కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

పెద్దలారా, ఇతరులకు శిక్షణ ఇవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు?

పెద్దలారా, ఇతరులకు శిక్షణ ఇవ్వడం గురించి మీరేమనుకుంటున్నారు?

“ప్రతిదానికి సమయము కలదు.”ప్రసం. 3:1.

1, 2. చాలా సంఘాల్లో ఏ అవసరం ఉందని ప్రాంతీయ పర్యవేక్షకులు గమనించారు?

 ప్రాంతీయ పర్యవేక్షకుడు, సంఘ పెద్దలతో తన కూటాన్ని ముగించబోతున్నాడు. ఆయన వాళ్లవైపు ఓసారి ఆప్యాయంగా చూశాడు. వాళ్లందరూ కష్టపడి పనిచేస్తున్న కాపరులు, వాళ్లలో వయసు పైబడినవాళ్లు కూడా ఉన్నారు. ఆయన ఓ ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తూ వాళ్లను ఇలా అడిగాడు, “సహోదరులారా, సంఘంలో బాధ్యతలు చేపట్టేలా ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి మీరు ప్రయత్నించారా?” సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి కృషి చేయమని ఆయన గత సందర్శనంలో ప్రోత్సహించిన సంగతి వాళ్లకు బాగా గుర్తుంది. అయితే, ఆ విషయంలో తామేమీ చేయలేదని చివరికి ఓ పెద్ద ఒప్పుకున్నాడు. మిగతా పెద్దలు కూడా అవునన్నట్లు తలూపారు.

2 మీరు ఓ సంఘపెద్ద అయ్యుంటే, బహుశా మీరు కూడా అలాంటి జవాబే ఇచ్చేవాళ్లు. వయసుతో నిమిత్తం లేకుండా, సంఘ బాధ్యతలు చేపట్టేలా సహోదరులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం చాలా సంఘాల్లో ఉందని ప్రపంచవ్యాప్తంగా ప్రాంతీయ కాపరులు గమనించారు. అయితే ఆ పని చేయడం అంత సులభం కాదు. ఎందుకు?

3. (ఎ) ఇతరులకు శిక్షణ ఇవ్వడం ప్రాముఖ్యమని బైబిలు ఎలా చూపిస్తుంది? శిక్షణ విషయంలో సంఘంలోని వాళ్లందరూ ఎందుకు ఆసక్తి కలిగివుండాలి? (అధస్సూచి చూడండి.) (బి) సహోదరులకు శిక్షణ ఇవ్వడం కొంతమంది పెద్దలకు ఎందుకు కష్టంగా ఉండవచ్చు?

3 సహోదరులకు శిక్షణ ఇవ్వడం చాలా ముఖ్యమని సంఘ పెద్దలైన మీకు తెలుసు. a ఇప్పుడున్న సంఘాలను ఆధ్యాత్మికంగా బలంగా ఉంచాలన్నా, భవిష్యత్తులో కొత్త సంఘాలు ఏర్పడాలన్నా చాలామంది సహోదరులు అవసరమని మీకు తెలుసు. (యెషయా 60:22 చదవండి.) పైగా మీరు ‘ఇతరులకు బోధించాలని’ కూడా బైబిలు చెప్తుంది. (2 తిమోతి 2:2 చదవండి.) అయినా ఆ పనికోసం సమయం కేటాయించడం మీకు కష్టం కావచ్చు. ఎందుకంటే, మీరు మీ కుటుంబాన్ని చూసుకోవాలి, ఉద్యోగం చేయాలి. వాటితోపాటు సంఘ బాధ్యతలు, వెంటనే చేయాల్సిన మరికొన్ని పనులు మీకుంటాయి. దాంతో సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి సమయం ఉండట్లేదని మీరనుకోవచ్చు. అయినప్పటికీ, శిక్షణ ఇవ్వడం కోసం మీరు సమయం కేటాయించడం ఎందుకు ప్రాముఖ్యమో ఇప్పుడు పరిశీలిద్దాం.

శిక్షణ ఇవ్వడం అత్యవసరం

4. సహోదరులకు శిక్షణ ఇవ్వడాన్ని పెద్దలు కొన్నిసార్లు ఎందుకు వాయిదా వేస్తారు?

