కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యేసులా ధైర్యం, వివేచన చూపించండి

యేసులా ధైర్యం, వివేచన చూపించండి

‘మీరు ఆయనను చూడకపోయినా ప్రేమించుచున్నారు; ఇప్పుడు ఆయనను కన్నులార చూడకపోయినా విశ్వసించుచున్నారు.’ —1 పేతు. 1:8, 9.

1, 2. (ఎ) మనం నిత్యజీవాన్ని ఎలా సొంతం చేసుకోవచ్చు? (బి) మనం నిత్యజీవ మార్గంలో ప్రయాణాన్ని కొనసాగించాలంటే ఏమి చేయాలి?

 క్రీస్తుకు శిష్యులమైనప్పుడు మనం ఓ ప్రయాణాన్ని మొదలుపెట్టాం. దేవునికి నమ్మకంగా ఉంటే మనం గమ్యాన్ని చేరుకుంటాం అంటే నిత్యజీవాన్ని సొంతం చేసుకుంటాం. “అంతమువరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును” అని యేసు చెప్పాడు. (మత్త. 24:13) మనం నిత్యజీవం పొందాలంటే, “అంతము” వరకూ అంటే మన జీవితాంతం వరకు లేదా ఈ దుష్టలోక అంతం వరకు నమ్మకంగా ఉండాలి. అయితే ఈ లోకంవల్ల మన దృష్టి మళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. (1 యోహా. 2:15-17) నిత్యజీవ మార్గంలో మన ప్రయాణాన్ని కొనసాగించాలంటే ఏమి చేయాలి?

2 మనం యేసు అడుగుజాడల్లో నడవాలి. యేసు ఆ మార్గంలో ఎలా ప్రయాణించాడో అంటే ఎలా జీవించాడో బైబిల్లో ఉంది. ఆ వివరాలు చదివితే యేసు ఎలాంటివాడో మనం అర్థం చేసుకుంటాం. అంతేకాక ఆయనను ప్రేమిస్తాం, ఆయన మీద విశ్వాసం ఉంచుతాం. (1 పేతురు 1:8, 9 చదవండి.) మనం ఆయన అడుగుజాడల్లో నడిచేలా యేసు మాదిరి ఉంచాడని అపొస్తలుడైన పేతురు అన్నాడు. (1 పేతు. 2:21) యేసు అడుగుజాడల్లో మనం జాగ్రత్తగా నడిస్తే, అంతం వరకూ సహించగలుగుతాం. a ముందటి ఆర్టికల్‌లో యేసు వినయాన్ని, కనికరాన్ని మనం ఎలా అనుకరించవచ్చో చూశాం. ఈ ఆర్టికల్‌లో మనం ఆయనలా ధైర్యాన్ని, వివేచనను ఎలా చూపించవచ్చో నేర్చుకుందాం.

యేసు ధైర్యం చూపించాడు

3. ధైర్యం అంటే ఏమిటి? దాన్ని మనమెలా పెంచుకుంటాం?

3 మనల్ని బలపర్చి, కష్టాల్ని తట్టుకునేలా సహాయం చేసేదే ధైర్యం. ధైర్యం ఉంటే సరైన దానికోసం స్థిరంగా నిలబడతాం. అంతేకాదు, కష్టాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి, దేవునికి నమ్మకంగా ఉండడానికి ధైర్యం సహాయం చేస్తుంది. ధైర్యం అనే లక్షణానికి భయంతో, నిరీక్షణతో, ప్రేమతో సంబంధం ఉంది. ఎలా? దేవున్ని నొప్పిస్తామేమో అనే భయం ఉంటే, మనం మనుషులకు భయపడం. (1 సమూ. 11:7; సామె. 29:25) బలమైన నిరీక్షణ వల్ల, మనం ప్రస్తుతం అనుభవించే కష్టాలపై కాకుండా భవిష్యత్తుపై మనసు నిలుపుతాం. (కీర్త. 27:14) నిస్వార్థమైన ప్రేమ ఉన్నప్పుడు, ఎన్ని హింసలు వచ్చినా ధైర్యంగా ఉంటాం. (యోహా. 15:13) దేవునిపై నమ్మకం ఉంచుతూ, ఆయన కుమారుని అడుగుజాడల్లో నడిస్తే మనం ధైర్యాన్ని పెంచుకుంటాం.—కీర్త. 28:7.

