మీరు మానవ బలహీనతలను యెహోవా చూస్తున్నట్లే చూస్తున్నారా?
“శరీరముయొక్క అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే.”—1 కొరిం. 12:22.
1, 2. పౌలు బలహీనుల మీద ఎందుకు సానుభూతి చూపించగలిగాడు?
మనమందరం కొన్నికొన్ని సందర్భాల్లో బలహీనులమౌతాం. జలుబు లాంటి చిన్నచిన్న వ్యాధులు వచ్చినప్పుడు, రోజూ చేసుకునే పనులు కూడా మనకు కష్టంగా అనిపించవచ్చు. అయితే మీరు కొన్ని రోజులపాటు, వారాలపాటు చివరికి కొన్ని నెలలపాటు బలహీనంగా ఉన్నారని ఊహించుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకుంటూ, మీమీద సానుభూతి చూపించాలని మీరు కోరుకోరా?
2 అపొస్తలుడైన పౌలు కూడా, సంఘంలోనుండి, బయటనుండి వచ్చిన ఒత్తిళ్ల వల్ల కొన్నిసార్లు బలహీనుడైనట్లుగా భావించాడు. ఇక తనవల్ల కాదని ఆయన కనీసం రెండుసార్లు అనుకున్నాడు. (2 కొరిం. 1:8; 7:5) తన జీవితాన్ని, నమ్మకమైన క్రైస్తవునిగా తాను పడ్డ ఎన్నో కష్టాలను తలపోస్తూ, “ఎవడైనను బలహీనుడాయెనా? నేనును బలహీనుడను కానా?” అని ఆయన ఒప్పుకున్నాడు. (2 కొరిం. 11:29) అంతేకాక క్రైస్తవ సంఘంలో ఉన్న సభ్యులను మానవ శరీరంలోని అవయవాలతో పోలుస్తూ, “అవయవములలో ఏవి మరి బలహీనములుగా కనబడునో అవి మరి అవశ్యములే” అని పౌలు అన్నాడు. (1 కొరిం. 12:22) ఆ మాటల అర్థమేమిటి? బలహీనులుగా కనిపించేవాళ్లను యెహోవా చూస్తున్నట్లుగా మనమెందుకు చూడాలి? అలా చేయడంవల్ల మనం ఎలాంటి ప్రయోజనాలు పొందుతాం?
మానవ బలహీనతలను యెహోవా ఎలా చూస్తాడు?
3. సంఘంలో ఎక్కువ సహాయం అవసరమైన వాళ్లను మనం చిన్నచూపు చూసే ప్రమాదం ఎందుకు ఉంది?
3 మనం ప్రస్తుతం జీవిస్తున్న పోటీ ప్రపంచంలో, బలాన్నీ యౌవనాన్నీ గొప్పగా చూస్తున్నారు. తమకు నచ్చిన దానికోసం ఏమి చేయడానికైనా చాలామంది వెనకాడడం లేదు, అందుకోసం వాళ్లు తరచూ బలహీనుల భావాలను గాయపరుస్తారు. మనం అలాంటి ప్రవర్తనను ఒప్పుకోకపోయినా, సంఘంలో సహాయం ఎక్కువగా అవసరమయ్యే వాళ్లను మనకు తెలియకుండానే చిన్నచూపు చూసే ప్రమాదం ఉంది. అయితే సంఘంలోని ప్రతీ సభ్యుణ్ణి యెహోవా చూస్తున్నట్లు మనం ఎలా చూడవచ్చు?
4, 5. (ఎ) మానవ బలహీనతల విషయంలో యెహోవా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి 1 కొరింథీయులు 12:20-23లో ఉన్న ఉదాహరణ మనకు ఎలా సహాయం చేస్తుంది? (బి) బలహీనులకు సహాయం చేసినప్పుడు మనం ఎలా ప్రయోజనం పొందుతాం?
