కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

తండ్రిని పోగొట్టుకున్నాను—మరో తండ్రిని కనుగొన్నాను

తండ్రిని పోగొట్టుకున్నాను—మరో తండ్రిని కనుగొన్నాను

మా నాన్న 1899లో ఆస్ట్రియాలోని, గ్రాజ్‌ నగరంలో జన్మించాడు. మొదటి ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఆయన యువకుడు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలైన కొంతకాలానికే ఆయనను జర్మనీ సైన్యంలోకి తీసుకున్నారు. 1943లో రష్యాతో జరిగిన పోరాటంలో ఆయన చనిపోయాడు. అలా విచారకరంగా, నా రెండేళ్ల వయసులోనే మా నాన్నను కోల్పోయాను. నాకు ఆయన గురించి తెలుసుకునే అవకాశం ఎన్నడూ దొరకలేదు. మానాన్న లేనందుకు నేను చాలా బాధపడేవాణ్ణి, ముఖ్యంగా స్కూల్లో పిల్లలందరికీ వాళ్ల నాన్నలు ఉండి నాకు లేకపోయేసరికి చాలా బాధేసేది. అయితే ఎదిగిన తర్వాత, ఎన్నడూ చనిపోని ఎంతో గొప్ప పరలోక తండ్రి గురించి తెలుసుకుని ఊరట పొందాను.

బాయ్‌ స్కౌట్స్‌తో నా అనుభవాలు

నా చిన్నప్పుడు

నాకు 7 ఏళ్లున్నప్పుడు బాయ్‌ స్కౌట్స్‌ యువకుల ఉద్యమంలో సభ్యునిగా చేరాను. బాయ్‌ స్కౌట్స్‌ అనేది ఓ అంతర్జాతీయ సంస్థ, దాన్ని 1908లో బ్రిటన్‌ సైనిక అధికారియైన రాబర్ట్‌ స్టీఫెన్‌సన్‌ స్మిత్‌ బేడన్‌-పోవల్‌ బ్రిటన్‌లో స్థాపించాడు. నా ఈడు పిల్లల కోసం ఆయన 1916లో ఊల్ఫ్‌ కబ్స్‌ (లేదా కబ్‌ స్కౌట్స్‌) స్థాపించాడు.

మా గుంపు చేసే వారాంతపు ప్రయాణాలు, మజిలీలు అంటే నాకెంతో ఇష్టం. మేము ఆ సమయాల్లో గుడారాల్లో నిద్రపోయేవాళ్లం, యూనిఫామ్‌ వేసుకునేవాళ్లం, డ్రమ్ముల శబ్దానికి అనుగుణంగా కవాతు చేసేవాళ్లం. ముఖ్యంగా ఇతర స్కౌట్స్‌తో కలవడం, రాత్రిళ్లు చలిమంట చుట్టూ కూర్చుని పాటలు పాడడం, అడవిలో ఆడుకోవడం అంటే ఇంకా ఇష్టపడేవాణ్ణి. మేము ప్రకృతి గురించి కూడా ఎంతో నేర్చుకునేవాళ్లం, దానివల్ల మన సృష్టికర్త చేసినవాటి మీద నాకు కృతజ్ఞత పెరిగింది.

ప్రతీరోజు ఒక మంచిపని చేయాలని బాయ్‌ స్కౌట్స్‌ను ప్రోత్సహించేవాళ్లు. మేము ఒకరినొకరం, “ఎల్లప్పుడూ సిద్ధం” అంటూ పలకరించుకునేవాళ్లం. అది నాకు ఎంతగానో నచ్చింది. వంద మందికిపైగా ఉన్న మా అబ్బాయిల గుంపులో దాదాపు సగంమంది క్యాథలిక్కులు, సగంమంది ప్రొటెస్టెంట్లు. ఒక పిల్లవాడు మాత్రం బౌద్ధుడు.

