పాఠకుల ప్రశ్న
పునరుత్థానమైనవాళ్లు “పెండ్లిచేసికొనరు పెండ్లికియ్యబడరు” అని యేసు సద్దూకయ్యులతో అన్నాడు. (లూకా 20:34-36) ఆయన భూమ్మీద జరిగే పునరుత్థానం గురించి మాట్లాడుతున్నాడా?
అది ఒక ముఖ్యమైన ప్రశ్న, ప్రియమైన తమ భాగస్వామిని కోల్పోయిన వాళ్లకు ఇంకా ప్రాముఖ్యమైన ప్రశ్న. వాళ్లు కొత్తలోకంలో పునరుత్థానమైన తమ భాగస్వామితో కలిసి జీవించాలని ఎంతగానో ఎదురుచూస్తుండవచ్చు. తన భార్యను కోల్పోయిన ఓ సహోదరుడు ఇలా చెబుతున్నాడు, “మా వివాహబంధాన్ని తెంచుకోవాలని నేనూ నా భార్యా కోరుకోలేదు. భార్యాభర్తలముగా ఎల్లప్పుడూ కలిసి యెహోవాను ఆరాధించాలన్నదే మా ఇద్దరి హృదయపూర్వక కోరిక. ఆ కోరిక నాలో ఇంకా సజీవంగానే ఉంది.” పునరుత్థానమైనవాళ్లకు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందని నమ్మడానికి ఏదైనా బలమైన కారణం ఉందా? మనం చెప్పలేము.
పునరుత్థానం, పెళ్లి గురించి యేసు చెప్పిన మాటలు బహుశా భూపునరుత్థానానికి సంబంధించినవని, నూతనలోకంలో పునరుత్థానమైన వాళ్లు పెళ్లి చేసుకోకపోవచ్చని మన ప్రచురణలు ఎన్నో ఏళ్లుగా చెబుతూ వచ్చాయి. a (మత్త. 22:29, 30; మార్కు 12:24, 25; లూకా 20:34-36) అయితే, యేసు ఆ మాటల్ని పరలోక పునరుత్థానాన్ని మనసులో పెట్టుకుని చెప్పివుంటాడా? అసలు యేసు ఏమి చెప్పాడో ఇప్పుడు పరిశీలిద్దాం.
ముందు ఆ సందర్భాన్ని చూద్దాం. (లూకా 20:27-33 చదవండి.) పునరుత్థానాన్ని నమ్మని సద్దూకయ్యులు, యేసును ఇరకాటంలో పెట్టడానికి పునరుత్థానం, మరిది వివాహం గురించి ఓ ప్రశ్న అడిగారు. b దానికి యేసు ఇలా సమాధానం చెప్పాడు, “ఈ లోకపు జనులు పెండ్లి చేసికొందురు, పెండ్లికియ్యబడుదురు గాని పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు పెండ్లిచేసికొనరు పెండ్లికియ్యబడరు. వారు పునరుత్థానములో పాలివారైయుండి, దేవదూత సమానులును దేవుని కుమారులునై యుందురు గనుక వారికను చావనేరరు.”—లూకా 20:34-36.
యేసు బహుశా భూపునరుత్థానం గురించే మాట్లాడుతున్నాడని మన ప్రచురణలు ఎందుకు చెప్పాయి? ముఖ్యంగా రెండు కారణాలను బట్టి అలా అనుకున్నాం. మొదటిది, సద్దూకయ్యులు భూపునరుత్థానాన్ని మనసులో ఉంచుకుని ఆ ప్రశ్న అడిగివుంటారు, కాబట్టి యేసు వాళ్లకు తగ్గట్లుగానే జవాబిచ్చుంటాడని గతంలో అనుకున్నాం. రెండవది, యేసు తన సమాధానం చివర్లో నమ్మకస్థులైన పితరులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గురించి ప్రస్తావించాడు, వాళ్లందరూ ఈ భూమ్మీద పునరుత్థానం అయ్యేవాళ్లే.—లూకా 20:37, 38.
