యెహోవా “తనవారిని ఎరుగును”
“ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైనవాడే.”—1 కొరిం. 8:3.
1. కొంతమంది దేవుని ప్రజలు తమను తాము మోసపర్చుకున్న ఒక వృత్తాంతాన్ని చెప్పండి. (ప్రారంభ చిత్రం చూడండి.)
ఒకరోజు ఉదయం, ప్రధాన యాజకుడైన అహరోను ధూపార్తిని పట్టుకొని యెహోవా గుడారపు ద్వారం దగ్గర నిలబడివున్నాడు. దగ్గర్లో కోరహు, ఆయనతోపాటు 250 మంది కూడా తమ సొంత ధూపార్తులను పట్టుకొని యెహోవాకు ధూపం వేస్తున్నారు. (సంఖ్యా. 16:16-18) చూడ్డానికి అందరూ యెహోవాను యథార్థంగా ఆరాధిస్తున్న వాళ్లలాగే కనిపించవచ్చు. అయితే, వాళ్లు అహరోనులాంటి వాళ్లు కాదుగానీ, యాజకత్వాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్న గర్విష్ఠులు. (సంఖ్యా. 16:1-11) దేవుడు తమ ఆరాధనను అంగీకరిస్తాడనే భ్రమలో వాళ్లు ఉన్నారు. కానీ హృదయాలను చదవగల, వేషధారణను పసిగట్టగల యెహోవాను అలాంటి ఆలోచనా విధానంతో వాళ్లు అవమానించారు.—యిర్మీ. 17:10.
2. మోషే ఏమి చెప్పాడు? ఆ మాటలు ఎలా నిజమయ్యాయి?
2 మోషే ఆ ముందు రోజే, ‘తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో యెహోవా తెలియజేస్తాడు’ అని చెప్పాడు. (సంఖ్యా. 16:5) “యెహోవాయొద్దనుండి అగ్ని బయలుదేరి ధూపార్పణమును తెచ్చిన [కోరహును,] ఆ రెండువందల ఏబదిమందిని కాల్చి” వేసినప్పుడు యథార్థవంతులెవరో, అబద్ధ ఆరాధకులు ఎవరో యెహోవా స్పష్టం చేశాడు. (సంఖ్యా. 16:35; 26:10) అదే సమయంలో, యెహోవా అహరోను ప్రాణాన్ని కాపాడి ఆయన నిజమైన ప్రధాన యాజకుడని, తన యథార్థ ఆరాధకుడని చూపించాడు.—1 కొరింథీయులు 8:3 చదవండి.
3. (ఎ) పౌలు కాలంలో ఎలాంటి పరిస్థితి తలెత్తింది? (బి) మోషే కాలంలోని తిరుగుబాటుదారులతో యెహోవా వ్యవహరించిన తీరు నుండి మనమేమి నేర్చుకుంటాం?
3 దాదాపు 1,500 సంవత్సరాల తర్వాత, అపొస్తలుడైన పౌలు కాలంలో కూడా అలాంటి పరిస్థితే తలెత్తింది. క్రైస్తవులమని చెప్పుకునే కొంతమంది అబద్ధ సిద్ధాంతాలను బోధించడం మొదలుపెట్టారు, అయినా వాళ్లు సంఘంతోనే సహవసిస్తున్నారు. పైపైన చూసేవాళ్లకు ఈ మతభ్రష్టులు, సంఘంలోని ఇతరులు ఒకేలా కనిపించవచ్చు. అయితే వాళ్ల మతభ్రష్టత్వం నమ్మకమైన క్రైస్తవులకు ముప్పుగా మారింది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల వంటి వీళ్లు ‘కొందరి విశ్వాసాన్ని చెరపడం’ మొదలుపెట్టారు. (2 తిమో. 2:16-18) అయితే, యెహోవా పైపైన మాత్రమే చూసే వ్యక్తి కాదని పౌలుకు తెలుసు. శతాబ్దాల క్రితం తిరుగుబాటుదారులైన కోరహుతో, ఆయన మద్దతుదారులతో యెహోవా వ్యవహరించిన తీరు నుండి పౌలు ఆ విషయాన్ని అర్థంచేసుకుని ఉండవచ్చు. దీనికి సంబంధించి, లేఖనాల్లో ఉన్న ఓ ఆసక్తికరమైన వృత్తాంతాన్ని పరిశీలించి, మనకు ఉపయోగపడే పాఠాలను నేర్చుకుందాం.
