కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మోషే విశ్వాసాన్ని అనుకరించండి

మోషే విశ్వాసాన్ని అనుకరించండి

“మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి . . . ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు.”—హెబ్రీ. 11:24-26.

1, 2. (ఎ) మోషే 40 ఏళ్లప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) దేవుని ప్రజలతో శ్రమపడాలని మోషే ఎందుకు నిర్ణయించుకున్నాడు?

 ఐగుప్తు, తనకు ఎలాంటి జీవితం ఇవ్వగలదో మోషేకు తెలుసు. అక్కడ ఆయన ధనవంతులుండే అందమైన, విశాలమైన భవనాలు చూశాడు. పైగా ఆయన రాజ కుటుంబీకుడు. అంతేకాక, మోషే వివిధ కళలు, ఖగోళశాస్త్రం, గణితశాస్త్రం వంటి ‘ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు.’ (అపొ. 7:22) ఓ సామాన్య ఐగుప్తీయుడు కలలో కూడా పొందలేనంత ధనం, అధికారం, గొప్ప అవకాశం మోషేకు అందుబాటులో ఉన్నాయి.

2 అలాంటి మోషే, 40 ఏళ్ల వయసులో ఓ అసాధారణమైన నిర్ణయం తీసుకున్నాడు. అది, ఆయనను పెంచుకున్న ఐగుప్తు రాజ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసివుంటుంది. ఆయన కనీసం ఓ సామాన్య ఐగుప్తీయుని “సాధారణ” జీవితాన్నైనా ఎంచుకోకుండా, బానిసల మధ్య జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకు? మోషేకున్న విశ్వాసం వల్ల. (హెబ్రీయులు 11:24-26 చదవండి.) ఆ విశ్వాసంతోనే ఆయన, కంటికి కనిపించే వాటికి మించి చూశాడు. మోషేకు “అదృశ్యుడైనవాని” మీద అంటే యెహోవా మీద, ఆయన చేసిన వాగ్దానాల నెరవేర్పు మీద విశ్వాసం ఉంది.—హెబ్రీ. 11:27.

3. ఈ ఆర్టికల్‌లో ఏ మూడు ప్రశ్నలకు జవాబులు చూస్తాం?

3 మనం కూడా, కంటికి కనిపించే వాటికి మించి చూడాలి. మనం “విశ్వాసము కలిగినవారమై” ఉండాలి. (హెబ్రీ. 10:38, 39) మన విశ్వాసాన్ని బలపర్చుకునేందుకు, హెబ్రీయులు 11:24-26 వచనాలు మోషే గురించి ఏమి చెబుతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. అలా పరిశీలిస్తూ ఈ ప్రశ్నలకు జవాబులు చూద్దాం: శరీర కోరికలను తిరస్కరించేలా మోషేను విశ్వాసం ఎలా పురికొల్పింది? అవమానాలు ఎదురైనప్పుడు కూడా తనకున్న సేవావకాశాలను అమూల్యంగా ఎంచేందుకు మోషేకు విశ్వాసం ఎలా సహాయం చేసింది? ఆయన “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం” మీద ఎందుకు మనసుపెట్టాడు?

శరీర కోరికలను తిరస్కరించాడు

4. “పాపభోగము” గురించి మోషే ఏమని అర్థం చేసుకున్నాడు?

4 “పాపభోగము” తాత్కాలికమేనని మోషే విశ్వాసం వల్ల అర్థంచేసుకున్నాడు. అయితే అప్పట్లో కొందరు, ‘విగ్రహారాధనతో, అభిచారంతో నిండిపోయిన ఐగుప్తు ప్రపంచ ఆధిపత్యంగా చలామణి అవుతుంటే, యెహోవా ప్రజలు మాత్రం బానిసత్వంలో మగ్గిపోతున్నారు కదా?’ అని వాదించి ఉండవచ్చు. కానీ, దేవుడు పరిస్థితులను మార్చగలడని మోషేకు తెలుసు. సొంత కోరికలు తీర్చుకోవడం మీదే మనసు పెట్టేవాళ్లు వర్ధిల్లుతున్నట్లు అనిపిస్తున్నా, దుష్టులు నశిస్తారనే నమ్మకం మోషేకు ఉంది. అందుకే, ఆయన ‘అల్పకాల పాపభోగాల’ వలలో చిక్కుకోలేదు.

