యెహోవా సంస్థీకరణగల దేవుడు
“దేవుడు సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త కాడు.”—1 కొరిం. 14:33.
1, 2. (ఎ) దేవుని మొట్టమొదటి సృష్టి ఎవరు? ఆయనను యెహోవా ఎలా ఉపయోగించుకున్నాడు? (బి) దేవదూతలు చక్కగా సంస్థీకరించబడి ఉన్నారని ఎలా చెప్పవచ్చు?
విశ్వాన్ని సృష్టించిన యెహోవా ప్రతీది క్రమపద్ధతిలో చేస్తాడు. ఆయన మొట్టమొదటిగా తన అద్వితీయ ఆత్మ కుమారుణ్ణి సృష్టించాడు. ఆ కుమారుణ్ణే దేవుడు తన ముఖ్య ప్రతినిధిగా ఉపయోగించుకున్నాడు కాబట్టి బైబిలు ఆయనను “వాక్యము” అని పిలుస్తుంది. ఆయన పరలోకంలో యెహోవాను ఎన్నో యుగాలు సేవించాడు, అందుకే బైబిలు ఇలా చెబుతుంది, “ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను . . . సమస్తమును ఆయన [వాక్యము] మూలముగా కలిగెను, కలిగియున్న దేదియు ఆయన లేకుండ కలుగలేదు.” సుమారు 2,000 సంవత్సరాల ముందు దేవుడు ఆ “వాక్యమును” భూమ్మీదకు పంపించాడు. ఆయనే తన తండ్రి చిత్తాన్ని నమ్మకంగా చేసిన పరిపూర్ణ మానవుడైన యేసుక్రీస్తు.—యోహా. 1:1-3, 14.
2 ఆయన భూమ్మీదకు రాకముందు, ‘ప్రధానశిల్పిగా’ దేవునికి ఎంతో యథార్థంగా సేవచేశాడు. (సామె. 8:30) యెహోవా ఆ కుమారుని ద్వారానే పరలోకంలో ఎన్నో కోట్ల ఇతర ఆత్మప్రాణులను సృష్టించాడు. (కొలొ. 1:16) ఆ దూతల గురించి ఓ బైబిలు వృత్తాంతం ఇలా చెబుతుంది, “కోట్లకొలది ఆయనకు సేవచేస్తూ ఉన్నారు. కోట్లకొలది ఆయన ఎదుట నిలబడ్డారు.” (దాని. 7:10, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) అసంఖ్యాకంగా ఉన్న ఆ ఆత్మప్రాణులను బైబిలు, యెహోవా “సైన్యములు” అని వర్ణిస్తూ, వాళ్లు చక్కగా సంస్థీకరించబడి ఉన్నారని చూపిస్తుంది.—కీర్త. 103:21.
3. నక్షత్రాల, గ్రహాల సంఖ్య ఎంత గొప్పగా ఉంది? అవి ఎలా వ్యవస్థీకరించబడి ఉన్నాయి?
3 అయితే, లెక్కలేనన్ని నక్షత్రాలు, గ్రహాలు ఉన్న భౌతిక సృష్టి సంగతేంటి? నక్షత్రాల గురించి ఈ మధ్య జరిగిన ఓ పరిశోధనను వివరిస్తూ, టెక్సస్‌లో వెలువడే హౌస్టన్ క్రానికల్ వార్తాపత్రిక, విశ్వంలో దాదాపు “300 వేల వందలకోట్ల వందకోట్లు నక్షత్రాలు, గ్రహాలు” ఉన్నాయని చెప్పింది. అంటే, 3 పక్కన 23 సున్నాలన్నమాట. నక్షత్రాలన్నీ నక్షత్ర వీధులుగా వ్యవస్థీకరించబడ్డాయి. వాటిలో వందల లేదా వేల కోట్ల సంఖ్యలో నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. ఈ నక్షత్ర వీధుల్లో చాలామట్టుకు మళ్లీ గుత్తులుగా, ఆ గుత్తులు మరింత పెద్ద గుత్తులుగా వ్యవస్థీకరించబడి ఉన్నాయి.
4. భూమ్మీదున్న తన సేవకులను కూడా యెహోవా సంస్థీకరిస్తాడని మనకెలా తెలుసు?
