జీవిత కథ
పూర్తికాల సేవ—నన్ను ఎంతోదూరం తీసుకెళ్లింది
నా 65 ఏళ్ల పూర్తికాల సేవను ఓసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, నా జీవితం ఎన్నో తీపి జ్ఞాపకాలతో నిండిపోయిందని ఖచ్చితంగా చెప్పగలను. అంటే అసలు ఏనాడూ బాధ, నిరుత్సాహం కలగలేదని కాదు. (కీర్త. 34:12; 94:19) కానీ, మొత్తంగా చూస్తే నా జీవితం ఎంతో ఫలవంతంగా, అర్థవంతంగా ఉంది.
సెప్టెంబరు 7, 1950 తేదీని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ రోజే నేను బ్రూక్లిన్ బెతెల్ కుటుంబ సభ్యుణ్ణయ్యాను. అప్పుడు అక్కడ, 19 నుండి 80 ఏళ్ల మధ్య వయసున్న 355 మంది సహోదరసహోదరీలు సేవ చేస్తున్నారు, వాళ్లు ఎన్నో దేశాల నుండి వచ్చారు. అందులో చాలామంది అభిషిక్త క్రైస్తవులే.
యెహోవాను ఎలా తెలుసుకున్నానంటే . . .
సంతోషంగల మన దేవుణ్ణి సేవించడం మా అమ్మ నాకు నేర్పింది. నా చిన్నప్పుడే మా అమ్మ యెహోవాను సేవించడం మొదలుపెట్టింది. 1939, జూలై 1న అమెరికాలోని కొలంబస్‌లో ఉన్న నెబ్రాస్కాలో జరిగిన జోన్ అసెంబ్లీలో (ఇప్పుడు ప్రాంతీయ సమావేశమని పిలుస్తున్నాం) నేను బాప్తిస్మం తీసుకున్నాను. అప్పుడు నాకు పదేళ్లు. “ఫాసిజమ్ ఆర్ ఫ్రీడమ్” అనే అంశంపై జోసెఫ్ రూథర్‌ఫర్డ్ ఇచ్చిన ప్రసంగపు రికార్డును వినడానికి ఇంచుమించు వంద మందిమి ఒక అద్దె హాలులో సమకూడాం. దాదాపు సగం ప్రసంగం అయ్యేసరికి, ఆ హాలు బయట ఓ అల్లరిమూక పోగయ్యింది. వాళ్లు బలవంతంగా లోపలికి వచ్చి, ఆ కూటాన్ని అడ్డుకుని, మమ్మల్ని ఆ ఊరు నుండి వెళ్లగొట్టారు. అయితే మేము ఆ ఊరికి కొద్ది దూరంలోనే ఉన్న ఓ సహోదరుని ఇంట్లో కలుసుకొని మిగతా కార్యక్రమాన్ని విన్నాం. నేను బాప్తిస్మం తీసుకున్న తేదీని ఎన్నడూ మర్చిపోలేదంటే దానిలో ఆశ్చర్యమేమీ లేదు.
నన్ను సత్యంలో పెంచడానికి మా అమ్మ చాలా కష్టపడింది. మా నాన్న మంచి మనిషి, మంచి తండ్రి. అయితే మతం విషయంలో, నా ఆధ్యాత్మిక సంక్షేమం విషయంలో ఆయన అంతగా ఆసక్తి చూపించేవాడు కాదు. మా అమ్మతోపాటు, ఒమాహా సంఘంలోని మిగతా సహోదరసహోదరీలు నాకు కావాల్సిన ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్లు.
నా జీవితంలో ఓ మలుపు
ఇంకొన్ని రోజుల్లో నా హైస్కూల్ విద్య పూర్తి అవుతుందనగా, నేను నా జీవితాన్ని ఎలా ఉపయోగించాలనే విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. మాకు వేసవి సెలవులు ఇచ్చిన ప్రతీసారి నా తోటివాళ్లతో కలిసి వెకేషన్ పయినీరు (ఇప్పుడు సహాయ పయినీరు అంటున్నాం) సేవ చేసేవాణ్ణి.
