చివరి శత్రువైన మరణాన్ని దేవుడు నాశనం చేస్తాడు
“కడపట నశింపజేయబడు శత్రువు మరణము.”—1 కొరిం. 15:26.
1, 2. ఆదాముహవ్వల జీవితం మొదట్లో ఎలా ఉండేది? ఏ ప్రశ్నల్ని ఇప్పుడు పరిశీలిస్తాం?
దేవుడు ఆదాముహవ్వలను సృష్టించినప్పుడు వాళ్లకు శత్రువులెవరూ లేరు. వాళ్లు పరిపూర్ణులుగా పరదైసులో జీవించారు. వాళ్లిద్దరూ కొడుకులా కూతురిలా తమ సృష్టికర్తతో ఎంతో సన్నిహితంగా ఉన్నారు. (ఆది. 2:7-9; లూకా 3:38) దేవుడు వాళ్లకు చాలా ముఖ్యమైన పని ఇచ్చాడు. (ఆదికాండము 1:28 చదవండి.) వాళ్లిద్దరూ ‘భూమిని నిండించి, దాన్ని లోబరుచుకోవడానికి’ మరీ ఎక్కువ కాలం పట్టదు. అయితే, “భూమిమీద ప్రాకు ప్రతి జీవిని” ఏలుతూ ఉండాలంటే మాత్రం వాళ్లు ఎల్లప్పుడూ జీవిస్తూ ఉండాలి. అవును, వాళ్లు నిరంతరం ఆనందంగా ప్రతీజీవిని ఏలగలిగేవాళ్లే!
2 మరైతే అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు ఎందుకు లేవు? మనకు ఏమాత్రం సంతోషం లేకుండా చేస్తున్న అనేక శత్రువులతోపాటు అతిపెద్ద శత్రువైన మరణం బారిన మనుషులు ఎలా పడ్డారు? ఈ శత్రువులను దేవుడు ఎలా నాశనం చేస్తాడు? ఈ ప్రశ్నలతోపాటు వీటికి సంబంధించిన మరికొన్ని ప్రశ్నలకు బైబిల్లో సమాధానాలు ఉన్నాయి. వాటిని ఇప్పుడు పరిశీలిద్దాం.
దేవుడు ప్రేమగా హెచ్చరించాడు
3, 4. (ఎ) దేవుడు ఆదాముహవ్వలకు ఏ ఆజ్ఞ ఇచ్చాడు? (బి) ఆ ఆజ్ఞకు లోబడి ఉండడం ఎంత ప్రాముఖ్యం?
3 ఆదాముహవ్వలకు నిత్యం జీవించే అవకాశం ఉన్నప్పటికీ, వాళ్లు అమర్త్యులు కారు. వాళ్లు జీవిస్తూ ఉండాలంటే గాలి పీల్చుకోవాలి, నిద్రపోవాలి, తినాలి, తాగాలి. అంతకన్నా ముఖ్యంగా, వాళ్ల జీవితాలు జీవదాతయైన యెహోవాతో వాళ్లకున్న అనుబంధంపై ఆధారపడివున్నాయి. (ద్వితీ. 8:3) వాళ్ల జీవితం సంతోషంగా సాగిపోతూ ఉండాలంటే తప్పకుండా దేవుని మార్గనిర్దేశం పాటించాలి. యెహోవా ఆ విషయాన్ని హవ్వను సృష్టించకముందే ఆదాముకు స్పష్టం చేశాడు. ఎలా? “దేవుడైన యెహోవా—ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.”—ఆది. 2:16, 17.
