‘తగినవేళ ఆహారం’ మీరు పొందుతున్నారా?
మానవ చరిత్రలోనే అత్యంత క్లిష్ట సమయంలో మనం జీవిస్తున్నాం. (2 తిమో. 3:1-5) యెహోవా పట్ల మనకున్న ప్రేమను, ఆయన నీతి ప్రమాణాల ప్రకారం జీవించాలనే మన నిశ్చయతను పరీక్షించే విషయాలు ప్రతిరోజూ ఎదురౌతున్నాయి. ఇలాంటి కష్టకాలం వస్తుందని యేసుకు ముందే తెలుసు, అందుకే అంతం వరకూ సహించడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని తన అనుచరులకు ఇస్తానని ఆయన మాటిచ్చాడు. (మత్త. 24:3, 13; 28:20) అందుకే, వాళ్లకు “తగినవేళ అన్నము” పెడుతూ బలపర్చడం కోసం నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుణ్ణి యేసు నియమించాడు.—మత్త. 24:45, 46.
యేసు నమ్మకమైన దాసుణ్ణి 1919లో నియమించాడు, అప్పటినుండి అన్ని భాషలకు చెందిన లక్షలమంది “ఇంటివారు” దేవుని సంస్థలోకి వస్తూ ఆధ్యాత్మిక పోషణ పొందుతున్నారు. (మత్త. 24:14; ప్రక. 22:17) అయితే కొన్నిరకాల బైబిలు సాహిత్యం కొన్ని భాషల్లో అందుబాటులో లేదు, అలాగే ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్న కొన్ని ప్రచురణలను చదివే సౌలభ్యం కొంతమందికే ఉంది. ఉదాహరణకు, jw.orgలో మాత్రమే ఉండే కొన్ని వీడియోలను, ఆర్టికల్స్‌ను చాలామంది చూడలేకపోతున్నారు. కాబట్టి, ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ఆహారాన్ని మనలో కొందరు పొందలేకపోతున్నారని దానర్థమా? దీనికి సమాధానం తెలుసుకోవడానికి మనం ఇప్పుడు నాలుగు ప్రాముఖ్యమైన ప్రశ్నల్ని పరిశీలిద్దాం.
1 యెహోవా అందించే ఆహారంలో ప్రాముఖ్యమైనది ఏమిటి?
రాళ్లను రొట్టెలుగా మార్చమని సాతాను శోధించినప్పుడు, “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అని యేసు జవాబిచ్చాడు. (మత్త. 4:3, 4) యెహోవా మాటలు బైబిల్లో ఉన్నాయి. (2 పేతు. 1:20, 21) కాబట్టి మన ఆధ్యాత్మిక ఆహారంలో ప్రాముఖ్యమైనది బైబిలే.—2 తిమో. 3:16, 17.
యెహోవా సంస్థ, పరిశుద్ధ లేఖనాల నూతనలోక అనువాదము మొత్తాన్ని లేదా ఒక భాగాన్ని 120 కంటె ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంచింది, ప్రతీ సంవత్సరం ఆ భాషల సంఖ్య పెరుగుతోంది. ఆ బైబిలుతోపాటు, వేరే బైబిలు అనువాదాలు కూడా మొత్తంగా లేదా భాగాలుగా వేల భాషల్లో కోట్ల కాపీలు అందుబాటులో ఉన్నాయి. అద్భుత రీతిలో సాగుతున్న ఈ పనంతా, “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెను” అని కోరుకుంటున్న యెహోవా చిత్తానికి అనుగుణంగా ఉంది. (1 తిమో. 2:3, 4) యెహోవా ప్రజలందరి హృదయాలు చూస్తాడు కాబట్టి, ‘ఆత్మవిషయమై దీనులైనవాళ్లను’ తన సంస్థలోకి ఆకర్షించి, వాళ్లకు ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తాడని మనం భరోసాతో ఉండవచ్చు.—హెబ్రీ. 4:13; మత్త. 5:3, 6; యోహా. 6:44; 10:14.
2 ఆధ్యాత్మిక ఆహారం అందించడంలో మన ప్రచురణల పాత్ర ఏమిటి?
