‘దేవుని చిత్తం చేయడమే నాకు ఆహారం’
మీకు ఏవి ఎక్కువ సంతోషాన్నిస్తాయి? వివాహ జీవితం, పిల్లల్ని పెంచి పెద్దచేయడం, స్నేహాన్ని వృద్ధిచేసుకోవడం వంటి అనుబంధాలా? బహుశా, ఆత్మీయులతో కలిసి సరదాగా భోజనం చేసే సందర్భాలు మీకు సంతోషాన్నివ్వవచ్చు. అయితే యెహోవా చిత్తం చేయడం, బైబిలు అధ్యయనం చేయడం, సువార్త ప్రకటించడం వంటివి నిజమైన సంతృప్తినిస్తాయని దేవుని సేవకులైన మనమందరం ఒప్పుకుంటాం.
పూర్వకాలంలో ఇశ్రాయేలు రాజైన దావీదు, సృష్టికర్తను కొనియాడుతూ, “నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములోనున్నది” అని పాడాడు. (కీర్త. 40:8) దావీదు ఎన్నో కష్టాలు, ఇబ్బందులు అనుభవించినా దేవుని చిత్తం చేయడంలో నిజమైన సంతోషాన్ని పొందాడు. అయితే, యెహోవా సేవలో సంతోషాన్ని పొందిన చాలామంది ఆరాధకుల్లో దావీదు ఒక్కడు మాత్రమే.
కీర్తన 40:8లోని ఆ మాటలను మెస్సీయకు లేదా క్రీస్తుకు అన్వయిస్తూ అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ఆయన [యేసు] ఈ లోకమందు ప్రవేశించునప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు.—బలియు అర్పణయు నీవు కోరలేదుగాని నాకొక శరీరమును అమర్చితివి. పూర్ణహోమములును పాపపరిహారార్థబలులును నీకిష్టమైనవికావు. అప్పుడు నేను—గ్రంథపుచుట్టలో నన్నుగూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా, నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని.”—హెబ్రీ. 10:5-7.
యేసు భూమ్మీదున్నప్పుడు సృష్టిని పరిశీలించడం, స్నేహితులతో సమయం గడపడం, నలుగురితో కలిసి భోజనం చేయడం వంటివాటిని ఆస్వాదించాడు. (మత్త. 6:26-29; యోహా. 2:1, 2; 12:1, 2) అయినా, యేసుకు అన్నిటికన్నా ఇష్టమైనది, ఎక్కువ సంతోషాన్నిచ్చింది మాత్రం తన పరలోక తండ్రి చిత్తాన్ని చేయడమే. అందుకే ఆయన ఇలా అన్నాడు, “నన్ను పంపినవాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై యున్నది.” (యోహా. 4:34; 6:38) శిష్యులు యేసు దగ్గర, నిజమైన సంతోషానికిగల రహస్యాన్ని నేర్చుకున్నారు. వాళ్లు చాలా సంతోషంగా, ఇష్టపూర్వకంగా, ఉత్సాహంగా రాజ్యసువార్త ఇతరులకు ప్రకటించారు.—లూకా 10:1, 8, 9, 17.
‘వెళ్లి, శిష్యుల్ని చేయండి’
యేసు తన శిష్యులకు ఇలా ఆజ్ఞాపించాడు, “మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ మత్త. 28:19, 20) ఆ బాధ్యతను నిర్వర్తించాలంటే ప్రజలు ఎక్కడుంటే అక్కడకు వెళ్లి ప్రకటించాలి, ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలవాలి, వాళ్లతో బైబిలు అధ్యయనాలు చేయాలి. ఇవి చేయడం వల్ల ఎంతో సంతోషం పొందుతాం.
ఉన్నాను.” (ప్రజలు సరిగ్గా స్పందించకపోయినా, ప్రకటనా పనిలో కొనసాగేలా ప్రేమ మనల్ని కదిలిస్తుంది
మన సందేశం పట్ల ప్రజలు ఆసక్తి చూపించినా చూపించకపోయినా, మనకు సరైన వైఖరి ఉంటే పరిచర్యలో సంతోషాన్ని సొంతం చేసుకుంటాం. కొందరు ఉదాసీనత చూపిస్తున్నా మనం ఎందుకు సువార్త ప్రకటిస్తూనే ఉంటాం? ఎందుకంటే దేవుని రాజ్యం గురించి ప్రకటించడం, శిష్యుల్ని చేయడం ద్వారా దేవుని మీదా పొరుగువాళ్ల మీదా ప్రేమను చూపించవచ్చని మనం అర్థం చేసుకుంటాం. నిజానికి, మన జీవితాలూ మన పొరుగువాళ్ల జీవితాలూ ప్రమాదంలో ఉన్నాయి. (యెహె. 3:17-21; 1 తిమో. 4:16) కష్టంగా అనిపించే క్షేత్రాల్లో పరిచర్య చేస్తున్నప్పుడు, తమ ఉత్సాహాన్ని కాపాడుకోవడానికి మన సహోదరులకు ఉపయోగపడిన కొన్ని విషయాలను చూద్దాం.
ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
పరిచర్యలో సరైన ప్రశ్నలను ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఒక రోజు ఉదయం ఆమాల్యా అనే సహోదరి ఒక పార్కులో వార్తాపత్రిక చదువుతున్న వ్యక్తిని చూసింది. ఆమె ఆయన దగ్గరకు వెళ్లి, ‘వార్తాపత్రికలో మంచి వార్తలు ఏమైనా ఉన్నాయా?’ అని అడిగింది. ఆయన లేవని చెప్పినప్పుడు ఆమె, “నేను దేవుని రాజ్యం గురించి మంచి వార్త తెచ్చాను” అని చెప్పింది. అది ఆ వ్యక్తిలో ఆసక్తి రేకెత్తించింది, ఆయన బైబిలు అధ్యయనానికి ఒప్పుకున్నాడు. నిజానికి ఆమాల్యా ఆ పార్కులో మరో మూడు బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టగలిగింది.
