జీవిత కథ
మరింత సంతృప్తినిచ్చే జీవితం మా సొంతమైంది
నేనూ గ్వెన్ 5 ఏళ్ల వయసులో డాన్స్ నేర్చుకోవడం మొదలుపెట్టాం. అప్పట్లో మేము ఒకరికొకరం తెలీదు. కానీ ఇద్దరం ‘బాలే డాన్స్‌నే’ మా జీవితంగా చేసుకోవాలనే లక్ష్యంతో పెరిగాం. అయితే ఆ రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటున్న సమయంలో దాన్ని పూర్తిగా వదిలేశాం. ఎందుకో మీకిప్పుడు చెప్తాం.
డేవిడ్: నేను 1945లో ఇంగ్లాండ్‌లోని ష్రాప్‌షర్‌లో పుట్టాను. అక్కడ ఒక ప్రశాంతమైన పల్లెటూర్లో మా నాన్నకు తోట ఉండేది. స్కూల్ అయిపోగానే నేను సరదాగా అక్కడికి వెళ్లి కోళ్లకు మేత వేసేవాణ్ణి, వాటి గుడ్లు ఏరేవాణ్ణి. వాటితోపాటు ఆవుల్ని, గొర్రెల్ని కూడా చూసుకునేవాణ్ణి. సెలవుల్లో అయితే, కోతపనిలో మా నాన్నకు సహాయం చేసేవాణ్ణి. అప్పుడప్పుడు ట్రాక్టర్‌తో పొలం దున్నేవాణ్ణి కూడా.
అయితే, మెల్లమెల్లగా నాకు డాన్స్ మీద ఇష్టం పెరిగింది. చాలా చిన్నవయసులోనే, మ్యూజిక్ వినగానే డాన్స్ చేసేవాణ్ణి. అది మా నాన్న గమనించి, నాకు ఐదేళ్లప్పుడు ట్యాప్ డాన్స్ నేర్పించడానికి మా ఊర్లోని ఓ డాన్స్ స్కూల్‌లో చేర్పించమని మా అమ్మకు చెప్పాడు. కానీ, ‘బాలే డాన్సర్’ అయ్యే సామర్థ్యం నాలో ఉందని గమనించిన మా డాన్స్ మాస్టర్ నాకు బాలే డాన్స్ కూడా నేర్పించాడు. నాకు 15 ఏళ్లున్నప్పుడు, లండన్‌లో ప్రఖ్యాత రాయల్ బాలే స్కూల్‌లో చేరే అవకాశం దొరికింది. అక్కడ నాకు గ్వెన్ పరిచయమైంది. ఆమే నా డాన్స్ పార్ట్‌నర్.
గ్వెన్: నేను 1944లో, బాగా రద్దీ నగరమైన లండన్‌లో పుట్టాను. చిన్నప్పుడే నాకు దేవుని మీద చాలా నమ్మకం ఉండేది. బైబిలు చదవడానికి ప్రయత్నించేదాన్ని కానీ అర్థమయ్యేదికాదు. నాకు ఐదేళ్లు ఉన్నప్పుడు డాన్స్ క్లాసులకు వెళ్లడం మొదలుపెట్టాను. ఆరు సంవత్సరాల తర్వాత, బ్రిటన్‌లోని అన్ని ప్రాంతాల డాన్సర్లు పాల్గొన్న ఓ పోటీలో నేను గెలిచాను. దాంతో నాకు రాయల్ బాలే స్కూల్‌లోని జూనియర్ సెక్షన్‌లో చేరే అవకాశం వచ్చింది. ఆ స్కూలు, లండన్ శివార్లలోని రిచ్‌మండ్ పార్క్‌లో ఉన్న వైట్ లాడ్జ్ అనే అందమైన భవంతిలో ఉంది. అక్కడ నేను చదువుతోపాటు, ప్రఖ్యాత టీచర్ల దగ్గర బాలే డాన్స్ కూడా నేర్చుకున్నాను. నాకు 16 ఏళ్లు వచ్చేసరికి సీనియర్ విద్యార్థి అయిపోయాను, ఆ సమయంలోనే నేను డేవిడ్‌ను కలిశాను. కొన్నినెలల్లోనే, మేమిద్దరం కలిసి లండన్‌లో ఉన్న కోవెంట్ గార్డెన్‌లోని రాయల్ ఒపేరా హౌజ్‌లో, బాలే డాన్స్ ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాం.
