కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు ఎక్కడున్నా యెహోవా స్వరం వినండి

మీరు ఎక్కడున్నా యెహోవా స్వరం వినండి

“ఇదే త్రోవ . . . అని నీ వెనుకనుండి యొక శబ్దము నీ చెవులకు వినబడును.”—యెష. 30:21.

1, 2. యెహోవా తన సేవకులతో ఎలా మాట్లాడతాడు?

 బైబిలు చరిత్రంతటిలో, యెహోవా వివిధ విధానాల్లో మనుషులకు మార్గనిర్దేశం ఇచ్చాడు. కొంతమందితో దూతల ద్వారా, దర్శనాల ద్వారా లేదా కలల ద్వారా దేవుడు మాట్లాడి, భవిష్యత్తులో ఏమి జరుగుతుందో వాళ్లకు చెప్పాడు. యెహోవా వాళ్లకు ప్రత్యేక నియామకాలు కూడా ఇచ్చాడు. (సంఖ్యా. 7:89; యెహె. 1:1; దాని. 2:19) ఇంకొంతమందికి, తన సంస్థలోని భూమ్మీద భాగంలో సేవచేస్తున్న మానవ ప్రతినిధుల ద్వారా నిర్దేశాలు ఇచ్చాడు. యెహోవా ప్రజలు, ఆయన నిర్దేశాలను ఏ విధంగా అందుకున్నప్పటికీ వాటిని పాటించిన వాళ్లు దీవెనలు పొందారు.

2 యెహోవా నేడు బైబిలు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, సంఘం ద్వారా తన ప్రజలకు నడిపింపు ఇస్తున్నాడు. (అపొ. 9:31; 15:28; 2 తిమో. 3:16, 17) ఆయన ఇచ్చే నిర్దేశం ఎంత స్పష్టంగా ఉందంటే, ఒక శబ్దము మన చెవులకు వినబడుతూ, “ఇదే త్రోవ దీనిలో నడువుడి” అని చెబుతున్నట్లుగా ఉంది. (యెష. 30:21) అలాగే, యేసు కూడా “నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుని” ద్వారా సంఘాన్ని నడిపిస్తూ యెహోవా స్వరాన్ని మనకు వినిపిస్తున్నాడు. (మత్త. 24:45) ఆ నడిపింపును, మార్గనిర్దేశాన్ని మనం ప్రాముఖ్యంగా ఎంచాలి, ఎందుకంటే వాటికి మనం చూపించే విధేయత మీదే మన నిత్యజీవం ఆధారపడివుంది.—హెబ్రీ. 5:9.

3. యెహోవాకు పూర్తి విధేయత చూపించకుండా ఏది అడ్డుకుంటుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

3 జీవాన్ని కాపాడే యెహోవా నిర్దేశాన్ని మనం వినకుండా చేయాలనేదే సాతాను లక్ష్యం. మన ‘మోసకరమైన హృదయం’ కూడా మనం యెహోవాకు పూర్తి విధేయత చూపించకుండా అడ్డుకుంటుంది. (యిర్మీ. 17:9) అందుకే, యెహోవా స్వరం మనకు వినిపించకుండా చేసే అడ్డంకులను ఎలా అధిగమించవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం. దానితోపాటు, మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా, యెహోవాతో సన్నిహితంగా సంభాషించడం వల్ల ఆయనతో మన బంధాన్ని ఎలా కాపాడుకోవచ్చో చూద్దాం.

సాతాను పన్నాగాలను తప్పించుకోండి

4. సాతాను ప్రజల ఆలోచనల్ని ఎలా కలుషితం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు?

4 తప్పుడు సమాచారంతో, మోసకరమైన ప్రచారంతో ప్రజల ఆలోచనలను కలుషితం చేయాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. (1 యోహాను 5:19 చదవండి.) మారుమూల ప్రాంతాలతోసహా భూమంతా ముద్రిత సమాచారంతో, రేడియో, టి.వీ. ప్రసారాలతో, ఇంటర్నెట్‌తో నిండిపోయింది. వాటిలో ఆసక్తి కలిగించే అంశాలు ఉన్నా, ఎక్కువగా అవి యెహోవా ప్రమాణాలకు భిన్నమైన ప్రవర్తనను, ప్రమాణాలనే ప్రోత్సహిస్తున్నాయి. (యిర్మీ. 2:13) ఉదాహరణకు వార్తల్లో, వినోద కార్యక్రమాల్లో పురుషులు-పురుషులను, స్త్రీలు-స్త్రీలను పెళ్లి చేసుకోవడం తప్పు కాదన్నట్లు చూపిస్తున్నారు. వాటిని చూసే చాలామంది, అలాంటివాటి గురించి బైబిలు చెప్పేది చాలా కఠినంగా ఉందని అనుకుంటారు.—1 కొరిం. 6:9, 10.

