పెద్దలు ఇతరులకు ఏయే విధాలుగా శిక్షణ ఇస్తారు?
“నావలన వినిన సంగతులను . . . నమ్మకమైన మనుష్యులకు అప్పగింపుము.”—2 తిమో. 2:2.
1. (ఎ) దేవుని ప్రజలకు ఏ విషయం తెలుసు? అది మన కాలానికి ఎలా వర్తిస్తుంది? (బి) ఈ ఆర్టికల్‌లో దేనిగురించి చూస్తాం?
శిక్షణవల్ల మంచి ఫలితాలు వస్తాయని దేవుని ప్రజలకు ఎప్పటినుండో తెలుసు. ఉదాహరణకు, అబ్రాహాము ‘శిక్షణ పొందిన’ తన సేవకుల్ని ఉపయోగించి లోతును శత్రువుల నుండి రక్షించాడు. (ఆది. 14:14-16, పరిశుద్ధ బైబల్, ఈజీ-టు-రీడ్ వర్షన్) రాజైన దావీదు కాలంలో, ‘శిక్షణ పొందిన’ గాయకులు పాటలు పాడుతూ యెహోవాను స్తుతించేవాళ్లు. (1 దిన. 25:7, పరిశుద్ధ బైబల్, ఈజీ-టు-రీడ్ వర్షన్) నేడు, మనం కూడా సాతానుతో అతని లోకంతో పోరాడుతున్నాం. (ఎఫె. 6:11-13) అలాగే, యెహోవా నామం గురించి ఇతరులకు చెప్తూ ఆయన్ను స్తుతించడానికి కృషి చేస్తున్నాం. (హెబ్రీ. 13:15, 16) ఆ పనుల్లో మంచి ఫలితాలు సాధించాలంటే మనం కూడా వాళ్లలాగే శిక్షణ పొందాలి. ఇతరులకు శిక్షణనిచ్చే బాధ్యతను యెహోవా సంఘపెద్దలకు అప్పగించాడు. (2 తిమో. 2:2) సహోదరులకు శిక్షణ ఇవ్వడానికి కొంతమంది పెద్దలు ఎలాంటి పద్ధతులు ఉపయోగించారో ఇప్పుడు చూద్దాం.
యెహోవామీద ప్రేమ పెంచుకునేలా సహాయం చేయండి
2. సహోదరులకు కొత్త మెళకువలు నేర్పించే ముందు పెద్దలు ఏమి చేయవచ్చు? ఎందుకు?
2 సంఘపెద్దలు చేసేపనిని, ఓ రైతు చేసే పనితో పోల్చవచ్చు. రైతు విత్తనాలు నాటేముందు, నేలను సారవంతం చేయడానికి కొన్నిసార్లు ఎరువులు వేయాల్సి రావచ్చు. దానివల్ల మొక్కలు బలంగా ఎదుగుతాయి. అలాగే పెద్దలు కూడా సహోదరులకు కొత్త మెళకువలు నేర్పించే ముందు వాళ్లతో కొన్ని బైబిలు సూత్రాల గురించి మాట్లాడాల్సి రావచ్చు. అప్పుడు వాళ్లు ఆ మెళకువలను పాటించడానికి సిద్ధంగా ఉంటారు.—1 తిమో. 4:6.
3. (ఎ) ఓ సంఘపెద్ద, శిక్షణ ఇస్తున్న సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు మార్కు 12:29, 30లోని మాటల్ని ఎలా ఉపయోగించవచ్చు? (బి) సంఘపెద్ద చేసే ప్రార్థనవల్ల శిక్షణ పొందే వ్యక్తి ఎలా ప్రయోజనం పొందుతాడు?
3 పెద్దలారా, మీరు శిక్షణ ఇస్తున్న వ్యక్తి ఆలోచనలను, భావాలను సత్యం ఎంతగా ప్రభావితం చేసిందో మీరు అర్థం చేసుకోవడం ముఖ్యం. అందుకోసం మీరు అతన్ని ఇలా అడగవచ్చు, ‘యెహోవాకు సమర్పించుకోవడం వల్ల మీ జీవన విధానంలో ఎలాంటి మార్పు వచ్చింది?’ అలా అడగడం ద్వారా, యెహోవాను పూర్ణహృదయంతో సేవించాలంటే ఏమి చేయాలో మీరిద్దరూ మాట్లాడుకోగలుగుతారు. (మార్కు 12:29, 30 చదవండి.) అలా మాట్లాడుకున్న తర్వాత మీరు ఆ సహోదరునితో కలిసి యెహోవాకు ప్రార్థించవచ్చు. సరిగ్గా శిక్షణ పొందేలా అతనికి పరిశుద్ధాత్మను ఇవ్వమని మీరు ప్రార్థనలో అడగవచ్చు. మీరు తన కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినప్పుడు ఆ సహోదరుడు ఎంతో ప్రోత్సాహం పొందుతాడు.