4. దేవాలయంలో యేసు ఎలా ధైర్యం చూపించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

4 యేసు 12 ఏళ్ల వయసులో కూడా ధైర్యం చూపించాడు. ఆయన ఓ సందర్భంలో ‘దేవాలయంలోని బోధకుల మధ్య కూర్చొని’ ఉన్నప్పుడు ఏమి జరిగిందో పరిశీలించండి. (లూకా 2:41-47 చదవండి.) ఆ యూదా మత బోధకులకు ధర్మశాస్త్రంతోపాటు యూదుల ఆచారాలు గురించి కూడా తెలుసు. ఆ ఆచారాలవల్లే, ధర్మశాస్త్రాన్ని పాటించడం ప్రజలకు చాలా కష్టమైంది. అయితే యేసు, ఆ బోధకుల జ్ఞానాన్ని చూసి భయపడిపోలేదు లేక మౌనంగా ఉండిపోలేదు. ఆయన వాళ్లను ‘ప్రశ్నలు అడుగుతూ’ ఉన్నాడు. అవి చిన్నపిల్లలు అడిగేలాంటి ప్రశ్నలు కాదు, బదులుగా అవి అక్కడున్న బోధకుల్ని సైతం ఆలోచింపజేశాయి. ఒకవేళ వాళ్లు వాదనలకు దారితీసే ప్రశ్నలు అడిగి యేసును తికమక పెట్టాలని ప్రయత్నించి ఉంటే, వాళ్ల ప్రయత్నం వృథా అయినట్లే. యేసుకున్న జ్ఞానాన్ని, ఆయనిచ్చిన జవాబుల్ని చూసి ఆ బోధకులతో సహా అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. అవును, దేవుని వాక్యంలోని సత్యాన్ని యేసు ధైర్యంగా సమర్థించాడు.

5. యేసు పరిచర్యలో ఎలా ధైర్యం చూపించాడు?

5 యేసు పరిచర్యలో కూడా అనేక విధాల్లో ధైర్యం చూపించాడు. ఉదాహరణకు, అబద్ధ బోధలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న మతనాయకుల్ని ఆయన నిలదీశాడు. (మత్త. 23:13-36) అంతేకాదు, ఈ లోక ప్రభావాలను ధైర్యంగా ఎదిరించాడు. (యోహా. 16:33) ఎంత వ్యతిరేకత ఉన్నా ప్రకటనా పనిని ఆపలేదు. (యోహా. 5:15-18; 7:14) యేసు రెండు సందర్భాల్లో, దేవాలయంలో సత్యారాధనను కలుషితం చేస్తున్నవాళ్లను ధైర్యంగా వెళ్లగొట్టాడు.—మత్త. 21:12, 13; యోహా. 2:14-17.

6. యేసు తన భూజీవితపు చివరిరాత్రి ఎలా ధైర్యం చూపించాడు?

6 యేసు తన భూజీవితంలోని చివరిరాత్రి ఎలా ధైర్యం చూపించాడో పరిశీలించండి. ఇస్కరియోతు యూదా తనను అప్పగించిన తర్వాత ఏమి జరుగుతుందో యేసుకు తెలుసు. అయినా యేసు పస్కా భోజన సమయంలో యూదాతో ఇలా అన్నాడు, “నీవు చేయుచున్నది త్వరగా చేయుము.” (యోహా. 13:21-27) గెత్సేమనే తోటలో తనను బంధించడానికి వచ్చినవాళ్లతో తానే యేసునని ధైర్యంగా చెప్పాడు. తన ప్రాణం ప్రమాదంలో ఉన్నా యేసు తన శిష్యులను కాపాడడానికి ప్రయత్నించాడు. (యోహా. 18:1-8) తనను చంపడానికి ప్రధాన యాజకుడు సాకులు వెదుకుతున్నాడని తెలిసినా తానే క్రీస్తునని, దేవుని కుమారుణ్ణని మహాసభలో యేసు ధైర్యంగా చెప్పాడు. (మార్కు 14:60-65) యేసు హింసాకొయ్యపై చనిపోయేంతవరకు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. అందుకే ఆయన తన చివరి శ్వాస విడుస్తూ “సమాప్తమైనది” అని చెప్పగలిగాడు.—యోహా. 19:28-30.

