యెహోవా సంస్థతో కలిసి మీరు ముందుకు సాగుతున్నారా?
‘ప్రభువు [“యెహోవా,” NW] కన్నులు నీతిమంతుల మీద ఉన్నవి.’—1 పేతు. 3:12.
1. భ్రష్ట ఇశ్రాయేలీయుల స్థానంలో యెహోవా తన నామం కోసం ఎవరిని ఎంపిక చేసుకున్నాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)
మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘ స్థాపనకు, మన కాలంలో సత్యారాధన పునఃస్థాపనకు ఘనతంతా యెహోవాకు చెందడమే సముచితం. ప్రాచీన కాలంలో, యెహోవా తన నామం కోసం ఎంపిక చేసుకున్న ఇశ్రాయేలు జనాంగం భ్రష్టత్వంలో మునిగిపోయింది. అందుకే ఆయన దాన్ని తిరస్కరించి, క్రీస్తు తొలి అనుచరులతో ఏర్పడిన కొత్త జనాంగాన్ని రూపొందించాడు. యెహోవా కృపను ఎంతగానో పొందిన ఆ కొత్త సంస్థ, సా.శ. 70లో యెరూషలేము నాశనాన్ని తప్పించుకుంది. (లూకా 21:20, 21) మొదటి శతాబ్దంలో జరిగిన ఆ సంఘటనలకూ నేటి యెహోవా సేవకులకు జరగబోతున్న సంఘటనలకూ పోలికలు ఉన్నాయి. త్వరలోనే సాతాను దుష్ట వ్యవస్థ నాశనం కానుంది, కానీ యెహోవా సంస్థ మాత్రం అంత్యదినాల నుండి సురక్షితంగా బయటపడుతుంది. (2 తిమో. 3:1) ఆ విషయాన్ని మనం ఎందుకు నమ్మవచ్చు?
2. ‘మహాశ్రమ’ గురించి యేసు ఏమి చెప్పాడు? అది ఎలా మొదలౌతుంది?
2 తన అదృశ్య ప్రత్యక్షత, యుగసమాప్తి గురించి మాట్లాడుతూ యేసు, “లోకారంభము నుండి ఇప్పటివరకును అట్టి శ్రమ కలుగలేదు, ఇక ఎప్పుడును కలుగబోదు” అన్నాడు. (మత్త. 24:3, 21) యెహోవా రాజకీయ శక్తులను ఉపయోగించి ప్రపంచ అబద్ధమత సామ్రాజ్యమైన ‘మహా బబులోనును’ నాశనం చేయడంతో, యేసు చెప్పిన ఆ ‘మహాశ్రమ’ ప్రారంభమౌతుంది. (ప్రక. 17:3-5, 16) దాని తర్వాత ఏమి జరుగుతుంది?
సాతాను దాడి హార్‌మెగిద్దోనుకు నడిపిస్తుంది
3. అబద్ధమతం నాశనమైన తర్వాత, యెహోవా ప్రజలపై ఎలాంటి దాడి జరుగుతుంది?
3 అబద్ధమతం నాశనమైన తర్వాత, సాతాను అతని లోకంలోని ఇతర శక్తులు యెహోవా సేవకుల మీద దాడి చేస్తారు. ఉదాహరణకు, “మాగోగు దేశపువాడగు గోగు” గురించి లేఖనాలు ఇలా ప్రవచించాయి, “గాలి వాన వచ్చినట్లును మేఘము కమ్మినట్లును నీవు దేశము మీదికి వచ్చెదవు, నీవును నీ సైన్యమును నీతోకూడిన బహు జనమును దేశముమీద వ్యాపింతురు.” అయితే యెహోవాసాక్షులు ఎలాంటి ఆయుధాలు ధరించరు, పైగా ఎంతో శాంతికామకులు, కాబట్టి వాళ్లను ఇట్టే తుడిచిపెట్టేయవచ్చని శత్రువులు అనుకుంటారు. అయితే అలా దాడి చేయడం ఎంత పెద్ద పొరపాటో వాళ్లు త్వరలోనే గ్రహిస్తారు!—యెహె. 38:1, 2, 9-12.