బాయ్‌ స్కౌట్స్‌ 1920 నుండి కొన్నేళ్లకు ఓసారి అంతర్జాతీయ ఉత్సవాలు జరుపుకునేవాళ్లు. 1951 ఆగస్టులో ఆస్ట్రియాలోని, బాట్‌ ఇషల్‌లో జరిగిన 7వ అంతర్జాతీయ ఉత్సవానికి, అలాగే 1957లో ఇంగ్లాండ్‌లోని, బర్మింగ్‌హామ్‌ దగ్గర సాటన్‌ పార్క్‌లో జరిగిన 9వ అంతర్జాతీయ ఉత్సవానికి నేను హాజరయ్యాను. 9వ అంతర్జాతీయ ఉత్సవానికి 85 దేశాల, ప్రాంతాలనుండి వచ్చిన సుమారు 33,000 మంది స్కాట్స్‌ హాజరయ్యారు. అంతేకాక ఆ ఉత్సవాన్ని ఇంగ్లాండ్‌ ఎలిజబెత్‌ రాణితోపాటు సుమారు 7,50,000 మంది సందర్శించారు. నాకు అది ఓ అంతర్జాతీయ సహోదరత్వంలా అనిపించింది. అయితే, అంతకంటే గొప్ప సహోదరత్వాన్ని అంటే ఆధ్యాత్మిక సహోదరత్వాన్ని నేను తెలుసుకోబోతున్నానని నాకు అప్పట్లో తెలియదు.

మొదటిసారి ఓ యెహోవాసాక్షిని కలవడం

రూడాల్ఫ్‌ చిగెర్ల్‌, నాకు అనియతంగా సాక్ష్యమిచ్చిన మొదటి వ్యక్తి

అది 1958, వసంతకాలం. ఆస్ట్రియాలోని, గ్రాండ్‌ హోటల్‌ వీస్లా అఫ్‌ గ్రాజ్‌ అనే హోటల్‌లో వెయిటర్‌గా నా శిక్షణ కొద్దికాలంలో ముగుస్తుందనగా నాతోపాటు పనిచేస్తున్న రూడాల్ఫ్‌ చిగెర్ల్‌ నాకు అనియత సాక్ష్యం ఇచ్చాడు. నేను అంతకుముందు ఎన్నడూ సత్యం గురించి వినలేదు. ఆయన మొదట త్రిత్వ సిద్ధాంతం గురించి ప్రస్తావించి, అది బైబిలు బోధ కాదని చెప్పాడు. నేను మాత్రం త్రిత్వాన్ని సమర్థిస్తూ, ఆయన చెప్పేది తప్పని నిరూపించాలని అనుకున్నాను. కానీ అతనంటే నాకు ఇష్టం, అందుకే అతను మళ్లీ క్యాథలిక్‌ చర్చీకి వచ్చేలా ఒప్పించాలని నిర్ణయించుకున్నాను.

రూడీ అని మేము పిలిచే రూడాల్ఫ్‌ నాకోసం ఓ బైబిలు తెచ్చాడు. అయితే క్యాథలిక్‌ అనువాదమే తెమ్మని నేను అప్పటికే బలవంతం చేయడంతో అదే తెచ్చాడు. నేను చదవడం మొదలుపెట్టిన కొన్నిరోజులకే, దానిలో రూడీ పెట్టిన ఓ కరపత్రం కనిపించింది. అది కావలికోట సంస్థ ముద్రించిన బైబిలు ఆధారిత కరపత్రం. అయితే అలాంటి కరపత్రాల్లోని సమాచారం సరైనదిగా కనిపిస్తున్నా దానిలో అబద్ధాలు ఉండవచ్చనే ఉద్దేశంతో నేను దాన్ని ఇష్టపడలేదు. కానీ అతనితో బైబిలు గురించి చర్చించడానికి మాత్రం నేను సరేనన్నాను. రూడీ కూడా నా ఉద్దేశాన్ని అర్థంచేసుకుని మళ్లీ ఆ తర్వాత ముద్రిత సమాచారాన్ని నాకు ఇవ్వలేదు. మేము అప్పుడప్పుడు కొన్నిసార్లైతే అర్ధరాత్రి వరకు బైబిలు గురించి చర్చించుకునేవాళ్లం. అలా దాదాపు మూడు నెలలు చేశాం.

మా సొంతూరైన గ్రాజ్‌లోని హాటల్‌లో నా శిక్షణ ముగించుకున్న తర్వాత, పైచదువుల కోసం ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ పాఠశాలలో మా అమ్మ నన్ను చేర్పించింది. దాంతో నేను ఆ స్కూల్‌ ఉన్న ఆల్ప్స్‌ పర్వతాల్లోని మైదాన పట్టణమైన బాట్‌ హోఫ్‌గాస్టిన్‌కు వెళ్లిపోయాను. ఆ పాఠశాలకు బాట్‌ హోఫ్‌గాస్టిన్‌లోని గ్రాండ్‌ హోటల్‌కు సంబంధాలు ఉండేవి, అందుకే కొన్నిసార్లు ఆ హాటల్‌లో పనిచేసి, తరగతి గది ఇవ్వలేని అనుభవాన్ని సంపాదించుకున్నాను.