డేవిడ్: అవును, గ్వెన్ చెప్పినట్లు మేము ప్రఖ్యాత రాయల్ ఒపేరా హౌజ్‌లో, అలాగే లండన్ ఫెస్టివల్ బాలే (ఇప్పుడు దాని పేరు, ఇంగ్లీష్ నేషనల్ బాలే) కంపెనీతోపాటు డాన్స్ ప్రదర్శనలు ఇచ్చేవాళ్లం. రాయల్ బాలేలో పని చేసిన ఒక డాన్స్ మాస్టర్, జర్మనీలోని ఉప్పర్టల్‌లో ఓ అంతర్జాతీయ డాన్స్ కంపెనీ ప్రారంభించాడు. మా ఇద్దరినీ అందులో సోలో డాన్సర్లుగా తీసుకున్నాడు. మేము ప్రపంచవ్యాప్తంగా ఎన్నో చోట్ల ప్రదర్శనలు ఇచ్చాం. డేమ్ మార్గో, ఫాన్‌టెన్, రూడాల్ఫ్ నూరేవ్ వంటి ప్రముఖ డాన్సర్లతో కలిసి డాన్స్ చేశాం. సాధారణంగా అలాంటి జీవితం మనుషుల్లో గర్వాన్ని పెంచుతుంది. చివరికి మేము డాన్స్‌కి అంకితం అయిపోయాం.
గ్వెన్: నేను నా మనసును, శరీరాన్ని డాన్స్‌కు అంకితం చేశాను. నేనూ డేవిడ్, డాన్స్‌లో అత్యున్నత స్థాయికి
చేరుకోవాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఆటోగ్రాఫ్‌లు ఇవ్వడం, అభిమానులు ఇచ్చే పువ్వులు తీసుకోవడం, వాళ్లు కొట్టే చప్పట్లు వినడం నాకు చాలా ఇష్టం. నేనున్న రంగుల ప్రపంచంలో ఎటుచూసినా విచ్చలవిడిగా జీవించేవాళ్లు, పొగతాగేవాళ్లు, మద్యం తాగేవాళ్లే ఉండేవాళ్లు. పైగా మిగతా డాన్సర్లలా నేను కూడా అదృష్టాన్ని తీసుకొచ్చే వస్తువులను ఎక్కువగా ఉపయోగించేదాన్ని.మా జీవితాలు పూర్తిగా మారిపోయాయి
డేవిడ్: ఎన్నో సంవత్సరాలు డాన్స్ ప్రదర్శనల కోసం ప్రయాణాలు చేసీచేసీ, నాకు ప్రయాణమంటే విరక్తి వచ్చింది. చిన్నప్పుడు మా తోటలో ఎక్కువగా గడపడంవల్ల, ఏదైనా పల్లెటూర్లో సాదాసీదాగా జీవించాలనే కోరిక పుట్టింది. అందుకే 1967లో, డాన్స్‌కు స్వస్తి చెప్పి మా అమ్మానాన్నల ఇంటికి దగ్గర్లోని ఓ పెద్ద తోటలో పని చేయడం మొదలుపెట్టాను. ఆ తోట యజమాని నాకు ఓ చిన్న ఇంటిని అద్దెకు ఇచ్చాడు. తర్వాత, గ్వెన్‌కు ఫోన్ చేసి నన్ను పెళ్లి చేసుకోమని అడిగాను. అయితే ఆమె అప్పటికే సోలో డాన్సర్‌గా మంచి స్థాయిలో ఉండడంతో, నిర్ణయం తీసుకోవడం ఆమెకు కాస్త కష్టమైంది. అయినాసరే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుని, తనకు ఏమాత్రం అలవాటులేని పల్లెటూరి జీవితాన్ని గడపడానికి ఇష్టపడింది.
