పరిచర్యలో బంగారు సూత్రాన్ని పాటించండి
“మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి.”—మత్త. 7:12.
1. పరిచర్యలో కలిసే ప్రజలతో మనం ఎలా వ్యవహరిస్తున్నామో చూసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఓ అనుభవం చెప్పండి. (ప్రారంభ చిత్రం చూడండి.)
కొన్నేళ్ల క్రితం, ఫిజి దేశంలో ఒక దంపతులు క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు ప్రజల్ని ఆహ్వానిస్తూ ఓ మహిళ ఇంటికి వెళ్లారు. ఇంటి బయట ఆ మహిళతో మాట్లాడుతుండగా వర్షం మొదలైంది. దాంతో ఆ సహోదరుడు ఆ మహిళకు ఒక గొడుగు ఇచ్చి, తన భార్యతోపాటు మరో గొడుగు కింద నిలబడ్డాడు. ఆరోజు సాయంత్రం, జ్ఞాపకార్థ ఆచరణకు ఆ మహిళ వచ్చినప్పుడు వాళ్లెంతో సంతోషించారు. తన ఇంటికొచ్చిన సాక్షులు ఏమి మాట్లాడారో తనకు అంతగా గుర్తులేదని ఆమె ఒప్పుకుంది. కానీ వాళ్లు తనతో వ్యవహరించిన విధానం ఎంతగా ఆకట్టుకుందంటే, ఆ కూటానికి తప్పకుండా వెళ్లాలనుకున్నానని ఆమె చెప్పింది. ఆ దంపతుల ప్రవర్తన ఆమెను ఎందుకంతగా ఆకట్టుకుంది? ఎందుకంటే వాళ్లు “బంగారు సూత్రం” అని పేరుగాంచిన నియమాన్ని పాటించారు.
2. బంగారు సూత్రం అంటే ఏమిటి? దాన్ని మనమెలా పాటించవచ్చు?
2 ఇంతకీ ఏమిటా బంగారు సూత్రం? “మనుష్యులు మీకు ఏమి చేయవలెనని మీరు కోరుదురో ఆలాగుననే మీరును వారికి చేయుడి” అని యేసు ఇచ్చిన ఉపదేశమే ఆ బంగారు సూత్రం. (మత్త. 7:12) దాన్ని మనమెలా పాటించవచ్చు? ముఖ్యంగా రెండు పనులు చేయడం ద్వారా. మొదటిగా, ‘ఒకవేళ నేనే వాళ్ల స్థానంలో ఉంటే, నాతో ఇతరులు ఎలా వ్యవహరించాలని కోరుకుంటాను?’ అని మనల్ని ప్రశ్నించుకోవాలి. రెండవదిగా, ఇతరులతో అలా వ్యవహరించడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి.—1 కొరిం. 10:24.
3, 4. (ఎ) బంగారు సూత్రాన్ని పాటించాల్సింది తోటి విశ్వాసుల విషయంలో మాత్రమే కాదని ఎందుకు చెప్పవచ్చు? (బి) ఈ ఆర్టికల్‌లో మనం ఏమి చూస్తాం?
3 మనం తోటి విశ్వాసులతో వ్యవహరించేటప్పుడు తరచూ బంగారు సూత్రాన్ని పాటిస్తాం. అయితే కేవలం తోటి విశ్వాసుల విషయంలోనే దాన్ని పాటించమని యేసు ఎక్కడా చెప్పలేదు. నిజానికి ప్రజలందరితో, ఆఖరికి శత్రువులతో కూడా ఎలా ప్రవర్తించాలో చెబుతున్న సందర్భంలో యేసు బంగారు సూత్రాన్ని ప్రస్తావించాడు. (లూకా 6:27, 28, 31, 35 చదవండి.) శత్రువుల విషయంలోనే మనం ఆ సూత్రాన్ని పాటించాలంటే, మనం సాక్ష్యమిస్తున్న ప్రజల విషయంలో దాన్ని పాటించడం ఇంకెంత ప్రాముఖ్యం! ఎందుకంటే వాళ్లలో చాలామంది, సువార్తకు సానుకూలంగా స్పందించి “నిత్యజీవము” సంపాదించుకునే అవకాశం ఉంది.—అపొ. 13:48.
