కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘ఎన్ని శ్రమలు’ వచ్చినా దేవుణ్ణి యథార్థంగా సేవించండి

‘ఎన్ని శ్రమలు’ వచ్చినా దేవుణ్ణి యథార్థంగా సేవించండి

“అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను.”—అపొ. 14:22.

1. శ్రమలు వచ్చినప్పుడు దేవుని సేవకులు ఎందుకు ఆశ్చర్యపోరు?

 నిత్యజీవ బహుమానాన్ని పొందే ముందు “అనేక శ్రమలు” వస్తాయంటే మీరు ఆశ్చర్యపోతారా? బహుశా ఆశ్చర్యపోరు. మీరు కొత్తగా బాప్తిస్మం తీసుకున్నా లేదా ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తున్నా, సాతాను లోకంలో కష్టాలు తప్పవని మీకు తెలుసు.—ప్రక. 12:12.

2. (ఎ) అపరిపూర్ణ మానవులందరికీ వచ్చే కష్టాలతోపాటు ఏ శ్రమ కూడా క్రైస్తవులకు కలుగుతుంది? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) మన శ్రమల వెనక ఉన్నది ఎవరు? అది మనకెలా తెలుసు?

2 “సాధారణముగా మనుష్యులకు” అంటే అపరిపూర్ణ మానవులందరికీ వచ్చే కష్టాలేకాక క్రైస్తవులకు మరోవిధమైన శ్రమ కూడా కలుగుతుంది. (1 కొరిం. 10:13) ఏమిటది? దేవుని ఆజ్ఞలకు నమ్మకంగా లోబడడంవల్ల వచ్చే తీవ్ర వ్యతిరేకత. యేసు తన అనుచరులకు ఇలా చెప్పాడు, “దాసుడు తన యజమానునికంటె గొప్పవాడు కాడు . . . లోకులు నన్ను హింసించినయెడల మిమ్మును కూడ హింసింతురు.” (యోహా. 15:20) అలాంటి వ్యతిరేకత వెనుక ఎవరున్నారు? మరెవరో కాదు సాతానే. అతను “గర్జించు సింహమువలె” దేవుని ప్రజలను “మ్రింగుదునా అని వెదకుచు” తిరుగుచున్నాడని బైబిలు వర్ణిస్తుంది. (1 పేతు. 5:8) యేసు శిష్యుల యథార్థతను పాడుచేయడానికి సాతాను ఏమి చేయడానికైనా వెనకాడడు. అపొస్తలుడైన పౌలుకు ఏమి జరిగిందో పరిశీలించండి.

లుస్త్రలో శ్రమ

3-5. (ఎ) పౌలు లుస్త్రలో ఏ శ్రమను అనుభవించాడు? (బి) ముందుముందు శ్రమలు వస్తాయని పౌలు చెప్పిన మాట శిష్యులను ఎందుకు బలపర్చింది?

3 తన విశ్వాసం కారణంగా పౌలు ఒకటికన్నా ఎక్కువసార్లు హింసలు అనుభవించాడు. (2 కొరిం. 11:23-27) అలాంటి ఒక సంఘటన లుస్త్రలో జరిగింది. పుట్టుకతోనే కుంటివాడైన ఒక వ్యక్తిని పౌలు స్వస్థపర్చిన తర్వాత, అక్కడి ప్రజలు పౌలును, అతనితో ఉన్న బర్నబాను దేవుళ్లుగా స్తుతించడం మొదలుపెట్టారు. అయితే తమను ఆరాధించవద్దని, ఆ గుంపును వాళ్లిద్దరు బతిమిలాడాల్సి వచ్చింది. అంతలోనే, వ్యతిరేకులైన యూదులు వచ్చి అబద్దాలు చెప్పి ప్రజల మనసులను చెడగొట్టారు. పరిస్థితి ఒక్కసారిగా తలకిందులైంది. ప్రజలు పౌలును రాళ్లతో కొట్టి, చనిపోయాడనుకుని వదిలేశారు.—అపొ. 14:8-19.

