కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా మనకెలా సన్నిహితమౌతాడు?

యెహోవా మనకెలా సన్నిహితమౌతాడు?

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”—యాకో. 4:8.

1. మనుషులకు ఏ అవసరం ఉంది? ఆ అవసరాన్ని ఎవరు తీరుస్తారు?

 ఇతరులకు సన్నిహితంగా ఉండాల్సిన అవసరం మనుషులకు ఎంతో ఉంది. ఇద్దరు వ్యక్తులు ‘ఒకరినొకరు ఇష్టపడుతున్నప్పుడు, ఒకరికొకరు బాగా తెలిసినప్పుడు సన్నిహితంగా ఉన్నారు’ అని చెప్పవచ్చు. మనల్ని ప్రేమించే, అర్థంచేసుకునే, మనకు విలువిచ్చే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మనకున్న అనుబంధాలు సహజంగానే సంతోషాన్నిస్తాయి. అయితే, మనం అత్యంత సన్నిహిత సంబంధం కలిగివుండాల్సింది, మన గొప్ప సృష్టికర్తతోనే.—ప్రసం. 12:2.

2. యెహోవా మనకు ఏమని మాటిస్తున్నాడు? అయితే చాలామంది ఎందుకు దాన్ని నమ్మరు?

2 తన ‘వద్దకు’ రమ్మని యెహోవా మనల్ని ఆహ్వానిస్తున్నాడు, మనం అలా చేస్తే ఆయన మన ‘వద్దకు’ వస్తానని మాటిస్తున్నాడు. (యాకో. 4:8) ఆ మాటే ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. అయితే, దేవుడు తమకు దగ్గరవ్వాలని కోరుకుంటున్నాడనే వాస్తవాన్ని చాలామంది నమ్మరు. దేవునికి సన్నిహితం కావడానికి తమకు అర్హత లేదని, ఆయన అందనంత దూరంలో ఉంటాడని వాళ్లు అనుకుంటారు. అయితే, యెహోవాతో సాన్నిహిత్యం నిజంగా సాధ్యమేనా?

3. యెహోవా గురించి ఏ విషయాన్ని మనం అర్థంచేసుకోవాలి?

3 యెహోవాను తెలుసుకోవడం ఖచ్చితంగా సాధ్యమే, ఎందుకంటే తనను వెదికే వాళ్లకు ఆయన “దూరముగా ఉండువాడు కాడు.” (అపొస్తలుల కార్యములు 17:26, 27; కీర్తన 145:18 చదవండి.) అపరిపూర్ణ మనుషులు కూడా తనకు సన్నిహితం కావాలనేదే మన దేవుని సంకల్పం. తన సన్నిహిత స్నేహితులుగా వాళ్లను అక్కున చేర్చుకోవడానికి ఆయన సిద్ధంగా, ఇష్టంగా ఉన్నాడు. (యెష. 41:8; 55:6) అందుకే తన సొంత అనుభవంతో కీర్తనకర్త యెహోవా గురించి ఇలా రాశాడు, “ప్రార్థన ఆలకించువాడా, సర్వశరీరులు నీయొద్దకు వచ్చెదరు . . . నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు.” (కీర్త. 65:2, 4) ఇప్పుడు మనం, యూదాను పాలించిన ఆసా దేవునికి ఎలా సన్నిహితమయ్యాడో, యెహోవా కూడా ఆయనకు ఎలా సన్నిహితమయ్యాడో బైబిల్లో చూద్దాం. a

ప్రాచీనకాల ఉదాహరణ నుండి నేర్చుకోండి

4. రాజైన ఆసా యూదా ప్రజలకు ఎలాంటి ఆదర్శాన్ని ఉంచాడు?

