కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—మైక్రోనీసియాలో

తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు​—మైక్రోనీసియాలో

కాథ్రన్‌ అమెరికాలో పెరిగింది, ఆమె 16 ఏళ్లప్పుడు యెహోవాసాక్షిగా బాప్తిస్మం పొందింది. ఆమె పరిచర్యలో బాగా ప్రయాసపడేది కానీ తను ప్రకటించే ప్రాంతంలో ప్రజలు అంతగా స్పందించేవాళ్లు కాదు. ఆమె ఇలా చెబుతోంది, “తాము దేవుని గురించి తెలుసుకునేలా సహాయం చేయడానికి ఎవరో ఒకరిని పంపించమని ప్రార్థించినవాళ్ల అనుభవాలను నేను చదివాను. నాకూ అలాంటివాళ్లు దొరకాలని చాలాసార్లు కోరుకునేదాన్ని, కానీ అలా ఎప్పుడూ జరగలేదు.”

ఒకే ప్రాంతంలో కొన్నేళ్లు ప్రకటించిన తర్వాత, ప్రజలు రాజ్య సందేశానికి మరింత బాగా స్పందించే ప్రాంతానికి వెళ్లడం గురించి కాథ్రన్‌ ఆలోచించడం మొదలుపెట్టింది. అయితే, ఇంటికి దూరంగా జీవించడం తనకు కష్టమౌతుందేమోనని భయపడింది. ఆమె తన జీవితంలో ఒకేఒక్కసారి తన కుటుంబానికి దూరంగా వెళ్లింది, అదీ రెండు వారాలే. అప్పుడు కూడా ఆమె ప్రతీరోజు ఇంట్లో వాళ్లను గుర్తుచేసుకుంటూ బెంగపెట్టుకునేది. అయినా, యెహోవా కోసం వెదికేవాళ్లకు సహాయం చేయడంలోని ఆనందాన్ని అనుభవించాలనే హృదయపూర్వక కోరికవల్ల ఆమె ధైర్యం చేసింది. తాను వెళ్లడానికి వీలుగావుండే కొన్ని ప్రాంతాలను పరిశీలించాక, గ్వామ్‌లోని బ్రాంచి కార్యాలయానికి ఉత్తరం రాసి కావాల్సిన సమాచారాన్ని పొందింది. కాథ్రన్‌ 26 ఏళ్లప్పుడు 2007, జూలై 1న పసిఫిక్‌ మహాసముద్రంలో ఉన్న సైపాన్‌ అనే ద్వీపానికి వెళ్లింది. అది ఆమె ఇంటి నుండి 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి వెళ్లాక, ఆమెకు ఎలా అనిపించింది?

రెండు ప్రార్థనలకు జవాబు

కాథ్రన్‌ కొత్త సంఘానికి వెళ్లిన కొంతకాలానికే, డోరస్‌ అనే 45 ఏళ్ల మహిళను కలుసుకుంది. ఆమె బైబిలు అధ్యయనానికి కూడా ఒప్పుకుంది. బైబిలు బోధిస్తోంది పుస్తకంలో మూడు అధ్యాయాలు ఆమెతో చర్చించిన తర్వాత కాథ్రన్‌లో చింత మొదలైంది. ఆమె ఇలా గుర్తుచేసుకుంది, “డోరస్‌ చాలా మంచి విద్యార్థి, నేను ఆమె ఆసక్తిని నీరుగార్చాలనుకోలేదు. నేను ఇంతకుముందు ఎవరితోనూ క్రమంగా బైబిలు అధ్యయనం చేయలేదు, కాబట్టి డోరస్‌తో అధ్యయనం చేయడానికి మరింత అనుభవం ఉన్నవాళ్లు బహుశా ఆమె వయస్సు వాళ్లయితే బాగుంటుందని నాకు అనిపించింది.” డోరస్‌తో అధ్యయనం చేయడానికి తగిన సహోదరి దొరికేలా సహాయం చేయమని కాథ్రన్‌ యెహోవాకు ప్రార్థించింది. అధ్యయనాన్ని వేరేవాళ్లకు అప్పగించబోతున్నట్లు డోరస్‌కు చెప్పాలని నిర్ణయించుకుంది.

