కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘యెహోవా ప్రసన్నతను చూడండి’

‘యెహోవా ప్రసన్నతను చూడండి’

కొన్ని సమస్యలు మనల్ని బాగా కృంగదీస్తాయి. అవి మనల్ని వాటిగురించి మాత్రమే ఆలోచించేలా చేసి, మనలోని శక్తిని క్షీణింపజేసి, మనం జీవితాన్ని చూసే విధానాన్నే మార్చివేస్తాయి. ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదుకు వచ్చిన తీవ్రమైన కష్టాలు ఆయనను ఎంతో కృంగదీశాయి. ఆయన వాటినెలా తట్టుకోగలిగాడు? మనసును కదిలించే ఓ కీర్తనలో ఆయనిలా జవాబు చెబుతున్నాడు: “నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొఱ్ఱపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. నాలో నా ప్రాణము క్రుంగియున్నప్పుడు నా మార్గము నీకు తెలియును.” అవును, దావీదు సహాయం కోసం వినయంగా యెహోవాను అర్థించాడు.​—కీర్త. 142:1-3.

కష్టకాలాల్లో దావీదు సహాయం కోసం యెహోవాను వినయంగా వేడుకున్నాడు

మరొక కీర్తనలో దావీదు ఇలా పాడాడు: “యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను.” (కీర్త. 27:4) దావీదు లేవీయుడు కానప్పటికీ, సత్యారాధనకు కేంద్రమైన ప్రత్యక్ష గుడారంలోని పరిశుద్ధ ఆవరణ బయట నిలబడి ఉన్నట్లు ఊహించుకోండి. దావీదు హృదయం కృతజ్ఞతతో ఎంతగా ఉప్పొంగిపోయిందంటే, ఆయన తన జీవితాంతం అక్కడే ఉండి, ‘యెహోవా ప్రసన్నతను చూడాలని’ కోరుకున్నాడు.

“ప్రసన్నత” అనే పదం ‘మనసుకు, హృదయానికి నచ్చే లేదా ఇష్టంగా అనిపించే స్థితిని’ సూచిస్తుంది. ఆరాధన కోసం యెహోవా చేసిన ఏర్పాట్ల విషయంలో దావీదు ఎల్లప్పుడూ కృతజ్ఞత చూపించాడు. కాబట్టి మనందరం ఇలా ప్రశ్నించుకుందాం: ‘యెహోవా ఏర్పాట్ల విషయంలో నేనూ దావీదులాగే భావిస్తున్నానా?’

దేవుని ఏర్పాట్ల విషయంలో కృతజ్ఞత చూపించండి

మన కాలంలోనైతే, యెహోవాను సమీపించడానికి కంటికి కనిపించే అక్షరార్థమైన ఆలయం లేదు, కానీ ఓ గొప్ప ఆధ్యాత్మిక ఆలయం అంటే సత్యారాధన కోసం ఆయన చేసిన పరిశుద్ధ ఏర్పాటు ఉంది. a ఆ ఏర్పాటు పట్ల మనకు కృతజ్ఞత ఉంటే మనం కూడా ‘యెహోవా ప్రసన్నతను చూడగలుగుతాం.’

ప్రత్యక్ష గుడారపు ద్వారం ఎదుట ఉన్న ఇత్తడి బలిపీఠం గురించి ఆలోచించండి, దానిమీద దహనబలులు అర్పించేవాళ్లు. (నిర్గ. 38:1, 2; 40:6) యేసు మానవ జీవాన్ని బలిగా అంగీకరించడానికి యెహోవాకున్న సుముఖతను ఆ బలిపీఠం సూచించింది. (హెబ్రీ. 10:5-10) దానివల్ల మనం పొందిన ప్రయోజనాల గురించి ఆలోచించండి! అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు: ‘ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడ్డాము.’ (రోమా. 5:10) యేసు చిందించిన రక్తం మీద విశ్వాసం ఉంచితే, మనం దేవుని స్నేహితులముగా ఆయన ఆమోదాన్ని, నమ్మకాన్ని సంపాదించుకుంటాం. దానివల్ల మనం యెహోవాకు “సన్నిహితులం” అవుతాం.​—కీర్త. 25:14, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము.

మన ‘పాపాలు తుడిచివేయబడుతున్నాయి’ కాబట్టి మనం ‘ప్రభువు సముఖము నుండి వచ్చే విశ్రాంతికాలాల్ని’ ఆస్వాదించగలుగుతున్నాం. (అపొ. 3:19, 20) మన పరిస్థితిని మరణశిక్ష పడిన ఓ ఖైదీ పరిస్థితితో పోల్చవచ్చు. ఆ ఖైదీ తాను చేసిన తప్పులకు కుమిలిపోతూ, తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవడాన్ని గమనించిన ఓ దయగల న్యాయమూర్తి అతని మరణశిక్షను రద్దు చేశాడు. అప్పుడా ఖైదీకి ఎంత ఉపశమనంగా, ఆనందంగా అనిపిస్తుందో ఆలోచించండి. ఆ దయగల న్యాయమూర్తిలాగే యెహోవా కూడా పశ్చాత్తాపం చూపించిన మానవులకు తన అనుగ్రహం చూపించి మరణమనే సంకెళ్ల నుండి విడిపిస్తాడు.

