కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

విడాకులు పొందిన తోటి విశ్వాసులకు సహాయం చేయడం ఎలా?

విడాకులు పొందిన తోటి విశ్వాసులకు సహాయం చేయడం ఎలా?

మీకు తెలిసినవాళ్లలో విడాకులు తీసుకున్నవాళ్లు కూడా బహుశా ఉండవచ్చు. ఎందుకంటే విడాకులు తీసుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోతోంది. ఉదాహరణకు, పోలాండ్‌ దేశంలో నిర్వహించిన ఓ పరిశోధన ప్రకారం, 30వ పడిలో ఉన్న చాలామంది 3 నుండి 6 ఏళ్లు దాంపత్య జీవితం గడిపిన తర్వాత ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు. అయితే విడాకులు తీసుకుంటున్నది ఆ వయస్సు వాళ్లు మాత్రమే కాదు.

నిజానికి, [ఐరోపాలో] ప్రతీ రెండు జంటల్లో ఒక జంట విడాకులు తీసుకుంటుందని గణాంకాలు చూపిస్తున్నట్లు స్పెయిన్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఫ్యామిలి పాలసీ చెబుతోంది. అభివృద్ధి చెందిన ఇతర దేశాల్లో కూడా పరిస్థితి అలాగే ఉంది.

తీవ్రమైన భావాలు ముంచెత్తడం

విడాకులు తీసుకున్నప్పుడు ఏమి జరుగుతుంది? తూర్పు ఐరోపాలోని, అనుభవజ్ఞురాలైన ఓ వివాహ సలహాదారురాలు ఇలా చెబుతోంది, “విడాకులు అనేవి, అప్పటికే జరిగిపోయిన వాటిని, అంటే ఇద్దరి మధ్య ఉన్న బంధం తెగిపోవడం, విడిపోవడం వంటి వాటిని చట్టబద్ధం చేస్తాయి. అవి భావోద్వేగపరంగా తీవ్ర బాధను కలిగిస్తాయి. ఆ తర్వాత కోపం, పశ్చాత్తాపం, నిరుత్సాహం, నిరాశ, అవమానం లాంటి తీవ్రమైన, బలమైన భావాలు కలుగుతాయి.” అందువల్ల కొన్నిసార్లు ఆత్మహత్యా ఆలోచనలు కూడా వస్తుంటాయి. “కోర్టు విడాకులను మంజూరు చేశాక జీవితంలోని తర్వాతి దశ మొదలౌతుంది. జీవితమంతా శూన్యం అయిపోయినట్లు, ఒంటరి వాళ్లమైపోయామన్నట్లు భావిస్తూ, ‘విడాకులు తీసుకున్నాను, ఇప్పుడు నా స్థానం ఏమిటి? నా జీవితానికి అసలు అర్థముందా?’ అని వాళ్లు అనుకుంటారు.”

కొన్ని సంవత్సరాల క్రితం తను ఎలా భావించిందో గుర్తుచేసుకుంటూ ఈవా అనే మహిళ ఇలా అంటోంది, “విడాకులు మంజూరైన తర్వాత నా సహోద్యోగులు, ఇరుగుపొరుగువాళ్లు నన్ను ‘విడాకులు తీసుకున్న ఆవిడ’ అనేవాళ్లు. నేను అవమాన భారంతో కుమిలిపోయాను. ఎప్పుడూ కోపంగా ఉండేదాన్ని. ఇక నాకు మిగిలిన ఇద్దరు చిన్నపిల్లలకు నేనే అమ్మ, నాన్న అవ్వాల్సివచ్చింది.” a 12 సంవత్సరాలు సంఘపెద్దగా సేవచేసిన ఆడామ్‌ అనే సహోదరుడు ఇలా చెబుతున్నాడు, “నేను నా ఆత్మ గౌరవాన్ని ఎంతగా కోల్పోయానంటే కొన్నిసార్లు కోపంతో ఊగిపోయేవాణ్ణి, అందరికి దూరంగా ఉండాలనిపించేది.”

మళ్లీ మామూలు స్థితికి వచ్చేందుకు పోరాటం

విడాకులు అయ్యాక భవిష్యత్తు గురించిన ఆందోళనతో ఉక్కిరిబిక్కిరైన కొందరు మళ్లీ మామూలు జీవితం గడపడానికి ఎంతో పోరాడాల్సి వచ్చింది, కొంతమందికి అలా చేయడానికి ఏళ్లు పట్టింది. ఇతరులు తమను పట్టించుకోవడం లేదని అలాంటివాళ్లు అనుకోవచ్చు. అంతేకాక, పత్రికలకు ఆర్టికల్స్‌ రాసే ఓ మహిళ చెబుతున్నట్లు, విడాకులు పొందిన వాళ్లు “తమ అలవాట్లను మార్చుకుని, సమస్యల్ని సొంతగా పరిష్కరించుకోవడం నేర్చుకోవాలి.”

