కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

యెహోవా నాకు నిజంగా సహాయం చేశాడు

యెహోవా నాకు నిజంగా సహాయం చేశాడు

నా నవవధువు ఎవ్లిన్‌తో కలిసి కెనడాలోని, ఉత్తర ఒంటారియోలో ఉన్న, హోర్న్‌పేన్‌ పట్టణంలో రైలు దిగాను. అది తెల్లవారుజాము, పైగా ఎముకలు కొరికే చలి. ఆ ప్రాంతంలోని ఓ సహోదరుడు రైల్వేస్టేషన్‌కు వచ్చి, మమ్మల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆయన భార్య, కొడుకుతో కలిసి తృప్తిగా తిని, మేము మంచులో అడుగులు వేస్తూ ఇంటింటి పరిచర్యకు వెళ్లాం. ఆ రోజు మధ్యాహ్నం ప్రాంతీయ పర్యవేక్షకునిగా నా మొదటి బహిరంగ ప్రసంగాన్ని ఇచ్చాను. ఆ కూటానికి మేము ఐదుగురం తప్ప ఇంకెవరూ రాలేదు.

నిజం చెప్పాలంటే, 1957⁠లో నేనిచ్చిన ఆ ప్రసంగానికి అంత తక్కువ మంది వచ్చినందుకు నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే, నాకు విపరీతమైన సిగ్గు. ఎంత సిగ్గంటే, నా చిన్నప్పుడు ఎవరైనా మా ఇంటికొస్తే, ఆఖరికి తెలిసినవాళ్లే అయినా లోపలికి వెళ్లి దాక్కునేవాణ్ణి.

అలాంటి నేను, యెహోవా సంస్థ నాకు అప్పగించిన చాలా బాధ్యతల వల్ల స్నేహితులు, కొత్తవాళ్లు అనే తేడా లేకుండా ఎందరితోనో కలిసి పనిచేశానంటే మీరు ఆశ్చర్యపోతారు. అయినప్పటికీ ఆ సంవత్సరాలన్నిటిలో సిగ్గు, బిడియాలతో పోరాడుతూనే ఉన్నాను. అందుకే, ఆ నియామకాల్లో సాధించినదేదీ నా సొంత శక్తితో కాదని ఖచ్చితంగా చెప్పగలను. “నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే, నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును” అని యెహోవా చేసిన వాగ్దానం ఎంత నిజమో ప్రతీ సందర్భంలో చూశాను. (యెష. 41:9, 10) నాకు సహాయం చేయడానికి యెహోవా అన్నిటికన్నా ఎక్కువగా ఉపయోగించుకున్నది తోటి క్రైస్తవులనే. అలా నాకు సహాయం చేసిన వాళ్లలో కొంతమంది గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ముందు నా బాల్యం నుండి చూద్దాం.

ఆమె బైబిలు, చిన్న నల్ల పుస్తకం ఉపయోగించేది

నైరుతి ఒంటారియోలోని మా ఇంటి ముందు

1940లలో ఓ వెచ్చని ఆదివారాన, నైరుతి ఒంటారియోలో ఉన్న మా తోటలోని ఇంటికి సహోదరి ఎల్సీ హంటింగ్‌ఫర్డ్‌ వచ్చి తలుపు తట్టింది. మా అమ్మ వెళ్లి తలుపుతీసింది. మా నాన్న, నాతోపాటు లోపలే ఉన్నాడు, ఆయనకు కూడా నాలాగే సిగ్గు ఎక్కువ. ఆవిడ ఏదో అమ్మడానికి వచ్చిందని, మా అమ్మ అవసరం లేనివేవో కొనేస్తుందని నాన్న కంగారుపడ్డాడు. అందుకే కాసేపైన తర్వాత నాన్న బయటకు వెళ్లి, మాకేమీ వద్దని చెప్పాడు. వెంటనే ఆవిడ, “మీకు బైబిలు అధ్యయనం కూడా వద్దా?” అని అడిగింది. “ఎంతమాట, అదైతే మాకు తప్పకుండా కావాలి!” అన్నాడు నాన్న.

