కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘తిరిగొచ్చి మీ సహోదరులను స్థిరపర్చండి’

‘తిరిగొచ్చి మీ సహోదరులను స్థిరపర్చండి’

యేసు ఎవరో తెలియదని చెప్పిన తర్వాత పేతురు కుమిలికుమిలి ఏడ్చాడు. పేతురు ఆధ్యాత్మికంగా బలపడడానికి ఆ తర్వాత కష్టపడాల్సి వచ్చింది, అయినా ఇతరులకు సహాయం చేయడానికి పేతురును ఉపయోగించుకోవాలని యేసు కోరుకున్నాడు. అందుకే పేతురుతో, “నీ మనసు తిరిగిన తరువాత నీ సహోదరులను స్థిరపరచు” అని చెప్పాడు. (లూకా 22:32, 54-62) పేతురు ఆ తర్వాత మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘంలో ఒక స్తంభంలా ఎదిగాడు. (గల. 2:8) అలాగే, ఒకప్పుడు సంఘపెద్దగా సేవచేసిన సహోదరుడు, ఇప్పుడు మళ్లీ ఆ బాధ్యతను చేపట్టి తోటి విశ్వాసులను ఆధ్యాత్మికంగా బలపర్చేపనిలో సంతోషించవచ్చు.

గతంలో పర్యవేక్షకులుగా సేవచేసిన కొంతమంది, ఆ బాధ్యత నుండి తీసేసిన తర్వాత తాము విఫలం అయిపోయామన్నట్లుగా భావించివుండవచ్చు. దక్షిణ అమెరికాలో 20 సంవత్సరాల కంటే ఎక్కువకాలం సంఘపెద్దగా సేవచేసిన జూలియో a ఏమంటున్నాడంటే, “ప్రసంగాల కోసం సిద్ధపడడం, సహోదరులను సందర్శించడం, సంఘ సభ్యులను సంరక్షించడం వంటివే నా జీవితంలో ఎక్కువగా ఉండేవి. అవన్నీ ఒక్కసారిగా పోవడంతో నా జీవితం శూన్యంగా మారింది. అది చాలా బాధాకరమైన సమయం.” ప్రస్తుతం జూలియో మళ్లీ సంఘపెద్దగా సేవచేస్తున్నాడు.

“అది మహానందమని యెంచుకొనుడి”

శిష్యుడైన యాకోబు ఇలా రాశాడు, “నా సహోదరులారా . . . మీరు నానా విధములైన శోధనలలో పడునప్పుడు, అది మహానందమని యెంచుకొనుడి.” (యాకో. 1:2) హింసల వల్ల, అపరిపూర్ణత వల్ల ఎదురయ్యే కష్టాల గురించి యాకోబు ఇక్కడ మాట్లాడుతున్నాడు. స్వార్థ కోరికల గురించి, పక్షపాతం చూపించడం వంటివాటి గురించి ఆయన ప్రస్తావించాడు. (యాకో. 1:14; 2:1; 4:1, 2, 11) యెహోవా క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మనకు బాధగానే ఉండవచ్చు. (హెబ్రీ. 12:11) అయితే అలాంటి బాధవల్ల మనం ఆనందాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు.

మనల్ని సంఘంలోని బాధ్యతల నుండి తొలగించినా, మన విశ్వాసం బలంగా ఉందని, మనం యెహోవాను ప్రేమిస్తున్నామని నిరూపించుకునే అవకాశం మనకింకా ఉంది. మనం పెద్దలుగా ఎందుకు సేవ చేశామో కూడా ఆలోచించవచ్చు. మనం ఆ బాధ్యత కోసం అర్హతలు సంపాదించుకున్నది మన ప్రయోజనం కోసమా? లేక దేవుని మీదున్న ప్రేమ, సంఘం ఆయనకు చెందిందనే నమ్మకం, దాన్ని మృదువుగా కాయాలనే కోరిక మనల్ని కదిలించాయా? (అపొ. 20:28-30) గతంలో పెద్దలుగా సేవచేసిన చాలామంది పరిశుద్ధ సేవలో సంతోషంగా కొనసాగుతూ, యెహోవా మీద తమ ప్రేమ నిస్వార్థమైనదని సాతానుతో సహా అందరికీ రుజువుచేస్తున్నారు.

