కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఈ లోక అంతాన్ని కలిసికట్టుగా తప్పించుకుందాం!

ఈ లోక అంతాన్ని కలిసికట్టుగా తప్పించుకుందాం!

“మనము ఒకరికొకరము అవయవములై యున్నాము.”—ఎఫె. 4:25.

1, 2. తన ఆరాధకులు ఎలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు?

 మీరు యెహోవాను సేవిస్తున్న యౌవనులా? అయితే, యెహోవా ప్రపంచవ్యాప్త సంస్థలో మీరు ముఖ్యమైన వాళ్లనే నమ్మకంతో ఉండండి. చాలా దేశాల్లో, బాప్తిస్మం తీసుకుంటున్న వాళ్లలో ఎక్కువమంది యౌవనులే. అలా ఎంతోమంది యువతీయువకులు యెహోవాను సేవించడానికి ముందుకురావడం చూస్తుంటే ఎంతో ప్రోత్సాహంగా అనిపిస్తుంది.

2 యౌవనులారా, మీ వయసు వాళ్లతో సమయం గడపడం మీకిష్టమేనా? అవునని మీరు చెప్పవచ్చు. అలా సరదాగా సమయం గడపడం ఆనందంగానే ఉంటుంది. కానీ, మనం ఏ వయసు వాళ్లమైనా, ఎలాంటి పరిస్థితుల మధ్య పెరిగినా మనందరం తనను ఐక్యంగా ఆరాధించాలన్నదే దేవుని కోరిక. “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని” దేవుడు కోరుకుంటున్నాడని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 తిమో. 2:3, 4) “ప్రతి జనములోనుండియు ప్రతి వంశములోనుండియు ప్రజలలోనుండియు, ఆయా భాషలు మాటలాడువారిలో నుండియు” వచ్చినవాళ్లు దేవుణ్ణి ఆరాధిస్తారని ప్రకటన 7:9 చెబుతోంది.

3, 4. (ఎ) లోకంలోని చాలామంది యౌవనుల ప్రవర్తన ఎలా ఉంది? (బి) సంఘం ఎలా ఉండాలని ఎఫెసీయులు 4:25 లో పౌలు వివరించాడు?

3 యెహోవాను సేవిస్తున్న యౌవనులకూ ఈ లోకంలోని యౌవనులకూ ఎంత తేడా ఉందో కదా! యెహోవాను సేవించని చాలామంది యౌవనులు తమకు నచ్చిందే చేస్తూ, తమ కోసమే బ్రతుకుతున్నారు. నిజానికి ఇప్పుడున్న యౌవనులు అంతకు ముందుకన్నా చాలా స్వార్థంగా తయారయ్యారని కొంతమంది పరిశోధకులు చెబుతున్నారు. వాళ్లు మాట్లాడే పద్ధతి, వేసుకునే బట్టలు ఇతరులపై ముఖ్యంగా పెద్దవాళ్లపై ఏమాత్రం గౌరవం లేదని చూపిస్తున్నాయి.

4 మనచుట్టూ అలాంటివాళ్లే ఉన్నారు. కాబట్టి, అలాంటి ఆలోచనా విధానానికి దూరంగా ఉంటూ, యెహోవాను సంతోషపెట్టాలంటే క్రైస్తవ యువతీయువకులు ఎంతో కృషి చేయాలి. మొదటి శతాబ్దంలో కూడా ఆ సమస్య ఉండేది. అందుకే, “అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి” దూరంగా ఉండమని పౌలు తోటి విశ్వాసులను ప్రోత్సహించాడు. వాళ్లు ఒకప్పుడు దానిప్రకారం ‘నడుచుకున్నారు.’ (ఎఫెసీయులు 2:1-3 చదవండి.) అలాంటి ప్రవర్తనకు దూరంగా ఉంటూ, సహోదరసహోదరీలతో కలిసి ఐక్యంగా పనిచేస్తున్న యౌవనుల్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే “మనము ఒకరికొకరము అవయవములై యున్నాము” అని పౌలు చెప్పిన మాటల్ని వాళ్లు అర్థం చేసుకున్నారు. (ఎఫె. 4:25) ఈ పాత లోకం అంతానికి దగ్గరౌతున్న కొద్దీ, మన సహోదరసహోదరీలతో కలిసి ఐక్యంగా పనిచేయడం మరింత ప్రాముఖ్యం. కలిసికట్టుగా ఉండడం ఎందుకు ప్రాముఖ్యమో చూపించే కొన్ని బైబిలు ఉదాహరణలు ఇప్పుడు పరిశీలిద్దాం.

