కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవా సంకల్పంలో స్త్రీల పాత్ర

యెహోవా సంకల్పంలో స్త్రీల పాత్ర

“[సువార్త] ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.”—కీర్త. 68:11.

1, 2. (ఎ) దేవుడు ఆదాముకు ఏ బహుమతులు ఇచ్చాడు? (బి) దేవుడు ఆదాముకు ఎందుకు భార్యను ఇచ్చాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

 యెహోవా భూమిని ఒక సంకల్పంతో సృష్టించాడు. ఆయన, “నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను.” (యెష. 45:18) దేవుడు మొదట పరిపూర్ణ మానవుడైన ఆదామును సృష్టించి, అతనికి ఏదెను తోటను ఓ అద్భుతమైన గృహంగా ఇచ్చాడు. పొడవాటి చెట్లు, జలజలా ప్రవహించే వాగులు, గంతులు వేసే జంతువులను చూసి ఆదాము ఎంత ఆనందించివుంటాడో ఊహించండి! కానీ చాలా ప్రాముఖ్యమైన ఒక విషయంలో ఆయనకు కొదువ ఉంది. “నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదును” అని అన్నప్పుడు ఆ కొదువ ఏమిటో యెహోవా సూచించాడు. అప్పుడు దేవుడు ఆదాముకు గాఢనిద్ర కలుగజేసి, ఆయన ప్రక్కటెముకలలో ఒకటి తీసి ‘స్త్రీనిగా నిర్మించెను.’ ఆదాము నిద్ర లేచినప్పుడు, ఎంత సంతోషించివుంటాడో! ఆయనిలా అన్నాడు, “నా యెముకలలో ఒక యెముక నా మాంసములో మాంసము ఇది నరునిలోనుండి తీయబడెను గనుక నారి అనబడును.”—ఆది. 2:18-23.

2 దేవుడు ఆదాముకు అనుగ్రహించిన ప్రత్యేక బహుమతి హవ్వ, ఎందుకంటే ఆమె ఆదాముకు పరిపూర్ణమైన సహాయకారి. ఆమెకు పిల్లల్ని కనే అద్భుతమైన అవకాశం కూడా దేవుడిచ్చాడు. అందుకే, “ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను, ఏలయనగా ఆమె జీవముగల ప్రతివానికిని తల్లి.” (ఆది. 3:20) ఆ మొదటి మానవ దంపతులకు యెహోవా ఎంతటి అద్భుత బహుమతిని ఇచ్చాడు! వాళ్లకు ఇతర పరిపూర్ణ మనుషుల్ని కనే సామర్థ్యం ఉంది. దానివల్ల ఈ భూమంతా పరిపూర్ణ మానవులతో, వాళ్లకు లోబడే ప్రాణులతో నిండి క్రమేణా ఓ పరదైసుగా మారివుండేది.—ఆది. 1:27, 28.

3. (ఎ) దేవుని ఆశీర్వాదాలు పొందాలంటే ఆదాముహవ్వలు ఏమి చేయాల్సి ఉంది, కానీ ఏమి జరిగింది? (బి) మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 తమ ముందున్న ఆశీర్వాదాలను పొందాలంటే, ఆదాముహవ్వలు యెహోవాకు లోబడుతూ ఆయనను తమ పరిపాలకునిగా ఒప్పుకోవాలి. (ఆది. 2:15-17) అప్పుడే వాళ్లు తమ విషయంలో దేవుడు సంకల్పించిన దాన్ని నెరవేర్చగలుగుతారు. అయితే విచారకరంగా, “ఆది సర్పమైన” సాతాను ప్రేరణతో వాళ్లు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు. (ప్రక. 12:9; ఆది. 3:1-6) ఈ తిరుగుబాటు స్త్రీలపై ఎలాంటి ప్రభావం చూపించింది? ప్రాచీనకాలంలో దైవభయం గల స్త్రీలు ఎలా దేవుణ్ణి సేవించారు? నేటి క్రైస్తవ స్త్రీలను “గొప్ప సైన్యము” అని ఎందుకు పిలవవచ్చు?—కీర్త. 68:11.