4 సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి సమయం కేటాయించడం కొంతమంది పెద్దలకు ఎందుకు కష్టం కావచ్చు? బహుశా వాళ్లిలా అనుకోవచ్చు, ‘సంఘంలో, వెంటనే చూసుకోవాల్సిన మరింత అత్యవసరమైన పనులు కొన్ని ఉన్నాయి. నేను ఇప్పటికిప్పుడు సహోదరులకు శిక్షణ ఇవ్వకపోయినా సంఘానికి వచ్చే నష్టమేమీ ఉండదు.’ నిజమే, సంఘంలో అత్యవసరమైన పనులు కొన్ని ఉంటాయి. కానీ మీరు సహోదరులకు శిక్షణ ఇవ్వడం ఆలస్యం చేస్తుంటే, సంఘానికి హాని జరిగే అవకాశం ఉంది.

5, 6. డ్రైవర్‌ తన కారును చూసుకునే విధానం నుండి పెద్దలు ఏ పాఠం నేర్చుకోవచ్చు? ఆ ఉదాహరణ సంఘానికి ఎలా అన్వయిస్తుంది?

5 ఈ ఉదాహరణ గురించి ఆలోచించండి. కారు సరిగ్గా నడవాలంటే, ఇంజన్‌ ఆయిల్‌ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని డ్రైవర్‌కి తెలుసు. కానీ, పెట్రోల్‌ లేకపోతే కారు అసలు నడవదు కాబట్టి, పెట్రోల్‌ కొట్టించడమే చాలా ముఖ్యమని డ్రైవర్‌ అనుకోవచ్చు. పైగా, తాను బిజీగా ఉన్నాను కాబట్టి, ఇంజన్‌ ఆయిల్‌ని తర్వాత మార్చినా ఫర్వాలేదని అతను అనుకోవచ్చు. ఎంతైనా, దాన్ని మార్చకపోతే కారు వెంటనే ఆగిపోదు. కానీ అలా నడపడం ప్రమాదకరం. ఇంజన్‌ ఆయిల్‌ని క్రమంగా మార్చకపోతే, కారు ఏదోకరోజు పాడైపోతుంది. చివరికి దాన్ని బాగు చేయించడానికి చాలా డబ్బు ఖర్చుపెట్టాల్సి వస్తుంది, ఎంతో సమయం కూడా వృథా అవుతుంది. ఈ ఉదాహరణ నుండి పెద్దలు ఏమి నేర్చుకోవచ్చు?

6 పెద్దలు, కొన్ని ముఖ్యమైన పనుల్ని వెంటనే చేయాల్సివుంటుంది. లేకపోతే సంఘంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కారులో పెట్రోల్‌ ఉందో లేదో ఎప్పటికప్పుడు చూసుకునే ఆ డ్రైవర్‌లాగే పెద్దలు కూడా ‘శ్రేష్ఠమైన కార్యాలను వివేచించగలగాలి.’ (ఫిలి. 1:9-11) అయితే కొంతమంది పెద్దలు ముఖ్యమైన పనుల్లో బిజీగా ఉంటూ, సహోదరులకు శిక్షణ ఇవ్వడాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అది, ఇంజన్‌ ఆయిల్‌ మార్చడాన్ని వాయిదా వేయడం లాంటిదే. పెద్దలు శిక్షణ ఇవ్వడాన్ని వాయిదా వేస్తుంటే, ఈరోజు కాకపోతే రేపైనా సంఘంలో సమస్య తలెత్తుతుంది. సంఘ అవసరాలన్నిటినీ చూసుకోవడానికి శిక్షణ పొందిన సహోదరులు సరిపడా ఉండని పరిస్థితి వస్తుంది.

7. ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి కృషి చేసే పెద్దల్ని మనం ఎలా చూడాలి?

7 కాబట్టి, శిక్షణ ఇవ్వడం అత్యవసరం కాదని అస్సలు అనుకోకండి. సంఘ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుంటూ, సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి కృషి చేసే పెద్దలు తెలివైన ‘గృహనిర్వాహకులు.’ వాళ్లు సంఘానికి నిజమైన ఆశీర్వాదం. (1 పేతురు 4:10 చదవండి.) ఆ శిక్షణవల్ల సంఘం ఎలా ప్రయోజనం పొందుతుంది?