5. ‘అల్పకాల పాపభోగంతో’ పోరాడాలంటే ఏమి చేయాలి?

5 ‘అల్పకాల పాపభోగంతో’ మీరు ఎలా పోరాడవచ్చు? పాపం వల్ల కలిగే సుఖం తాత్కాలికమేనని ఎప్పుడూ గుర్తుంచుకోండి. “లోకమును దాని ఆశయు గతించిపోవుచున్నవి” అని విశ్వాస నేత్రాలతో చూడండి. (1 యోహా. 2:15-17) పశ్చాత్తాపపడని పాపుల గతి ఎలా ఉంటుందో ఆలోచించండి. వాళ్లు ‘కాలుజారు చోటనే ఉండి, మహా భయంతో నశిస్తారు.’ (కీర్త. 73:18, 19) తప్పుడు పనులు చేయాలని అనిపించినప్పుడు ‘నేను ఎలాంటి భవిష్యత్తును కోరుకుంటున్నాను?’ అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి.

6. (ఎ) “ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు” మోషే ఎందుకు ఒప్పుకోలేదు? (బి) మోషే తీసుకున్న నిర్ణయం సరైనదని మీరు ఎందుకు అనుకుంటున్నారు?

6 భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలను కూడా మోషే విశ్వాసాన్ని బట్టే తీసుకున్నాడు. “మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి . . . ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు.” (హెబ్రీ. 11:24-26) రాజసభలో సభ్యునిగా ఉంటూనే తన ధనాన్ని, స్థానాన్ని ఉపయోగించి తోటి ఇశ్రాయేలీయులకు సహాయం చేస్తూ దేవుని సేవ చేయవచ్చని మోషే అనుకోలేదు. బదులుగా తన పూర్ణ హృదయంతో, ఆత్మతో, శక్తితో యెహోవాను ప్రేమించాలని మోషే నిశ్చయించుకున్నాడు. (ద్వితీ. 6:5) ఆ నిర్ణయం వల్ల ఆయన ఎంతో మనోవేదనను తప్పించుకున్నాడు. ఆయన వదులుకున్న ఐగుప్తు సంపదను చాలామట్టుకు ఆ తర్వాత ఇశ్రాయేలీయులే దోచుకున్నారు. (నిర్గ. 12:35, 36) ఫరో అవమానానికి గురై, ప్రాణాలు కోల్పోయాడు. (కీర్త. 136:15) అయితే మోషేను మాత్రం దేవుడు కాపాడి, మొత్తం జనాంగాన్నే సురక్షితంగా నడిపించడానికి ఉపయోగించుకున్నాడు. ఆయన జీవితానికి నిజమైన అర్థం చేకూరింది.

7. (ఎ) మత్తయి 6:19-21 ప్రకారం, మనం శాశ్వతమైన భవిష్యత్తు కోసం ఎందుకు ప్రణాళికలు వేసుకోవాలి? (బి) ఈ లోకమిచ్చే సంపదలకు, ఆధ్యాత్మిక సంపదలకు మధ్య ఉన్న తేడాను నొక్కిచెప్పే ఓ అనుభవం చెప్పండి.