ఇద్దరు మిషనరీ సహోదరీలు నన్ను సందర్శించడం

ఇల్జా అంటర్‌డోర్ఫర్‌, ఇల్‌ఫ్రీడి లోవర్‌ 1958లో నాతో బైబిలు అధ్యయనం మొదలుపెట్టారు

రూడీ నా కొత్త చిరునామాను వియన్నాలోని బ్రాంచి కార్యాలయానికి పంపించడంతో, బ్రాంచి దాన్ని ఇల్జా అంటర్‌డోర్ఫర్‌, ఇల్‌ఫ్రీడి లోవర్‌ a అనే ఇద్దరు మిషనరీ సహోదరీలకు పంపించింది. ఓ రోజు హోటల్‌ రిసెప్షన్‌లో పనిచేస్తున్న ఒకతను నన్ను పిలిచి, ఎవరో ఇద్దరు మహిళలు బయట కారులో ఉన్నారని, నాతో మాట్లాడాలనుకుంటున్నారని చెప్పాడు. వాళ్లు ఎవరై ఉంటారా అనుకుంటూ బయటకు వెళ్లి చూశాను. వాళ్లిద్దరూ రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు సాక్షుల పని నిషేదించబడినప్పుడు జర్మనీలో కొరియర్లుగా సేవచేసిన యెహోవాసాక్షులని నాకు తర్వాత తెలిసింది. యుద్ధం మొదలవ్వడానికి ముందే జర్మనీ రహస్య పోలీసు దళం (గెస్టపో) వీళ్లిద్దరినీ పట్టుకుని లిక్టన్‌బర్గ్‌లోని నిర్బంధ శిబిరంలో ఉంచారు. తర్వాత యుద్ధం మొదలైనప్పుడు వాళ్లను బెర్లిన్‌ సమీపంలోని రావన్స్‌బ్రూక్‌లోని శిబిరానికి తరలించారు.

ఆ సహోదరీలు అటూఇటుగా మా అమ్మ వయసువాళ్లు, అందుకే వాళ్లంటే నాకెంతో గౌరవం. అయితే, వాళ్లతో బహుశా కొన్ని వారాలు లేదా కొన్ని నెలలు చర్చలు జరిపి, ఆ తర్వాత స్టడీ వద్దని చెప్పి వాళ్ల సమయాన్ని వృథా చేయడం నాకిష్టం లేదు. అందుకే, క్యాథలిక్‌ సిద్ధాంతమైన అపొస్తలుల వారసత్వం గురించిన లేఖనాల లిస్టును మాత్రమే ఇవ్వమని వాళ్లను అడిగాను. స్థానిక ప్రీస్టు దగ్గరికి వెళ్లి ఆయనతో ఆ లేఖనాల గురించి చర్చిస్తానని వాళ్లతో చెప్పాను. అప్పుడు నేను సత్యమేమిటో గ్రహించగలుగుతానని అనుకున్నాను.

పరలోకంలోని నిజమైన పరిశుద్ధ తండ్రి గురించి నేర్చుకోవడం

పోపులు అపొస్తలుడైన పేతురు వారసులని, ఆ వంశావళి అప్పటినుండి నిరాటంకంగా కొనసాగుతుందని అపొస్తలుల వారసత్వం గురించిన రోమన్‌ క్యాథలిక్‌ సిద్ధాంతం బోధిస్తుంది. (చర్చి నాయకులు మత్తయి 16:18, 19లోని యేసు మాటల్ని తప్పుగా అర్థంచేసుకుంటారు.) అలాగే, పోపు అధికారపూర్వకంగా సిద్ధాంతాల గురించి మాట్లాడేటప్పుడు తప్పు మాట్లాడడం అసంభవమని కూడా క్యాథలిక్కులు నమ్ముతుంటారు. నాక్కూడా ఆ నమ్మకం ఉండేది. అందుకే, పరిశుద్ధుడైన తండ్రిగా క్యాథలిక్కులు కొలిచే పోపు, సిద్ధాంతాల గురించి అబద్ధం చెప్పడం అసాధ్యం కాబట్టి, ఆయన త్రిత్వ సిద్ధాంతం సరైనదని చెబితే అది తప్పకుండా నిజమే అయ్యుంటుందని నేను నమ్మాను. ఒకవేళ ఆయన తప్పు మాట్లాడే అవకాశం ఉంటే, ఆ సిద్ధాంతం కూడా తప్పు అవ్వవచ్చని అనుకున్నాను. చాలామంది క్యాథలిక్కులకు అపొస్తలుల వారసత్వం చాలా ప్రాముఖ్యమైన బోధని వేరే చెప్పనక్కర్లేదు, ఎందుకంటే వాళ్ల మిగతా సిద్ధాంతాలు సరైనవా కావా అనేది దానిమీదే ఆధారపడివుంటాయి.