జానస్ తన ఉద్యోగ స్థలాన్నే పరిచర్య క్షేత్రంగా చేసుకుంది. ఒక సెక్యూరిటీ గార్డ్, ఆయనతోపాటు పనిచేసే ఓ మహిళ కావలికోట పత్రికలోని ఒక ఆర్టికల్ చదివి ఆసక్తి చూపించారు. దాంతో వాళ్లకు ప్రతీనెల పత్రికలు తెచ్చిస్తానని జానస్ చెప్పింది. కావలికోట, తేజరిల్లు! (ఇంగ్లీషు) పత్రికల్లో వచ్చే వివిధ అంశాలను చూసి ఆకర్షితుడైన మరో సహోద్యోగికి కూడా క్రమంగా పత్రికలు తెచ్చిస్తానని మాటిచ్చింది. అది చూసి అక్కడే పనిచేస్తున్న మరో మహిళ కూడా పత్రికలు కావాలని అడిగింది. “యెహోవా ఎంతో ఆశీర్వదించాడు” అని జానస్ అంటోంది, అలా క్రమేణా ఆమె 11 మందికి పత్రికలు ఇవ్వడం మొదలుపెట్టింది.
సానుకూలంగా ఉండండి
ఇంటింటి పరిచర్యలో ఆసక్తి చూపించిన వాళ్లతో మాట్లాడిన తర్వాత, ‘మరో రోజు వచ్చి మిమ్మల్ని కలుస్తాను’ వంటి మాటలతో ముగించవద్దని ఓ ప్రయాణ పర్యవేక్షకుడు ప్రచారకులకు సలహా ఇచ్చాడు. బదులుగా, “బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో మీకు చూపించమంటారా?” లేదా “మీతో మళ్లీ మాట్లాడడానికి ఏ రోజు, ఎన్ని గంటలకు రమ్మంటారు?” అని అడగొచ్చని ఆయన చెప్పాడు. ఆ ప్రయాణ పర్యవేక్షకుడు సందర్శించిన ఒక సంఘంలోని సహోదరసహోదరీలు ఈ పద్ధతి ఉపయోగించి ఒక్క వారంలోనే 44 బైబిలు అధ్యయనాలను మొదలుపెట్టారని ఆయన అన్నాడు.
ఆసక్తి చూపించిన వాళ్లను సరైన సమయానికే మళ్లీ కలిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది, కొన్ని రోజుల వ్యవధిలోనే మళ్లీ కలిసినా మంచిదే. ఎందుకు? అలా చేయడం ద్వారా, బైబిల్ని అర్థం చేసుకునేలా సహృదయులకు సహాయం చేయాలని మనం నిజంగా కోరుకుంటున్నామని చూపిస్తాం. యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడానికి ఎందుకు ఒప్పుకుందో ఓ మహిళను
అడిగినప్పుడు, “వాళ్లు నా పట్ల నిజమైన శ్రద్ధ, ప్రేమ చూపించారు కాబట్టే నేను అధ్యయనం చేయడానికి ఇష్టపడ్డాను” అని చెప్పింది.ఆసక్తి చూపించిన వాళ్లను, “బైబిలు అధ్యయనం ఎలా చేస్తామో మీకు చూపించమంటారా?” అని అడగవచ్చు
పయినీరు సేవా పాఠశాలకు హాజరైన కొంతకాలానికే, మాదాయీ అనే సహోదరి 15 బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టింది, మరో 5 అధ్యయనాలను ఇతర ప్రచారకులకు ఇచ్చింది. ఆమె బైబిలు విద్యార్థుల్లో చాలామంది క్రమంగా కూటాలకు హాజరవుతున్నారు. మాదాయీ అన్ని అధ్యయనాలను ఎలా మొదలుపెట్టగలిగింది? మొదటిసారి కలిసినప్పుడు ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలుసుకునేంత వరకు వాళ్ల ఇంటికి వెళ్తూనే ఉండాలనే విషయాన్ని పయినీరు పాఠశాల ఆమె మనసులో ముద్రించింది. బైబిలు సత్యాలను నేర్చుకునేలా ఎంతోమందికి సహాయం చేసిన మరో సహోదరి ఇలా చెబుతుంది, “యెహోవా గురించి తెలుసుకోవాలని కోరుకునేవాళ్లకు సహాయం చేయాలంటే, పట్టుదలగా పునర్దర్శనాలు చేయడం ముఖ్యమని నేను నేర్చుకున్నాను.”
బైబిల్ని అర్థం చేసుకోవాలని కోరుకునేవాళ్లను వీలైనంత త్వరగా పునర్దర్శించడం ద్వారా, వాళ్లమీద మనకు నిజంగా శ్రద్ధ ఉందని చూపిస్తాం
పునర్దర్శనాలు, బైబిలు అధ్యయనాలు చేయాలంటే పట్టుదల, కృషి అవసరం. అయితే, వాటివల్ల వచ్చే ఆశీర్వాదాలు ఆ కష్టాన్నంతటినీ మరిపిస్తాయి. మనం రాజ్య ప్రకటనాపనిలో ప్రయాసపడినప్పుడు, ప్రజలు “సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానము” సంపాదించుకుని, ప్రాణాలను కాపాడుకోవడానికి సహాయం చేస్తాం. (1 తిమో. 2:3, 4) మన విషయానికొస్తే, సాటిలేని సంతృప్తినీ సంతోషాన్నీ సొంతం చేసుకుంటాం.