4, 5. తన ప్రజలను నాశనం చేయాలని సాతాను ప్రయత్నించినప్పుడు యెహోవా ఎలా స్పందిస్తాడు?
4 మరి తన ప్రజలను నాశనం చేయాలని సాతాను ప్రయత్నిస్తుంటే, యెహోవా చూస్తూ ఊరుకుంటాడా? విశ్వసర్వాధిపతిగా తనకున్న హక్కును ఉపయోగిస్తూ యెహోవా తన ప్రజల తరఫున జోక్యం చేసుకుంటాడు. తన ప్రజలపై జరుగుతున్న దాడిని స్వయంగా తనపైనే జరుగుతున్న దాడిగా యెహోవా భావిస్తాడు. (జెకర్యా 2:8 చదవండి.) అందుకే యెహోవా ఏమాత్రం ఆలస్యం చేయకుండా చర్య తీసుకుని మనల్ని రక్షిస్తాడు “సర్వాధికారియైన దేవుని మహాదినమున జరుగు యుద్ధమైన” హార్‌మెగిద్దోనులో ఆయన సాతాను లోకాన్ని నాశనం చేయడంతో ఆ రక్షణ కార్యం ముగింపుకు వస్తుంది.—ప్రక. 16:14-16.
5 హార్‌మెగిద్దోను గురించి బైబిలు ఇలా ప్రవచించింది, “యెహోవా జనములతో వ్యాజ్యెమాడుచున్నాడు, శరీరులందరితో ఆయన వ్యాజ్యెమాడుచున్నాడు, ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు; ఇదే యెహోవా వాక్కు. సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు—జనమునుండి జనమునకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతములనుండి గొప్ప తుపాను బయలు వెళుచున్నది. ఆ దినమున యెహోవాచేత హతులైన వారు ఈ దేశముయొక్క యీ దిశనుండి ఆ దిశవరకు కనబడుదురు. ఎవరును వారినిగూర్చి అంగలార్చరు, వారిని సమకూర్చరు, పాతిపెట్టరు, పెంటవలె వారి శవములు నేలమీద పడియుండును.” (యిర్మీ. 25:31-33) హార్‌మెగిద్దోను యుద్ధం, ఈ దుష్టలోకానికి ముగింపు పలుకుతుంది. సాతాను లోకం నామరూపాల్లేకుండా పోతుంది, కానీ యెహోవా సంస్థలోని భూమ్మీది భాగం సురక్షితంగా ఉంటుంది.
యెహోవా సంస్థ నేడు ఎందుకు వర్ధిల్లుతోంది?
6, 7. (ఎ) ‘గొప్పసమూహపు’ సభ్యుల్లో ఎవరెవరు ఉంటారు? (బి) గడిచిన కొన్ని సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగింది?
6 దేవుని సంస్థ ఎంతోకాలంగా ఉనికిలో ఉంటూ, వర్ధిల్లుతోంది. ఎందుకంటే దానిలో ఉన్న ప్రజలకు ఆయన ఆమోదం ఉంది. “ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి” అని బైబిలు భరోసా ఇస్తుంది. (1 పేతు. 3:12) ఆ నీతిమంతుల్లో “మహాశ్రమలనుండి వచ్చిన” ‘గొప్పసమూహపు’ సభ్యులు కూడా ఉన్నారు. (ప్రక. 7:9, 14) వాళ్లను బైబిలు కేవలం ఒక ‘సమూహము’ అని కాకుండా “గొప్పసమూహము” అని పిలుస్తూ వాళ్ల సంఖ్య చాలా పెద్దదని సూచిస్తుంది. రక్షణ పొందే ఆ ‘గొప్పసమూహంలో’ మీరుకూడా ఉన్నట్లు ఊహించుకోగలరా?