గ్వెన్: నిజమే, అక్కడి జీవితానికి అలవాటుపడడం నాకు చాలా కష్టమైంది. వర్షంలో, చలిలో పాలుపితకడం, పందులకు, కోళ్లకు మేత వేయడం చాలా కష్టంగా అనిపించాయి. డేవిడ్, పశువుల పెంపకంలో కొత్తకొత్త పద్ధతులు నేర్చుకోవడానికి ఓ కళాశాలలో 9 నెలలపాటు శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టాడు. రాత్రి ఆయన ఇంటికి వచ్చేవరకు నేను ఒంటరిగా ఉండాల్సివచ్చేది. తర్వాత, మాకు ఒక అమ్మాయి పుట్టింది, తన పేరు గిలి. నేను డేవిడ్ సలహాతో కారు నడపడం నేర్చుకున్నాను. ఒకరోజు, దగ్గర్లోని ఓ ఊరుకు వెళ్తున్నప్పుడు గేల్ అనే మహిళ కలిసింది. ఇంతకుముందు ఆమె ఓ షాపులో పని చేసేటప్పుడు నాకు పరిచయమైంది.
టీ తాగడానికి రమ్మని ఆమె తన ఇంటికి ఆహ్వానించింది. తన పెళ్లి ఫోటోలు చూపిస్తూ, రాజ్యమందిరం బయట కొంతమంది నిలబడివున్న ఓ ఫోటోను కూడా ఆమె చూపించింది. ‘ఇది ఏ చర్చి?’ అని ఆమెను అడిగాను. ఆమె, ఆమె భర్త యెహోవాసాక్షులని చెప్పినప్పుడు నేను చాలా సంతోషించాను. మా మేనత్త కూడా యెహోవాసాక్షేనని నాకు అప్పుడు గుర్తొచ్చింది. అంతేకాక, మా నాన్న ఆమెమీద ఎంతగా కోప్పడేవాడో, చిరాకు పడేవాడో కూడా గుర్తొచ్చింది. నాన్న ఆమె దగ్గరున్న పుస్తకాల్ని చెత్తకుండీలోకి విసిరేసేవాడు. అందరితో చాలా సరదాగా ఉండే నాన్న మా మేనత్తతో మాత్రం ఎందుకు అలా ప్రవర్తించేవాడో నాకు అర్థమయ్యేదికాదు.
మా మేనత్త నమ్మకాలకు, చర్చీల్లో చెప్పే విషయాలకు తేడా ఏమిటో తెలుసుకునే అవకాశం చివరికి నాకు అప్పుడు దొరికింది. బైబిలు నిజంగా ఏమి బోధిస్తుందో గేల్ నాకు చూపించింది. త్రిత్వం, ఆత్మకు చావు ఉండదు వంటి ఎన్నో సిద్ధాంతాలు బైబిల్లో లేవని తెలుసుకుని ఆశ్చర్యపోయాను. (ప్రసం. 9: 5, 10; యోహా. 14:28; 17:3) అంతేకాదు, దేవుని పేరు యెహోవా అని బైబిల్లో మొదటిసారి చూశాను.—నిర్గ. 6:3.
డేవిడ్: నేర్చుకుంటున్న విషయాల్ని గ్వెన్ నాకు చెప్పేది. చిన్నప్పుడు మా నాన్న నన్ను బైబిలు చదవమని చెప్పేవాడు. గేల్, ఆమె భర్త డెరిక్ దగ్గర, మేమిద్దరం బైబిలు స్టడీ తీసుకోవడం మొదలుపెట్టాం. అయితే మా సొంత తోటనే కౌలుకు తీసుకునే అవకాశం రావడంతో, 6 నెలల తర్వాత ష్రాప్‌షర్‌లోనే ఓస్‌వెస్ట్రీ అనే ప్రాంతానికి వెళ్లిపోయాం. అక్కడ డీర్‌డ్రీ అనే సహోదరి మాతో ఓపిగ్గా బైబిలు అధ్యయనం కొనసాగించింది. అయితే మాకున్న పశువుల్ని చూసుకునే పనివల్ల సమయం దొరికేది కాదు, దాంతో మొదట్లో అంతగా ప్రగతి సాధించలేకపోయాం. కానీ సత్యం మెల్లమెల్లగా మాలో మార్పు తీసుకొచ్చింది.
గ్వెన్: మూఢనమ్మకాల నుండి బయటపడడం నాకు పెద్ద సవాలు అనిపించింది. అయితే అదృష్టాన్ని ఆరాధించే ప్రజలను యెహోవా ఎలా చూస్తాడో తెలుసుకోవడానికి యెషయా 65:11 నాకు సహాయం చేసింది. అదృష్టం కోసం పెట్టుకున్న వస్తువులను, తాయెత్తులను విడిచిపెట్టడానికి నాకు కొంచెం సమయం పట్టింది. ప్రార్థన కూడా నాకెంతో సహాయం చేసింది. “తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును” అని తెలుసుకున్నప్పుడు, నేనెలా ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడో అర్థమైంది. (మత్త. 23:12) తనకెంతో ఇష్టమైన కుమారుణ్ణి మన కోసం బలిగా అర్పించిన దేవున్ని సేవించాలని నిర్ణయించుకున్నాను. అప్పటికే మాకు రెండో కూతురు పుట్టింది. మా కుటుంబమంతా పరదైసు భూమిమీద నిత్యం జీవించవచ్చని తెలుసుకుని చాలా సంతోషించాను.