4. (ఎ) శిక్షణ పొందేవాళ్లు ప్రగతి సాధించడానికి ఏ బైబిలు వృత్తాంతాలు సహాయం చేస్తాయి? (బి) సహోదరులకు శిక్షణ ఇస్తున్నప్పుడు పెద్దల లక్ష్యం ఏమై ఉండాలి?
4 శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, ఇతరులకు సహాయం చేయడం, నమ్మదగినవాళ్లుగా, వినయంగా ఉండడం ఎందుకు ముఖ్యమో చూపించే కొన్ని బైబిలు వృత్తాంతాలను చర్చించండి. (1 రాజు. 19:19-21; నెహె. 7:2; 13:13; అపొ. 18:24-26) నేలకు పోషకాలు ఎంత ముఖ్యమో, శిక్షణ పొందే సహోదరులకు ఈ లక్షణాలు అంత ముఖ్యం. వాళ్లు ఆధ్యాత్మికంగా త్వరగా ఎదగడానికి అవి సహాయం చేస్తాయి. ఫ్రాన్స్‌కు చెందిన జాన్ క్లోడ్ అనే పెద్ద ఇలా చెప్తున్నాడు, ‘శిక్షణ పొందే సహోదరులు బైబిలు సూత్రాల ఆధారంగా మంచి నిర్ణయాలు తీసుకునేలా సహాయం చేయడమే నా లక్ష్యం. వాళ్లు దేవుని వాక్యంలో ఉన్న “ఆశ్చర్యమైన సంగతులను” చూడగలిగేలా, వాళ్లతో కలిసి కొన్ని లేఖనాల్ని చదివే అవకాశం కోసం నేను చూస్తాను.’ (కీర్త. 119:18) మీరు ఇంకా ఏయే విధాలుగా సహాయం చేయవచ్చు?
లక్ష్యాలు పెట్టుకోమనండి, ఫలానా పని ఎందుకు చేయాలో చెప్పండి
5. (ఎ) శిక్షణ పొందే సహోదరులతో ఆధ్యాత్మిక లక్ష్యాల గురించి మాట్లాడడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) చిన్నప్పటి నుండే ఎందుకు శిక్షణ ఇవ్వాలి? (అధస్సూచి చూడండి.)
5 మీరు శిక్షణ ఇస్తున్న సహోదరునికి ఏ ఆధ్యాత్మిక లక్ష్యాలు ఉన్నాయో అడగండి. ఎలాంటి లక్ష్యాలు లేకపోతే, అతను చేరుకోగల ఓ లక్ష్యాన్ని పెట్టుకోవడానికి సహాయం చేయండి. ఒకప్పుడు మీరు ఏ లక్ష్యం పెట్టుకున్నారో, దాన్ని సాధించినప్పుడు మీకెంత ఆనందం కలిగిందో ఉత్సాహంగా చెప్పండి. ఈ పద్ధతి చాలా తేలికైనది, కానీ మంచి ఫలితాలు తీసుకొస్తుంది. ఆఫ్రికాలో పెద్దగా, పయినీరుగా సేవచేస్తున్న విక్టర్ ఏమంటున్నాడంటే, “నా చిన్నప్పుడు ఓ సంఘపెద్ద నా లక్ష్యాల గురించి కొన్ని ప్రశ్నలు అడిగాడు. నేను పరిచర్య గురించి సీరియస్‌గా ఆలోచించేలా ఆ ప్రశ్నలు నాకు సహాయం చేశాయి.” యౌవనంలో ఉన్నప్పుడే, వీలైతే ఇంకాముందే శిక్షణను మొదలుపెట్టడం చాలా ముఖ్యమని అనుభవమున్న పెద్దలు అంటారు. అందుకే సంఘంలో, వాళ్ల వయసుకు తగిన కొన్ని పనుల్ని అప్పగించండి. అలా చిన్నప్పుడే శిక్షణ ఇస్తే, యుక్త వయసు వచ్చాక దృష్టి మళ్లించే విషయాలు ఎన్నివున్నా వాళ్లు తమ లక్ష్యాలమీదే మనసు నిలపగలుగుతారు.—కీర్తన 71:5, 17 చదవండి. a
6. శిక్షణ ఇచ్చేటప్పుడు యేసు ఏ ముఖ్యమైన పద్ధతిని ఉపయోగించాడు?