వాళ్లు కలిసికట్టుగా ఉన్నారు

5, 6. లోతు, ఆయన కుటుంబం నుండి మనం ఏమి నేర్చుకుంటాం?

5 కష్టాలు వచ్చినప్పుడు తన ప్రజలు కలిసికట్టుగా ఉంటూ, ఒకరికొకరు సహాయం చేసుకున్నప్పుడు యెహోవా వాళ్లను కాపాడాడు. చిన్నవాళ్లయినా, పెద్దవాళ్లయినా దేవుని సేవకులందరూ ఆ బైబిలు ఉదాహరణలనుండి ఎంతో నేర్చుకోవచ్చు. ముందుగా లోతు ఉదాహరణను చూద్దాం.

6 లోతు, ఆయన కుటుంబం ఉంటున్న సొదొమ అనే పట్టణాన్ని నాశనం చేయాలని యెహోవా నిర్ణయించాడు. దాంతో వాళ్లు ప్రమాదంలో చిక్కుకున్నారు. అప్పుడు దేవుడు తన దూతల్ని పంపి, ఆ పట్టణాన్ని విడిచిపెట్టి పర్వత ప్రాంతానికి వెళ్లమని లోతును హెచ్చరించాడు. ఆ దూతలు లోతుతో “నీ ప్రాణమును దక్కించుకొనునట్లు పారిపొమ్ము” అని చెబుతూ ఆయనను బలవంతపెట్టారు. (ఆది. 19:12-22) లోతు, ఆయన ఇద్దరు కూతుళ్లు దూతలు చెప్పినట్లు చేశారు. అయితే, లోతుకు కాబోయే అల్లుళ్లు మాత్రం ఆ మాటలు నమ్మలేదు. లోతు తన “అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయువానివలె నుండెను.” కాబట్టి వాళ్లు ప్రాణాలు పోగొట్టుకున్నారు. (ఆది. 19:14) కేవలం లోతు, ఆయనతోపాటు ఉన్న ఇద్దరు కూతుళ్లు మాత్రమే బతికి బయటపడ్డారు.

7. ఐగుప్తునుండి వచ్చేటప్పుడు ఐక్యంగా ఉన్న ఇశ్రాయేలీయులకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

7 మరో ఉదాహరణ చూడండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తునుండి వచ్చేటప్పుడు ఎవరికివాళ్లే గుంపులుగుంపులుగా విడిపోయి, ఇష్టమొచ్చిన దారిలో వెళ్లలేదు. ‘మోషే సముద్రం మీద తన చెయ్యి చాపినప్పుడు’ యెహోవా సముద్రాన్ని రెండు పాయలుగా విడగొట్టాడు. అప్పుడు మోషే ఒంటరిగానో లేదా కేవలం కొంతమంది ఇశ్రాయేలీయులతోనో ఆ సముద్రాన్ని దాటలేదు. బదులుగా, దేవుని సహాయంతో ఇశ్రాయేలు సమాజమంతా దాన్ని సురక్షితంగా దాటింది. (నిర్గ. 14:21, 22, 29, 30) వాళ్లందరూ కలిసికట్టుగా వెళ్లారు, ఇశ్రాయేలీయులుకాని “అనేకులైన అన్యజనుల సమూహము” కూడా వాళ్లతోపాటు వెళ్లింది. (నిర్గ. 12:38) ఆ సందర్భంలో, కొంతమంది వ్యక్తులు బహుశా యువతీయువకులు తమకు నచ్చిన దారిలో వెళ్లుంటే ఆపదలో చిక్కుకునేవాళ్లు. వాళ్లు యెహోవా రక్షణను పొందలేకపోయేవాళ్లు.—1 కొరిం. 10:1.

8. యెహోషాపాతు కాలంలో దేవుని ప్రజలు ఎలా కలిసికట్టుగా ఉన్నారు?