పెద్దలారా, సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోండి

8. (ఎ) పెద్దలు ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి ఏ కారణాలు ఉన్నాయి? (బి) అవసరం ఎక్కువున్న ప్రాంతాలకు వెళ్లి సేవ చేస్తున్న పెద్దలకు ఏ అత్యవసర బాధ్యత ఉంది? (“ అత్యవసరమైన పని” అనే బాక్సు చూడండి.)

8 ఎంతో అనుభవం ఉన్న పెద్దలు కూడా, తమకు వయసు పైబడేకొద్దీ సంఘంలోని బాధ్యతల్ని ఇప్పటిలా చూసుకోలేమని వినయంగా గుర్తించాలి. (మీకా 6:8) అంతేకాక అనూహ్యంగా, “కాలవశము చేత” జరిగే కొన్ని సంఘటనల వల్ల, తాము సంఘ బాధ్యతలను నిర్వర్తించలేని పరిస్థితి ఎప్పుడైనా రావచ్చని వాళ్లు తెలుసుకోవాలి. (ప్రసం. 9:11, 12; యాకో. 4:13, 14) అందుకే, యెహోవా గొర్రెల మీదున్న ప్రేమతో, శ్రద్ధతో పెద్దలు ఎన్నో ఏళ్ల అనుభవంలో నేర్చుకున్న విషయాలను యువ సహోదరులకు నేర్పించడానికి కృషి చేస్తారు.—కీర్తన 71:17, 18 చదవండి.

9. సహోదరులకు ఇప్పుడే శిక్షణ ఇవ్వడం ఎందుకు ప్రాముఖ్యం?

9 పెద్దలు సహోదరులకు శిక్షణ ఇవ్వడం వల్ల సంఘం బలపడుతుంది కాబట్టి, ఆ కారణాన్నిబట్టి కూడా వాళ్లు సంఘానికి ఓ ఆశీర్వాదం అని చెప్పవచ్చు. ఆ శిక్షణవల్ల ఎక్కువమంది సహోదరులు తమ సంఘాన్ని స్థిరంగా, ఐక్యంగా ఉంచడానికి సహాయం చేయగలుగుతారు. సంఘాలు అలా ఉండడం ఈ అంత్యదినాల్లో ముఖ్యం, రాబోయే మహాశ్రమల కాలంలో మరింత ప్రాముఖ్యం. (యెహె. 38:10-12; మీకా 5:5, 6) కాబట్టి, ప్రియమైన పెద్దలారా ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి క్రమంగా సమయం కేటాయించండి, దాన్ని ఈ రోజే మొదలుపెట్టండి.

10. ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి పెద్దలు ఎలా సమయం కేటాయించవచ్చు?

10 ముఖ్యమైన సంఘ బాధ్యతలను చూసుకోవడంలో మీరు ఇప్పటికే బిజీగా ఉన్నారని మాకు తెలుసు. అయితే, వాటికోసం మీరు వెచ్చించే సమయంలో కొంత భాగాన్ని ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి ఉపయోగించండి. (ప్రసం. 3:1) అలా చేసినప్పుడు మీరు మీ సమయాన్ని చక్కగా ఉపయోగించిన వాళ్లవుతారు, ముందుముందు మీ సంఘం ఎంతో ప్రయోజనం పొందుతుంది.

శిక్షణ కోసం వాళ్ల హృదయాల్ని సిద్ధం చేయండి

11. (ఎ) వేర్వేరు దేశాలకు చెందిన పెద్దలు ఇచ్చిన సలహాల్లో ఏ ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది? (బి) సామెతలు 15:22 ప్రకారం, ఆ సలహాలను చర్చించడం వల్ల ప్రయోజనం ఏమిటి?

11 ప్రపంచవ్యాప్తంగా చాలామంది పెద్దలు తోటి సహోదరులకు సమర్థవంతంగా శిక్షణ ఇస్తున్నారు. ఆ పనిని ఎలా చేస్తున్నారని వాళ్లలో కొంతమందిని అడిగినప్పుడు, వాళ్లు వేర్వేరు దేశాల్లో, పరిస్థితుల్లో జీవిస్తున్నా ఆశ్చర్యకరంగా అందరూ దాదాపు ఒకే సలహా ఇచ్చారు. b దీన్నిబట్టి ఏమి అర్థమౌతుంది? “ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను” ఉన్న సహోదరులు లేఖనాధార శిక్షణ వల్ల ప్రయోజనం పొందుతున్నారు. (1 కొరిం. 4:17) ఆ పెద్దలు ఇచ్చిన కొన్ని సలహాల గురించి ఈ ఆర్టికల్‌లో, తర్వాత ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.—సామె. 15:22.