ఆ సహోదరి మా ఇంటికి సరైన సమయంలోనే వచ్చింది. అంతకుముందు వరకూ అమ్మానాన్నలు, యునైటెడ్‌ చర్చ్‌ ఆఫ్‌ కెనడా సభ్యులుగా దాని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాళ్లు. అయితే, దాన్నుండి బయటకు వచ్చేయాలని కొన్ని రోజుల ముందే నిర్ణయించుకున్నారు. ఎందుకు? అక్కడి మత గురువు, ఆయా దాతలు ఇచ్చే విరాళాల విలువను బట్టి వాళ్ల పేర్లను వరుసలో రాసి చర్చి హాలులో అంటించేవాడు. మా అమ్మానాన్నల ఆదాయం అంతంత మాత్రమే కావడంతో, వాళ్ల పేర్లు సాధారణంగా కిందెక్కడో ఉండేవి. అంతేకాక, ఎక్కువ విరాళాలు ఇవ్వాలని చర్చి పెద్దలు ఒత్తిడి చేసేవాళ్లు. మరో బోధకుడైతే, తన ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడానికి తప్పదు కాబట్టి, తాను నమ్మని విషయాలను బోధిస్తున్నానని ఒప్పుకున్నాడు. దాంతో, మేము చర్చిని వదిలేశాం, కానీ దేవునికి దగ్గరవ్వాలనే ఆశను మాత్రం వదులుకోలేదు.

అప్పట్లో యెహోవాసాక్షుల పనిని కెనడాలో నిషేధించడం వల్ల, ఎల్సీ హంటింగ్‌ఫర్డ్‌ తనతో బైబిలు, ఓ చిన్న నల్ల పుస్తకాన్ని తెచ్చుకుని మా కుటుంబంతో బైబిలు అధ్యయనం చేసేది. మేము తనని అధికారులకు పట్టించమనే నమ్మకం కుదిరిన తర్వాత, మాకు బైబిలు ప్రచురణలు ఇవ్వడం మొదలుపెట్టింది. అధ్యయనం పూర్తయిన ప్రతీసారి వాటిని జాగ్రత్తగా దాచిపెట్టేవాళ్లం. a

ఇంటింటి పరిచర్య ద్వారా సత్యాన్ని తెలుసుకున్న మా అమ్మానాన్నలు 1948⁠లో బాప్తిస్మం పొందారు

వ్యతిరేకత, ఇతర ఇబ్బందులు ఉన్నా ఆ సహోదరి ఉత్సాహంగా రాజ్య సువార్త ప్రకటించేది. ఆ ఉత్సాహాన్ని చూసి, నేను సత్యానికి కట్టుబడి ఉండాలనే ప్రోత్సాహాన్ని పొందాను. మా అమ్మానాన్న బాప్తిస్మం తీసుకుని యెహోవాసాక్షులైన మరుసటి సంవత్సరం, నేను కూడా బాప్తిస్మం తీసుకున్నాను. 1949, ఫిబ్రవరి 27న పశువులకు నీళ్లు పెట్టే తొట్టిలో నాకు బాప్తిస్మం ఇచ్చారు. అప్పుడు నాకు 17 ఏళ్లు. దాని తర్వాత, పూర్తికాల పరిచర్య చేయాలని తీర్మానించుకున్నాను.

యెహోవా నాకు ధైర్యాన్ని ఇచ్చాడు

1952⁠లో బెతెల్‌కు రమ్మనే ఆహ్వానం అందుకుని ఆశ్చర్యపోయాను

వెంటనే పయినీరు సేవ మొదలుపెట్టడానికి నేను జంకాను. పయినీరు సేవ చేయాలంటే, నా ఖర్చుల కోసం ఎంతోకొంత సంపాదించుకోవాలనే ఆలోచనతో కొంతకాలంపాటు ఓ బ్యాంకులోనూ మరో ఆఫీస్‌లోనూ పని చేశాను. అయితే కుర్రతనం వల్ల, వచ్చిన డబ్బులు వచ్చినట్లే ఖర్చయిపోయేవి. దాంతో టెడ్‌ సార్జెంట్‌ అనే సహోదరుడు, ధైర్యంగా ఉండమని, యెహోవా మీద నమ్మకం ఉంచమని నన్ను ప్రోత్సహించాడు. (1 దిన. 28:10) నా మనసును తట్టిన ఆ సంఘటనతో, 1951, నవంబరులో పయినీరు సేవ మొదలుపెట్టాను. అప్పుడు నా దగ్గరున్నవి 40 డాలర్లు, పాత సైకిలు, ఓ కొత్త పెట్టె మాత్రమే. కానీ యెహోవా ఎప్పుడూ నా అవసరాలు తీరేలా చూశాడు. పయినీరు సేవ చేపట్టేలా నన్ను ప్రోత్సహించిన టెడ్‌ను నేనెప్పటికీ మర్చిపోలేను! ఎందుకంటే, ఆ సేవవల్లే మరెన్నో దీవెనలు పొందాను.

