కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మీరు గ్రహించారా?

మీరు గ్రహించారా?

‘వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను.’—లూకా 24:45.

1, 2. పునరుత్థానమైన రోజున యేసు తన శిష్యుల్ని ఎలా బలపర్చాడు?

 అది యేసు పునరుత్థానమైన రోజు. యెరూషలేము నుండి సుమారు 11 కి.మీ. దూరంలో ఉన్న ఒక గ్రామానికి ఇద్దరు శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసు పునరుత్థానం అయ్యాడని తెలియక, కొన్నిరోజుల క్రితం జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ వాళ్లు బాధపడుతున్నారు. అకస్మాత్తుగా యేసు వాళ్లకు కనిపించి, వాళ్లతో నడుస్తూ ఆ శిష్యులను ఓదార్చాడు. ఏవిధంగా? “మోషేయు సమస్త ప్రవక్తలును మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను.” (లూకా 24:13-15, 27) ఆ సందర్భంలో ఆయన వాళ్లకు లేఖనాల అర్థాన్ని స్పష్టంగా వివరించినప్పుడు ‘వాళ్ల హృదయాలు మండుతున్నట్లు’ వాళ్లకు అనిపించింది.—లూకా 24:32.

2 అదే రోజు సాయంత్రం ఆ ఇద్దరు శిష్యులు యెరూషలేముకు తిరిగొచ్చి జరిగినదంతా అపొస్తలులకు చెప్పారు. ఆ శిష్యులు మాట్లాడుతుండగా, యేసు వాళ్లందరికీ కనిపించాడు. అయితే, అపొస్తలులు చాలా భయపడ్డారు. వాళ్ల మదిలో ఎన్నో సందేహాలు మెదిలాయి. యేసు వాళ్లను ఎలా బలపర్చాడు? ‘వారు లేఖనములు గ్రహించునట్లుగా ఆయన వారి మనస్సును తెరచెను’ అని బైబిలు చెబుతుంది.—లూకా 24:45.

3. మనకు ఎలాంటి సవాళ్లు ఎదురవ్వవచ్చు? పరిచర్యలో మన సంతోషాన్ని ఎలా కాపాడుకోగలం?

3 ఆ శిష్యుల్లాగే మనం కూడా కొన్నిసార్లు బాధతో కృంగిపోతాం. బహుశా, మనం ఎక్కువగా దేవుని సేవ చేస్తున్నా ఫలితాలు కనిపించక నీరుగారిపోతుండవచ్చు. (1 కొరిం. 15:58) లేదా మన బైబిలు విద్యార్థులు అంతగా ప్రగతి సాధించట్లేదని మనకు అనిపించవచ్చు. వాళ్లలో కొందరు యెహోవాకు దూరమైవుండవచ్చు కూడా. అలాంటి పరిస్థితుల్లో కూడా మనం సంతోషంగా ఎలా పరిచర్య చేయవచ్చు? అందుకు ఓ మార్గం, యేసు చెప్పిన ఉపమానాల అర్థాన్ని గ్రహించడం. వాటిలో ఇప్పుడు మూడు ఉపమానాలు పరిశీలించి, ఏమి నేర్చుకోవచ్చో చూద్దాం.

నిద్రపోయిన విత్తువాడు

4. నిద్రపోయిన విత్తువాని గురించి యేసు చెప్పిన ఉపమాన అర్థమేమిటి?