4 పరలోకంలో ఉన్న నీతియుక్తమైన ఆత్మప్రాణుల్లాగే, భౌతిక సృష్టి కూడా అద్భుతంగా వ్యవస్థీకరించబడివుంది. (యెష. 40:26) దీన్నిబట్టి, భూమ్మీదున్న తన సేవకులను కూడా యెహోవా సంస్థీకరిస్తాడని అర్థమౌతుంది. వాళ్లు క్రమపద్ధతిలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలా ఉండడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే, వాళ్లు ఎంతో ముఖ్యమైన పని చేయాల్సివుంది. తన సేవకులు తనను నమ్మకంగా ఆరాధించేలా యెహోవా వాళ్లను వేల సంవత్సరాలుగా సంస్థీకరిస్తూ వచ్చాడు. చరిత్రంతటిలో ఎన్నో సందర్భాల్లో తాను వాళ్లకు తోడుగా ఉన్నానని, తాను “సమాధానమునకే కర్త గాని అల్లరికి కర్త” కాడని నిరూపించుకున్నాడు.—1 కొరింథీయులు 14:33, 39-40 చదవండి.
యెహోవా ప్రాచీన కాలంలో తన ప్రజలను సంస్థీకరించాడు
5. క్రమపద్ధతిలో జరగాల్సిన విస్తరణకు ఎలా అడ్డుకట్ట పడింది?
5 యెహోవా మొదటి మనుషులను సృష్టించినప్పుడు వాళ్లను, “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి” అని దీవించాడు. (ఆది. 1:28) మనుషులు ఓ క్రమపద్ధతిలో వృద్ధిచెంది భూమిని నింపాలని, భూమంతటినీ పరదైసుగా మార్చాలని యెహోవా ఉద్దేశించాడు. అయితే, క్రమపద్ధతిలో జరగాల్సిన ఆ విస్తరణకు ఆదాముహవ్వల అవిధేయత వల్ల తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. (ఆది. 3:1-6) కాలం గడుస్తుండగా, ‘నరుల చెడుతనం భూమ్మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదని యెహోవా చూశాడు.’ అంతేకాదు, ‘భూలోకం దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.’ దాంతో దేవుడు భూవ్యాప్తంగా జలప్రళయం తీసుకొచ్చి చెడ్డవాళ్లను నాశనం చేయాలనుకున్నాడు.—ఆది. 6:5, 11-13, 17.
6, 7. (ఎ) నోవహు ఎందుకు యెహోవా కృప పొందాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) నోవహు కాలంలోని అవిధేయులకు ఏమి జరిగింది?
6 అయితే, ‘నోవహు యెహోవా దృష్టియందు కృప పొందాడు,’ ఎందుకంటే, ఆయన “నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను.” దానితోపాటు, ‘నోవహు దేవునితో నడిచాడు’ కాబట్టి, పెద్ద ఓడ నిర్మించమని నోవహుకు యెహోవా చెప్పాడు. (ఆది. 6:8, 9, 14-16) మనుషుల, జంతువుల ప్రాణాలు కాపాడడానికి అనువైన విధంగా దాన్ని నిర్మించాలి. నోవహు “తనకు యెహోవా ఆజ్ఞాపించిన” వాటన్నిటినీ ఎంతో విధేయతతో చేశాడు. తన కుటుంబ సభ్యుల సహాయసహకారాలతో ఒక క్రమపద్ధతిలో ఓడను నిర్మించాడు. జంతువులు ఓడలోకి వెళ్లాక, యెహోవా ఓడ తలుపును మూసేశాడు.—ఆది. 7:5, 16.
7 సా.శ.పూ. 2370లో జలప్రళయం ద్వారా యెహోవా ‘నేల మీదున్న జీవరాసులన్నింటినీ తుడిచేశాడు,’ కానీ ఓడలో ఉన్న నమ్మకస్థుడైన నోవహును, అతని కుటుంబాన్ని రక్షించాడు. (ఆది. 7:23) ఇప్పుడు భూమ్మీదున్న ప్రతిఒక్కరూ నోవహు సంతానమే. అయితే, ఓడ బయట ఉన్నవాళ్లందరూ చనిపోయారు. ఎందుకంటే, వాళ్లు “నీతిని ప్రకటించిన నోవహు” మాట వినలేదు.—2 పేతు. 2:5.
8. యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశానికి వెళ్లమని ఆజ్ఞాపించే సమయానికి, వాళ్లలో చక్కని సంస్థీకరణ ఉండేదని ఎలా చెప్పవచ్చు?