6 శిక్షణ పొందుతున్న సహోదరుల్ని ఎక్కువగా సేవచేసేలా ప్రోత్సహించాలంటే, ఏమి చేయాలో చెప్పడంతోపాటు ఎందుకు చేయాలో కూడా మీరు వివరించాలి. అలా చేయడం ద్వారా మీరు గొప్ప బోధకుడైన యేసును అనుకరిస్తారు. ఉదాహరణకు, సమస్త ప్రజల్ని శిష్యుల్ని చేయమని యేసు తన అపొస్తలుల్ని ఆజ్ఞాపించే ముందు, ఆ ఆజ్ఞకు ఎందుకు లోబడాలో కూడా చెప్పాడు. ఆయనిలా అన్నాడు, “పరలోకమందును భూమిమీదను నాకు సర్వాధికారము ఇయ్యబడియున్నది. కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి.” (మత్త. 28:18, 19) యేసు ఉపయోగించిన ఆ పద్ధతిని మీరెలా అనుసరించవచ్చు?
7, 8. (ఎ) శిక్షణ ఇచ్చే విషయంలో పెద్దలు యేసును ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు? (బి) శిక్షణ పొందుతున్న వాళ్లను మెచ్చుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? (సి) ఇతరులకు శిక్షణ ఇచ్చే పెద్దలు ఏ సలహాలు పాటించవచ్చు? (“ ఇతరులకు ఎలా శిక్షణ ఇవ్వాలి?” అనే బాక్సు చూడండి.)
7 మీరు ఓ సహోదరునికి ఏదైనా పని అప్పగించేటప్పుడు, ఆ పని చేయడం ఎందుకు ప్రాముఖ్యమో తెలియజేసే బైబిలు సూత్రాలను వివరించండి. అలాచేస్తే, ఆ సహోదరుడు ఏ పని చేసినా, దాని వెనకున్న బైబిలు సూత్రాల గురించి ఆలోచించడం నేర్చుకుంటాడు. ఉదాహరణకు, రాజ్యమందిర ముందుభాగం అందంగా, నడవడానికి సురక్షితంగా ఉండేలా శుభ్రం చేయమని మీరు ఓ సహోదరునికి చెప్తున్నారనుకోండి. శుభ్రంగా ఉండే రాజ్యమందిరం, ఏవిధంగా ‘మన రక్షకుడైన దేవుని ఉపదేశాన్ని అలంకరిస్తుందో’ తీతు 2:9, 10 ఉపయోగించి మీరు ఆయనకు వివరించవచ్చు. అంతేకాదు, ఆ పనివల్ల సంఘంలోని వృద్ధులు ఎలా ప్రయోజనం పొందుతారో ఆలోచించమని చెప్పండి. అలాంటి శిక్షణవల్ల ఆ సహోదరుడు నియమాల కన్నా, సంఘంలోనివాళ్ల గురించి ఎక్కువగా ఆలోచించడం నేర్చుకుంటాడు. తాను చేస్తున్న పనివల్ల సహోదరసహోదరీలు ఎలా ప్రయోజనం పొందుతున్నారో చూసినప్పుడు, ఆయన చాలా సంతోషిస్తాడు.
8 మీరు తప్పకుండా చేయాల్సిన మరో పని, మీరు ఇచ్చిన సలహాలు పాటించినందుకు ఆ సహోదరుణ్ణి మెచ్చుకోవడం. అలా చేయడం ఎందుకు ప్రాముఖ్యం? ఓ మొక్క ఎదగడానికి, బలంగా ఉండడానికి నీళ్లు చాలా అవసరం. అలాగే, ఆ సహోదరుడు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే అతన్ని మెచ్చుకోవడం చాలా ప్రాముఖ్యం.—మత్తయి 3:17తో పోల్చండి.
మరో సవాలు
9. (ఎ) సంపన్న దేశాల్లోని పెద్దలు సహోదరులకు శిక్షణ ఇవ్వడం ఎందుకు కష్టం కావచ్చు? (బి) కొంతమంది యౌవన సహోదరులు తమ జీవితంలో దేవుని సేవకు మొదటి స్థానం ఎందుకు ఇవ్వలేకపోయారు?
