మీ మాట—‘అవునని చెప్పి కాదన్నట్లుగా’ ఉందా?
ఈ సన్నివేశాన్ని ఊహించుకోండి: ఆసుపత్రి అనుసంధాన కమిటీలో సేవచేస్తున్న ఓ సంఘపెద్ద, ఆదివారం ఉదయం క్షేత్రసేవలో ఒక యువ సహోదరునితో కలిసి పనిచేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే, అదే రోజు పొద్దున ఓ సహోదరి కారు ప్రమాదానికి గురైంది. ఆమె భర్త ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లి, ఆ పెద్దకు ఫోను చేసి, రక్తం విషయంలో మన నమ్మకాలతో సహకరించే డాక్టరును సంప్రదించడానికి సహాయం చేయమని అడిగాడు. అత్యవసర పరిస్థితిలో ఉన్న ఈ దంపతులకు సహాయం చేసేందుకు, ఆ పెద్ద తాను అంతకుముందు మాటిచ్చినట్లుగా ఆ యువ సహోదరునితో క్షేత్రసేవకు రాలేనని చెప్పాడు.
మరో సన్నివేశాన్ని ఊహించుకోండి: ఇద్దరు కూతుళ్లున్న ఒంటరి తల్లిని, సంఘంలోని ఓ దంపతులు ఒక సాయంత్రం తమతో కలిసి సరదాగా సమయం గడపడానికి ఆహ్వానించారు. దానిగురించి ఆమె తన పిల్లలకు చెప్పినప్పుడు, వాళ్ల ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఆ సాయంత్రం ఎప్పుడు వస్తుందోనని వాళ్లు ఎదురుచూశారు. అయితే అలా వెళ్లడానికి ఒక రోజు ముందు, తమకు అనుకోని పని పడిందని, వాళ్లతో కలిసి సమయం గడపడం కుదరదని ఆ దంపతులు చెప్పారు. వాళ్లు ఎందుకలా చెప్పారో ఆమెకు ఆ తర్వాత తెలిసింది. వాళ్లను ఆహ్వానించిన తర్వాత, ఆ దంపతులను కొందరు స్నేహితులు అదే రోజు సాయంత్రం తమ ఇంటికి ఆహ్వానించారు, వాళ్లు దానికి సరేనన్నారు.
క్రైస్తవులమైన మనం మాటమీద నిలబడాలి. ‘అవునని చెప్పి, కాదన్నట్లుగా’ మనం ఎన్నడూ ప్రవర్తించకూడదు. (2 కొరిం. 1:18) అయితే, పైనున్న రెండు ఉదాహరణలు చూపిస్తున్నట్లు, పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు. ఒక్కోసారి, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేమేమో అనిపించే పరిస్థితి ఎదురుకావచ్చు. అపొస్తలుడైన పౌలుకు కూడా ఒకసారి అలాంటి పరిస్థితే వచ్చింది.
పౌలు మాటమీద నిలబడడని నిందించారు
సా.శ. 55లో పౌలు తన మూడవ మిషనరీ యాత్రలో ఉన్నప్పుడు, ఏజీయన్ సముద్రం దాటి కొరింథుకు వెళ్లి, అక్కడ నుండి మాసిదోనియకు వెళ్లాలనుకున్నాడు. తిరిగి యెరూషలేముకు వచ్చేటప్పుడు, కొరింథు సంఘాన్ని మరోసారి సందర్శించి వాళ్లు యెరూషలేములోని సహోదరుల కోసం దయతో ఇవ్వాలనుకున్న ద్రవ్యాన్ని తీసుకువెళ్లాలని పౌలు అనుకున్నాడు. (1 కొరిం. 16:3) ఈ విషయం 2 కొరింథీయులు 1:15, 16 చదివితే అర్థమౌతుంది, పౌలు అక్కడ ఇలా చెప్పాడు: “ఈ నమ్మికగలవాడనై మీకు రెండవ కృపావరము లభించునట్లు మొదట మీయొద్దకు వచ్చి, మీ యొద్దనుండి మాసిదోనియకు వెళ్లి మాసిదోనియనుండి మరల మీయొద్దకు వచ్చి, మీచేత యూదయకు సాగనంపబడవలెనని ఉద్దేశించితిని.”
