కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

“శ్రేష్ఠమైన పని” కోసం మీరు ముందుకు వస్తున్నారా?

“శ్రేష్ఠమైన పని” కోసం మీరు ముందుకు వస్తున్నారా?

జేమ్స్‌ a కాస్త ఆందోళనగా ఉన్నాడు. ఇద్దరు పెద్దలు ఆయనతో ఏకాంతంగా మాట్లాడాలన్నారు. గతంలో జరిగిన కొన్ని ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనాల తర్వాత, పెద్దలు ఆయనతో మాట్లాడి సంఘంలో అదనపు బాధ్యతలు చేపట్టేలా అర్హతలు సాధించాలంటే ఏమి చేయాలో చెప్పారు. కాలం గడుస్తుండగా, తాను ఎప్పటికైనా సంఘపెద్ద అవ్వగలనా అని జేమ్స్‌ ఆలోచించసాగాడు. అయితే, ప్రాంతీయ పర్యవేక్షకుడు ఈ మధ్యే మళ్లీ సంఘాన్ని సందర్శించాడు. పెద్దలు ఈసారి ఏమి చెబుతారో?

ఆ ఇద్దరు పెద్దల్లో ఒకరు మాట్లాడుతుంటే జేమ్స్‌ జాగ్రత్తగా వింటున్నాడు. ఆ సహోదరుడు 1 తిమోతి 3:1 ప్రస్తావిస్తూ, జేమ్స్‌ను సంఘ పెద్దగా నియమిస్తున్నట్లు బ్రాంచి తమకు కబురు పంపిందని చెప్పాడు. జేమ్స్‌ వెంటనే నిటారుగా కూర్చొని ఆశ్చర్యంగా “ఏమన్నారు?” అని అడిగాడు. ఆ సహోదరుడు మళ్లీ అదే మాటను చెప్పడంతో, జేమ్స్‌ ముఖంలో చిరునవ్వు ప్రత్యక్షమైంది. తర్వాత, సంఘంలో ఆ విషయాన్ని ప్రకటించినప్పుడు, అందరూ చిరునవ్వులు చిందించారు.

సంఘంలో బాధ్యతలు ఆశించడం తప్పా? ఎంతమాత్రం కాదు. 1 తిమోతి 3:1 ప్రకారం, “ఎవడైనను అధ్యక్ష్యపదవిని ఆశించినయెడల అట్టివాడు దొడ్డపనిని [“శ్రేష్ఠమైన పని,” పవిత్ర గ్రంథము, వ్యాఖ్యాన సహితం] అపేక్షించుచున్నాడు.” ప్రోత్సాహాన్నిచ్చే ఆ సలహాను పాటిస్తున్న చాలామంది క్రైస్తవ పురుషులు సంఘంలో బాధ్యతలు చేపట్టేలా ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తున్నారు. అందువల్ల వేలాదిమంది సహోదరులు సమర్థవంతులైన పెద్దలు, పరిచర్య సేవకులు అయ్యి దేవుని ప్రజలకు ఆశీర్వాదంగా మారుతున్నారు. అయితే సంఘాలు పెరుగుతున్నాయి కాబట్టి, ఇంకా చాలామంది పురుషులు అర్హత సాధించాల్సిన అవసరం ఉంది. ఆ పనిని సరైన విధంగా ఎలా చేయాలి? పర్యవేక్షకులుగా సేవ చేయాలనుకుంటున్న సహోదరులు జేమ్స్‌లాగే ఆందోళన చెందాలా?

‘ఆశించడం’ అంటే అర్థమేమిటి?

బైబిల్లో ‘ఆశించు’ అని అనువదించిన గ్రీకు క్రియాపదానికి మనస్ఫూర్తిగా కోరుకోవడం, చేతిని బాగా చాపడం వంటి అర్థాలు కూడా ఉన్నాయి. ఈ పదాలు, చెట్టుకు వ్రేలాడుతున్న నోరూరించే పండును అందుకోవడానికి కష్టపడుతున్న ఒకరిని మీకు గుర్తుచేయవచ్చు. అయితే ఆ పదానికి అర్థం, “అధ్యక్ష్యపదవి” అనే బాధ్యతను అత్యాశతో చేజిక్కించుకోవడమని కాదు. ఎందుకని? ఎందుకంటే పెద్దలుగా సేవచేయాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాళ్లకు, స్థానాన్ని పొందాలనే లక్ష్యం కాదుగానీ “శ్రేష్ఠమైన పని” చేయాలనే లక్ష్యం ఉండాలి.