సత్యారాధనలో ఆనందించండి

సత్యారాధనకు సంబంధించిన అనేక అంశాలను యెహోవా మందిరంలో దావీదు చూడగలిగాడు. ఆరాధన కోసం తోటి ఇశ్రాయేలీయులు గుంపులుగా సమకూడడం, ధర్మశాస్త్రాన్ని బిగ్గరగా చదివి దాని అర్థాన్ని వివరించడం, ధూపాన్ని దహించడం, లేవీయులు యాజకులు పరిశుద్ధ సేవ చేయడం వంటివి ఆయన చూశాడు. (నిర్గ. 30:34-38; సంఖ్యా. 3:5-8; ద్వితీ. 31:9-12) ప్రాచీన ఇశ్రాయేలులో సత్యారాధనకు సంబంధించిన ఆ అంశాలకు మనకాలంలో జరిగేవాటికి పోలికలున్నాయి.

గతంలోలాగే ఇప్పుడు కూడా “సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!” (కీర్త. 133:1) మన ప్రపంచవ్యాప్త “సహోదరుల” సంఖ్యలో గణనీయమైన అభివృద్ధి చూస్తున్నాం. (1 పేతు. 2:17) మన కూటాల్లో దేవుని వాక్యాన్ని బిగ్గరగా చదవడం, దాన్ని వివరించడం వింటున్నాం. యెహోవా తన సంస్థ ద్వారా ఉపదేశాన్నిచ్చే చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. మన వ్యక్తిగత, కుటుంబ అధ్యయనం కోసం ముద్రిత పేజీల రూపంలో మనకు సమృద్ధిగా ఆధ్యాత్మిక ఆహారం అందుతుంది. పరిపాలక సభలోని ఒక సభ్యుడు ఇలా చెప్పాడు: “దేవుని వాక్యాన్ని ధ్యానించడం, దాని అర్థం గురించి ఆలోచించడం, లేఖనాల లోతైన అవగాహన కోసం పరిశోధించడం వంటి పనులు చేయడం వల్ల నా రోజంతా ఆధ్యాత్మిక సంపదలతో, సంతృప్తితో నిండిపోయేది.” అవును, ‘తెలివి మనకు మనోహరముగా ఉంటుంది.’​—సామె. 2:10.

నేడు దేవుని సేవకులు చేసే ఆమోదయోగ్యమైన ప్రార్థనలు రోజూ యెహోవాకు చేరుతున్నాయి. అలాంటి ప్రార్థనలు యెహోవాకు పరిమళమైన ధూపద్రవ్యంలా ఇంపుగా ఉంటాయి. (కీర్త. 141:2) మనం వినయంగా ప్రార్థించినప్పుడు యెహోవా చాలా సంతోషిస్తాడని తెలుసుకోవడం మనసుకు ఎంత సంతృప్తిని ఇస్తుందో కదా!

“మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద నుండును గాక. మా చేతిపనిని మాకు స్థిరపరచుము” అని మోషే ప్రార్థించాడు. (కీర్త. 90:17) మనం ఉత్సాహంగా పరిచర్యలో పాల్గొన్నప్పుడు యెహోవా మన పనిని ఆశీర్వదిస్తాడు. (సామె. 10:22) కొంతమంది సత్యాన్ని నేర్చుకునేలా మనం సహాయం చేసివుండవచ్చు. బహుశా ప్రజలు సువార్తకు అంతగా స్పందించకున్నా లేదా మనం అనారోగ్యంతో, మానసిక వ్యాకులతతో బాధపడుతున్నా లేదా హింసలు ఎదురౌతున్నా సంవత్సరాలుగా పరిచర్యలో ఓర్పుగా కొనసాగుతుండవచ్చు. (1 థెస్స. 2:2) అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం ‘యెహోవా ప్రసన్నతను’ చూడలేదా? మన ప్రయత్నాలకు మన పరలోక తండ్రి ఎంతో సంతోషించాడని అర్థంచేసుకోలేదా?

దావీదు ఇలా పాడాడు: “యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను.” (కీర్త. 16:5, 6) దావీదుకు తన ‘స్వాస్థ్యం’ పట్ల చాలా కృతజ్ఞత ఉంది, యెహోవాతో అనుబంధం కలిగివుండి, ఆయనను సేవించే అరుదైన అవకాశమే ఆ ‘స్వాస్థ్యం.’ దావీదుకు వచ్చినట్లే మనకు కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదురుకావచ్చు, కానీ మనకు ఎన్నో ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఉన్నాయి! కాబట్టి మనమందరం సత్యారాధనలో ఆనందిస్తూ ఉందాం, యెహోవా ఆధ్యాత్మిక ఆలయం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉందాం.

a కావలికోట 1996, జూలై 1 సంచిక 14-24 పేజీలు చూడండి.