12. పెద్దలు ఏ పని చేయాలి? ఎందుకు?

12 పెద్దలు ముందుగా, శిక్షణ కోసం అనుకూల పరిస్థితులు కల్పించాలి. అది ఎందుకు ముఖ్యం? ఓ రైతు విత్తనాలు నాటేముందు నేలను దున్ని సిద్ధం చేస్తాడు. అలాగే పెద్దలు కూడా సహోదరులకు కొత్త నైపుణ్యాలు నేర్పించే ముందు వాళ్ల హృదయాల్ని సిద్ధం చేయాలి. ఆ పనిని ఎలా చేయవచ్చు? వాళ్లు ఈ విషయంలో సమూయేలు ప్రవక్త పాటించిన పద్ధతిని అనుసరించవచ్చు.

13-15. (ఎ) యెహోవా సమూయేలుకు ఏ పని అప్పగించాడు? (బి) ఆ పనిని సమూయేలు ఎలా చేశాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (సి) ఈ వృత్తాంతం విషయంలో నేటి పెద్దలకు ఎందుకు ఆసక్తి ఉండాలి?

13 సుమారు 3,000 సంవత్సరాల క్రితం ఓ రోజున, వృద్ధుడైన సమూయేలు ప్రవక్తకు యెహోవా ఇలా చెప్పాడు, “నా జనులైన ఇశ్రాయేలీయుల మీద వానిని అధికారినిగా అభిషేకించుటకుగాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశములోనుండి ఒక మనుష్యుని నీయొద్దకు రప్పించుదును.” (1 సమూ. 9:15, 16) తానిక ఇశ్రాయేలీయుల నాయకునిగా ఉండలేనని, యెహోవా చెప్పినట్లు వేరేవ్యక్తిని నాయకునిగా అభిషేకించాలని సమూయేలు అర్థంచేసుకున్నాడు. దాంతో అతన్ని ఇశ్రాయేలు రాజుగా సిద్ధం చేయడానికి ఏమి చేయాలో ఆలోచించుకుని సమూయేలు ఓ ప్రణాళిక వేసుకున్నాడు.

14 ఆ తర్వాత రోజు సమూయేలు సౌలును చూసినప్పుడు, “ఇతడే నేను నీతో చెప్పిన మనిషి” అని యెహోవా చెప్పాడు. వెంటనే సమూయేలు తన ప్రణాళికను అమలుచేశాడు. ఆయన సౌలుతో మాట్లాడడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటుచేశాడు. సౌలును, అతని పనివాణ్ణి భోజనానికి ఆహ్వానించి, వాళ్లను భోజనశాలలోని ప్రధాన స్థానాల్లో కూర్చోబెట్టాడు. సౌలుకు శ్రేష్ఠమైన మాంసాన్ని వడ్డిస్తూ సమూయేలు ఇలా అన్నాడు, ‘ఈ ప్రత్యేకమైన సందర్భం కోసం నీ కొరకే ఈ మాంసం భద్రపర్చబడింది.’ [పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌] భోజనం అయ్యాక ఆయన సౌలును తన ఇంటికి ఆహ్వానించాడు. దారిలో వాళ్లిద్దరూ సరదాగా మాట్లాడుకున్నారు. ఇంటికి వచ్చాక వాళ్లిద్దరూ డాబాపైకి వెళ్లారు, అప్పుడు సమూయేలు “సౌలుతో మిద్దె మీద” చాలాసేపు మాట్లాడాడు. అలా వాళ్లిద్దరూ నిద్రపోయేదాకా మాట్లాడుకుంటూ ఉన్నారు. తర్వాత రోజు సమూయేలు సౌలును అభిషేకించి, ముద్దు పెట్టుకుని మరికొన్ని సలహాలు ఇచ్చాడు. అలా సమూయేలు సౌలును సిద్ధం చేసి, పంపించాడు.—1 సమూ. 9:17-27; 10:1.