7 ఆ గొప్పసమూహంలో అన్ని దేశాల నుండి వచ్చిన ప్రజలు ఉంటారు. ప్రకటనా పని వల్లే వాళ్లందరూ ఆ సమూహంలో సభ్యులుగా తయారవుతున్నారు. యేసు ఇలా ప్రవచించాడు, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.” (మత్త. 24:14) ఈ చివరి రోజుల్లో, దేవుని సంస్థ చేస్తున్న ముఖ్యమైన పని అదే. యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ప్రకటనా, బోధనా పనివల్ల, లక్షలమంది “ఆత్మతోను సత్యముతోను” దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకున్నారు. (యోహా. 4:23, 24) ఉదాహరణకు, గత పది సంవత్సరాల్లో అంటే 2003 సేవా సంవత్సరం నుండి 2012 సేవ సంవత్సరం వరకు, 27,07,000 కన్నా ఎక్కువమంది యెహోవాకు చేసుకున్న సమర్పణను సూచిస్తూ బాప్తిస్మం పొందారు. నేడు భూవ్యాప్తంగా 79,00,000 కన్నా ఎక్కువమంది యెహోవాసాక్షులు ఉన్నారు, అంతేకాక లక్షలమంది వాళ్లతో సహవసిస్తున్నారు, ముఖ్యంగా వార్షిక జ్ఞాపకార్థ ఆచరణ సమయంలో. అయితే ఆ సంఖ్యల్ని చెబుతున్నది మన గొప్పతనం కోసం కాదు, ఎందుకంటే ‘వృద్ధి కలుగజేసేవాడు దేవుడే.’ (1 కొరిం. 3:5-7) అయినా, గొప్పసమూహం ప్రతీ సంవత్సరం మరింతగా పెరుగుతూ, వృద్ధి చెందుతూనే ఉందని చెప్పడానికి అవే రుజువులు.
8. యెహోవా ఆధునికకాల సంస్థ అద్భుత అభివృద్ధికి ఏది కారణం?
8 యెహోవా ఆశీర్వాదాలు ఆయన సాక్షులపై పుష్కలంగా ఉన్నాయి కాబట్టే ఆయన సేవకుల సంఖ్య అద్భుతంగా వృద్ధి చెందింది. (యెషయా 43:10-12 చదవండి.) ఆ అభివృద్ధి గురించి యెహోవా ముందే ఇలా ప్రవచించాడు, “వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును ఎన్నికలేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగినకాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును.” (యెష. 60:22) భూమ్మీదున్న అభిషిక్తులు ఒకప్పుడు ‘ఒంటరియైనవానిలా’ ఉన్నారు, అయితే ఆధ్యాత్మిక ఇశ్రాయేలులోని మిగతా సభ్యుల్ని కూడా దేవుడు తన సంస్థలోకి సమకూర్చడంతో వాళ్ల సంఖ్య పెరిగింది. (గల. 6:16) సంవత్సరాలుగా యెహోవా ఆశీర్వాదం వల్ల, గొప్పసమూహపు సభ్యులు కూడా సంస్థలోకి వస్తుండడంతో ఆ సంఖ్య మరింతగా పెరుగుతూ ఉంది.
యెహోవా మననుండి ఏమి ఆశిస్తున్నాడు?
9. దేవుని వాక్యం వాగ్దానం చేసిన అద్భుతమైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి?