“యెహోవానైన నేను మార్పులేనివాడను”
4. పౌలుకు ఏ నమ్మకం ఉంది? ఆయన దాన్ని తిమోతికి రాసిన పత్రికలో ఎలా వ్యక్తంచేశాడు?
4 ఎవరు వేషధారులో, ఎవరు నిజమైన ఆరాధకులో యెహోవా గుర్తించగలడని పౌలు నమ్మాడు. పౌలు దైవప్రేరణతో తిమోతికి పత్రిక రాస్తున్నప్పుడు ఎంచుకున్న పదాల్లో ఆ బలమైన నమ్మకాన్ని వ్యక్తంచేశాడు. మతభ్రష్టులు అప్పటికే సంఘంలోని కొంతమందికి చేస్తున్న ఆధ్యాత్మిక హాని గురించి చెప్పిన తర్వాత పౌలు ఇలా రాశాడు, “అయినను దేవునియొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది. —ప్రభువు తనవారిని ఎరుగును అనునదియు—ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది.”—2 తిమో. 2:17-19.
5, 6. “దేవునియొక్క స్థిరమైన పునాది” అని పౌలు ఉపయోగించిన వాక్యం ప్రాముఖ్యత ఏమిటి? ఆ వాక్యం తిమోతి మీద ఎలాంటి ప్రభావం చూపించింది?
5 ఈ లేఖనంలో పౌలు ఎంపిక చేసుకున్న పదాల ప్రాముఖ్యత ఏమిటి? బైబిల్లో ఈ ఒక్కచోటే “దేవునియొక్క స్థిరమైన పునాది” అనే వాక్యం ఉంది. బైబిలు “పునాది” అనే పదాన్ని వివిధమైన వాటిని సూచించడానికి ఉపయోగించింది, వాటిలో ప్రాచీన ఇశ్రాయేలు రాజధానియైన యెరూషలేము ఒకటి. (కీర్త. 87:1, 2) యెహోవా సంకల్పంలో యేసు పాత్రను కూడా బైబిలు పునాదితో పోల్చింది. (1 కొరిం. 3:11; 1 పేతు. 2:6) “దేవునియొక్క స్థిరమైన పునాది” గురించి రాసినప్పుడు పౌలు మనసులో ఏముంది?
6 సంఖ్యాకాండము 16:5లో కోరహు, ఆయన మద్దతుదారుల గురించి మోషే పలికిన మాటలను పౌలు ఎత్తిరాస్తున్న సందర్భంలో “దేవునియొక్క స్థిరమైన పునాది” గురించి ప్రస్తావించాడు. యెహోవా తిరుగుబాటుదారులను పసిగట్టి, వాళ్ల చర్యలను అడ్డుకోగలడని తిమోతికి గుర్తుచేస్తూ ప్రోత్సహించేందుకే పౌలు ఆ సందర్భం గురించి ప్రస్తావించివుంటాడు. యెహోవా సంకల్పాన్ని కోరహు మార్చలేకపోయాడు, అలాగే సంఘంలోని మతభ్రష్టులు కూడా యెహోవా సంకల్పాన్ని ఏమాత్రం మార్చలేరు. “దేవునియొక్క స్థిరమైన పునాది” దేన్ని సూచిస్తుందో పౌలు సవివరంగా చెప్పలేదు. అయితే, పౌలు ఉపయోగించిన వాక్యం మాత్రం యెహోవా మార్గాల విషయంలో తిమోతికి తప్పకుండా నమ్మకం, విశ్వాసం కలిగించాయి.
7. యెహోవా ఎల్లప్పుడూ నీతిగా, విశ్వసనీయంగా ఉంటాడని మనం ఎందుకు చెప్పవచ్చు?