కాథ్రన్‌ ఇలా చెబుతోంది, “నేను ఆ విషయం గురించి మాట్లాడకముందే, డోరస్‌ ఒక సమస్య గురించి నాతో మాట్లాడాలని అంది. ఆమె చెప్పినదాన్ని విన్న తర్వాత, అలాంటి సమస్యే నాకూ వచ్చినప్పుడు యెహోవా ఎలా సహాయం చేశాడో ఆమెకు వివరించాను. అప్పుడు ఆమె నాకు కృతజ్ఞతలు చెప్పింది.” అప్పుడు డోరస్‌, కాథ్రన్‌తో ఇలా అంది, “యెహోవా నీ ద్వారా నాకు సహాయం చేస్తున్నాడు. నువ్వు మా ఇంటికి వచ్చిన మొదటి రోజు, నేను కొన్ని గంటల నుండి బైబిలు చదువుతూ, అర్థంచేసుకునేలా సహాయం చేయడానికి ఎవరినైనా పంపించమని ఏడుస్తూ దేవుణ్ణి అడుగుతున్నాను. అప్పుడే నువ్వు మా ఇంటి తలుపు తట్టావు. అలా యెహోవా నా ప్రార్థనకు జవాబిచ్చాడు.” డోరస్‌ ఆ విషయం చెబుతున్నప్పుడు కాథ్రన్‌ కంట్లో నీళ్లు తిరిగాయి. కాథ్రన్‌ ఇలా చెబుతోంది, “డోరస్‌ చెప్పిన మాటలు నా ప్రార్థనకు జవాబుగా అనిపించాయి. ఈ అధ్యయనాన్ని కొనసాగించే సామర్థ్యం నాకుందని యెహోవా చూపించాడు.”

డోరస్‌, 2010⁠లో బాప్తిస్మం పొంది ఇప్పుడు తను కూడా కొన్ని బైబిలు అధ్యయనాలు చేస్తుంది. “యెహోవా సేవకులయ్యేలా యథార్థ హృదయంగల ఒక్క వ్యక్తికైనా సహాయం చేయాలనే నా చిరకాల కోరిక తీరినందుకు నేను ఎంతో కృతజ్ఞురాలిని” అని కాథ్రన్‌ చెబుతోంది. ప్రస్తుతం కాథ్రన్‌ పసిఫిక్‌ ద్వీపమైన కోస్రేలో ప్రత్యేక పయినీరుగా సంతోషంగా సేవ చేస్తుంది.

మూడు సవాళ్లు—వాటిని ఎలా అధిగమించవచ్చు?

మైక్రోనీసియాలో అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వందకంటే ఎక్కువ మంది ఇతర దేశాల సహోదరసహోదరీలు (19 నుండి 79 మధ్య వయస్సు వాళ్లు) ఉత్సాహంగా సేవచేశారు. వాళ్ల భావాలు ఎరికా మాటల్లో ప్రతిబింబిస్తాయి. 2006⁠లో అంటే తన 19వ ఏట గ్వామ్‌కు వెళ్లి సేవచేసిన ఎరికా ఇలా అంటోంది, “సత్యం కోసం తపిస్తున్న ప్రజలున్న ప్రాంతంలో పయినీరు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇటువంటి సేవ చేపట్టేలా యెహోవా నాకు సహాయం చేసినందుకు ఆయనకు ఎంతో కృతజ్ఞురాలిని. ఇంతకంటే శ్రేష్ఠమైన జీవితం మరొకటి లేదు!” నేడు ఎరికా, మార్షల్‌ దీపాల్లోని ఈబై ప్రాంతంలో ప్రత్యేక పయినీరుగా ఆనందంగా సేవ చేస్తుంది. అయితే, వేరే దేశంలో సేవ చేస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. వాటిలో మూడిటిని పరిశీలించి, మైక్రోనీసియాకు వెళ్లినవాళ్లు వాటిని ఎలా అధిగమించారో చూద్దాం.

