కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పూర్తికాల సేవలో ఉన్నవాళ్లను గుర్తుపెట్టుకోండి

పూర్తికాల సేవలో ఉన్నవాళ్లను గుర్తుపెట్టుకోండి

‘విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మేము మానక జ్ఞాపకము చేసికొనుచున్నాము.’—1 థెస్స. 1:2, 3.

1. సువార్త కోసం కష్టపడ్డవాళ్ల గురించి పౌలు ఎలా భావించాడు?

 అపొస్తలుడైన పౌలు సువార్త కోసం కష్టపడ్డవాళ్లను గుర్తుపెట్టుకున్నాడు. “విశ్వాసముతోకూడిన మీ పనిని, ప్రేమతోకూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతోకూడిన మీ ఓర్పును, మేము మన తండ్రియైన దేవుని యెదుట మానక జ్ఞాపకము” చేసుకుంటున్నామని పౌలు అన్నాడు. (1 థెస్స. 1:2, 3) తమ పరిస్థితులవల్ల ఎక్కువ సేవ చేస్తున్నా లేదా కొంచెమే చేస్తున్నా, ప్రేమతో తనను నమ్మకంగా సేవించేవాళ్లను యెహోవా తప్పకుండా గుర్తుపెట్టుకుంటాడు.—హెబ్రీ. 6:10.

2. ఈ ఆర్టికల్‌లో మనమేమి చూస్తాం?

2 అప్పుడూ ఇప్పుడూ చాలామంది దేవుని సేవకులు పూర్తికాల సేవ చేయడానికి పెద్దపెద్ద త్యాగాలు చేశారు. ముందుగా మనం, మొదటి శతాబ్దంలో కొంతమంది దేవుని సేవ ఎలా చేశారో చూద్దాం. అంతేకాక, నేడు పూర్తికాల సేవలో ఉన్న వివిధ రంగాలను పరిశీలించి, ఈ ప్రత్యేకమైన విధానాల్లో సేవచేస్తున్న మన ప్రియ సహోదరసహోదరీలను ఎలా గుర్తుపెట్టుకోవచ్చో చూద్దాం.

మొదటి శతాబ్దంలోని క్రైస్తవులు

3, 4. (ఎ) మొదటి శతాబ్దంలో కొంతమంది ఎలా సేవ చేశారు? (బి) వాళ్ల అవసరాలు ఎలా తీరేవి?

3 యేసు బాప్తిస్మం తీసుకున్న కొన్ని రోజులకే, భూవ్యాప్తంగా జరగాల్సిన ఒక పనిని ప్రారంభించాడు. (లూకా 3:21-23; 4:14, 15, 43) ఆయన చనిపోయాక అపొస్తలులు ఆ పనిని ముందుండి నడిపించారు. (అపొ. 5:42; 6:7) ఫిలిప్పులాంటి కొంతమంది క్రైస్తవులు పాలస్తీనా దేశంలో సువార్తికులుగా, మిషనరీలుగా సేవ చేశారు. (అపొ. 8:5, 40; 21:8) పౌలు, మరితరులు సుదూర ప్రాంతాలకు వెళ్లి సేవచేశారు. (అపొ. 13:2-4; 14:26; 2 కొరిం. 1:19) సిల్వాను, మార్కు, లూకా వంటి ఇంకొంతమంది లేఖికులుగా, రచయితలుగా కూడా సేవచేశారు. (1 పేతు. 5:12) నమ్మకస్థులైన ఈ సహోదరులతో కలసి కొంతమంది సహోదరీలు కూడా సేవ చేశారు. (అపొ. 18:26; రోమా. 16:1, 2) వాళ్లందరి అనుభవాలవల్ల క్రైస్తవ గ్రీకు లేఖనాలు చదవడానికి ఆసక్తికరంగా ఉండడంతోపాటు యెహోవా తన సేవకుల్ని గుర్తుంచుకుంటాడని కూడా చూపిస్తాయి.