4 మార్కు 4:26-29 చదవండి. నిద్రపోయిన విత్తువాని గురించి యేసు చెప్పిన ఉపమాన అర్థం ఏమిటి? ఆ ఉపమానంలో, విత్తనాలు చల్లిన వ్యక్తి ఒక్కొక్క రాజ్య ప్రచారకుణ్ణి సూచిస్తున్నాడు. విత్తనం, యథార్థ హృదయంగల వాళ్లకు ప్రకటించిన రాజ్య సందేశాన్ని సూచిస్తుంది. సాధారణంగా అందరూ చేసినట్లే విత్తువాడు కూడా రాత్రి ‘నిద్రపోతూ’, పగలు ‘మేల్కొంటున్నాడు.’ విత్తనాలు నాటిన తర్వాత పంట చేతికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో ‘విత్తనం మొలిచి పెరుగుతుంది.’ విత్తనం దానంతటదే మొలిచి, క్రమేణా దశలవారీగా పెరుగుతుంది. అదే విధంగా, ఒక వ్యక్తి కూడా క్రమక్రమంగా, దశలవారీగా ఆధ్యాత్మిక అభివృద్ధి సాధిస్తాడు. ఆయన చివరికి దేవుణ్ణి సేవించేంతగా ప్రగతి సాధించినప్పుడు ఫలిస్తాడు, అంటే యెహోవాకు సమర్పించుకుని బాప్తిస్మం తీసుకుంటాడు.

5. నిద్రపోయిన విత్తువాని ఉపమానం ద్వారా యేసు ఏమి చెప్పాడు?

5 యేసు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? మంచి మనసున్న వాళ్లలో సత్యం వృద్ధి అయ్యేలా చేసేది యెహోవాయేనని యేసు చెబుతున్నాడు. (అపొ. 13:48; 1 కొరిం. 3:7) మనం నాటి, నీళ్లు పోస్తాం కానీ ఎదుగుదల మన చేతుల్లో ఉండదు. అవి పెరిగేలా మనం బలవంతం చేయలేం, అలాగే వేగంగా పెరిగేలా కూడా చేయలేం. ఉపమానంలోని వ్యక్తిలానే మనకు కూడా, బైబిలు విద్యార్థుల హృదయాల్లో సత్యం ఎలా వృద్ధి చెందుతుందో తెలియదు. మనం రోజువారీ పనుల్లో ఉన్నప్పుడు దాన్ని గ్రహించలేకపోవచ్చు. కానీ కాలం గడుస్తుండగా బైబిలు విద్యార్థుల్లో రాజ్యవిత్తనం ఫలిస్తుంది, అప్పుడు వాళ్లు కూడా మనతో కలిసి సంతోషంగా కోతపనిలో పాల్గొంటారు.—యోహా. 4:36-38.

6. బైబిలు విద్యార్థుల ప్రగతికి సంబంధించి మనం ఏమి గుర్తుంచుకోవాలి?

6 ఈ ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మొదటిగా, బైబిలు విద్యార్థులు ఎంత త్వరగా ప్రగతి సాధిస్తారనేది మన చేతుల్లో ఉండదు. వాళ్లకు సహాయం చేయడానికి, మద్దతివ్వడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం, కానీ బాప్తిస్మం తీసుకోమని వాళ్లను బలవంతపెట్టం. సమర్పించుకోవాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది వాళ్లేనని మనం వినయంగా ఒప్పుకుంటాం. దేవుని మీద ప్రేమ ఉంటేనే ఎవరైనా ఆయనకు సమర్పించుకుంటారు. అలా తనమీద నిజమైన ప్రేమతో సమర్పించుకున్నప్పుడే యెహోవా అంగీకరిస్తాడు.—కీర్త. 51:12; 54:6; 110:3.

7, 8. (ఎ) నిద్రపోయిన విత్తువాని ఉపమానం నుండి మనం ఏ ఇతర పాఠాలు నేర్చుకుంటాం? ఒక ఉదాహరణ చెప్పండి. (బి) యెహోవా, యేసు గురించి ఈ ఉపమానం మీకేమి నేర్పిస్తుంది?