డేవిడ్: మత్తయి 24వ అధ్యాయంలో, దానియేలు పుస్తకంలో ఉన్నటువంటి బైబిలు ప్రవచనాలు ఎలా నెరవేరతాయో అర్థంచేసుకున్నప్పుడు, ఇదే సత్యమని నాకు నమ్మకం కుదిరింది. ఈ లోకంలో ఉన్నదేదీ యెహోవాతో ఉన్న స్నేహానికి సాటిరాదని నేను గ్రహించాను. దాంతో, పేరుప్రతిష్ఠలు సంపాదించుకోవాలనే కోరిక నాలో క్రమంగా తగ్గిపోయింది. నా భార్యాబిడ్డలు కూడా నాకు చాలా ముఖ్యమని అర్థం చేసుకున్నాను. నా గురించీ, పెద్ద తోటను కొనుక్కోవాలనే నా కోరిక గురించీ ఆలోచించడం మానేసేలా ఫిలిప్పీయులు 2:4 నాకు సహాయం చేసింది. యెహోవా సేవకే జీవితంలో మొదటిస్థానం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. పొగత్రాగడం మానేశాను. అయితే, శనివారం సాయంత్రం 10 కి.మీ. ప్రయాణించి కూటాలకు వెళ్లడం ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే సాధారణంగా మేము సాయంకాల సమయాల్లోనే పాలు పితుకుతాం. అయినాసరే నా భార్య చక్కని సహకారం వల్ల, మేము ఏనాడూ ఒక్క కూటం కూడా మానలేదు. అంతేకాకుండా, ప్రతీ ఆదివారం ఉదయం పాలు పితికిన తర్వాత మా ఇద్దరు కూతుళ్లను తీసుకుని క్రమంగా పరిచర్యకు కూడా వెళ్లేవాళ్లం.
మాలో వచ్చిన మార్పు మావాళ్లకు నచ్చలేదు. గ్వెన్‌తో, వాళ్ల నాన్న 6 సంవత్సరాలపాటు మాట్లాడలేదు. మా అమ్మానాన్నలు కూడా, మమ్మల్ని యెహోవాసాక్షులతో సహవసించకుండా చేయాలని ఎంతో ప్రయత్నించారు.
గ్వెన్: ఈ కష్టాలన్నిటినీ తట్టుకోవడానికి యెహోవా మాకు సహాయం చేశాడు. సమయం గడిచేకొద్దీ ఓస్‌వెస్ట్రీ సంఘంలోని సహోదరసహోదరీలు మా కష్టాల్లో తోడుగా ఉంటూ కుటుంబ సభ్యుల్లా కలిసిపోయారు. (లూకా 18:29, 30) మేము యెహోవాకు సమర్పించుకుని 1972లో బాప్తిస్మం తీసుకున్నాం. తర్వాత, వీలైనంత ఎక్కువమందికి సత్యం నేర్పించాలనే కోరికతో నేను పయినీరు సేవ మొదలుపెట్టాను.
సంతృప్తినిచ్చిన కొత్త జీవితం
డేవిడ్: మేము మా తోటలో పని చేసినంతకాలం చాలా కష్టపడ్డాం. అంతేకాదు, ఆధ్యాత్మిక విషయాల్లో మా పిల్లలకు చక్కని ఆదర్శం ఉంచడానికి కృషిచేశాం. కొంతకాలానికి, ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీలు తగ్గించడంతో మా తోటను వదులుకోవాల్సి వచ్చింది. ఇల్లు లేదు, ఉద్యోగం లేదు, పైగా మా మూడో కూతురు పుట్టి అప్పటికి సంవత్సరమే అయింది. ఆ సమయంలో సహాయం, నిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థించాం. ఎలాగూ డాన్స్ వచ్చు కాబట్టి, కుటుంబ పోషణ కోసం డాన్స్ స్కూల్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాం. యెహోవాకు మొదటి స్థానం ఇవ్వడం వల్ల మేము మంచి ఫలితాలు పొందాం. మా ముగ్గురు కూతుళ్లు, తమ స్కూల్ చదువులు అయిపోయాక పయినీరు సేవ మొదలుపెట్టడం చూసి మేమెంతో సంతోషించాం. గ్వెన్ అప్పటికే పయినీరు సేవ చేస్తుండడంతో వాళ్లకు పరిచర్యలో అవసరమైన సహాయం చేసేది.