4 “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం,” ఏది మంచో ఏది చెడో నిర్ణయించే యెహోవా అధికారానికి గుర్తుగా ఉంది. అయితే, దేవుడు ఆదామును తన స్వరూపంలో చేసి, ఆయనలో మనస్సాక్షిని పెట్టాడు కాబట్టి ఆదాముకు కూడా మంచీచెడులను గుర్తించే సామర్థ్యం కొంచెం ఉంది. యెహోవా మార్గనిర్దేశం తమకు ఎల్లప్పుడూ అవసరమని ఆ చెట్టు ఆదాముహవ్వలకు గుర్తుచేసేది. వాళ్లు ఆ చెట్టు పళ్లను తింటే, నిజానికి మంచీచెడులను నిర్ణయించుకునే స్వేచ్ఛను కోరుకున్నట్లే అవుతుంది, అది వాళ్లకూ వాళ్ల పిల్లలకూ తీవ్రమైన హాని కలిగిస్తుంది. దేవుడు ఆజ్ఞతోపాటు, శిక్షను కూడా ప్రస్తావించడాన్ని బట్టి అది ఎంత తీవ్రమైన విషయమో అర్థమౌతుంది.
మానవ కుటుంబంలోకి మరణం ఎలా ప్రవేశించింది?
5. ఆదాముహవ్వలు యెహోవాకు ఎలా అవిధేయులయ్యారు?
5 దేవుడు హవ్వను సృష్టించిన తర్వాత, ఆదాము ఆ ఆజ్ఞ గురించి ఆమెకు చెప్పాడు. హవ్వకు ఆ ఆజ్ఞ బాగా తెలుసు, అందుకే దాన్ని ఉన్నదున్నట్లుగా చెప్పగలిగింది. (ఆది. 3:1-3) ఆమె దాన్ని, ఓ పాము ద్వారా మాట్లాడుతున్న సాతానుతో చెప్పింది. సాతాను అప్పటికే అధికారం, స్వేచ్ఛ కోసం తహతహలాడుతున్నాడు. (యాకోబు 1:14, 15తో పోల్చండి.) సాతాను తన చెడు ఉద్దేశాల్ని నెరవేర్చుకునేందుకు, దేవుడు అబద్ధమాడుతున్నాడని నిందించాడు. పైగా దేవుని నుండి స్వతంత్రంగా ఉంటే చనిపోరుగాని దేవునిలా తయారవుతారని సాతాను హవ్వను నమ్మించాడు. (ఆది. 3:4, 5) హవ్వ ఆ మాటలు నమ్మి, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఆ చెట్టు పండ్లను తిన్నది, ఆదాము చేతకూడా తినిపించింది. (ఆది. 3:6, 17) సాతాను ఆమెతో అబద్ధం చెప్పాడు. (1 తిమోతి 2:14 చదవండి.) వాటిని తినడం తప్పని ఆదాముకు తెలిసినా, ‘తన భార్య మాట విన్నాడు.’ ఆ పాము తన మేలు కోరుతున్నట్లు హవ్వకు అనిపించినా, నిజానికి దాని వెనకున్న అపవాదియైన సాతాను ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని శత్రువు. హవ్వకు తాను ఇచ్చిన సలహావల్ల ఎలాంటి ఘోరమైన పర్యవసానాలు వస్తాయో ఆ శత్రువుకు తెలుసు.
6, 7. యెహోవా తప్పిదస్థులకు ఎలా తీర్పుతీర్చాడు?
6 ఆదాముహవ్వలు తమకు ప్రాణాన్ని, సమస్తాన్ని ఇచ్చిన యెహోవాపై స్వార్థంతో తిరుగుబాటు చేశారు. అయితే జరిగినదంతా యెహోవా చూశాడు. (1 దిన. 28:9; సామెతలు 15:3 చదవండి.) కానీ ఆదాము, హవ్వ, సాతాను ఈ ముగ్గురు తనగురించి ఏమనుకుంటున్నారో చూపించే అవకాశం ఆయన వాళ్లకిచ్చాడు. ఒక తండ్రిగా యెహోవా ఎంతో బాధపడ్డాడు. (ఆదికాండము 6:6తో పోల్చండి.) అయితే తర్వాత, ఓ జడ్జిలా ఆ పాపుల విషయంలో తీర్పు తీర్చాడు.