7 రెండవదిగా, ఈ ఉపమానం ద్వారా యేసు చెప్పిన పాఠాన్ని అర్థంచేసుకుంటే, మనం చేస్తున్న సేవకు మొదట్లో అంతగా ఫలితాలు రాకపోయినా నీరుగారిపోకుండా ఓపిగ్గా ఉంటాం. (యాకో. 5:7, 8) విద్యార్థికి సహాయం చేయడానికి మనం చేయగలిగినదంతా చేసినా, అతని హృదయంలో సత్యం వృద్ధి కాకపోతే మనం సరిగ్గా బోధించలేదని కాదు. ఎవరైతే వినయంగా మార్పులు చేసుకోవడానికి ఇష్టపడతారో, వాళ్ల హృదయాల్లోనే సత్యపు విత్తనాలు మొలకెత్తేలా యెహోవా చేస్తాడు. (మత్త. 13:23) అందుకే, కేవలం ఫలితాలు చూసి మన పరిచర్య గురించి ఒక అభిప్రాయానికి వచ్చేయకూడదు. మనం చెప్పేదానికి ప్రజలు ఎలా స్పందిస్తున్నారు అనే దాన్నిబట్టి యెహోవా మన పరిచర్యకు విలువకట్టడు. ఫలితాలను కాదుగానీ నమ్మకంగా మనం చేస్తున్న కృషినే ఆయన అమూల్యంగా ఎంచుతాడు.—లూకా 10:17-20; 1 కొరింథీయులు 3:8 చదవండి.

8 మూడవదిగా, ఒక వ్యక్తి హృదయంలో వస్తున్న మార్పులను మనం ప్రతీసారి గుర్తించలేం. ఉదాహరణకు, ఒక జంట తమతో కొంతకాలంగా బైబిలు అధ్యయనం చేస్తున్న మిషనరీ దగ్గరకు వచ్చి, తాము ప్రచారకులు అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. అలా అవ్వాలనుకుంటే ముందు పొగతాగడం మానేయమని మిషనరీ ఆ జంటకు గుర్తుచేశాడు. అయితే కొన్ని నెలల క్రితమే ఆ అలవాటును మానేశామని వాళ్లు చెప్పినప్పుడు ఆ సహోదరుడు ఆశ్చర్యపోయాడు. వాళ్లు ఎందుకు మానేశారు? ఎందుకంటే, రహస్యంగా పొగతాగినా యెహోవా చూడగలడనీ ఆయన వేషధారణను అసహ్యించుకుంటాడనీ వాళ్లు అర్థం చేసుకున్నారు. కాబట్టి, తాగితే మిషనరీ ఎదురుగా తాగాలి లేదంటే పూర్తిగా మానేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. యెహోవా మీద చిగురించిన ప్రేమవల్ల వాళ్లు సరైన నిర్ణయం తీసుకోగలిగారు. ఆ మార్పును మిషనరీ గమనించకపోయినా, వాళ్లు మాత్రం మార్పులు చేసుకుని ఆధ్యాత్మికంగా అభివృద్ధి సాధించారు.

వల

9. వల గురించి యేసు చెప్పిన ఉపమాన అర్థమేమిటి?

9 మత్తయి 13:47-50 చదవండి. వల గురించి యేసు చెప్పిన ఉపమాన అర్థం ఏమిటి? మనుష్యులందరికీ రాజ్య సందేశం ప్రకటించడాన్ని సముద్రంలోకి ఒక పెద్ద వల వేయడంతో యేసు పోల్చాడు. వలలో “నానావిధములైన చేపలు” పడినట్లే మన ప్రకటనా పనికి కూడా అన్నిరకాల ప్రజలు లక్షల సంఖ్యలో ఆకర్షితులౌతున్నారు. (యెష. 60:5) ప్రతీ సంవత్సరం మన సమావేశాలకు, జ్ఞాపకార్థ ఆచరణకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవ్వడమే దానికి రుజువు. వాళ్లలో “మంచి” చేపల్లాంటి కొంతమంది ప్రజలు క్రైస్తవ సంఘ సభ్యులౌతున్నారు. మరికొంతమంది ప్రజలు “చెడ్డ” చేపల్లాంటివాళ్లు, వాళ్లను యెహోవా అంగీకరించడు.