స్టనిస్లా ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “మేము విడాకులు తీసుకున్నప్పుడు, నా మాజీ భార్య నా ఇద్దరు కూతుళ్లను చూడనివ్వలేదు. దాంతో ఇక నేనంటే ఎవ్వరికీ శ్రద్ధ లేదని, చివరికి యెహోవా కూడా నన్ను వదిలేశాడని అనిపించింది. నాకు బ్రతకాలనిపించలేదు. కానీ కాలం గడుస్తుండగా, నేను ఎంత తప్పుగా ఆలోచించానో అర్థమైంది.” విడాకులు తీసుకున్న వాండా అనే మహిళ కూడా తన భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆందోళనతో సతమతమైంది. ఆమె ఇలా అంటోంది, “కొన్నిరోజులు గడిచాక నా చుట్టు ఉన్న ప్రజలు, చివరికి నా తోటి సహోదరసహోదరీలు కూడా నన్నూ నా పిల్లల్నీ ఏమాత్రం పట్టించుకోరని అప్పట్లో బలంగా అనుకున్నాను. కానీ సహోదరసహోదరీలు కొండంత అండగా ఎలా నిలబడ్డారో, నా పిల్లలు యెహోవా ఆరాధకులు అయ్యేలా పెంచడానికి నేను చేసిన ప్రయత్నాలకు ఎలా మద్దతిచ్చారో ఇప్పుడు స్పష్టంగా చూడగలుగుతున్నాను.”

విడాకులైన తర్వాత కొంతమంది ప్రతికూల భావాల్లో కూరుకుపోతారని ఆ మాటలనుబట్టి అర్థమౌతుంది. తమకు అంత విలువ లేదని, ఇతరుల అవధానం పొందడానికి తాము అర్హులు కామని అనుకుంటూ వాళ్లు తమ గురించి తక్కువగా భావించుకుంటారు. దానితోపాటు వాళ్లు, తమ చుట్టు ఉన్నవాళ్లలో ఎక్కువగా తప్పులు పడుతుంటారు. ఫలితంగా, సంఘంలోని వాళ్లకు తమమీద ఏమాత్రం ప్రేమ, జాలి లేవని అనుకోవడం మొదలుపెడతారు. అయితే, తమపై తోటి సహోదరసహోదరీలు నిజంగా శ్రద్ధ చూపిస్తారనే విషయాన్ని విడాకులు పొందిన వాళ్లు ఏదో రోజు అర్థం చేసుకుంటారని స్టనిస్లా, వాండాల అనుభవాలనుబట్టి తెలుస్తుంది. నిజానికి, విడాకులు పొందినవాళ్లు మొదట్లో గుర్తించకపోయినా, వాళ్లపట్ల తోటి క్రైస్తవులు అసాధారణమైన శ్రద్ధను చూపించారు.

ఒంటరితనం, ఇతరులు దూరంగా ఉంచారనే భావాలు కలిగినప్పుడు . . .

విడాకులు పొందిన తోటి ఆరాధకులకు మనం ఎంత సహాయం చేస్తున్నా వాళ్లు అప్పుడప్పుడు ఒంటరితనంతో బాధపడతారని గుర్తుంచుకోండి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న సహోదరీలు, తమను ఎక్కువమంది పట్టించుకోవడం లేదని అనుకోవచ్చు. అలీట్సా ఇలా ఒప్పుకుంటుంది, “నేను విడాకులు తీసుకుని ఎనిమిది ఏళ్లు గడిచాయి. అయినా, నేనంత విలువైనదాన్ని కానని ఇప్పటికీ కొన్నిసార్లు అనిపిస్తుంటుంది. అలాంటి సమయాల్లో, అందరికీ దూరంగా వెళ్లిపోయి ఏడవాలనిపిస్తుంది, నా మీద నాకే జాలేస్తుంది.”

విడాకులు తీసుకున్నవాళ్లలో ఇలాంటి భావాలు కలగడం సహజమే అయినా, నలుగురికీ దూరంగా ఉండవద్దని బైబిలు ఉపదేశిస్తుంది. ఆ ఉపదేశానికి విరుద్ధంగా ప్రవర్తిస్తే “లెస్సైన జ్ఞానమును” తిరస్కరించినట్లే. (సామె. 18:1) అయితే, పరాయి స్త్రీ నుండి లేదా పురుషుని నుండి అదేపనిగా సలహాలను, ఓదార్పును పొందకుండా జాగ్రత్తగా ఉండడం కూడా లెస్సైన జ్ఞానానికి నిదర్శనమని ఒంటరితనంతో బాధపడుతున్న వాళ్లు అర్థంచేసుకోవాలి. అలా ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తికి దగ్గరవ్వాలనే అనుచిత ఆలోచనలకు తావివ్వరు.

విడాకులు పొందిన మన తోటి సహోదరసహోదరీలు, భవిష్యత్తు గురించిన ఆందోళనతో, ఒంటరితనంతో లేదా ఇతరులు తమను దూరంగా ఉంచారనే భావాలతో సతమతమౌతుండవచ్చు. అలాంటివి సహజమే అయినా వాటిని తట్టుకోవడం కష్టమని మనం అర్థం చేసుకుని, వాటితో పోరాడుతున్న సహోదరసహోదరీలకు నమ్మకంగా మద్దతునివ్వడం ద్వారా యెహోవాను అనుకరించాలి. (కీర్త. 55:22; 1 పేతు. 5:6, 7) మనం ఏ సహాయం చేసినా అది వాళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుందనే నమ్మకంతో ఉండండి. నిస్సందేహంగా, వాళ్లు సంఘంలోనే ఉన్న నిజమైన స్నేహితుల నుండి ఎంతో మద్దతును పొందుతారు.—సామె. 17:17; 18:24.

a అసలు పేర్లు కావు.