9 సంపన్న దేశాల్లో సేవచేస్తున్న పెద్దలకు మరో సవాలు ఎదురవ్వవచ్చు. 20లలో లేదా 30లలో ఉన్న సహోదరులను, సంఘంలో బాధ్యతలు చేపట్టేలా ప్రోత్సహించడం వాళ్లకు కష్టంగా ఉండవచ్చు. బాధ్యతల కోసం కొంతమంది యౌవన సహోదరులు ఎందుకు ముందుకు రావట్లేదో, సుమారు 20 దేశాలకు చెందిన అనుభవంగల పెద్దలు తమ అభిప్రాయాల్ని చెప్పారు. ఆధ్యాత్మిక లక్ష్యాలు పెట్టుకోమని తల్లిదండ్రులు తమ పిల్లల్ని చిన్నతనంలో ప్రోత్సహించకపోవడమే కారణమని చాలామంది పెద్దలు అన్నారు. కొంతమంది యౌవన సహోదరులు ఎక్కువ సేవ చేయాలని కోరుకున్నా వాళ్ల తల్లిదండ్రులు మాత్రం ఉన్నత విద్య, మంచి ఉద్యోగం వంటి లక్ష్యాల కోసం కృషి చేయమని ప్రోత్సహించారు. అలా, ఆ యౌవన సహోదరులు తమ జీవితంలో దేవుని సేవకు ఎన్నడూ మొదటి స్థానం ఇవ్వలేకపోయారు.—మత్త. 10:24.
10, 11. (ఎ) తన ఆలోచనా విధానాన్ని మార్చుకునేలా ఓ సహోదరునికి ఒక పెద్ద ఎలా క్రమక్రమంగా సహాయం చేయవచ్చు? (బి) అతన్ని ప్రోత్సహించడానికి ఏ లేఖనాల్ని ఉపయోగించవచ్చు? ఎందుకు? (అధస్సూచి చూడండి.)
10 ఓ సహోదరునికి సంఘంలో బాధ్యతలు చేపట్టాలనే ఆసక్తి లేనట్లు మీరు గుర్తిస్తే, అతని ఆలోచనా విధానాన్ని మార్చడానికి మీరు ఎంతో ఓపిగ్గా కృషి చేయాల్సి ఉంటుంది. కానీ అలా చేయడం అసాధ్యమేమీ కాదు. ఓ మొక్క తిన్నగా ఎదగడానికి ఓ రైతు దాని కాండాన్ని నెమ్మదిగా వంచుతూ సరిచేస్తాడు. అలాగే, సంఘంలోని బాధ్యతల విషయంలో తన ఆలోచనా విధానాన్ని మార్చుకోవడానికి ఆ సహోదరునికి మీరు క్రమక్రమంగా సహాయం చేయవచ్చు. ఏవిధంగా?
11 ఆ సహోదరునితో స్నేహం పెంచుకోండి. సంఘానికి అతని అవసరం ఉందని చెప్పండి. ఆ తర్వాత, తాను యెహోవాకు చేసుకున్న సమర్పణ గురించి ఆలోచింపజేసే కొన్ని లేఖనాల్ని అతనితో చర్చించండి. (ప్రసం. 5:4, 5; యెష. 6:8; మత్త. 6:24, 33; లూకా 9:57-62; 1 కొరిం. 15:58; 2 కొరిం. 5:15; 13:5) అతని హృదయంలో ఏముందో తెలుసుకోవడానికి ఈ ప్రశ్నలు అడగండి, ‘మీరు యెహోవాకు సమర్పించుకున్నప్పుడు ఏమని మాటిచ్చారు? మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు యెహోవా ఎలా భావించి ఉంటాడని మీరనుకుంటున్నారు?’ (సామె. 27:11) ‘సాతానుకు ఎలా అనిపించి ఉంటుంది?’ (1 పేతు. 5:8) జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న లేఖనాలు అతని హృదయంపై ఎంతో ప్రభావం చూపించగలవు.—హెబ్రీయులు 4:12 చదవండి. b
శిక్షణ పొందుతున్న సహోదరులారా, నమ్మకంగా ఉండండి
12, 13. (ఎ) ఏలీయాను సేవించే విషయంలో ఎలీషాకు ఎలాంటి వైఖరి ఉంది? (బి) నమ్మకంగా ఉన్నందుకు యెహోవా ఎలీషాను ఎలా ఆశీర్వదించాడు?