4 పరిచర్య చేస్తున్నప్పుడు మనం మనసులో ఉంచుకోవాల్సిన నాలుగు ప్రశ్నల గురించి ఇప్పుడు చర్చిద్దాం, అవి: నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఎక్కడ మాట్లాడుతున్నాను? ఎప్పుడు మాట్లాడితే మంచిది? ఎలా మాట్లాడితే మంచిది? ఈ ప్రశ్నల్ని మనసులో ఉంచుకుంటే, ఇంటివాళ్ల భావాలను పట్టించుకుంటూ, వాళ్లకు తగ్గట్లుగా మాట్లాడగలుగుతాం.—1 కొరిం. 9:19-23.
ఎవరితో మాట్లాడుతున్నాను?
5. మనం ఎలాంటి ప్రశ్నలు వేసుకుంటే మంచిది?
5 పరిచర్యలో మనం సాధారణంగా ఒక్కొక్కరితో మాట్లాడతాం. ఏ ఇద్దరి నేపథ్యాలూ పరిస్థితులూ ఒకేలా ఉండవు. (2 దిన. 6:29) ఓ వ్యక్తితో సువార్త పంచుకుంటున్నప్పుడు ఇలా ప్రశ్నించుకోండి, ‘ఒకవేళ ఆయన స్థానంలో నేనూ, నా స్థానంలో ఆయనా ఉంటే, ఆయన నన్ను ఎలా చూడాలని కోరుకుంటాను? ఆయన నన్ను కేవలం తన పొరుగున నివసించే ఓ అనామకునిగా మాత్రమే చూస్తే నేను సంతోషిస్తానా? లేక, నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని గుర్తిస్తే సంతోషిస్తానా?’ ఇలాంటి ప్రశ్నల గురించి ఆలోచిస్తే, ప్రతీ గృహస్థుణ్ణి ప్రత్యేకంగా చూడగలుగుతాం.
6, 7. పరిచర్యలో ఎవరైనా మనతో కటువుగా ప్రవర్తిస్తే ఏమి చేయాలి?
6 దయగా, మర్యాదగా మాట్లాడాలని చెబుతున్న బైబిలు ఉపదేశాన్ని పాటించడానికి క్రైస్తవులు చేయగలిగినదంతా చేస్తారు. (కొలొ. 4:6) అయితే మనం అపరిపూర్ణులం కాబట్టి కొన్నిసార్లు నోరుజారి, తర్వాత నాలుక కరుచుకుంటాం. (యాకో. 3:2) బహుశా, ఆ రోజు ఎదురైన చిరాకులవల్ల, ఇతరులతో ఒకవేళ కటువుగా మాట్లాడితే, వాళ్లు మనల్ని అర్థం చేసుకోవాలని ఆశిస్తాం. అంతేగానీ మనం “మొరటుగా,” “అనాలోచితంగా” మాట్లాడినట్లు వాళ్లు భావించకూడదని కోరుకుంటాం. మరి ఇతరుల విషయంలో కూడా మనం అలాగే ఆలోచించవద్దా?
7 పరిచర్యలో ఓ వ్యక్తి మీతో కోపంగా లేదా కటువుగా ప్రవర్తిస్తే, అతను ఎందుకలా ప్రవర్తించాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారా? బహుశా పని వల్ల లేదా చదువుల వల్ల కలిగిన ఒత్తిడి కారణంగా అలా ప్రవర్తించాడా? లేదా అతను తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడా? చాలా సందర్భాల్లో, కొంతమంది గృహస్థులు యెహోవా ప్రజల మీద మొదట్లో చిరాకుపడినా, సాక్షుల సౌమ్యతకు, మర్యాదకు ముగ్ధులై సువార్తకు చక్కగా స్పందించారు.—సామె. 15:1; 1 పేతు. 3:15.
8. అన్ని రకాల ప్రజలకు రాజ్యసువార్త ప్రకటించడానికి మనమెందుకు వెనకాడకూడదు?