4 దెర్బేను సందర్శించిన తర్వాత పౌలు, బర్నబా “లుస్త్రకును ఈకొనియకును అంతియొకయకును తిరిగివచ్చి శిష్యుల మనస్సులను దృఢపరచి—విశ్వాసమందు నిలుకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు” ప్రోత్సహించారు. (అపొ. 14:21, 22) మొదటిసారి విన్నప్పుడు ఆ మాటలు వింతగా అనిపించవచ్చు. ఎంతైనా, “అనేక శ్రమలు” అనుభవించడం నిరుత్సాహంగా ఉంటుందేగానీ ప్రోత్సాహంగా ఉండదు. మరి పౌలు, బర్నబాలు అనేక శ్రమల గురించి చెబుతూ ‘శిష్యుల మనస్సులను దృఢపర్చడం’ ఎలా సాధ్యమైంది?

5 పౌలు మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే దానికి జవాబు దొరుకుతుంది. పౌలు, “మనం అనేక శ్రమలను సహించాలి” అని చెప్పలేదు కానీ, “అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెను” అని చెప్పాడు. కాబట్టి నమ్మకంగా జీవించడంవల్ల వచ్చే బహుమానం గురించి నొక్కిచెబుతూ పౌలు శిష్యులను బలపర్చాడు. ఆ బహుమానం కేవలం కల కాదు. నిజానికి, యేసు ఇలా చెప్పాడు, “అంతమువరకును సహించిన వాడు రక్షింపబడును.”మత్త. 10:22.

6. సహించేవాళ్లు ఏ బహుమానం పొందుతారు?

6 మనం సహిస్తే బహుమానం పొందుతాం. అభిషిక్త క్రైస్తవులైతే, యేసు సహపాలకులుగా పరలోకంలో అమర్త్యమైన జీవాన్ని పొందుతారు. “వేరే గొఱ్ఱెలు” “నీతి నివసించు” భూమిమీద నిత్యం జీవిస్తారు. (యోహా. 10:16; 2 పేతు. 3:13) పౌలు చెప్పినట్లు, అప్పటివరకు మనం అనేక శ్రమలు అనుభవిస్తాం. మనకు వచ్చే రెండు రకాల శ్రమలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఎదురుగా చేసే దాడులు

7. ఎదురుదాడులు అంటే ఏమిటి?

7 “వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; అధిపతుల యెదుటను రాజుల యెదుటను . . . నిలువబడెదరు” అని యేసు ముందే చెప్పాడు. (మార్కు 13:9) ఆ మాటలు సూచిస్తున్నట్లు, కొంతమంది క్రైస్తవులు బహుశా మతనాయకుల వల్ల, రాజకీయ నాయకుల వల్ల శారీరక హింసల రూపంలో శ్రమలు అనుభవిస్తారు. (అపొ. 5:27, 28) పౌలు ఉదాహరణ మళ్లీ పరిశీలించండి. అలాంటి హింస వస్తుందని తెలిసినప్పుడు ఆయన భయపడ్డాడా? అస్సలు భయపడలేదు.—అపొస్తలుల కార్యములు 20:22, 23 చదవండి.

8, 9. సహించాలని నిశ్చయించుకున్నట్లు పౌలు ఎలా చూపించాడు? నేడు కొందరు అలాంటి నిశ్చయతనే ఎలా చూపించారు?

8 సాతాను ఎదురు దాడుల్ని ధైర్యంగా ఎదుర్కొన్న పౌలు ఇలా అన్నాడు, “దేవుని కృపాసువార్తనుగూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును, నేను ప్రభువైన యేసువలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు.” (అపొ. 20:24) హింసలు వస్తాయని పౌలు భయపడలేదన్నది సుస్పష్టం. బదులుగా, ఏమి జరిగినా సహించాలని ఆయన నిశ్చయించుకున్నాడు. ఏ శ్రమ ఎదురైనా, సమగ్రంగా ‘సాక్ష్యమివ్వడమే’ లక్ష్యంగా పెట్టుకున్నాడు.