ఏడవ గిలియడ్ పాఠశాలలో అప్పుడే పట్టభద్రులైన ఇద్దరు ఒంటరి సహోదరులను మా ప్రాంతంలో ప్రయాణ సేవకోసం నియమించారు. వాళ్లు జాన్ చిమిక్లిస్, టెడ్ జారస్. వాళ్లకు 25 ఏళ్లు కూడా లేవని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. నాకు అప్పుడు 18 ఏళ్లు, త్వరలోనే హైస్కూలు చదువు పూర్తి కావస్తుంది. నేను నా జీవితాన్ని ఎలా ఉపయోగించాలనుకుంటున్నానని సహోదరుడు చిమిక్లిస్ నన్ను అడగడం నాకింకా గుర్తుంది. నా అభిప్రాయం చెప్పినప్పుడు
ఆయన నన్ను, “నువ్వు మరో ఆలోచన లేకుండా పూర్తికాల సేవ చేపట్టు. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు తెలియదు” అని ప్రోత్సహించాడు. ఆ సలహాతోపాటు, వాళ్లిద్దరి ఆదర్శం నాలో చెరగని ముద్రవేసింది. దాంతో హైస్కూలు పూర్తి అవగానే, 1948లో పయినీరు సేవ మొదలుపెట్టాను.బెతెల్‌కు ఎలా వచ్చానంటే . . .
న్యూయార్క్ యాంకీ స్టేడియంలో 1950, జూలైలో జరిగిన అంతర్జాతీయ సమావేశానికి అమ్మానాన్నలతో కలిసి హాజరయ్యాను. ఆ సమావేశంలో, బెతెల్ సేవచేయడానికి ఆసక్తి ఉన్న వాళ్లకోసం ఏర్పాటు చేసిన కూటానికి హాజరయ్యాను. బెతెల్‌లో సేవచేయడానికి ఇష్టపడుతున్నానని తెలియజేస్తూ ఒక దరఖాస్తు ఇచ్చాను.
నేను ఇంట్లో ఉంటూ పయినీరు సేవ చేస్తున్నందుకు మా నాన్న అభ్యంతరం చెప్పకపోయినా, నా వసతి కోసం, నా భోజనం కోసం కొంతైనా డబ్బులు తనకు ఇవ్వాలని ఆయన భావించేవాడు. దాంతో ఉద్యోగ అన్వేషణ మొదలుపెట్టాను. అలా, ఆగష్టు నెల ఆరంభంలో ఓ రోజు బయటకు వెళ్తూ, మా ఇంటి ఉత్తరాల డబ్బా దగ్గర ఆగాను. దానిలో, నాకు బ్రూక్లిన్ నుండి వచ్చిన ఉత్తరం ఉంది. దాని మీద నేథన్ హెచ్. నార్ సంతకం ఉంది. అందులో ఆయనిలా రాశాడు, “బెతెల్ సేవ కోసం నువ్వు పెట్టుకున్న దరఖాస్తు అందింది. ప్రభువు నిన్ను ఉంచినంత కాలం బెతెల్‌లో ఉండడానికి ఒప్పుకుంటున్నావని నాకు అర్థమైంది. కాబట్టి, 124 కొలంబియా హైట్స్, బ్రూక్లిన్, న్యూయార్క్ చిరునామాలో ఉన్న బెతెల్‌కు 1950, సెప్టెంబరు 7న వచ్చి రిపోర్టు చేయి.”
మా నాన్న ఆ రోజు పని నుండి ఇంటికి వచ్చిన వెంటనే, నాకు ఉద్యోగం దొరికిందని చెప్పాను. “సంతోషం, ఇంతకీ నువ్వు పనిచేసేది ఎక్కడ?” అని ఆయన అడిగాడు. “బ్రూక్లిన్ బెతెల్‌లో, నెలకు 10 డాలర్లు ఇస్తారు” అని చెప్పాను. ఆ మాట వినగానే ఆయన కొంచెం ఖంగుతిన్నాడు. కానీ నేను కోరుకున్నది అదే అయితే, దానిలో విజయం సాధించడానికి కష్టపడాలని నాతో అన్నాడు. ఎంతోకాలం గడవకముందే, అంటే 1953లో యాంకీ స్టేడియంలో జరిగిన సమావేశంలో మా నాన్న బాప్తిస్మం తీసుకున్నాడు!