7 “నీవు [మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను] తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు” అని యెహోవా ఆదాముకు ముందే చెప్పాడు. ఆ “దినము” 24 గంటల దినమని బహుశా ఆదాము అర్థం చేసుకునివుంటాడు. దేవుని ఆజ్ఞను మీరిన తర్వాత, సూర్యాస్తమయానికి ముందే చనిపోతానని ఆదాము అనుకొనివుంటాడు. యెహోవా ‘చల్లని వేళ’ వీళ్లిద్దరి దగ్గరికి వచ్చాడు. (ఆది. 3:8) న్యాయవంతుడైన జడ్జిలా ఆయన ముందుగా వాళ్లిద్దరు చెప్పింది విన్నాడు. (ఆది. 3:9-13) తర్వాత ఆ పాపులిద్దరికి మరణ శిక్ష విధించాడు. (ఆది. 3:14-19) దేవుడు ఒకవేళ ఆదాముహవ్వలను అక్కడికక్కడే నాశనం చేసివుంటే వాళ్ల విషయంలో, వాళ్ల సంతానం విషయంలో ఆయన సంకల్పం నెరవేరకపోయేది. (యెష. 55:11) వాళ్లిద్దరు ఖచ్చితంగా చనిపోతారని దేవుడు చెప్పాడు, పాపంవల్ల పర్యవసానాలు వెంటనే కనిపించడం మొదలయ్యాయి. అయినా, యెహోవా ఆదాముహవ్వలకు పిల్లల్ని కనే అవకాశం ఇచ్చాడు, ఆ పిల్లలు ఆయన చేయబోయే ఏర్పాట్లనుండి ప్రయోజనం పొందవచ్చు. అయితే దేవుని దృష్టిలో ఆదాముహవ్వలు తప్పుచేసిన రోజే చనిపోయారు. యెహోవాకు ఒక దినం 1,000 సంవత్సరాలతో సమానం కాబట్టి, వాళ్లు ఒక్క ‘దినంలోనే’ చనిపోయారు.—2 పేతు. 3:8.
8, 9. ఆదాము చేసిన పాపం ఆయన సంతతిపై ఎలాంటి ప్రభావం చూపించింది? (ప్రారంభ చిత్రం చూడండి.)
8 ఆదాముహవ్వలు చేసిన పాపం వాళ్ల పిల్లలపై ఏమైనా ప్రభావం చూపించిందా? నిస్సందేహంగా చూపించింది. రోమీయులు 5:12 వివరిస్తున్నట్లు “ఒక మనుష్యునిద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.” చనిపోయిన మొదటి వ్యక్తి, నమ్మకస్థుడైన హేబెలు. (ఆది. 4:8) ఆ తర్వాత, ఆదాము పిల్లల్లో మిగతావాళ్లు వృద్ధులై చనిపోయారు. వాళ్లు పాపమరణాల్ని వారసత్వంగా పొందారా? అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, ‘ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా చేయబడ్డారు.’ (రోమా. 5:19) ఆదామునుండి వారసత్వంగా వచ్చిన పాపం, మరణం ఏమాత్రం జాలిలేని శత్రువుల్లా మానవజాతిని పట్టిపీడిస్తున్నాయి, అపరిపూర్ణ మనుషులు వాటినుండి తప్పించుకోలేరు. పాపం, మరణం ఆదామునుండి ఆయన పిల్లలకు, ఆ తర్వాతి తరాలకు ఎలా సంక్రమించిందో మనకైతే పూర్తిగా తెలియదు, కానీ సంక్రమించిందని మాత్రం తెలుసు.