ఎరికా

జీవన విధానం. 22 ఏళ్ల సైమన్‌ 2007⁠లో పలావ్‌ ద్వీపానికి వెళ్లాడు. అయితే, తన స్వదేశమైన ఇంగ్లాండ్‌లో కన్నా ఇక్కడ చాలా తక్కువ డబ్బు సంపాదించగలడని అతనికి కొంతకాలానికే అర్థమైంది. “నాకు నచ్చిందల్లా కొనకూడదని నేను నేర్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఏ ఆహార వస్తువులు కొనాలో జాగ్రత్తగా ఎంపికచేసుకుని, అవి తక్కువ ధరకు దొరికే షాపులో కొంటున్నాను. ఏదైనా వస్తువు పాడైతే, సెకెండ్‌హ్యాండ్‌ షాపులో దాని విడిభాగాలు కొని, రిపేరు చేయించుకుంటాను” అని సైమన్‌ చెబుతున్నాడు. నిరాడంబరమైన జీవితం గడపడం వల్ల ఆయన ఎలా ప్రయోజనం పొందాడు? సైమన్‌ ఇలా అంటున్నాడు, “జీవితంలో ఏవి నిజంగా అవసరమైనవో, తక్కువ డబ్బుతోనే ఎలా నెట్టుకురావచ్చో నేర్చుకోవడానికి అది నాకు సహాయం చేసింది. చాలా సందర్భాల్లో యెహోవా నా అవసరాలు తీర్చడం నేను గమనించాను. నేను ఇక్కడ సేవచేసిన 7 సంవత్సరాల్లో భోజనానికి, వసతికి నాకెప్పుడూ లోటు రాలేదు.” అవును, రాజ్యాన్ని మొదట వెదకాలనే కోరికతో నిరాడంబరంగా జీవిస్తున్న వాళ్లకు యెహోవా తోడుంటాడు.—మత్త. 6:32, 33.

ఇంటిమీద బెంగ. ఎరికా ఇలా అంటోంది, “నాకు నా కుటుంబ సభ్యులంటే చాలా ఇష్టం, కాబట్టి నేను బెంగ పెట్టుకుని పరిచర్యను సరిగ్గా చేయలేనేమోనని భయపడ్డాను.” ఆమె దాన్ని అధిగమించడానికి ఏమి చేసింది? “నేను ఆ ప్రాంతానికి వెళ్లే ముందు, ఇంటిమీద బెంగ గురించి కావలికోటలో వచ్చిన ఆర్టికల్స్‌ చదివాను. అలా ఆ ఇబ్బందిని అధిగమించడానికి నా హృదయాన్ని సిద్ధం చేసుకున్నాను. ఒక ఆర్టికల్‌లో ఓ తల్లి తన కూతురికి యెహోవా శ్రద్ధ గురించి ఇలా ధైర్యం చెప్పింది, ‘యెహోవా నిన్ను నాకంటే బాగా చూసుకుంటాడు.’ ఆ మాటలు నన్ను నిజంగా బలపరిచాయి.” హాన్నా, ఆమె భర్త పాట్రిక్‌ మార్షల్‌ ద్వీపాల్లోని మజూరోలో సేవచేస్తున్నారు. ఆమె తమ సంఘంలోని సహోదరసహోదరీల గురించి ఎక్కువగా ఆలోచించడంవల్ల ఇంటిమీద బెంగను పోగొట్టుకోగలిగింది. ఆమె ఇలా అంటోంది, “మన ప్రపంచవ్యాప్త సహోదరత్వాన్ని ఇచ్చినందుకు నేను యెహోవాకు కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాను, ఎందుకంటే వాళ్లూ నా కుటుంబమే. వాళ్ల ప్రేమపూర్వక మద్దతు లేకుండా, అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతంలో నేను ఎప్పటికీ సేవ చేయలేకపోయేదాన్ని.”

సైమన్‌

స్నేహితులను చేసుకోవడం. “ఒక కొత్త దేశానికి వెళ్లినప్పుడు, అన్నీ కొత్తగా ఉంటాయి” అని సైమన్‌ చెబుతున్నాడు. “నేను జోకులు వేస్తే నవ్వేవాళ్లుగానీ, నన్ను పూర్తిగా అర్థం చేసుకునేవాళ్లుగానీ ఎవ్వరూ లేరని కొన్నిసార్లు అనిపిస్తుంది.” ఎరికా ఇలా అంటోంది, “మొదట్లో, నాకు తోడెవ్వరూ లేరనిపించేది. అయితే, నేను ఇక్కడికి రావడానికిగల ఉద్దేశాన్ని పరిశీలించుకోవడానికి అది సహాయం చేసింది. నేనేదో పొందాలని కాదుగానీ యెహోవాను మరింతగా సేవించడానికే వచ్చాను. అయితే ఎంతోకాలం గడవకముందే, నేను మంచి స్నేహితులను సంపాదించుకున్నాను. వాళ్ల స్నేహానికి నేనెంతో విలువిస్తాను.” సైమన్‌ కష్టపడి పలావన్‌ భాషను నేర్చుకున్నాడు. అది అక్కడ ఉన్న సహోదరసహోదరీల పట్ల ‘తన హృదయాన్ని విశాలపర్చుకోవడానికి’ సహాయం చేసింది. (2 కొరిం. 6:13) ఆ భాషను కష్టపడి నేర్చుకున్నందుకు సహోదరులు ఆయనకు దగ్గరయ్యారు. అవును, కొత్తవాళ్లూ స్థానిక సంఘంలోని సహోదరులూ కలిసి పని చేసినప్పుడు, వాళ్లందరూ సంఘంలో సన్నిహిత స్నేహాల్ని ఆస్వాదిస్తారు. అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సేవచేయడానికి ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చినవాళ్లు ఇంకా ఏ ప్రయోజనాలను పొందారు?