9 మనం అభిషిక్త క్రైస్తవులమైనా లేదా గొప్పసమూహంలోని సభ్యులమైనా, దేవుని వాక్యం వాగ్దానం చేసిన అద్భుతమైన భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. అయితే, అందుకోసం మనం యెహోవా ఆజ్ఞలు పాటించాలి. (యెష. 48:17, 18) మోషే ధర్మశాస్త్రం కిందవున్న ఇశ్రాయేలీయుల గురించి ఓసారి ఆలోచించండి. యెహోవా ఆ ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి ఒక కారణం, లైంగిక ప్రవర్తన, వ్యాపార వ్యవహారాలు, పిల్లల పెంపకం, తోటివాళ్లతో సరిగ్గా వ్యవహరించడం వంటి విషయాల్లో సరైన నియమాలు ఇచ్చి వాళ్లను కాపాడడం. (నిర్గ. 20:14; లేవీ. 19:18, 35-37; ద్వితీ. 6:6-9) దేవుడు మననుండి ఆశించేవాటిని చేసినప్పుడు మనం కూడా అలాగే ప్రయోజనం పొందుతాం, అంతేకాక ఆయన ఆజ్ఞలు మనం పాటించలేనంత కష్టమైనవి కావని గ్రహిస్తాం. (1 యోహాను 5:3 చదవండి.) నిజానికి, ధర్మశాస్త్రం ఇశ్రాయేలీయుల్ని కాపాడినట్లే, దేవుని నియమాలకు, సూత్రాలకు మనం చూపే విధేయత మనల్ని కాపాడడమే కాకుండా, యెహోవామీద మనకున్న విశ్వాసాన్ని పెంచుతుంది.—తీతు 1:13, 14.
10. మనం బైబిలు అధ్యయనానికి, కుటుంబ ఆరాధనకు ఎందుకు సమయం కేటాయించాలి?
10 యెహోవా సంస్థలోని భూమ్మీది భాగం అనేక విధాలుగా ముందుకు వెళ్తోంది. ఉదాహరణకు, బైబిలు సత్యానికి సంబంధించి మన అవగాహన అంతకంతకూ స్పష్టమౌతూనే ఉంది. దానికి మనం ఆశ్చర్యపోము, ఎందుకంటే, “పట్టపగలగువరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును.” (సామె. 4:18) మనం ఇలా ప్రశ్నించుకోవడం మంచిది, ‘లేఖన సత్యానికి సంబంధించిన అవగాహనలో వస్తున్న మార్పులను నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నానా? రోజూ బైబిలు చదివే అలవాటు నాకుందా? మన ప్రచురణలను ఆసక్తిగా చదువుతున్నానా? నా కుటుంబంతో కలిసి ప్రతీవారం కుటుంబ ఆరాధన చేసుకుంటున్నానా?’ ఈ పనులను చేయడం పెద్ద కష్టం కాదని మనలో చాలామందిమి ఒప్పుకుంటాం. మనం చేయాల్సిందల్లా, వాటికోసం సమయం కేటాయించడమే. ఖచ్చితమైన లేఖన జ్ఞానం సంపాదించుకోవడం, దాన్ని అన్వయించుకోవడం, ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడం చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా, మహాశ్రమలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో అది మరింత ప్రాముఖ్యం!
11. ప్రాచీనకాల పండుగలు, నేటి కూటాలూ సమావేశాలూ ఎలా ప్రయోజనకరమైనవి?
11 “కొందరు మానుకొనుచున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగు చేయుచు, ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము” అని పౌలు ఇచ్చిన సలహాను పాటించమని యెహోవా సంస్థ పదేపదే చెబుతున్నది మన శ్రేయస్సు కోసమే. (హెబ్రీ. 10:24, 25) వార్షిక పండుగలు, ఆరాధన కోసం ఏర్పాటు చేసిన మరితర కూటాలు ఇశ్రాయేలీయుల్ని ఆధ్యాత్మికంగా బలపర్చేవి. అంతేకాక, నెహెమ్యా కాలంలో జరిగిన పర్ణశాలల పండుగలు వంటివి సంతోషాన్నిచ్చే సందర్భాలుగా ఉండేవి. (నిర్గ. 23:15, 16; నెహె. 8:9-18) మనం కూడా కూటాల్లోనూ పెద్దపెద్ద సమావేశాల్లోనూ అలాంటి ప్రయోజనమే పొందుతున్నాం. ఆ ఏర్పాట్లను పూర్తిగా వినియోగించుకుని, ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుదాం.—తీతు 2:2.
12. రాజ్య ప్రకటనా పని గురించి మనం ఎలా భావించాలి?
