కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ప్రగతి సాధించేందుకు ‘మీ మార్గంలో’ ఉన్న అడ్డంకులను తీసేయండి

ప్రగతి సాధించేందుకు ‘మీ మార్గంలో’ ఉన్న అడ్డంకులను తీసేయండి

దేవుని ప్రజలు, సా.శ.పూ. 537⁠లో బబులోనును విడిచి యెరూషలేముకు వెళ్లేటప్పుడు, వాళ్లు ప్రయాణించే మార్గం విషయంలో యెహోవా శ్రద్ధ తీసుకున్నాడు. ఆయన వాళ్లకిలా చెప్పాడు, “త్రోవ సిద్ధపరచుడి రాజమార్గమును చక్కపరచుడి, చక్కపరచుడి రాళ్లను ఏరి పారవేయుడి.” (యెష. 62:10) కొందరు యూదులు ఆ పనిని ఎలా చేసివుంటారో ఊహించండి. వాళ్లు ముందే వెళ్లి ఆ దారిలో ఉన్న గుంటలను పూడ్చి, ఎత్తుపల్లాలను సరిచేసి, ఆ మార్గాన్ని బాగుచేసివుంటారు. వాళ్లు అలా చేయడం వల్ల, వాళ్ల వెనుక వస్తున్న మిగతా సహోదరసహోదరీలు తమ సొంత పట్టణమైన యెరూషలేముకు ఏ ఇబ్బంది లేకుండా ప్రయాణించగలిగారు.

ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయాణించే మార్గం విషయంలో కూడా అదే చేయాల్సి ఉంటుంది. తన సేవకులు వెళ్లే ఆ మార్గంలో అనవసరమైన అడ్డంకులు వాళ్లకు ఎదురుకాకూడదని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన వాక్యం మనల్ని ఇలా ప్రోత్సహిస్తుంది, “నీవు నడచు మార్గమును సరాళము చేయుము అప్పుడు నీ మార్గములన్నియు స్థిరములగును.” (సామె. 4:26) మీరు పిల్లలైనా, యువతీయువకులైనా ఆ సలహాలో ఉన్న జ్ఞానాన్ని అర్థంచేసుకోవచ్చు.

మంచి నిర్ణయాలు తీసుకుంటూ మార్గాన్ని సిద్ధం చేసుకోండి

‘ఆమెకు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి, అతనికి బంగారు భవిష్యత్తు ఉంది’ అని ఒకానొక యువతి గురించో యువకుని గురించో కొందరు అనడం మీరు వినేవుంటారు. సాధారణంగా యౌవనులకు మంచి ఆరోగ్యం, చురుగ్గా ఆలోచించే సామర్థ్యం, ఏదో సాధించాలనే తపన ఉంటాయి. బైబిలు సరిగ్గానే ఇలా చెబుతోంది, “యౌవనస్థుల బలము వారికి అలంకారము.” (సామె. 20:29) తమకున్న తెలివితేటలను, శక్తిని యెహోవా సేవలో ఉపయోగించే యువతీయువకులు ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకుంటారు, నిజమైన సంతోషాన్ని సొంతం చేసుకుంటారు.

అయితే, మన మధ్యవున్న యౌవనుల సామర్థ్యాలకు ఈ లోకం ఎంతో విలువిస్తుందని మీకు తెలుసు. ఓ యువ యెహోవాసాక్షి స్కూల్లో బాగా రాణించినప్పుడు, టీచర్లు, సలహాదారులు లేదా తోటి విద్యార్థులు, ఆ సాక్షిని ఉన్నత విద్య చేపట్టి ఈ లోకంలో మంచి హోదా సంపాదించుకోమని ఒత్తిడి చేయవచ్చు. క్రీడల్లో బాగా రాణించే సాక్షుల విషయానికొస్తే, వాళ్లు క్రీడల్నే తమ వృత్తిగా చేసుకునేలా ఇతరులు ప్రలోభపెట్టవచ్చు. మీరు గానీ మీకు బాగా తెలిసినవాళ్లు గానీ అటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారా? ఈ విషయంలో జ్ఞానయుక్తమైన నిర్ణయం తీసుకోవడానికి ఒక క్రైస్తవునికి ఏది సహాయం చేస్తుంది?

జీవానికి నడిపించే అత్యుత్తమ మార్గంలో పయనించేందుకు బైబిలు బోధలు సహాయం చేయగలవు. “నీ బాల్యదినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము” అని ప్రసంగి 12:2 చెబుతుంది. మీరు లేదా మీకు తెలిసిన యౌవనులు ‘మీ సృష్టికర్తను ఎలా స్మరణకు తెచ్చుకోవచ్చు?’