7 యెహోవా ఉన్నతమైన సూత్రాలు ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. “యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును” అని కీర్తన 33:11 చెబుతుంది. యెహోవా పరిపాలన, ఆయన యథార్థ ప్రేమ, నీతి, విశ్వసనీయత నిరంతరం ఉంటాయని ఇతర లేఖనాలు చెబుతున్నాయి. (నిర్గ. 15:18; కీర్త. 106:1;112:9; 117:2) “యెహోవానైన నేను మార్పులేనివాడను” అని మలాకీ 3:6లో ఆయన చెబుతున్నాడు. యాకోబు 1:17 చెబుతున్నట్లు, యెహోవాలో “చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.”
యెహోవాపై విశ్వాసాన్ని బలపర్చే “ముద్ర”
8, 9. “దేవునియొక్క స్థిరమైన పునాది” మీద ఉన్న సందేశాల నుండి యెహోవా ప్రజలు ఏ పాఠం నేర్చుకోవచ్చు?
8 పౌలు, 2 తిమోతి 2:19లో ఉపయోగించిన పదచిత్రం, ఓ సందేశం ముద్రించబడివున్న పునాదిని వర్ణిస్తుంది. ప్రాచీన కాలాల్లో, ఒక భవనం పునాదిమీద దాన్ని నిర్మించిన వాళ్ల పేరుగానీ లేదా దాని యజమాని పేరుగానీ చెక్కడం సర్వసాధారణం. ఈ దృష్టాంతాన్ని వాడిన మొట్టమొదటి బైబిలు రచయిత పౌలే. a “దేవునియొక్క స్థిరమైన పునాది” మీదున్న ముద్రలో రెండు సందేశాలు ఉన్నాయి. మొదటిది, “ప్రభువు [“యెహోవా,” NW] తనవారిని ఎరుగును.” రెండవది, “ప్రభువు [“యెహోవా,” NW] నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతినుండి తొలగిపోవలెను.” అవి, సంఖ్యాకాండము 16:5లోని మాటల్ని మనకు గుర్తుచేస్తాయి.—చదవండి.
9 “దేవునియొక్క స్థిరమైన పునాది” మీద ఉన్న సందేశాల నుండి యెహోవా ప్రజలు ఏ పాఠం నేర్చుకోవచ్చు? యెహోవా విలువలు, సూత్రాలు రెండు ప్రాథమిక సత్యాలపై ఆధారపడి ఉన్నాయి, అవి: (1) తనకు యథార్థంగా ఉన్నవాళ్లను యెహోవా ప్రేమిస్తాడు, (2) యెహోవా దుర్నీతిని ద్వేషిస్తాడు. అయితే, ఈ పాఠానికీ సంఘంలోని మతభ్రష్టత్వానికీ సంబంధం ఏమిటి?
10. మతభ్రష్టుల ప్రవర్తన పౌలు కాలంలో కొంతమంది నమ్మకస్థుల మీద ఎలాంటి ప్రభావం చూపించింది?
10 తిమోతి అలాగే ఇతర నమ్మకమైన వాళ్లు, తమ మధ్యవున్న మతభ్రష్టుల ప్రవర్తనకు కలవరపడి ఉండవచ్చు. సంఘంలో అటువంటి వాళ్లను ఎందుకు ఉండనిస్తున్నారని కొంతమంది క్రైస్తవులు బహుశా అడిగివుండవచ్చు. ‘తనను యథార్థంగా ఆరాధిస్తున్నవాళ్లు ఎవరో, వేషధారణతో ఆరాధిస్తున్న మతభ్రష్టులు ఎవరో యెహోవాకు నిజంగా తెలియదా?’ అని కొందరు నమ్మకమైన వాళ్లు అనుకొనివుండవచ్చు.—అపొ. 20:29, 30.
11, 12. పౌలు రాసిన పత్రిక తిమోతి విశ్వాసాన్ని నిస్సందేహంగా ఎలా బలపర్చింది?