8 జలప్రళయం వచ్చిన 8 శతాబ్దాల తర్వాత, దేవుడు ఇశ్రాయేలీయులను ఓ జనాంగంగా సంస్థీకరించాడు. వాళ్ల జీవితాల్లోని ప్రతీ విషయాన్ని, ముఖ్యంగా వాళ్లు తనను ఆరాధించే విధానాన్ని యెహోవా సంస్థీకరించాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయుల్లో అనేకమంది యాజకులు, లేవీయులతోపాటు “ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్రు” కూడా ఉండేవాళ్లు. (నిర్గ. 38:8) యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులను కనాను దేశానికి వెళ్లమని ఆజ్ఞాపించినప్పుడు, ఆ తరంవాళ్లు విశ్వాసం ఉంచలేదు. అందుకే వాగ్దానదేశాన్ని వేగుచూసి, మంచి నివేదిక తెచ్చిన “యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణముచేసిన దేశమందు మీలో ఎవరును ప్రవేశింపరు” అని దేవుడు వాళ్లతో అన్నాడు. (సంఖ్యా. 14:30, 37, 38) మోషే, యెహోవా నిర్దేశం ప్రకారం యెహోషువను తన తర్వాతి నాయకునిగా నియమించాడు. (సంఖ్యా. 27:18-23) యెహోషువ ఇశ్రాయేలీయుల్ని కనాను దేశంలోకి నడిపించే ముందు, “నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును” అని యెహోవా ఆయనకు అభయమిచ్చాడు.—యెహో. 1:9.
9. యెహోవా విషయంలో, ఆయన ప్రజల విషయంలో రాహాబు అభిప్రాయం ఏమిటి?
9 యెహోషువ వేసిన ప్రతీ అడుగులో యెహోవా దేవుడు తోడున్నాడు. ఉదాహరణకు, కనానులోని యెరికో దగ్గర్లో ఇశ్రాయేలు జనాంగం దిగినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. యెరికోను వేగు చూడ్డానికి సా.శ.పూ. 1473లో యెహోషువ ఇద్దరు మనుషులను పంపాడు, వాళ్లు రాహాబు అనే వేశ్య ఇంటికి వెళ్లారు. ఆమె వాళ్లను తన ఇంటి మిద్దెమీద దాచిపెట్టి, యెరికో రాజు పంపించిన మనుషుల కంటపడకుండా వాళ్లను కాపాడింది. రాహాబు ఆ ఇద్దరితో ఇలా అంది, ‘యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడని, మీ యెదుట యెహోవా ఎఱ్ఱసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో, అమోరీయుల ఇద్దరు రాజులను మీరేమి చేసితిరో మేము వింటిమి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమియందును దేవుడే.’ (యెహో. 2:9-11) అప్పుడున్న యెహోవా సంస్థతో కలిసి నడవాలని రాహాబు నిర్ణయించుకుంది కాబట్టి, యెరికో నాశనం నుండి దేవుడు ఆమెను, ఆమె ఇంటివాళ్లను తప్పించాడు. (యెహో. 6:25) రాహాబు యెహోవా మీద విశ్వాసాన్నీ భక్తినీ చూపించింది, ఆయన ప్రజల్ని గౌరవించింది.
మొదటి శతాబ్దంలో చురుకైన సంస్థ
10. యేసు తన కాలంలోని యూదా మతనాయకులతో ఏమన్నాడు? ఎందుకు ఆ మాట అన్నాడు?
10 యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీయులు ఒక్కో పట్టణాన్ని జయించుకుంటూ కనాను దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ తర్వాతి కాలాల్లో ఏమి జరిగింది? శతాబ్దాలపాటు, ఇశ్రాయేలీయులు దేవుని నియమాలను పదేపదే ఉల్లంఘిస్తూ వచ్చారు. యెహోవా తన కుమారుణ్ణి భూమ్మీదకు పంపించిన సమయానికి, వాళ్లు దేవునికి, ఆయన ప్రతినిధులకు ఎంతగా అవిధేయత చూపించారంటే, యేసు యెరూషలేమును, “ప్రవక్తలను చంపు” పట్టణమని పిలిచాడు. (మత్తయి 23:37, 38 చదవండి.) యూదా మతనాయకుల అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వాళ్లను తిరస్కరించాడు. యేసు వాళ్లతో, “దేవుని రాజ్యము మీ యొద్దనుండి తొలగింపబడి, దాని ఫలమిచ్చు జనులకియ్యబడును” అని అన్నాడు.—మత్త. 21:43.
11, 12. (ఎ) యెహోవా మొదటి శతాబ్దంలో యూదా జనాంగాన్ని తిరస్కరించి ఒక కొత్త సంస్థను ఆశీర్వదించడం మొదలుపెట్టాడని ఏది నిరూపిస్తుంది? (బి) దేవుని కొత్త సంస్థలో ఎవరెవరు ఉన్నారు?