4 పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని ఓ ఉదాహరణ చూస్తే, యెహోవా మానవ బలహీనతలను ఎలా దృష్టిస్తాడో మరింత బాగా అర్థం చేసుకోవచ్చు. శరీరంలో ఏమాత్రం అందంగా లేని, అత్యంత బలహీనమైన అవయవం కూడా ఉపయోగకరమైనదేనని పౌలు 12వ అధ్యాయంలో గుర్తు చేస్తున్నాడు. (1 కొరింథీయులు 12:12, 18, 20-23 చదవండి.) మానవ శరీరానికి సంబంధించిన ఈ సత్యాన్ని కొంతమంది పరిణామవాదులు తప్పుబట్టారు. కొన్ని అవయవాలవల్ల ఉపయోగం లేదని ఒకప్పుడు అనుకున్నారు, కానీ నిజానికి అవి ప్రాముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తాయని శరీర నిర్మాణానికి సంబంధించిన పరిశోధనలు నిరూపిస్తున్నాయి. a ఉదాహరణకు, కాలి చిటికిన వ్రేలు అవసరం ఏముందని కొందరు ప్రశ్నించారు, అయితే మనిషి స్థిరంగా నిలబడి ఉండాలంటే అది అవసరమని ఇటీవల కనుగొన్నారు.
5 క్రైస్తవసంఘంలో ఉన్న సభ్యులందరూ ముఖ్యమైన వాళ్లేనని పౌలు చెప్పిన ఉదాహరణ నొక్కిచెబుతుంది. మనుషులకు ఆత్మగౌరవం లేకుండా చేయాలని సాతాను చూస్తుంటాడు, కానీ యెహోవా మాత్రం బలహీనులుగా కనిపించే వాళ్లతో సహా తన సేవకులందరినీ ‘అవశ్యకమైన వాళ్లలా’ చూస్తాడు. (యోబు 4:18, 19) మనం ఆ విషయాన్ని మనసులో ఉంచుకుంటే స్థానిక సంఘంలోనూ ప్రపంచవ్యాప్త సహోదరత్వంలోనూ మనకున్న స్థానాన్ని బట్టి ఆనందిస్తాం. ఉదాహరణకు, అవసరంలో ఉన్న ఓ వృద్ధునికి సహాయం చేసిన ఒకానొక సందర్భాన్ని గుర్తుతెచ్చుకోండి. దానివల్ల ఆయన ప్రయోజనం పొందాడు, అయితే మీరు ప్రయోజనం పొందలేదా? తప్పకుండా పొందివుంటారు. అవును, మనం ఇతరులకు సహాయం చేసినప్పుడు సంతోషాన్ని పొందుతాం. మనం మరింత సహనాన్ని అలవర్చుకుంటాం. మనం సహోదరులను మరింతగా ప్రేమిస్తాం, మరింత శ్రేష్ఠమైన క్రైస్తవులముగా తయారౌతాం. (ఎఫె. 4:15, 16) బలహీనులుగా కనిపించేవాళ్లతో సహా సంఘంలోని ప్రతీ సహోదరుణ్ణి, సహోదరిని మనం ప్రాముఖ్యమైనవాళ్లగా ఎంచాలని యెహోవా కోరుకుంటున్నాడు. మనం అలా ఎంచితే వాళ్లనుండి అతిగా ఆశించం, అప్పుడు సంఘం మొత్తం మరింత ఎక్కువ ప్రేమను చూపించేవిధంగా తయారౌతుంది.
6. “బలహీనులు,” “బలవంతులు” పదాలను పౌలు ఏ ఉద్దేశంతో ఉపయోగించాడు?
6 నిజమే, పౌలు కొంతమంది తోటి క్రైస్తవులను ఉద్దేశిస్తూ “బలహీనులు,” “బలహీనత” వంటి పదాలను ఉపయోగించాడు. ఎందుకంటే, కొందరు అన్యులు క్రైస్తవుల్ని అలా చూశారు. అంతేగానీ ఆ క్రైస్తవులు మిగతా వాళ్లకంటే తక్కువవాళ్లని ఆయన చెప్పడం లేదు. పైగా, కొన్నిసార్లు పౌలు కూడా బలహీనుడై పోయినట్లు భావించాడు. (1 కొరిం. 1:26, 27-29; 2:3) అలాగే, పౌలు “బలవంతుల” గురించి మాట్లాడినప్పుడు కూడా, కొంతమంది క్రైస్తవులు ఇతరులకన్నా గొప్పవాళ్లనే ఉద్దేశంతో ఆయన అలా చెప్పలేదు. (రోమా. 15:1) బదులుగా, అనుభవజ్ఞులైన క్రైస్తవులు సత్యంలో అప్పుడప్పుడే నిలదొక్కుకుంటున్న క్రైస్తవుల విషయంలో సహనంగా ఉండాలని ఆయన చెబుతున్నాడు.