‘సమృద్ధిగా పంటకోస్తారు’

“సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకోయును” అని అపొస్తలుడైన పౌలు అన్నాడు. (2 కొరిం. 9:6) పౌలు మాటల్లోని ఈ సూత్రం తమ పరిచర్యను విస్తృతం చేసుకునే వాళ్లకు తప్పకుండా వర్తిస్తుంది. మైక్రోనీసియాలో వాళ్లు ఎలాంటి పంటను ‘సమృద్ధిగా కోశారు?’

పాట్రిక్‌, హాన్నా

మైక్రోనీసియాలో బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి, బైబిలు సత్యాన్ని నేర్చుకుని దాన్ని పాటించేవాళ్లు సాధించే అభివృద్ధిని ప్రత్యక్షంగా చూడడానికి ఇప్పటికీ పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. పాట్రిక్‌, హాన్నాలు 320 మంది ఉండే ఆన్గర్‌ అనే చిన్న ద్వీపంలో కూడా ప్రకటించారు. అక్కడ రెండు నెలలు ప్రకటించిన తర్వాత, వాళ్లు ఓ ఒంటరి తల్లిని కలిశారు. ఆమె వెంటనే బైబిలు అధ్యయనానికి ఒప్పుకుంది, సత్యాన్ని ఆత్రుతతో నేర్చుకుని, తన జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకుంది. హాన్నా ఇలా చెబుతోంది, “అధ్యయనం అయిపోయిన ప్రతీసారి, మా సైకిళ్ల మీద ఇంటికి వెళ్తూ మేము ఒకరినొకరం చూసుకుని, ‘యెహోవా, నీకు కృతజ్ఞతలు’ అని చెప్పేవాళ్లం. యెహోవా ఈ మహిళను ఏదోవిధంగా తన దగ్గరికి ఆకర్షించుకుని ఉండేవాడని నాకు తెలుసు. కానీ, అవసరం ఎక్కువ ఉన్న ప్రాంతంలో సేవచేయడం వల్ల మేము గొర్రెలాంటి ఈ మహిళను కనుగొని, యెహోవాను తెలుసుకునేలా ఆమెకు సహాయం చేయగలిగాం. మా జీవితమంతటిలో పొందిన ఆశీర్వాదకరమైన అనుభవాల్లో ఇది ఒకటి.” ఎరికా చెబుతున్నట్లుగా, “యెహోవాను తెలుసుకునేలా ఒక వ్యక్తికి సహాయం చేసినప్పుడు మీరు చెప్పలేనంత సంతోషాన్ని సొంతం చేసుకుంటారు.”

మీరూ అలా వెళ్లగలరా?

చాలా ప్రాంతాల్లో రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువుంది. సహాయం అవసరమైన ప్రాంతాల్లో సేవచేయడానికి మీరు కూడా వెళ్లగలరా? పరిచర్యను విస్తృత పర్చుకోవాలనే మీ కోరికను బలపరచమని యెహోవాను ప్రార్థనలో అడగండి. ఈ విషయాన్ని సంఘ పెద్దలతో, ప్రాంతీయ పర్యవేక్షకునితో లేదా సహాయం అవసరమైన ప్రాంతంలో సేవచేస్తున్న వాళ్లతో చర్చించండి. మీరు ప్రణాళికలు వేసుకోవడం మొదలు పెట్టినప్పుడు, మీరు ఏ క్షేత్రంలో సేవ చేయాలనుకుంటున్నారో దాన్ని పర్యవేక్షించే బ్రాంచికి ఉత్తరం రాసి, మరింత సమాచారం అడగండి. a తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేసుకుంటూ, ‘సమృద్ధిగా పంట కోయడంలోని’ ఆనందాన్ని చవిచూస్తున్న వేలాది యువకులు, వృద్ధులు, ఒంటరివాళ్లు, వివాహితులైన సహోదరసహోదరీలతో బహుశా మీరూ కలవవచ్చు.

a 2011, ఆగస్టు మన రాజ్య పరిచర్యలోని “మీరు ‘మాసిదోనియకు’ వెళ్లగలరా?” అనే ఆర్టికల్‌ చూడండి.