4 రాజైన ఆసా, యూదాలో ప్రబలంగా ఉన్న విగ్రహారాధనను, దేవదాసీతనాన్ని నిర్మూలించి స్వచ్ఛారాధన విషయంలో అద్భుతమైన ఉత్సాహాన్ని చూపించాడు. (1 రాజు. 15:9-13) అందుకే, ‘వారి పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించమని, ధర్మశాస్త్రమును, విధినిబట్టి క్రియలు జరిగించమని’ ఆసా ప్రజలకు ధైర్యంగా చెప్పాడు. యెహోవా ఆశీర్వాదంవల్ల, ఆసా పరిపాలనలోని మొదటి పదేళ్లలో శాంతిసమాధానాలు వర్ధిల్లాయి. దానికి కారణం ఎవరని ఆసా ఒప్పుకున్నాడు? “మన దేవుడైన యెహోవాను మనము ఆశ్రయించితిమి, ఆశ్రయించినందున ఆయన మన చుట్టును నెమ్మది కలుగజేసి యున్నాడు; దేశమందు మనము నిరభ్యంతరముగా తిరుగవచ్చును” అని ఆసా ప్రజలతో అన్నాడు. (2 దిన. 14:1-7) ఆ తర్వాత ఏమి జరిగిందో చూడండి.

5. దేవుని మీద ఆధారపడుతున్నాడని ఆసా ఏ పరిస్థితిలో నిరూపించుకున్నాడు? దాని ఫలితం ఏమిటి?

5 ఆసా స్థానంలో మీరు ఉన్నట్లు ఊహించుకోండి. 10 లక్షల సైన్యంతో, 300 రథాలతో కూషీయుడైన జెరహు యూదా మీదికి దండెత్తాడు. (2 దిన. 14:8-10) మీ రాజ్యంపైకి అంత పెద్ద సైన్యం రావడం చూస్తే మీకెలా అనిపిస్తుంది? మీ దగ్గరేమో 5,80,000 మంది సైనికులు మాత్రమే ఉన్నారు! దాదాపు రెట్టింపు సైన్యం మీమీదికి వస్తుంటే, దేవుడు ఈ దాడిని ఎందుకు ఆపట్లేదని మీరు అనుకుంటారా? ఆ అత్యవసర పరిస్థితిలో మీరు సొంత తెలివితేటల మీద ఆధారపడతారా? ఆసా చేసిన పనిని చూస్తే, ఆయనకు యెహోవాపై ఎంత నమ్మకం, ఆయనతో ఎంత సన్నిహిత సంబంధం ఉన్నాయో అర్థమౌతుంది. “మా దేవా యెహోవా, మాకు సహాయము చేయుము, నిన్నే నమ్ముకొని యున్నాము, నీ నామమును బట్టియే యీ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి యున్నాము. యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైని జయమొందనియ్యకుము” అని ఆసా తీవ్రంగా ప్రార్థించాడు. ఆసా హృదయపూర్వకంగా చేసిన ఆ మనవికి దేవుడు ఎలా స్పందించాడు? ‘యెహోవా ఆ కూషీయులను మొత్తాడు.’ వాళ్లలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదు.—2 దిన. 14:11-13.

6. మనం ఆసాను ఎలా అనుకరించాలి?

6 దేవుడు తనను కాపాడతాడనే, తగిన నిర్దేశం ఇస్తాడనే అచంచల విశ్వాసం ఆసా ఎలా పెంచుకోగలిగాడు? ఆసా “యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొని,” “హృదయపూర్వకముగా యెహోవాను అనుసరించెను” అని బైబిలు చెబుతుంది. (1 రాజు. 15:11, 14) మనం కూడా హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించాలి. ఇప్పుడూ, భవిష్యత్తులోనూ దేవునితో సన్నిహిత సంబంధం ఆస్వాదించాలంటే అది చాలా ప్రాముఖ్యం. యెహోవాయే చొరవ తీసుకుని మనల్ని తన అక్కున చేర్చుకున్నందుకు; తనతో సన్నిహిత బంధాన్ని ఏర్పర్చుకుని, దాన్ని కాపాడుకోవడానికి సహాయం చేస్తున్నందుకు మనం ఎంత కృతజ్ఞులమో! దేవుడు ఏ రెండు విధానాల్లో ఆ పని చేశాడో ఇప్పుడు చూద్దాం.