మన అభిప్రాయాన్ని సరిచేసుకోవాలా?
7. అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయకుండా మనం ఎందుకు వెనుకాడుతుండవచ్చు?
7 యెహోవా బలహీనులకు సహాయం చేస్తాడు, మనమూ అలా చేస్తే ఆయన సంతోషిస్తాడు. (కీర్త. 41:1; ఎఫె. 5:1) అయితే, అవసరంలో ఉన్న కొంతమంది మీద మనకు సరైన అభిప్రాయం లేనప్పుడు, వాళ్లకు సహాయం చేయడానికి వెనుకాడుతుంటాం. లేదా సమస్యల్లో ఉన్న అలాంటివాళ్లకు ఏమి చెప్పి ఓదార్చాలో తెలియకపోవడం వల్ల వాళ్లకు దూరంగా ఉండాలని మనకు అనిపించవచ్చు. సింథియా b అనే సహోదరిని ఆమె భర్త వదిలేశాడు, ఆమె ఏమంటుందంటే, “సహోదరసహోదరీలు మీకు దూరంగా ఉంటుంటే, లేక మీరు ఆశిస్తున్నట్లు సన్నిహిత స్నేహితుల్లా మెలగకపోతుంటే, మనసు గాయపడుతుంది. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు నలుగురు మీకు తోడుగా ఉండాలి.” ఇతరులు దూరంగా ఉంచితే కలిగే బాధ ఎలా ఉంటుందో కీర్తనకర్త దావీదుకు కూడా తెలుసు.—కీర్త. 31:12.
8. ఇతరులను మరింత బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలి?
8 అనారోగ్యం, సత్యంలో లేని కుటుంబ సభ్యులతో జీవించడం, కృంగుదల వంటి కష్టాల కారణంగా మన ప్రియమైన సహోదరసహోదరీలు బలహీనులు అవుతున్నారని గుర్తుపెట్టుకుంటే, వాళ్లను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతాం. ఏదో ఒక రోజు మనకు కూడా ఆ కష్టాలు రావచ్చు. ఒకప్పుడు ఐగుప్తులో బీదలుగా, బలహీనులుగా ఉన్న ఇశ్రాయేలీయులు, కష్టాల్లో ఉన్న తమ సహోదరుల పట్ల తమ ‘హృదయం కఠినపరుచుకోకూడదు’ అని వాగ్దాన దేశంలోకి ప్రవేశించే ముందు యెహోవా వాళ్లకు గుర్తుచేశాడు. బీదలుగా, బలహీనులుగా ఉన్న తోటి సహోదరులకు ఇశ్రాయేలీయులు సహాయం చేయాలని యెహోవా కోరుకున్నాడు.—ద్వితీ. 15:7, 11; లేవీ. 25:35-38.
9. కష్టాల్లో చిక్కుకున్న వాళ్లకు సహాయం చేసేటప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏమిటి? ఉదాహరణతో చెప్పండి.
9 కష్టాల్లో చిక్కుకున్న వాళ్లను విమర్శించే బదులు, అనుమానించే బదులు వాళ్లకు మనం ఆధ్యాత్మిక సేదదీర్పు అందించాలి. (యోబు 33:6, 7; మత్త. 7:1) ఓ ఉదాహరణ చెప్పుకోవాలంటే, మోటార్‌సైకిల్ నడుపుతున్న ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడితే, ఆయన్ను హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొచ్చారని అనుకోండి. అప్పుడు డాక్టర్లు, నర్సులు ఆ ప్రమాదానికి కారణం ఎవరైవుంటారోనని చర్చిస్తూ కాలయాపన చేస్తారా? లేదు, వాళ్లు వెంటనే వైద్యసహాయం అందిస్తారు. అలాగే తోటి విశ్వాసి వ్యక్తిగత సమస్యలవల్ల బలహీనపడితే మనం చేయాల్సిన మొదటి పని, వాళ్లకు ఆధ్యాత్మిక సహాయం అందించడమే.—1 థెస్సలొనీకయులు 5:14 చదవండి.
10. చూడ్డానికి బలహీనంగా ఉన్న కొంతమంది నిజానికి “విశ్వాసమందు భాగ్యవంతులుగా” ఎలా ఉన్నారు?