ఈ ప్రణాళిక గురించి పౌలు అంతకుముందు రాసిన పత్రికలో, కొరింథులోని సహోదరులకు చెప్పాడనిపిస్తుంది. (1 కొరిం. 5:9) అయితే, ఆ పత్రిక రాసిన కొంతకాలానికే, ఆ సంఘంలో తీవ్రమైన కలహాలు ఉన్నాయని క్లోయె ఇంటివాళ్ల ద్వారా పౌలుకు తెలిసింది. (1 కొరిం. 1:10, 11) దాంతో పౌలు తన ప్రణాళికను మార్చుకోవాలనుకుని, ప్రస్తుతం మన బైబిల్లో ఉన్న 1 కొరింథీయులు పత్రిక రాశాడు. పౌలు ఆ పత్రిక ద్వారా వాళ్లకు ప్రేమతో ఉపదేశం, దిద్దుబాటు ఇచ్చాడు. తన ప్రయాణ ప్రణాళికను మార్చుకున్నానన్న విషయం కూడా ప్రస్తావిస్తూ, ముందు మాసిదోనియకు వెళ్లి ఆ తర్వాత కొరింథుకు వస్తానని పౌలు ఆ పత్రికలో రాశాడు.—1 కొరిం. 16:5, 6. a
కొరింథులోని సహోదరులకు ఆ పత్రిక అందినప్పుడు, ఆ సంఘంలో ఉన్న ‘మిక్కిలి శ్రేష్ఠులైన అపొస్తలుల్లో’ కొందరు పౌలును చపలచిత్తుడని, మాటమీద నిలబడడని నిందించారు. అయితే తాను తప్పుచేయలేదని చూపిస్తూ పౌలు ఇలా అడిగాడు: “కావున నేనీలాగు ఉద్దేశించి చపలచిత్తుడనుగా నడుచుకొంటినా? అవును అవునని చెప్పుచు, కాదు కాదనునట్టు ప్రవర్తింపవలెనని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా?”—2 కొరిం. 1:17; 11:5.
ఈ సందర్భంలో అపొస్తలుడైన పౌలు నిజంగా ‘చపలచిత్తుడిగా నడుచుకున్నాడా’? కానే కాదు! ‘చపలచిత్తుడు’ అని అనువదించిన పదం నిలకడలేని, నమ్మలేని, మాట నిలబెట్టుకోని వాళ్లను సూచిస్తుంది. “శరీరానుసారముగా యోచించుచున్నానా?” అని పౌలు అడిగిన ప్రశ్నను బట్టి ఆయన తన ప్రణాళికలను మార్చుకున్నది, నిలకడలేనితనం వల్ల కాదని వాళ్లు అర్థం చేసుకోవాల్సింది.
వాళ్ల నిందను తిప్పికొడుతూ పౌలు ఇలా రాశాడు: “దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు.” (2 కొరిం. 1:18) నిస్సందేహంగా, కొరింథులోని సహోదరసహోదరీల శ్రేయస్సు కోసమే పౌలు తన ప్రణాళికను మార్చుకున్నాడు. “మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు” అని 2 కొరింథీయులు 1:23లో పౌలు అన్నాడు. నిజానికి, తాను వాళ్లను కలవడానికి ముందే పరిస్థితులు చక్కదిద్దుకునే అవకాశం పౌలు ఇచ్చాడు. పౌలు ఆశించినట్లే, ఆయన పత్రికను చదివిన కొరింథీయులు చేసిన తప్పులకు బాధపడి, పశ్చాత్తాపపడ్డారని మాసిదోనియలో ఉన్న పౌలు దగ్గరికి తీతు వచ్చి చెప్పినప్పుడు ఆయన ఎంతో సంతోషించాడు.—2 కొరిం. 6:11; 7:5-7.
యేసే భరోసా
మాటమీద నిలబడడని పౌలుపై పడిన నిందను బట్టి, తన అనుదిన జీవితంలో మాట నిలబెట్టుకోలేని పౌలు, పరిచర్య విషయంలో ఎంత వరకు నమ్మకంగా ఉంటాడనే ఆలోచన కొందరికి వచ్చి ఉండవచ్చు. అయితే, వాళ్లకు యేసుక్రీస్తు గురించి ప్రకటించానని పౌలు గుర్తుచేశాడు. “మాచేత, అనగా నాచేతను సిల్వానుచేతను తిమోతిచేతను, మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై యుండలేదు గాని ఆయన అవుననువాడై యున్నాడు.” (2 కొరిం. 1:19) పౌలుకు ఆదర్శమైన యేసు, ఏ విషయంలోనైనా నమ్మదగనివానిలా ప్రవర్తించాడా? లేదు! యేసు తన జీవితంలో, పరిచర్యలో ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాడు. (యోహా. 14:6; 18:37, 38) యేసు ప్రకటించింది పూర్తిగా సత్యమైతే, నమ్మదగినదైతే పౌలు కూడా అదే సందేశాన్ని ప్రకటించాడు కాబట్టి ఆయన ప్రకటించింది కూడా నమ్మదగినదే.