యెహోవా, విమోచన క్రయధనం ద్వారా మనల్ని తనకు సన్నిహితం చేసుకున్నాడు

7. (ఎ) మనల్ని తనకు సన్నిహితం చేసుకోవడానికి యెహోవా ఏమి చేశాడు? (బి) యెహోవా అలా చేస్తున్న అతిగొప్ప విధానం ఏమిటి?

7 మనకోసం అందమైన భూమిని సృష్టించి, యెహోవా మనమీద ప్రేమ చూపించాడు. మనం బ్రతకడానికి కావాల్సిన అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ ఇప్పటికీ మనమీద ప్రేమ చూపిస్తూనే ఉన్నాడు. (అపొ. 17:28; ప్రక. 4:10, 11) అన్నిటికన్నా ముఖ్యంగా, యెహోవా మన ఆధ్యాత్మిక అవసరాలు తీరుస్తున్నాడు. (లూకా 12:42) మన ప్రార్థనలను స్వయంగా తానే వింటాననే అభయాన్ని కూడా ఇస్తున్నాడు. (1 యోహా. 5:14) అయితే యెహోవా తన ప్రేమను చూపిస్తున్న అతి గొప్ప విధానం, విమోచన క్రయధనం. దానిద్వారా యెహోవా మనకు దగ్గరవుతున్నాడు, మనం ఆయనకు దగ్గరవుతున్నాం. (1 యోహాను 4:9, 10, 19 చదవండి.) మనల్ని పాపమరణాల నుండి విడిపించడానికి యెహోవా తన ‘అద్వితీయ కుమారుణ్ణి’ ఈ భూమ్మీదికి పంపించాడు.—యోహా. 3:16.

8, 9. యెహోవా సంకల్పంలో యేసు పాత్ర ఏమిటి?

8 క్రీస్తుకు ముందు జీవించిన వాళ్లుకూడా విమోచన క్రయధనం నుండి ప్రయోజనం పొందాలని యెహోవా కోరుకున్నాడు. మానవజాతిని రక్షించబోయే వ్యక్తి గురించి యెహోవా ప్రవచించినప్పుడే, ఆయన దృష్టిలో విమోచన క్రయధనం చెల్లించబడింది. ఎందుకంటే, తన సంకల్పం ఎన్నడూ తప్పిపోదని యెహోవాకు తెలుసు. (ఆది. 3:15) శతాబ్దాల తర్వాత అపొస్తలుడైన పౌలు, “క్రీస్తుయేసునందలి విమోచనము” విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెప్పాడు. ‘పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమివలన ఉపేక్షించాడు’ అని కూడా ఆయన అన్నాడు. (రోమా. 3:21-26) దేవునికి మనల్ని సన్నిహితం చేయడంలో యేసుకు ఎంత ముఖ్యమైన పాత్ర ఉందో కదా!

9 దీనులైన ప్రజలు కేవలం యేసు ద్వారానే యెహోవాను తెలుసుకుని, ఆయనతో సన్నిహిత బంధాన్ని కలిగివుండగలరు. ఈ సత్యాన్ని లేఖనాలు ఎలా నొక్కిచెబుతున్నాయి? పౌలు ఇలా రాశాడు, “దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.” (రోమా. 5:6-8) మనం అర్హులమని కాదుగానీ, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టే యేసు విమోచన క్రయధనాన్ని అనుగ్రహించాడు. “నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని యెవడును నా యొద్దకు రాలేడు” అని యేసు అన్నాడు. మరో సందర్భంలో “నా ద్వారానే తప్ప యెవడును తండ్రియొద్దకు రాడు” అన్నాడు. (యోహా. 6:44; 14:6) యెహోవా తన పరిశుద్ధాత్మను ఉపయోగిస్తూ, యేసు ద్వారా మనల్ని తన దగ్గరకు ఆకర్షించుకుంటాడు. అంతేకాక, మనం నిత్యజీవ నిరీక్షణతో తన ప్రేమలో నిలిచివుండేలా పరిశుద్ధాత్మ ద్వారా సహాయం చేస్తున్నాడు. (యూదా 20, 21 చదవండి.) యెహోవా మనల్ని తనకు సన్నిహితం చేసుకునే మరో విధానాన్ని చూద్దాం.