11 పౌలు రాసిన పత్రిక ఖచ్చితంగా తిమోతి విశ్వాసాన్ని బలపర్చి ఉంటుంది. ఎందుకంటే కోరహు, ఆయన అనుచరులు వేషధారులనే విషయం యెహోవా గతంలో స్పష్టం చేశాడని పౌలు తిమోతికి గుర్తుచేశాడు. ఆయన వాళ్లను తిరస్కరించి, నాశనం చేశాడు కూడా, అయితే అహరోనుకు మాత్రం తన ఆమోదం ఉందని చూపించాడు. మరో మాటలో చెప్పాలంటే, తమ మధ్య అబద్ధ క్రైస్తవులు ఉన్నప్పటికీ మోషే కాలంలో చేసినట్లుగానే, తన నిజమైన ప్రజలు ఎవరో యెహోవా గుర్తిస్తాడని పౌలు చెబుతున్నాడు.
12 యెహోవా ఎప్పటికీ మారడు, ఆయనను నమ్మవచ్చు. ఆయన చెడుతనాన్ని ద్వేషిస్తున్నాడు, పశ్చాత్తాపపడని పాపులకు ఆయన తగినకాలంలో తీర్పుతీరుస్తాడు. అబద్ధ క్రైస్తవుల చెడు ప్రభావానికి లొంగకుండా స్థిరంగా ఉండమని పౌలు తిమోతికి గుర్తుచేశాడు, ఎందుకంటే “ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును” చెడుతనాన్ని తిరస్కరించాలి. b
నిజమైన ఆరాధన ఎప్పటికీ వ్యర్థం కాదు
13. మనం ఏ నమ్మకంతో ఉండవచ్చు?
13 పౌలు ప్రేరేపిత మాటల నుండి మనం కూడా ఆధ్యాత్మిక బలాన్ని పొందవచ్చు. మొట్టమొదటిగా, యెహోవా పట్ల మనకున్న యథార్థతను ఆయన చూస్తున్నాడని తెలుసుకోవడం ధైర్యాన్నిస్తుంది. యెహోవా కేవలం తనవాళ్లను చూడడమే కాదు, వాళ్ల విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నాడు. “తనయెడల యథార్థ హృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” అని బైబిలు చెబుతుంది. (2 దిన. 16:9) కాబట్టి, ‘పవిత్ర హృదయంతో’ మనం యెహోవాకు ఏమి చేసినా అది వ్యర్థం కాదని తప్పకుండా నమ్మవచ్చు.—1 తిమో. 1:5; 1 కొరిం. 15:58.
14. యెహోవా ఎలాంటి ఆరాధనను సహించడు?
14 వేషధారణతో చేసే ఆరాధనను యెహోవా సహించడని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఆయన “కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది” కాబట్టి తనపట్ల ‘యథార్థ హృదయంతో’ లేని వాళ్లను యెహోవా పసిగట్టగలడు. పైకి విధేయత నటిస్తూ, రహస్యంగా పాపం చేస్తూ ఉండే “కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యడు” అని సామెతలు 3:32 చెబుతోంది. అలాంటి వ్యక్తి కొంతకాలం తెలివిగా మానవులను మోసం చేసినా, యెహోవాకున్న సర్వశక్తిని, నీతిని బట్టి చూస్తే, “అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు” అని ఖచ్చితంగా చెప్పవచ్చు.—సామె. 28:13; 1 తిమోతి 5:24; హెబ్రీయులు 4:13 చదవండి.
15. మనం ఏమి చేయకూడదు? ఎందుకు?