9 నేడు, మన సహోదరసహోదరీలు చాలామంది అలాంటి నిశ్చయతనే చూపించారు. ఉదాహరణకు, ఒక దేశంలో కొందరు సాక్షులు తటస్థంగా ఉన్నందువల్ల దాదాపు 20 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. వాళ్ల కేసు ఎన్నడూ విచారణకు రాలేదు. ఎందుకంటే, మనస్సాక్షి నిమిత్తం సైన్యంలో చేరనివాళ్లకు ఆ దేశ చట్టంలో వేరే ఏర్పాటు లేదు. జైల్లో ఉన్నప్పుడు, కనీసం కుటుంబ సభ్యులు కలవడానికి కూడా అనుమతించేవాళ్లు కాదు. జైల్లో ఉన్న కొందరిని కొట్టేవాళ్లు, రకరకాల చిత్రహింసలు పెట్టేవాళ్లు.

10. ఆకస్మికంగా వచ్చే శ్రమలకు మనం ఎందుకు భయపడకూడదు?

10 ఇంకొన్ని ప్రాంతాల్లో మన సహోదరులు ఆకస్మికంగా వచ్చే శ్రమలను సహిస్తున్నారు. అలాంటి శ్రమలు మీకు వస్తే, భయపడకండి. యోసేపును గుర్తుచేసుకోండి. ఆయన్ను బానిసత్వానికి అమ్మేశారు, కానీ యెహోవా ‘అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించాడు.’ (అపొ. 7:9, 10) యెహోవా మీకు కూడా సహాయం చేయగలడు. “భక్తులను శోధనలోనుండి తప్పించుటకు . . . ప్రభువు సమర్థుడు” అని ఎన్నడూ మర్చిపోకండి. (2 పేతు. 2:9) నమ్మకంగా ఉండడానికి, హింసను ధైర్యంగా ఎదుర్కోవడానికి మీకు చాలా కారణాలు ఉన్నాయి. యెహోవా మిమ్మల్ని ఈ దుష్టలోకం నుండి రక్షించి, తన రాజ్యంలో నిత్యజీవం ఇస్తాడని నమ్మండి.—1 పేతు. 5:8, 9.

పైకి కనిపించని దాడులు

11. సాతాను ఎదురుగా చేసే దాడులకు, పైకి కనిపించని దాడులకు తేడా ఏమిటి?

11 ఇక మరోరకమైన శ్రమ, పైకి కనిపించకుండా మనమీద జరిగే దాడులు. ఈ దాడికీ శారీరకంగా హింసించే ఎదురుదాడికీ తేడా ఏమిటి? ఎదురుదాడి, మీ ఊరుమీదకి దూసుకొచ్చి క్షణాల్లో మీ ఇంటిని ధ్వంసం చేసే బలమైన సుడిగాలి లాంటిది. అయితే పైకి కనిపించకుండా జరిగే దాడులు మాత్రం, నెమ్మదిగా మీ ఇల్లు కూలిపోయేంత వరకూ చెక్కను తినివేసే చెదపురుగులు లాంటివి. ఈ దాడిలో, పరిస్థితి చేయిదాటిన తర్వాతగానీ ప్రమాదాన్ని పసిగట్టలేం.

12. (ఎ) సాతాను దొంగచాటుగా ఉపయోగిస్తున్న ఒక కుయుక్తి ఏమిటి? అది ఎందుకు చాలా సమర్థవంతమైనది? (బి) నిరుత్సాహం కలిగినప్పుడు పౌలు ఎలా భావించాడు?