8 మనం అన్నిరకాల ప్రజలకు ప్రకటిస్తాం. గడిచిన కొన్ని సంవత్సరాల్లోనే ఇంగ్లీషు కావలికోట సంచికల్లో, “బైబిలు జీవితాలను మారుస్తుంది” శీర్షికతో 60కు పైగా అనుభవాలు ప్రచురితమయ్యాయి. ఆ ఆర్టికల్స్‌లో అనుభవం చెప్పిన కొంతమంది ఒకప్పుడు దొంగలు, తాగుబోతులు, రౌడీలు లేదా మాదకద్రవ్యాలకు బానిసలు. మరికొంతమంది, రాజకీయవేత్తలు, మత నాయకులు లేదా చదువు-ఉద్యోగం తప్ప మరోలోకం తెలియనివాళ్లు. కొంతమందైతే అనైతిక జీవితాన్ని కూడా గడిపినవాళ్లు. అయితే వాళ్లందరూ సువార్త విని, బైబిలు అధ్యయనం చేసి, తమ జీవితాల్లో మార్పులు చేసుకుని, సత్యంలోకి వచ్చారు. కాబట్టి, ఫలానావాళ్లు రాజ్య సందేశాన్ని అస్సలు వినరనే నిర్ధారణకు మనం ఎప్పుడూ రాకూడదు. (1 కొరింథీయులు 6:9-11 చదవండి.) బదులుగా, అన్ని రకాల ప్రజలు సువార్తకు స్పందించే అవకాశం ఉందని మనం గుర్తిస్తాం.—1 కొరిం. 9:22.
ఎక్కడ మాట్లాడుతున్నాను?
9. ఇతరుల ఇంటిపట్ల మనం ఎందుకు గౌరవం చూపించాలి?
9 పరిచర్యలో మనం ప్రజలను ఎక్కడ కలుస్తాం? ఎక్కువగా వాళ్ల ఇళ్లల్లోనే. (మత్త. 10:11-13) ఇతరులు మన ఇంటిపట్ల, పరిసరాలు-వస్తువుల పట్ల గౌరవం చూపిస్తే మనం సంతోషిస్తాం. ఎంతైనా, మన ఇల్లంటే మనకు ఇష్టం. అది ఏకాంతాన్ని, భద్రతను ఇచ్చే స్థలంగా ఉండాలని కోరుకుంటాం. గృహస్థులకు సంబంధించిన వాటిపట్ల కూడా మనం అదే గౌరవాన్ని చూపించాలి. కాబట్టి ఇంటింటి పరిచర్యలో మనం గృహస్థుల ఇంటి విషయంలో ఎలా వ్యవహరిస్తున్నామో చూసుకోవడం మంచిది.—అపొ. 5:42.
10. మనం పరిచర్యలో ఇతరులకు అభ్యంతరం కలిగించకుండా ఎలా నడుచుకోవచ్చు?
10 నేరాలతో నిండిపోయిన నేటి ప్రపంచంలో, చాలామంది ఇంటివాళ్లు కొత్తవాళ్లను అనుమానంగా చూస్తుంటారు. (2 తిమో. 3:1-5) అయితే వాళ్ల అనుమానానికి బలం చేకూర్చే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఉదాహరణకు, మనం ఓ ఇంటికి వెళ్లి తలుపు తట్టాం. ఎవరూ తలుపు తీయలేదు, దాంతో కిటికీలో నుండి చూడాలని లేదా ఇంటివాళ్లను కలుసుకోవడానికి ఇంటి చుట్టూ గాలించాలని మనకు అనిపించవచ్చు. మీ ప్రాంతంలో అలాంటి ప్రవర్తన గృహస్థులను కంగారుపెడుతుందా? మీరలా చేయడం చూస్తే ఆ చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారు? మనం సమగ్రంగా సాక్ష్యమివ్వాలన్న మాట నిజమే. (అపొ. 10:42) మన దగ్గరున్న మంచి సందేశాన్ని ఇతరులతో పంచుకోవాలన్న తపన మనకుంటుంది, మన ఉద్దేశాలు కూడా మంచివే. (రోమా. 1:14, 15) అయితే, మనం సాక్ష్యమిస్తున్న ప్రాంతంలోని ప్రజలను అనవసరంగా అభ్యంతర పెట్టే ప్రతీదానికి దూరంగా ఉంటే మంచిది. తన “పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక” నడుచుకున్నానని అపొస్తలుడైన పౌలు రాశాడు. (2 కొరిం. 6:3) మన ప్రాంతంలోని ప్రజల ఇంటి పట్ల, పరిసరాలు-వస్తువుల పట్ల గౌరవం చూపించినప్పుడు, మన ప్రవర్తన కొంతమందిని సత్యంలోకి ఆకర్షిస్తుంది.—1 పేతురు 2:12 చదవండి.