సంతోషకరమైన విషయం ఏమిటంటే, నాతో పయినీరు సేవ చేసిన ఆల్‌ఫ్రడ్ నస్రాల్లాకు కూడా బెతెల్ ఆహ్వానం రావడంతో, మేమిద్దరం కలిసి వెళ్లాం. ఆ తర్వాత ఆయన పెళ్లి చేసుకొని, తన భార్య జోవన్‌తో కలిసి గిలియడ్‌కు హాజరై, కొంతకాలం లెబనాన్‌లో మిషనరీ సేవ చేసి, ఆ తర్వాత ప్రయాణ సేవకోసం మళ్లీ అమెరికా వచ్చాడు.
బెతెల్‌లో నియామకాలు
బెతెల్‌లో నా మొదటి నియామకం బైండరీలో పుస్తకాలు కుట్టే పని. మతం మానవజాతి కోసం ఏం చేసింది? (ఇంగ్లీషు) పుస్తకం నేను పనిచేసిన మొదటి ప్రచురణ. బైండరీలో సుమారు ఎనిమిది నెలలు పనిచేసిన తర్వాత, నన్ను సేవా విభాగానికి మార్చి, సహోదరుడు థామస్ జే. సల్లీవన్ ఆధ్వర్యంలో పనిచేయమన్నారు. ఆయనతో పనిచేస్తూ, సుదీర్ఘ అనుభవంతో ఆయన సంపాదించుకున్న ఆధ్యాత్మిక జ్ఞానం, అవగాహన నుండి ప్రయోజనం పొందడం నాకు సంతోషాన్నిచ్చింది.
సేవా విభాగంలో దాదాపు మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత, ఫ్యాక్టరీ పర్యవేక్షకుడైన మ్యాక్స్ లార్సన్ ఓసారి నా దగ్గరకు వచ్చి సహోదరుడు నార్ నన్ను రమ్మన్నాడని చెప్పాడు. నేను ఏదైనా తప్పు చేశానేమోనని కంగారుపడ్డాను. అయితే, సమీప భవిష్యత్తులో బెతెల్ వదిలిపెట్టి వెళ్లే ఉద్దేశం నాకేమైనా ఉందేమో కనుక్కోవడానికే పిలిపించానని నార్ అన్నప్పుడుగానీ నా మనసు కుదటపడలేదు. ఆయన ఆఫీసులో కొంతకాలం పనిచేయడానికి ఒకరు కావాల్సివచ్చింది, ఆ బాధ్యతను నేను నిర్వర్తించగలనేమో తెలుసుకోవడానికి నాకోసం కబురు చేశాడు. నాకు బెతెల్ వదిలి వెళ్లే ఆలోచన లేదని చెప్పాను. అలా, ఆ తర్వాతి 20 ఏళ్లు ఆయన ఆఫీసులో పనిచేసే అవకాశం నాకు దొరికింది.
బెతెల్‌లో సహోదరులు సల్లీవన్, నార్‌తోపాటు మిల్టన్ హెన్షల్, క్లాస్ జెన్సన్, మ్యాక్స్ లార్సన్, హూగో రీమర్, గ్రారట్ స్యూటర్ వంటి ఇతర సహోదరులతో కలిసి పనిచేస్తూ ఎన్నో విషయాలు నేర్చుకున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని తరచూ చెబుతుండేవాణ్ణి. a
నేను కలిసి పనిచేసిన సహోదరులు, సంస్థలో తమకున్న బాధ్యతలను చాలా పద్ధతిగా నిర్వర్తించేవాళ్లు. అలుపెరగకుండా పనిచేసే బ్రదర్ నార్, రాజ్య పని సాధ్యమైనంత విస్తృత స్థాయిలో జరగాలని కోరుకునేవాడు. ఆయన ఆఫీసులో పనిచేసే వాళ్లమంతా ఆయనతో నిస్సంకోచంగా మాట్లాడేవాళ్లం. ఏదైనా విషయంలో మాకు వేరే అభిప్రాయం ఉంటే, ఏమాత్రం సంకోచించకుండా ఆయనతో చెప్పేవాళ్లం, అయినప్పటికీ ఆయన మామీద నమ్మకం ఉంచేవాడు.