8 యెహోషాపాతు రాజు కాలంలో, దేవుని ప్రజలు భయంకరమైన శత్రువును ఎదుర్కొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలనుండి “గొప్ప సైన్యం” వాళ్లమీదకు వచ్చింది. (2 దిన. 20:1, 2) అయితే మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాళ్లు ఆ శత్రువును తమ సొంత శక్తితో ఓడించాలని ప్రయత్నించలేదు. బదులుగా వాళ్లు యెహోవా సహాయం కోసం ప్రార్థించారు. (2 దినవృత్తాంతములు 20:3, 4 చదవండి.) అయితే ఎవరికివాళ్లు సొంతంగా, తమకు తోచినట్లు ఆ పని చేయలేదు. “యూదావారందరును తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలువబడిరి” అని బైబిలు చెబుతుంది. (2 దిన. 20:13) చిన్నాపెద్దా అనే తేడా లేకుండా వాళ్లందరూ కలిసి యెహోవా నిర్దేశాన్ని నమ్మకంగా పాటించడానికి కృషి చేశారు, దాంతో ఆ శత్రువునుండి యెహోవా వాళ్లను కాపాడాడు. (2 దిన. 20:20-27) దేవుని ప్రజలు కష్టాల్ని ఎలా ఎదుర్కోవాలో ఈ ఉదాహరణ చక్కగా చూపిస్తుంది.

9. తొలి క్రైస్తవుల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

9 తొలి క్రైస్తవులు కూడా ఐక్యంగా పనిచేశారు. ఉదాహరణకు, చాలామంది యూదులు, యూదులు కానివాళ్లు క్రైస్తవులుగా మారిన తర్వాత వాళ్లందరూ ఒకే రకమైన బోధల్ని పాటించారు. వాళ్లు కలిసి సమయం గడిపారు, కలిసి భోజనం చేశారు, కలిసి ప్రార్థించారు. (అపొ. 2:42) ముఖ్యంగా, హింసలు వచ్చినప్పుడు వాళ్లు ఐక్యంగా ఉన్నారు. వాళ్లకు ఒకరి సహాయం ఒకరికి నిజంగా అవసరమైంది అలాంటప్పుడే. (అపొ. 4:23, 24) కష్టాలు వచ్చినప్పుడు కలిసికట్టుగా ఉండడం చాలా ముఖ్యమని మీరు ఒప్పుకోరా?

యెహోవా దినం దగ్గరయ్యేకొద్దీ ఐక్యంగా ఉండండి

10. దేవుని ప్రజలు ముఖ్యంగా ఎప్పుడు ఐక్యంగా ఉండాలి?

10 లోకం ఇంతకు ముందెప్పుడూ చూడని కష్టకాలం త్వరలో రాబోతుంది. యోవేలు ప్రవక్త దాన్ని ‘అంధకారం, మహాంధకారం గల దినం’ అని వర్ణించాడు. (యోవే. 2:1, 2; జెఫ. 1:14) అయితే అప్పుడు దేవుని ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలి. యేసు చెప్పిన ఈ మాటల్ని గుర్తుతెచ్చుకోండి, “తనకుతానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును.”—మత్త. 12:25.

11. కీర్తన 122:3, 4 లో ఉన్న ఏ పోలిక నేటి దేవుని ప్రజలకు వర్తిస్తుంది? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 మనం ఎంత ఐక్యంగా ఉండాలి? ప్రాచీన యెరూషలేములోని ఇళ్లను కట్టే విధానం నుండి మనం ఓ పాఠం నేర్చుకోవచ్చు. ఆ ఇళ్లను ఎంత దగ్గరదగ్గరగా కట్టేవాళ్లంటే, కీర్తనకర్త యెరూషలేమును “ఒకే ఐక్యపట్టణం” అని పిలిచాడు. దానివల్ల అక్కడుండేవాళ్లు ఒకరికొకరు సహాయం చేసుకోవడం, కాపాడుకోవడం వీలయ్యేది. అంతేకాదు, వాళ్లలా దగ్గరదగ్గరగా నివసించడం, ‘యెహోవా గోత్రాలన్నీ’ ఆరాధన కోసం సమకూడినప్పుడు ఆ గోత్రాల మధ్య ఉండే ఐక్యతను సూచించింది. (కీర్తన 122:3, 4 చదవండి.) ఇప్పుడూ అలాగే రాబోయే కష్టకాలాల్లోనూ, మనం కూడా అలా ఐక్యంగా ఉండాలి.

12. దేవుని ప్రజల మీద జరగబోయే దాడి నుండి బయటపడాలంటే మనం ఏమి చేయాలి?