మత్తయి 13:47-50 చదివిన తర్వాత. . .

10. వల గురించిన ఉపమానం ద్వారా యేసు ఏమి సూచించాడు?

10 యేసు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? ఈ ఉపమానంలో చేపల్ని వేరుచేయడం, మహాశ్రమల కాలంలో జరిగే చివరితీర్పును సూచించడం లేదుగానీ, అంత్యదినాల్లో జరిగేదాన్ని సూచిస్తుంది. సత్యం వైపు ఆకర్షితులైన వాళ్లలో అందరూ యెహోవా సేవకులు అవ్వరని యేసు సూచించాడు. మన కూటాలకు వస్తున్నవాళ్లలో లేదా బైబిలు అధ్యయనం చేస్తున్నవాళ్లలో చాలామంది యెహోవాకు సమర్పించుకోవడానికి ముందుకు రావడంలేదు. (1 రాజు. 18:21) ఇంకొంతమందైతే కూటాలకు రావడం కూడా మానేశారు. కొంతమంది పిల్లలు క్రైస్తవ కుటుంబంలో పెరిగినా, యెహోవా ఆజ్ఞల పట్ల ప్రేమ పెంచుకోలేదు. ఏదేమైనా, ఎవరికివాళ్లే నిర్ణయం తీసుకోవాలని యేసు నొక్కి చెప్పాడు. సరైన నిర్ణయం తీసుకునేవాళ్లను యెహోవా ‘అన్యజనులందరియొక్క ఇష్టవస్తువులుగా’ లేదా విలువైనవాళ్లగా చూస్తాడు.—హగ్గ. 2:7.

. . .ఆ మాటలు మనకాలానికి ఎలా వర్తిస్తాయో ఆలోచించండి

11, 12. (ఎ) ఈ ఉపమానం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? (బి) యెహోవా, యేసు గురించి ఈ ఉపమానం మీకేమి నేర్పిస్తుంది?

11 ఈ ఉపమానం నుండి మనం ఎలా ప్రయోజనం పొందవచ్చు? యేసు ఈ ఉపమానం ద్వారా చెప్పిన పాఠాన్ని అర్థం చేసుకుంటే, బైబిలు విద్యార్థులుగానీ మన పిల్లల్లో ఒకరుగానీ సత్యాన్ని అంగీకరించకపోతే మనం మరీ ఎక్కువగా నిరాశపడం. కొన్నిసార్లు మనం ఎంత కృషి చేసినా వాళ్లు సత్యంలోకి రాకపోవచ్చు. బైబిలు అధ్యయనం చేసినంతమాత్రాన లేదా సత్యంలో పెరిగినంతమాత్రాన వాళ్లు యెహోవాకు స్నేహితులు అవుతారని చెప్పలేం. యెహోవా ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ఇష్టపడని వాళ్లు, చివరికి దేవుని ప్రజలనుండి దూరం అవుతారు.

సత్యానికి ఆకర్షితులైన వాళ్లలో కొంతమంది యెహోవా పక్షాన నిలబడతారు (9-12 పేరాలు చూడండి)

12 అంటే సత్యాన్ని విడిచిపెట్టినవాళ్లు సంఘానికి ఎప్పటికీ తిరిగిరాలేరని దానర్థమా? లేక, యెహోవాకు ఇంకా సమర్పించుకోనివాళ్లు ఎప్పటికీ ఆయనకు దగ్గరవ్వలేరనా? కాదు. మహాశ్రమలు మొదలయ్యేవరకు అలాంటివాళ్లకు అవకాశం ఉంది. ‘తిరిగి నా దగ్గరికి రండి, నేను తిరిగి మీ దగ్గరికి వస్తాను’ అని యెహోవా వాళ్లను ఆహ్వానిస్తున్నాడు. (మలా. 3:7, పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) యేసు ఇదే విషయాన్ని తప్పిపోయిన కుమారుని ఉపమానంలో కూడా నొక్కి చెప్పాడు.—లూకా 15:11-32 చదవండి.