ఒక సందర్భంలో సహోదరుడు నార్, చిన్న విషయాలని అనిపించే వాటిపట్ల కూడా ఎందుకు శ్రద్ధ చూపించాలో నాకు వివరిస్తూ, ఓ ఉదాహరణ కూడా చెప్పాడు. నార్ ఫ్యాక్టరీ పర్యవేక్షకునిగా ఉన్నకాలంలో, సహోదరుడు రూథర్‌ఫర్డ్ అప్పుడప్పుడూ ఫోను చేసి, “బ్రదర్ నార్, ఫ్యాక్టరీ నుండి భోజనానికి వచ్చేటప్పుడు, పెన్సిల్ రబ్బర్లు కొన్ని తెచ్చివ్వండి. నా టేబుల్ మీద ఉన్నవి అయిపోయాయి” అని చెప్పేవాడట. అప్పుడు ఆయన నేరుగా స్టోర్ రూముకి వెళ్లి, కొన్ని రబ్బర్లు జేబులో వేసుకుని, వాటిని మధ్యాహ్నం రూథర్‌ఫర్డ్ ఆఫీసులో పెట్టేవాడట. రబ్బర్లు తెచ్చివ్వడం చిన్న విషయమే అయినా, అవి రూథర్‌ఫర్డ్‌కి ఎంతో ఉపయోగపడేవని అన్నాడు. ఇదంతా చెప్పిన తర్వాత సహోదరుడు నార్ నాతో, “నాకు ప్రతీరోజు చెక్కిన పెన్సిళ్లు అవసరం. కాబట్టి దయచేసి ప్రతీ ఉదయం అవి నా టేబుల్ మీద ఉండేలా చూడు” అన్నాడు. అప్పటినుండి ఎన్నో సంవత్సరాలు ఆయన టేబుల్ మీద చెక్కిన పెన్సిళ్లు ఉండేలా చూసుకున్నాను.
ఫలానా పని చేయమని తాను చెప్పినప్పుడు శ్రద్ధగా వినడం చాలా అవసరమని కూడా బ్రదర్ నార్ తరచూ చెప్పేవాడు. ఒకానొక పనిని ఎలా చేయాలో సహోదరుడు నార్ సవివరంగా చెప్పిన ఓ సందర్భంలో నేను జాగ్రత్తగా వినలేదు. దాంతో, నా వల్ల ఆయనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కలిగింది. నాకు చాలా బాధేసింది, అందుకే నేను చేసిన ఆ పనికి చాలా దుఃఖ పడుతున్నానని చెబుతూ ఒక చిన్న ఉత్తరం రాశాను. నన్ను ఆయన ఆఫీసు నుండి మార్చితే బాగుంటుందని అనిపించింది. అయితే, కాసేపటి తర్వాత బ్రదర్ నార్ నా టేబుల్ దగ్గరికి వచ్చి, “రాబర్ట్ నువ్వు రాసింది చూశాను. నీవల్ల పొరపాటు జరిగింది, దానిగురించి ఇప్పటికే నీతో మాట్లాడాను, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా మరింత జాగ్రత్తపడతావని నాకు నమ్మకం ఉంది. సరే పద, మన పని చూసుకుందాం.” ఆ విషయంలో ఆయన నామీద దయ చూపించినందుకు నేనెంతో కృతజ్ఞుణ్ణి.