పెద్దపెద్ద పాపాలు చేసినందుకు దావీదుకు యెహోవా క్రమశిక్షణ ఇచ్చాడు, దావీదు దాన్ని అంగీకరించాడు కాబట్టే క్షమాపణ పొందాడు. ఆయన ఇలా పాడాడు, “తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవాచేత నిర్దోషి అని యెంచబడినవాడు ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు.” (కీర్త. 32:1, 2) ఆ క్రమశిక్షణ దావీదు వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చి, ఆయన్ను నిస్సందేహంగా దేవుని ప్రజల మంచి కాపరిగా మార్చింది.

మళ్లీ సంఘ పెద్దలుగా సేవ మొదలుపెట్టిన చాలామంది, గతంలో కంటే మరింత మంచి కాపరులుగా తయారయ్యారు. అలాంటి ఒక పెద్ద ఏమంటున్నాడంటే, “తప్పు చేసిన వాళ్లపట్ల ఎలా శ్రద్ధ చూపించాలో గతంలో కన్నా ఇప్పుడు బాగా అర్థం చేసుకుంటున్నాను.” మరో పెద్ద ఇలా అంటున్నాడు, “సహోదరులకు సేవచేసే ఈ అవకాశాన్ని ఇప్పుడు మరింత విలువైనదిగా చూస్తున్నాను.”

మీరు మళ్లీ సేవ చేయగలరా?

“[యెహోవా] ఎల్లప్పుడు వ్యాజ్యెమాడువాడు కాడు” అని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 103:9) కాబట్టి గంభీరమైన తప్పు చేసిన వ్యక్తిని యెహోవా మళ్లీ ఎన్నడూ నమ్మడని మనం అనుకోకూడదు. ఎన్నో సంవత్సరాలు సంఘపెద్దగా సేవచేసిన రికార్డో ఇలా గుర్తుచేసుకుంటున్నాడు, “తప్పు చేసినప్పుడు తీవ్రమైన నిరాశకు గురయ్యాను. నేను సరిపోననే ఆలోచనవల్ల, మళ్లీ సంఘపెద్దగా నా సహోదరులకు సేవ చేయడానికి చాలాకాలం ముందుకు రాలేకపోయాను. నేను నమ్మకస్థుణ్ణేనని నిరూపించుకోవడానికి కావాల్సిన ఆత్మవిశ్వాసం నాలో లోపించింది. అయితే ఇతరులకు సహాయం చేయడమంటే నాకిష్టం కాబట్టి, బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తూ, రాజ్యమందిరంలో సహోదరులను ప్రోత్సహిస్తూ, వాళ్లతో కలిసి పరిచర్య చేయడంలో నిమగ్నమయ్యాను. నా ఆత్మవిశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవడానికి అవి నాకు సహాయం చేశాయి, ప్రస్తుతం నేను మళ్లీ సంఘపెద్దగా సేవచేస్తున్నాను.”

తమ ఆనందాన్ని తిరిగి సంపాదించుకోవడానికి, సేవ చేయాలని మళ్లీ కోరుకోవడానికి యెహోవా పురుషులకు సహాయం చేశాడు

కోపాన్ని మనసులో ఉంచుకోవడం వల్ల ఓ సహోదరుడు మళ్లీ సంఘపెద్దగా సేవ చేయడానికి ముందుకు రాకపోవచ్చు. ఈ విషయంలో దావీదును అనుకరించడం ఎంత ఉత్తమమో కదా! అసూయపరుడైన సౌలు నుండి పారిపోతున్న దావీదుకు, సౌలుమీద పగ తీర్చుకునేందుకు ఎన్ని అవకాశాలు వచ్చినా ఆయన ఆ పని చేయలేదు. (1 సమూ. 24:4-7; 26:8-12) అంతేకాదు, సౌలు యుద్ధంలో చనిపోయినప్పుడు, ఆయన్ను ఆయన కుమారుడైన యోనాతానును “ప్రజల అభిమానం చూరగొన్నవారు, మనోహరమైనవారు” అని వర్ణిస్తూ దావీదు వాళ్ల గురించి ఏడ్చాడు. (2 సమూ. 1:21-23, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) దావీదు కోపాన్ని మనసులో ఉంచుకోలేదు.

