కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘విని, గ్రహించండి’

‘విని, గ్రహించండి’

“మీరందరు నా మాట విని గ్రహించుడి.”—మార్కు 7:14.

1, 2. యేసు మాటల్ని విన్న చాలామంది వాటిని ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు?

 ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల స్వరం మనకు వినిపిస్తుంది, వాళ్లు మాట్లాడే తీరు కూడా మనకు అర్థమౌతుంది. కానీ వాళ్లు ఏం చెప్తున్నారో మనం గ్రహించకపోతే ఉపయోగం ఏముంటుంది? (1 కొరిం. 14:9) అదే విధంగా, యేసు చెప్పిన విషయాల్ని వేలమంది విన్నారు. ఆయన వాళ్లకు అర్థమయ్యే భాషలోనే మాట్లాడాడు. అయినా, ఆయన ఏమి చెబుతున్నాడో చాలామంది అర్థం చేసుకోలేదు. అందుకే ఆయన వాళ్లతో ఇలా అన్నాడు, “మీరందరు నా మాట విని గ్రహించుడి.”—మార్కు 7:14.

2 యేసు మాటల్ని చాలామంది ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? వాళ్లలో కొంతమందికి అప్పటికే సొంత అభిప్రాయాలు, తప్పుడు ఉద్దేశాలు ఉన్నాయి. వాళ్ల గురించి యేసు ఇలా చెప్పాడు, “మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు.” (మార్కు 7:9) వాళ్లు యేసు మాటల్లోని అర్థాన్ని గ్రహించడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. తమ పద్ధతులను, అభిప్రాయాలను మార్చుకోవడానికి ఇష్టపడలేదు. వాళ్లు వినడానికైతే విన్నారు కానీ ఆ మాటలు వాళ్ల హృదయాల్లోకి వెళ్లలేదు. (మత్తయి 13:13-15 చదవండి.) అయితే, యేసు బోధల నుండి ప్రయోజనం పొందేలా మన హృదయాల్ని ఎలా సిద్ధం చేసుకోవచ్చు?

యేసు బోధల నుండి ప్రయోజనం పొందాలంటే ఏమి చేయాలి?

3. శిష్యులు యేసు మాటల్ని ఎలా అర్థం చేసుకోగలిగారు?

3 మనం వినయస్థులైన యేసు శిష్యుల మాదిరిని అనుసరించాలి. వాళ్లతో యేసు ఇలా అన్నాడు, “మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి.” (మత్త. 13:16) ఇతరులు అర్థం చేసుకోలేకపోయిన వాటిని శిష్యులు ఎలా అర్థం చేసుకోగలిగారు? వాళ్లు దానికోసం మూడు పనులు చేశారు. మొదటిగా, వాళ్లు ప్రశ్నలు అడిగి, యేసు మాటల నిజమైన అర్థాన్ని తెలుసుకోవాలని కోరుకున్నారు. (మత్త. 13:36; మార్కు 7:17) రెండవదిగా, వాళ్లు అప్పటికే నమ్ముతున్న విషయాలకు యేసు మాటల్ని చేర్చి, తమ జ్ఞానాన్ని పెంచుకోవాలని కోరుకున్నారు. (మత్తయి 13:11, 12 చదవండి.) మూడవదిగా, విని అర్థం చేసుకున్న వాటిని తమ జీవితాల్లో పాటించడంతోపాటు వాటిని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయాలని కూడా కోరుకున్నారు.—మత్త. 13:51, 52.

4. యేసు ఉపమానాల అర్థాన్ని గ్రహించాలంటే మనం చేయాల్సిన మూడు పనులేంటి?