11 మొదటి శతాబ్దంలో, యెహోవా అవిశ్వాసులైన ఇశ్రాయేలు జనాంగాన్ని తిరస్కరించాడు. అంతమాత్రాన, యెహోవాకు భూమ్మీద నమ్మకమైన సేవకులున్న సంస్థ లేకుండా పోలేదు. యేసుక్రీస్తు, ఆయన బోధల ఆధారంగా ఏర్పాటైన చురుకైన ఒక కొత్త సంస్థను యెహోవా ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అది సా.శ. 33 పెంతెకొస్తు నాడు ప్రారంభమైంది. ఆ సమయంలో, దాదాపు 120 మంది యేసు శిష్యులు యెరూషలేములోని ఒక స్థలంలో సమకూడారు. అప్పుడు, “వేగముగా వీచు బలమైన గాలివంటి యొక ధ్వని ఆకాశమునుండి అకస్మాత్తుగా, వారు కూర్చుండియున్న యిల్లంతయు నిండెను. మరియు అగ్నిజ్వాలలవంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగ అందరు పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి.” (అపొ. 2:1-4) క్రీస్తు శిష్యులతో ఏర్పడిన ఆ కొత్త సంస్థకు యెహోవా అనుగ్రహం ఉందని ఈ సంఘటన తిరుగులేని విధంగా నిరూపించింది.
12 ఆ అద్భుతమైన రోజున, యేసు అనుచరుల సంఖ్యకు “ఇంచుమించు మూడువేలమంది చేర్చబడిరి.” దానితోపాటు యెహోవా, ‘రక్షణ పొందుచున్నవారిని అనుదినము వారితో చేరుస్తూ’ వచ్చాడు. (అపొ. 2:41, 47) మొదటి శతాబ్దంలోని ఆ ప్రచారకులు చేసిన పని ఎంత శక్తిమంతంగా సాగిందంటే, “దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను; మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి.” (అపొ. 6:7) ఆ కొత్త సంస్థలోని సభ్యులు ప్రకటించిన సత్యాలను, మంచి మనసున్న ఎంతోమంది అంగీకరించారు. ఆ తర్వాత, యెహోవా ‘అన్యజనులను’ క్రైస్తవ సంఘంలోకి సమకూర్చడం మొదలుపెట్టినప్పుడు కూడా ఆ సంస్థపై తన ఆశీర్వాదం ఉందని మరోసారి రుజువుచేశాడు.—అపొస్తలుల కార్యములు 10:44-46 చదవండి.
13. దేవుడు తన కొత్త సంస్థకు ఏ పని ఇచ్చాడు?
13 క్రీస్తు అనుచరులకు దేవుడు అప్పగించిన పని ఏమిటో స్పష్టమైంది. ఆ పనిలో స్వయంగా యేసే వాళ్లకు ఆదర్శం. ఆయన బాప్తిస్మం తీసుకున్న వెంటనే “పరలోకరాజ్యము” గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. (మత్త. 4:17) ఆ రాజ్యం గురించి ప్రకటించమని యేసు తన శిష్యులకు చెప్పాడు. ఆయనిలా అన్నాడు: “మీరు యెరూషలేములోను, యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును, నాకు సాక్షులైయుందురు.” (అపొ. 1:8) తాము చేయాల్సింది ఏమిటో క్రీస్తు తొలి అనుచరులు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఉదాహరణకు, పిసిదియలోని అంతియొకయలో పౌలు, బర్నబాలు తమను వ్యతిరేకిస్తున్న యూదులతో ధైర్యంగా ఇలా అన్నారు: “దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు, గనుక ఇదిగో మేము అన్యజనులయొద్దకు వెళ్లుచున్నాము; ఏలయనగా—నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెను.” (అపొ. 13:14, 45-47) మొదటి శతాబ్దం నుండి దేవుని సంస్థలోని భూమ్మీది భాగం, రక్షణ కోసం ఆయన చేసిన ఏర్పాటు గురించి ప్రకటిస్తూనే ఉంది.
దేవుని సేవకులు ప్రాణాలు దక్కించుకున్నారు
14. మొదటి శతాబ్దంలో యెరూషలేముకు ఏమి జరిగింది, కాని ఎవరు తప్పించుకున్నారు?