10 మనం ఒక్కక్షణం ఆగి మన సహోదరుల పరిస్థితి గురించి ఆలోచిస్తే, వాళ్ల బలహీనతను వేరే కోణంలోనుండి చూడగలుగుతాం. సంవత్సరాల తరబడి కుటుంబంలో వ్యతిరేకత ఎదుర్కొంటున్న సహోదరీల గురించి ఆలోచించండి. వాళ్లలో చాలామంది చూడ్డానికి దీనంగా, బలహీనంగా ఉండవచ్చు, అయినా వాళ్లు అసాధారణమైన విశ్వాసాన్ని, మనోబలాన్ని చూపించడం లేదా? తన పిల్లలతో క్రమంగా కూటాలకు వస్తున్న ఓ ఒంటరి తల్లిని చూసినప్పుడు, ఆమె విశ్వాసాన్ని, దృఢసంకల్పాన్ని చూసి మీరు ప్రేరణ పొందట్లేదా? పాఠశాలలో, కాలేజీలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా సత్యాన్ని హత్తుకుని ఉన్న యౌవనుల మాటేమిటి? అలాంటివాళ్లు చూడ్డానికి బలహీనంగా ఉండవచ్చుగానీ, అనుకూల పరిస్థితులు ఉన్న మనలో కొంతమందివలె వాళ్లు కూడా “విశ్వాసమందు భాగ్యవంతులుగా” ఉన్నారని మనం వినయంగా ఒప్పుకుంటాం.—యాకో. 2:5.
యెహోవాలా చూడడం నేర్చుకోండి
11, 12. (ఎ) మానవ బలహీనతలను యెహోవా చూస్తున్నట్లే చూడడానికి మనకేది సహాయం చేస్తుంది? (బి) యెహోవా అహరోనుతో వ్యవహరించిన విధానం నుండి ఏమి నేర్చుకోవచ్చు?
11 యెహోవా తన సేవకులతో ఎలా వ్యవహరించాడో పరిశీలిస్తే, మానవ బలహీనతలను ఆయనలా చూడడం నేర్చుకుంటాం. (కీర్తన 130:3 చదవండి.) ఉదాహరణకు, అహరోను బంగారు దూడను చేసినప్పుడు మోషేతోపాటు మీరు కూడా ఉండివుంటే, అహరోను సాకులు చెప్పినప్పుడు మీకెలా అనిపించివుండేది? (నిర్గ. 32:21-24) అన్య స్త్రీని పెళ్లి చేసుకున్న మోషేను, తన అక్క మిర్యాము ప్రోద్బలంతో అహరోను విమర్శించినప్పుడు ఆయన వైఖరి చూసి మీరు ఏమనుకుని ఉండేవాళ్లు? (సంఖ్యా. 12:1, 2) యెహోవా మెరీబా వద్ద అద్భుతరీతిలో నీళ్లు రప్పించినప్పుడు, మోషే, అహరోనులు ఆయనను ఘనపర్చని సందర్భంలో మీరుండివుంటే ఎలా స్పందించేవాళ్లు?—సంఖ్యా. 20:10-13.
12 పైన చెప్పిన ప్రతీ సందర్భంలో కావాలనుకుంటే యెహోవా అహరోనును అక్కడికక్కడే శిక్షించివుండేవాడు. అయితే అహరోను చెడ్డవాడు కాడని, తప్పంతా ఆయనదే కాదని యెహోవాకు తెలుసు. తానున్న పరిస్థితుల వల్ల, ఇతరుల ఒత్తిడి వల్ల అహరోను తప్పులు చేశాడని అర్థమౌతుంది. అయితే ఆ తప్పులను ఆయనకు తెలియజేసినప్పుడు, ఆయన వెంటనే వాటిని ఒప్పుకున్నాడు, యెహోవా తీర్పులకు మద్దతిచ్చాడు. (నిర్గ. 32:26; సంఖ్యా. 12:11; 20:23-27) అందుకే, అహరోను విశ్వాసంమీద, ఆయన పశ్చాత్తాప వైఖరిమీద యెహోవా దృష్టి పెట్టాడు. శతాబ్దాల తర్వాత కూడా బైబిలు అహరోనును, ఆయన సంతతిని నమ్మకస్థులైన యెహోవా సేవకులుగా వర్ణించింది.—కీర్త. 115:10-12; 135:19, 20.
13. ఇతరుల బలహీనతల విషయంలో మన అభిప్రాయాన్ని ఎలా పరిశీలించుకోవచ్చు?