నేను ఓ ప్రీస్టును కలిసినప్పుడు ఆయన నా ప్రశ్నకు జవాబు చెప్పలేకపోయాడు. అయితే అపొస్తలుల వారసత్వానికి సంబంధించిన ఓ పుస్తకాన్ని నాకిచ్చి, చదవమన్నాడు. ఆయన సలహా ప్రకారం నేను దాన్ని ఇంటికి తీసుకెళ్లి, చదివి, మరిన్ని ప్రశ్నలతో ఆయన దగ్గరికి వెళ్లాను. ఆ ప్రీస్టు నా ప్రశ్నలకు జవాబు చెప్పలేక చివరికి, “నేను నిన్ను ఒప్పించలేను, నువ్వు నన్ను ఒప్పించలేవు . . . నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను” అన్నాడు. నాతో ఆ తర్వాత ఎలాంటి చర్చలు జరపడానికి ఆయన ఇష్టపడలేదు.

ఆ సమయంలో ఇల్జా, ఇల్‌ఫ్రీడితో బైబిలు అధ్యయనం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రైన యెహోవా గురించి వాళ్లు నాకెంతో నేర్పించారు. (యోహా. 17:11) అయితే ఆ ప్రాంతంలో అప్పట్లో ఒక్క సంఘం కూడా లేదు. అందుకే ఓ ఆసక్తిగల వ్యక్తి ఇంట్లో ఆ సహోదరీలు సంఘ కూటాలు నిర్వహించేవాళ్లు. వాటికి కొంతమందే హాజరయ్యేవాళ్లు. నాయకత్వం తీసుకునే బాప్తిస్మం పొందిన సహోదరులు ఎవరూ లేకపోవడంతో, కూటాల్లోని సమాచారాన్ని చాలామట్టుకు ఆ సహోదరీలిద్దరే చర్చించుకునేవాళ్లు. అప్పుడప్పుడు వేరే ప్రాంతం నుండి ఓ సహోదరుడు వచ్చి అద్దె భవనంలో బహిరంగ ప్రసంగం ఇచ్చేవాడు.

పరిచర్య మొదలుపెట్టడం

ఇల్జా, ఇల్‌ఫ్రీడి నాతో 1958, అక్టోబరులో బైబిలు అధ్యయనం మొదలుపెట్టారు, మూడు నెలల తర్వాత అంటే 1959 జనవరిలో నేను బాప్తిస్మం పొందాను. బాప్తిస్మానికి ముందు, వాళ్లతోపాటు ఇంటింటి పరిచర్యకు వచ్చి ప్రకటనా పని ఎలా చేస్తారో చూస్తానని ఆ సహోదరీలను అడిగాను. (అపొ. 20:20, 21) వాళ్లిద్దరితో మొదటిసారి పరిచర్య చేశాక, నాకంటూ వ్యక్తిగత క్షేత్రం ఇవ్వడం వీలౌతుందేమో అడిగాను. వాళ్లు నాకు ఓ గ్రామాన్ని ఇచ్చారు. నేను ఒక్కడినే వెళ్లి ఇంటింటి పరిచర్య చేసి, ఆసక్తిగల వాళ్లను మళ్లీ కలిసేవాణ్ణి. నాతోపాటు కలిసి పనిచేసిన మొట్టమొదటి సహోదరుడు, మమ్మల్ని ఆ తర్వాత సందర్శించిన ఓ ప్రాంతీయ పర్యవేక్షకుడు.

నా హోటల్‌ చదువు పూర్తి చేసుకున్నాక 1960లో, మా సొంతూరికి వెళ్లి మా బంధువులకు బైబిలు సత్యాలు నేర్పించడం మొదలుపెట్టాను. కానీ ఇప్పటివరకూ వాళ్లలో ఒక్కరు కూడా సత్యంలోకి రాలేదు, అయితే వాళ్లలో కొంతమంది ఇప్పుడు కొంచెం ఆసక్తి చూపిస్తున్నారు.