5. సాతాను ప్రచారపు సునామీలో మనం కొట్టుకొనిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి?

5 దేవుని నీతి ప్రమాణాలను ప్రేమించేవాళ్లు, సాతాను తప్పుడు ప్రచారపు సునామీలో కొట్టుకొనిపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఏది మంచో ఏది చెడో వాళ్లు ఎలా గుర్తించగలరు? “[దేవుని] వాక్యమునుబట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే.” (కీర్త. 119:9) మోసకరమైన ప్రచారానికి, నిజమైన సమాచారానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడానికి సహాయం చేసే నడిపింపు బైబిల్లో ఉంది. (సామె. 23:23) లేఖనాలను ఎత్తి చెబుతూ యేసు ఇలా అన్నాడు, “మనుష్యుడు . . . దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును.” (మత్త. 4:4) మనం బైబిలు సూత్రాలను జీవితంలో ఎలా పాటించాలో నేర్చుకోవాలి. ఉదాహరణకు, వ్యభిచారం గురించి యెహోవా ధర్మశాస్త్రంలో నియమం ఇవ్వడానికి ఎన్నో సంవత్సరాల ముందే, అలాంటి ప్రవర్తన దేవుని దృష్టిలో పాపమని యోసేపు అర్థంచేసుకున్నాడు. తప్పుచేసేలా పోతీఫరు భార్య ప్రేరేపించినా, యెహోవాకు అవిధేయత చూపించాలనే ఆలోచనను కూడా యోసేపు దరిచేరనివ్వలేదు. (ఆదికాండము 39:7-9 చదవండి.) పోతీఫరు భార్య కొంతకాలంపాటు అతణ్ణి ఒత్తిడి చేసినా, యోసేపు ఆమె స్వరాన్ని కాకుండా దేవుని స్వరాన్నే విన్నాడు. చెవులు చిల్లులు పడేలా వినబడుతున్న సాతాను ప్రచారాన్ని వినకుండా దేవుని స్వరాన్ని వింటే, ఏది మంచో ఏది చెడో మనం గుర్తించగలుగుతాం.

6, 7. సాతాను చెడు సలహాలను వినకూడదంటే మనం ఏమి చేయాలి?

6 తికమకపెట్టే మత బోధలతో, సిద్ధాంతాలతో నిండిపోయిన ఈ లోకంలో, నిజమైన మతం కోసం వెదకడం వృథా అని చాలామంది అనుకుంటారు. అయితే, మనం యెహోవా చెప్పేది వినడానికి ఇష్టపడితే, సత్యాన్ని సులభంగా కనుగొనేలా ఆయన సహాయం చేస్తాడు. కాబట్టి, ఎవరి స్వరాన్ని వినాలో మనం నిర్ణయించుకోవాలి. వాస్తవానికి, మనం రెండు స్వరాలను ఒకేసారి వినలేం. అందుకే, యేసు ‘స్వరాన్ని’ గుర్తించి, ఆయన చెప్పేది వినాలి. ఎందుకంటే, యెహోవా తన మందకు కాపరిగా యేసునే నియమించాడు.—యోహాను 10:3-5 చదవండి.

7 “మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి” అని యేసు చెప్పాడు. (మార్కు 4:24) యెహోవా ఇచ్చే సలహాలు సరైన విధంగా, స్పష్టంగా ఉంటాయి. అయితే వాటిని స్వీకరించేలా మన హృదయాల్ని సిద్ధం చేసుకుంటూ, జాగ్రత్తగా మనసుపెట్టి వినాలి. మనం జాగ్రత్తగా లేకపోతే, దేవుని ప్రేమపూర్వక సలహాలకు బదులు సాతాను చెడు సలహాలను వినే ప్రమాదం ఉంది. ఈ ప్రపంచంలోని సంగీతం, వీడియోలు, టి.వీ. కార్యక్రమాలు, పుస్తకాలు, స్నేహితులు, టీచర్లు లేదా జ్ఞానులమని చెప్పుకునేవాళ్లు మీ జీవితాన్ని శాసించకుండా జాగ్రత్తపడండి.—కొలొ. 2:8.