ఈ శ్రేష్ఠమైన పని కోసం కావాల్సిన అర్హతలు, 1 తిమోతి 3:2-7, తీతు 1:5-9 వచనాల్లో ఉన్నాయి. చాలాకాలం నుండి పెద్దగా సేవచేస్తున్న రేమండ్‌ అనే సహోదరుడు ఆ ఉన్నత ప్రమాణాల గురించి ఇలా చెబుతున్నాడు, “నావరకూ మనం ఎలాంటివాళ్లం అన్నదే ముఖ్యం. మాట్లాడడం, బోధించడం ముఖ్యమైనవే అయినా నిందారహితునిగా, అలవాట్లలో మితంగా, స్వస్థబుద్ధితో, మర్యాదస్థునిగా, అతిథి ప్రియునిగా, సహేతుకంగా ఉండడం వాటికన్నా ప్రాముఖ్యం.”

సంఘంలో వివిధ పనులు చేస్తూ, బాధ్యతల కోసం అర్హతలు సంపాదించుకోండి

బాధ్యతల కోసం నిజంగా అర్హతలు సంపాదించుకునే సహోదరుడు అన్ని రకాల మోసాలకు, అపరిశుభ్రతకు దూరంగా ఉంటూ తాను నిందారహితుణ్ణని చూపించుకుంటాడు. ఆయన అలవాట్లలో మితంగా, స్వస్థబుద్ధితో, మర్యాదస్థునిగా, సహేతుకంగా ఉంటాడు. అందుకే ఆయన సంఘంలో నాయకత్వం వహించగలడని, తమకు సమస్యలు వచ్చినప్పుడు సహాయం చేయగలడని తోటివిశ్వాసులు నమ్ముతారు. ఆయన ఆతిథ్యం ఇవ్వడం ద్వారా యౌవనులను, సత్యంలోకి కొత్తగా వచ్చినవాళ్లను చక్కగా ప్రోత్సహిస్తాడు. ఆయన మంచిని ప్రేమిస్తాడు కాబట్టి అనారోగ్యంతో ఉన్నవాళ్లకు, వయస్సు మళ్లినవాళ్లకు సహాయం చేస్తూ ఊరటనిస్తాడు. ఆయన ఇలాంటి లక్షణాలను వృద్ధి చేసుకునేది ఇతరులకు సహాయపడాలనే ఉద్దేశంతోనే తప్ప, తొందరగా బాధ్యతలు పొందాలని కాదు. b

పెద్దలు సంతోషంగా సలహాలను, ప్రోత్సాహాన్ని ఇస్తారు, కానీ లేఖనాధార అర్హతల్ని సంపాదించుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆ సహోదరునిదే. హెన్రీ అనే అనుభవంగల పెద్ద ఇలా చెబుతున్నాడు, “మీరు బాధ్యతల్ని ఆశిస్తున్నట్లయితే, వాటికి మీరు అర్హులేనని నిరూపించుకోవడానికి కష్టపడండి.” ప్రసంగి 9:10 గురించి ఆయన ఇలా వివరించాడు, “‘మీ చేతికి వచ్చిన ఏ పనినైనా శక్తిలోపము లేకుండా చేయండి.’ పెద్దలు ఏ పనిని అప్పగించినా శాయశక్తులా కష్టపడండి. సంఘంలో మీకు ఇచ్చే పనులన్నిటినీ, చివరికి ఊడ్చే పనిని కూడా ప్రేమించండి. సమయం గడుస్తుండగా మీ పనిని, కష్టాన్ని గుర్తిస్తారు.” మీరు ఏదో ఒక రోజు పెద్దగా సేవ చేయాలనుకుంటే, పరిశుద్ధ సేవకు సంబంధించిన అన్ని విషయాల్లో కష్టపడుతూ, నమ్మదగినవాళ్లలా ఉండండి. మీలో గర్వం కాదుగానీ వినయం స్పష్టంగా కనిపించాలి.—మత్త. 23:8-12.

తప్పుడు ఆలోచనలకు, ప్రవర్తనకు దూరంగా ఉండండి

సంఘంలో బాధ్యతలు ఆశించే కొంతమంది వాళ్ల కోరికను ఏదోవిధంగా పెద్దలసభకు తెలియజేయాలని లేదా పెద్దలసభను మంచి చేసుకోవాలని ప్రయత్నించవచ్చు. మరికొంతమంది, పెద్దలు ఏదైనా సలహా ఇస్తే చిరాకుపడతారు. అలాంటివాళ్లు ఇలా ప్రశ్నించుకోవాలి, ‘నా ఇష్టప్రకారం జరగాలని నేను కోరుకుంటున్నానా? లేక వినయంగా యెహోవా గొర్రెల బాగోగులు చూసుకోవాలనుకుంటున్నానా?’