12 ఆ సమయంలో మనం ‘ఐక్యంగా’ ఉండడం ఎందుకంత ప్రాముఖ్యం? దేవుని ప్రజల మీద “మాగోగు దేశపువాడగు గోగు” చేయబోయే దాడి గురించి యెహెజ్కేలు 38వ అధ్యాయం చెబుతుంది. ఆ సమయంలో మన ఐక్యతను దెబ్బతీసే దేన్నీ చేయకుండా మనం జాగ్రత్తపడాలి. సహాయం కోసం మనం లోకం వైపు అస్సలు చూడకూడదు. బదులుగా, మన సహోదరసహోదరీలకు సన్నిహితంగా ఉండాలి. అయితే, మనం వాళ్లతో కలిసుండడం మాత్రమే సరిపోదు కానీ యెహోవాపై విశ్వాసం ఉంచి, ఆయనకు లోబడినప్పుడే ప్రాణాలు కాపాడుకుంటాం. అప్పుడే యెహోవా, యేసుక్రీస్తు ఆ దాడి నుండి మనల్ని కాపాడి, సురక్షితంగా నూతనలోకంలోకి నడిపిస్తారు. (యోవే. 2:32; మత్త. 28:20) అయితే, మనం దేవుని ప్రజలతో ఐక్యంగా ఉండడం తప్పనిసరి. తమకు నచ్చిన దారిలో వెళ్లాలనుకునే వాళ్లను యెహోవా కాపాడతాడని మీరనుకుంటున్నారా?—మీకా 2:12.

13. ఇప్పటివరకు మనం పరిశీలించిన వాటినుండి యౌవనులు ఏమి నేర్చుకోవచ్చు?

13 యౌవనులారా, తోటి సహోదరసహోదరీలతో ఐక్యంగా ఉండడం ఎందుకు ముఖ్యమో అర్థం చేసుకున్నారా? మీ వయసు వాళ్లతో మాత్రమే సమయం గడుపుతూ, ఇతరులకు దూరంగా ఉండాలని ప్రయత్నించకండి. యౌవనులమైనా, పెద్దవాళ్లమైనా మనం ఒకరికొకరం నిజంగా అవసరమయ్యే పరిస్థితులు త్వరలో రాబోతున్నాయి. కాబట్టి సహోదరసహోదరీలతో కలిసి ఎలా పనిచేయాలో, ఐక్యంగా ఎలా ఉండాలో మీరు ఇప్పుడే నేర్చుకోండి. అలా చేస్తేనే మీ ప్రాణాల్ని కాపాడుకుంటారు.

“ఒకరికొకరము అవయవములై యున్నాము”

14, 15. (ఎ) ఐక్యంగా ఉండేలా యెహోవా మనకు ఎందుకు శిక్షణ ఇస్తున్నాడు? (బి) యెహోవా మనల్ని ఏమని ప్రోత్సహిస్తూ ఐక్యంగా ఉండేలా సహాయం చేస్తున్నాడు?

14 మనం ‘ఏక మనసుతో ఆయనను’ సేవించేలా యెహోవా సహాయం చేస్తున్నాడు. (జెఫ. 3:8, 9) యెహోవా భవిష్యత్తులో “సమస్తమును క్రీస్తునందు ఏకముగా” సమకూరుస్తాడు, దానికోసం మనకు ఇప్పటి నుండే శిక్షణ ఇస్తున్నాడు. (ఎఫెసీయులు 1:8-10 చదవండి.) అవును, పరలోకంలోనూ భూమ్మీదా ఉన్న వాళ్లందరూ ఒకే కుటుంబంగా తనను ఆరాధించాలన్నది యెహోవా కోరిక. అది తప్పకుండా నెరవేరుతుంది. యౌవనులారా, మీరూ ఆ కుటుంబంలో సభ్యులుగా ఉండవచ్చు. మరి యెహోవా సంస్థతో ఐక్యంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా?

15 మనం ఇప్పుడే ఐక్యంగా ఉండేలా యెహోవా మనకు శిక్షణ ఇస్తున్నాడు. దానివల్ల మనం కొత్త లోకంలో అందరితో సమాధానంగా జీవించగలుగుతాం. ‘ఒకరినొకరు పరామర్శించుకోమని,’ ‘ఒకనియందొకడు అనురాగముగల వారై ఉండమని,’ ‘ఒకనినొకడు ఆదరించుకోమని,’ ‘ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగజేసుకోమని’ లేఖనాలు మనకు పదేపదే చెబుతున్నాయి. (1 కొరిం. 12:24, 25; రోమా. 12:10; 1 థెస్స. 4:18; 5:11) మనం అపరిపూర్ణులం కాబట్టి ఐక్యంగా ఉండడం మనకు కొన్నిసార్లు కష్టమౌతుందని యెహోవాకు తెలుసు. అందుకే మనం మనస్ఫూర్తిగా ‘ఒకరినొకరం క్షమించుకోవాలి.’—ఎఫె. 4:32.