7 మీరు యెహోవాను సేవిస్తున్న యౌవనులైతే, చదువు-ఉద్యోగం వంటి విషయాల్లో సరైన ఎంపికలు చేసుకోవడానికి మీకు విశ్వాసం ఎలా సహాయం చేస్తుంది? భవిష్యత్తు కోసం ఇప్పుడే ప్రణాళికలు వేసుకోండి. దేవుని వాగ్దానాలమీద విశ్వాసం ఉంచి తాత్కాలిక భవిష్యత్తు కోసం కాకుండా శాశ్వత భవిష్యత్తు కోసం ‘కూర్చుకోండి.’ (మత్తయి 6:19-21 చదవండి.) సోఫీ అనే ప్రతిభావంతురాలైన డాన్సర్‌ అనుభవాన్ని పరిశీలించండి. ఆమెకు, అమెరికాలోని డాన్స్‌కు సంబంధించిన కంపెనీలు ఉపకార వేతనాన్ని, మంచి ఉద్యోగ అవకాశాల్ని ఇచ్చాయి. “నన్ను అందరూ అలా అభిమానిస్తుంటే ఒళ్లు పులకరించేది. నిజానికి, నా తోటివాళ్లకంటే గొప్పదాన్నని నాకనిపించేది. కానీ, అవేవీ నాకు సంతోషాన్ని ఇవ్వలేదు” అని ఆమె ఒప్పుకుంటుంది. అప్పుడు ఆమె, యువత ఇలా అడుగుతోంది—నేను నా జీవితంలో ఏమి చేస్తాను? (ఇంగ్లీషు) వీడియో చూసింది. ఆమె ఇలా చెబుతుంది, “యెహోవాకు పూర్ణహృదయంతో చేయాల్సిన ఆరాధనను పణంగా పెట్టినందుకే, ఈ లోకం నాకు విజయాన్ని, ప్రేక్షకుల అభిమానాన్ని ఇచ్చిందని అర్థమైంది. దాంతో యెహోవాకు హృదయపూర్వకంగా ప్రార్థించాను. ఆ తర్వాత నేను నృత్య ప్రదర్శనలకు స్వస్తి చెప్పాను.” ఆ నిర్ణయం గురించి ఆమెలా భావిస్తుంది? ఆమె ఇలా అంటోంది, “నేను నా పాత జీవితాన్ని తలుచుకుని బాధపడట్లేదు. ఇప్పుడు నేను నూటికినూరు పాళ్లు ఆనందంగా ఉన్నాను. నా భర్తతో కలిసి పయినీరు సేవ చేస్తున్నాను. ప్రస్తుతం మాకు పేరుప్రఖ్యాతులు లేవు, అంత డబ్బు కూడా లేదు. కానీ మాకు యెహోవా ఉన్నాడు, బైబిలు విద్యార్థులు ఉన్నారు, ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయి. ఏదో కోల్పోయానన్న బాధ నాకేమాత్రం లేదు.”

8. తమ జీవితంతో ఏమి చేయాలో నిర్ణయించుకునేందుకు యౌవనులకు ఏ బైబిలు ఉపదేశం సహాయం చేస్తుంది?

8 మీకేది శ్రేష్ఠమైనదో యెహోవాకు తెలుసు. మోషే ఇలా చెప్పాడు, “నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు, ఆయనను ప్రేమించి, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోను నీ పూర్ణాత్మతోను సేవించి, నీ మేలుకొరకు నేడు నేను నీకాజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు?” (ద్వితీ. 10:12, 13) మీరు యౌవనంలో ఉన్నప్పుడే, ‘మీ పూర్ణహృదయంతో, మీ పూర్ణాత్మతో’ యెహోవాను ప్రేమించడానికి, సేవించడానికి తోడ్పడే ప్రణాళికలు వేసుకోండి. వాటివల్ల మీకు “మేలు” జరుగుతుందనే నమ్మకంతో ఉండండి.

తనకున్న సేవావకాశాలను అమూల్యంగా ఎంచాడు

9. తనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడం మోషేకు ఎందుకు కష్టమనిపించి ఉండొచ్చు?

9 “ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని” మోషే ఎంచాడు. (హెబ్రీ. 11:24-26) యెహోవా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు నుండి విడిపించే బాధ్యతను మోషేకు అప్పగించడం ద్వారా ఆయనను ‘క్రీస్తుగా’ లేదా ‘అభిషిక్తునిగా’ నియమించాడు. ఆ బాధ్యతను నిర్వర్తించడం అంత సులువుకాదని, “నింద” కూడా పడాల్సివుంటుందని మోషేకు తెలుసు. అంతకుముందు ఓ ఇశ్రాయేలీయుడు, “మామీద నిన్ను అధికారినిగాను తీర్పరినిగాను నియమించినవాడెవడు?” అంటూ మోషేను తిట్టాడు. (నిర్గ. 2:13, 14) ఆ తర్వాత స్వయంగా మోషే యెహోవాను ఇలా అడిగాడు, “నా మాట ఫరో యెట్లు వినును?” (నిర్గ. 6:12) అయితే, అలాంటి నిందలను ధైర్యంగా ఎదుర్కొనేందుకు మోషే యెహోవాకు ప్రార్థించి తన భయాలను, ఆందోళనలను చెప్పుకున్నాడు. మరి ఈ కష్టమైన బాధ్యతను నిర్వర్తించడానికి మోషేకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