9 అందుకే, “సమస్తజనముల ముఖములను కప్పుచున్న ముసుకు” అనీ, “సమస్త జనములమీద పరచబడిన తెర” అనీ పాపమరణాల గురించి బైబిలు సరిగ్గానే వర్ణిస్తోంది. (యెష. 25:7) ఊపిరి ఆడకుండా చేసే ముసుకులా లేదా తెరలా మరణం అందరినీ తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. అందుకే “ఆదామునందు అందరు . . . మృతిపొందుచున్నారు” అని బైబిలు చెబుతోంది. (1 కొరిం. 15:22) కాబట్టి పౌలుకు వచ్చిన ఈ ప్రశ్నే సహజంగా అందరికీ వస్తుంది, “ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” మరి ఎవరైనా విడిపించగలరా? a—రోమా. 7:24.
ఆదాము నుండి వచ్చిన పాపం, మరణం నాశనమౌతాయి
10. (ఎ) ఆదామువల్ల వచ్చిన మరణాన్ని దేవుడు నాశనం చేస్తాడని ఏయే వచనాలు సూచిస్తున్నాయి? (బి) ఆ వచనాలు యెహోవా గురించి, ఆయన కుమారుని గురించి ఏమి తెలియజేస్తాయి?
10 అవును, యెహోవా పౌలును విడిపించగలడు. “ముసుకు” గురించి ప్రస్తావించిన వెంటనే యెషయా ఇలా రాశాడు, “మరెన్నడును ఉండకుండ మరణమును ఆయన మ్రింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖముమీది బాష్ప బిందువులను తుడిచివేయును.” (యెష. 25:8) తన పిల్లలకు కష్టం కలిగించే బాధను తీసేసి, వాళ్ల కన్నీళ్లు తుడిచే ఓ తండ్రిలా యెహోవా కూడా ఆదామువల్ల వచ్చిన మరణాన్ని ఎంతో ఆనందంగా తీసేస్తాడు! ఆ పనిలో ఆయనకు యేసుక్రీస్తు సహకరిస్తాడు. 1 కొరింథీయులు 15:22 ఇలా చెబుతుంది, “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.” అందుకే, “నన్నెవడు విడిపించును?” అని ప్రశ్నించిన తర్వాత పౌలు ఇలా అన్నాడు, “మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.” (రోమా. 7:25) మానవజాతిని సృష్టించేలా యెహోవాను కదిలించిన ప్రేమ, ఆదాముహవ్వల తిరుగుబాటువల్ల చల్లారిపోలేదు. అలాగే మొదటి మానవజతను ఉనికిలోకి తీసుకురావడానికి యెహోవాతో కలిసి పనిచేసిన యేసుకు కూడా మనుషులపై ఇష్టం తగ్గిపోలేదు. (సామె. 8:30, 31) అయితే మానవజాతిని యెహోవా ఎలా విడిపిస్తాడు?
11. మానవజాతికి సహాయం చేసేందుకు యెహోవా ఏ ఏర్పాటు చేశాడు?
11 ఆదాము పాపం చేసినప్పుడు యెహోవా ఆయనకు మరణశిక్ష విధించాడు. ఆ పాపంవల్ల మనుషులందరూ అపరిపూర్ణతను, మరణాన్ని వారసత్వంగా పొందారు. (రోమా. 5:12, 16) “తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యులకందరికిని శిక్షావిధి కలుగుటకు” కారణమైందని రోమీయులు 5:18 చెబుతుంది. అయితే, యెహోవా తన నీతి ప్రమాణాలను ఉల్లంఘించకుండానే మనుషులకు ఎలా సహాయం చేయగలడు? దానికి జవాబు యేసు చెప్పిన ఈ మాటల్లో ఉంది, “మనుష్యకుమారుడు . . . అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను.” (మత్త. 20:28) యేసు పరిపూర్ణ మనిషి కాబట్టి “విమోచన క్రయధనము” చెల్లించగలడు. అయితే విమోచన క్రయధనం ఏవిధంగా యెహోవా న్యాయానికి తగినట్లుగా ఉంది?—1 తిమో. 2:5, 6.