అయితే, యేసు పరలోక పునరుత్థానాన్ని మనసులో ఉంచుకుని ఆ మాటలు చెప్పివుంటాడని అనిపిస్తుంది. ఈ అభిప్రాయానికి రావడానికి మనకు ఏ ఆధారాలు ఉన్నాయి? యేసు సమాధానంలోని రెండు ముఖ్యమైన వాక్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
“మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులని యెంచబడినవారు.” నమ్మకస్థులైన అభిషిక్తులు ‘దేవుని రాజ్యమునకు యోగ్యులు.’ (2 థెస్స. 1:5, 11) విమోచన క్రయధనం ఆధారంగా యెహోవా వాళ్లను జీవం పొందే నీతిమంతులుగా తీర్పుతీర్చాడు కాబట్టి, వాళ్లు శిక్షావిధికి గురైన పాపులుగా చనిపోరు. (రోమా. 5:1, 18; 8:1) అలాంటివాళ్లు “ధన్యులును పరిశుద్ధులునై” ఉన్నారని బైబిలు చెబుతుంది కాబట్టి, వాళ్లు పరలోక పునరుత్థానం పొందడానికి నిస్సందేహంగా యోగ్యులు. (ప్రక. 20:5, 6) అయితే, భూమ్మీద పునరుత్థానం అయ్యేవాళ్లలో “అనీతిమంతులు” కూడా ఉంటారు. (అపొ. 24:14, 15) మరి, ఈ ‘అనీతిమంతుల్ని’ “పునరుత్థానం పొందుటకు యోగ్యులు” అని చెప్పగలమా?
“వారికను చావనేరరు.” యేసు “వారికను చావరు” అనలేదుగానీ, “వారికను చావనేరరు” అన్నాడు. ఇదే వాక్యాన్ని ఇతర అనువాదాలు “వారిక ఏమాత్రం మరణం అధీనంలో ఉండరు,” “చావుకు ఇక వారిమీద అధికారం లేదు” అని అనువదించాయి. నమ్మకంగా తమ భూజీవితం ముగించిన అభిషిక్త క్రైస్తవులు, పరలోకానికి పునరుత్థానమై అమర్త్యతను అంటే అంతంలేని, నాశనం చేయలేని జీవాన్ని పొందుతారు. (1 కొరిం. 15:53, 54) పరలోక పునరుత్థానం పొందేవాళ్ల మీద మరణానికి ఇక ఎంతమాత్రం అధికారం ఉండదు. c
ఈ కారణాలను బట్టి మనం ఏ అభిప్రాయానికి రావచ్చు? పెళ్లి, పునరుత్థానం గురించి చెప్పినప్పుడు యేసు పరలోక పునరుత్థానం గురించే మాట్లాడివుండవచ్చు. ఒకవేళ అదే నిజమైతే, ఆయన మాటలు పరలోకానికి పునరుత్థానమయ్యే వాళ్ల గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తాయి. అవి: (1) వాళ్లు పెళ్లి చేసుకోరు, (2) వాళ్లు చనిపోలేరు, (3) వాళ్లు కొన్ని విషయాల్లో పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. అయితే మనం అలాంటి అభిప్రాయానికి వస్తే, మరికొన్ని ప్రశ్నలు తలెత్తుతాయి.
మొదటి ప్రశ్న, సద్దూకయ్యులు భూపునరుత్థానం గురించి అడిగితే యేసు పరలోక పునరుత్థానం గురించి ఎందుకు చెప్పాడు? యేసు తన వ్యతిరేకులకు జవాబిచ్చేటప్పుడు అన్నిసార్లూ వాళ్ల ఆలోచనలకు సరిపోయే విధంగా సమాధానం చెప్పలేదు. ఉదాహరణకు, ఓ సూచకక్రియ చేయమని అడిగిన యూదులతో ఆయన “ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదును” అని చెప్పాడు. వాళ్లు నిజమైన ఆలయం గురించి ఆలోచిస్తున్నారని యేసుకు తెలిసినా, “ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.” (యోహా. 2:18-21) సద్దూకయ్యులు పునరుత్థానాన్ని, దేవదూతల్ని నమ్మరు కాబట్టి వాళ్లకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని బహుశా యేసు అనుకునివుంటాడు. (సామె. 23:9; మత్త. 7:6; అపొ. 23:8) అయితే, యథార్థవంతులైన తన శిష్యులు ఏదోరోజు పరలోక పునరుత్థానం పొందుతారని యేసుకు తెలుసు, అందుకే వాళ్ల ప్రయోజనం కోసమే పరలోక పునరుత్థానం గురించిన సత్యాలను చెప్పాలని ఆయన అనుకునివుంటాడు.