4 యేసు చెప్పిన ఉపమానాల అర్థాన్ని గ్రహించాలంటే మనం కూడా వాళ్లలా మూడు పనులు చేయాలి. మొదటిది, మనం సమయం తీసుకుని యేసు చెప్పిన వాటిని చదివి, వాటి గురించి ఆలోచించాలి. అంతేకాక పరిశోధన చేయాలి, 8వ పేజీలోని బాక్సులో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన ప్రశ్నలు వేసుకోవాలి. అలా మన జ్ఞానాన్ని పెంచుకుంటాం. (సామె. 2:4, 5) రెండవది, ఆ జ్ఞానాన్ని మనకు అప్పటికే తెలిసిన వాటితో చేర్చి, అది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో ఆలోచించాలి. అది మన అవగాహనను పెంచుతుంది. (సామె. 2:2, 3) ఇక మూడవది, నేర్చుకున్న వాటిని మన జీవితంలో పాటించాలి. దానివల్ల మన తెలివి పెరుగుతుంది.—సామె. 2:6, 7.

5. జ్ఞానానికి, అవగాహనకు, తెలివికి మధ్య ఉన్న తేడాను ఉదాహరణతో చెప్పండి.

5 జ్ఞానానికి, అవగాహనకు, తెలివికి మధ్య ఉన్న తేడా ఏమిటి? మీరు రోడ్డు మధ్యలో నిలబడి ఉన్నారని ఊహించుకోండి. ఒక బస్సు మీ వైపు వస్తోంది. ముందు, అది బస్సు అని మీరు గుర్తిస్తారు. అది జ్ఞానం. తర్వాత, అక్కడే నిలబడివుంటే అది మిమ్మల్ని గుద్దేస్తుందని మీకు అర్థమౌతుంది. అది అవగాహన. కాబట్టి మీరు వెంటనే పక్కకి వెళ్తారు. అది తెలివి. అందుకే “లెస్సయైన జ్ఞానమును [“తెలివిని,” NW] . . . భద్రము చేసికొనుము” అని బైబిలు చెబుతుంది, ఎందుకంటే అది మన ప్రాణాన్ని కాపాడుతుంది!—సామె. 3:21, 22; 1 తిమో. 4:16.

6. యేసు చెప్పిన ఏడు ఉపమానాలను పరిశీలిస్తున్నప్పుడు మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచిస్తాం? ( బాక్సు చూడండి.)

6 ఈ ఆర్టికల్‌లో, దీని తర్వాతి ఆర్టికల్‌లో యేసు చెప్పిన ఏడు ఉపమానాలను పరిశీలిస్తాం. వాటిని పరిశీలిస్తున్నప్పుడు ఈ ప్రశ్నల గురించి ఆలోచిద్దాం: ఈ ఉపమాన అర్థమేమిటి? (ఇది జ్ఞానం.) యేసు ఈ ఉపమానాన్ని ఎందుకు చెప్పాడు? (ఇది అవగాహన.) అందులోని విషయాల్ని మనకు, ఇతరులకు ప్రయోజనం కలిగేలా ఎలా ఉపయోగించవచ్చు? (ఇది తెలివి.) ఈ ఉపమానం యెహోవా గురించి, యేసు గురించి మనకేమి నేర్పిస్తుంది?

ఆవగింజ

7. యేసు చెప్పిన ఆవగింజ ఉపమానం అర్థం ఏమిటి?

7 మత్తయి 13:31, 32 చదవండి. ఆవగింజ ఉపమానం అర్థం ఏమిటి? ఆవగింజ రాజ్యసందేశాన్ని, దాన్ని ప్రకటించడం వల్ల వృద్ధిచెందిన క్రైస్తవ సంఘాన్ని సూచిస్తుంది. ‘విత్తనాలన్నిటిలో చిన్నదైన’ ఆవగింజలాగే క్రైస్తవ సంఘం కూడా సా.శ. 33⁠లో చాలా కొద్దిమందితో ప్రారంభమైంది. కానీ, అది కొన్ని దశాబ్దాల్లోనే ఊహించినదానికన్నా చాలా వేగంగా వృద్ధి చెందింది. (కొలొ. 1:23) ‘ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలమీద నివసించేంత’ పెద్ద చెట్టుగా ఆవగింజ ఎదుగుతుందని యేసు చెప్పాడు. అంటే, క్రైస్తవ సంఘం వృద్ధి చెందేకొద్దీ మంచి మనసున్న ప్రజలు దానిలోకి వచ్చి ఆధ్యాత్మిక ఆహారాన్ని, సంరక్షణను, ఆశ్రయాన్ని పొందుతారని అర్థం.—యెహెజ్కేలు 17:23తో పోల్చండి.