14 యూదుల్లో ఎక్కువమంది సువార్తను అంగీకరించలేదు. వాళ్ల మీదకు విపత్తు రానుంది, అందుకే, యేసు తన శిష్యులను ఇలా హెచ్చరించాడు: “యెరూషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచునప్పుడు దాని నాశనము సమీపమైయున్నదని తెలిసికొనుడి. అప్పుడు యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను; దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను; పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు.” (లూకా 21:20, 21) యేసు హెచ్చరించినట్లే జరిగింది. యూదుల తిరుగుబాటును అణచివేయడానికి, సా.శ. 66లో సెస్టియస్ గ్యాలస్ ఆధ్వర్యంలో రోమా సైన్యాలు యెరూషలేమును చుట్టుముట్టాయి. అయితే, ఉన్నట్టుండి వాళ్లు తిరిగి వెళ్లిపోయారు. అది యెరూషలేమును, యూదయను విడిచి పారిపోవడానికి యేసు అనుచరులకు వీలు కల్పించింది. చాలామంది యొర్దాను నది దాటి పెరయలోని పెల్లాకు పారిపోయారని చరిత్రకారుడైన యూసిబియస్ రాశాడు. సా.శ. 70లో టైటస్ నాయకత్వంలో రోమా సైన్యాలు మళ్లీ యెరూషలేమును చుట్టుముట్టి దాన్ని సమూలంగా నాశనం చేశాయి. కానీ, యేసు హెచ్చరికను లక్ష్యపెట్టిన నమ్మకమైన క్రైస్తవులు మాత్రం ప్రాణాలను కాపాడుకున్నారు.
15. ఎలాంటి పరిస్థితుల్లో కూడా క్రైస్తవత్వం వృద్ధి చెందింది?
15 క్రీస్తు అనుచరులకు ఎన్నో కష్టాలు, హింసలతోపాటు మరితర విశ్వాస పరీక్షలు ఎదురైనా మొదటి శతాబ్దంలో క్రైస్తవత్వం వృద్ధి చెందింది. (అపొ. 11:19-21; 19:1, 19, 20) దేవుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఆ తొలి క్రైస్తవులు ఎంతో వర్ధిల్లారు.—సామె. 10:22.
16. దేవునితో మంచి సంబంధం కాపాడుకునేందుకు ప్రతీ క్రైస్తవుడు ఏమి చేయాల్సివచ్చింది?
16 దేవునితో మంచి సంబంధం కోసం ప్రతీ క్రైస్తవుడు వ్యక్తిగతంగా కృషి చేయాల్సి వచ్చింది. లేఖనాలను శ్రద్ధగా చదవడం, కూటాలకు క్రమంగా హాజరవ్వడం, రాజ్య ప్రకటనా పనిలో చురుగ్గా పాల్గొనడం ఆ కాలంలో చాలా ప్రాముఖ్యం. నేడు మనకు సహాయం చేస్తున్నట్లే, అలాంటి కార్యకలాపాలు తొలి క్రైస్తవుల ఆధ్యాత్మిక శ్రేయస్సుకు, ఐక్యతకు దోహదపడ్డాయి. చక్కగా సంస్థీకరించబడిన తొలి సంఘాలతో సహవసించిన ప్రజలు, వాటిలోని పెద్దలు, పరిచర్య సేవకులు ఇష్టంతో చేసిన సేవనుండి ఎంతో ప్రయోజనం పొందారు. (ఫిలి. 1:1; 1 పేతు. 5:1-4) అంతేకాదు, పౌలు వంటి ప్రయాణ పెద్దలు సంఘాలను సందర్శించినప్పుడు, సంఘాల్లోని వాళ్లు ఎంత ఆనందించివుంటారో! (అపొ. 15:36, 40, 41) మొదటి శతాబ్దంలోని క్రైస్తవుల ఆరాధనకు, మనం చేస్తున్న ఆరాధనకు ఎన్ని పోలికలు ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాడు-నేడు యెహోవా తన సేవకులను సంస్థీకరించినందుకు ఎంత రుణపడివున్నాం! a
17. తర్వాతి ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?
17 సాతాను వ్యవస్థకు అంతం దగ్గరపడిన ఈ చివరి రోజుల్లో, యెహోవా విశ్వవ్యాప్త సంస్థలోని భూమ్మీది భాగం కనీవినీ ఎరుగని వేగంతో ముందుకు దూసుకుపోతోంది. ఆ వేగాన్ని మీరు అందుకుంటున్నారా? మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నారా? తర్వాతి ఆర్టికల్‌లో వాటి గురించి చర్చిస్తాం.
a జూలై 15, 2002 కావలికోట సంచికలో వచ్చిన, “క్రైస్తవులు ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తారు,” “వారు సత్యమును అనుసరించి నడుస్తూ ఉంటారు” ఆర్టికల్స్ చూడండి. దేవుని సంస్థలోని భూమ్మీది భాగం గురించి, యెహోవాసాక్షులు—దేవుని రాజ్య ప్రచారకులు (ఇంగ్లీషు) పుస్తకంలో సవివరంగా ఉంది.