4 అప్పట్లో పూర్తికాల సేవకులు ఖర్చులను ఎలా భరించేవాళ్లు? వాళ్లను కొన్నిసార్లు తోటి క్రైస్తవులు తమ ఇంటికి ఆహ్వానించేవాళ్లు, వేరేవిధాలుగా కూడా సహాయం చేసేవాళ్లు. అయితే, అలాంటి సహాయం చేయాల్సిందేనని వాళ్లు పట్టుబట్టేవాళ్లు కాదు. (1 కొరిం. 9:11-15) కొంతమంది సహోదరసహోదరీలకు తోడు, సంఘాలు కూడా ఇష్టంగానే సహాయం చేశాయి. (అపొస్తలుల కార్యములు 16:14, 15; ఫిలిప్పీయులు 4:15-18 చదవండి.) పౌలు, ఆయనతోపాటు ప్రయాణసేవ చేసినవాళ్లు ఖర్చులకోసం కొంత సమయం పనికూడా చేసేవాళ్లు.

నేటి పూర్తికాల సేవకులు

5. పూర్తికాల సేవలోని తమ జీవితం గురించి ఒక దంపతులు ఏమన్నారు?

5 నేడుకూడా ఎంతోమంది పూర్తికాల సేవలోని వివిధ రంగాల్లో చాలా కష్టపడుతున్నారు. (“పూర్తికాల సేవలోని విధానాలు” బాక్సు చూడండి.) తాము ఎంచుకున్న జీవితం గురించి వాళ్లేమనుకుంటున్నారు? ఈ ప్రశ్న వాళ్లనే అడిగిచూడండి, వాళ్లిచ్చే సమాధానం మిమ్మల్ని తప్పకుండా ప్రోత్సహిస్తుంది. ఉదాహరణకు, ఒక సహోదరుడు క్రమ పయినీరుగా, ప్రత్యేక పయినీరుగా, మిషనరీగా, వేరే దేశంలో బెతెల్‌ కుటుంబ సభ్యునిగా సేవ చేశాడు. ఆయన ఏమంటున్నాడంటే, “పూర్తికాల సేవ చేయాలని నేను తీసుకున్న నిర్ణయమే అన్నిటికన్నా మంచి నిర్ణయం. నాకు 18 ఏళ్లున్నప్పుడు యూనివర్సిటీలో చదువుకోవాలా, పూర్తికాల ఉద్యోగం చేయాలా, లేక పయినీరు సేవచేయాలా అని నిర్ణయించుకోవడం చాలా కష్టమైంది. పూర్తికాల సేవకోసం చేసిన త్యాగాలను యెహోవా మర్చిపోడని అనుభవంతో తెలుసుకున్నాను. ఒకవేళ నేను ఉద్యోగం చేస్తే, యెహోవా నాకిచ్చిన శక్తిసామర్థ్యాలను ఇప్పుడు ఉపయోగిస్తున్న విధానాల్లో ఎప్పటికీ ఉపయోగించ లేకపోయేవాణ్ణి.” ఆయన భార్య ఇలా అంటోంది, ‘ప్రతి నియామకం నా వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చింది. యెహోవా మమ్మల్ని ఎన్నో రకాలుగా చాలాసార్లు సంరక్షించాడు, నడిపించాడు. ఒకవేళ మేము పూర్తికాల సేవలో లేకపోయివుంటే వాటిని అనుభవించేవాళ్లం కాదు. మేము పూర్తికాల సేవలో ఉన్నందుకు నేను ప్రతీరోజు యెహోవాకు కృతజ్ఞతలు చెబుతాను.’ మీరూ అలాంటి జీవితాన్నే కావాలనుకుంటున్నారా?

6. మన సేవను యెహోవా ఎలా చూస్తాడు?