8. యేసు ఆవగింజ ఉపమానం ద్వారా ఏమి వివరించాడు?

8 యేసు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? యేసు ఆశ్చర్యకరంగా పెరిగిన ఆవగింజను ఉపయోగిస్తూ, దేవుని రాజ్యం ఎలా వృద్ధి చెందుతుందో, ఎలా ప్రజల్ని సంరక్షిస్తుందో, ఎలా ఆటంకాలన్నిటినీ జయిస్తుందో వివరించాడు. ముఖ్యంగా 1914 నుండి క్రైస్తవ సంఘం అసాధారణమైన రీతిలో వృద్ధి చెందుతోంది. (యెష. 60:22) దానిలోని వాళ్లందరూ అద్భుతమైన ఆధ్యాత్మిక సంరక్షణను పొందుతున్నారు. (సామె. 2:7; యెష. 32:1, 2) ఆటంకాలు ఎన్ని వచ్చినా సంఘ అభివృద్ధి ఆగదు.—యెష. 54:17.

9. (ఎ) ఆవగింజ ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? (బి) యెహోవా గురించి, యేసు గురించి ఈ ఉపమానం మీకేమి నేర్పిస్తుంది?

9 ఈ ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం నివసిస్తున్న ప్రాంతంలో సాక్షులు తక్కువమంది ఉండవచ్చు లేదా ప్రకటనా పనికి వెంటనే మంచి ఫలితాలు రాకపోవచ్చు. అయితే, దేవుని రాజ్యం ఏ ఆటంకాన్నైనా అధిగమించగలదని గుర్తుంచుకుంటే ఆ పనిలో ఓపిగ్గా కొనసాగుతాం. ఉదాహరణకు, 1926లో సహోదరుడు ఎడ్విన్‌ స్కిన్నర్‌ ఇండియాకు వచ్చినప్పుడు సాక్షులు కొద్దిమందే ఉన్నారు. మొదట్లో అభివృద్ధి అంతంతమాత్రంగానే ఉండేది, ప్రకటనా పని కూడా చాలా ‘కష్టంగా సాగేది.’ కానీ ఆయన ఆ పనిలో కొనసాగుతూ, రాజ్య సందేశం ఏ విధంగా పెద్దపెద్ద ఆటంకాలను అధిగమించగలదో చూశాడు. ఇప్పుడు ఇండియాలో 37,000 కన్నా ఎక్కువమంది సాక్షులు ఉన్నారు. గత సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణకు 1,08,000 కన్నా ఎక్కువమంది వచ్చారు. మరో ఉదాహరణ చూద్దాం. ఆ సహోదరుడు ఇండియాకు వచ్చిన సంవత్సరంలోనే జాంబియాలో ప్రకటనా పని మొదలైంది. ఇప్పుడు అక్కడ 1,70,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు సువార్త ప్రకటిస్తున్నారు. 2013 జ్ఞాపకార్థ ఆచరణకు 7,63,915 మంది హాజరయ్యారు. అంటే ఆ దేశంలోని ప్రతీ 18 మందిలో ఒకరు ఆ ఆచరణకు వచ్చారు. ఎంత అసాధారణ అభివృద్ధి!

పులిసిన పిండి

10. యేసు చెప్పిన పులిసిన పిండి ఉపమానం అర్థం ఏమిటి?