యెహోవా, తన వాక్యం ద్వారా మనల్ని తనకు సన్నిహితం చేసుకుంటున్నాడు

10. మనం దేవునికి దగ్గరయ్యేలా బైబిలు ఎలా సహాయం చేస్తుంది?

10 ఈ ఆర్టికల్‌లో ఇప్పటివరకు మనం 14 వివిధ బైబిలు పుస్తకాల్లోని లేఖనాలను ఉపయోగించాం. అసలు బైబిలే లేకపోతే, మనం సృష్టికర్తకు సన్నిహితం కాగలమని తెలిసుండేదా? బైబిలు లేకుండా, విమోచన క్రయధనం గురించి, యేసు ద్వారా యెహోవా మనల్ని ఆకర్షించడం గురించి తెలుసుకోగలమా? యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ని రాయించాడు. ఆయన ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గురించి, ఉన్నతమైన సంకల్పాల గురించి అది తెలియజేస్తుంది. ఉదాహరణకు, నిర్గమకాండము 34:6, 7⁠లో యెహోవా తన గురించి మోషేకు ఇలా వివరించాడు, “కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల దేవుడైన యెహోవా, ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును.” అలాంటి వ్యక్తికి సన్నిహితం అవ్వాలని ఎవరు కోరుకోరు? మనం బైబిలు ద్వారా తన గురించి ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అంతెక్కువగా తనను ఓ నిజమైన వ్యక్తిలా చూస్తామని, సన్నిహితమౌతామని యెహోవాకు తెలుసు.

11. మనం యెహోవా లక్షణాల గురించి, విధానాల గురించి తెలుసుకోవడానికి ఎందుకు కృషిచేయాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 దేవునికి ఎలా దగ్గరవ్వవచ్చో వివరిస్తూ, యెహోవాకు సన్నిహితమవ్వండి పుస్తకంలోని ముందుమాట ఇలా చెబుతుంది, “మనమెవరితో స్నేహాన్ని పెంపొందింపజేసుకోవాలన్నా అది ఆ వ్యక్తిని తెలుసుకొని, అతని విశేష లక్షణాలను ప్రశంసిస్తూ వాటిని విలువైనవిగా పరిగణించడంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి బైబిల్లో వెల్లడిచేయబడిన దేవుని లక్షణాలు, విధానాలు అధ్యయనం చేయడానికి ముఖ్యమైన అంశాలు.” యెహోవా తన వాక్యాన్ని మనకు అర్థమయ్యేలా రాయించినందుకు ఎంత కృతజ్ఞులమో!

12. బైబిల్ని రాయించడానికి యెహోవా మనుషులను ఎందుకు ఉపయోగించాడు?

12 యెహోవా కావాలనుకుంటే బైబిల్ని దూతల చేత రాయించగలిగేవాడే. పైగా, దూతలకు మనమన్నా, మనం చేసే పనులన్నా ఎంతో ఆసక్తి ఉంది. (1 పేతు. 1:12) మనుషులకు దేవుడిచ్చిన సందేశాన్ని దూతలు రాయగలిగేవాళ్లని చెప్పడంలో సందేహం లేదు. కానీ దూతలు మనుషుల్లా ఆలోచించి ఉండేవాళ్లా? మన అవసరాలను, బలహీనతలను, ఆశలను వాళ్లు అర్థం చేసుకోగలిగేవాళ్లా? లేదు, ఈ విషయంలో దూతలకున్న పరిమితుల్ని యెహోవా అర్థం చేసుకున్నాడు. మనుషుల చేత బైబిల్ని రాయించడం వల్లే అది మనసులను హత్తుకునే విధంగా ఉంది. బైబిలు రచయితల, ఇతరుల నిరుత్సాహాలను, అనుమానాలను, భయాలను, తప్పులను మనం బైబిల్లో చదివినప్పుడు వాళ్ల బాధను మనం అర్థంచేసుకోగలుగుతున్నాం. అలాగే, వాళ్లు సంతోషంగా ఉన్న సందర్భాల గురించి చదివినప్పుడు మనమూ సంతోషించగలుగుతున్నాం. ఏలీయా ప్రవక్తలాగే బైబిలు రచయితలందరూ “మనవంటి స్వభావముగల” వాళ్లే.—యాకో. 5:17.