6 కొంతమంది తమ పరిస్థితుల వల్ల ప్రస్తుతం పూర్తికాల సేవ చేయలేకపోవచ్చు. కానీ అలాంటివాళ్లు మనస్ఫూర్తిగా చేస్తున్న ప్రయత్నాల్ని కూడా యెహోవా విలువైనవిగా చూస్తున్నాడనే నమ్మకంతో ఉండవచ్చు. కొలొస్సయి సంఘంలోని వాళ్లతోసహా, ఫిలేమోను 1-3 వచనాల్లో పౌలు ప్రస్తావించిన కొంతమంది గురించి ఆలోచించండి. (చదవండి.) పౌలు వాళ్లను మెచ్చుకున్నాడు, యెహోవా కూడా మెచ్చుకున్నాడు. మీ సేవను కూడా మన పరలోక తండ్రి మెచ్చుకుంటాడు. మరి ప్రస్తుతం పూర్తికాల సేవచేస్తున్న వాళ్లకు మీరు ఎలా సహాయం చేయవచ్చు?

పయినీర్లకు సహాయం చేయండి

7, 8. పయినీర్లు ఎలా కష్టపడతారు, వాళ్లకు మనం ఎలా సహాయపడగలం?

7 మొదటి శతాబ్దంలోని సువార్తికుల్లాగే, నేటి ఉత్సాహవంతులైన పయినీర్లు సంఘానికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నారు. వాళ్లలో చాలామంది ప్రతీనెల కష్టపడి 70 గంటలు పరిచర్య చేస్తారు. వాళ్లకు మనమెలా సహాయం చేయవచ్చు?

8 షారీ అనే పయినీరు సహోదరి ఇలా చెబుతుంది, “పయినీర్లు రోజూ సేవ చేస్తారు కాబట్టి బలంగా ఉన్నట్లు కనిపిస్తారు. కానీ, వాళ్లకు కూడా ప్రోత్సాహం అవసరం.” (రోమా. 1:11, 12) కొన్నేళ్లు పయినీరు సేవచేసిన ఒక సహోదరి తన సంఘంలోని పయినీర్ల గురించి ఇలా చెప్పింది, “వాళ్లు ఎన్నో గంటలు కష్టపడుతూనే ఉంటారు. ఎవరైనా వాళ్లను తమ వాహనంలో పరిచర్యకు తీసుకెళ్తే, భోజనానికి ఆహ్వానిస్తే, పెట్రోల్‌ ఖర్చులు ఎంతోకొంత పెట్టుకుంటే లేక వేరేరకంగా ఆర్థిక సహాయం చేస్తే ఎంతో సంతోషిస్తారు. ఇవన్నీ వాళ్లమీద మనకు నిజంగా శ్రద్ధ ఉందని చూపిస్తాయి.”

9, 10. తమ సంఘంలోని పయినీర్లకు సహాయం చేయడానికి కొంతమంది ఏమి చేశారు?

9 పయినీర్లకు పరిచర్యలో సహాయం చేయాలనుకుంటున్నారా? బాబీ అనే పయినీరు ఇలా చెప్పింది, “మాకు వారం మధ్యలో ప్రకటనా పనికోసం మరింత సహాయం అవసరం.” ఆమె తోటి పయినీరు ఏమంటుందంటే, “మధ్యాహ్నాల్లో పరిచర్యకు వెళ్లడానికి తోడు దొరకడం చాలా కష్టం.” బ్రూక్లిన్‌ బెతెల్‌లో సేవచేస్తున్న ఓ సహోదరి తన పయినీరు సేవ గురించి ఇలా గుర్తుచేసుకుంటుంది, “కారు ఉన్న ఒక సహోదరి, ‘నీకెప్పుడైనా తోడు లేకపోతే నాకు ఫోన్‌ చెయ్యి, నీతో పరిచర్యకు వస్తాను’ అనేది. నిజంగా ఆమెవల్లే నా పయినీరు సేవను కొనసాగించగలిగాను.” షారీ ఇలా చెబుతుంది, “ఒంటరి పయినీర్లు పరిచర్య తర్వాత, తరచూ ఒంటరివాళ్లయిపోతారు. మీరు అప్పుడప్పుడు వాళ్లను మీ కుటుంబ ఆరాధనకు ఆహ్వానించవచ్చు. ఇతర కార్యకలాపాల్లో వాళ్లను కలుపుకోవచ్చు, అలా వాళ్లు దృఢంగా ఉండడానికి సహాయం చేయవచ్చు.”