పశ్చిమ ఆఫ్రికాలో ఉన్న ఎరిక్‌ a అనుభవాన్ని పరిశీలించండి. అతనికి ఫుట్‌బాల్‌ ఆటంటే ప్రాణం. ఎరిక్‌కి 15 ఏళ్లున్నప్పుడు జాతీయ జట్టులోకి ఎంపిక అయ్యాడు. దాంతో, ఐరోపాలో అత్యుత్తమ క్రీడా శిక్షణ పొందే అవకాశంతో పాటు, ఆ క్రీడనే వృత్తిగా చేసుకునే గొప్ప అవకాశం కూడా అతని ముందుంది. అయితే, అతను తన సృష్టికర్తను ఎలా ‘స్మరణకు తెచ్చుకున్నాడు?’ దానినుండి మీలాంటి యౌవనులు ఏ పాఠం నేర్చుకోవచ్చు?

స్కూల్‌కు వెళ్లే రోజుల్లో, ఎరిక్‌ యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. మానవ సమస్యలను సృష్టికర్త శాశ్వతంగా పరిష్కరిస్తాడని నేర్చుకున్న ఎరిక్‌ ఆ సృష్టికర్త చిత్తాన్ని చేయడానికి తన సమయాన్ని, శక్తిని ఉపయోగించడం చాలా ప్రాముఖ్యమని అర్థం చేసుకున్నాడు. అందుకే క్రీడా రంగాన్ని వృత్తిగా చేసుకోవడానికి ప్రయాసపడకూడదని నిర్ణయించుకున్నాడు. దానికి బదులు, అతను బాప్తిస్మం పొంది ఆధ్యాత్మిక విషయాలపై మనసుపెట్టాడు. కొంతకాలానికే అతను పరిచర్య సేవకుడు అయ్యి, తర్వాత ఒంటరి సహోదరుల కోసం బైబిలు పాఠశాలకు కూడా హాజరయ్యాడు.

ఎరిక్‌ క్రీడా రంగంలోనే ఉండివుంటే డబ్బు, పేరుప్రఖ్యాతులు వచ్చివుండేవి. కానీ, “ధనికులు, వారి ఐశ్వర్యం వారిని కాపాడుతుంది అనుకొంటారు. అది ఒక బలమైన కోటలా ఉంది అని వారు తలుస్తారు” అని బైబిలు చెబుతున్న మాటలు వాస్తవమని అతను గ్రహించాడు. (సామె. 18:11, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) అవును, డబ్బు ద్వారా నిజమైన భద్రత పొందలేము. అంతేకాదు, ధన సంపాదనే ధ్యేయంగా పెట్టుకునేవాళ్లు ‘నానాబాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు.’—1 తిమో. 6:9, 10.

అయితే, చాలామంది యౌవనులు పూర్తికాల సేవను చేపట్టి సంతోషాన్ని, శాశ్వత భద్రతను కనుగొన్నారు. ఎరిక్‌ ఇలా చెబుతున్నాడు, “పూర్తికాల సేవ చేస్తున్న యెహోవా సేవకుల పెద్ద ‘టీమ్‌లో’ నేను చేరాను. నేను చేరగల అత్యుత్తమ టీమ్‌ అదే. జీవితంలో నిజమైన సంతోషానికి, విజయానికి నడిపించగల ఏకైక మార్గాన్ని చూపించినందుకు యెహోవాకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెబుతాను.”

మీ సంగతేంటి? లోకసంబంధ లక్ష్యాల వెంటపడే బదులు, పయినీరు సేవ చేయడం ద్వారా యెహోవా యెదుట ‘మీ మార్గాలను’ స్థిరపర్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తారా?—“ విశ్వవిద్యాలయం ఇవ్వలేని ప్రయోజనాలను నేను పొందాను” బాక్సు చూడండి.

మీ మార్గంలో ఉన్న అడ్డంకులను తీసివేయండి

ఒక జంట, అమెరికాలో ఉన్న బ్రాంచి కార్యాలయాన్ని చూడడానికి వెళ్లినప్పుడు, బెతెల్‌లో పనిచేస్తున్న సహోదరసహోదరీలు ఎంత సంతోషంగా ఉన్నారో గమనించింది. ఆ సహోదరి తర్వాత ఇలా రాసింది, “మేము మా రోజువారీ జీవితానికి బాగా అలవాటుపడిపోయాం.” అయితే, కొన్ని సర్దుబాట్లు చేసుకుని మరిన్ని గొప్ప సేవావకాశాలు పొందగలిగేలా తమ సమయాన్ని, శక్తిని వెచ్చించాలని వాళ్లు నిర్ణయించుకున్నారు.