10. తాను అప్పగించిన బాధ్యతను నిర్వర్తించడానికి మోషేకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

10 మోషేకు సహాయం చేయడానికి యెహోవా చేసిన మొదటి పని, “నిశ్చయముగా నేను నీకు తోడైయుందును” అని ఆయనకు భరోసా ఇవ్వడం. (నిర్గ. 3:12) రెండవది, తన పేరుకున్న అర్థంలోని ఒక అంశాన్ని వివరించి మోషేలో ధైర్యం నింపాడు. “నేను ఎలా అవ్వాలనుకుంటే అలా అవుతాను” అని ఆయన చెప్పాడు. a (నిర్గ. 3:14, NW) మూడవది, మోషేను పంపించింది తానేనని ప్రజలు నమ్మేలా ఆయనకు అద్భుతాలు చేయగల శక్తినిచ్చాడు. (నిర్గ. 4:2-5) నాలుగవది, ఆ పనిలో మోషేకు తోడుగా ఉండడానికి, ఆయన తరఫున మాట్లాడడానికి అహరోనును ఇచ్చాడు. (నిర్గ. 4:14-16) తన సేవకులు ఏ బాధ్యతనైనా నిర్వర్తించగలిగేలా దేవుడు సహాయం చేస్తాడనే నమ్మకం, జీవితపు చివరిదశకు చేరుకునే సరికి మోషేలో ఎంతగానో బలపడింది. అందుకే, తన తర్వాతి నాయకుడైన యెహోషువతో, “నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు. భయపడకుము విస్మయమొందకుము” అని పూర్తి నమ్మకంతో చెప్పగలిగాడు.—ద్వితీ. 31:8.

11. మోషే తన బాధ్యతను గొప్ప గౌరవంగా ఎందుకు భావించాడు?

11 యెహోవా మద్దతుతో మోషే ఆ కష్టమైన బాధ్యతను, “ఐగుప్తు ధనముకంటె . . . గొప్ప భాగ్యమని” ఎంచుతూ దానికి ఎంతో విలువిచ్చాడు. ఎంతైనా, ఐగుప్తును ఏలే ఫరోను సేవించడంతో పోల్చితే, సర్వశక్తిమంతుడైన దేవుణ్ణి సేవించడం గొప్ప భాగ్యం కాదా? ఐగుప్తు రాకుమారునిగా ఉండడానికీ, యెహోవా నియమించిన ‘క్రీస్తుగా’ లేదా అభిషిక్తునిగా ఉండడానికీ తేడా లేదా? అలాంటి వైఖరి చూపించాడు కాబట్టే మోషే యెహోవాతో ప్రత్యేకమైన అనుబంధం సంపాదించుకున్నాడు. అంతేకాదు, ఇశ్రాయేలీయులను వాగ్దాన దేశానికి నడిపించేలా యెహోవా ఆయనకు, “మహా భయంకర కార్యములు” చేసే శక్తిని అనుగ్రహించాడు.—ద్వితీ. 34:10-12.

12. యెహోవా ఇస్తున్న ఏ సేవావకాశాలను మనం అమూల్యంగా ఎంచాలి?