తప్పిపోయిన కుమారుడు

13. తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమాన అర్థం ఏమిటి?

13 తప్పిపోయిన కుమారుని గురించి యేసు చెప్పిన ఉపమాన అర్థం ఏమిటి? ఈ ఉపమానంలోని జాలిగల తండ్రి, మన ప్రేమగల పరలోక తండ్రి యెహోవాను సూచిస్తున్నాడు. ఆస్తిలో తన భాగాన్ని ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టిన కుమారుడు, సంఘానికి దూరమైనవాళ్లను సూచిస్తున్నాడు. అలా వెళ్లడం ద్వారా వాళ్లు ‘దూరదేశానికి’ అంటే యెహోవా నుండి వేరైపోయిన సాతాను లోకంలోకి ప్రయాణిస్తున్నారు. (ఎఫె. 4:18; కొలొ. 1:21) అయితే కొంతమంది తాము చేసిన తప్పు తెలుసుకుని, మళ్లీ యెహోవా దగ్గరకు రావాలని కోరుకుంటారు. కానీ అందుకోసం కృషి అవసరం. అయితే వాళ్లు వినయం చూపిస్తూ, నిజంగా పశ్చాత్తాపపడుతున్నారు కాబట్టి, యెహోవా దేవుడు వాళ్లను క్షమించి సంతోషంగా ఆహ్వానిస్తున్నాడు.—యెష. 44:22; 1 పేతు. 2:25.

14. తప్పిపోయిన కుమారుని ఉపమానం ద్వారా యేసు ఏమి చెప్పాడు?

14 యేసు ఈ ఉపమానం ఎందుకు చెప్పాడు? తనకు దూరమైనవాళ్లు తిరిగి రావాలని యెహోవా ఎంతగా కోరుకుంటున్నాడో యేసు ఈ ఉపమానం ద్వారా చక్కగా చెప్పాడు. ఈ ఉపమానంలోని తండ్రి, తన కుమారుడు తిరిగి వస్తాడనే ఆశను ఎన్నడూ వదులుకోలేదు. తన కుమారుడు తిరిగి రావడం చూసి, ‘అతనింకా దూరంగా ఉండగానే’ తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆహ్వానించాడు. సత్యాన్ని విడిచిపెట్టిన వాళ్లు వెంటనే యెహోవా దగ్గరకు తిరిగొచ్చేలా ఈ ఉపమానం వాళ్లను కదిలించాలి. వాళ్లు దేవునికి చాలా దూరమై ఉండవచ్చు. తిరిగిరావడం అవమానమని, కష్టమని కూడా వాళ్లు అనుకుంటుండవచ్చు. కానీ అలా రావడం వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. వాళ్లు తిరిగొచ్చినప్పుడు యెహోవా, యేసు, దేవదూతలు ఎంతో సంతోషిస్తారు.—లూకా 15:7.

15, 16. (ఎ) తప్పిపోయిన కుమారుని ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? కొన్ని అనుభవాలు చెప్పండి. (బి) యెహోవా, యేసు గురించి ఈ ఉపమానం మీకేమి నేర్పిస్తుంది?

15 తప్పిపోయిన కుమారుని ఉపమానం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? మనం కూడా యెహోవాలా ప్రేమ చూపించాలి. పశ్చాత్తాపంతో సంఘానికి తిరిగొచ్చిన వాళ్లను ఆహ్వానించలేనంత ‘అతి నీతిమంతులుగా’ మనం ఉండకూడదు. అలావుంటే యెహోవాతో మన స్నేహం పూర్తిగా దెబ్బతింటుంది. (ప్రసం. 7:16) మనం మరో పాఠాన్ని కూడా నేర్చుకుంటాం. సంఘానికి దూరమైన వాళ్లను ‘తప్పిపోయిన గొర్రెల్లా’ చూడాలేగానీ వాళ్లు ఎప్పటికీ తిరిగిరారని అనుకోకూడదు. (కీర్త. 119:176) సంఘానికి దూరమైన వాళ్లను మనం కలిస్తే, వాళ్లు తిరిగొచ్చేలా ప్రేమతో సహాయం చేస్తామా? అలాగే, తగిన సహాయం అందించేలా ఆ విషయాన్ని వెంటనే సంఘ పెద్దలకు చెప్తామా? తప్పిపోయిన కుమారుని ఉపమానం ద్వారా యేసు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని, దాన్ని పాటిస్తే తప్పకుండా అలాంటి సహాయం చేస్తాం.