పెళ్లి చేసుకోవాలనే కోరిక
ఎనిమిది సంవత్సరాలు బెతెల్‌లో సేవచేసిన తర్వాత, ఇక అక్కడే ఉండిపోవాలని అనుకున్నాను. అయితే నా ఆలోచనలో మార్పు వచ్చింది. 1958లో యాంకీ స్టేడియంలో అలాగే పోలో గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ సమావేశం జరుగుతున్నప్పుడు, లారెన్ బ్రూక్స్‌ను చూశాను. ఆమె కెనడాలోని మారట్రీయల్‌లో పయినీరు సేవ చేస్తుండగా, 1955లో ఓసారి తనను కలిశాను. పూర్తికాల సేవ విషయంలో ఆమెకున్న దృక్పథాన్ని, యెహోవా సంస్థ ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్లడానికి ఆమెకున్న ఇష్టాన్ని చూసి ముగ్ధుణ్ణయ్యాను. లారెన్‌కి గిలియడ్ పాఠశాలకు వెళ్లాలనే కోరిక ఉండేది. ఆమెకు 22 ఏళ్లున్నప్పుడు, 1956లో జరిగిన 27వ గిలియడ్ తరగతికి హాజరయ్యింది. ఆ పాఠశాల తర్వాత ఆమెను బ్రెజిల్‌లో మిషనరీగా నియమించారు. 1958లో లారెన్, నేను మళ్లీ మా స్నేహాన్ని కొనసాగించాం, పెళ్లి చేసుకుందామని అన్నప్పుడు ఆమె ఒప్పుకుంది. ఆ తర్వాతి సంవత్సరమే పెళ్లి చేసుకొని, చక్కగా ఇద్దరం కలిసి మిషనరీ సేవ చేద్దామని అనుకున్నాం.
నా మనసులో మాటను బ్రదర్ నార్‌కి చెప్పినప్పుడు,
ఆయన నన్ను మూడు సంవత్సరాలు ఆగి పెళ్లి చేసుకోమని, తర్వాత బ్రూక్లిన్ బెతెల్‌లో సేవ చేయమని సలహా ఇచ్చాడు. అప్పట్లో, ఎవరైనా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా బెతెల్‌లోనే ఉండాలంటే, దంపతుల్లో ఒకరు కనీసం పది లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు, మరొకరు కనీసం మూడు సంవత్సరాలు బెతెల్‌లో సేవచేసి ఉండాలి. దాంతో, పెళ్లికి ముందు లారెన్ రెండు సంవత్సరాలు బ్రెజిల్ బెతెల్‌లో, ఆ తర్వాత ఒక సంవత్సరం బ్రూక్లిన్ బెతెల్‌లో సేవచేయడానికి ఒప్పుకుంది.మా ప్రదానం జరిగిన తర్వాత మొదటి రెండు సంవత్సరాలు ఉత్తరాల ద్వారానే మాట్లాడుకునేవాళ్లం. అప్పట్లో ఫోను చేయడం చాలా ఖర్చుతో కూడుకున్న పని, పైగా ఇ-మెయిల్స్ కూడా లేవు. 1961, సెప్టెంబరు 16న జరిగిన మా పెళ్లిలో స్వయంగా సహోదరుడు నార్ పెళ్లి ప్రసంగమిచ్చాడు. పెళ్లి కోసం మేము వేచివున్న ఆ కొన్ని సంవత్సరాలు ఎన్నో యుగాలుగా అనిపించిన మాట నిజమే. కానీ 50 ఏళ్లు పైబడిన మా దాంపత్య జీవితాన్ని సంతృప్తితో, ఆనందంతో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అలా వేచివుండడం వల్ల మంచే జరిగిందని ఇద్దరికీ అనిపిస్తుంది.
సేవావకాశాలు
నాకు 1964లో, జోన్ పర్యవేక్షకుడిగా ఇతర దేశాలను సందర్శించే గొప్ప అవకాశం వచ్చింది. అప్పట్లో భర్తలతోపాటు భార్యలు వెళ్లే ఏర్పాటు లేదు. 1977లో ఆ ఏర్పాటును సవరించడంతో భార్యలు కూడా తమ భర్తలతోపాటు ప్రయాణించగలుగుతున్నారు. అదే సంవత్సరం గ్రాంట్‌స్యూటర్ ఈడత్ దంపతులతో కలిసి, నేనూ నా భార్యా జర్మనీ, ఆస్ట్రియా, గ్రీస్, సైప్రస్, టర్కీ, ఇజ్రాయిల్ దేశాల్లో ఉన్న బ్రాంచి కార్యాలయాలను సందర్శించాం. నేను ఇప్పటివరకు దాదాపు 70 దేశాలు సందర్శించాను.