మా పెద్ద కూతురు గిలి, రెండో కూతురు డెనీజ్ పెళ్లిళ్లు అయ్యాక మా డాన్స్ స్కూల్‌ను మూసేశాం. తర్వాత, అవసరం ఎక్కువున్న చోట సేవ చేయాలన్న మా కోరికను బ్రాంచి కార్యాలయానికి తెలియజేశాం. వాళ్లు మమ్మల్ని ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని పట్టణాల్లో సేవ చేయమన్నారు. మా మూడో కూతురు డెబీ మాతోపాటే ఉండేది. పిల్లల బాధ్యత తగ్గడంతో నేను కూడా పయినీరు సేవ మొదలుపెట్టాను. ఐదేళ్ల తర్వాత, ఉత్తర ఇంగ్లాండ్‌లోని ఇతర సంఘాలకు కూడా మమ్మల్ని పంపించారు. డెబీ పెళ్లి కూడా అయ్యాక మేము అంతర్జాతీయ నిర్మాణ పనిలో 10 సంవత్సరాలపాటు సేవ చేశాం. జింబాబ్వే, మాల్డోవా, హంగరి, కోటె డి ఐవరీ దేశాల్లోని నిర్మాణ పనుల్లో పాల్గొన్నాం. ఆ తర్వాత, లండన్‌లోని బెతెల్ నిర్మాణ పనిలో సహాయం చేయడానికి ఇంగ్లాండ్‌కు తిరిగొచ్చాం. నాకు వ్యవసాయంలో, పశువుల పెంపకంలో అనుభవం ఉండడం వల్ల, బెతెల్‌కు చెందిన వ్యవసాయ క్షేత్రంలో నన్ను నియమించారు. ప్రస్తుతం, మేము వాయువ్య ఇంగ్లాండ్‌లో పయినీర్లుగా సేవ చేస్తున్నాం.
గ్వెన్: మేము మా జీవితాల్ని మొదటిసారి డాన్స్‌కు అంకితం చేశాం. అది మాకు కొంతకాలమే సంతోషాన్నిచ్చింది. అయితే రెండోసారి, మా జీవితాల్ని యెహోవాకు అంకితం చేసుకున్నాం. అది మాత్రం చిరకాలం నిలిచే సంతోషాన్నిచ్చింది. మేమిద్దరం ఇప్పటికీ కలిసి కాళ్లు కదుపుతున్నాం, కాకపోతే డాన్స్‌లో కాదు పయినీరు సేవలో. ప్రాణాల్ని రక్షించే విలువైన సత్యాలను నేర్చుకునేలా ఎంతోమందికి సహాయం చేయడం, మాకు అంతులేని ఆనందాన్ని ఇచ్చింది. లోకంలోని పేరు ప్రతిష్ఠల కన్నా ఈ “సిఫారసు పత్రికలు” ఎంతో గొప్పవి. (2 కొరిం. 3:1, 2) ఒకవేళ మాకు సత్యం తెలియకపోయుంటే, మా జీవితంలో డాన్స్ తాలూకు జ్ఞాపకాలు, పాత ఫోటోలు, ప్రదర్శనలు తప్ప ఇంకేమీ ఉండేవి కావు.
డేవిడ్: యెహోవా సేవ మా జీవితాల్లో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చింది. ఒక మంచి భర్తగా, తండ్రిగా ఉండడానికి అది నాకు ఎంతో సహాయపడింది. మిర్యాము, రాజైన దావీదు, మరికొంతమంది సంతోషంతో నాట్యం చేశారని బైబిలు చెప్తుంది. మేముకూడా చాలామందిలాగే, దేవుని నూతనలోకంలో సంతోషంగా డాన్స్ చేయాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాం.—నిర్గ. 15:20; 2 సమూ. 6:13, 14.