12 యెహోవాతో మీకున్న సంబంధాన్ని పాడుచేయాలన్నదే సాతాను కోరిక. అందుకోసం శారీరకంగా హింసించే ఎదురు దాడులను లేదా మీ విశ్వాసాన్ని నిదానంగా తినివేసే దొంగచాటు దాడులను ఉపయోగించవచ్చు. సాతాను దొంగచాటుగా ఉపయోగిస్తున్న కుయుక్తుల్లో అత్యంత సమర్థవంతమైనది, నిరుత్సాహం. తాను కొన్నిసార్లు నిరుత్సాహపడ్డానని అపొస్తలుడైన పౌలు కూడా ఒప్పుకున్నాడు. (రోమీయులు 7:21-24 చదవండి.) అయితే ఆధ్యాత్మికంగా ఎంతో బలంగా ఉండి, బహుశా మొదటి శతాబ్దపు పరిపాలక సభ సభ్యునిగా కూడా సేవచేసిన పౌలు, ‘తాను దౌర్భాగ్యుణ్ణి’ అని ఎందుకు అన్నాడు? తన అపరిపూర్ణతల కారణంగానే అలా భావించానని పౌలు చెప్పాడు. మంచి చేయాలని పౌలు నిజంగా కోరుకున్నాడు కానీ, కొన్నిసార్లు అలా చేయలేకపోయాడు. మీరు అప్పుడప్పుడూ అలాంటి భావాలతో సతమతమౌతుంటే, అపొస్తలుడైన పౌలుకు కూడా అలాంటి సమస్యే వచ్చిందని తెలుసుకోవడం ఊరటనివ్వడం లేదా?

13, 14. (ఎ) దేవుని సేవకుల్లో కొందరు ఎందుకు నిరుత్సాహపడతారు? (బి) మన విశ్వాసం సన్నగిల్లాలని ఎవరు కోరుకుంటున్నారు? ఎందుకు?

13 చాలామంది సహోదరసహోదరీలు అప్పుడప్పుడు నిరుత్సాహపడతారు, ఆందోళన పడతారు. తాము పనికిరానివాళ్లమని కూడా అనుకుంటారు. ఉదాహరణకు, ఉత్సాహంగా పయినీరు సేవచేస్తున్న ఓ సహోదరి ఇలా చెబుతుంది, “నేను చేసిన ఓ తప్పు పదేపదే గుర్తుకొస్తుంది, అలా గుర్తొచ్చిన ప్రతీసారి చాలా కృంగిపోతాను. నా తప్పులు గుర్తుకొచ్చినప్పుడల్లా, నన్ను ఎవ్వరూ ప్రేమించలేరని చివరికి యెహోవా కూడా ప్రేమించలేడని అనిపిస్తుంది.”

14 ఆమెలాంటి ఉత్సాహవంతులైన కొందరు యెహోవా సేవకులు ఎందుకు నిరుత్సాహపడతారు? దానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరి మనస్తత్వమే అంత, వాళ్లు తమ గురించీ తమ పరిస్థితుల గురించీ చెడుగా ఆలోచిస్తుంటారు. (సామె. 15:15) మరికొందరికి అనారోగ్యంవల్ల ప్రతికూల భావాలు వస్తుంటాయి. అయితే కారణం ఏదైనా, అలాంటి భావాలు వచ్చినప్పుడు ఎవరు దాన్ని అవకాశంగా తీసుకోవాలనుకుంటున్నారో మనం గుర్తుంచుకోవాలి. నిజానికి, మనం యెహోవా సేవను ఆపేసేంతగా నిరుత్సాహపడితే ఎవరు సంతోషిస్తారు? తను ఎలాగూ నాశనం అవుతాడు కాబట్టి, మీరు కూడా ఏ నిరీక్షణా లేదన్నట్లు భావించాలని ఎవరు కోరుకుంటున్నారు? (ప్రక. 20:10) ఖచ్చితంగా సాతానే. ఎదురుదాడులు చేసినా లేదా దొంగచాటుగా దెబ్బతీసినా సాతాను లక్ష్యం మాత్రం ఒక్కటే; మనల్ని ఆందోళనకు గురిచేసి, మన ఉత్సాహాన్ని నీరుగార్చి, మనం సేవను ఆపేలా చేయడమే. దేవుని ప్రజలు ఆధ్యాత్మిక యుద్ధం చేస్తున్నారనే సంగతి గుర్తుంచుకోండి!

