కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆనాటి జ్ఞాపకాలు

“యురేకా డ్రామా” వల్ల చాలామంది బైబిలు సత్యం తెలుసుకున్నారు

“యురేకా డ్రామా” వల్ల చాలామంది బైబిలు సత్యం తెలుసుకున్నారు

“యురేకా” అంటే అర్థం “నేను దాన్ని కనుగొన్నాను!” 19వ శతాబ్దంలో అమెరికాలోని, కాలిఫోర్నియాలో బంగారం కోసం త్రవ్వకాలు జరుగుతున్నప్పుడు ఎవరికైనా బంగారం దొరికితే “యురేకా” అని అరిచేవాళ్లు. అయితే ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, ఆయన తోటి బైబిలు విద్యార్థులు బంగారం కన్నా ఎంతో విలువైన బైబిలు సత్యం కనుగొన్నారు. దాన్ని ఇతరులతో పంచుకోవాలని వాళ్లు ఆరాటపడ్డారు.

బైబిలు విద్యార్థుల సమాఖ్య (I.B.S.A.) రూపొందించిన ఎనిమిది గంటల “ఫోటో డ్రామా ఆఫ్‌ క్రియేషన్‌” ప్రదర్శనను 1914 వేసవికాలంకల్లా పెద్దపెద్ద పట్టణాల్లో లక్షలమంది చూశారు. ఆశ్చర్యపరిచే చలనచిత్రాలు, రంగురంగుల స్లైడ్లు, ఆసక్తికరమైన వ్యాఖ్యానం, చక్కని శాస్త్రీయ సంగీతంతో ఉన్న ఆ బైబిలు ఆధారిత ప్రదర్శనలో సృష్టి నుండి, యేసుక్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన చివరివరకూ కళ్లకు కట్టినట్లు చూపించారు.—ప్రక. 20:4. a

అయితే చిన్న పట్టణాల్లో, పల్లెల్లో ఉండేవాళ్ల సంగతేంటి? సత్యం కోసం ఆకలితో ఉన్న వాళ్లందరూ దాన్ని తప్పక చూడాలనే ఉద్దేశంతో 1914 ఆగస్టు నెలలో బైబిలు విద్యార్థులు, ‘ఫోటో డ్రామాలోని’ చలనచిత్రాలను తీసివేసి “యురేకా డ్రామా” తయారుచేశారు. దాన్ని ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు, దానిలో మూడు రకాలు ఉన్నాయి. వాటిని అనేక భాషల్లో రూపొందించారు. వాటిలో ఒకటి “యురేకా X”, దానిలో రికార్డు చేసిన అన్ని వ్యాఖ్యానాలతో పాటు సంగీతం కూడా ఉండేది. రెండవదైన “యురేకా Y” ప్రదర్శనలో అన్ని రికార్డింగ్‌లతో పాటు అందమైన రంగుల స్లైడ్లు ఉండేవి. ఇక మూడవది “యురేకా ఫ్యామిలీ డ్రామా,” దాన్ని ఇళ్లల్లో చూడడానికి రూపొందించారు. దానిలో ఎంపికచేసిన కొన్ని వ్యాఖ్యానాలు, పాటలు ఉండేవి. తక్కువ ఖర్చుతో ఫోనోగ్రాఫ్‌లు, ప్రొజెక్టర్లు కూడా తీసుకునే అవకాశం ఉండేది.

రంగురంగుల స్లైడ్లు చూపించడానికి ఓ ప్రొజెక్టర్‌ ఉపయోగించారు

ఫిల్మ్‌ ప్రొజెక్టర్‌, పెద్ద తెరలు అవసరం లేకుండానే, బైబిలు విద్యార్థులు ఈ ఉచిత ప్రదర్శనను పల్లెల్లోని ప్రజలకు చూపిస్తూ రాజ్య సందేశాన్ని కొత్త ప్రాంతాలకు తీసుకెళ్లగలిగారు. కేవలం వ్యాఖ్యానాలే ఉన్న ‘యురేకా Xను’ పగలే కాదు రాత్రిళ్లు కూడా వినిపించవచ్చు. “యురేకా Y” స్లైడ్‌ ప్రొజెక్టర్‌ను విద్యుత్తు లేకుండానే కార్బైడ్‌ దీపం ఉపయోగించి ప్రదర్శించగలిగారు. “మనం ఈ చిత్రాలను దాదాపు ఎక్కడైనా చూపించవచ్చు” అని ఫిన్నిష్‌ భాషలోని కావలికోటలో వచ్చిన ఓ నివేదిక చెప్పింది. అది ఎంత వాస్తవమో!