నిస్సందేహంగా, యెహోవా ‘సత్యదేవుడు.’ (కీర్త. 31:5) అందుకే పౌలు, “దేవుని వాగ్దానములు ఎన్నియైనను అన్నియు క్రీస్తునందు అవునన్నట్టుగానే యున్నవి” అని అన్నాడు. భూమ్మీద ఉన్నప్పుడు యేసు పరిపూర్ణ యథార్థతతో జీవించి యెహోవా వాగ్దానాలను సందేహించడానికి ఎలాంటి కారణమూ లేదని చూపించాడు. అందుకే, పౌలు ఇంకా ఇలా రాశాడు: “గనుక మనద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన [యేసు] వలన నిశ్చయములై యున్నవి.” (2 కొరిం. 1:20) యెహోవా చేసిన ప్రతీ వాగ్దానం నెరవేరుతుందని నమ్మడానికి యేసే భరోసా లేదా ‘ఆమేన్.’
యెహోవా, యేసుక్రీస్తు ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడారు, అలాగే పౌలు కూడా ఎల్లప్పుడూ నిజాయితీగా మాట్లాడాడు. (2 కొరిం. 1:19) పౌలు నిలకడలేనివాడు కాడు, ఆయన ‘శరీరానుసారముగా’ వాగ్దానాలు చేయలేదు. (2 కొరిం. 1:17) బదులుగా, ఆయన ‘ఆత్మానుసారముగా నడుచుకొన్నాడు.’ (గల. 5:16) ఆయన ఏమి చేసినా ఇతరుల శ్రేయస్సు కోసమే చేశాడు. ఆయన ‘అవును’ అంటే అవునన్నట్లుగానే ప్రవర్తించాడు.
మీరు ‘అవును’ అంటే అవునన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారా?
ఈ రోజుల్లో, బైబిలు సూత్రాల ప్రకారం జీవించని ప్రజలు మాట ఇస్తారుగానీ, చిన్న సమస్య వచ్చినా లేదా మెరుగైనది పొందే అవకాశం కనిపించినా అలవాటుగా మాట తప్పుతుంటారు. వ్యాపార విషయాల్లో, రాతపూర్వకంగా ఒప్పందాలు కుదుర్చుకున్నా సాధారణంగా వాటికి కట్టుబడి ఉండరు. చాలామంది వివాహాన్ని ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కట్టుబడి ఉండాల్సిన ఒప్పందంగా చూడట్లేదు. బదులుగా, చాలామంది దృష్టిలో వివాహమనేది ఎప్పుడంటే అప్పుడు తెంచేసుకునే తాత్కాలిక సంబంధం మాత్రమేనని శరవేగంగా పెరుగుతున్న విడాకుల సంఖ్య చూపిస్తుంది.—2 తిమో. 3:1, 2.
మరి మీ సంగతేమిటి? మీరు ‘అవును’ అంటే అవునన్నట్లుగానే ప్రవర్తిస్తున్నారా? ఈ ఆర్టికల్ ప్రారంభంలో చూసినట్లు, కొన్నిసార్లు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోవచ్చు. అయితే, మీలో నిలకడ లేనందువల్ల కాదుగానీ అనివార్య పరిస్థితుల వల్లే అలా జరగవచ్చు. కానీ క్రైస్తవులైన మీరు మాట ఇచ్చినా, ఒప్పందం చేసినా కట్టుబడి ఉండడానికి చేయగలిగినదంతా చేయాలి. (కీర్త. 15:4; మత్త. 5:37) మీరు అలా చేస్తే, మీరు నమ్మదగినవాళ్లని, మాటమీద నిలబడతారని, ఎప్పుడూ సత్యమే మాట్లాడతారని అందరు గుర్తిస్తారు. (ఎఫె. 4:15, 25; యాకో. 5:12) రోజువారీ వ్యవహారాల్లో మీరు నమ్మదగినవాళ్లని ప్రజలు గుర్తించినప్పుడు, దేవుని రాజ్యం గురించి మీరు ప్రకటించే సత్యాన్ని వినడానికి మరింతగా ఇష్టపడతారు. కాబట్టి ఏదేమైనా, మనం ‘అవును’ అంటే అవునన్నట్లుగానే ప్రవర్తించడానికి కృషి చేద్దాం!
a పౌలు 1 కొరింథీయులు పత్రిక రాసిన కొంతకాలానికి, త్రోయ మీదుగా మాసిదోనియకు వెళ్లాడు. అక్కడ ఆయన 2 కొరింథీయులు పత్రిక రాశాడు. (2 కొరిం. 2:12; 7:5) ఆ తర్వాత ఆయన కొరింథును సందర్శించాడు.