నాకు 1942, ఆగస్టు చివర్లో ఓ రోజు సాయంత్రం, టోరెంటో నగరం నుండి ఫోన్‌కాల్‌ వచ్చింది. సెప్టెంబరు నెలనుండి బెతెల్‌లో సేవ చేయడానికి రమ్మని యెహోవాసాక్షుల కెనడా బ్రాంచి కార్యాలయం నాకు ఫోన్‌ చేసింది. నాకసలే బిడియం, పైగా అంతకు ముందెప్పుడూ బ్రాంచి కార్యాలయాన్ని చూడలేదు. అయితే, ఇతర పయినీర్లు అప్పటికే బెతెల్‌ గురించి చెప్పిన అద్భుతమై విషయాలు ఆ ఆహ్వానాన్ని ఉత్సాహంగా స్వీకరించేలా చేశాయి. బెతెల్‌ జీవితానికి అలవాటుపడడానికి నాకు ఎంతో కాలం పట్టలేదు.

“సహోదరుల మీద నీకు ప్రేమ ఉందని చూపించు”

బెతెల్‌కు వెళ్లిన రెండేళ్లకు, బిల్‌ యాకస్‌ అనే సహోదరుని స్థానంలో టోరెంటోలోని, షా యూనిట్‌కు నన్ను కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌గా (ఇప్పుడు పెద్దల సభ సమన్వయకర్త అంటున్నాం) నియమించారు. b అప్పుడు నా వయసు 23 ఏళ్లే కాబట్టి, లోకజ్ఞానం ఏమాత్రం లేని పిల్లవాణ్ణని నాకనిపించింది. కానీ నేను ఏమి చేయాలో, బ్రదర్‌ యాకస్‌ ఎంతో వినయంగా, ప్రేమగా నేర్పించాడు. దానికి తోడు, యెహోవా నాకు నిజంగా సహాయం చేశాడు.

దృఢకాయుడే అయినా ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో ఉండే బిల్‌ యాకస్‌, మనుషుల గురించి పట్టించుకునేవాడు. ఆయనకు సహోదరులంటే ప్రేమ, వాళ్లకు ఈయనంటే ప్రేమ. సమస్యలున్నప్పుడు మాత్రమే కాకుండా, తరచూ ఆయన వాళ్ల ఇళ్లకు వెళ్లి వాళ్లను సందర్శించేవాడు. నన్ను కూడా అలాగే చేయమని, క్షేత్ర పరిచర్యలో సహోదరసహోదరీలతో కలిసి పనిచేయమని బిల్‌ యాకస్‌ ప్రోత్సహించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, “కెన్‌, సహోదరుల మీద నీకు ప్రేమ ఉందని చూపించు. అది అనేకమైన పొరపాట్లను కప్పుతుంది.”

ప్రేమతో నన్ను అంటిపెట్టుకున్న నా భార్య

యెహోవా నాకు 1957, జనవరి నుండి మరో ప్రత్యేకమైన విధానంలో సహాయం చేస్తున్నాడు. ఆ నెలలో నేను ఎవ్లిన్‌ను పెళ్లి చేసుకున్నాను. తను గిలియడ్‌ పాఠశాల, 14వ తరగతి విద్యార్థి. మా పెళ్లికి ముందు, తను క్విబెక్‌ రాష్ట్రంలోని ఫ్రెంచ్‌ భాషా క్షేత్రంలో సేవ చేసేది. ఆ రోజుల్లో దాదాపు క్విబెక్‌ ప్రాంతమంతా రోమన్‌ క్యాథలిక్‌ చర్చిదే ఆధిపత్యం. కాబట్టి ఎవ్లిన్‌కు అక్కడ సేవ చేయడం చాలా కష్టంగా ఉండేది, అయితే తను మాత్రం ఆ నియామకానికి, యెహోవాకు నమ్మకంగా కట్టుబడింది.