12. ఏ విమోచన క్రయధనం న్యాయాన్ని ప్రతిబింబించింది?
12 యేసు పరిపూర్ణ మనిషి కాబట్టి నిరంతరం జీవించగలడు. ఆదాము కూడా అలాగే జీవించాలని యెహోవా కోరుకున్నాడు. ఆదాము పరిపూర్ణ సంతతితో ఈ భూమిని నింపాలన్నది యెహోవా సంకల్పం. అందుకే యేసు, తన తండ్రి మీదా ఆదాము సంతతిమీదా ఉన్న ప్రగాఢమైన ప్రేమతో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అవును, ఆదాము కోల్పోయిన జీవానికి సరిసమానమైన తన పరిపూర్ణ మానవ జీవాన్ని యేసు అర్పించాడు. ఆ తర్వాత, యెహోవా తన కుమారుణ్ణి ఆత్మ ప్రాణిగా పునరుత్థానం చేశాడు. (1 పేతు. 3:18) ఒక్క పరిపూర్ణ మనిషి ప్రాణాన్ని అంటే యేసు ప్రాణాన్ని విమోచన క్రయధనంగా యెహోవా అంగీకరించాడు. దానితో యెహోవా ఆదాము సంతతిని తిరిగి కొని, ఆయన కోల్పోయిన నిత్యజీవాన్ని వాళ్లకు ఇవ్వడం సాధ్యమౌతుంది. అలా విమోచన క్రయధనం న్యాయాన్ని కూడా ప్రతిబింబించింది. ఒక విధంగా, యేసు ఆదాము స్థానంలోకి వెళ్లాడు. అందుకే పౌలు ఇలా వివరించాడు, “ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయెనని వ్రాయబడియున్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయెను.”—1 కొరిం. 15:45.
13. “కడపటి ఆదాము” చనిపోయినవాళ్లకు ఎలా సహాయం చేస్తాడు?
13 “కడపటి ఆదాము” అతి త్వరలోనే ఆదాము సంతతికి నిత్యజీవం అనుగ్రహిస్తాడు. ఆ సంతతిలో, చనిపోయినవాళ్లు కూడా చాలామంది ఉంటారు. వాళ్లందరూ పునరుత్థానమై ఇదే భూమ్మీద మళ్లీ జీవిస్తారు.—యోహా. 5:28, 29.
14. మానవజాతికి అపరిపూర్ణత వల్ల వచ్చిన కష్టాలు ఎలా తొలగిపోతాయి?
14 మానవజాతికి అపరిపూర్ణత వల్ల వచ్చిన కష్టాలు ఎలా తొలగిపోతాయి? యెహోవా ‘కడపటి ఆదాముతో,’ మనుషుల్లో నుండి ఎన్నుకున్న మరికొంతమందితో పరలోకంలో ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. (ప్రకటన 3:21 చదవండి.) యేసుతోపాటు పరలోకంలో పరిపాలించే ఆ ఇతరులు ఒకప్పుడు మనలా అపరిపూర్ణులే. యేసు, ఆయన తోటి పరిపాలకులు వెయ్యేళ్లు పరిపాలించి, మనుషులు పరిపూర్ణులయ్యేలా సహాయం చేస్తారు.—ప్రక. 20:6.
15, 16. (ఎ) ‘కడపటి శత్రువైన’ ఏ మరణాన్ని దేవుడు నాశనం చేస్తాడు? ఎప్పుడు? (బి) 1 కొరింథీయులు 15:28 ప్రకారం యేసు ఏమి చేస్తాడు?