12 దేవుని సంస్థతో సహవసిస్తున్న మనకు, దేవుని సువార్త ప్రకటించడమనే పరిశుద్ధమైన పనిలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. (రోమా. 15:15, 16) ఆ పని చేయడంవల్ల, “పరిశుద్ధ” దేవుడైన యెహోవాకు మనం ‘జతపనివారిగా’ ఉండగలుగుతాం. (1 కొరిం. 3:9; 1 పేతు. 1:14-16) యెహోవా పరిశుద్ధ నామం పరిశుద్ధపర్చబడేందుకు సువార్త ప్రకటనా పని దోహదపడుతుంది. సంతోషంగల దేవుడు ‘అప్పగించిన మహిమగల సువార్త’ ప్రకటించే అవకాశం మనకు దొరికిన గొప్ప భాగ్యం.—1 తిమో. 1:8-11.
13. మన ఆధ్యాత్మిక ఆరోగ్యం, జీవం వేటిపై ఆధారపడివున్నాయి?
13 మనం తనను అంటిపెట్టుకుని ఉంటూ, తన సంస్థ నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలకు మద్దతిస్తూ ఆధ్యాత్మిక ఆరోగ్యం కాపాడుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు. మోషే ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పాడు, “నేడు జీవమును మరణమును, ఆశీర్వాదమును శాపమును నేను నీ యెదుటను ఉంచి, భూమ్యాకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించునట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్షుకును మూలమై యున్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రదుకుచు, నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనునట్లును జీవమును కోరుకొనుడి.” (ద్వితీ. 30:19, 20) యెహోవా చిత్తాన్ని చేస్తూ, ఆయన్ను ప్రేమిస్తూ, ఆయన మాటలకు విధేయత చూపిస్తూ, ఆయనను అంటిపెట్టుకుని ఉంటేనే మన జీవాన్ని కాపాడుకోగలుగుతాం.
14. దేవుని సంస్థలోని దృశ్య భాగం విషయంలో ఓ సహోదరుడు ఎలా భావించాడు?
14 సహోదరుడు ప్రైస్ హ్యూస్, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండి, ఆయన సంస్థతోపాటు పయనించాడు. ఆయనిలా రాశాడు, “నేను 1914కు కాస్త ముందు నుండి, యెహోవా సంకల్పాలను తెలుసుకుంటూ జీవించినందుకు ఎంతో కృతజ్ఞుణ్ణి. . . . నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏదైనా ఉందంటే, అది యెహోవా దృశ్య సంస్థను అంటిపెట్టుకుని ఉండడమే. మానవ ఆలోచనల మీద ఆధారపడడం ఎంత తెలివితక్కువ పనో నా తొలి అనుభవాలు నేర్పించాయి. ఆ విషయాన్ని ఒక్కసారి స్పష్టంగా అర్థం చేసుకున్నాక, సంస్థకు నమ్మకంగా కట్టుబడివుండాలని నిశ్చయించుకున్నాను. యెహోవా అనుగ్రహం, ఆశీర్వాదం పొందేందుకు వేరే మార్గమేదైనా ఉందంటారా?”
దేవుని సంస్థతో కలిసి ముందుకు సాగుతూ ఉండండి
15. లేఖనాల అవగాహనలో వచ్చే సవరింపులను మనం ఎలా దృష్టించాలో తెలిపే బైబిలు ఉదాహరణ చెప్పండి.