ఎవ్లిన్‌, నేను 1957⁠లో పెళ్లి చేసుకున్నాం

ఎవ్లిన్‌ నాకు కూడా నమ్మకంగా కట్టుబడే ఉంది. (ఎఫె. 5:31) ఆ విషయాన్ని, పెళ్లయిన వెంటనే ఎదురైన ఓ పరీక్ష రుజువు చేసింది! పెళ్లి తర్వాత సరదాగా అమెరికాలోని, ఫ్లారిడాకు వెళ్దామని అనుకున్నాం. కానీ పెళ్లి అయిన మరుసటి రోజే బ్రాంచి నుండి కబురు వచ్చింది. వారం రోజులపాటు కెనడా బెతెల్‌లో జరిగే కూటానికి నేను హాజరవ్వాలన్నది దాని సారాంశం. ఈ కూటం వల్ల మేము అనుకున్నట్లుగా ఫ్లారిడాకు వెళ్లలేకపోయాం. అయితే, యెహోవా ఏది అడిగినా చేయాలని మేమిద్దరం కోరుకున్నాం. అందుకే, మా హనీమూన్‌ను రద్దు చేసుకున్నాం. ఆ వారంపాటు, తను బ్రాంచి దగ్గర్లోని క్షేత్రంలో పరిచర్య చేసింది. క్విబెక్‌తో పోలిస్తే ఆ క్షేత్రంలోని పరిస్థితులు ఎంతో భిన్నంగా ఉన్నా తను సర్దుకుపోయింది.

ఆ వారం చివర్లో నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ, కెనడాలోని ఉత్తర ఒంటారియోకు ప్రాంతీయ పర్యవేక్షకునిగా నియమించారు. అసలే కొత్తగా పెళ్లయింది, వయసు చూస్తే 25 ఏళ్లే, పైగా ఏమాత్రం అనుభవం లేదు. అయినా యెహోవా మీద నమ్మకంతో ముందుకు వెళ్లాను. తమ నియామకాలకు తిరిగి వెళ్తున్న అనుభవజ్ఞులైన చాలామంది ప్రయాణ పర్యవేక్షకులతో కలిసి రైల్లో మా ప్రాంతానికి బయల్దేరాం. అది విపరీతమైన చలికాలం, పైగా రాత్రంతా ప్రయాణం. అయితే, రైల్లో మాతోపాటు ఉన్న సహోదరులు అందించిన ప్రోత్సాహం మరువలేనిది! ఒక సహోదరుడైతే తన కోసం రిజర్వ్‌ చేయించుకున్న బెర్తులను, ఎంత వద్దంటున్నా మాకు ఇచ్చేశాడు. దాంతో రాత్రంతా కూర్చునే ప్రయాణించాల్సిన మేము సుఖంగా నిద్రపోయాం. ఉదయాన్నే, అంటే మా పెళ్లయిన 15 రోజులకే, నా కథ ప్రారంభంలో చెప్పినట్లు హోర్న్‌పేన్‌లోని చిన్న గుంపును సందర్శించాం.

మా ఇద్దరి జీవితాల్లో ఇంకెన్నో మార్పులు రానున్నాయి. 1960 చివర్లో నేను జిల్లా పర్యవేక్షకునిగా సేవ చేస్తున్నప్పుడు, 36వ గిలియడ్‌ తరగతికి నన్ను ఆహ్వానించారు. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరిగే ఆ పది నెలల కోర్సు, 1961 ఫిబ్రవరిలో ప్రారంభం కానుందని ఆ ఉత్తరంలో ఉంది. దాన్ని చూసినప్పుడు పట్టరానంత ఆనందం కలిగినా, ఎవ్లిన్‌కు ఆహ్వానం రానందుకు మాత్రం కాస్త బాధనిపించింది. అదే పరిస్థితిలో ఉన్న ఇతర సహోదరీల్లాగే ఎవ్లిన్‌ను కూడా ఓ ఉత్తరం రాయమన్నారు. తాను కనీసం పది నెలలపాటు నా నుండి దూరంగా ఉండడానికి అంగీకారం తెలుపుతూ ఆ ఉత్తరం రాయాలి. ఎవ్లిన్‌ కళ్లు చెమ్మగిల్లినా, నేను గిలియడ్‌ పాఠశాలకు హాజరుకావాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. అంతేకాదు, అక్కడ నేను విలువైన తర్ఫీదు పొందబోతున్నందుకు తను సంతోషించింది.