8. (ఎ) మన హృదయం ఎలా మనల్ని ప్రమాదంలో పడేయొచ్చు? (బి) హెచ్చరికలను లక్ష్యపెట్టకుంటే ఏమి జరిగే ప్రమాదం ఉంది?

8 మనలో పాపపు కోరికలు ఉన్నాయని సాతానుకు తెలుసు, వాటికి మనల్ని బానిసలు చేయాలని అతడు ప్రయత్నిస్తాడు. సాతాను ఆ విధంగా మనపై దాడి చేసినప్పుడు, మన యథార్థతను కాపాడుకోవడం కత్తి మీద సామే. (యోహా. 8:44-47) అయితే, ఆ సవాలును మనమెలా విజయవంతంగా ఎదుర్కోవచ్చు? క్షణికానందం పొందాలని ఆరాటపడే ఓ వ్యక్తి గురించి ఆలోచించండి. తన జీవితంలో ఫలానా తప్పు ఎప్పటికీ చేయనని ఆయన అనుకున్నా చివరికి ఆ తప్పు చేశాడు. (రోమా. 7:15) అతనికి ఎందుకా దుస్థితి వచ్చింది? బహుశా, యెహోవా స్వరానికి స్పందించలేనంతగా మెల్లమెల్లగా ఆయన హృదయం మొద్దుబారిపోయివుంటుంది. తన హృదయానికి ఏమి జరుగుతుందో తెలియజేసే హెచ్చరికలను ఆయన గుర్తించలేదు లేదా వాటిని నిర్లక్ష్యం చేశాడు. బహుశా అతడు ప్రార్థించడం మానేసివుంటాడు లేదా ఒకప్పటిలా పరిచర్యకు, కూటాలకు క్రమంగా వెళ్తుండకపోవచ్చు. అలా చివరికి తన కోరికకు లొంగిపోయి, తప్పు అని తెలిసి కూడా తప్పు చేశాడు. కాబట్టి, హృదయం ఇచ్చే హెచ్చరికల్ని లక్ష్యపెట్టి, వెంటనే మనల్ని సరిదిద్దుకుంటే అలాంటి ఘోరమైన తప్పును చేయకుండా ఉండవచ్చు. అంతేకాదు, మనం యెహోవా స్వరం వింటుంటే ఎలాంటి మతభ్రష్ట ఆలోచనలకూ తావివ్వం.—సామె. 11:9.

9. మనల్ని శోధనలకు నడిపించే ఆలోచనల్ని ముందే గుర్తించడం ఎందుకు చాలా ప్రాముఖ్యం?

9 ఏదైనా జబ్బును ముందుగానే గుర్తిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. అదేవిధంగా, మనలో ఒక పాపపు ఆలోచన ఉందని గుర్తిస్తే, మనల్ని ‘సాతాను తన ఇష్టము చొప్పున చెర పట్టక’ ముందే మనం వెంటనే చర్య తీసుకోవాలి. (2 తిమో. 2:24-26) మన ఆలోచనలు, కోరికలు యెహోవా మననుండి కోరే వాటికి భిన్నంగా ఉన్నట్లు గుర్తిస్తే ఏమి చేయాలి? మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వినయంగా ఆయన దగ్గరకు తిరిగొచ్చి, ఆయన సలహాను విని పూర్ణ హృదయంతో దాన్ని పాటించాలి. (యెష. 44:22) అయితే, ఓ వ్యక్తి యెహోవా దగ్గరకు తిరిగొచ్చినా, ఆయన గతంలో చేసిన ఒకానొక తప్పువల్ల ఎంతో వేదన పడవచ్చు. కాబట్టి, అసలు యెహోవాను విడిచిపెట్టకుండా ఉండడం ఎంతో ఉత్తమం.