15 మనలో ప్రతీ ఒక్కరం యెహోవా సంస్థకు మద్దతిస్తూ, లేఖనాల అవగాహనలో వచ్చే మార్పులను అంగీకరించినప్పుడే ఆయన అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతాం. ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి, మొదటి శతాబ్దంలో కొంతమంది యూదులు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ధర్మశాస్త్రాన్ని పాటించాలని కోరుకున్నారు. (అపొ. 21:17-20) అయితే, తాము ‘ధర్మశాస్త్రాన్ని బట్టి అర్పింపబడిన’ బలుల వల్ల కాదుగానీ, “యేసుక్రీస్తుయొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుటచేత” పరిశుద్ధులయ్యామన్న నిజాన్ని, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికను చదివి వాళ్లు అర్థం చేసుకున్నారు. (హెబ్రీ. 10:5-10) క్రైస్తవులుగా మారిన చాలామంది యూదులు తమ ఆలోచనా విధానాన్ని సరిచేసుకుని, ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించారని నిస్సందేహంగా చెప్పవచ్చు. మనం కూడా వాళ్లలాగే శ్రద్ధగా అధ్యయనం చేస్తూ, లేఖనాల అవగాహనలో లేదా ప్రకటనా పద్ధతుల్లో సవరింపులు వచ్చినప్పుడు వాటిని స్వాగతించాలి.
16. (ఎ) నూతనలోకంలో జీవితం ఎందుకు అద్భుతంగా ఉంటుంది? (బి) నూతనలోకంలో మీరు దేనిగురించి ఎదురుచూస్తున్నారు?
16 యెహోవాకు, ఆయన సంస్థకు నమ్మకంగా కట్టుబడి ఉన్నవాళ్లు ఆయన ఆశీర్వాదాలను ముందుముందు కూడా పొందుతూనే ఉంటారు. నమ్మకస్థులైన అభిషిక్తులు క్రీస్తుతోపాటు పరలోకంలో రాజులుగా పరిపాలించే గొప్ప అవకాశం పొందుతారు. (రోమా. 8:16, 17) భూనిరీక్షణ గలవాళ్లు, పరదైసులో జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. యెహోవా సంస్థలో భాగమైన మనం, ఆయన వాగ్దానం చేసిన కొత్తలోకం గురించి ఇతరులకు చెప్పడంలో ఎంత ఆనందాన్ని పొందుతాం! (2 పేతు. 3:13) “దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు క్షేమము కలిగి సుఖించెదరు” అని కీర్తన 37:11 చెబుతుంది. “జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు . . . వారు తాము చేసికొనినదాని ఫలమును పూర్తిగా అనుభవింతురు.” (యెష. 65:21, 22) అణచివేత, పేదరికం, ఆకలి బాధలు ఏమాత్రం కనిపించవు. (కీర్త. 72:13-16) ప్రజలను మోసం చేయడానికి మహాబబులోను కూడా ఉండదు. (ప్రక. 18:8, 21) చనిపోయినవాళ్లు పునరుత్థానమై, నిరంతరం జీవించే అవకాశం పొందుతారు. (యెష. 25:8; అపొ. 24:14, 15) యెహోవాకు సమర్పించుకున్న లక్షలాదిమందికి ఎంతటి అద్భుతమైన భవిష్యత్తు వేచివుంది! అయితే అలాంటి జీవితాన్ని కళ్లారా చూడాలంటే, మనలో ప్రతీ ఒక్కరం ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూ, దేవుని సంస్థతోపాటు కలిసి ముందుకు పయనిస్తూ ఉండాలి.
17. యెహోవా ఆరాధన విషయంలో, ఆయన సంస్థ విషయంలో మన వైఖరి ఎలా ఉండాలి?
17 ఈ దుష్టలోక అంతం చాలా దగ్గర్లో ఉంది కాబట్టి, మనం విశ్వాసంలో స్థిరంగా ఉంటూ, ఆరాధన కోసం యెహోవా చేసిన ఏర్పాట్లపట్ల హృదయపూర్వక కృతజ్ఞత చూపిద్దాం. కీర్తనకర్త దావీదు అలాంటి వైఖరినే చూపించాడు, “యెహోవాయొద్ద ఒక్క వరము అడిగితిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింప గోరుచున్నాను” అని ఆయన పాడాడు. (కీర్త. 27:4) కాబట్టి మనలో ప్రతీ ఒక్కరం యెహోవాను అంటిపెట్టుకుని ఉంటూ, ఆయన ప్రజలతో నడుస్తూ, ఆయన సంస్థతో కలిసి ఎల్లప్పుడూ ముందుకు సాగుదాం!