ఆ ఎడబాటు కాలంలో, ఎవ్లిన్‌ కెనడా బ్రాంచి కార్యాలయంలో సేవ చేసింది. ఆ సమయంలో, అభిషిక్త సహోదరియైన మార్గెట్‌ లవల్‌తోపాటు ఆమె గదిలో ఉండే అవకాశం ఎవ్లిన్‌కు దక్కింది. ఆ సహోదరి ఎంతో ప్రేమగలది. ఏదేమైనా, ఎవ్లిన్‌కూ నాకూ ఒకరికొకరం బాగా గుర్తొచ్చేవాళ్లం. అయినా యెహోవా సహాయంతో మా నియామకాల్లో చక్కగా కుదురుకున్నాం. నేను యెహోవాకు, ఆయన సంస్థకు మరింతగా ఉపయోగపడడం కోసం ఎవ్లిన్‌ నాతోపాటు గడిపే సమయాన్ని త్యాగం చేయడం నా మనసులో చెరగని ముద్రవేసింది.

గిలియడ్‌ పాఠశాలలో మూడు నెలలు గడిచాక, అప్పట్లో ప్రపంచవ్యాప్త పనిని చూసుకుంటున్న సహోదరుడు నేథన్‌ నార్‌, ఓ అసాధారణమైన అవకాశాన్ని నా ముందుంచాడు. అప్పటికప్పుడే గిలియడ్‌ పాఠశాలను విడిచిపెట్టి తిరిగి కెనడాకు వెళ్లి, కొంతకాలంపాటు అక్కడి బ్రాంచి కార్యాలయంలో రాజ్య పరిచర్య పాఠశాల ఉపదేశకునిగా సేవ చేయడం నాకు వీలౌతుందేమోనని ఆయన అడిగాడు. నేను ఆ ఆహ్వానాన్ని ఒప్పుకోవడం తప్పనిసరేమీ కాదని కూడా బ్రదర్‌ నార్‌ అన్నాడు. కావాలనుకుంటే నేను గిలియడ్‌ పాఠశాలను ముగించుకుని, మిషనరీగా నియామకం పొందే అవకాశం కూడా ఉందన్నాడు. అంతేకాక, ఒకవేళ నేను తిరిగి కెనడాకు వెళితే, గిలియడ్‌కు హాజరయ్యే అవకాశం మరెప్పుడూ రాకపోవచ్చనీ బహుశ కెనడా క్షేత్రంలో సేవ చేయడానికి నన్ను పంపించవచ్చని కూడా ఆయన అన్నాడు. నా భార్యతో చర్చించి నా నిర్ణయం చెప్పమన్నాడు.

అయితే, దేవుని సంస్థలో వచ్చే నియామకాల విషయంలో ఎవ్లిన్‌ అభిప్రాయమేంటో నాకు బాగా తెలుసు కాబట్టి, ఏమాత్రం ఆలోచించకుండా “యెహోవా సంస్థ ఏమి చేయమంటే అది సంతోషంగా చేస్తాం” అని జవాబిచ్చాను. మా ఇష్టాయిష్టాలను పక్కనపెట్టి, యెహోవా సంస్థ ఎక్కడకు వెళ్లమంటే అక్కడకు వెళ్లి సేవ చేయాలన్నదే మా ఇద్దరి ఆలోచన.

దాంతో, రాజ్య పరిచర్య పాఠశాలలో బోధించడానికి నేను 1961, ఏప్రిల్‌లో బ్రూక్లిన్‌ నుండి కెనడాకు తిరుగు ప్రయాణమయ్యాను. ఆ తర్వాత, మేమిద్దరం కెనడా బెతెల్‌ కుటుంబంలో సేవ చేశాం. ఇదిలా ఉండగా నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ, 1965⁠లో ప్రారంభం కానున్న 40వ గిలియడ్‌ తరగతికి నన్ను ఆహ్వానించారు. మేమిద్దరం దూరంగా ఉండడానికి అంగీకారం తెలుపుతూ ఎవ్లిన్‌ మరోసారి ఉత్తరం రాసింది. కానీ కొన్ని వారాల తర్వాత, తనను కూడా పాఠశాలకు ఆహ్వానిస్తూ వచ్చిన మరో ఉత్తరాన్ని అందుకున్నప్పుడు మేము పొందిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.