యేసులా ధైర్యం చూపించండి

7. యౌవనులారా, యెహోవా పేరును పెట్టుకున్నందుకు మీకేమనిపిస్తుంది? మీరు ధైర్యాన్ని ఎలా చూపించవచ్చు?

7 మనం యేసులా ధైర్యం ఎలా చూపించవచ్చు? స్కూల్‌లో/కాలేజ్‌లో. యౌవనులారా, మీ తోటి విద్యార్థులు లేదా ఇతరులు ఎగతాళి చేసినా, మీరు ఓ యెహోవాసాక్షి అని వాళ్లతో చెప్పడం ద్వారా ధైర్యం చూపిస్తారు. అలా మీరు యెహోవా పేరు పెట్టుకున్నందుకు గర్వపడుతున్నారని చూపిస్తారు. (కీర్తన 86:12 చదవండి.) పరిణామ సిద్ధాంతాన్ని నమ్మేలా కొంతమంది మిమ్మల్ని ఒత్తిడి చేయవచ్చు. అయితే సృష్టి గురించి బైబిలు చెప్తున్నది నిజమని నమ్మడానికి మీకు ఎన్నో కారణాలు ఉన్నాయి. ద ఆరిజన్‌ ఆఫ్‌ లైఫ్‌—ఫైవ్‌ క్వశ్చన్స్‌ వర్త్‌ ఆస్కింగ్‌ అనే బ్రోషురు ఉపయోగించి, ‘మీ నిరీక్షణ’ గురించి మిమ్మల్ని ప్రశ్నించేవాళ్లకు జవాబు చెప్పవచ్చు. b (1 పేతు. 3:15, 16) అప్పుడు మీరు, బైబిలు సత్యాన్ని ధైర్యంగా సమర్థించారనే సంతృప్తితో ఉంటారు.

8. ధైర్యంగా ప్రకటించడానికి మనకు ఏ కారణాలు ఉన్నాయి?

8 పరిచర్యలో. నిజ క్రైస్తవులమైన మనం “ప్రభువును [“యెహోవాను,” NW] ఆనుకొని ధైర్యముగా” మాట్లాడాలి. (అపొ. 14:3) మనం ఎందుకు ధైర్యంగా ప్రకటించవచ్చు? మొదటిగా, మనం ప్రకటించే సందేశానికి బైబిలే ఆధారం కాబట్టి అది సత్యమని మనకు తెలుసు. (యోహా. 17:17) రెండవది, మనం “దేవుని జతపనివారము.” ఆ పనిలో పరిశుద్ధాత్మ సహాయం కూడా మనకు ఉంటుంది. (1 కొరిం. 3:9; అపొ. 4:31) మూడవది, మనం యెహోవాను, ప్రజల్ని ప్రేమిస్తాం కాబట్టి సువార్త ప్రకటించడానికి చేయగలిగినదంతా చేస్తాం. (మత్త. 22:37-39) మనకు ధైర్యం ఉంది కాబట్టి ప్రకటిస్తూనే ఉంటాం. అబద్ధమత బోధల వల్ల గుడ్డివాళ్లైన లేదా మోసపోయిన ప్రజలకు సత్యం నేర్పించాలని మనం నిర్ణయించుకున్నాం. (2 కొరిం. 4:4) ఇతరులు మన సందేశాన్ని వినకపోయినా లేదా మనల్ని హింసించినా సువార్త ప్రకటిస్తూనే ఉంటాం.—1 థెస్స. 2:1, 2.

9. కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ధైర్యం చూపించవచ్చు?

9 కష్టాలు వచ్చినప్పుడు. మనం దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు, కష్టాలను తట్టుకునే విశ్వాసాన్ని, ధైర్యాన్ని ఆయనిస్తాడు. ఇష్టమైనవాళ్లు చనిపోతే మనం బాధపడతాం, కానీ నిరాశానిస్పృహల్లో కూరుకుపోము. బదులుగా, “సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు” మనకు బలాన్నిస్తాడనే నమ్మకంతో ఉంటాం. (2 కొరిం. 1:3, 4; 1 థెస్స. 4:13) మన ఆరోగ్యం పాడైనప్పుడు లేదా తీవ్రంగా గాయపడినప్పుడు నొప్పిని భరిస్తాం కానీ యెహోవాకు ఇష్టంలేని వైద్య చికిత్సలను అంగీకరించం. (అపొ. 15:28, 29) మనం కృంగిపోయినప్పుడు మన హృదయం నిందించవచ్చు. అయితే, “విరిగిన హృదయముగలవారికి” దగ్గరగా ఉండే యెహోవా మీద నమ్మకం ఉంచుతాం కాబట్టి మనం అతిగా నిరుత్సాహపడం. c1 యోహా. 3:19, 20; కీర్త. 34:18.