10 దాదాపు 50 ఏళ్లుగా పూర్తికాల సేవలో ఉన్న ఒక సహోదరి, ఇతర ఒంటరి సహోదరీలతో కలసి చేసిన పయినీరు సేవను గుర్తుచేసుకుంటూ ఇలా అంది, “మా సంఘపెద్దలు కొన్ని నెలలకోసారి క్రమంగా పయినీర్లను కలిసేవాళ్లు. మా ఆరోగ్యం గురించి, ఉద్యోగం గురించి అడిగేవాళ్లు, ఇంకేమైనా సమస్యలున్నాయేమో తెలుసుకునేవాళ్లు. మాకు సహాయం చేయాలని నిజంగా కోరుకునేవాళ్లు. మాకు ఏదైనా సహాయం అవసరమేమో తెలుసుకోవడానికి మా ఇంటికే వచ్చేవాళ్లు.” ఆ మాటల్ని చూస్తే, ఎఫెసులో తనకు సహాయం చేసిన ఒక కుటుంబ యజమాని పట్ల పౌలు చూపించిన కృతజ్ఞత గుర్తుకొస్తుంది.—2 తిమో. 1:18.

11. ప్రత్యేక పయినీరు సేవ ఎలా ఉంటుంది?

11 కొన్ని సంఘాలకు ప్రత్యేక పయినీర్లతో కలిసి సేవ చేసే గొప్ప అవకాశం ఉంటుంది. ఈ సహోదరసహోదరీల్లో చాలామంది ప్రతీనెల 130 గంటలు పరిచర్య చేయడానికి కృషిచేస్తారు. వాళ్లు పరిచర్యలో ఎక్కువ సమయం గడపడంతోపాటు వేరే విధాలుగా కూడా సహాయం చేస్తారు కాబట్టి, వాళ్లు కొన్ని గంటలే ఉద్యోగం చేయగలరు, లేదా అసలు చేయలేరు. వాళ్లు పరిచర్య మీదే మనసు పెట్టేలా, ఖర్చుల కోసం కొంత డబ్బును బ్రాంచి కార్యాలయం ఇస్తుంది.

12. పెద్దలు, ఇతరులు ప్రత్యేక పయినీర్లకు ఎలా సహాయం చేయవచ్చు?

12 ప్రత్యేక పయినీర్లకు మనమెలా సహాయం చేయవచ్చు? ఓ బ్రాంచి కార్యాలయంలో పెద్దగా సేవచేస్తూ, చాలామంది ప్రత్యేక పయినీర్లతో పరిచయం ఉన్న ఓ సహోదరుడు ఇలా అంటున్నాడు, “సంఘ పెద్దలు ప్రత్యేక పయినీర్లతో మాట్లాడి, వాళ్ల పరిస్థితులేంటో తెలుసుకోవాలి. వాళ్లకెలా సహాయం చేయవచ్చో అప్పుడు నిర్ణయించుకోవాలి. ప్రత్యేక పయినీర్లకు బ్రాంచి నుండి సహాయం అందుతుంది కాబట్టి వాళ్లకు ఏలోటూ ఉండదని కొంతమంది సహోదరసహోదరీలు అనుకుంటారు, కానీ వాళ్లకు సంఘంలోని ఇతరులు చాలా విధాలుగా సహాయం చేయవచ్చు.” క్రమ పయినీర్లలాగే ప్రత్యేక పయినీర్లు కూడా, పరిచర్యలో తమతో కలిసి పనిచేసే వాళ్లుంటే ఎంతో సంతోషిస్తారు. మీరు ఆ విధంగా సహాయం చేయగలరా?

