కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీకిది తెలుసా?

మీకిది తెలుసా?

బైబిలు కాలాల్లో, ప్రజలు కావాలనే తమ బట్టలు చింపుకోవడానికి ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?

వివిధ వ్యక్తులు తమ బట్టలు చింపుకున్న అనేక సందర్భాలను లేఖనాలు ప్రస్తావించాయి. ఇప్పటి పాఠకులకు అది కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ నిరాశానిస్పృహలు, అవమానం, కోపం, దుఃఖం వల్ల కలిగే తీవ్ర భావోద్వేగాలను వ్యక్తపరచడానికి అప్పట్లో యూదులు అలా చేసేవాళ్లు.

ఉదాహరణకు, యోసేపును అతని అన్నలు బానిసత్వానికి అమ్మేసిన సందర్భంలో, అతన్ని రక్షించలేకపోయినందుకు రూబేను ‘తన బట్టలు చింపుకున్నాడు.’ వాళ్ల తండ్రి యాకోబు కూడా, యోసేపును క్రూరమృగం చంపేసింది అనుకుని ‘తన బట్టలు చింపుకున్నాడు.’ (ఆది. 37:18-35) తన పిల్లలందరూ చనిపోయారనే వార్త విన్నప్పుడు యోబు ‘తన పై వస్త్రమును చింపుకున్నాడు.’ (యోబు 1:18-20) ఇశ్రాయేలీయులు యుద్ధంలో ఓడిపోయారని, ఏలీ ఇద్దరు కుమారులు చనిపోయారని, శత్రువులు మందసాన్ని ఎత్తుకుపోయారని ప్రధాన యాజకుడైన ఏలీకి చెప్పడానికి ఓ వార్తాహరుడు “చినిగిన బట్టలతో” వచ్చాడు. (1 సమూ. 4:12-17) ధర్మశాస్త్రంలోని మాటలు విన్న యోషీయా, తన ప్రజలు తప్పు చేశారని గ్రహించి “తన బట్టలు చింపుకొనెను.”—2 రాజు. 22:8-13.

విచారణ సమయంలో, యేసు దేవదూషణ చేశాడని నిందిస్తూ ప్రధాన యాజకుడైన కయప ‘తన వస్త్రము చింపుకున్నాడు.’ (మత్త. 26:59-66) దేవుని నామాన్ని దూషించడం విన్న ఎవరైనా తమ బట్టలు చింపుకోవాలని అప్పటి ఓ రబ్బీల ఆచారం నిర్దేశించింది. అయితే, యెరూషలేము ఆలయం నాశనమైన తర్వాత వచ్చిన రబ్బీల మరో నియమం, “దేవుని నామాన్ని దూషించడం విన్న వాళ్లెవరైనా ఇప్పుడు తమ బట్టలు చింపుకోనక్కర్లేదు, లేదంటే వాళ్లకు మిగిలేది పీలికలు మాత్రమే” అని చెప్పింది.

అయితే, ఓ వ్యక్తి నిజంగా దుఃఖంలో మునిగిపోవడం వల్ల తన బట్టలు చింపుకున్నప్పుడే దేవుని దృష్టిలో దానికి విలువ ఉండేది. అందుకే, యెహోవా తన ప్రజలకు ‘మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని నా తట్టు తిరుగుడి’ అని చెప్పాడు.—యోవే. 2:13.