ఫ్రెంచ్‌ భాషా తరగతుల్లో పేర్లు నమోదైన విద్యార్థులనందరినీ ఆఫ్రికాకు పంపిస్తామని బ్రదర్‌ నార్‌ పాఠశాల ప్రారంభంలో చెప్పాడు. వాళ్లలో మేము కూడా ఉన్నాం. అయితే మాకు గిలియడ్‌ పట్టాలు ఇస్తూ, తిరిగి కెనడాకే పంపించారు! అక్కడ నన్ను బ్రాంచి పర్యవేక్షకునిగా (ఇప్పుడు, బ్రాంచి కమిటీ సమన్వయకర్త అంటున్నాం) నియమించారు. అప్పటికి నా వయసు 34 ఏళ్లే. అందుకే సహోదరుడు నార్‌తో, “నేను చాలా చిన్నవాణ్ణి” అన్నాను. కానీ ఆయన నాకు ధైర్యం చెప్పాడు. ఆ నియామకం చేపట్టిన మొదటి రోజు నుండి, ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు బెతెల్‌లో నాకంటే అనుభవజ్ఞులైన సహోదరులతో సంప్రదించేవాణ్ణి.

బెతెల్‌లో ఎన్నో నేర్చుకున్నాను, నేర్పించాను

బెతెల్‌లో సేవ చేయడం వల్ల ఇతరుల నుండి నేర్చుకునే అద్భుతమైన అవకాశాలు వచ్చాయి. బ్రాంచి కమిటీలో ఉన్న మిగతా సహోదరులంటే నాకు ఎంతో గౌరవం, అభిమానం. బ్రాంచి కార్యాలయంలోనూ అలాగే వివిధ సంఘాల్లోనూ సేవ చేసినప్పుడు వందల మంది ఆదర్శవంతులైన సహోదరసహోదరీలను కలుసుకున్నాం. వయసుతో సంబంధం లేకుండా వాళ్లందరి నుండి ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను.

కెనడా బెతెల్‌ కుటుంబంలో ఉదయకాల ఆరాధన నిర్వహిస్తూ

ఇతరులకు నేర్పించే, వాళ్ల విశ్వాసాన్ని బలపర్చే అవకాశాన్ని కూడా బెతెల్‌ నాకిచ్చింది. అపొస్తలుడైన పౌలు ‘నీవు నేర్చుకొనిన వాటియందు నిలుకడగా ఉండుము’ అని తిమోతికి రాశాడు. ఆయన ఇలా కూడా చెప్పాడు, “నీవు అనేక సాక్షులయెదుట నావలన వినిన సంగతులను, ఇతరులకును బోధించుటకు సామర్థ్యముగల నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.” (2 తిమో. 2:2; 3:14) బెతెల్‌లో సేవ చేసిన 57 సంవత్సరాల్లో ఎలాంటి విషయాలు నేర్చుకున్నానని తోటి క్రైస్తవులు అప్పుడప్పుడు నన్ను అడుగుతుంటారు. వాళ్లకు నేను చెప్పే సమాధానం ఒక్కటే, “యెహోవా సహాయం చేస్తాడనే భరోసాతో, ఆయన సంస్థ అడిగింది మనస్ఫూర్తిగా, తూ.చా. తప్పకుండా చేయండి.”

బెతెల్‌లో అడుగుపెట్టిన రోజు ఇంకా నా మదిలో స్పష్టంగా మెదులుతోంది. ఏమాత్రం అనుభవం లేని వయసులో, బిడియంతో బెతెల్‌కు వచ్చాను. అయితే, ఈ సంవత్సరాలన్నిటిలో యెహోవా, ‘నా కుడిచేతిని పట్టుకునే’ ఉన్నాడు. ప్రత్యేకించి, అవసరంలో ఆదుకుంటూ, దయ చూపించే తోటి విశ్వాసుల రూపంలో, ఆయన ఇప్పటికీ నాతో “భయపడకుము నేను నీకు సహాయము చేసెదను” అని అంటూనే ఉన్నాడు.—యెష. 41:13.

a కెనడా ప్రభుత్వం మన పని మీదున్న నిషేధాన్ని 1945, మే 22న ఎత్తివేసింది.

b అప్పట్లో, ఒకే నగరంలో ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉంటే, ఒక్కో సంఘాన్ని “యూనిట్‌” అని పిలిచేవాళ్లు.