యేసు వివేచన చూపించాడు

10. వివేచన అంటే ఏమిటి? వివేచన ఉన్న క్రైస్తవుని మాటలు, పనులు ఎలా ఉంటాయి?

10 ఏది మంచో, ఏది చెడో అర్థం చేసుకుని, మంచిదాన్ని ఎంచుకునే సామర్థ్యమే వివేచన. (హెబ్రీ. 5:14) వివేచనగల క్రైస్తవుడు దేవునితో తన సంబంధాన్ని బలపర్చే నిర్ణయాలు తీసుకుంటాడు. తన మాటలతో ఇతరుల మనసు నొప్పించే బదులు వాళ్లను ప్రోత్సహించేలా మాట్లాడుతూ యెహోవాను సంతోషపెడతాడు. (సామె. 11:12, 13) అలాంటి వ్యక్తి తొందరపడి కోప్పడడు. (సామె. 14:29) ఆయన ‘చక్కగా ప్రవర్తిస్తాడు’ అంటే తన జీవితంలో ఎప్పుడూ మంచి నిర్ణయాలే తీసుకుంటాడు. (సామె. 15:21) మనం వివేచన చూపించడం ఎలా నేర్చుకోవచ్చు? అందుకోసం మనం దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదివి, నేర్చుకున్నవాటిని పాటించాలి. (సామె. 2:1-5, 10, 11) మరిముఖ్యంగా, భూమ్మీద జీవించిన వాళ్లందరిలో ఎక్కువ వివేచనను చూపించిన యేసు జీవితాన్ని పరిశీలిస్తే మరింత ప్రయోజనం పొందుతాం.

11. యేసు తన మాటల్లో వివేచన ఎలా చూపించాడు?

11 యేసు ఎప్పుడూ తన మాటల్లో, పనుల్లో వివేచన చూపించేవాడు. ఆయన మాటలు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు యేసు ఉపయోగించిన “దయగల మాటలు” విని ప్రజలు ఆశ్చర్యపోయారు. (లూకా 4:22; మత్త. 7:28) ఆయన తరచూ దేవుని వాక్యాన్ని చదివేవాడు, అందులోని మాటల్ని ఎత్తి చెప్పేవాడు. ఏ సందర్భంలో ఏ లేఖనం ఉపయోగించాలో ఆయనకు బాగా తెలుసు. (మత్త. 4:4, 7, 10; 12:1-5; లూకా 4:16-21) యేసు, ప్రజల హృదయాలకు చేరేలా లేఖనాలను చక్కగా వివరించేవాడు కూడా. ఆయన పునరుత్థానం అయ్యాక, ఎమ్మాయు అనే ఊరికి వెళ్తున్న ఇద్దరు శిష్యులకు కనబడి, తనకు సంబంధించిన లేఖనాలు ఎలా నెరవేరాయో వివరించాడు. ఆ మాటలు విన్న శిష్యులు, “ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా” అని చెప్పుకున్నారు.—లూకా 24:27, 32.

12, 13. యేసు తొందరపడి కోప్పడేవాడు కాదని, పరిస్థితుల్ని అర్థం చేసుకునేవాడని ఎలా చెప్పవచ్చు?

12 ఆయన ప్రవర్తన, ఆలోచనా తీరు. యేసుకు వివేచన ఉంది కాబట్టి, తొందరపడి కోప్పడేవాడు కాదు. (సామె. 16:32) ఆయన “సాత్వికుడు.” (మత్త. 11:29) తన శిష్యులు ఎన్ని పొరపాట్లు చేసినా ఆయన సహనం కోల్పోలేదు. (మార్కు 14:34-38; లూకా 22:24-27) చివరికి అన్యాయానికి గురైనప్పుడు కూడా మౌనంగానే ఉన్నాడు.—1 పేతు. 2:23.