15. రెండవ కొరింథీయులు 4:16, 18 ప్రకారం మనం ఏమని నిశ్చయించుకోవాలి?

15 కాబట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ పోరాటాన్ని ఆపకండి. బహుమానం మీదే దృష్టిపెట్టండి. కొరింథులోని క్రైస్తవులకు పౌలు ఇలా రాశాడు, “మేము అధైర్యపడము; మా బాహ్య పురుషుడు కృశించుచున్నను, ఆంతర్యపురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు . . . క్షణమాత్రముండు మా చులకని శ్రమ మాకొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది.”—2 కొరిం. 4:16, 18.

శ్రమల కోసం ఇప్పుడే సిద్ధపడండి

క్రైస్తవులు చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా తమ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి శిక్షణ పొందుతారు (16వ పేరా చూడండి)

16. శ్రమల కోసం ఇప్పుడే సిద్ధపడడం ఎందుకు ప్రాముఖ్యం?

16 మనమీద ప్రయోగించడానికి సాతాను దగ్గర అనేక “తంత్రములు” సిద్ధంగా ఉన్నాయి. (ఎఫె. 6:11) అందుకే, “విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి” అని 1 పేతురు 5:9 చెబుతున్న సలహాను మనమందరం పాటించాలి. విశ్వాసంలో స్థిరంగా ఉండాలంటే మన మనసును, హృదయాన్ని సిద్ధం చేసుకొని సరైనది చేసేలా ఇప్పుడే మనకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి. ఉదాహరణకు చెప్పాలంటే, యుద్ధానికి వెళ్లడానికి ఎంతోకాలం ముందునుండే సైనికులు ప్రత్యేక శిక్షణ పొందుతుంటారు. యెహోవా దేవుని ఆధ్యాత్మిక సైనికుల విషయంలో కూడా అంతే. మన యుద్ధంలో ముందుముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి ఓ మోస్తరు శాంతిసమాధానాలు ఉన్న సమయంలోనే మనకు మనం శిక్షణ ఇచ్చుకోవడం తెలివైన పని కాదా? పౌలు కొరింథీయులకు ఇలా రాశాడు, “మీరు విశ్వాసముగలవారై యున్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి; మిమ్మును మీరే పరీక్షించుకొనుడి.”—2 కొరిం. 13:5.

17-19. (ఎ) మనల్ని మనం ఎలా పరీక్షించుకోవచ్చు? (బి) స్కూల్లో తమ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి యౌవనులు ఎలా సిద్ధపడవచ్చు?

17 పౌలు ఇచ్చిన సలహాను పాటించే ఒక మార్గం ఏమిటంటే, మనల్ని మనం లోతుగా పరిశీలించుకోవడమే. ఈ ప్రశ్నల్ని వేసుకోండి: ‘నేను పట్టుదలగా ప్రార్థిస్తానా? తోటివాళ్లు ఒత్తిడి చేసినప్పుడు, మనుష్యులకు కాక దేవునికే లోబడతానా? క్రైస్తవ కూటాలకు క్రమంగా హాజరౌతున్నానా? నా నమ్మకాల గురించి మాట్లాడే ధైర్యం నాకుందా? తోటి సహోదరసహోదరీలు నా తప్పులను క్షమించాలని కోరుకుంటున్నట్లే, నేనూ వాళ్ల తప్పులను వెంటనే క్షమిస్తున్నానా? స్థానిక సంఘంలోనూ సంస్థలోనూ నాయకత్వం వహిస్తున్నవాళ్లకు నేను లోబడుతున్నానా?’