15 నిజమే, ఓ వ్యక్తిని రాజుగా అభిషేకించడం, సంఘంలో బాధ్యతలు చేపట్టేలా ఓ సహోదరునికి శిక్షణ ఇవ్వడం ఒక్కటి కాదు. అయినా, సమూయేలు సౌలును సిద్ధం చేసిన విధానం నుండి నేటి పెద్దలు ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. వాటిలో రెండింటిని ఇప్పుడు చూద్దాం.

ఇష్టంగా శిక్షణ ఇవ్వండి, మంచి స్నేహితులుగా ఉండండి

16. (ఎ) ఇశ్రాయేలీయులు తమకో రాజు కావాలని అడిగినప్పుడు సమూయేలు ఎలా స్పందించాడు? (బి) యెహోవా అప్పగించిన పనిని సమూయేలు ఎలా చేశాడు?

16 ఇష్టంగా చేయండి, వెనకాడకండి. తమకు ఓ రాజు కావాలని ఇశ్రాయేలీయులు అడిగినప్పుడు, వాళ్లు తనను వద్దనుకుంటున్నారని సమూయేలు మొదట్లో చాలా నిరుత్సాహపడ్డాడు. (1 సమూ. 8:4-8) నిజానికి వాళ్లు అడిగింది సమూయేలుకు ఏమాత్రం నచ్చలేదు. అందుకే, వాళ్లు చెప్పినట్లు చేయమని యెహోవా ఆయనకు మూడుసార్లు చెప్పాల్సివచ్చింది. (1 సమూ. 8:7, 9, 22) అయినప్పటికీ, సమూయేలు తన స్థానంలో రాబోయే వ్యక్తి మీద ఏమాత్రం కోపం లేదా అసూయ పెంచుకోలేదు. సౌలును అభిషేకించమని యెహోవా చెప్పినప్పుడు, సమూయేలు వెనకాడలేదు. అంతేకాదు, ఏదో చేయాలి కదా అన్నట్లు కాకుండా, యెహోవా మీద ప్రేమతో ఇష్టంగా చేశాడు.

17. నేడు పెద్దలు సమూయేలును ఎలా అనుకరిస్తారు? దానివల్ల వాళ్లు ఎలాంటి ఆనందం పొందుతారు?

17 సమూయేలులాగే, ఇప్పుడున్న అనుభవంగల పెద్దలు కూడా ఇతరులకు ఎంతో ప్రేమతో శిక్షణ ఇస్తారు. (1 పేతు. 5:2) అలాంటి పెద్దలు, తమ బాధ్యతల్ని పంచుకోవాల్సి వస్తుందేమోనని భయపడరు కానీ, ఇష్టంగా శిక్షణ ఇస్తారు. తాము శిక్షణ ఇస్తున్న సహోదరుల్ని పోటీదారులుగా కాకుండా, సంఘ అవసరాలను తీర్చడంలో తమతోపాటు ‘కలిసి పనిచేసే వాళ్లుగా’ చూస్తూ అమూల్యంగా ఎంచుతారు. (2 కొరిం. 1:24, పరిశుద్ధ బైబల్‌, ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; హెబ్రీ. 13:16) ఆ సహోదరులు సంఘాన్ని వృద్ధి చేయడానికి తమ సామర్థ్యాలను ఉపయోగించడం చూసినప్పుడు, ఆ పెద్దలు ఎంతో ఆనందిస్తారు.—అపొ. 20:35.

18, 19. ఓ సహోదరునికి శిక్షణ ఇవ్వడానికి ముందు ఒక పెద్ద ఏమి చేయాలి? అది ఎందుకు ప్రాముఖ్యం?