సాతాను పన్నాగాలను తప్పించుకోవడానికి మంచి ఆధ్యాత్మిక అలవాట్లు ఎలా సహాయం చేస్తాయి? (4-9 పేరాలు చూడండి)

గర్వాన్ని, దురాశను తీసేసుకోండి

10, 11. (ఎ) గర్విష్ఠి ఏమి చేస్తాడు? (బి) కోరహు, దాతాను, అబీరాముల తిరుగుబాటు నుండి మనం ఏ పాఠం నేర్చుకుంటాం?

10 మన హృదయం మనల్ని తప్పుదారి పట్టిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. మన పాపపు లక్షణాలు మనమీద ఎంత బలమైన ప్రభావం చూపిస్తాయో! ఉదాహరణకు గర్వాన్ని, దురాశనే తీసుకోండి. అవి మనకు యెహోవా స్వరం వినబడకుండా చేసి ఎలా మనల్ని పతనానికి నడిపిస్తాయో పరిశీలించండి. ఒక గర్విష్ఠి తన గురించి తాను ఎక్కువగా ఊహించుకుంటాడు. తాను ఏమి చేయాలో ఎవరూ చెప్పనక్కర్లేదని, తనకు ఇష్టమొచ్చింది చేసే హక్కు ఉందని అనుకుంటాడు. అలా అతను తోటి క్రైస్తవులు, సంఘ పెద్దలు, చివరికి దేవుని సంస్థ ఇచ్చే నిర్దేశాలను, సలహాలను వినాల్సిన అవసరం లేదని అనుకుంటాడు. అలాంటి వ్యక్తికి యెహోవా స్వరం చాలా అస్పష్టంగా ఉంటుంది.

11 ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచరించినప్పుడు కోరహు, దాతాను, అబీరాములు మోషే, అహరోనుల అధికారానికి ఎదురుతిరిగారు. యెహోవాను ఆరాధించడానికి వాళ్లు గర్వంతో సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. దానికి యెహోవా ఎలా స్పందించాడు? ఆయన వాళ్లను నాశనం చేశాడు. (సంఖ్యా. 26:8-10) ఆ సంఘటన నుండి మనం ఎంత ప్రాముఖ్యమైన పాఠం నేర్చుకోవచ్చో! యెహోవాకు ఎదురుతిరగడం నాశనానికి నడిపిస్తుంది. “నాశనమునకు ముందు గర్వము నడచును” అనే విషయాన్ని మనం గుర్తుంచుకుందాం.—సామె. 16:18; యెష. 13:11.

12, 13. (ఎ) దురాశ ఓ వ్యక్తిని నాశనానికి నడిపిస్తుందని చూపించడానికి ఓ ఉదాహరణ చెప్పండి. (బి) అదుపు చేసుకోకపోతే దురాశ ఎలా త్వరగా పెరిగిపోతుందో వివరించండి.

12 దురాశ కూడా ప్రమాదకరమైనదే. దురాశ ఉన్న వ్యక్తి యెహోవా నిర్దేశాలు తన కోసం కాదని అనుకుంటాడు. తనవి కాని వస్తువులు తీసుకోవచ్చని అనుకుంటాడు. సిరియా సైనికాధికారి నయమాను కుష్ఠు రోగం నుండి స్వస్థత పొందిన తర్వాత, ఎలీషా ప్రవక్తను బహుమానాలు తీసుకోమన్నాడు, కానీ ఆయన తీసుకోలేదు. అయితే, ఎలీషా సేవకుడైన గేహజీ మాత్రం ఆ బహుమానాలు కావాలనుకున్నాడు. “యెహోవా జీవముతోడు నేను పరుగెత్తికొని పోయి అతని కలిసికొని అతనియొద్ద ఏదైనను తీసికొందును” అని గేహజీ అనుకున్నాడు. ఎలీషాకు తెలియకుండా అతను నయమాను దగ్గరకు పరుగెత్తుకొని వెళ్లి, పచ్చి అబద్ధాలు చెప్పి “రెండు మణుగుల వెండియు రెండు దుస్తుల బట్టలు” అడిగాడు. అంతేకాదు గేహజీ, యెహోవా ప్రవక్తకు కూడా అబద్ధం చెప్పాడు. ఫలితం? నయమానుకు ఉన్న కుష్ఠు రోగం దురాశాపరుడైన గేహజీకి వచ్చింది.—2 రాజు. 5:20-27.