15 యెహోవా ప్రజల్లో చాలామంది యథార్థమైన భక్తిని చూపిస్తున్నారు. వేషధారణతో ఆరాధిస్తూ యెహోవాను మోసం చేయాలని ప్రయత్నించేవాళ్లు సంఘంలో చాలా అరుదుగా ఉంటారు. అయినా, మోషే కాలంలో, తొలి క్రైస్తవ సంఘంలో అలా జరిగిందంటే, నేడు కూడా అలా జరిగే అవకాశం ఉంది. (2 తిమో. 3:1, 5) అయితే, మనతోటి క్రైస్తవులు యెహోవాకు యథార్థంగా లేరేమోనని మనం సందేహించాలా? అలా ఎన్నడూ చేయకూడదు! మనతోటి సహోదరసహోదరీలను నిరాధారంగా అనుమానించడం తప్పు. (రోమీయులు 14:10-12; 1 కొరింథీయులు 13:7 చదవండి.) అంతేకాక, సంఘంలోని ఇతరుల యథార్థతను సందేహించే స్వభావం ఉంటే నిజానికి మన ఆధ్యాత్మికతకే హాని కలుగుతుంది.
16. (ఎ) మన హృదయంలో వేషధారణ మొలకెత్తకుండా చూసుకోవాలంటే ఏమి చేయవచ్చు? (బి) ‘శోధించుకుంటూ, పరీక్షించుకుంటూ ఉండండి’ అనే బాక్సు నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు?
16 ప్రతి క్రైస్తవుడు “తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను.” (గల. 6:4) మనం అపరిపూర్ణులం కాబట్టి, మనకు తెలియకుండానే తప్పుడు ఉద్దేశాలు మనలో మొలకెత్తే ప్రమాదం ఉంది. (హెబ్రీ. 3:12, 13-15) అందుకే, యెహోవాను మనం ఏ ఉద్దేశంతో ఆరాధిస్తున్నామో ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. మనం ఇలా ప్రశ్నించుకోవచ్చు: ‘నేను యెహోవాను నా పరిపాలకునిగా ఒప్పుకుంటూ, ఆయన మీదున్న ప్రేమతోనే ఆరాధిస్తున్నానా? లేక పరదైసులో నేను పొందబోయే భౌతిక ఆశీర్వాదాల గురించే ఎక్కువ ఎదురుచూస్తున్నానా?’ (ప్రక. 4:10, 11) మన పనులను పరిశీలించుకుంటూ, మన హృదయంలో వేషధారణకు సంబంధించిన జాడలను తీసేసుకున్నప్పుడు మనమందరం నిశ్చయంగా ప్రయోజనం పొందుతాం.
యథార్థత సంతోషాన్ని ఇస్తుంది
17, 18. మనం ఎలాంటి వేషధారణ లేకుండా, యెహోవాను ఎందుకు యథార్థంగా ఆరాధించాలి?
17 మనం వేషధారణ లేకుండా, యథార్థంగా ఆరాధించడానికి కృషి చేసినప్పుడు ఎన్నో ప్రయోజనాలు పొందుతాం. కీర్తనకర్త ఇలా చెబుతున్నాడు, “యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు, ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.” (కీర్త. 32:2) అవును, వేషధారణను తమ హృదయంలో నుండి తీసేసుకునేవాళ్లు సంతోషంగా ఉంటారు. అంతేకాదు, వాళ్లు భవిష్యత్తులో పరిపూర్ణ ఆనందాన్ని సొంతం చేసుకుంటారు.
18 యెహోవా తగిన కాలంలో చెడ్డవాళ్లందరి చెడుతనాన్ని, ద్వంద జీవితం గడిపేవాళ్ల గుట్టును బయటపెట్టి, “నీతిగలవారెవరో దుర్మార్గులెవరో దేవుని సేవించువారెవరో ఆయనను సేవించనివారెవరో” స్పష్టంగా చూపిస్తాడు. (మలా. 3:18) అప్పటివరకు, యెహోవా “కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను” ఉన్నాయని తెలుసుకోవడం ఎంతో ధైర్యాన్నిస్తుంది.—1 పేతు. 3:12.
a పౌలు తిమోతికి పత్రికలు రాసిన దశాబ్దాల తర్వాత, 12మంది అపొస్తలుల పేర్లు ఉన్న పండ్రెండు “పునాదుల” గురించి యోహాను ప్రకటన 21:14లో రాశాడు.
b మనం యెహోవాను అనుకరిస్తూ దుర్నీతి నుండి ఎలా తొలగిపోవచ్చో తర్వాతి ఆర్టికల్లో పరిశీలిస్తాం.