ఎప్పుడు మాట్లాడుతున్నాను?
11. ఇతరులు మన సమయానికి విలువిస్తే మనం ఎందుకు సంతోషిస్తాం?
11 క్రైస్తవ కార్యకలాపాల వల్ల మనం సాధారణంగా బిజీగా ఉంటాం. కాబట్టి మన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే, జాగ్రత్తగా ప్రణాళిక వేసుకుంటూ వేటికి ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. (ఎఫె. 5:15, 16; ఫిలి. 1:9-11) అనుకోని ఆటంకాల వల్ల మన ప్రణాళిక దెబ్బతిన్నప్పుడు అసహనానికి గురవ్వడం సహజమే. అందుకే ఇతరులు మన సమయానికి విలువిచ్చినప్పుడు, ముఖ్యంగా వాళ్లు మననుండి మరీ ఎక్కువ సమయాన్ని ఆశించకుండా సహేతుకత చూపించినప్పుడు మనం కృతజ్ఞత చూపిస్తాం. ఇతరుల సమయం విషయంలో గౌరవం చూపించడానికి బంగారు సూత్రం మనకెలా సహాయం చేస్తుంది?
12. మన ప్రాంతంలోని ప్రజలకు ప్రకటించడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుందో ఎలా తెలుసుకోవచ్చు?
12 ఇంటివాళ్లతో ఏ సమయంలో మాట్లాడితే బాగుంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. మన ప్రాంతంలో ప్రజలు సాధారణంగా ఏ సమయంలో ఇళ్లల్లో ఉంటారు? ఏ సమయంలోనైతే వాళ్లు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది? ఆ సమయంలో వాళ్లను కలిసేలా మన ప్రకటనా వేళల్ని సర్దుబాటు చేసుకుంటే మంచిది. కొన్ని దేశాల్లో కాస్త ఎండ తగ్గిన తర్వాత లేదా సాయంత్రం పూట ఇంటింటి పరిచర్య చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీ ప్రాంతంలో కూడా అలాంటి సమయాలు అనుకూలంగా ఉంటే, ఆ సమయాల్లో కాసేపైనా ఇంటింటి పరిచర్యలో పాల్గొనేలా మీ పరిస్థితులను సర్దుబాటు చేసుకోగలరా? (1 కొరింథీయులు 10:24 చదవండి.) మీ ప్రాంతంలోని ప్రజలకు అనువైన సమయంలోనే సువార్త ప్రకటించడానికి మీరు చేసే త్యాగాలను యెహోవా తప్పకుండా ఆశీర్వదిస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.
13. గృహస్థుల పట్ల మనం ఎలా గౌరవం చూపించవచ్చు?
13 ప్రతీ వ్యక్తి పట్ల ఇంకా ఏయే విధాలుగా గౌరవం చూపించవచ్చు? సువార్త వినడానికి ఇష్టపడేవాళ్లను కలిస్తే, మనం చక్కని సాక్ష్యం ఇవ్వాలేగానీ వాళ్ల సమయం మరీ ఎక్కువ తీసుకోకూడదు. బహుశా గృహస్థుడు ఆ సమయాన్ని తనకు ప్రాముఖ్యమైన పనులకోసం కేటాయించుకొని ఉండొచ్చు. తాను బిజీగా ఉన్నానని చెబితే, క్లుప్తంగా మాట్లాడి వెళ్లిపోతామని మాటివ్వండి. మాటిచ్చినట్లే క్లుప్తంగా ముగించండి. (మత్త. 5:37) ముగించే ముందు, ఆయనను మళ్లీ కలవడానికి ఏ సమయమైతే అనుకూలంగా ఉంటుందో అడగవచ్చు. “మీతో మాట్లాడడం సంతోషంగా ఉంది, మిమ్మల్ని మళ్లీ కలవాలనుకుంటున్నాను. వచ్చేముందు ఫోన్ చేసి లేదంటే మెస్సేజ్ పెట్టి వస్తే మీకు ఓకేనా?” అని అడిగి కొంతమంది ప్రచారకులు చక్కని ఫలితాలు పొందారు. మన ప్రాంతంలోని ప్రజలకు తగ్గట్లుగా మన ప్రకటనా వేళల్ని మార్చుకున్నప్పుడు, తన “స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమును” కోరుకున్న పౌలును ఆదర్శంగా తీసుకున్న వాళ్లమవుతాం.—1 కొరిం. 10:33.