16, 17. (ఎ) క్రైస్తవ కూటాలను ఏర్పాటు చేయడానికి ఒక కారణం ఏమిటి? (బి) యేసు నుండి యౌవనులు ఏమి నేర్చుకోవచ్చు?

16 ఐక్యంగా ఎలా ఉండాలో యెహోవా క్రైస్తవ కూటాల ద్వారా కూడా నేర్పిస్తున్నాడు. హెబ్రీయులు 10:24, 25 వచనాల్లో ఉన్న ప్రోత్సాహాన్నిచ్చే మాటల్ని మనం తరచూ చదువుతాం. వాటిని ఏర్పాటు చేయడానికి ఒక కారణం, ‘ప్రేమచూపేలా సత్కార్యాలు చేసేలా ఒకరినొకరు పురికొల్పుకోవడం.’ అయితే ‘ఒకనినొకడు హెచ్చరించుచు [“ప్రోత్సహించుకుంటూ,” NW], ఆ దినము సమీపించుట చూసేకొద్దీ మరి ఎక్కువగా అలా చేయడం’ చాలా ప్రాముఖ్యం.

17 యేసు చిన్నతనంలో అలాంటి కూటాలను విలువైనవిగా చూస్తూ చక్కని ఆదర్శం ఉంచాడు. 12 ఏళ్లప్పుడు ఆయన తల్లిదండ్రులతోపాటు దేవాలయంలో ఒక పెద్ద కూటానికి వెళ్లాడు. అప్పుడు, ఒక సమయంలో యేసు కనిపించక తల్లిదండ్రులు ఆయన కోసం వెదికారు. ఆయన మిగతా పిల్లలతోపాటు ఆడుకోవడానికి వెళ్లాడా? లేదు. ఆయన దేవాలయంలోని బోధకులతో బైబిలు విషయాలు మాట్లాడుతూ తన తల్లిదండ్రులకు కనిపించాడు.—లూకా 2:45-47.

18. మన ప్రార్థనలు ఐక్యతకు ఎలా దోహదం చేస్తాయి?

18 ఒకరిపట్ల ఒకరు ప్రేమను పెంచుకుంటూ, క్రైస్తవ కూటాలకు వెళ్లడంతో పాటు, మనం ఒకరి గురించి ఒకరం ప్రార్థించడం ద్వారా కూడా ఐక్యతను పెంచుకోవచ్చు. మన సహోదరసహోదరీలు ఎదుర్కొనే సమస్యలను ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రస్తావించడం ద్వారా, వాళ్లమీద మనకు శ్రద్ధ ఉందని చూపిస్తాం. యౌవనులారా, ఈ ఏర్పాట్లను పూర్తిగా ఉపయోగించుకుంటూ సంఘంలోని సహోదరసహోదరీలకు మీరు మరింత దగ్గరౌతున్నారా? ఈ లోక అంతాన్ని తప్పించుకోవాలంటే మనం సాతాను లోకానికి కాదుగానీ మన సహోదరసహోదరీలకు దగ్గరగా ఉండాలి.

మనమందరం తోటి సహోదరసహోదరీల గురించి ప్రార్థించవచ్చు (18వ పేరా చూడండి)

‘మనం ఒకరికొకరం అవయవములమై ఉన్నామని’ చూపిద్దాం

19-21. (ఎ) ‘మనం ఒకరికొకరం అవయవములమై ఉన్నామని’ ముఖ్యంగా ఎలా చూపిస్తాం? ఉదాహరణలు చెప్పండి. (బి) విపత్తులు వచ్చినప్పుడు కొంతమంది సహోదరసహోదరీలు ఏమి చేశారు? దాని నుండి మీరు ఏమి నేర్చుకోవచ్చు?

19 ‘మనం ఒకరికొకరం అవయవములమై ఉన్నాము’ అని చెబుతున్న రోమీయులు 12:4, 5లోని మాటలకు అనుగుణంగా యెహోవా ప్రజలు ఇప్పటికే జీవిస్తున్నారు. విపత్తులు వచ్చినప్పుడు దానికి సంబంధించిన రుజువులు చూడవచ్చు. 2011 డిసెంబరులో, ఫిలిప్పీన్స్‌ దీవుల్లో ఒకటైన మిండనావోలో తుఫానువల్ల తీవ్రమైన వరదలు వచ్చాయి. చాలామంది సహోదరసహోదరీల ఇళ్లతోపాటు, 40,000 కన్నా ఎక్కువ ఇళ్లు రాత్రికిరాత్రే మునిగిపోయాయి. అయితే, స్థానిక సహాయక బృందాలు సహాయం చేయడానికి ముందే, “వేరే ప్రాంతాల్లోని సహోదరసహోదరీలు తమ వంతు సహాయాన్ని పంపించడం మొదలుపెట్టారు” అని అక్కడి బ్రాంచి కార్యాలయం చెప్పింది.