16 పశ్చాత్తాపంతో తిరిగొచ్చేవాళ్లు తమపట్ల యెహోవా కనికరం చూపించినందుకు, సహోదరసహోదరీలు ప్రేమతో మద్దతిచ్చినందుకు ఎంతో కృతజ్ఞత చూపిస్తారు. బహిష్కరించిన 25 సంవత్సరాల తర్వాత సంఘానికి తిరిగొచ్చిన ఒక సహోదరుడు ఏమంటున్నాడంటే, “యెహోవా నాకు ‘విశ్రాంతి కాలాలు’ ఇచ్చాడు కాబట్టి సంఘానికి తిరిగొచ్చినప్పటి నుండి రోజురోజుకీ నా సంతోషం పెరుగుతోంది. (అపొ. 3:19) సంఘంలోని వాళ్లందరూ ఎంతో మద్దతిస్తూ ప్రేమిస్తున్నారు. ఇప్పుడు నాకొక చక్కని ఆధ్యాత్మిక కుటుంబం ఉంది.” అలాగే, సంఘానికి దూరమై 5 ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన ఓ యువ సహోదరి ఇలా చెబుతోంది, “యేసు చెప్పిన నిజమైన ప్రేమను సహోదరసహోదరీలు నా మీద స్పష్టంగా చూపించినప్పుడు నాకెలా అనిపించిందో మాటల్లో చెప్పలేను. యెహోవా సంస్థలో ఉండడం అమూల్యమైన అవకాశం!”

17, 18. (ఎ) మనం పరిశీలించిన మూడు ఉపమానాల నుండి ఏ పాఠాలు నేర్చుకున్నాం? (బి) మనమేమని నిర్ణయించుకోవాలి?

17 ఈ మూడు ఉపమానాల నుండి మనకు ఉపయోగపడే ఏ పాఠాలను నేర్చుకున్నాం? మొదటిది, బైబిలు విద్యార్థుల ఆధ్యాత్మిక ప్రగతి మన చేతుల్లో ఉండదని మనం గుర్తుంచుకోవాలి. అది యెహోవా పని. రెండవది, మన కూటాలకు వచ్చేవాళ్లలో, బైబిలు అధ్యయనం చేసేవాళ్లలో అందరూ సత్యాన్ని అంగీకరిస్తారని ఆశించలేం. చివరగా, కొంతమంది యెహోవాకు దూరమైనా, వాళ్లు తిరిగొస్తారనే ఆశను మనం ఎప్పటికీ వదులుకోం. వాళ్లు తిరిగొచ్చినప్పుడు మనం కూడా యెహోవాలా ప్రేమతో ఆహ్వానిద్దాం.

18 కాబట్టి మనందరం జ్ఞానాన్ని, అవగాహనను, తెలివిని సంపాదించుకుంటూ ఉందాం. యేసు చెప్పిన ఉపమానాలను చదువుతున్నప్పుడు ఆ ఉపమానాల అర్థం ఏమిటో, వాటిని బైబిల్లో ఎందుకు నమోదు చేశారో, వాటి నుండి నేర్చుకున్న పాఠాలను మనం ఎలా పాటించవచ్చో, అవి యెహోవా, యేసు గురించి మనకేమి నేర్పిస్తున్నాయో ఆలోచిద్దాం. అలాచేస్తే మనం యేసు మాటలను గ్రహించామని చూపిస్తాం.