ఒక వ్యక్తి బలమైన విశ్వాసం పెంచుకోవాలంటే బైబిలు చదవడం మాత్రమే సరిపోదు. చదివేదాన్ని అర్థం చేసుకోవాలి, నేర్చుకున్నవాటిని పాటించాలి. (యాకో. 1:22-25) మొదటి శతాబ్దానికి చెందిన ఐతియోపీయుడైన సపుంసకుడు ఆ వాస్తవాన్ని అర్థం చేసుకున్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని చదువుతుండగా సువార్తికుడైన ఫిలిప్పు “నీవు చదువునది గ్రహించుచున్నావా?” అని అడిగాడు, దానికి ఆ నపుంసకుడు “ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను” అని జవాబిచ్చాడు. (అపొ. 8:26-31) అప్పుడు ఫిలిప్పు, దేవుని వాక్యం గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకునేందుకు ఆయనకు సహాయం చేశాడు. నేర్చుకున్న విషయాలు ఆ నపుంసకుణ్ణి ఎంతగా కదలించాయంటే, ఆయన వెంటనే బాప్తిస్మం పొందాడు. (అపొ. 8:32-38) అలాగే మన బైబిలు ప్రచురణలు, సత్యం గురించి ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకునేలా మనకు సహాయం చేశాయి. అవి మన భావోద్వేగాలను పురికొల్పి, నేర్చుకున్నవాటిని పాటించేలా మనల్ని కదిలించాయి.—కొలొ. 1:9-12.
యెహోవా దేవుడు ప్రచురణల ద్వారా తన సేవకులు ‘తినడానికి,’ ‘పానం చేయడానికి’ సమృద్ధిగా ఆధ్యాత్మిక విషయాల్ని అందిస్తున్నాడు. (యెష. 65:13) ఉదాహరణకు, బైబిలు ప్రవచనాలను వివరిస్తూ, లోతైన ఆధ్యాత్మిక విషయాల పట్ల మన అవగాహన పెంచుతూ, బైబిలు ప్రమాణాల ప్రకారం జీవించేలా మనల్ని పురికొల్పుతున్న కావలికోట పత్రిక 210 కన్నా ఎక్కువ భాషల్లో లభ్యమౌతోంది. తేజరిల్లు! సుమారు 100 భాషల్లో ముద్రితమౌతోంది, అది యెహోవా సృష్టికార్యాలపట్ల మనకున్న జ్ఞానాన్ని పెంచుతూ, బైబిలు సలహాలను జీవితంలో ఎలా పాటించవచ్చో చూపిస్తుంది. (సామె. 3:21-23; రోమా. 1:20) నమ్మకమైన దాసుడు 680 కన్నా ఎక్కువ భాషల్లో బైబిలు ఆధారిత సమాచారాన్ని అందిస్తున్నాడు! మీరు ప్రతీరోజు బైబిలు చదవడానికి సమయం కేటాయిస్తున్నారా? మీ భాషలో వచ్చే ప్రతీ కొత్త పత్రికను, ప్రచురణను ఎప్పటికప్పుడు చదువుతున్నారా?
యెహోవా సంస్థ ప్రచురణలను తయారు చేయడంతోపాటు, మన కూటాల్లో, సమావేశాల్లో ప్రసంగాల కోసం బైబిలు ఆధారిత సంక్షిప్త ప్రతులను కూడా తయారుచేస్తుంది. ఆ ప్రసంగాలను, నాటకాలను, ప్రదర్శనలను, ఇంటర్వ్యూలను మీరు ఆస్వాదిస్తున్నారా? యెహోవా నిస్సందేహంగా మనకు ఆధ్యాత్మిక విందును ఏర్పాటు చేస్తున్నాడు!—యెష. 25:6.
3 సంస్థ తయారుచేసే అన్ని ప్రచురణలు మీ భాషలో లేనట్లయితే, మీకు తగినంత ఆధ్యాత్మిక ఆహారం అందడం లేదని అర్థమా?
కాదు! కొన్నిసార్లు కొంతమంది యెహోవా సేవకులకు తోటి విశ్వాసులకన్నా ఎక్కువ ఆధ్యాత్మిక ఆహారం అందుబాటులో ఉండడం చూసి మనం ఆశ్చర్యపోము. ఎందుకు? అపొస్తలుల గురించి ఓసారి ఆలోచించండి. వాళ్లు మొదటి శతాబ్దంలోని ఇతర శిష్యులకన్నా ఎక్కువ ఉపదేశాన్ని అందుకున్నారు. (మార్కు 4:10; 9:35-37) అయితే, మిగతా శిష్యులకు ఏదో తక్కువైందని కాదు, వాళ్లు కూడా అవసరమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని పొందారు.—ఎఫె. 4:20-24; 1 పేతు. 1:8, 9.
యేసు భూమ్మీద ఉన్నప్పుడు చేసిన పనులన్నీ, చెప్పిన మాటలన్నీ సువార్తల్లో నమోదు కాలేదనే విషయం కూడా గమనించండి. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు, “యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతిదానిని వివరించి వ్రాసినయెడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది.” (యోహా. 21:25) పరిపూర్ణుడైన యేసు గురించి మనకన్నా మొదటి శతాబ్దపు శిష్యులకే ఎక్కువ తెలిసినా మనమేమీ నష్టపోలేదు. ఎందుకు? ఎందుకంటే మనం యేసు అడుగుజాడల్లో నడవడానికి అవసరమైన విషయాలన్నీ తెలుసుకునేలా యెహోవా చూశాడు.—1 పేతు. 2:21.