పూర్తికాల సేవలో జీవితం

నేను 20వ పడిలో

అప్పట్లో అంటే 1961లో, పయినీర్లను ప్రోత్సహిస్తూ బ్రాంచి కార్యాలయం రాసిన ఉత్తరాలను సంఘంలో చదివేవాళ్లు. నేను ఒంటరిగా, మంచి ఆరోగ్యంతో ఉన్నాను కాబట్టి పయినీరు సేవ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నాను. అయితే ఓ మూడు నెలలు ఉద్యోగం చేసి కారు కొనుక్కుంటే పయినీరు సేవకు ఉపయోగపడుతుందని అనుకున్నాను. అదే విషయాన్ని ప్రాంతీయ పర్యవేక్షకుడు కుర్ట్‌ క్యూన్‌కి చెప్పి ఆయన అభిప్రాయం అడిగాను. “యేసుకు, అపొస్తలులకు పూర్తికాల సేవ చేయడానికి కారు అవసరమైందా?” అని ఆయన నన్ను ప్రశ్నించాడు. నన్ను నేను సరి చేసుకునేందుకు అది దోహదపడింది. వీలైనంత తొందరగా పయినీరు సేవ మొదలుపెట్టాలని అనుకున్నాను. అయితే నేను ఓ హోటల్‌ రెస్టారెంట్‌లో ప్రతీవారం 72 గంటలు పనిచేసేవాణ్ణి, కాబట్టి ముందుగా కొన్ని మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.

నేను నా యజమానిని కలిసి, వారానికి 60 గంటలు మాత్రమే పనిచేయడం వీలౌతుందేమో అడిగాను. ఆయన ఒప్పుకోవడమే కాక జీతాన్ని కూడా ఏమాత్రం తగ్గించలేదు. కొంతకాలం తర్వాత మళ్లీ ఆయన దగ్గరికి వెళ్లి, వారానికి 48 గంటలే పనిచేయగలనని చెప్పాను. ఆయన దానికి కూడా అంగీకరించాడు, జీతాన్ని కూడా తగ్గించలేదు. మరోసారి, రోజుకు 6 గంటల చొప్పున వారానికి 36 గంటలు మాత్రమే పని చేస్తానని అన్నాను. ఆయన ఒప్పుకోవడమే కాకుండా నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈసారి కూడా జీతాన్ని తగ్గించలేదు! నన్ను వదులుకోవడం నా యజమానికి ఇష్టం లేదన్నట్లుగా అనిపించింది. దాంతో హోటల్‌లో పనిచేస్తూనే పయినీరు సేవ మొదలుపెట్టాను. అప్పట్లో పయినీర్లు నెలకు 100 గంటలు పరిచర్యలో గడిపేవాళ్లు.

నాలుగు నెలల తర్వాత నన్ను ప్రత్యేక పయినీరుగా నియమించి, కారింథియా రాష్ట్రంలోని, ష్పిటాల్‌ ఆన్‌ డేర్‌ డ్రా పట్టణంలో ఉన్న ఓ చిన్న సంఘానికి కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌గా నియమించారు. అప్పట్లో ప్రత్యేక పయినీర్లు నెలలో 150 గంటలు క్షేత్రసేవలో గడపాలి. నాకు పయినీరు భాగస్వామి ఎవ్వరూ లేరు. అయితే అసిస్టెంట్‌ కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌గా సేవచేస్తున్న గర్‌ట్రూడ లోబ్నర్‌ నాకు పరిచర్యలో ఇచ్చిన మద్దతును నేను ఎప్పటికీ మర్చిపోలేను. b

నియామకాల్లో త్వరిత మార్పులు

నన్ను 1963లో ప్రాంతీయ సేవ చేయడానికి ఆహ్వానించారు. కొన్నిసార్లు నేను ఒక సంఘం నుండి మరో సంఘానికి రైలులో పెద్దపెద్ద సూటుకేసులతో ప్రయాణించాను. అప్పట్లో చాలామంది సహోదరులకు కార్లు లేకపోవడంతో నన్ను తీసుకెళ్లడానికి ఎవ్వరూ స్టేషన్‌కు వచ్చేవాళ్లు కాదు. అయితే టాక్సీలో వెళ్లి సహోదరుల మనసు నొప్పించడం నాకిష్టం లేదు, అందుకే నేను ఉండబోయే చోటికి నడుచుకుంటూనే వెళ్లేవాణ్ణి.