10 మత్తయి 13:33 చదవండి. పులిసిన పిండి ఉపమానం అర్థం ఏమిటి? యేసు ఈ ఉపమానాన్ని కూడా రాజ్యసందేశాన్ని, దానివల్ల వచ్చే ఫలితాలను వివరించడానికే చెప్పాడు. ‘మొత్తం పిండి’ దేశాలన్నిటినీ సూచిస్తుంది. పిండి పులవడం, ప్రకటనా పని ద్వారా రాజ్య సందేశం ఎలా వ్యాప్తి చెందుతుందో సూచిస్తుంది. ఆవగింజ పెరుగుదలను మనం స్పష్టంగా చూడగలం, కానీ పిండి పులవడాన్ని మనం మొదట్లో గమనించలేం. పిండిలో వచ్చిన మార్పు బయటకు కనబడడానికి కొంత సమయం పడుతుంది.

11. పులిసిన పిండి ఉపమానం ద్వారా యేసు ఏమి చెప్పాడు?

11 యేసు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? రాజ్య సందేశానికి “భూదిగంతముల వరకు” విస్తరించే, ప్రజలను మార్చే శక్తి ఉందని ఈ ఉపమానం ద్వారా యేసు చెప్పాడు. (అపొ. 1:8) ఈ శక్తిమంతమైన సందేశం ప్రజల్లో మార్పు తీసుకొస్తుంది, కానీ ఆ మార్పును మనం మొదట్లో గుర్తించకపోవచ్చు. ఎంతోమంది ప్రజలు రాజ్య సందేశాన్ని వింటూ, దాని సహాయంతో తమ ప్రవర్తన మార్చుకుంటున్నారు.—రోమా. 12:2; ఎఫె. 4:22, 23.

12, 13. పులిసిన పిండి ఉపమానంలో యేసు వివరించినట్లుగా, రాజ్య ప్రకటనా పని ఏ విధంగా విస్తరించిందో ఉదాహరణలు చెప్పండి.

12 చాలాసార్లు, సువార్త ప్రకటించడం మొదలుపెట్టిన ఎన్నో సంవత్సరాల తర్వాతగానీ ఫలితాలు కనిపించవు. ఉదాహరణకు, ఫ్రాంట్స్‌-మార్గిట్‌ దంపతులు 1982లో బ్రెజిల్‌ బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్నప్పుడు ఓ చిన్న ఊర్లో సువార్త ప్రకటించారు. వాళ్లు అక్కడ ఎంతోమందితో బైబిలు అధ్యయనం చేశారు. వాళ్లలో ఓ తల్లి, ఆమె నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. 12 ఏళ్ల వాళ్ల పెద్దబ్బాయికి సిగ్గు ఎక్కువ, అందుకే వీళ్లు స్టడీకి వెళ్లినప్పుడల్లా ఎక్కడో దాక్కునేవాడు. అయితే, నియామకం మారడం వల్ల ఫ్రాంట్స్‌-మార్గిట్‌లు వాళ్లతో అధ్యయనం కొనసాగించలేకపోయారు. 25 ఏళ్ల తర్వాత వాళ్లు మళ్లీ ఆ ఊరికి వెళ్లినప్పుడు అక్కడ 69 మంది ప్రచారకులు గల ఓ సంఘం ఉంది, వాళ్లలో 13 మంది క్రమ పయినీర్లు. వాళ్లందరూ తమ కొత్త రాజ్యమందిరంలో కూటాలు జరుపుకుంటున్నారు. ఒకప్పుడు సిగ్గుతో దాక్కునే ఆ అబ్బాయి, ఇప్పుడు ఆ సంఘంలో పెద్దల సభ సమన్వయకర్త! యేసు చెప్పిన ఉపమానంలోని పులిసిన పిండిలానే, రాజ్యసందేశం విస్తరించి ఎంతోమంది జీవితాలను మార్చింది.