తిరుగుబాటు వల్ల ఏమి జరిగింది?

4. మొదటి మానవ దంపతులు చేసిన పాపానికి దేవుడు ఎవర్ని బాధ్యునిగా ఎంచాడు?

4 ఎందుకు తప్పు చేశావని యెహోవా ఆదామును అడిగినప్పుడు, “నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిని” అని కుంటి సాకు చెప్పాడు. (ఆది. 3:12) ఆదాము తన తప్పును ఒప్పుకోకపోగా, దాన్ని హవ్వ మీదికి, ఆమెను ప్రేమతో అనుగ్రహించిన దేవుని మీదికి నెట్టడానికి ప్రయత్నించాడు. ఆదాముహవ్వలు ఇద్దరూ పాపం చేశారు, కానీ దేవుడు ఆదామునే దానికి బాధ్యునిగా ఎంచాడు. అందుకే, “ఒక మనుష్యుని [ఆదాము] ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో” ప్రవేశించాయని పౌలు రాశాడు.—రోమా. 5:12.

5. తన సహాయం లేకుండా మనుషులు కొంతకాలం తమను తామే పరిపాలించుకోవడానికి దేవుడు అనుమతించడం వల్ల ఏ విషయం రుజువైంది?

5 తమకు యెహోవా పరిపాలన అవసరం లేదని మొదటి మానవ దంపతులు అనుకునేలా సాతాను మోసం చేశాడు. దానివల్ల సర్వాధిపత్యం గురించి ఈ ప్రాముఖ్యమైన ప్రశ్న తలెత్తింది: పరిపాలించే హక్కు ఎవరికి ఉంది? మళ్లీ ఎప్పుడూ ఆ ప్రశ్న తలెత్తకుండా, మనుషులు తన సహాయం లేకుండా కొంతకాలం తమను తామే పరిపాలించుకోవడానికి దేవుడు అనుమతించాడు. అయితే అలాంటి పాలన విఫలమౌతుందనే సంగతి మనుషులకు ముందుముందు అర్థమౌతుందని దేవునికి తెలుసు. సొంత పరిపాలన వల్ల మనుషులు ఎన్నో శతాబ్దాలుగా ఒకదాని తర్వాత మరో ముప్పు తెచ్చుకుంటూనే ఉన్నారు. గత శతాబ్దంలోనే దాదాపు 10 కోట్ల మంది యుద్ధాల్లో చనిపోయారు, వాళ్లలో చాలామంది అమాయకులైన పురుషులు, స్త్రీలు, పిల్లలే. “మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదు” అని చెప్పడానికి ఇప్పటికే కావాల్సినంత రుజువు ఉంది. (యిర్మీ. 10:23) ఈ వాస్తవాన్ని గ్రహించాం కాబట్టే యెహోవాను మన పరిపాలకునిగా ఒప్పుకుంటాం.—సామెతలు 3:5, 6 చదవండి.

6. చాలా ప్రాంతాల్లో మహిళల్ని, ఆడపిల్లల్ని ఎలా చూస్తున్నారు?

6 సాతాను అధీనంలో ఉన్న ఈ లోకంలో పురుషులు, స్త్రీలు అన్యాయానికి గురయ్యారు. (ప్రసం. 8:9; 1 యోహా. 5:19) జరుగుతున్న దారుణాల్లో మహిళల మీద అరాచకాలే ఎక్కువ. తమ భర్తలు లేదా బాయ్‌ఫ్రెండ్స్‌ తమమీద దాడి చేశారని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 30 శాతం మహిళలు చెబుతున్నారు. అబ్బాయిలైతే వంశాన్ని నిలబెడతారని, వృద్ధులైన తల్లిదండ్రుల-తాతామామ్మల బాగోగులు కూడా చూసుకుంటారనే ఉద్దేశంతో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు మగపిల్లలు కావాలనుకుంటారు. కొన్ని దేశాల్లో ఆడపిల్లలు పుడితే అస్సలు ఇష్టపడరు. వాళ్లను పుట్టకముందే చంపేస్తున్నారు.