రెండవ ప్రశ్న, యేసు తన సమాధానం చివర్లో, భూమ్మీద పునరుత్థానం అయ్యే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గురించి ఎందుకు ప్రస్తావించాడు? (మత్తయి 22:31, 32 చదవండి.) యేసు ఆ నమ్మకస్థుల గురించి చెప్పే ముందు, “మృతుల పునరుత్థానమును గూర్చి” అని అన్నాడు. అలా అనడం ద్వారా, యేసు బహుశా తన చర్చను పరలోక పునరుత్థానం నుండి భూపునరుత్థానం వైపుకు మళ్లిస్తుండవచ్చు. సద్దూకయ్యులు మోషే రాసినవాటిని నమ్ముతారని యేసుకు తెలుసు, అందుకే భూపునరుత్థానం దేవుని సంకల్పమని గట్టిగా రుజువుచేయడానికి, మండుతున్న పొద దగ్గర యెహోవా మోషేతో చెప్పిన మాటల్ని యేసు ప్రస్తావించాడు.—నిర్గ. 3:1-6.
ఇక మూడవ ప్రశ్న, పునరుత్థానం-పెళ్లి గురించి యేసు చెప్పిన మాటలు పరలోక పునరుత్థానం గురించే అయితే, భూమ్మీద పునరుత్థానం అయ్యేవాళ్లకు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా? ఆ ప్రశ్నకు బైబిలు సూటిగా జవాబు చెప్పడం లేదు. యేసు ఒకవేళ పరలోక పునరుత్థానం గురించే మాట్లాడివుంటే, పరదైసులో పునరుత్థానం అయ్యేవాళ్లకు పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుందా లేదా అనే ప్రశ్నకు ఆయన మాటల్లో జవాబు దొరకదు.
అయితే, వివాహబంధం మరణంతో తెగిపోతుందని దేవుని వాక్యం ఖచ్చితంగా చెబుతుందని మనకు తెలుసు. కాబట్టి తమ భాగస్వామిని మరణంలో పోగొట్టుకున్నవాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటే, అది తప్పేమీ కాదు. అది వ్యక్తిగత నిర్ణయం. మళ్లీ పెళ్లి చేసుకుని, ప్రేమించే భాగస్వామి సహచర్యాన్ని పొందాలనుకునే అలాంటివాళ్లను ఇతరులు విమర్శించకూడదు.—రోమా. 7:2, 3; 1 కొరిం. 7:39.
కొత్త లోకంలో జీవితం గురించి ఎన్నో ప్రశ్నలు రావడం సహజమే. అలాంటి ప్రశ్నల జవాబులను అనవసరంగా ఊహించే బదులు, వాటికోసం ఎదురుచూడడం మంచిది. అయితే ఒక్క విషయాన్ని ఖచ్చితంగా చెప్పవచ్చు, తనకు విధేయత చూపించే మనుషులందరి అవసరాలను, కోరికలను యెహోవా శ్రేష్ఠమైన రీతిలో తీరుస్తాడు కాబట్టి వాళ్లు సంతోషంగా ఉంటారు.—కీర్త. 145:16.
a కావలికోట (ఇంగ్లీషు) జూన్ 1, 1987 సంచికలో 30-31 పేజీలు చూడండి.
b బైబిలు కాలాల్లో మరిది వివాహం ఒక ఆచారం. ఒక వ్యక్తి సంతానం లేకుండా చనిపోతే, అతని తమ్ముడు అన్న భార్యను పెళ్లిచేసుకుని పిల్లల్ని కని తన అన్న వంశాన్ని నిలబెట్టేవాడు.—ఆది. 38:8; ద్వితీ. 25:5, 6.
c భూమ్మీద పునరుత్థానం అయ్యేవాళ్లకు అమర్త్యత కాదుగానీ నిరంతరం జీవించే అవకాశం ఉంటుంది. అమర్త్యతకు, నిరంతర జీవితానికి మధ్యవున్న తేడా గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి కావలికోట (ఇంగ్లీషు) ఏప్రిల్ 1, 1984 సంచికలో 30-31 పేజీలు చూడండి.