పెద్ద హాళ్లు అద్దెకు తీసుకునే బదులు, బైబిలు విద్యార్థులు తెలివిగా స్కూల్‌ తరగతి గదులు, కోర్టు ప్రాంగణాలు, రైల్వేస్టేషన్లు, పెద్ద ఇళ్లలోని హాళ్లు వంటి ఉచిత సౌకర్యాలను ఉపయోగించుకునే వాళ్లు. ఇంటిబయట గిడ్డంగుల పక్కన పెద్ద తెల్లటి తెర వేలాడదీసి దానిమీద చాలా ప్రదర్శనలను చూపించేవాళ్లు. ఆంథనీ హమ్‌బుక్‌ ఇలా రాశాడు, “రైతులైతే తమ తోటలో అందరూ కూర్చొని చూడడానికి వీలుగా చెట్టు మొద్దులను బల్లల్లా వేసి చిన్న స్టేడియంలా ఏర్పాటు చేసేవాళ్లు.” ఈ “యురేకా” టీమ్‌వాళ్లు ప్రదర్శనకు అవసరమైన సామాగ్రిని, తమ వస్తువులను, వంట చేసుకోవడానికి, పడుకోవడానికి కావాల్సిన వస్తువులను ఉంచడానికి “డ్రామా వాగన్‌” అనే బండిని ఉపయోగించేవాళ్లు.

“యురేకా డ్రామా” చూడ్డానికి ప్రేక్షకులు పదుల నుండి వందల సంఖ్యలో వచ్చేవాళ్లు. అమెరికాలో, 150 మంది జనాభాగల చిన్న పట్టణంలోని స్కూల్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనలను 400 మంది చూశారు. ఇంకొన్ని చోట్ల, “యురేకా డ్రామా” చూడడానికి కొందరు 8 కిలోమీటర్లు నడిచి వచ్చారు. స్వీడన్‌లోని షార్లట్‌ ఆల్‌బెర్గ్‌ అనే మహిళ ఇంట్లో ఆమె పొరుగువాళ్లు సమకూడి ఆ రికార్డింగ్‌లను వింటున్నప్పుడు అవి వాళ్లను ‘నిజంగా కదిలించాయి.’ ఆస్ట్రేలియాలో, గనులున్న ఓ మారుమూల పట్టణంలో ఒక్క ప్రదర్శనకే దాదాపు 1,500 మంది హాజరయ్యారు. స్కూళ్లలో, కాలేజీల్లో “ప్రొఫెసర్లు, విద్యార్థులు చిత్రాలను చూసి, మన అద్భుతమైన ఫోనోగ్రాఫ్‌ రికార్డింగ్‌లను విని ముగ్ధులయ్యారు” అని ఓ కావలికోట తెలియజేసింది. సినిమాహాళ్లు ఉన్న చోట్ల కూడా ఈ “యురేకా డ్రామా” ప్రజాదరణ పొందింది.

సత్యపు విత్తనాలకు నీళ్లుపోయడం

బైబిలు విద్యార్థుల తరగతుల లేదా సంఘాల నుండి ప్రసంగీకులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి ప్రసంగాలిచ్చి, “యురేకా డ్రామా” చూపించి కొత్త అధ్యయన తరగతులు ప్రారంభించారు. “యురేకా డ్రామా” ఎంతమంది చూశారో ఖచ్చితంగా చెప్పడం కష్టమే. చాలా డ్రామా సెట్లను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. అయినా, 1915⁠లో 86 “డ్రామా” టీముల్లో కేవలం 14 టీముల వాళ్లు మాత్రమే తమ ప్రదర్శనల గురించి క్రమంగా నివేదించేవాళ్లు. టీమ్‌ల నివేదికలు పూర్తిగా అందకపోవడం కాస్త బాధ అనిపించినా, సంవత్సరం చివర్లో సమీక్షించినప్పుడు పది లక్షలకన్నా ఎక్కువమంది “డ్రామా” చూశారని తెలిసింది. దాదాపు 30,000 మంది బైబిలు సాహిత్యం కోసం అడిగారు.

“యురేకా డ్రామా” చరిత్రలో అంతగా నిలిచిపోలేదు. అయినప్పటికీ ఆస్ట్రేలియా నుండి అర్జెంటీనా వరకు, దక్షిణ ఆఫ్రికా నుండి బ్రిటీష్‌దీవులు, ఇండియా, కరీబియన్‌ ప్రాంతాల వరకు లక్షలమంది ఈ ప్రత్యేక ప్రదర్శనను చూసివుంటారు. వాళ్లలో చాలామంది బంగారం కన్నా విలువైన బైబిలు సత్యాన్ని కనుగొని, “యురేకా” అని అరిచివుంటారు.

a కావలికోట ఫిబ్రవరి 15, 2014 సంచికలోని 30-32 పేజీల్లో ఉన్న “ఆనాటి జ్ఞాపకాలు—100 ఏళ్ల విశ్వాస గాథ” చూడండి.