18 మన ఆలోచనా విధానాన్ని మార్చడానికి ప్రయత్నించే ప్రజల మధ్య మనం జీవిస్తున్నాం. చాలామంది యౌవన సహోదరసహోదరీలు స్కూల్లో తమ నమ్మకాల గురించి ధైర్యంగా మాట్లాడాల్సి ఉంటుంది. అయితే వాళ్లు అలా చేయడానికి సిగ్గుపడరు లేదా భయపడరు. అలా ధైర్యంగా మాట్లాడడానికి వాళ్లకు ఏది సహాయం చేసింది? వాళ్లు మన పత్రికల్లో వచ్చిన సలహాలను ఉపయోగించారు. ఉదాహరణకు, తోటి విద్యార్థులను ఆలోచింపజేసే కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా పిల్లలు తమ నమ్మకాల గురించి ధైర్యంగా ఎలా మాట్లాడవచ్చో మే 15, 2013 కావలికోటలోని 6వ పేజీలో కొన్ని సలహాలు ఉన్నాయి. తల్లిదండ్రులారా, ఎలా మాట్లాడాలో మీ పిల్లలతో తప్పకుండా ప్రాక్టీసు చేయించండి, అలాచేస్తే వాళ్లు తమ విశ్వాసాన్ని సమర్థించుకోవడానికి సిద్ధంగా ఉంటారు.

19 నిజమే, మన నమ్మకాలను ధైర్యంగా సమర్థించుకోవడం లేదా యెహోవా మననుండి కోరేవాటిని చేయడం ఎల్లప్పుడూ అంత సులభం కాదు. రోజంతా పనిచేసిన తర్వాత, కూటాలకు వెళ్లడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అలాగే పరిచర్య కోసం ఉదయాన్నే నిద్ర లేవడం కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీరు ఇప్పుడు ఆధ్యాత్మిక అలవాట్లను వృద్ధి చేసుకుంటేనే, భవిష్యత్తులో వచ్చే పెద్దపెద్ద శోధనలను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు.

20, 21. (ఎ) విమోచన క్రయధనం గురించి ధ్యానించడంవల్ల నిరుత్సాహాన్ని ఎలా తీసేసుకోవచ్చు? (బి) మనం ఏమని నిశ్చయించుకోవాలి?

20 సాతాను దొంగచాటుగా చేసే దాడుల సంగతేంటి? వాటిలో ఒకటైన నిరుత్సాహాన్ని ఎలా తీసేసుకోవచ్చు? అందుకు ఒక శక్తిమంతమైన మార్గం ఏమిటంటే, విమోచన క్రయధనం గురించి ధ్యానించడం. అపొస్తలుడైన పౌలు అదే చేశాడు. తాను పనికిరానివాణ్ణని ఆయన కొన్నిసార్లు అనుకున్నాడు. అయితే, క్రీస్తు పరిపూర్ణుల కోసం కాదుగానీ, పాపుల కోసమే చనిపోయాడన్న విషయం ఆయనకు తెలుసు. ఆ పాపులలో పౌలు కూడా ఉన్నాడు. నిజానికి ఆయనిలా రాశాడు, “నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసమువలన జీవించుచున్నాను.” (గల. 2:20) అవును, పౌలు విమోచన క్రయధన ఏర్పాటును ఒప్పుకొని, అది తనకు వ్యక్తిగతంగా వర్తించిందని నమ్మాడు.

21 మీరు కూడా విమోచన క్రయధనాన్ని యెహోవా మీకు ఇచ్చిన వ్యక్తిగత బహుమానంగా భావిస్తే, ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అంటే నిరుత్సాహం వెంటనే పోతుందని కాదు. మనలో కొంతమంది కొత్తలోకం వచ్చేంతవరకు ఈ దొంగచాటు దాడులతో పోరాడాల్సిరావచ్చు. కానీ గుర్తుంచుకోండి, పట్టుదలగా కొనసాగేవాళ్లకే బహుమతి దక్కుతుంది. దేవుని రాజ్యం శాంతిసమాధానాల్ని నెలకొల్పి, నమ్మకమైన మనుషులను పరిపూర్ణతకు తీసుకొచ్చే ఆ మహిమానిత్వ రోజుకు మనం చాలా దగ్గర్లో ఉన్నాం. కాబట్టి ఏదేమైనా, చివరికి ఎన్ని శ్రమలు అనుభవించైనా ఆ రాజ్యంలోకి ప్రవేశించాలని నిశ్చయించుకోండి.