13 యెహోవాలా చూడడం నేర్చుకోవాలంటే, బలహీనులుగా కనిపిస్తున్నవాళ్ల విషయంలో మన అభిప్రాయం ఎలా ఉందో పరిశీలించుకోవాలి. (1 సమూ. 16:7) ఉదాహరణకు, ఒక యువకుడు/యువతి క్రైస్తవులకు తగని వినోదం ఎంచుకున్నప్పుడు లేదా ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తున్నప్పుడు మీరెలా స్పందిస్తారు? వాళ్లను అతిగా విమర్శించే బదులు, పరిణతికి ఎదిగేలా వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో ఆలోచిస్తారా? మీరలా సహాయం చేస్తే, మీరు వాళ్లతో ఇంకా సహనంగా ఉండగలుగుతారు, వాళ్ల మీద మరింత ప్రేమ చూపగలుగుతారు.
14, 15. (ఎ) ఏలీయా ధైర్యం కోల్పోయినప్పుడు యెహోవా ఎలా భావించాడు? (బి) ఏలీయా అనుభవం నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?
14 కృంగిపోయినవాళ్ల గురించి యెహోవా ఎలా భావిస్తాడు? అలాంటి స్థితిలో ఉన్న తన సేవకుల్లో ఒకడైన ఏలీయాకి ఆయన ఎలా సహాయం చేశాడో పరిశీలించండి. ఆయన ఓ సందర్భంలో ధైర్యంగా 450 మంది బయలు ప్రవక్తలను సవాలు చేసినా, యెజెబెలు రాణి తన ప్రాణం తీయాలనుకుంటుందని తెలుసుకున్నప్పుడు భయంతో దూరంగా పారిపోయాడు. సుమారు 150 కిలోమీటర్లు నడిచి బెయేర్షెబాకు వెళ్లి, అక్కడి నుండి అరణ్యం లోపలికి వెళ్లాడు. మండుటెండలో అంత దూరం నడిచేసరికి సొమ్మసిల్లిన ఏలీయా, ఒక చెట్టు కింది కూర్చుని “నా ప్రాణము తీసికొనుము” అని యెహోవాకు ప్రార్థించాడు.—1 రాజు. 18:19; 19:1-4.
15 నమ్మకమైన తన ప్రవక్త అలా నిరాశలో కూరుకుపోయినప్పుడు యెహోవా ఎలా భావించాడు? ఏలీయా కృంగిపోయి, ధైర్యం కోల్పోయాడు కాబట్టి యెహోవా ఆయనను తిరస్కరించాడా? ఎంతమాత్రం కాదు! యెహోవా ఏలీయా పరిస్థితిని అర్థం చేసుకుని ఒక దేవదూతను పంపించాడు. ఆ దేవదూత రెండుసార్లు ఏలీయాకు భోజనం ఏర్పాటు చేశాడు, అలా ఏలీయా తన ప్రయాణాన్ని కొనసాగించడానికి శక్తి పొందాడు. (1 రాజులు 19:5-8 చదవండి.) అవును, ఏలీయాకు ఎలాంటి నిర్దేశాలు ఇవ్వకముందే, యెహోవా ఆయన చెప్పింది విని ఆయన్ను పోషించడానికి ఏర్పాటు చేశాడు.
16, 17. ఏలీయా మీద యెహోవా చూపించిన శ్రద్ధను మనం ఎలా అనుకరించవచ్చు?
16 శ్రద్ధగల మన దేవుణ్ణి మనం ఎలా అనుకరించవచ్చు? మనం సలహాలివ్వడానికి తొందర పడకూడదు. (సామె. 18:13) ఓ సహోదరుడు లేదా సహోదరి కృంగిపోతే లేదా తాము పనికిరానివాళ్లమని అనుకుంటుంటే, మీరు ముందుగా చేయాల్సిన పని వాళ్లు చెప్పేది వినడం, వాళ్లపట్ల మీకు శ్రద్ధ ఉందని చూపించడం. (1 కొరిం. 12:23) అప్పుడు వాళ్లకు నిజంగా అవసరమైనదేంటో తెలుసుకుని, దానికి తగ్గట్లుగా సహాయం చేయగలుగుతారు.