12 మనకూ ఓ బాధ్యత ఉంది. యెహోవా దేవుడు, పరిచర్య చేసే బాధ్యతను తన కుమారుని ద్వారా పౌలుకూ మరితరులకూ ఇచ్చినట్లే మనకు కూడా అప్పగించాడు. (1 తిమోతి 1:12-14 చదవండి.) సువార్త ప్రకటించే భాగ్యం మనలో ప్రతి ఒక్కరికీ ఉంది. (మత్త. 24:14; 28:19, 20) కొందరు పూర్తికాల సేవ చేస్తుంటారు. పరిణతిగల మరికొంతమంది సహోదరులు పరిచర్య సేవకులుగా, పెద్దలుగా సంఘంలోని ఇతరులకు సేవ చేస్తారు. అయితే సత్యంలో లేని కుటుంబ సభ్యులూ మరితరులూ, అలాంటి సేవకు ఏమాత్రం విలువలేదని అనొచ్చు, లేదా అలాంటి స్వయంత్యాగం చూపిస్తున్నందుకు మిమ్మల్ని నిందించవచ్చు కూడా. (మత్త. 10:34-37) వాళ్ల మాటల వల్ల మీరు డీలాపడిపోతే, ‘అలాంటి త్యాగాలు చేయడం నిజంగా అవసరమా? ఆ బాధ్యతను నేను సక్రమంగా నిర్వర్తించగలనా?’ వంటి ఆలోచనలు మీ మనసులో మొదలయ్యే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో పట్టుదలతో కొనసాగడానికి విశ్వాసం మీకు ఎలా సహాయం చేస్తుంది?

13. తానిచ్చిన బాధ్యతలను నిర్వర్తించడానికి యెహోవా మనల్ని ఎలా సన్నద్ధుల్ని చేస్తాడు?

13 విశ్వాసంతో ప్రార్థిస్తూ యెహోవా సహాయాన్ని అర్థించండి. మీ భయాలను, ఆందోళనలను ఆయనతో చెప్పుకోండి. ఎంతైనా, మీకు ఆ బాధ్యతలు ఇచ్చింది యెహోవా దేవుడే కాబట్టి, విజయం సాధించడానికి కూడా ఆయనే సహాయం చేస్తాడు. ఎలా? మోషేకు సహాయం చేసిన విధానాల్లోనే ఆయన మీకు సహాయం చేస్తాడు. మొదటిది, “నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” అని యెహోవా ఇస్తున్న భరోసా. (యెష. 41:9, 10) రెండవది, “నేను చెప్పియున్నాను దాని నెరవేర్చెదను, ఉద్దేశించియున్నాను సఫలపరచెదను” అని అంటూ తన వాగ్దానాలను పూర్తిగా నమ్మవచ్చని గుర్తుచేస్తున్నాడు. (యెష. 46:11) మూడవది, పరిచర్య నెరవేర్చేలా యెహోవా మీకు “బలాధిక్యము” ఇస్తున్నాడు. (2 కొరిం. 4:7) నాలుగవది, “యొకనినొకడు ఆదరించి యొకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయు” అంతర్జాతీయ సహోదర బృందాన్ని మన తండ్రి అనుగ్రహించాడు. వాళ్లు మీ బాధ్యతను నిర్వర్తించేలా మీకు సహాయం చేస్తూ, మీకు తోడుగా ఉన్నారు. (1 థెస్స. 5:11) యెహోవా దేవుడు తాను అప్పగించిన బాధ్యతల కోసం మిమ్మల్ని సన్నద్ధుల్ని చేస్తుండగా, మీకు ఆయన మీదున్న విశ్వాసం బలపడుతుంది, అంతేకాదు భూమ్మీదున్న ఎలాంటి ధననిధులకన్నా మీకున్న సేవావకాశాలు గొప్పవని గ్రహిస్తారు.

“ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను”

14. తాను తప్పకుండా బహుమానాన్ని పొందుతానని మోషే ఎందుకు నమ్మాడు?

14 మోషే, “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.” (హెబ్రీ. 11:24-26) భవిష్యత్తు గురించి తనకున్న కాస్త అవగాహనతోనే మోషే తన ఆలోచనా విధానాన్ని మార్చుకున్నాడు. తన పూర్వీకుడైన అబ్రాహాములానే మోషే కూడా, చనిపోయినవాళ్లను యెహోవా పునరుత్థానం చేయగలడని గట్టిగా నమ్మాడు. (లూకా 20:37, 38; హెబ్రీ. 11:17-19) భవిష్యత్తులో పొందే ఆశీర్వాదాల గురించి ఆలోచించాడు కాబట్టే, అజ్ఞాతంలో గడిపిన 40 ఏళ్లు, అరణ్యంలో సంచరించిన మరో 40 ఏళ్లు వృథా అయిపోయాయని మోషే బాధపడలేదు. దేవుని వాగ్దానాలు ఎలా నెరవేరతాయో పూర్తిగా తెలియకపోయినా, భవిష్యత్తులో పొందబోయే బహుమానాన్ని మోషే విశ్వాస నేత్రాలతో చూడగలిగాడు.