13 వివేచన వల్ల యేసు పరిస్థితుల్ని అర్థం చేసుకునేవాడు. ఆయన ధర్మశాస్త్రంలోని నియమాల వెనక ఉన్న ఉద్దేశాన్ని అర్థం చేసుకుని దానికి తగ్గట్లుగా ప్రవర్తించేవాడు. ఉదాహరణకు, రక్తస్రావంతో బాధపడుతున్న ఓ మహిళతో ఆయనెలా వ్యవహరించాడో పరిశీలించండి. (మార్కు 5:25-34 చదవండి.) ఆమె జనసమూహంతో పాటు వచ్చి యేసు వస్త్రాన్ని ముట్టుకున్నప్పుడు, ఆ బాధనుండి బయటపడింది. ధర్మశాస్త్రం ప్రకారం ఆమె అపవిత్రురాలు కాబట్టి ఎవర్నీ ముట్టుకోకూడదు. (లేవీ. 15:25-27) అయితే ‘కనికరం, విశ్వాసం’ వంటివి ‘ధర్మశాస్త్రంలో ఉన్న ప్రధానమైన విషయాలని’ అర్థం చేసుకున్న యేసు ఆ మహిళను కోప్పడలేదు. (మత్త. 23:23) బదులుగా ఆయన దయగా ఇలా అన్నాడు, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక.” ఇతరుల పట్ల  దయ చూపించేలా వివేచన ఓ వ్యక్తిని కదిలిస్తుందని చెప్పడానికి ఇది ఓ చక్కని ఉదాహరణ కాదా!

14. యేసు దేన్ని తన జీవితంగా చేసుకున్నాడు? ఆయన ఆ పనిమీదే ఎలా మనసు పెట్టగలిగాడు?

14 ఆయన జీవన విధానం. యేసు తన జీవన విధానంలో కూడా వివేచన చూపించాడు. ఆయన పరిచర్యనే జీవితంగా చేసుకున్నాడు. (లూకా 4:43) అంతేకాక, పరిచర్యపైనే మనసు పెట్టగలిగేలా, దాన్ని పూర్తి చేయగలిగేలా సరైన నిర్ణయాలు తీసుకున్నాడు. అందుకే, పరిచర్య కోసం తన సమయాన్ని, శక్తిని ధారపోసేందుకు సాదాసీదా జీవితం గడిపాడు. (లూకా 9:58) తాను చనిపోయిన తర్వాత కూడా ప్రకటనా పని కొనసాగాలంటే, ఇతరులకు శిక్షణ ఇవ్వాలని ఆయనకు తెలుసు. (లూకా 10:1-12; యోహా. 14:12) అందుకే, “యుగసమాప్తి వరకు” పరిచర్యలో సహాయం చేస్తూనే ఉంటానని యేసు తన శిష్యులకు మాటిచ్చాడు.—మత్త. 28:19, 20.

యేసులా వివేచన చూపించండి

ప్రజలకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో అర్థం చేసుకుని, వాళ్ల అవసరాలకు తగ్గట్లుగా మాట్లాడాలి. (15వ పేరా చూడండి)

15. మనం మాటల్లో వివేచనను ఎలా చూపించవచ్చు?

15 మనం యేసులా ఎలా వివేచన చూపించవచ్చు? మన మాటలు. మనం తోటి సహోదరసహోదరీలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్లను ప్రోత్సహిస్తామే తప్ప నిరుత్సాహపర్చం. (ఎఫె. 4:29) దేవుని రాజ్యం గురించి ప్రజలతో మాట్లాడేటప్పుడు మన సంభాషణ “ఉప్పువేసినట్లు” ఉండాలి, అంటే మనం నేర్పుగా మాట్లాడాలి. (కొలొ. 4:6) ప్రజల అవసరాలు ఏమిటో, వాళ్లకు ఏ విషయాల మీద ఆసక్తి ఉందో అర్థం చేసుకుని వాటికి తగ్గట్లుగా మాట్లాడాలి. దయగా మాట్లాడితే ప్రజలు వినడానికి ఇష్టపడవచ్చు, మన సందేశం వాళ్ల హృదయాన్ని కదిలించవచ్చు. అంతేకాకుండా, మన నమ్మకాలను వివరించేటప్పుడు వీలైనప్పుడల్లా నేరుగా బైబిలు నుండి చదువుతాం, ఎందుకంటే బైబిలు దేవుని వాక్యం. మన మాటలకన్నా బైబిల్లోని సందేశానికే ఎంతో శక్తి ఉందని మనకు తెలుసు.—హెబ్రీ. 4:12.