7. స్త్రీపురుషులు ఇద్దరూ ఎలాంటి జీవితాన్ని ప్రారంభించేలా దేవుడు చూశాడు?

7 ఎవరైనా స్త్రీలతో అనుచితంగా ప్రవర్తిస్తే, దేవుడు ఏమాత్రం ఇష్టపడడు. ఆయన వాళ్లను నిష్పక్షపాతంతో చూస్తూ గౌరవిస్తున్నాడు. దేవుడు హవ్వను సృష్టించిన విధానాన్ని బట్టి ఆ విషయం అర్థంచేసుకోవచ్చు. ఆమెను ఒక బానిసగా కాదుగానీ పరిపూర్ణంగా సృష్టించి, ఆదాముకు సాటియైన సహాయకారిగా ఉండడానికి కావాల్సిన లక్షణాలన్నీ ఆమెలో పెట్టాడు. అందుకే ఆరవ సృష్టి దినం ముగింపులో దేవుడు, “తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను.” (ఆది. 1:31) అవును, యెహోవా చేసిన ‘యావత్తు చాలా మంచిదిగా’ ఉంది. నిస్సందేహంగా, వాళ్లిద్దరి జీవితం ఎంతో చక్కగా మొదలయ్యేలా దేవుడు చూశాడు.

యెహోవా ఆశీర్వదించిన స్త్రీలు

8. (ఎ) ప్రజల ప్రవర్తన ఎలా ఉందో వర్ణించండి. (బి) చరిత్రంతటిలో దేవుడు ఎవరిపట్ల అనుగ్రహం చూపిస్తూ ఉన్నాడు?

8 ఏదెనులో తిరుగుబాటు జరిగినప్పటి నుండి స్త్రీపురుషుల ప్రవర్తన దిగజారిపోయింది. ముఖ్యంగా గత శతాబ్దంలో, పరిస్థితి ముందెన్నడూ లేనంత ఘోరంగా తయారైంది. “అంత్యదినములలో” మనుషుల ప్రవర్తన మరీ చెడ్డగా ఉంటుందని బైబిలు ముందే చెప్పింది. మానవుల చెడుతనం ఎంతగా పెరిగిపోయిందంటే ఇవి “అపాయకరమైన కాలములు” అని చెప్పడానికి సందేహమే అక్కర్లేదు. (2 తిమో. 3:1-5) అయితే మానవ చరిత్రంతటిలో, తనను నమ్మి, తనకు లోబడి, తనను పరిపాలకునిగా ఒప్పుకున్న స్త్రీపురుషులకు సర్వోన్నత ప్రభువైన యెహోవా అనుగ్రహం చూపిస్తూనే ఉన్నాడు.—కీర్తన 71:5 చదవండి.

9. జలప్రళయాన్ని ఎంతమంది తప్పించుకున్నారు? ఎందుకు?

9 పూర్వం నోవహు కాలంలో, హింసతో నిండిన లోకాన్ని జలప్రళయం ద్వారా దేవుడు నాశనం చేసినప్పుడు కేవలం కొద్దిమందే తప్పించుకున్నారు. ఒకవేళ నోవహు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆ సమయంలో జీవించివుంటే, వాళ్లు కూడా ఆ జలప్రళయంలో చనిపోయేవుంటారు. (ఆది. 5:30) అయితే ఆ జలప్రళయంలో ఎంతమంది పురుషులు తప్పించుకున్నారో, అంతేమంది స్త్రీలు కూడా తప్పించుకున్నారు. వాళ్లలో నోవహు ఆయన భార్య, ఆయన ముగ్గురు కుమారులు, వాళ్ల భార్యలు ఉన్నారు. వాళ్లు దేవునికి భయపడి ఆయన చిత్తాన్ని చేశారు కాబట్టి వాళ్లు తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ఇప్పుడు జీవిస్తున్న కోట్లమంది, యెహోవా అనుగ్రహం పొందిన ఆ ఎనిమిదిమంది నుండి వచ్చినవాళ్లే.—ఆది. 7:7; 1 పేతు. 3:19, 20.