నన్ను 1965లో, 41వ గిలియడ్‌ తరగతికి ఆహ్వానించారు. ఆ తరగతిలో చాలామంది విద్యార్థులు నాలాగే పెళ్లికానివాళ్లు. ఆశ్చర్యకరంగా గ్రాడ్యుయేషన్‌ సమయంలో, నా ప్రాంతీయ సేవను కొనసాగించమని తిరిగి నా సొంత దేశం ఆస్ట్రియాకే నియమించారు. అయితే అమెరికా నుండి వచ్చేసేముందు, నాలుగు వారాల పాటు ఆంథోనీ కోంటీ అనే ఓ ప్రాంతీయ పర్యవేక్షకునితో కలిసి పనిచేయమని నాకు చెప్పారు. ఆప్యాయతగల ఆ సహోదరునితో పని చేయడంవల్ల నేను ఎంతో ప్రయోజనం పొందాను. ఆయనకు క్షేత్రసేవ అంటే ఎంతో ఇష్టం, పరిచర్యలో చాలా సమర్థవంతంగా మాట్లాడేవాడు. మేమిద్దరం న్యూయార్క్‌ ఎగువన ఉన్న కోర్న్‌వాల్‌ ప్రాంతంలో సేవచేశాం.

మా పెళ్లిరోజు

తిరిగి ఆస్ట్రియాకు వచ్చి, ప్రాంతీయ సేవ చేస్తున్నప్పుడు టోవి మెరెటె అనే అందమైన సహోదరిని కలిశాను. తను 5వ ఏట నుండి సత్యంలో పెరిగింది. మేమిద్దరం ఎలా కలిశామని సహోదరులు అడిగినప్పుడు, “బ్రాంచే అలా ఏర్పాటు చేసింది” అని సరదాగా చెప్పేవాళ్లం. ఓ సంవత్సరం తర్వాత అంటే 1967, ఏప్రిల్‌లో మేము పెళ్లిచేసుకున్నాం. పెళ్లి తర్వాత మేమిద్దరం ప్రయాణ సేవలో కొనసాగడానికి సంస్థ ఒప్పుకుంది.

ఆ తర్వాతి సంవత్సరం, యెహోవా తన అంతులేని కృపతో నన్ను ఆధ్యాత్మిక కుమారునిగా దత్తత తీసుకున్నాడని గ్రహించాను. అలా నా పరలోక తండ్రి యెహోవాతో, రోమీయులు 8:15 చెబుతున్నట్లుగా “అబ్బా తండ్రీ అని మొఱ్ఱపెట్టే” మిగతా అభిషిక్తులతో ఓ ప్రత్యేకమైన బంధంలోకి వచ్చాను.

నేను, మెరెటె 1976 వరకు ప్రాంతీయ, జిల్లా సేవలో కొనసాగాం. చలికాలంలో కొన్నిసార్లు మేము, నీరు గడ్డకట్టే అతి తక్కువ ఉష్ణోగ్రతగల గదుల్లో నిద్రపోయేవాళ్లం, పైగా గదిని వెచ్చగా ఉంచుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు మాకు ఉండేవి కావు. ఓసారైతే, మేము నిద్ర లేచేసరికి మేము కప్పుకున్న రగ్గు పైభాగం మంచుతో గట్టిగా, తెల్లగా తయారైంది. కారణం మా శ్వాస మంచుగా మారడం. దాంతో రాత్రిళ్లు చలిని తట్టుకోవడానికి ఓ ఎలక్ట్రిక్‌ హీటర్‌ను మాతోపాటు ఉంచుకోవాలని చివరికి నిర్ణయించుకున్నాం. కొన్ని ప్రాంతాల్లో రాత్రివేళ బాత్రూమ్‌కు వెళ్లాలంటే, మంచులో కొంతదూరం నడుచుకుంటూ వెళ్లాల్సివచ్చేది, పైగా వాటిలో చల్లగాలి లోపలికి వస్తుండేది. మాకంటూ సొంత ఇల్లు లేకపోవడంతో, మేము సందర్శించిన సంఘం ఏర్పాటు చేసిన వసతిలోనే సోమవారం కూడా ఉండేవాళ్లం. మంగళవారం ఉదయం మరో సంఘానికి ప్రయాణించేవాళ్లం.

ఆస్ట్రియాలో ఉన్నప్పుడు, వీధిసాక్ష్యంతో సహా వివిధ పద్ధతుల్లో ప్రకటనా పనిని ఆస్వాదించాను

ఈ సంవత్సరాలన్నింటిలో నా ప్రియమైన భార్య నాకు తోడుగా నిలిచిందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఆమెకు క్షేత్రసేవంటే చాలా ఇష్టం, పరిచర్యకు వెళ్దామని ఆమెను ప్రోత్సహించాల్సిన అవసరం నాకెప్పుడూ రాలేదు. ఆమె సంఘంలోని స్నేహితులను కూడా ప్రేమించేది, ఇతరులను ఎంతగానో పట్టించుకునేది. ఆమె అలా ఉండడం నాకు చాలా సహాయకరంగా ఉంది.