13 దురాశ చిన్నగా మొదలౌతుంది, కానీ దాన్ని అరికట్టకపోతే త్వరగా పెరిగిపోయి ఓ వ్యక్తిని నాశనం చేస్తుంది. దురాశ ఎంత ఘోరమైనదో ఆకాను ఉదాహరణ చూపిస్తుంది. ఆకానులో దురాశ ఎంత త్వరగా పెరిగిపోయిందో చూడండి. “దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పైవస్త్రమును రెండువందల తులముల వెండిని ఏబది తులముల యెత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసికొంటిని” అని అతను అన్నాడు. తప్పుడు కోరికను తీసేసుకునే బదులు, ఆకాను దురాశతో ఆ వస్తువులను దొంగతనం చేసి, తన గుడారంలో దాచిపెట్టుకున్నాడు. యెహోవా ఆకాను తప్పును బయటపెట్టాడు, ఇశ్రాయేలీయులు అదే రోజు ఆ దొంగను, అతని కుటుంబాన్ని రాళ్లతో కొట్టి చంపారు. (యెహో. 7:11, 21, 24, 25) మనలో ఎవరమైనా ఆకానులా దురాశాపరులమయ్యే ప్రమాదం ఉంది. అందుకే, ‘మనం ఏ విధమైన లోభమునకు చోటివ్వకుండా జాగ్రత్తపడాలి.’ (లూకా 12:15) అప్పుడప్పుడు మనకు చెడు ఆలోచనలు లేదా అనైతిక ఊహలు వస్తుంటాయి. అయితే మన మనసును అదుపులో పెట్టుకుని, పాపం చేసేంతగా ఆ కోరికలకు లొంగిపోకుండా ఉండడం చాలా ప్రాముఖ్యం.—యాకోబు 1:14, 15 చదవండి.

14. గర్వం వల్ల, దురాశ వల్ల తప్పు చేయాలనే శోధన ఎదురైతే ఏమి చేయాలి?

14 గర్వం, దురాశ రెండూ నాశనానికి నడిపిస్తాయి. తప్పు చేయడం వల్ల వచ్చే పర్యవసానాల గురించి ఆలోచిస్తే, యెహోవా స్వరాన్ని వినబడకుండా చేసే వాటినుండి దూరంగా ఉండగలుగుతాం. (ద్వితీ. 32:29) దేవుడు సరైన మార్గం ఏదో తెలియజేయడంతోపాటు, దానిలో వెళ్తే వచ్చే ప్రయోజనాల గురించి, తప్పుడు మార్గంలో వెళ్తే వచ్చే నష్టాల గురించి బైబిల్లో వివరించాడు. గర్వం వల్ల, దురాశ వల్ల తప్పు చేయాలనే శోధన ఎదురైతే, పర్యవసానాల గురించి ఆలోచించడం ఎంత తెలివైన పని! తప్పుచేస్తే మన మీద, మన ఆత్మీయుల మీద, ముఖ్యంగా యెహోవాతో మనకున్న సంబంధం మీద ఎలాంటి ప్రభావం పడుతుందో ఆలోచించాలి.

యెహోవాతో సన్నిహితంగా మాట్లాడుతూ ఉండండి

15. దేవునితో మాట్లాడే విషయంలో యేసునుండి మనమేమి నేర్చుకోవచ్చు?

15 మనకు శ్రేష్ఠమైన జీవితం ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు. (కీర్త. 1:1-3) మనకు సరైన సమయంలో సరైన నిర్దేశాన్ని ఆయన దయచేస్తాడు. (హెబ్రీయులు 4:16 చదవండి.) యేసు పరిపూర్ణుడైనా నిర్దేశం కోసం యెహోవాతో క్రమంగా మాట్లాడేవాడు, ఎడతెగక ప్రార్థించేవాడు. యెహోవా అద్భుతమైన విధానాల్లో యేసుకు సహాయం చేశాడు, నిర్దేశాలు ఇచ్చాడు. ఆయనకు పరిచారం చేయడానికి దూతలను పంపించాడు, పరిశుద్ధాత్మను ఇచ్చి సహాయం చేశాడు, 12మంది అపొస్తలులను ఎంచుకోవడానికి నడిపింపును ఇచ్చాడు. అంతేకాక, పరలోకం నుండి మాట్లాడి యేసుకు తన ఆమోదం, మద్దతు ఉన్నాయని చూపించాడు. (మత్త. 3:17; 17:5; మార్కు 1:12, 13; లూకా 6:12, 13; యోహా. 12:28) యేసులాగే మనం కూడా ప్రార్థనలో దేవుని ముందు మన హృదయాన్ని కుమ్మరించాలి. (కీర్త. 62:7, 8; హెబ్రీ. 5:7) ప్రార్థన ద్వారా మనం యెహోవాతో సన్నిహితంగా ఉండగలుగుతాం, ఆయనకు ఘనత తీసుకొచ్చేలా జీవించగలుగుతాం.