10. నమ్మకస్థులైన పితరుల భార్యలకు యెహోవా ఎందుకు సహాయం చేశాడు?

10 ఆ తర్వాత సంవత్సరాల్లో, నమ్మకస్థులైన పితరుల భార్యలు కూడా యెహోవా మద్దతును, కాపుదలను అనుభవించారు. వాళ్లు ఒకవేళ తమ జీవితం గురించి సణిగివుంటే ఆయన వాళ్లకు సహాయం చేసేవాడా? (యూదా 16) అబ్రాహాము, శారా ఊరనే పట్టణంలోని సౌకర్యాలను విడిచిపెట్టి వేరే దేశంలో యాత్రికులుగా గుడారాల్లో నివసించాల్సి వచ్చింది. అప్పుడు శారా సణిగి ఉంటుందని కనీసం ఊహించడం కూడా కష్టమే. బదులుగా, “శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి యుండెను.” (1 పేతు. 3:6) ఇస్సాకు భార్య రిబ్కా గురించి కూడా ఆలోచించండి. ఆమె ఇస్సాకుకు యెహోవా అనుగ్రహించిన దీవెన. అందుకే ఆమె భర్త “ఆమెను ప్రేమించెను. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమై దుఃఖనివారణ పొందెను.” (ఆది. 24:67) శారా, రిబ్కాలాంటి దైవభయంగల స్త్రీలు నేడు మనమధ్య కూడా ఉన్నందుకు మనమెంత సంతోషిస్తున్నామో!

11. ఇద్దరు హెబ్రీ మంత్రసానులు ఎలా ధైర్యాన్ని చూపించారు?

11 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసలుగా ఉన్నకాలంలో, వాళ్ల సంతానం ఎంతగానో వృద్ధి చెందింది. దాంతో వాళ్ల మగ పిల్లలందర్నీ పుట్టిన వెంటనే చంపేయమని ఫరో ఆజ్ఞాపించాడు. అయితే హెబ్రీ మంత్రసానులైన షిఫ్రా, పూయాలు అప్పుడు ఏమి చేశారో పరిశీలించండి. వాళ్లు యెహోవా మీదున్న భక్తిపూర్వక భయంతో ధైర్యంగా రాజాజ్ఞను ధిక్కరించారు. అందుకే దేవుడు వాళ్లకు వంశాభివృద్ధి కలుగజేశాడు.—నిర్గ. 1:15-21.

12. దెబోరా, యాయేలు ప్రత్యేకత ఏమిటి?

12 న్యాయాధిపతుల కాలంలో దేవుడు దెబోరా అనే స్త్రీని ప్రవక్త్రినిగా నియమించాడు. ఆమె న్యాయాధిపతియైన బారాకును ప్రోత్సహించి, ఇశ్రాయేలీయులు అణచివేతనుండి బయటపడడానికి సహాయం చేసింది. అయితే కనానీయులను ఓడించిన ఘనత బారాకుకు రాదని, కనానీయుల ప్రధాన అధిపతియైన సీసెరాను “ఒక స్త్రీచేతికి” దేవుడు అప్పగిస్తాడని ఆమె ప్రవచించింది. అన్యురాలైన యాయేలు అతన్ని చంపినప్పుడు ఆ మాటలు నెరవేరాయి.—న్యాయా. 4:4-9, 17-22.

13. అబీగయీలు గురించి బైబిలు ఏమి చెబుతుంది?