15 వెయ్యేళ్ల రాజ్యపాలన ముగిసే సమయానికి, విధేయులైన మనుషులందరూ ఆదాము కారణంగా వచ్చిన శత్రువుల నుండి విడుదల పొందుతారు. బైబిలు ఇలా చెబుతుంది, “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు. అటుతరువాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రియైన దేవునికి రాజ్యము అప్పగించును; అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులనందరిని తన పాదముల క్రింద ఉంచువరకు ఆయన రాజ్యపరిపాలన చేయుచుండవలెను. కడపట నశింపజేయబడు శత్రువు మరణము.” (1 కొరిం. 15:22-26) అవును, ఆదాము నుండి వచ్చిన మరణం చివరకు నాశనం అవుతుంది. సమస్త మానవజాతిని కప్పివున్న “ముసుకు” శాశ్వతంగా తొలగిపోతుంది.—యెష. 25:7, 8.
16 అపొస్తలుడైన పౌలు తన వివరణను ఈ మాటలతో ముగిస్తున్నాడు, “సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును.” (1 కొరిం. 15:28) కుమారుని పరిపాలనకున్న ఉద్దేశం పూర్తిగా నెరవేరుతుంది. అప్పుడు ఆయన పూర్తి సంతృప్తితో తన అధికారాన్ని, పరిపూర్ణ మానవ కుటుంబాన్ని యెహోవాకు అప్పగిస్తాడు.
17. సాతానుకు చివరికి ఏమౌతుంది?
17 మరి, అసలు మానవజాతి బాధలకు కారణమైన సాతాను సంగతి ఏమిటి? ప్రకటన 20:7-15 వచనాల్లో దానికి జవాబుంది. పరిపూర్ణ మనుషులందరూ ఎదుర్కొనే అంతిమ పరీక్షలో, వాళ్లను తప్పుదోవ పట్టించడానికి సాతాను ప్రయత్నిస్తాడు. అప్పుడు, సాతానుతోపాటు అతన్ని అనుసరించేవాళ్లు ‘రెండవ మరణంలో’ శాశ్వతంగా నాశనం అవుతారు. (ప్రక. 21:8) ఈ ‘రెండవ మరణంలో’ చనిపోయేవాళ్లు మళ్లీ ఎప్పటికీ బ్రతకరు కాబట్టి ఈ మరణం ఎన్నడూ నాశనం కాదు. అయితే సృష్టికర్తను ప్రేమిస్తూ, ఆయన్ను సేవించేవాళ్లకు రెండవ మరణంవల్ల ఏ హానీ ఉండదు.
18. దేవుడు ఆదాముకు ఇచ్చిన పని ఎలా పూర్తౌతుంది?
18 అప్పుడు జీవించే మనుషులందరూ పరిపూర్ణులుగా, యెహోవా దృష్టిలో నిత్యజీవం పొందడానికి అర్హులుగా ఉంటారు. శత్రుభయం లేకుండా మనుషులు సంతోషంగా ఉంటారు. ఆదాముకు దేవుడు ఏ పనైతే ఇచ్చాడో, అది ఆదాము లేకుండానే పూర్తౌతుంది. ఆయన పిల్లలు ఎంతో ఆనందంగా ఈ భూమిని, దాని మీదున్న జంతువులను సంరక్షిస్తారు. కడపటి శత్రువైన మరణాన్ని యెహోవా త్వరలోనే నాశనం చేస్తాడు కాబట్టి మనమెంత సంతోషించవచ్చో కదా!
a మనుషులు ఎందుకు వృద్ధులై చనిపోతున్నారో వివరించడానికి శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాల గురించి లేఖనాలపై అంతర్దృష్టి (ఇంగ్లీషు) ఇలా వ్యాఖ్యానించింది, “మొట్టమొదటి మానవజంటకు సృష్టికర్తే స్వయంగా మరణశిక్షను విధించి, దాన్ని మనుషులు పూర్తిగా అర్థం చేసుకోలేని రీతిలో అమలుచేస్తున్నాడనే వాస్తవాన్ని వాళ్లు నిర్లక్ష్యం చేస్తున్నారు.”—2వ సంపుటి, 247వ పేజీ.