20 అలాగే, తూర్పు జపాన్‌లో వచ్చిన పెద్ద భూకంపం, సునామీ వల్ల చాలామంది సహోదరసహోదరీలు బాగా నష్టపోయారు. కొంతమందైతే దాదాపు ఉన్నదంతా కోల్పోయారు. తమ రాజ్యమందిరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటున్న యోషీకో అనే సహోదరి ఇల్లు నాశనమైంది. ఆమె ఇలా చెబుతుంది, “భూకంపం వచ్చిన తర్వాతి రోజే ప్రాంతీయ పర్యవేక్షకుడు, మరో సహోదరుడు మమ్మల్ని వెతుక్కుంటూ రావడం చూసి ఆశ్చర్యపోయాం.” చిరునవ్వుతో ఆమె ఇంకా ఏమంటుందంటే, “సంఘం ద్వారా సమృద్ధిగా మా ఆధ్యాత్మిక అవసరాలను తీర్చినందుకు మేము నిజంగా సంతోషించాం. అంతేకాక మాకు బట్టలు, బూట్లు, బ్యాగులు ఇచ్చారు.” విపత్తు సహాయక బృందంలోని ఓ సహోదరుడు ఇలా అంటున్నాడు, “జపాన్‌ అంతటా ఉన్న సహోదరసహోదరీలు కలిసికట్టుగా ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. కొంతమందైతే అమెరికా నుండి కూడా వచ్చారు. అంతదూరం నుండి ఎందుకొచ్చారని అడిగినప్పుడు వాళ్లిలా అన్నారు, ‘మేమూ జపాన్‌లోని మా సహోదరసహోదరీలూ అంతా ఒక్కటే, వాళ్లిప్పుడు కష్టాల్లో ఉన్నారు.’” తన సభ్యుల పట్ల అంతలా శ్రద్ధ తీసుకునే సంస్థలో ఉన్నందుకు మీకు గర్వంగా లేదా? అలాంటి ఐక్యతను చూసి యెహోవా ఎంతో సంతోషిస్తాడని మీరు నమ్మకంతో ఉండవచ్చు.

21 ఒకరిమీద ఒకరం ఆధారపడడం ఇప్పుడే నేర్చుకుంటే, భవిష్యత్తులో వచ్చే కష్టాల్ని కలిసికట్టుగా ఎదుర్కోగలుగుతాం. వేరే దేశాల్లోని సహోదరసహోదరీలతో మన సంబంధాలు తెగిపోయినా, స్థానిక సాక్షులతో ఐక్యంగా ఉంటూ వాటిని ఎదుర్కొంటాం. జపాన్‌లో తుఫాను వల్ల నష్టపోయిన ఫూమీకో ఏం చెబుతుందంటే, “అంతం చాలా దగ్గర్లో ఉంది. ఎలాంటి విపత్తులు ఉండని రోజు కోసం ఎదురుచూస్తున్న మనం తోటి విశ్వాసులకు సహాయం చేస్తూనే ఉండాలి.”

22. ఐక్యంగా ఉంటే మనం భవిష్యత్తులో ఏ ప్రయోజనం పొందుతాం?

22 కాబట్టి సహోదరసహోదరీలతో ఐక్యంగా ఉండడానికి చేయగలిగినదంతా చేస్తూ, యెహోవా దినం కోసం ఇప్పుడే సిద్ధపడండి. యెహోవా తన ప్రజల్ని ఇంతకుముందు రక్షించినట్లే, సాతాను దుష్టలోకం అంతమైనప్పుడు కూడా రక్షిస్తాడు. (యెష. 52:9, 10) మీరు యౌవనులైనా, పెద్దవాళ్లయినా రక్షణ పొందాలంటే దేవుని ప్రజలతో ఐక్యంగా ఉండాలి. తర్వాతి ఆర్టికల్‌లో, మనం ఇప్పటికే పొందిన వాటిపట్ల ఎందుకు కృతజ్ఞత చూపించాలో తెలుసుకుందాం.