17 పైన చూసిన సింథియా అనుభవాన్ని మళ్లీ చూద్దాం. భర్త వదిలేసినప్పుడు ఆమె, ఇద్దరు కూతుళ్లు ఒంటరివాళ్లమై పోయామన్నట్లు భావించారు. అప్పుడు తోటి సాక్షులు ఏమి చేశారు? ఆమె ఇలా వివరిస్తోంది, “జరిగిన విషయాన్ని ఫోన్లో తోటి సహోదరసహోదరీలకు చెప్పినప్పుడు, వాళ్లు 45 నిమిషాల్లోనే మా ఇంట్లో ఉన్నారు. వాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు. రెండు మూడు రోజులదాకా వాళ్లు మాతోపాటే ఉన్నారు. మేము సరిగ్గా భోజనం చేయకపోవడం, తీవ్రంగా బాధపడడం చూసి వాళ్లు కొంతకాలంపాటు మమ్మల్ని వాళ్ల ఇంట్లో ఉంచుకున్నారు.” వాళ్లు చేసిన ఆ సహాయం చూస్తే, “సహోదరుడైనను సహోదరియైనను దిగంబరులై ఆ నాటికి భోజనము లేక యున్నప్పుడు, మీలో ఎవడైనను శరీరమునకు కావలసినవాటిని ఇయ్యక—సమాధానముగా వెళ్లుడి, చలి కాచుకొనుడి, తృప్తిపొందుడని చెప్పినయెడల ఏమి ప్రయోజనము? ఆలాగే విశ్వాసము క్రియలులేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును” అని యాకోబు రాసిన మాటలు మనకు గుర్తురావచ్చు. (యాకో. 2:15-17) సంఘంలోని సహోదరసహోదరీలు అందించిన మద్దతుతో సింథియా, ఆమె ఇద్దరు పిల్లలు బలపడి, ఆ సంఘటన జరిగిన ఆరు నెలలకే సహాయ పయినీరు సేవ చేయగలిగారు.—2 కొరిం. 12:10.
ఎంతోమందికి ప్రయోజనాలు
18, 19. (ఎ) తాత్కాలికంగా బలహీనులైన వాళ్లకు మనం ఎలా సహాయం చేయవచ్చు? (బి) బలహీనులకు సహాయం చేసినప్పుడు ఎవరు ప్రయోజనం పొందుతారు?
18 మనం ఎక్కువ కాలంగా అనారోగ్యంతో బాధపడుతుంటే కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాగే ఏదో తప్పు చేయడంవల్ల లేదా సమస్యలో చిక్కుకోవడంవల్ల బలహీనమైన ఓ క్రైస్తవుడు తిరిగి ఆధ్యాత్మిక శక్తిని సంపాదించుకోవడానికి కూడా సమయం పట్టవచ్చు. నిజమే, ఆయన వ్యక్తిగత అధ్యయనం, ప్రార్థన, ఇతర క్రైస్తవ కార్యకలాపాల ద్వారా తిరిగి తన విశ్వాసాన్ని బలపర్చుకోవాలి. అయితే అప్పటివరకు ఆయన విషయంలో మనం సహనం చూపిస్తామా? ఆయన అలా ఆధ్యాత్మికంగా కోలుకుంటున్నప్పుడు మనం ఆయనను ప్రేమిస్తూనే ఉంటామా? తాత్కాలికంగా బలహీనమైనవాళ్లు, తాము విలువైనవాళ్లమని, సహోదరులు తమను ప్రేమిస్తున్నారని నమ్మేలా సహాయం చేయడానికి కృషి చేస్తామా?—2 కొరిం. 8:8.
19 మన సహోదరులకు సహాయం చేసేటప్పుడు, ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తామని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. అలా చేస్తే సహానుభూతి, సహనం చూపించే మన సామర్థ్యాన్ని కూడా పెంచుకుంటాం. అయితే ప్రయోజనం పొందేది మనం మాత్రమే కాదు. దానివల్ల మొత్తం సంఘం మరింత ప్రేమ, ఆప్యాయత చూపించే విధంగా తయారౌతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా, ప్రతి ఒక్కరినీ విలువైనవాళ్లలా చూసే యెహోవాను మనం అనుకరిస్తాం. అవును, “బలహీనులను సంరక్షింపవలెను” అని బైబిలు ఇస్తున్న ప్రోత్సాహాన్ని పాటించడానికి మనకు ఎన్నో మంచి కారణాలు ఉన్నాయి.—అపొ. 20:35.