మొదటి శతాబ్దంలో అపొస్తలులు సంఘాలకు రాసిన పత్రికల గురించి కూడా ఆలోచించండి. పౌలు రాసిన అనేక పత్రికల్లో కనీసం ఒక పత్రిక బైబిల్లో లేదు. (కొలొ. 4:16) ఆ పత్రిక మనకు అందుబాటులో లేదు కాబట్టి, మనకు సరిపడా ఆధ్యాత్మిక ఆహారం లేదని అర్థమా? కాదు. మనకు ఏమి అవసరమో యెహోవాకు తెలుసు, మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు కావాల్సినవన్నీ ఆయన దయచేశాడు.—మత్త. 6:8.
మనకు ఏమి అవసరమో యెహోవాకు తెలుసు, మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు కావాల్సినవన్నీ ఆయన దయచేశాడు
నేడు కొంతమంది యెహోవా సేవకులకు, ఇతరుల కన్నా ఎక్కువ ఆధ్యాత్మిక ఆహారం అందుబాటులో ఉంది. మీ భాషలో కొన్ని ప్రచురణలు మాత్రమే ఉన్నాయా? ఉంటే, యెహోవా మీమీద శ్రద్ధ చూపిస్తున్నాడని తెలుసుకోండి. వాటిని అధ్యయనం చేయండి, వీలైతే మీకు అర్థమయ్యే భాషలో జరిగే కూటాలకు వెళ్లండి. యెహోవా మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలంగా ఉంచుతాడనే నమ్మకంతో ఉండండి.—కీర్త. 1:2; హెబ్రీ. 10:24, 25.
4 jw.orgలో ఉన్న సమాచారం చూసే సౌలభ్యం మీకు లేకపోతే, మీ విశ్వాసం బలహీనపడుతుందా?
మన వెబ్‌సైట్‌లో, మన పత్రికలతోపాటు బైబిలు అధ్యయన ప్రచురణలు అందుబాటులో ఉన్నాయి. దంపతులకు, యువతీయువకులకు, చిన్న పిల్లలున్న తల్లిదండ్రులకు ఉపయోగపడే సమాచారం కూడా మన వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఈ సమాచారాన్ని తమ కుటుంబ ఆరాధనలో పరిశీలించి కుటుంబాలు ప్రయోజనం పొందవచ్చు. అంతేకాదు గిలియడ్ స్నాతకోత్సవాలు, వార్షిక కూటాలు వంటి ప్రత్యేక కార్యక్రమాల గురించి నివేదికలు, ప్రకృతి విపత్తులకు గురైన యెహోవాసాక్షుల గురించి, వాళ్లు న్యాయస్థానాల్లో సాధించిన విజయాల గురించి తాజా వార్తలు కూడా మన వెబ్‌సైట్‌లో ఉంటాయి. (1 పేతు. 5:8, 9) అలాగే, మన పనిమీద ఆంక్షలున్న దేశాల్లో లేదా పని నిషేధించబడిన దేశాల్లో కూడా ఈ వెబ్‌సైట్ సువార్తను ప్రజలకు అందుబాటులో ఉంచుతూ ఓ శక్తిమంతమైన ఉపకరణంలా పనిచేస్తుంది.
అయితే ఈ వెబ్‌సైట్ మీకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరు ఆధ్యాత్మికంగా బలంగా ఉండగలరు. ఇంటివారిలోని ప్రతీ ఒక్కరికి సమృద్ధిగా ఆధ్యాత్మిక ఆహారం అందించడానికి సరిపడా ముద్రిత సమాచారాన్ని దాసుడు ఎంతో కష్టపడి అందించాడు. కాబట్టి, కేవలం jw.org వెబ్‌సైట్‌ను చూసేందుకే ఓ ఉపకరణాన్ని కొనాలని మీరు భావించాల్సిన అవసరం లేదు. కొంతమంది మన వెబ్‌సైట్‌లో ఉన్న కొంత సమాచారాన్ని ప్రింట్లు తీసి, ఇంటర్నెట్ సౌకర్యంలేని తెలిసినవాళ్లకు ఇవ్వాలని కోరుకోవచ్చు. అయితే సంఘాలు అలా చేయాల్సిన అవసరం లేదు.
మన ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తానని ఇచ్చిన మాటను యేసు నిలబెట్టుకుంటున్నందుకు మనం ఎంతో కృతజ్ఞులం. కష్టాలతో నిండిన ఈ అంత్యదినాలు వేగంగా అంతానికి చేరువౌతుండగా, యెహోవా “తగినవేళ [ఆధ్యాత్మిక] అన్నము” పెడుతూనే ఉంటాడని మనం నమ్మకంతో ఉండవచ్చు.