15, 16. (ఎ) మన బహుమానం మీద ఎందుకు దృష్టి నిలపాలి? (బి) దేవుని రాజ్యంలో ఉండే ఏ దీవెనల కోసం మీరు ఆశగా ఎదురుచూస్తున్నారు?

15 “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు” మీరు కూడా దృష్టి నిలుపుతున్నారా? మోషేలాగే, ప్రస్తుతం మనకు కూడా దేవుని వాగ్దానాల గురించిన అన్ని వివరాలు తెలియవు. ఉదాహరణకు, మహాశ్రమలు మొదలయ్యే “కాలమెప్పుడు వచ్చునో” మనకు తెలియదు. (మార్కు 13:32, 33) కానీ భవిష్యత్తులో వచ్చే భూపరదైసు గురించి మోషేకన్నా మనకు ఎక్కువే తెలుసు. దేవుని రాజ్యంలో ఉండే జీవితం గురించిన పూర్తి వివరాలు మనకు తెలియకపోయినా, భవిష్యత్తు బహుమానం మీద “దృష్టి” నిలపడానికి సరిపడినన్ని దేవుని వాగ్దానాలు మనకున్నాయి. కొత్త లోకం గురించి మన మనసులో స్పష్టమైన చిత్రం ఉన్నప్పుడు రాజ్యానికి సంబంధించిన విషయాలకు మొదటి స్థానం ఇవ్వడానికి మొగ్గుచూపుతాం. అదెలా? దీని గురించి ఆలోచించండి, ఒక ఇంటి గురించి సరిగ్గా తెలుసుకోకుండా మీరు దాన్ని కొనేస్తారా? అలా ఎప్పుడూ చెయ్యరు! అలాగే, స్పష్టంగా చూడలేని భవిష్యత్తు కోసం మన జీవితాల్ని పణంగా పెట్టలేము. మనం విశ్వాస నేత్రాలతో దేవుని రాజ్యంలో ఉండే జీవితాన్ని స్పష్టంగా చూస్తూ, దాని మీదే మనసు నిలపాలి.

మోషేవంటి నమ్మకస్థులతో మాట్లాడుతుంటే మనసు ఎంత పులకరిస్తుంది! (16వ పేరా చూడండి)

16 దేవుని రాజ్యంలో ఉండే జీవితాన్ని మీ మనసులో మరింత స్పష్టంగా చూడాలంటే, రాబోయే పరదైసులోని మీ జీవితం మీద “దృష్టి” నిలపండి. మీ ఊహాశక్తికి పని చెప్పండి. ఉదాహరణకు, మొదటి శతాబ్దానికి ముందు జీవించిన దేవుని సేవకుల గురించి చదువుతుంటే, భవిష్యత్తులో వాళ్లు పునరుత్థానం అయినప్పుడు వాళ్లను మీరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో ఆలోచించండి. అంత్యదినాల్లో మీ జీవితం గురించి వాళ్లు ఎలాంటి వివరాలు తెలుసుకోవాలని ఇష్టపడతారో ఊహించండి. శతాబ్దాల క్రితం జీవించిన బంధువుల్ని కలుసుకుని వాళ్ల కోసం దేవుడు చేసిన వాటన్నిటి గురించి వాళ్లకు బోధిస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించుకోండి. శాంతిసామరస్యాలు విలసిల్లే పరిస్థితుల్లో ఎన్నో వన్యమృగాలను పరిశీలిస్తూ, వాటి గురించి తెలుసుకుంటున్నప్పుడు పొందే సంతోషాన్ని మీ మనోనేత్రాలతో చూడడానికి ప్రయత్నించండి. పరిపూర్ణతకు చేరుకునే కొద్దీ యెహోవాకు మీరు ఇంకెంత దగ్గరౌతారో ఆలోచించండి.