ప్రాంతీయ పర్యవేక్షకులకు ఎలా సహాయం చేయవచ్చు?

13, 14. (ఎ) ప్రాంతీయ పర్యవేక్షకుల గురించి మనమేమి గుర్తుపెట్టుకోవాలి? (బి) ప్రాంతీయ సేవలో ఉన్నవాళ్లకు సహాయం చేయడానికి మీరేమి చేయాలనుకుంటున్నారు?

13 ప్రాంతీయ పర్యవేక్షకులు వాళ్ల భార్యలు ఆధ్యాత్మికంగా బలమైన వాళ్లని, అన్నిటికీ తట్టుకోగలరని చాలామంది అనుకుంటారు. అది నిజమే అయినా వాళ్లకు కూడా ప్రోత్సాహం, పరిచర్యలో తోడు అవసరం. సహోదరసహోదరీలు సరదాగా సమయం గడిపేటప్పుడు వాళ్లను కూడా ఆహ్వానిస్తే సంతోషిస్తారు. ఒకవేళ వాళ్లు అనారోగ్యానికి గురై, హాస్పిటల్‌లో ఉండాల్సివచ్చి ఆపరేషన్‌గానీ, మరేదైనా చికిత్సగానీ అవసరమైతే? దగ్గర్లో ఉన్న సహోదరసహోదరీలు వాళ్లను చూసుకుంటూ, వాళ్లపై శ్రద్ధ చూపిస్తే వాళ్లెంత ఆనందిస్తారో! ‘ప్రియ వైద్యుడైన’ లూకా, పౌలు గురించి, ఆయనతోపాటు ప్రయాణ సేవలో ఉన్నవాళ్ల గురించి శ్రద్ధ తీసుకున్నాడు.—కొలొ. 4:14; అపొ. 20:5–21:18.

14 ప్రాంతీయ పర్యవేక్షకులకు, వాళ్ల భార్యలకు సన్నిహిత స్నేహితుల ప్రేమ, ప్రోత్సాహం అవసరం. ఒక ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇలా రాస్తున్నాడు, “నాకెప్పుడు ప్రోత్సాహం అవసరమో నా స్నేహితులకు తెలుసనిపిస్తుంది. వాళ్లు తెలివిగా ప్రశ్నలు అడుగుతారు, దాంతో నేను వేటిగురించి ఎక్కువగా ఆలోచిస్తున్నానో వాళ్లకు చెప్పేస్తాను. వాళ్లు కేవలం శ్రద్ధగా వినడమే నాకు పెద్ద సహాయం.” సహోదరసహోదరీలు తమపై చూపించే శ్రద్ధకు ప్రాంతీయ పర్యవేక్షకులు, వాళ్ల భార్యలు ఎంతో కృతజ్ఞత కలిగివుంటారు.

బెతెల్‌ కుటుంబం సభ్యులకు మద్దతివ్వండి

15, 16. బెతెల్‌లో పనిచేస్తున్నవాళ్లు ఎలాంటి సేవలు అందిస్తున్నారు? మనం వాళ్లకెలా సహాయం చేయగలం?

15 ప్రపంచవ్యాప్తంగా బెతెల్‌ గృహాల్లో సేవచేసేవాళ్లు రాజ్యపనికి ఎంతో ప్రాముఖ్యమైన మద్దతిస్తున్నారు. మీ సంఘంలోగానీ, సర్క్యూట్‌లోగానీ బెతెల్‌ సభ్యులు ఉన్నట్లయితే, వాళ్లను మీరు గుర్తుపెట్టుకుంటున్నారని ఎలా చూపించవచ్చు?

