కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

శవదహనం చేయడం క్రైస్తవులకు సరైనదేనా?

శవదహనం చేయడం తప్పని బైబిలు ఎక్కడా చెప్పడం లేదు.

చనిపోయినవాళ్ల దేహాలను లేదా ఎముకలను కాల్చిన సందర్భాల గురించి బైబిలు ప్రస్తావిస్తోంది. (యెహో. 7:25; 2 దిన. 34:4, 5) వాళ్లు గౌరవప్రదంగా సమాధి చేయబడడానికి అనర్హులని అది సూచించి ఉండవచ్చు. అయితే అలా కాల్చబడిన వాళ్లందరూ సమాధికి అనర్హులని కాదు.

ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, రాజైన సౌలు, ఆయన ముగ్గురు కుమారులు చనిపోయినప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. ఫిలిష్తీయులతో జరిగిన యుద్ధంలో ఆ నలుగురు చనిపోయారు. వాళ్లలో ఒకరు, దావీదుకు ఆప్తమిత్రుడూ నమ్మకమైన అనుచరుడూ అయిన యోనాతాను. యాబేష్గిలాదులోని పరాక్రమవంతులైన ఇశ్రాయేలీయులు జరిగిన సంగతి తెలుసుకుని, ఆ నలుగురి మృతదేహాలను తీసుకువచ్చి, వాటిని దహించి, యెముకలను పాతిపెట్టారు. వీళ్లు చేసిన పనిని దావీదు ఆ తర్వాత ఎంతో ప్రశంసించాడు.—1 సమూ. 31:2, 8-13; 2 సమూ. 2:4-6.

చనిపోయిన వ్యక్తి పునరుత్థానం అవుతాడని అంటే ఆ వ్యక్తికి దేవుడు మళ్లీ జీవాన్ని ఇస్తాడని లేఖనాలు చెబుతున్నాయి. చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని కాల్చినా కాల్చకపోయినా, ఆ వ్యక్తికి ఒక కొత్త శరీరాన్ని ఇచ్చి జీవాన్ని ప్రసాదించే సామర్థ్యం యెహోవాకు ఉంది. ముగ్గురు నమ్మకస్థులైన హెబ్రీ యువకులను మండుతున్న గుండంలో పడేయమని రాజైన నెబుకద్నెజరు ఆజ్ఞ ఇచ్చిన సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. తమ శరీరాలు అందులో కాలిపోతే, దేవుడు తమను మళ్లీ బతికిస్తాడో లేదోనన్న భయం వాళ్లకు అవసరం లేదు. (దాని. 3:16-18) నాజీ నిర్బంధ శిబిరాల్లో చనిపోయి, అక్కడే దహనసంస్కారాలు పూర్తైన నమ్మకస్థులైన యెహోవా సేవకుల విషయంలో కూడా అది నిజం. చాలామంది యథార్థవంతులైన దేవుని సేవకులు బాంబు పేలుళ్లలో, మరితర విధాల్లో చనిపోవడం వల్ల వాళ్ల శరీరం తాలూకు ఆనవాలు కూడా మిగల్లేదు. అయినప్పటికీ, వాళ్లు తప్పకుండా పునరుత్థానం అవుతారు.—ప్రక. 20:13.

చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించడం కోసం, ఆ వ్యక్తికి ముందున్న శరీరాన్నే మళ్లీ అమర్చాల్సిన అవసరం యెహోవాకు లేదు. అభిషిక్త క్రైస్తవులను దేవుడు పరలోక జీవానికి పునరుత్థానం చేసే విధానంలో ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ‘ఆత్మవిషయంలో బ్రతికింపబడిన’ యేసులాగే, అభిషిక్త క్రైస్తవులు కూడా అదే వ్యక్తులుగా ఆత్మీయ శరీరాలతో పునరుత్థానం అవుతారు. వాళ్ల భౌతిక శరీరంలోని ఏ భాగం కూడా వాళ్లతోపాటు పరలోకానికి వెళ్లదు.—1 పేతు. 3:18; 1 కొరిం. 15:42-53; 1 యోహా. 3:2.

కాబట్టి పునరుత్థానమనే మన నిరీక్షణ, మృతదేహాన్ని ఏమి చేస్తారనే దానిపై కాదుగాని, తన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుని సామర్థ్యంపై, ఇష్టంపై మనకున్న విశ్వాసం మీదే ఆధారపడివుంది. (అపొ. 24:14, 15) నిజమే, దేవుడు చనిపోయినవాళ్లను గతంలో అద్భుతరీతిగా ఎలా బ్రతికించాడో లేదా భవిష్యత్తులో ఎలా బ్రతికిస్తాడో మనం పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. అయినా, మనం యెహోవా మీద విశ్వాసం ఉంచుతాం. యేసును పునరుత్థానం చేయడం ద్వారా దేవుడు దాన్ని ‘నమ్మడానికి ఆధారం’ కలుగజేశాడు.—అపొ. 17:31; లూకా 24:2, 3.

మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించే విషయంలో క్రైస్తవులు సామాజిక కట్టుబాట్లను, స్థానిక ప్రజల మనోభావాలను, ప్రభుత్వ చట్టాలను పరిగణనలోకి తీసుకుంటే మంచిది. (2 కొరిం. 6:3, 4) అప్పుడు, ఆ మృతదేహాన్ని దహనం చేయాలా వద్దా అనేది వ్యక్తిగతంగా లేదా కుటుంబంగా నిర్ణయించుకోవాలి.