18 కేవలం బోధకునిగానే కాదు, స్నేహితునిగా కూడా ఉండండి. సమూయేలు సౌలును చూసిన వెంటనే, అతని తలమీద నూనెపోసి రాజుగా అభిషేకించి ఉండవచ్చు. కానీ అలాచేస్తే, సౌలు అభిషేకించబడ్డ రాజు అవుతాడేగానీ దేవుని ప్రజల్ని నడిపించడానికి సిద్ధంగా ఉండడు. అందుకే సమూయేలు చాలా సమయం కేటాయించి, ఆ పనికోసం సౌలు హృదయాన్ని సిద్ధం చేశాడు. ఆయన సౌలును అభిషేకించడానికి సరైన సమయం కోసం చూశాడు. వాళిద్దరూ కలిసి తృప్తిగా భోజనం చేశారు, సరదాగా కలిసి నడిచారు, చాలాసేపు మాట్లాడుకున్నారు, విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాతే ఆయన సౌలును అభిషేకించాడు.

ఇతరులకు శిక్షణ ఇచ్చేముందు వాళ్లతో స్నేహం చేయండి (18, 19 పేరాలు చూడండి)

19 నేడు కూడా, ఒక సంఘ పెద్ద ఓ సహోదరునికి శిక్షణ ఇచ్చే ముందు, అతనితో స్నేహం చేయడానికి కృషిచేయాలి. ఎలా స్నేహం చేయాలనేది స్థానిక పరిస్థితుల్ని, పద్ధతుల్ని బట్టి మారుతుంది. మీరు ఏ ప్రాంతంలో నివసిస్తున్నా, మీరెంత బిజీగా ఉన్నా మీరు శిక్షణ ఇస్తున్న సహోదరునితో సమయం గడపండి. అప్పుడు, మీరు తనను చాలా ముఖ్యమైన వ్యక్తిగా ఎంచుతున్నారని అతనికి అర్థమౌతుంది. (రోమీయులు 12:10 చదవండి.) మీరు చూపించే ప్రేమకు, శ్రద్ధకు ఆ వ్యక్తి ఎంతో కృతజ్ఞతతో ఉంటాడు.

20, 21. (ఎ) శిక్షణ ఇచ్చేటప్పుడు మంచి ఫలితాలు సాధించాలంటే ఏమి చేయాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

20 పెద్దలారా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మంచి ఫలితాలు సాధించాలంటే మీరు శిక్షణ ఇవ్వడాన్ని ప్రేమించడంతోపాటు, శిక్షణ పొందుతున్న వ్యక్తిని కూడా ప్రేమించాలి. (యోహాను 5:20తో పోల్చండి.) అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే మీకు తనమీద నిజంగా శ్రద్ధ ఉందని అతను గమనించినప్పుడే, మీరు చెప్పేవి నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. కాబట్టి పెద్దలారా, శిక్షణ ఇవ్వడంతోపాటు మంచి స్నేహితులుగా ఉండడానికి కూడా కృషిచేయండి.—సామె. 17:17; యోహా. 15:15.

21 ఓ సహోదరుని హృదయాన్ని సిద్ధం చేసిన తర్వాత, ఓ పెద్ద అతనికి శిక్షణ ఇవ్వడం ప్రారంభించవచ్చు. అందుకోసం ఎలాంటి పద్ధతులు ఉపయోగించవచ్చు? దీని గురించి తర్వాతి ఆర్టికల్‌లో పరిశీలిద్దాం.

a ఈ ఆర్టికల్‌, తర్వాత ఆర్టికల్‌ ముఖ్యంగా పెద్దలను మనసులో ఉంచుకుని తయారుచేశాం. అయితే వీటిలోని విషయాలమీద ప్రతీఒక్కరికి ఆసక్తి ఉండాలి. ఎందుకు? ఎందుకంటే, వీటిని పరిశీలించిన తర్వాత, సంఘంలో బాధ్యతలు చేపట్టాలంటే తమకు శిక్షణ అవసరమని సహోదరులందరూ అర్థంచేసుకుంటారు. సంఘంలో శిక్షణ పొందిన సహోదరులు ఎక్కువమంది ఉంటే, సంఘంలోని వాళ్లందరూ ప్రయోజనం పొందుతారు.

b అమెరికా, ఆస్ట్రేలియా, కొరియా, జపాన్‌, దక్షిణ ఆఫ్రికా, నమీబియా, నైజీరియా, ఫ్రాన్స్‌, ఫ్రెంచ్‌ గయానా, బంగ్లాదేశ్‌, బెల్జియం, బ్రెజిల్‌, మెక్సికో, రష్యా, రియూనియన్‌ దేశాలకు చెందిన పెద్దలను ఆ ప్రశ్న అడిగాం.