అలా, 1980లో బ్రెజిల్ బ్రాంచి కార్యాలయాన్ని సందర్శించే క్రమంలో, భూమధ్యరేఖ మీదున్న బెలెమ్ అనే నగరానికి వెళ్లాం. లారెన్ అంతకు ముందు అక్కడ మిషనరీగా సేవ చేసింది. మానాస్ నగరంలో కూడా ఆగి అక్కడున్న సహోదరులను సందర్శించాం. ఒక స్టేడియంలో ప్రసంగిస్తున్నప్పుడు, అక్కడ కూర్చునివున్న ఓ గుంపును చూశాం. సాధారణంగా బ్రెజిల్ వాసుల్లో కనిపించే అలవాటు అంటే, సహోదరీలు ఒకరికొకరు బుగ్గమీద ముద్దుపెట్టుకోవడం, సహోదరులైతే కరచాలనం చేసుకోవడం వంటివి వాళ్లు చేయడం లేదు. ఎందుకు?
వాళ్లు అమెజాన్ అడవుల్లోని మారుమూల ప్రాంతంలో ఉన్న కుష్ఠురోగుల కాలనీ నుండి వచ్చిన మన ప్రియ సహోదరసహోదరీలు. అందుకే, ఆరోగ్య కారణాలను బట్టి వాళ్లు ఎవ్వరినీ తాకడం లేదు. కానీ, వాళ్లు మా హృదయాన్ని తాకారు, అలాగే వాళ్ల ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. “నా సేవకులు హృదయానందముచేత కేకలు వేసెదరు” అని యెహోవా చెప్పిన మాటలు ఎంత వాస్తవమో కదా!—యెష. 65:14.
ఫలవంతమైన, అర్థవంతమైన జీవితం
లారెన్, నేను అరవై ఏళ్లకు పైగా యెహోవాకు నమ్మకంగా చేసిన సేవను తరచూ గుర్తుచేసుకుంటాం. యెహోవా తన సంస్థ ద్వారా మమ్మల్ని నడిపించినప్పుడు ఆయనకు సహకరించడం వల్ల మేము పొందిన అనేక ఆశీర్వాదాలను బట్టి ఎంతో సంతోషిస్తున్నాం. ఒకప్పటిలా నేను వివిధ దేశాలు తిరగలేకపోతున్నా, పరిపాలక సభ సహాయకునిగా కో-ఆర్డినేటర్స్ కమిటీతో, సర్వీస్ కమిటీతో పని చేస్తూ నా రోజువారీ బాధ్యతలు నిర్వర్తించగలుగుతున్నాను. ఈ విధంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సహోదరులకు మద్దతిచ్చే పనిలో నాకూ ఓ చిన్న వంతు ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. “చిత్తగించుము, నేనున్నాను నన్ను పంపు” అని యెషయా చూపినలాంటి సుముఖతనే చూపిస్తూ పూర్తికాల పరిచర్య చేయడానికి పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్న యువతీయువకులను చూస్తుంటే ఇప్పటికీ ఆశ్చర్యం అనిపిస్తుంది. (యెష. 6:8) అప్పట్లో ఓ ప్రాంతీయ పర్యవేక్షకుడు నాతో చెప్పిన ఈ మాటలు వాస్తవమని చెప్పడానికి వీళ్లే నిదర్శనం: “నువ్వు మరో ఆలోచన లేకుండా పూర్తికాల సేవ చేపట్టు. అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నీకు తెలియదు.”
a ఈ సహోదరుల్లోని కొందరి జీవిత కథల గురించి ఇంగ్లీషులో ఉన్న ఈ కావలికోట సంచికలు చూడండి: థామస్ జే. సల్లీవన్ (ఆగస్టు 15, 1965); క్లాస్ జెన్సన్ (అక్టోబరు 15, 1969); మ్యాక్స్ లార్సన్ (సెప్టెంబరు 1, 1989); హూగో రీమర్ (సెప్టెంబరు 15, 1964); గ్రాంట్ స్యూటర్ (సెప్టెంబరు 1, 1983).