13 మనం తెలుసుకోవాల్సిన మరో స్త్రీ, అబీగయీలు. ఆమె సా.శ.పూ. 11వ శతాబ్దంలో జీవించింది. ఆమె సుబుద్ధిగలది, కానీ ఆమె భర్త నాబాలు మాత్రం మొరటువాడు, పనికిరానివాడు, బుద్ధిలేనివాడు. (1 సమూ. 25:2, 3, 25) దావీదు, అతని మనుషులు నాబాలు ఆస్తిని కొంతకాలం కాపాడారు. అయితే, వాళ్లు ఆహార పదార్థాలు కావాలని అడిగినప్పుడు నాబాలు “వారితో కఠినముగా మాటలాడి” ఒట్టి చేతులతో పంపించేశాడు. దాంతో దావీదుకు కోపం వచ్చి నాబాలును, అతని మనుషులను చంపడానికి బయలుదేరాడు. ఆ విషయం తెలుసుకున్న అబీగయీలు దావీదుకు, అతని మనుషులకు ఆహారాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకెళ్లింది, ఆ విధంగా రక్తపాతం జరగకుండా ఆపింది. (1 సమూ. 25:8-18) ఆ తర్వాత దావీదు ఆమెతో ఇలా అన్నాడు, “నాకు ఎదురుపడుటకై నిన్ను పంపిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక.” (1 సమూ. 25:32) నాబాలు చనిపోయిన తర్వాత, దావీదు అబీగయీలును పెళ్లిచేసుకున్నాడు.—1 సమూ. 25:37-42.

14. షల్లూము కుమార్తెలు ఏ పనిలో సహాయం చేశారు? అలాంటి పనినే క్రైస్తవ స్త్రీలు నేడు ఎలా చేస్తున్నారు?

14 బబులోను సైన్యం సా.శ.పూ. 607⁠లో యెరూషలేమును, దాని దేవాలయాన్ని నాశనం చేసినప్పుడు చాలామంది పురుషులు, స్త్రీలు, పిల్లలు చనిపోయారు. సా.శ.పూ. 455⁠లో నెహెమ్యా పర్యవేక్షణలో ఆ పట్టణపు గోడలను మళ్లీ నిర్మించారు. ఆ పనిలో సహాయం చేసినవాళ్లలో, యెరూషలేము పట్టణంలోని సగభాగానికి అధిపతియైన షల్లూము కుమార్తెలు కూడా ఉన్నారు. (నెహె. 3:12) ఆ స్త్రీలు దాన్ని తక్కువ పనిగా భావించకుండా, ఇష్టంగా చేశారు. నేడు, రాజ్యసంబంధ నిర్మాణ పనుల్లో అనేక విధాలుగా సంతోషంగా మద్దతిస్తున్న చాలామంది క్రైస్తవ స్త్రీలను మనమెంత మెచ్చుకుంటామో కదా!

మొదటి శతాబ్దంలోని దైవభక్తిగల స్త్రీలు

15. మరియకు దేవుడు ఏ గొప్ప అవకాశమిచ్చాడు?

15 సా.శ. మొదటి శతాబ్దానికి ముందు, అలాగే ఆ శతాబ్దంలో చాలామంది స్త్రీలకు యెహోవా చక్కని అవకాశాలు ఇచ్చాడు. వాళ్లలో ఒకరు కన్యకయైన మరియ. యోసేపుతో ప్రధానం అయిన తర్వాత ఆమె పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతరీతిలో గర్భం దాల్చింది. యేసుకు తల్లిగా ఆమెనే దేవుడు ఎందుకు ఎంపిక చేశాడు? ఎందుకంటే, తన పరిపూర్ణ కుమారుణ్ణి పరిణతిగల వ్యక్తిగా పెంచడానికి కావాల్సిన ఆధ్యాత్మిక లక్షణాలు ఆమెలో ఉన్నాయి. భూమ్మీద జీవించిన వాళ్లందరిలో గొప్ప వ్యక్తికి తల్లి అవ్వడం ఎంతటి గొప్ప అవకాశమో!—మత్త. 1:18-25.