16 కొత్తగా బెతెల్‌కి వచ్చినవాళ్లు కుటుంబాన్ని, స్నేహితుల్ని వదిలివస్తారు కాబట్టి, వాళ్లకు ఇంటిమీద కొంచెం బెంగగా ఉంటుంది. తోటి బెతెల్‌ సభ్యులు, కొత్త సంఘంలోని సహోదరసహోదరీలు వాళ్లతో పరిచయం పెంచుకుని, స్నేహం చేస్తే ఎంతో సంతోషిస్తారు. (మార్కు 10:29, 30) వాళ్లకు ప్రతీవారం కూటాలకు వెళ్లడానికి, పరిచర్య చేయడానికి సమయం ఉంటుంది. అయితే అప్పుడప్పుడూ వాళ్లు అదనంగా పనిచేయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సంఘాలు అర్థం చేసుకుని, బెతెల్‌ సభ్యులకూ వాళ్ల సేవకూ కృతజ్ఞత చూపించినప్పుడు అందరూ ప్రయోజనం పొందుతారు.—1 థెస్సలొనీకయులు 2:9 చదవండి.

మీ దేశంలో సేవచేస్తున్న పూర్తికాల సేవకులను చూసుకోండి

17, 18. వేరే దేశాల్లో పూర్తికాల సేవకులు ఎలాంటి సేవలు చేస్తారు?

17 వేరే దేశంలో సేవ చేయడానికి వెళ్లేవాళ్లకు, ఏమాత్రం అలవాటులేని ఆహారం, భాషలు, ఆచారాలు, పరిస్థితులు ఎదురుకావచ్చు. వేరే దేశంలో పూర్తికాల సేవచేస్తున్న వాళ్లకు ఏ నియామకాలు ఉంటాయి?

18 కొంతమంది మిషనరీలుగా సేవ చేస్తారు. వాళ్లు ముఖ్యంగా క్షేత్రసేవ చేస్తూ, తాము తీసుకున్న ప్రత్యేక శిక్షణ ద్వారా చాలామందికి ప్రయోజనం చేకూరుస్తారు. బ్రాంచి కార్యాలయం వాళ్లకోసం తగిన వసతిని ఏర్పాటు చేయడంతోపాటు, కనీస అవసరాల కోసం కొంత డబ్బును పంపిస్తుంది. మరికొంతమంది, బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తారు, లేదా బ్రాంచి వసతులు, అనువాద కార్యాలయాలు, సమావేశ హాళ్లు, రాజ్యమందిరాలు నిర్మించడంలో సహాయం చేస్తారు. వాళ్లకు కూడా ఆహారం, వసతి ఏర్పాటు చేయడంతోపాటు మిగతా ఖర్చులను చూసుకుంటారు. బెతెల్‌ సభ్యుల్లా వీళ్లు కూడా క్రమంగా స్థానిక కూటాలకు వెళ్తూ, పరిచర్య చేస్తూ ఎన్నో విధాలుగా ఆశీర్వాదకరంగా ఉంటారు.

19. మీ దేశంలో సేవచేయడానికి వచ్చిన పూర్తికాల సేవకులకు మీరు ఎలా సహాయం చేయవచ్చు?

19 అలాంటి పూర్తికాల సేవకుల్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? ముఖ్యంగా మొదట్లో, వాళ్లకు మన ఆహారం అలవాటు ఉండకపోవచ్చని గుర్తుంచుకోండి. వాళ్లను భోజనానికి పిలిచేటప్పుడు ఈ విషయం మనసులో ఉంచుకోండి. వాళ్లు ఏమి తినడానికి ఇష్టపడతారో, వాళ్లకు ఏవేవి ఇష్టం ఉండవో ముందే అడిగి తెలుసుకోవచ్చు. వాళ్లు మన భాష, మన అలవాట్లు నేర్చుకునే వరకు ఓపిగ్గా ఉండండి. మీరు చెబుతున్నవన్నీ అర్థం చేసుకోవడానికి వాళ్లకు కొంత సమయం పట్టొచ్చు, అయితే పదాలను ఎలా పలకాలో మీరు నేర్పించవచ్చు. వాళ్లకు నేర్చుకోవాలనే కోరిక ఉంది.