16. మనం యెహోవా స్వరం వినగలిగేలా ఆయన ఎలా సహాయం చేస్తాడు?

16 యెహోవా తన సలహాలను అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచినప్పటికీ, వాటిని పాటించేలా ఆయన ఎవర్నీ బలవంతం చేయడు. మనం ఆయన పరిశుద్ధాత్మ కోసం వేడుకోవాలి, ఆయన దాన్ని సమృద్ధిగా దయచేస్తాడు. (లూకా 11:10-13 చదవండి.) అంతేకాదు, ‘మనం ఎలా వింటున్నామో చూసుకోవడం’ చాలా ప్రాముఖ్యం. (లూకా 8:18) ఉదాహరణకు, అశ్లీల చిత్రాలు లేదా అసభ్యకర సినిమాలు చూస్తూనే, చెడు కోరికల్ని అధిగమించడానికి సహాయం చేయమని యెహోవాను అడగడంలో అర్థంలేదు. యెహోవా ఆత్మ ఉండే చోట, అది పనిచేసే పరిస్థితుల్లో మనం ఉండాలి. సంఘకూటాల్లో ఆయన పరిశుద్ధాత్మ ఉంటుందని మనకు తెలుసు. కూటాల్లో యెహోవా చెప్పేవాటిని విని చాలామంది దేవుని సేవకులు ఎన్నో అపాయాలను తప్పించుకున్నారు. వాళ్లు తమ హృదయాల్లో వృద్ధి చెందుతున్న తప్పుడు కోరికలను గుర్తించి వాటిని సరి చేసుకున్నారు.—కీర్త. 73:12-17; 143:10.

యెహోవా స్వరం జాగ్రత్తగా వింటూనే ఉండండి

17. సొంత జ్ఞానం మీద ఆధారపడడం ఎందుకు ప్రమాదకరం?

17 ప్రాచీన ఇశ్రాయేలు రాజైన దావీదు గురించి ఆలోచించండి. ఆయన చిన్నప్పుడే ఫిలిష్తీయుల శూరుడైన గొల్యాతును ఓడించాడు. దావీదు తర్వాత సైనికుడు, కొంతకాలానికి రాజు అయ్యాడు. ఇశ్రాయేలీయుల్ని సంరక్షిస్తూ, వాళ్లకోసం ఎన్నో మంచి నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ దావీదు సొంత జ్ఞానం మీద ఆధారపడినప్పుడు, అతని హృదయం అతన్ని మోసం చేసింది. దావీదు బత్షెబతో ఘోరమైన పాపం చేయడంతోపాటు, చివరికి ఆమె భర్త ఊరియాను కూడా యుద్ధంలో చంపించాడు. అయితే యెహోవా దావీదును సరిదిద్దినప్పుడు, ఆయన వినయంతో తన తప్పును ఒప్పుకుని, మళ్లీ యెహోవాకు స్నేహితుడయ్యాడు.—కీర్త. 51:4, 6, 10, 11.

18. మనం యెహోవా స్వరాన్ని వింటూనే ఉండాలంటే ఏమి చేయాలి?

18 మనమందరం, 1 కొరింథీయులు 10:12⁠లో ఉన్న సలహాను పాటిస్తూ, మితిమీరిన ఆత్మవిశ్వాసం చూపించకుండా జాగ్రత్తపడదాం. మనం ‘మన మార్గాన్ని ఏర్పర్చుకోలేం’ కాబట్టి, అయితే యెహోవా స్వరాన్నైనా వింటాం లేదా ఆయన శత్రువు స్వరాన్నైనా వింటాం. (యిర్మీ. 10:23) అందుకే, మనం ఎడతెగక ప్రార్థిద్దాం, పరిశుద్ధాత్మ నిర్దేశాన్ని పాటిద్దాం, ఎల్లప్పుడూ యెహోవా స్వరాన్ని జాగ్రత్తగా విందాం.