16. యేసు స్త్రీలను ఎలా చూసేవాడో ఒక ఉదాహరణ చెప్పండి.

16 యేసు స్త్రీలతో చాలా దయగా ప్రవర్తించాడు. ఉదాహరణకు, 12 ఏళ్లపాటు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ గురించి ఆలోచించండి. యేసు చుట్టూ మనుషులు గుంపుగా ఉన్నప్పుడు ఆయన వస్త్రాన్ని వెనుకనుండి ఆమె ముట్టుకుంది. యేసు ఆమెను గద్దించే బదులు, దయగా ఇలా అన్నాడు, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము.”—మార్కు 5:25-34.

17. సా.శ. 33 పెంతెకొస్తునాడు ఏ అద్భుతమైన సంఘటన జరిగింది?

17 యేసు శిష్యులైన కొందరు స్త్రీలు ఆయనకు, ఆయన శిష్యులకు సేవ చేశారు. (లూకా 8:1-3) సా.శ. 33 పెంతెకొస్తు రోజున దాదాపు 120 మంది పురుషులు, స్త్రీలు ఓ ప్రత్యేక విధానంలో దేవుని ఆత్మను పొందారు. (అపొస్తలుల కార్యములు 2:1-4 చదవండి.) పరిశుద్ధాత్మ వాళ్లమీదకు రావడం గురించి బైబిలు ముందే ఇలా ప్రవచించింది, “తరువాత నేను [యెహోవా] సర్వజనులమీద నా ఆత్మను కుమ్మరింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచనములు చెప్పుదురు . . . ఆ దినములలో నేను పనివారిమీదను పనికత్తెలమీదను నా ఆత్మను కుమ్మరింతును.” (యోవే. 2:28, 29) పెంతెకొస్తునాడు అద్భుతరీతిలో జరిగిన ఆ సంఘటన ద్వారా, తన ఆశీర్వాదం మతభ్రష్టులైన ఇశ్రాయేలీయులకు కాదుగానీ ‘దేవుని ఇశ్రాయేలులోని’ స్త్రీపురుషులకు ఉందని దేవుడు చూపించాడు. (గల. 3:28; 6:15, 16) మొదటి శతాబ్దంలో పరిచర్యలో పాల్గొన్న క్రైస్తవ స్త్రీలలో, సువార్తికుడైన ఫిలిప్పు నలుగురు కుమార్తెలు కూడా ఉన్నారు.—అపొ. 21:8, 9

స్త్రీలు “గొప్ప సైన్యము”

18, 19. (ఎ) సత్యారాధన విషయంలో దేవుడు పురుషులకు, స్త్రీలకు ఏ గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు? (బి) దేవుని సువార్త ప్రకటించే స్త్రీల గురించి కీర్తనకర్త ఏమి చెబుతున్నాడు?

18 కొందరు స్త్రీపురుషులు, 18వ శతాబ్దం చివర్లో సత్యారాధన విషయంలో ఎంతో ఆసక్తి చూపించారు. “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును” అని యేసు చెప్పిన ప్రవచనాన్ని ప్రస్తుతం నెరవేరుస్తున్న మనకు మార్గం తెరిచింది వాళ్లే.—మత్త. 24:14.

19 చిన్న గుంపుగా మొదలైన బైబిలు విద్యార్థులు ఇప్పుడు దాదాపు 80 లక్షలమంది ఉన్న యెహోవాసాక్షులుగా వృద్ధి చెందారు. వాళ్లతోపాటు 1 కోటి 10 లక్షలకన్నా ఎక్కువమంది ఇతరులు కూడా యేసు మరణ జ్ఞాపకార్థ ఆచరణకు హాజరై బైబిలు పట్ల, మన పనిపట్ల ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్లలో అధికశాతం స్త్రీలే. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 10 లక్షలమంది పూర్తికాల రాజ్య ప్రచారకుల్లో ఎక్కువమంది స్త్రీలే ఉన్నారు. తనకు ప్రాతినిధ్యం వహించే అరుదైన అవకాశాన్ని యెహోవా స్త్రీలకు ఇచ్చాడు. “ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు” అని కీర్తనకర్త రాసిన మాటలు నిస్సందేహంగా నెరవేరాయి.—కీర్త. 68:11.