యోనాతో, పేతురుతో యెహోవా వ్యవహరించిన తీరు మిమ్మల్ని ఆయనకు ఎలా మరింత సన్నిహితం చేస్తుంది? (13, 15 పేరాలు చూడండి)

13. యోనా ప్రార్థన చదువుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది?

13 ఉదాహరణకు, దేవుడు చెప్పిన పని చేయకుండా పారిపోయినప్పుడు యోనా ఎలా భావించాడో దూతలు పూర్తిగా రాయగలిగేవాళ్లా? అందుకే సముద్ర గర్భంలో నుండి యోనా చేసిన హృదయపూర్వక ప్రార్థనతోపాటు ఆయన వృత్తాంతాన్ని యెహోవా యోనాతోనే రాయించడం ఎంత సరైనదో! “కూపములోనుండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా, నేను యెహోవాను జ్ఞాపకము చేసికొంటిని” అని యోనా అన్నాడు.—యోనా 1:3, 10; 2:1-9.

14. యెషయా తన గురించి రాసుకున్న మాటల్ని మనం ఎందుకు అర్థంచేసుకోగలం?

14 దైవ ప్రేరణతో యెషయా తన గురించి ఏమని రాసుకున్నాడో కూడా పరిశీలించండి. దేవుని మహిమ గురించిన దర్శనం చూసిన తర్వాత ఆ ప్రవక్త తన పాపపు స్థితి గురించి ఇలా అన్నాడు, “అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను; అపవిత్రమైన పెదవులుగల జనుల మధ్యను నివసించువాడను; నేను నశించితిని; రాజును సైన్యముల కధిపతియునగు యెహోవాను నేను కన్నులార చూచితిని.” (యెష. 6:5) దూతలైతే ఆ మాటలు అనగలిగి ఉండేవాళ్లా? కానీ యెషయా ఆ మాటలు అనగలిగాడు, ఆయనలా ఎందుకు భావించాడో మనం అర్థంచేసుకోగలం.

15, 16. (ఎ) తోటి మనుషుల భావాలను మనం ఎందుకు అర్థంచేసుకోగలుగుతాం? ఉదాహరణలు చెప్పండి. (బి) యెహోవాకు మరింత సన్నిహితం కావాలంటే ఏమి చేయాలి?

15 తాను “అపాత్రుడను” అని యాకోబు ఓ సందర్భంలో చెప్పుకున్నాడు, పేతురైతే తాను “పాపాత్ముడను” అన్నాడు. దూతలు తమగురించి ఆ మాటలు చెప్పివుండేవాళ్లా? (ఆది. 32:10; లూకా 5:8) దూతలు యేసు శిష్యుల్లా ‘భయపడి’ ఉండేవాళ్లా? అలాగే వ్యతిరేకత వచ్చినప్పుడు సువార్త ప్రకటించడానికి పౌలు, మరితరులు ‘ధైర్యం కూడగట్టుకున్నారు.’ దూతలకైతే అది అవసరమై ఉండేదా? (యోహా. 6:19; 1 థెస్స. 2:2) లేదు, దూతలు అన్నివిషయాల్లో పరిపూర్ణులు, మనకన్నా బలవంతులు. అయితే అపరిపూర్ణ మనుషులు అలాంటి భావాలు వ్యక్తం చేస్తే మనం వెంటనే అర్థంచేసుకోగలుగుతాం. ఎందుకంటే మనమూ వాళ్లలాంటి మామూలు మనుషులమే. బైబిలు చదువుతున్నప్పుడు నిజానికి మనం ‘సంతోషించే వాళ్లతో సంతోషిస్తాం; ఏడ్చే వాళ్లతో ఏడుస్తాం.’—రోమా. 12:15, 16.