మమ్మల్ని 1976లో, ఆస్ట్రియాలోని వియన్నా బ్రాంచి కార్యాలయంలో సేవచేసేందుకు ఆహ్వానించారు. నన్ను బ్రాంచి కమిటీ సభ్యునిగా నియమించారు. అప్పట్లో ఆస్ట్రియా బ్రాంచి, తూర్పు ఐరోపాలోని చాలా దేశాల పనిని పర్యవేక్షిస్తూ, ఆయా దేశాలకు గోప్యంగా సాహిత్యాన్ని రవాణా చేసే ఏర్పాట్లు చేసేది. సహోదరుడు యూర్గన్‌ రుండల్‌ ఎంతో చొరవ తీసుకుంటూ ఈ పనిని పర్యవేక్షించేవాడు. నాకు ఆయనతో పనిచేసే అవకాశం దక్కింది, ఆ తర్వాత నాకు పది తూర్పు ఐరోపా భాషల్లో అనువాద పనిని పర్యవేక్షించే నియామకం ఇచ్చారు. యూర్గన్‌, ఆయన భార్య గర్‌ట్రూడ ఇద్దరూ ప్రస్తుతం జర్మనీలో ప్రత్యేక పయినీర్లుగా నమ్మకంగా సేవచేస్తున్నారు. 1978 మొదలుకొని ఆస్ట్రియా బ్రాంచి ఫోటోటైప్‌సెట్టింగ్‌ ప్రక్రియ ద్వారా పత్రికలు తయారుచేసి, ఆరు భాషల్లో వాటిని చిన్న ఆఫ్‌సెట్‌ ప్రెస్‌ మీద ముద్రిస్తూ వచ్చింది. అలాగే వివిధ దేశాలనుండి మన పత్రికల కోసం చందా కట్టిన వాళ్లకు పత్రికలు పంపించేవాళ్లం. ఆ పనిని ముఖ్యంగా సహోదరుడు ఓటో కూగ్లిచ్‌ చూసుకునేవాడు. ఆయన ప్రస్తుతం తన భార్య ఇంగ్రీట్‌తో కలిసి జర్మనీ బ్రాంచి కార్యాలయంలో సేవచేస్తున్నాడు.

తూర్పు ఐరోపా దేశాల్లోని సహోదరులు కాపీ చేసే యంత్రాల సహాయంతో లేదా ఫిల్మ్‌ను ఉపయోగించి ముద్రిస్తూ తమ సొంత దేశాల్లో కూడా సాహిత్యాన్ని తయారుచేసేవాళ్లు. అయినప్పటికీ ఇతర దేశాల సహోదరుల సహాయం వాళ్లకు అవసరమైంది. యెహోవా ఆ పనిని కాపాడాడు. పని నిషేధించబడిన ఆ సంవత్సరాలన్నిటిలో బ్రాంచిలో నమ్మకంగా సేవ చేసిన ఆ సహోదరులను మేము ఎంతో ప్రేమించాం.

రుమేనియాకు ప్రత్యేక సందర్శనం

నాకు 1989లో, పరిపాలక సభ సభ్యుడైన థియోడోర్‌ జారస్‌తో కలిసి రుమేనియా దేశాన్ని సందర్శించే గొప్ప అవకాశం దొరికింది. సంస్థకు దూరమైన చాలామంది సహోదరులను తిరిగి సంస్థతో కలపాలన్నదే మా సందర్శన ఉద్దేశం. 1949 ఆరంభంలో, వివిధ కారణాలవల్ల వాళ్లు సంస్థతో తెగతెంపులు చేసుకుని తమ సొంత సంఘాలను స్థాపించుకున్నారు. అయితే వాళ్లు ప్రకటించేవాళ్లు, బాప్తిస్మం ఇచ్చేవాళ్లు. సంస్థలోని సహోదరుల్లాగే వీళ్లు కూడా తమ క్రైస్తవ తటస్థత విషయంలో రాజీపడకుండా జైలుకు కూడా వెళ్లారు. రుమేనియా సందర్శించినప్పుడు మన పనిమీద నిషేధం ఉండడంతో, రుమేనియా బ్రాంచి కమిటీ ప్రతినిధులతో పాటు మేము రహస్యంగా సహోదరుడు పాంఫీల్‌ ఆల్బూ ఇంట్లో కలుసుకున్నాం. నలుగురు ముఖ్యమైన పెద్దలు కూడా ఆ మీటింగ్‌కు వచ్చారు. మేము ఆస్ట్రియా నుండి రాల్ఫ్‌ కెల్నా అనే అనువాదకుణ్ణి కూడా తీసుకెళ్లాం.