మిమ్మల్ని అపార్థం చేసుకున్నారని లేదా మీకు అన్యాయం జరిగిందని అనిపిస్తే, మనసులో కోపం పెట్టుకోకుండా జాగ్రత్తపడండి. ఉదాహరణకు, బ్రిటన్‌లో దాదాపు 30 సంవత్సరాలు పెద్దగా సేవచేసిన విలియమ్స్‌ను ఆ బాధ్యతనుండి తొలగించినప్పుడు ఆయన తోటి పెద్దల్లో కొంతమంది మీద కోపం పెంచుకున్నాడు. ఆయన దాన్ని ఎలా తీసేసుకోగలిగాడు? “యోబు పుస్తకం చదవడం వల్ల నేను ప్రోత్సాహం పొందాను. తన ముగ్గురు స్నేహితులతో సమాధానపడడానికి యెహోవా యోబుకు సహాయం చేశాడంటే, క్రైస్తవ పెద్దలతో సమాధానపడడానికి నాకు ఇంకెంత ఎక్కువగా సహాయం చేస్తాడో” అని ఆయన చెబుతున్నాడు.—యోబు 42:7-9.

కాపరులుగా మళ్లీ సేవ చేసేవాళ్లను యెహోవా ఆశీర్వదిస్తాడు

దేవుని మందను కాసే బాధ్యతనుండి మీ అంతట మీరే తప్పుకుంటే, మీరెందుకు అలా చేశారో పరిశీలించుకోవడం మంచిది. మీరు సమస్యల్లో మునిగిపోవడంవల్ల అలా చేశారా? మీరు జీవితంలోని వేరే విషయాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారా? లేదా ఇతరుల అపరిపూర్ణతల వల్ల మీరు నిరుత్సాహపడ్డారా? కారణం ఏదైనా, మీరు సంఘపెద్దగా ఉన్న రోజుల్లో అనేక విధాలుగా ఇతరులకు సేవ చేయగలిగారని గుర్తుంచుకోండి. మీ ప్రసంగాలు వాళ్లను బలపర్చాయి, మీ ఆదర్శం వాళ్లను ప్రోత్సహించింది, మీరు చేసిన కాపరి సందర్శనాలు సమస్యల్ని సహించడానికి వాళ్లకు సహాయం చేశాయి. మీరు నమ్మకమైన సంఘపెద్దగా చేసిన సేవ మీ హృదయాన్ని సంతోషపెట్టినట్లే, యెహోవా హృదయాన్ని కూడా సంతోషపెట్టింది.—సామె. 27:11.

పరిశుద్ధ సేవలో సంతోషంగా పాల్గొంటూ యెహోవా పట్ల మీకున్న ప్రేమను నిరూపించుకోండి

యెహోవా సహాయంతో చాలామంది పురుషులు తమ ఆనందాన్ని తిరిగి సంపాదించుకున్నారు, సంఘంలో బాధ్యతలు చేపట్టాలని మళ్లీ కోరుకున్నారు. సంఘపెద్దగా ఉండకుండా మీరే తప్పుకున్నా లేదా మిమ్మల్ని తొలగించినా, మీరు మళ్లీ ‘అధ్యక్ష్యపదవి’ కోసం అర్హతలు సంపాదించుకోవచ్చు. (1 తిమో. 3:1) కొలొస్సయిలోని క్రైస్తవులు దేవుని చిత్తం గురించిన ఖచ్చితమైన జ్ఞానం సంపాదించుకుని, “అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు, ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని” పౌలు వాళ్ల కోసం ‘మానక ప్రార్థించాడు.’ (కొలొ. 1:9, 10) మీరు మళ్లీ సంఘపెద్దగా సేవ చేస్తుంటే, సహనం, సంతోషం కోసం యెహోవాపై ఆధారపడండి. ఈ అంత్యదినాల్లో దేవుని ప్రజలకు ప్రేమగల ఆధ్యాత్మిక కాపరుల సహాయం అవసరం. మీరు మీ సహోదరులను స్థిరపర్చగలరా? అందుకోసం ముందుకు వస్తారా?

a కొన్ని పేర్లు అసలు పేర్లు కావు.