పెద్దలు అవ్వాలని కోరుకునేవాళ్లు, “మందకు మాదిరులుగా ఉండుడి” అనే అర్హత గురించి మర్చిపోకూడదు. (1 పేతు. 5:1-3) సంఘానికి మాదిరిగా ఉండాలనుకునే వ్యక్తి మోసపూరితంగా ఆలోచించడు, ప్రవర్తించడు. ఆయనకు ఇప్పుడు ఆ నియామకం వచ్చినా, రాకపోయినా ఎంతో సహనాన్ని వృద్ధి చేసుకుంటాడు. సంఘపెద్ద అవ్వడంవల్ల, ఒక వ్యక్తిలోని లోపాలన్నీ అద్భుతరీతిలో మాయమవ్వవు. (సంఖ్యా. 12:3; కీర్త. 106:32, 33) అంతేకాదు, ఆ సహోదరునికి తనయందు ‘ఏ దోషము కనిపించకపోవచ్చు’ కానీ ఏదో కారణం వల్ల ఇతరులకు అతని మీద సరైన అభిప్రాయం ఉండకపోవచ్చు. (1 కొరిం. 4:4) కాబట్టి, పెద్దలు మీ మేలు కోరి లేఖనాధార సలహా ఇస్తే చిరాకుపడకుండా వినండి. వాళ్ల సలహాను పాటించడానికి కృషి చేయండి.

మీరు ఎంతోకాలంగా ఎదురుచూస్తుంటే?

ఆ బాధ్యత కోసం ఎదురుచూసీ చూసీ ఏళ్లు గడిచిపోతున్నట్లు చాలామంది సహోదరులకు అనిపిస్తుంది. మీరు కూడా ఎన్నో ఏళ్లుగా ‘అధ్యక్ష్యపదవిని ఆశిస్తూ’ అప్పుడప్పుడు బాధపడుతున్నారా? అలాగైతే, ఈ ప్రేరేపిత మాటల్ని గమనించండి, “కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.”—సామె. 13:12.

కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నామని అనిపించినప్పుడు బాధ కలగడం సహజమే. అబ్రాహాము అలాగే భావించాడు. ఆయనకు కుమారుణ్ణి ఇస్తానని యెహోవా మాటిచ్చాడు, అయితే ఏళ్లు గడుస్తున్నా అబ్రాహాము శారాలకు పిల్లలు పుట్టలేదు. (ఆది. 12:1-3, 7) వయస్సు పైబడుతున్నప్పుడు అబ్రాహాము బాధతో ఇలా అన్నాడు, “ప్రభువైన యెహోవా నాకేమి యిచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే . . . ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు.” తన మాట నెరవేరుతుందని యెహోవా అబ్రాహాముకు మళ్లీ భరోసా ఇచ్చాడు. అయినా, ఆ మాట నిజమవడం కోసం అబ్రాహాము కనీసం 14 ఏళ్లు ఎదురుచూడాల్సి వచ్చింది.—ఆది. 15:2-4; 16:16; 21:5.

అబ్రాహాము అలా ఎదురుచూస్తూ యెహోవా సేవలో ఆనందాన్ని కోల్పోయాడా? లేదు. యెహోవా మాటను ఆయన ఎన్నడూ సందేహించలేదు. మంచి ప్రతిఫలం కోసం ఆయన చాలాకాలం ఎదురుచూశాడు. అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, “ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.” (హెబ్రీ. 6:15) సర్వశక్తిమంతుడైన దేవుడు చివరికి నమ్మకస్థుడైన అబ్రాహామును ఊహించని విధంగా ఆశీర్వదించాడు. అబ్రాహాము నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

మీరు పెద్ద అవ్వాలని కోరుకొని సంవత్సరాలు గడుస్తున్నా అవ్వకపోతుంటే, యెహోవా మీద మీకున్న నమ్మకాన్ని వదులుకోకండి. ఆయన సేవలో మీ సంతోషాన్ని కోల్పోకండి. ఆధ్యాత్మిక ప్రగతి సాధించేలా చాలామందికి సహాయం చేసిన వారన్‌ అనే సహోదరుడు, అది ఎందుకు ప్రాముఖ్యమో ఇలా చెబుతున్నాడు, “ఓ సహోదరుడు బాధ్యత పొందడానికి అర్హత సాధించాడో లేదో తెలియాలంటే కాలం గడవాలి. కాలం గడుస్తుండగా, ఒక సహోదరుని సామర్థ్యాలు, మనస్తత్వం అతని ప్రవర్తనలో, అప్పగించిన పనులను చేసే విధానంలో మెల్లమెల్లగా బయటపడతాయి. బాధ్యతలు పొందితేనే విజయం సాధించినట్లని కొందరు నమ్ముతారు. కానీ అలా ఆలోచించడం తప్పు, అలాంటివాళ్లు ఎప్పుడూ అదే ఆలోచనతో ఉంటారు. మీరు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా యెహోవాకు నమ్మకంగా సేవ చేస్తుంటే విజయం సాధించినట్లే.”