17. కంటికి కనిపించని బహుమానాన్ని మన మనోనేత్రాలతో స్పష్టంగా చూడడం వల్ల ప్రయోజనం ఏమిటి?

17 కంటికి కనిపించని బహుమానాన్ని మన మనోనేత్రాలతో స్పష్టంగా చూడడం వల్ల సంతోషంగా ముందుకు సాగగలుగుతాం, సురక్షితమైన శాశ్వత భవిష్యత్తును మనసులో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోగలుగుతాం. అభిషిక్త క్రైస్తవులకు రాస్తూ పౌలు “మనము చూడనిదానికొరకు నిరీక్షించిన యెడల ఓపికతో దానికొరకు కనిపెట్టుదుము” అని అన్నాడు. (రోమా. 8:25) ఆ వచనంలోని సూత్రం నిత్యజీవం కోసం ఎదురుచూస్తున్న క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. మనం మన బహుమానాన్ని ఇంకా అందుకోనప్పటికీ, “ప్రతిఫలముగా కలుగబోవు బహుమానం” కోసం ఓపిగ్గా వేచివుండేంత బలమైన విశ్వాసం మనకుంది. యెహోవా సేవలో ఎన్ని సంవత్సరాలు గడిపినా అవి వ్యర్థం కావని మోషేలాగే మనమూ గుర్తుంచుకుంటాం. అంతేకాదు, “దృశ్యమైనవి అనిత్యములు; అదృశ్యమైనవి నిత్యములు” అనే నమ్మకంతో మనం ఉన్నాం.—2 కొరింథీయులు 4:16-18 చదవండి.

18, 19. (ఎ) విశ్వాసాన్ని కాపాడుకోవడానికి మనం ఎందుకు పోరాడాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో ఏమి పరిశీలిస్తాం?

18 విశ్వాసం ఉన్నప్పుడు, “అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువును” గ్రహించగలుగుతాం. (హెబ్రీ. 11:1) కనిపించే వాటి గురించి మాత్రమే ఆలోచించేవాళ్లు, యెహోవా సేవకున్న విలువను గుర్తించలేరు. ఆ సేవ, అలాంటి వాళ్లకు ‘వెర్రితనంగా’ అనిపిస్తుంది. (1 కొరిం. 2:14) అంతేకాదు, మనం నిరంతర జీవితాన్ని ఆస్వాదించాలని, పునరుత్థానాన్ని చూడాలని ఎదురుచూస్తున్నాం. అలాంటివి జరుగుతాయని ఈ లోకం ఊహించనైనా ఊహించలేదు. పౌలును “వదరుబోతు” అని ఎగతాళి చేసిన ఆనాటి తత్వవేత్తల్లానే, ఈ రోజుల్లో కూడా చాలామంది మనం అర్థంపర్థం లేనిదాన్ని ప్రకటిస్తున్నామని అనుకుంటారు.—అపొ. 17:18.

19 విశ్వాసమే కనిపించని లోకంలో జీవిస్తున్నాం కాబట్టి, మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి పోరాడాలి. మీ విశ్వాసం లేదా “నమ్మిక తప్పిపోకుండునట్లు” యెహోవాను వేడుకోండి. (లూకా 22:32) పాపం వల్ల కలిగే పర్యవసానాలను, యెహోవా సేవకున్న అసాధారణమైన విలువను, నిత్యజీవ నిరీక్షణను ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి. అయితే, విశ్వాసం వల్ల మోషే మరెంతో గొప్ప వాటిని చూశాడు. “అదృశ్యుడైనవానిని” చూడడానికి మోషేకు విశ్వాసం ఎలా సహాయం చేసిందో తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.—హెబ్రీ. 11:27.

a నిర్గమకాండము 3:14⁠లో దేవుడు పలికిన మాటల గురించి ఓ బైబిలు విద్వాంసుడు ఇలా రాశాడు, “తన చిత్తాన్ని నెరవేర్చకుండా ఆయనను ఏదీ అడ్డుకోలేదు . . . ఈ పేరు [యెహోవా] ఇశ్రాయేలీయులకు కోటగా, అనంతమైన ఆశలకు ఓదార్పుకు నిలయంగా ఉంది.”