16, 17. (ఎ) మనం తొందరపడి కోప్పడే వాళ్లం కాదని, ఇతరులను అర్థం చేసుకుంటామని ఎలా చూపించవచ్చు? (బి) మనం పరిచర్య మీదే మనసు పెట్టాలంటే ఏం చేయాలి?

16 మన ప్రవర్తన, ఆలోచనా తీరు. వివేచన ఉంటే మనం ఒత్తిళ్ల మధ్య కూడా ప్రశాంతంగా ఉంటాం, తొందరపడి కోప్పడం. (యాకో. 1:19) ఎవరైనా మనల్ని నొప్పించేలా మాట్లాడినా, ప్రవర్తించినా వాళ్లు ఎందుకలా చేశారో అర్థం చేసుకుంటాం. అప్పుడు వాళ్లమీద కోపాన్ని పెంచుకునే బదులు సులభంగా క్షమించగలుగుతాం. (సామె. 19:11) వివేచన ఉంటే మనం పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తిస్తాం. మన తోటి సహోదరసహోదరీలు పరిపూర్ణులు కాదని, మనకు తెలియని సమస్యలు వాళ్లకుంటాయని గుర్తుంచుకుంటాం. అందుకే వాళ్లు చెప్పేది వినడానికి ఇష్టపడతాం, మన మాటే నెగ్గాలని పట్టుబట్టకుండా వీలైనప్పుడల్లా వాళ్ల అభిప్రాయాల్ని గౌరవిస్తాం.—ఫిలి. 4:5.

17 మన జీవన విధానం. సువార్త ప్రకటించడం మనకున్న గొప్ప గౌరవమని మనకు తెలుసు. కాబట్టి, మన పరిచర్యమీదే మనసు పెట్టడానికి సహాయం చేసే నిర్ణయాలు తీసుకుంటాం. మన జీవితంలో యెహోవాకు మొదటి స్థానం ఇస్తాం. అంతం రాకముందే సువార్త ప్రకటించడానికి మన సమయాన్ని, శక్తిని ఉపయోగించగలిగేలా సాదాసీదా జీవితాన్ని గడుపుతాం.—మత్త. 6:33; 24:14.

18. నిత్యజీవ మార్గంలోనే ప్రయాణించాలంటే మనం ఏమి చేయాలి? మీరేమి చేయాలని నిర్ణయించుకున్నారు?

18 యేసుకున్న కొన్ని అద్భుతమైన లక్షణాల గురించి ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకుని ఎంతో సంతోషించాం. ఆయన ఇతర లక్షణాలను కూడా పరిశీలించి, ఆయనను ఇంకా ఎక్కువగా ఎలా అనుకరించవచ్చో నేర్చుకుంటే మరెన్నో ప్రయోజనాలు పొందుతాం. కాబట్టి యేసు అడుగుజాడల్లో నడవాలని మనం గట్టిగా నిర్ణయించుకుందాం. అలా చేస్తే, నిత్యజీవ మార్గంలోనే ప్రయాణిస్తాం, యెహోవాకు మరింత దగ్గరౌతాం.

a మొదటి పేతురు 1:8, 9⁠లోని మాటల్ని, పేతురు పరలోక నిరీక్షణ ఉన్న క్రైస్తవుల్ని ఉద్దేశించి రాశాడు. అయితే ఆ మాటలు భూమ్మీద నిత్యం జీవించే వాళ్లకు కూడా వర్తిస్తాయి.

b మరింత సమాచారం కోసం కావలికోట, అక్టోబరు 15, 2013 సంచిక, 7-11 పేజీల్లో ఉన్న “సృష్టిని చూస్తే జీవముగల దేవుడు ఉన్నాడని తెలుస్తుంది” ఆర్టికల్‌ చూడండి.

c కష్టాల్లో కూడా ధైర్యం చూపించినవాళ్ల అనుభవాల కోసం, కావలికోట డిసెంబరు 1, 2000, 24-28 పేజీలు; తేజరిల్లు! జూలై 8, 2003, 20-23 పేజీలు; తేజరిల్లు! జనవరి 22, 1995 (ఇంగ్లీషు), 11-15 పేజీలు చూడండి.