అలా మా చర్చ కొనసాగుతున్న రెండవ రోజు రాత్రి, సహోదరుడు ఆల్బూ తన తోటి నలుగురు పెద్దలను మాతో కలిసేలా ఒప్పించాడు, “మనం ఇప్పుడు ఆ పని చేయకపోతే, మనకు రెండో అవకాశం మరెప్పటికీ రాకపోవచ్చు” అని ఆయన వాళ్లతో అన్నాడు. అలా దాదాపు 5,000 మంది సహోదరులు సంస్థలో కలిసిపోయారు. అది యెహోవా దేవునికి ఎంత గొప్ప విజయమో, సాతానుకు మాత్రం చెంపదెబ్బ!

తూర్పు యూరప్‌లో కమ్యూనిజం పడిపోవడానికి ముందు, 1989 చివర్లో పరిపాలక సభ నన్నూ నా భార్యనూ న్యూయార్క్‌లోని ప్రపంచ ప్రధాన కార్యాలయంలో సేవచేయడానికి ఆహ్వానించింది. అది మా ఇద్దరినీ చాలా ఆశ్చర్యపరచింది. మేము 1990, జూలైలో బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవ మొదలుపెట్టాం. 1992లో నన్ను పరిపాలక సభలోని సేవా కమిటీకి సహాయకునిగా నియమించారు. 1994, జూలై నుండి పరిపాలక సభలో సేవచేసే గొప్ప అవకాశాన్ని ఆస్వాదిస్తున్నాను.

గతాన్ని తలపోస్తూ, భవిష్యత్తులోకి తొంగిచూస్తూ . . .

న్యూయార్క్‌లోని, బ్రూక్లిన్‌లో నా భార్యతో

నేను హోటల్‌లో వెయిటర్‌గా చేసిన రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు అంతర్జాతీయ సహోదరత్వం కోసం ఆధ్యాత్మిక ఆహారం సిద్ధం చేసే, దాన్ని పంచిపెట్టే పనిలో నా వంతు బాధ్యతను ఆనందంగా నిర్వర్తిస్తున్నాను. (మత్త. 24:45-47) 50 కంటే ఎక్కువ సంవత్సరాల నా ప్రత్యేక పూర్తికాల సేవను ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే నా మనసులో కృతజ్ఞతా భావం పొంగిపొర్లుతోంది. మన ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని యెహోవా ఎలా ఆశీర్వదిస్తున్నాడో చూసినప్పుడు నేను ఆనందంతో ఉప్పొంగిపోతాను. మన పరలోక తండ్రి యెహోవా గురించి, బైబిలు సత్యం గురించి ఎక్కువగా నేర్పించే అంతర్జాతీయ సమావేశాలకు హాజరవడమంటే నాకు చాలా ఇష్టం.

ఇంకా ఎన్నో లక్షలమంది బైబిలు అధ్యయనం చేసి, సత్యాన్ని అంగీకరించాలని, మన ప్రపంచవ్యాప్త క్రైస్తవ సహోదరత్వంతో కలిసి ఐక్యంగా యెహోవాను సేవించాలని నేను ప్రార్థిస్తున్నాను. (1 పేతు. 2:17) అలాగే పరలోకం నుండి చూస్తూ, భూమ్మీద జరిగే పునరుత్థానాన్ని గమనించాలని, చివరికి మా నాన్నను చూడాలని కూడా ఎదురుచూస్తున్నాను. పరదైసులో యెహోవాను సేవించాలనే కోరిక ఆయనకు, మా అమ్మకు, మిగతా బంధువులకు ఉంటుందని ఆశిస్తున్నాను.

పరలోకం నుండి చూస్తూ, భూమ్మీద జరిగే పునరుత్థానాన్ని గమనించాలని, చివరికి మా నాన్నను చూడాలని కూడా ఎదురుచూస్తున్నాను

a వాళ్ల జీవిత కథ కోసం కావలికోట (ఇంగ్లీషు) నవంబరు 1, 1979 సంచిక చూడండి.

b కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌, అసిస్టెంట్‌ కాంగ్రిగేషన్‌ సర్వెంట్‌ స్థానంలో ప్రస్తుతం పెద్దల సభలోనే ఒకరు సమన్వయకర్తగా, మరొకరు కార్యదర్శిగా సేవచేస్తారు.