అయితే ఒకానొక సమయంలో, ఆ మార్పులు ఆ జంటకు కొంచెం భారంగా అనిపించాయి. కానీ వాళ్లు ఒకరోజు దినవచనంలో యోహాను 8:31ని చదివి, ధ్యానించారు. ఆ వచనంలో, ‘మీరు నా వాక్యమందు నిలిచినవారైతే నిజముగా నాకు శిష్యులై ఉంటారు’ అని యేసు చెప్పిన మాటలు ఉన్నాయి. ఆ మాటలను మనసులో ఉంచుకొని వాళ్లు, ‘మన జీవితాన్ని నిరాడంబరంగా చేసుకోవడానికి ఏ త్యాగం చేసినా తప్పకుండా ప్రతిఫలం ఉంటుంది’ అని ఆలోచించుకున్నారు. వాళ్లు తమ పెద్ద ఇంటిని అమ్మేశారు, ఇతర బరువులను కూడా దించేసుకుని, ఎక్కువ అవసరం ఉన్న సంఘానికి వెళ్లారు. వాళ్లు ఇప్పుడు పయినీర్లుగా సేవ చేస్తున్నారు. అంతేకాదు, రాజ్యమందిర నిర్మాణ పనిలో, జిల్లా సమావేశాల్లో స్వచ్ఛందంగా సహాయం చేస్తున్నారు. వాళ్లు ఇప్పుడు ఎలా భావిస్తున్నారు? “యెహోవా సంస్థ ప్రోత్సహిస్తునట్లుగా, నిరాడంబరంగా జీవిస్తే నిజంగా ఇంత సంతోషం ఉంటుందానని ఆశ్చర్యపోతుంటాం” అని వాళ్లు అంటున్నారు.

ఆధ్యాత్మిక ప్రగతికి నడిపించే మార్గంలోనే ఉండండి

“నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను” అని సొలొమోను రాశాడు. (సామె. 4:25) ఆ మాటల అర్థం ఏమిటి? యెహోవా సేవలో మరిన్ని అవకాశాలు పొందే మార్గంలో మనం ఏకాగ్రతతో ప్రయాణించాలి. ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోనివ్వకుండా, వాటిని చేరుకోనివ్వకుండా ఆటంకపరిచే వాటికి మనం దూరంగా ఉండాలి.

మీరు ఎలాంటి ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకుని వాటిని చేరుకోవడానికి కృషి చేయవచ్చు? పూర్తికాల సేవ చేయడం ఒక మంచి లక్ష్యం. మీకు దగ్గర్లో ఉన్న కొన్ని సంఘాలకు చాలా పెద్ద క్షేత్రం ఉండవచ్చు, కానీ దాన్ని పూర్తిచేసేందుకు అనుభవంగల ప్రచారకులు అక్కడ లేకపోవచ్చు. లేదా ఒక సంఘంలో చాలామంది చురుకైన ప్రచారకులు ఉండవచ్చు, కానీ సరిపడా సంఘ పెద్దలు, పరిచర్య సేవకులు ఉండకపోవచ్చు. అలాంటి సంఘాల్లో ఒకదానికి సహాయపడాలనే లక్ష్యం మీరు పెట్టుకోగలరా? మీరు అలా సహాయం చేయడం వీలౌతుందేమో ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి అడిగి చూడండి. మీరు ఒకవేళ దూర ప్రాంతాల్లో సేవ చేయాలనుకుంటే, సహాయం అవసరమైన అలాంటి సంఘాల గురించి కూడా మరింత సమాచారం కోసం అడగవచ్చు. b

యెషయా 62:10⁠లోని విషయం దగ్గరికి మళ్లీ వద్దాం. దేవుని ప్రజలు గమ్యస్థానాన్ని చేరుకోవడానికి వీలుగా కొంతమంది యూదులు, యెరూషలేముకు వెళ్లే మార్గంలోని ఎత్తుపల్లాలను సరిచేసి దాన్ని బాగుచేయడానికి కష్టపడివుంటారు. అలాగే పరిశుద్ధ సేవలో లక్ష్యాలను చేరుకోవడానికి మీరు కృషి చేస్తున్నట్లైతే, దాన్ని ఆపకండి. దేవుని సహాయంతో మీరు కూడా మీ లక్ష్యాలను చేరుకోవచ్చు. మీ ముందున్న అడ్డంకులను తీసివేయడానికి ప్రయత్నిస్తుండగా జ్ఞానం కోసం యెహోవాను అడుగుతూనే ఉండండి. ‘మీ మార్గాన్ని సరళం’ చేసుకోవడానికి ఆయన మీకు ఎలా సహాయం చేస్తాడో తగిన సమయంలో మీరే చూస్తారు.—సామె. 4:26.

a అసలు పేరు కాదు.

b యెహోవా చిత్తం చేయడానికి సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 111-112 పేజీలు చూడండి.