20. పూర్తికాల సేవకులకు, వాళ్ల తల్లిదండ్రులకు మనం ఎలా సహాయం చేయవచ్చు?

20 పూర్తికాల సేవకులకు వయసు పెరుగుతుంది, వాళ్ల తల్లిదండ్రులకు కూడా వయసు మళ్లుతుంది. తల్లిదండ్రులు యెహోవాసాక్షులైతే తమ పిల్లలు పూర్తికాల సేవలోనే ఉండాలని ఎంతగానో కోరుకుంటారు. (3 యోహా. 4) అయితే, పూర్తికాల సేవకులు కూడా తమ తల్లిదండ్రులకు ఎప్పుడైనా సహాయం అవసరమైతే తాము చేయగలిగినదంతా చేస్తారు, వీలైనప్పుడల్లా వచ్చి వాళ్లను చూసుకుంటారు. అయితే, వృద్ధులైన తల్లిదండ్రులకు దగ్గర్లో ఉంటున్న సహోదరసహోదరీలు అవసరమైన సహాయం అందించడం ద్వారా, పూర్తికాల సేవలో ఉన్నవాళ్లకు మద్దతివ్వవచ్చు. పూర్తికాల సేవకులు ఈ భూమ్మీద జరుగుతున్న ఎంతో ప్రాముఖ్యమైన ప్రకటనా పనికి ఎక్కువగా మద్దతిస్తున్నారని మనం ఎన్నడూ మర్చిపోవద్దు. (మత్త. 28:19, 20) అలాంటి పూర్తికాల సేవకుల తల్లిదండ్రులకు సహాయం అవసరమైతే, మీరుగానీ మీ సంఘంలోని వాళ్లుగానీ ముందుకు రాగలరా?

21. ఇతరులు అందించే ప్రోత్సాహం, సహకారం విషయంలో పూర్తికాల సేవకులు ఎలా భావిస్తారు?

21 పూర్తికాల సేవకులు, ఏదో ఆర్థికలాభం పొందాలని కాదుగానీ యెహోవాకు శ్రేష్ఠమైనది ఇవ్వాలనే, ఇతరులకు సహాయం చేయాలనే ఉద్దేశంతోనే ఆ సేవలోకి అడుగుపెడతారు. కాబట్టి మనం ఏ సహాయం చేసినా వాళ్లు ఎంతో కృతజ్ఞత చూపిస్తారు. వాళ్ల కృతజ్ఞత, వేరే దేశంలో సేవ చేస్తున్న ఓ సహోదరి చెప్పిన ఈ మాటల్లో ధ్వనిస్తుంది, “కృతజ్ఞత తెలుపుతూ రాసే చిన్న మాటైనా, ఇతరులు మీ గురించి ఆలోచిస్తున్నారనీ మీరు చేస్తున్నదాన్ని బట్టి సంతోషిస్తున్నారనీ తెలియజేస్తుంది.”

22. పూర్తికాల సేవ గురించి మీరెలా భావిస్తున్నారు?

22 పూర్తికాల సేవకులు నిజమైన ఉత్తేజాన్ని, సంతృప్తిని ఇచ్చే జీవితాన్ని ఎంచుకున్నారు. ఈ రోజుల్లో ఇంతకన్నా అత్యుత్తమ జీవితం ఇంకోటి లేదు. వాళ్లు పూర్తికాల సేవ ద్వారా ఇప్పుడూ, నూతనలోకంలోనూ అవసరమయ్యే లక్షణాలను, పాఠాలను నేర్చుకోగలుగుతున్నారు. త్వరలోనే యెహోవా సేవకులందరికీ నిజమైన సంతృప్తినిచ్చే పని ప్రతీరోజు ఉంటుంది. కాబట్టి, పూర్తికాల సేవకులు ‘విశ్వాసంతో చేస్తున్న పనిని, ప్రేమతో కూడిన ప్రయాసను’ మనం ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుందాం.—1 థెస్స. 1:2, 3.