ఎలా మాట్లాడాలి?
14-16. (ఎ) మనం రావడానికి గల కారణాన్ని గృహస్థులకు మొదట్లోనే ఎందుకు చెప్పాలి? ఉదాహరణ ఇవ్వండి. (బి) పరిచర్యలో ఏ పద్ధతి సమర్థవంతంగా ఉన్నట్లు ఒక ప్రయాణ పర్యవేక్షకుడు తెలుసుకున్నాడు?
14 ఈ సన్నివేశం ఊహించుకోండి: ఓరోజు మీకు ఫోన్ వచ్చింది, అది మీకు తెలిసిన గొంతు కాదు. మీకు ఎలాంటి ఆహారం ఇష్టమో చెప్పమని ఆ అపరిచితుడు మిమ్మల్ని అడిగాడు. ‘అసలు ఆయన ఎవరు, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు’ అని మీరు అనుమానపడతారు. మర్యాదకొద్దీ కాసేపు మాట్లాడినా, ఆయనతో ఎక్కువసేపు మాట్లాడడం మీకు ఇష్టం లేదని చెబుతారు. అదే, ఫోన్ చేసిన ఆ అపరిచితుడు తనను తాను పరిచయం చేసుకుంటూ, తాను పోషకాహార విభాగంలో పనిచేస్తున్నాననీ తన దగ్గర ఆహారానికి సంబంధించి ఉపయోగకరమైన సమాచారం ఉందనీ చెప్పాడనుకోండి. అప్పుడు వినడానికి మీరు బహుశా మరింత సుముఖత చూపిస్తారు. ఎంతైనా, మనసు నొప్పించకుండానే విషయాన్ని సూటిగా చెప్పేవాళ్లను మనం ఇష్టపడతాం. పరిచర్యలో మనం కలిసేవాళ్ల పట్ల కూడా ఇదే మర్యాదను ఎలా చూపించవచ్చు?
15 చాలా ప్రాంతాల్లో, అసలు మనం ఎందుకు వచ్చామో గృహస్థులకు స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది. ఇంటివాళ్లకు తెలియని విలువైన సమాచారం మన దగ్గరున్న మాట నిజమే, కానీ మన గురించి అస్సలు పరిచయం చేసుకోకుండా, “ప్రపంచంలోని సమస్యలను పరిష్కరించే శక్తి మీకుంటే, మీరు ముందు దేన్ని పరిష్కరిస్తారు?” వంటి ప్రశ్నతో సంభాషణను మొదలుపెట్టాం అనుకోండి. వాళ్ల మనసులో ఏముందో తెలుసుకుని, సంభాషణను బైబిలు వైపు మళ్లించడానికే మనం అలాంటి ప్రశ్నలు అడుగుతామన్నది వాస్తవమే. అయితే గృహస్థుడు మాత్రం మనసులో “అసలు ఈయన ఎవరు? ఈ ప్రశ్న నన్నెందుకు అడుగుతున్నాడు? ఈయనకేం కావాలి?” అనే ఆలోచిస్తుంటాడు. కాబట్టి మనం ముందు చేయాల్సిన పని, గృహస్థునిలోని కంగారు పోగొట్టడమే. (ఫిలి. 2:3, 4) దాన్ని ఎలా చేయవచ్చు?