16 యెహోవా తన నమ్మకమైన సేవకులతో గతంలో ఎలా వ్యవహరించాడో ధ్యానిస్తే, ఆయన గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాం. అపరిపూర్ణ మనుషులకు ఆయన ఓర్పుతో, ప్రేమతో ఎలా దగ్గరయ్యాడో చూస్తాం. అలా యెహోవాను మరింత ఎక్కువగా తెలుసుకుని, ప్రగాఢంగా ప్రేమించగలుగుతాం. దానివల్ల ఆయనకు మరింత సన్నిహితం కాగలుగుతాం.—కీర్తన 25:14 చదవండి.

దేవునితో శాశ్వత బంధాన్ని ఏర్పర్చుకోండి

17. (ఎ) అజర్యా ఆసాకు ఏ మంచి సలహా ఇచ్చాడు? (బి) అజర్యా ఇచ్చిన సలహాను ఆసా ఎలా నిర్లక్ష్యం చేశాడు? దాని ఫలితం ఏమిటి?

17 ఆసా కూషీయుల సైన్యంపై గొప్ప విజయం సాధించిన తర్వాత, దేవుని ప్రవక్త అజర్యా ఆయనకు ఓ మంచి సలహా ఇచ్చాడు. అదేంటంటే “మీరు యెహోవా పక్షపువారైనయెడల ఆయన మీ పక్షమున నుండును; మీరు ఆయనయొద్ద విచారణ చేసినయెడల ఆయన మీకు ప్రత్యక్షమగును; మీరు ఆయనను విసర్జించినయెడల ఆయన మిమ్మును విసర్జించును.” (2 దిన. 15:1, 2) కానీ, ఆసా తన జీవితంలోని చివరిదశలో ఆ సలహా పాటించలేదు. ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం యూదాపై దండెత్తినప్పుడు, ఆయన సిరియా రాజును సహాయం అడిగాడు. గతంలోలాగే సహాయం కోసం యెహోవాకు మొరపెట్టే బదులు, అన్యుల సహాయం అర్థించాడు. అందుకే యెహోవా ఆసాతో ఇలా అన్నాడు, “యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును.” ఆసా పరిపాలనలోని మిగతా సంవత్సరాలు యుద్ధాలతో నిండిపోయాయి. (2 దిన. 16:1-9) దీని నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

18, 19. (ఎ) ఒకవేళ మనం దేవునికి దూరమైతే ఏమి చేయాలి? (బి) మనం యెహోవాకు ఎలా మరింత సన్నిహితం కావచ్చు?

18 మనం ఎన్నడూ యెహోవాకు దూరం అవ్వకూడదు. ఒకవేళ దూరమైతే, “నీవు నీ దేవునితట్టు తిరుగవలెను; కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవునియందు నమ్మికనుంచుము” అని హోషేయ 12:6⁠లో ఉన్న మాటల్ని మనం పాటించాలి. కాబట్టి, విమోచన క్రయధనం గురించి కృతజ్ఞతతో ధ్యానిస్తూ, బైబిల్ని శ్రద్ధగా చదువుతూ యెహోవాకు అంతకంతకూ దగ్గరౌతూ ఉందాం.—ద్వితీయోపదేశకాండము 13:4 చదవండి.

19 “దేవుని చెంత ఉండుటే నాకు క్షేమకరము” అని కీర్తనకర్త రాశాడు. (కీర్త. 73:28, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) కాబట్టి మనమందరం యెహోవా గురించి కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూ, ఆయనను ప్రేమించడానికి ఉన్న ఎన్నో కారణాలను గుర్తిస్తూ ఉందాం. యెహోవా ఇప్పుడూ, ఎల్లప్పుడూ మనకు మరింత సన్నిహితంగా ఉండును గాక!

a ఆసా గురించి కావలికోట ఆగస్టు 15, 2012 సంచికలో “మన పనులకు తగిన ప్రతిఫలం లభిస్తుంది” అనే ఆర్టికల్‌ చూడండి.