ఆయన తన నివాసానికి చేరుకున్నాడు
యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యుడైన గయ్ హాలస్ పియర్స్ 2014, మార్చి 18 మంగళవారం తన భూజీవితాన్ని ముగించాడు. క్రీస్తు సహోదరుల్లో ఒకరిగా పునరుత్థానం అవ్వాలనే తన నిరీక్షణ నిజమయ్యేనాటికి ఆయన వయస్సు 79 సంవత్సరాలు.—హెబ్రీ. 2:10-12; 1 పేతు. 3:18.
గయ్ పియర్స్, 1934 నవంబరు 6న అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఆబర్న్‌లో పుట్టాడు. ఆయన 1955లో బాప్తిస్మం తీసుకున్నాడు. 1977 లో పెళ్లి చేసుకున్నాడు, భార్య పేరు పెన్నీ. పిల్లల్ని పెంచిన అనుభవం వల్ల ఆయన ఇతరులమీద తండ్రిలా ఆప్యాయతను చూపించగలిగాడు. 1982కల్లా ఈ దంపతులు పయినీరు సేవలో చురుగ్గా ఉన్నారు. ఆయన 1986లో అమెరికాలో ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ మొదలుపెట్టి, 11 సంవత్సరాలపాటు ఆ సేవ చేశాడు.
గయ్ పియర్స్, పెన్నీలు 1997లో అమెరికా బెతెల్ కుటుంబ సభ్యులు అయ్యారు. అక్కడ సహోదరుడు, సేవా విభాగంలో పని చేశాడు. ఆయనను 1998లో పరిపాలక సభలోని పర్సోనెల్ కమిటీకి సహాయకునిగా నియమించారు. 1999, అక్టోబరు 2న జరిగిన వాచ్ టవర్ బైబిల్ అండ్ ట్రాక్ట్ సొసైటీ ఆఫ్ పెన్సిల్వేనియా వార్షిక కూటంలో సహోదరుడు పియర్స్‌ను పరిపాలక సభ సభ్యునిగా నియమించినట్లు ప్రకటించారు. ఇటీవలి సంవత్సరాల్లో ఆయన పర్సోనెల్, రైటింగ్, పబ్లిషింగ్, కో-ఆర్డినేటర్స్ కమిటీల్లో సేవ చేశాడు.
బ్రదర్ పియర్స్ ఎప్పుడూ చిరునవ్వు చిందిస్తూ సరదాగా మాట్లాడేవాడు. దాంతో వివిధ నేపథ్యాల, సంస్కృతులవాళ్లు ఆయనను ఇష్టపడేవాళ్లు. అయితే ప్రేమ, వినయం, దేవుని నియమాల-సూత్రాల పట్ల గౌరవం, యెహోవా మీద అపారమైన నమ్మకం వంటి లక్షణాలే ఆయన్ను ఇతరులకు దగ్గర చేశాయి. సూర్యుడు ఉదయించడమైనా మానేస్తాడేమో కానీ యెహోవా మాత్రం తన వాగ్దానాలను నెరవేర్చి తీరుతాడని ఆయన నమ్మేవాడు, ఆ సత్యాన్నే లోకం మొత్తానికి చాటిచెప్పాలని కోరుకున్నాడు.
ఆయన తెల్లవారుజామునే లేచి తరచూ రాత్రి వరకు పనిచేస్తూ అవిశ్రాంతంగా యెహోవా సేవ చేసేవాడు. ఆయన ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాంతాలకు ప్రయాణిస్తూ క్రైస్తవ సహోదరసహోదరీలను ప్రోత్సహించేవాడు. అయినప్పటికీ తన సహవాసాన్ని, సలహాల్ని, సహాయాన్ని కోరుకునే బెతెల్ కుటుంబ సభ్యులతో, మరితరులతో కూడా సమయం గడిపేవాడు. సంవత్సరాలు గడిచినా తోటి సహోదరసహోదరీలు ఇప్పటికీ ఆయన ఆతిథ్యాన్ని, స్నేహాన్ని, బైబిలు ద్వారా ఆయనిచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకుంటారు.
మన సహోదరుడూ ప్రియ స్నేహితుడూ అయిన పియర్స్‌కు భార్యా ఆరుగురు పిల్లలతోపాటు మనవళ్లు మునిమనవళ్లు కూడా ఉన్నారు. ఆయనకు చాలామంది ఆధ్యాత్మిక పిల్లలూ ఉన్నారు. 2014, మార్చి 22న మరో పరిపాలక సభ సభ్యుడైన మార్క్ సాండర్సన్ బ్రూక్లిన్ బెతెల్‌లో, సహోదరుడు పియర్స్ గురించి జ్ఞాపకార్థ ప్రసంగం ఇచ్చాడు. ఆయన తన ప్రసంగంలో ఇతర అంశాలతోపాటు సహోదరుడు పియర్స్‌కు ఉన్న పరలోక నిరీక్షణ గురించి మాట్లాడి యేసు చెప్పిన ఈ మాటలను చదివాడు, “నా తండ్రి యింట అనేక నివాసములు కలవు . . . నేను వెళ్లి మీకు స్థలము సిద్ధపరచినయెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నాయొద్ద నుండుటకు మిమ్మును తీసికొని పోవుదును. నేను వెళ్లుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియునని చెప్పెను.”—యోహా. 14:2-4.
నిజమే, సహోదరుడు పియర్స్ మనమధ్య లేకపోవడం పెద్ద లోటే. అయినప్పటికీ, ఆయన తన శాశ్వత ‘నివాసానికి’ చేరుకున్నాడని మనం సంతోషిస్తున్నాం.