16 ఒక ప్రయాణ పర్యవేక్షకుడు, కింద ఉన్న పద్ధతి సమర్థవంతంగా ఉన్నట్లు అనుభవంతో తెలుసుకున్నాడు. ఆయన, ఇంటివాళ్లను పరిచయం చేసుకుని, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? కరపత్రాన్ని వాళ్లకు ఇస్తూ, “ఈ రోజు ఇక్కడున్న వాళ్లందరికీ ఈ కరపత్రాన్ని ఇస్తున్నాం. దీనిలో, చాలామందికి వచ్చే ఆరు ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఇది మీకోసం, తీసుకోండి” అని చెప్పేవాడు. తాను ఎందుకు వచ్చాడో చెప్పడం వల్ల గృహస్థుల్లో కంగారు తగ్గి, ప్రశాంతంగా సంభాషణ కొనసాగిస్తున్నారని ఆయన చెబుతున్నాడు. ఆ తర్వాత ఆయన కరపత్రంలోకి చూపిస్తూ, “ఈ ప్రశ్నల గురించి మీరెప్పుడైనా ఆలోచించారా?” అని అడిగేవాడు. గృహస్థుడు ఏదైనా ప్రశ్నను ఎంచుకుంటే, ఆ సహోదరుడు కరపత్రం తెరిచి, ఆ ప్రశ్నకు బైబిలు ఇస్తున్న జవాబు చర్చించేవాడు. ఒకవేళ గృహస్థులు ఇబ్బంది పడుతున్నట్లయితే, ఆయనే ఓ ప్రశ్నను ఎంపిక చేసి చర్చను కొనసాగించేవాడు. నిజమే, సంభాషణను మొదలుపెట్టడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు, మనం విషయం చెప్పడానికి ముందు కొన్ని మర్యాదలు పాటించాలని ఆశిస్తారు. కాబట్టి గృహస్థులకు నచ్చేలా మన సంభాషణను మలచుకోవడం కీలకం.
మీ పరిచర్యలో బంగారు సూత్రాన్ని పాటిస్తూ ఉండండి
17. ఈ ఆర్టికల్‌లో చర్చించినట్లు, మనం పరిచర్యలో బంగారు సూత్రాన్ని ఏయే విధాలుగా పాటించవచ్చు?
17 క్లుప్తంగా చెప్పుకోవాలంటే, మనం పరిచర్యలో బంగారు సూత్రాన్ని ఏయే విధాలుగా పాటిస్తాం? మనం ప్రతీ గృహస్థుణ్ణి ప్రత్యేకంగా చూస్తాం. గృహస్థుని ఇల్లు, పరిసరాలు-వస్తువుల పట్ల గౌరవం చూపిస్తాం. ప్రజలు ఎప్పుడు ఇళ్లల్లో ఉంటారో, ఎప్పుడు వినడానికి ఇష్టపడతారో తెలుసుకుని, ఆ సమయాల్లో పరిచర్య చేయడానికి కృషి చేస్తాం. అలాగే మన ప్రాంతంలోని ప్రజలు ఇష్టపడే విధానంలోనే వాళ్లకు రాజ్య సందేశాన్ని పరిచయం చేస్తాం.
18. ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో, అలాగే మనం ప్రజలతో ప్రవర్తించినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి?
18 ఇతరులు మనతో ఎలా ప్రవర్తించాలని కోరుకుంటామో, అలాగే మనం ప్రజలతో ప్రవర్తించినప్పుడు చక్కని ఫలితాలు వస్తాయి. ఇతరులను అర్థం చేసుకుంటూ, వాళ్లతో దయగా ప్రవర్తించినప్పుడు, మన వెలుగును ప్రకాశింపజేస్తాం, లేఖన సూత్రాల విలువను మరింత స్పష్టంగా చూపిస్తాం, మన పరలోక తండ్రికి ఘనతను తీసుకొస్తాం. (మత్త. 5:16) మనం మొదటిసారి కలిసినప్పుడు వ్యవహరించే తీరును బట్టి చాలామంది సత్యంలోకి రావచ్చు. (1 తిమో. 4:16) మనం ప్రకటిస్తున్నవాళ్లు రాజ్య సందేశాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా, పరిచర్యను సంపూర్ణంగా జరిగించడానికి చేయగలిగినదంతా చేస్తున్నామనే తృప్తి మనకుంటుంది. (2 తిమో. 4:5) కాబట్టి మనమందరం, “నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను” అని రాసిన పౌలును అనుసరిద్దాం. (1 కొరిం. 9:23) అందుకే, పరిచర్యలో ఎల్లప్పుడూ బంగారు సూత్రాన్ని పాటిద్దాం.