13 రాజ్య సందేశానికి ఉన్న శక్తి ముఖ్యంగా ప్రకటనా పని మీద ఆంక్షలున్న దేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అలాంటి దేశాల్లో రాజ్యసువార్త ఎంతగా విస్తరించిందో తెలుసుకున్నప్పుడు మనం చాలా ఆశ్చర్యపోతాం. ఉదాహరణకు, క్యూబా దేశానికి 1910లో రాజ్యసువార్త పరిచయమైంది. సహోదరుడు రస్సెల్‌ 1913లో ఆ ద్వీపాన్ని సందర్శించాడు. మొదట్లో అక్కడ అంతగా అభివృద్ధి కనిపించలేదు. కానీ ఇప్పుడు క్యూబాలో 96,000 కన్నా ఎక్కువమంది ప్రచారకులు రాజ్యసువార్త ప్రకటిస్తున్నారు. 2013 జ్ఞాపకార్థ ఆచరణకు 2,29,726 మంది హాజరయ్యారు. అంటే ఆ దేశ ప్రజల్లోని ప్రతి 48 మందిలో ఒకరు హాజరయ్యారు. మన పనిపై నిషేధం లేని దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటించడం సాధ్యం కాదని స్థానిక సాక్షులు అనుకుంటారు. కానీ అలాంటి ప్రాంతాలకు కూడా రాజ్య సందేశం చేరే ఉంటుంది. aప్రసం. 8:7; 11:5.

14, 15. (ఎ) పులిసిన పిండి ఉపమానంలో నేర్చుకున్న దానినుండి మనం వ్యక్తిగతంగా ఎలా ప్రయోజనం పొందవచ్చు? (బి) యెహోవా గురించి, యేసు గురించి ఈ ఉపమానం మీకేమి నేర్పిస్తుంది?

14 పులిసిన పిండి ఉపమానంలో యేసు బోధించిన దానినుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చు? యేసు చెప్పిన ఈ ఉపమాన అర్థం గురించి ఆలోచిస్తే, ఇంకా సువార్త వినని కోట్లాదిమందికి రాజ్యసందేశం ఎలా చేరుతుందోనని అతిగా బాధపడం. ప్రతీది యెహోవా చూసుకుంటాడనే నమ్మకంతో ఉంటాం. మరి మనం చేయాల్సిందేంటి? బైబిలు దానికి ఇలా జవాబిస్తుంది, “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము, అది ఫలించునో యిది ఫలించునో లేక రెండును సరిసమానముగా ఎదుగునో నీవెరుగవు.” (ప్రసం. 11:6) అలాగే, ప్రకటనా పనిని ఆశీర్వదించమని యెహోవాకు తప్పకుండా ప్రార్థించాలి. ముఖ్యంగా సువార్త పనిపై ఆంక్షలు ఉన్న దేశాల్లో జరుగుతున్న పనిని దీవించమని మనం వేడుకోవాలి.—ఎఫె. 6:18-20.

15 అంతేకాదు, మన ప్రకటనా పనికి వెంటనే ఫలితాలు రానప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. ‘కొద్దిపాటి పనే జరిగిందని’ మనం బాధపడాల్సిన అవసరం లేదు. (జెక. 4:10, పవిత్ర గ్రంథము, కతోలిక అనువాదము) కాలం గడుస్తుండగా మనం ఊహించలేనన్ని అద్భుతమైన ఫలితాలు రావచ్చు.—కీర్త. 40:5; జెక. 4:7.

వర్తకుడు, దాచబడిన ధనం

16. వర్తకుడు, దాచబడిన ధనం గురించి యేసు చెప్పిన ఉపమానాల అర్థం ఏమిటి?

16 మత్తయి 13:44-46 చదవండి. వర్తకుడు గురించి, దాచబడిన ధనం గురించి యేసు చెప్పిన ఉపమానాల అర్థం ఏమిటి? యేసు కాలంలో, కొంతమంది వర్తకులు మంచి ముత్యాల కోసం చాలా దూరం ప్రయాణించేవాళ్లు. ఉపమానంలోని ‘అమూల్యమైన ముత్యం’ విలువైన రాజ్య సత్యాన్ని సూచిస్తుంది. వర్తకుడు, ఆ సత్యం కోసం అన్నిచోట్లా వెదికే మంచి మనసున్న వాళ్లను సూచిస్తున్నాడు. ఆ ముత్యానికి ఉన్న విలువను అర్థం చేసుకున్న వర్తకుడు దాన్ని కొనేందుకు తనకున్నదంతా వెంటనే అమ్మడానికి సిద్ధపడ్డాడు. అలాగే, పొలంలో పని చేస్తున్నప్పుడు “దాచబడిన” ధనాన్ని కనుగొన్న ఒక వ్యక్తి గురించి కూడా యేసు చెప్పాడు. అయితే అతను ఆ వర్తకునిలా ధననిధిని వెతుక్కుంటూ వెళ్లలేదు, కానీ అది దొరికినప్పుడు మాత్రం దాన్ని సొంతం చేసుకోవడానికి అతను కూడా తనకు “కలిగినదంతా” అమ్మడానికి సిద్ధపడ్డాడు.

