కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పాఠకుల ప్రశ్న

పాఠకుల ప్రశ్న

ఒక క్రైస్తవునికి సరిపడా ఆహారం ఉండని పరిస్థితిని యెహోవా ఎన్నడూ రానియ్యడని, కీర్తన 37:25⁠లో దావీదు, మత్తయి 6:33⁠లో యేసు చెప్పిన మాటలు సూచిస్తున్నాయా?

“నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి యుండలేదు” అని దావీదు రాశాడు. ఆయన తన అనుభవంతో ఆ మాటలు చెబుతున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ శ్రద్ధ తీసుకుంటాడనే విషయం దావీదుకు బాగా తెలుసు. (కీర్త. 37:25) అయితే దావీదు మాటలకు అర్థం, దేవుని సేవకులకు ఎప్పుడూ లోటు రాలేదనీ ఇకముందు కూడా రాదనీ కాదు.

కొన్నిసార్లు దావీదు కూడా చాలా కష్టాలు అనుభవించాడు. ఓ సందర్భంలో ఆయన సౌలు నుండి తప్పించుకుని పారిపోతున్నాడు. అప్పుడు ఆయన దగ్గర ఆహార పదార్థాలు కొద్దిగానే ఉన్నాయి, దాంతో తనకోసం తనతోపాటు ఉన్నవాళ్ల కోసం ఆయన ఆహారం అడగాల్సి వచ్చింది. (1 సమూ. 21:1-6) ఆ సందర్భంలో సరిపడా ఆహారం లేకపోయినా, వీధుల్లో భిక్షమెత్తుకోవాల్సిన దుస్థితి దావీదుకు రాలేదు. యెహోవా తన బాగోగులు చూసుకుంటాడని ఆయనకు తెలుసు.

దేవుని రాజ్యానికి మొదటి స్థానం ఇచ్చే నమ్మకమైన సేవకుల అవసరాలను దేవుడు తీరుస్తాడని, మత్తయి 6:33⁠లో యేసు ఇచ్చిన హామీని మనం చూస్తాం. “మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు [ఆహారం, నీళ్లు, బట్టలు కూడా] మీకనుగ్రహింపబడును” అని యేసు చెప్పాడు. అయితే, హింసలవల్ల తన ‘సహోదరులకు’ కొన్నిసార్లు ఆహారం ఉండకపోవచ్చని కూడా యేసు చెప్పాడు. (మత్త. 25:35, 37, 40) అపొస్తలుడైన పౌలుకు అలాగే జరిగింది. ఆయన కొన్నిసార్లు ఆకలిదప్పులతో ఇబ్బందిపడ్డాడు.—2 కొరిం. 11:27.

మనకు అనేక రకాల హింసలు వస్తాయని యెహోవా చెబుతున్నాడు. సాతాను నిందలకు జవాబివ్వడానికి మనవంతు ప్రయత్నిస్తుండగా, మనం కొన్నిసార్లు ఇబ్బందులు పడేందుకు దేవుడు అనుమతించవచ్చు. (యోబు 2:3-5) కొంతమంది తోటి క్రైస్తవులు హింసల వల్ల చాలా కష్టాలు పడుతున్నారు. ఉదాహరణకు, నాజీ నిర్బంధ శిబిరాల్లో సహోదరసహోదరీలు ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ల యథార్థతను బలహీనపర్చడానికి అధికారులు ఎన్నో క్రూర పద్ధతులు ఉపయోగించారు. వాటిలో ఒకటి, వాళ్లకు సరిపడా ఆహారం ఇవ్వకపోవడం. అయినా, నమ్మకస్థులైన సాక్షులు యెహోవాపట్ల యథార్థంగా ఉన్నారు; యెహోవా వాళ్లను విడిచిపెట్టలేదు. రకరకాల శ్రమలు అనుభవించేలా ఆయన క్రైస్తవులందరినీ అనుమతించినట్లే ఆ సహోదరసహోదరీలకు కూడా ఆ కష్టాన్ని అనుమతించాడు. అయితే తన నామం కోసం కష్టాలుపడే వాళ్లందరూ వాటిని సహించేలా యెహోవా సహాయం చేస్తాడని నిస్సందేహంగా చెప్పవచ్చు. (1 కొరిం. 10:13) ఫిలిప్పీయులు 1:29⁠లోని ఈ మాటల్ని మనం మనసులో ఉంచుకోవచ్చు, “క్రీస్తును విశ్వసించే అవకాశమే కాకుండా, ఆయన కోసం కష్టాలు అనుభవించే అవకాశం మీకు కూడా దేవుడు కలిగించాడు.” (పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌)

తన సేవకులకు తోడుగా ఉంటానని యెహోవా మాటిస్తున్నాడు. “నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు” అని యెషయా 54:17⁠లో ఆయన చెబుతున్నాడు. ఈ వాగ్దానంతో పాటు ఇలాంటి మరికొన్ని వాగ్దానాలు, దేవుడు తన ప్రజలను ఒక గుంపుగా కాపాడతాడనే భరోసా ఇస్తున్నాయి. అయితే క్రైస్తవులు ఒక్కొక్కరుగా మాత్రం శ్రమలు అనుభవించవచ్చు, కొన్నిసార్లయితే ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి రావచ్చు.