ఒక సహోదరుడు పెద్ద అవ్వడానికి 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం వేచిచూశాడు. అయితే, యెహెజ్కేలు 1వ అధ్యాయంలో బాగా తెలిసిన ఓ వృత్తాంతాన్ని ప్రస్తావిస్తూ, దానినుండి తానేమి నేర్చుకున్నాడో ఆయన ఇలా చెబుతున్నాడు, “యెహోవా తనకు నచ్చిన వేగంతో తన రథాన్ని అంటే సంస్థను నడిపిస్తాడు. మనం అనుకున్న సమయం కాదుగానీ యెహోవా అనుకున్న సమయమే చాలా ముఖ్యం. పెద్దగా సేవ చేయాలనుకుంటున్నప్పుడు నాకు ఏమి కావాలో, నేను ఏమి అవ్వగలనని అనుకుంటున్నానో ముఖ్యం కాదు. నేను కావాలనుకుంటున్నది యెహోవా దృష్టిలో నాకు అవసరం లేదేమో.”

క్రైస్తవ పెద్దగా సేవచేయాలని మీరు ఎదురుచూస్తుంటే, సంఘ సంతోషానికి తోడ్పడుతూ అర్హతలు సంపాదించుకోండి. అది ఆలస్యమవుతున్నట్లు అనిపిస్తే ఆందోళన చెందకండి, సహనంగా ఉండండి. పైన ప్రస్తావించిన రేమండ్‌ ఏమంటున్నాడంటే, “అతిగా ఆశించేవాళ్లు సంతృప్తిగా ఉండలేరు, ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండేవాళ్లు యెహోవా సేవలో ఉండే గొప్ప ఆనందాన్ని కోల్పోతారు.” దేవుని ఆత్మఫలాన్ని ముఖ్యంగా దీర్ఘశాంతాన్ని ఎక్కువగా వృద్ధిచేసుకోండి. లేఖనాలను అధ్యయనం చేస్తూ మీ ఆధ్యాత్మికతను మెరుగుపర్చుకోవడానికి కృషిచేయండి. సువార్తను ప్రకటించడంలో, ఆసక్తి ఉన్న వాళ్లతో బైబిలు అధ్యయనం చేయడంలో ఎక్కువ సమయం గడపండి. కుటుంబ ఆరాధనలో, ఇతర ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ముందుండి మీ కుటుంబాన్ని నడిపించండి. సహోదరసహోదరీలతో ఉన్నప్పుడల్లా సంతోషంగా సమయం గడపండి. మీరు మీ లక్ష్యానికి అంతకంతకూ దగ్గరౌతుండగా యెహోవా సేవలోని సంతోషాన్ని ఆస్వాదిస్తారు.

సంఘంలో బాధ్యతల కోసం అర్హత సంపాదించేలా కష్టపడడం యెహోవా ఇస్తున్న అద్భుత అవకాశం; అలా కష్టపడుతున్న వారెవరూ విసిగిపోయి, తన సేవలో సంతోషాన్ని కోల్పోవాలని యెహోవాగానీ ఆయన సంస్థగానీ కోరుకోవట్లేదు. మంచి మనసుతో తనను సేవించే వాళ్లందర్నీ దేవుడు బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఇస్తున్న ఎన్నో దీవెనల్లాగే, ఈ దీవెన కూడా ‘దానితోపాటు కష్టాల్ని తీసుకునిరాదు.’—సామె. 10:22, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

అర్హతలు సంపాదించుకోవడానికి మీరు ఎంతోకాలంగా కష్టపడుతున్నప్పటికీ, ఇంకా చక్కని ఆధ్యాత్మిక ప్రగతిని సాధించవచ్చు. మీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన లక్షణాలను వృద్ధిచేసుకుంటూ, సంఘంలో కష్టపడి పనిచేస్తుండగా మీ సేవను యెహోవా ఎన్నడూ మర్చిపోడని గుర్తుంచుకోండి. మీరు ఏ నియామకాలు పొందినా, యెహోవా సేవను ఎల్లప్పుడూ సంతోషంగా చేయండి.

a ఈ ఆర్టికల్‌లో ఉన్నవి అసలు పేర్లు కావు.

b ఈ ఆర్టికల్‌లోని సూత్రాలు పరిచర్య సేవకులు అవ్వాలనుకుంటున్న వాళ్లకు కూడా వర్తిస్తాయి. వాళ్లకు ఉండాల్సిన అర్హతల గురించి 1 తిమోతి 3:8-10, 12, 13 వచనాల్లో ఉన్నాయి.