17. వర్తకుడు, దాచబడిన ధనం గురించిన ఉపమానాల ద్వారా యేసు ఏమి చెప్పాడు?

17 యేసు ఈ రెండు ఉపమానాలను ఎందుకు చెప్పాడు? ప్రజలు సత్యాన్ని అనేక విధాలుగా కనుగొంటారని యేసు చెబుతున్నాడు. కొంతమంది సత్యం కోసం వెదికి, దాన్ని సొంత చేసుకోవడానికి త్యాగాలు చేశారు. మరికొంతమంది సత్యం కోసం వెదకకపోయినా, ఎవరో ఒకరు వాళ్లకు ప్రకటించడం వల్ల దాన్ని కనుగొన్నారు. ఈ ఉపమానాల్లోని ఇద్దరు వ్యక్తులూ తాము కనుగొన్నదాని విలువను గుర్తించారు, అంతేకాదు దాన్ని సొంతం చేసుకోవడం కోసం పెద్దపెద్ద త్యాగాలు చేయడానికి కూడా ఇష్టపడ్డారు.

18. (ఎ) ఈ రెండు ఉపమానాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (బి) యెహోవా గురించి, యేసు గురించి ఈ ఉపమానాలు మీకేమి నేర్పిస్తాయి?

18 ఈ రెండు ఉపమానాల నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? (మత్త. 6:19-21) మిమ్మల్ని ఇలా ప్రశ్నించుకోండి, ‘సత్యం పట్ల ఆ ఇద్దరికీ ఉన్న అభిప్రాయమే నాకూ ఉందా? నేను కూడా సత్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నానా? సత్యాన్ని సొంతం చేసుకోవడం కోసం త్యాగాలు చేయడానికి ఇష్టపడుతున్నానా, లేక ప్రతీరోజు ఉండే ఒత్తిళ్ల వల్ల నా ధ్యాస పక్కకు మళ్లుతోందా?’ (మత్త. 6:22-24, 33; లూకా 5:27, 28; ఫిలి. 3:8) మనం సత్యాన్ని నిజంగా ప్రేమిస్తే, దానికి మన జీవితంలో మొదటి స్థానం ఇవ్వడం కోసం ఎలాంటి త్యాగాలైనా చేస్తాం.

19. తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

19 కాబట్టి, మనం రాజ్యం గురించిన ఉపమానాలను విని, వాటి అర్థాన్ని గ్రహించామని చూపిద్దాం. వాటి అర్థాన్ని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు కానీ, వాటినుండి నేర్చుకున్న విషయాల్ని మన జీవితంలో పాటించాలి. తర్వాతి ఆర్టికల్‌లో మరో మూడు ఉపమానాలను పరిశీలించి, వాటి నుండి ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.

a అర్జెంటీనా (2001 వార్షిక పుస్తకం [ఇంగ్లీషు], 186వ పేజీ); తూర్పు జర్మనీ (1999 వార్షిక పుస్తకం, 83వ పేజీ); పాపువా న్యూగిని (2005 వార్షిక పుస్తకం, 63వ పేజీ); రాబిన్‌సన్‌ క్రూసో దీవి (కావలికోట, జూన్‌ 15, 2000, 9వ పేజీ) వంటి దేశాల్లో కూడా అలాంటి అనుభవాలే ఉన్నాయి.