సువార్త ప్రకటిస్తున్న స్త్రీలు నిజంగా “గొప్ప సైన్యము” (18, 19 పేరాలు చూడండి)

దైవభక్తిగల స్త్రీలకు ముందున్న గొప్ప దీవెనలు

20. మనం ఎలాంటి అధ్యయన ప్రాజెక్టులను పరిశీలించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చు?

20 బైబిల్లో ఉన్న నమ్మకమైన స్త్రీలందరి గురించి ఇప్పుడు చర్చించడం సాధ్యం కాదు. అయితే, వాళ్ల గురించి మనం బైబిల్లో అలాగే మన ప్రచురణల్లో వచ్చే ఆర్టికల్స్‌లో చదవవచ్చు. ఉదాహరణకు, మనం రూతు యథార్థత గురించి ధ్యానించవచ్చు. (రూతు 1:16, 17) రాణియైన ఎస్తేరు పేరుతో ఉన్న బైబిలు పుస్తకాన్ని, ఆమె గురించిన ఆర్టికల్స్‌ను చదవడం వల్ల మన విశ్వాసం బలపడుతుంది. ఇటువంటి అధ్యయన ప్రాజెక్టుల నుండి మనం ప్రయోజనం పొందవచ్చు, వీటిని కుటుంబ ఆరాధనలో చర్చించుకోవడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మనం ఒకవేళ ఒంటరిగా జీవిస్తున్నా, మన వ్యక్తిగత అధ్యయనంలో అలాంటివాళ్ల గురించి పరిశీలించవచ్చు.

21. దైవభక్తిగల స్త్రీలు కష్టకాలాల్లో యెహోవాపట్ల ఎలా భక్తి చూపించారు?

21 క్రైస్తవ స్త్రీలు చేసే ప్రకటనా పనిని యెహోవా ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, కష్టసమయాల్లో వాళ్లను ఆదుకుంటాడు. ఉదాహరణకు, దేవునికి విధేయత చూపించినందువల్ల నాజీల, కమ్యూనిస్టుల పాలనలో చాలామంది స్త్రీలు ఎన్నో కష్టాలు అనుభవించారు, కొందరైతే తమ ప్రాణాలనే కోల్పోయారు. దైవభక్తిగల అలాంటి స్త్రీలు యెహోవా సహాయంతో తమ యథార్థతను కాపాడుకున్నారు. (అపొ. 5:29) గతంలోలాగే నేడుకూడా మన సహోదరీలు, వాళ్ల తోటి ఆరాధకులందరూ దేవుని సర్వాధిపత్యాన్ని సమర్థిస్తున్నారు. యెహోవా ప్రాచీన ఇశ్రాయేలీయులతో అన్నట్లే, వీళ్ల కుడిచేతిని పట్టుకుని, “భయపడకుము నేను నీకు సహాయము చేసెదను” అని అంటున్నాడు.—యెష. 41:10-13.

22. భవిష్యత్తులో ఏ గొప్ప అవకాశాలు మనకు ఉంటాయి?

22 సమీప భవిష్యత్తులో దైవభక్తిగల పురుషులు, స్త్రీలు ఈ భూమిని పరదైసుగా మార్చి, పునరుత్థానమైన లక్షలాదిమందికి యెహోవా సంకల్పాల గురించి నేర్పిస్తారు. మనం అప్పటివరకు, పురుషులమైనా స్త్రీలమైనా “యేకమనస్కులై” ఆయనకు సేవచేసే గొప్ప అవకాశాన్ని విలువైనదిగా ఎంచుదాం.—జెఫ. 3:9.