12 శిక్షణ పొందుతున్న యువ సహోదరులారా, సంఘానికి మీ సహాయం అవసరం. మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మీ ఆలోచనా విధానం ఎలా ఉండాలి? దీన్ని తెలుసుకోవడానికి, ప్రాచీనకాలంలో ఏలీయా ప్రవక్త దగ్గర శిక్షణ పొందిన ఎలీషా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను పరిశీలిద్దాం.
13 దాదాపు 3,000 సంవత్సరాల క్రితం, ఏలీయా ప్రవక్త యౌవనుడైన ఎలీషాను తనకు సహాయకునిగా ఉండమని ఆహ్వానించాడు. ఎలీషా వెంటనే ఆ ఆహ్వానాన్ని అంగీకరించి, ఏలీయాకు నమ్మకంగా సేవచేశాడు. చిన్నచిన్న పనుల్ని కూడా వినయంగా చేశాడు. (2 రాజు. 3:11) అలా ఆయన సుమారు ఆరు సంవత్సరాల పాటు ఏలీయా దగ్గర శిక్షణ పొందాడు. ఏలీయా, ఇశ్రాయేలులో ప్రవక్తగా తన సేవ ముగుస్తుందనగా ఇక తన వెంట రావద్దని ఎలీషాకు చెప్పాడు. కానీ ఎలీషా మాత్రం మూడుసార్లూ “నేను నిన్ను విడువను” అని అన్నాడు. తనకు శిక్షణ ఇచ్చిన ఏలీయా దగ్గర వీలైనంత ఎక్కువ కాలం ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాడు. ఎలీషా విశ్వసనీయంగా, నమ్మకంగా ఉన్నందుకు యెహోవా ఆయన్ను ఆశీర్వదించాడు. ఏలీయాను సుడిగాలిచేత తీసుకెళ్తున్నప్పుడు, ఆ అద్భుతాన్ని చూసే అవకాశాన్ని ఎలీషాకు ఇచ్చాడు.—2 రాజు. 2:1-12.
14. (ఎ) శిక్షణ పొందుతున్న సహోదరులు ఎలీషాను ఎలా అనుకరించవచ్చు? (బి) వాళ్లు తమకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం ఎందుకు ప్రాముఖ్యం?
14 మీరు ఎలీషాను ఎలా అనుకరించవచ్చు? ఎలాంటి నియామకాన్నైనా చేయడానికి ముందుకు రండి, అది ఎంత చిన్నదైనా సరే. మీకు శిక్షణ ఇస్తున్న సంఘపెద్ద మీ స్నేహితుడని గుర్తుంచుకోండి. ఆయన మీకోసం చేస్తున్నదాని పట్ల మీకెంతో కృతజ్ఞత ఉందని ఆయనకు చెప్పండి. మీరు ఆయన నుండి ఇంకా నేర్చుకోవాలనుకుంటున్నట్లు చూపించండి. అన్నిటికన్నా ముఖ్యంగా, మీకిచ్చిన పనిని నమ్మకంగా చేయండి. ఎందుకు? మీరు నమ్మదగినవాళ్లని, ఏ పని ఇచ్చినా చేస్తారని పెద్దలు గమనించినప్పుడు, మీకు సంఘంలో మరిన్ని బాధ్యతలు ఇవ్వాలని యెహోవా కోరుకుంటున్నాడని వాళ్లు నమ్ముతారు.—కీర్త. 101:6; 2 తిమోతి 2:2 చదవండి.
గౌరవం చూపించండి
15, 16. (ఎ) ఏలీయా మీద గౌరవం ఉందని ఎలీషా ఎలా చూపించాడు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) ఇతర ప్రవక్తలు ఎలీషాను ఎందుకు నమ్మగలిగారు?
15 శిక్షణ ఇస్తున్న పెద్దల్ని గౌరవించడం చాలా ప్రాముఖ్యమని కూడా ఎలీషా వృత్తాంతం చూపిస్తోంది. యెరికోలో కొంతమంది ప్రవక్తల్ని కలిసిన తర్వాత ఏలీయా, ఎలీషా యొర్దాను నది దగ్గరికి వచ్చారు. అక్కడ ఏలీయా తన పైవస్త్రాన్ని చుట్టి, దానితో నీళ్లమీద కొట్టినప్పుడు ఆ నది రెండుగా విడిపోయింది. అప్పుడు, వాళ్లిద్దరూ ఆ పొడినేల మీద నడుస్తూ ‘మాట్లాడుకున్నారు.’ ఏలీయా చెప్పిన ప్రతీ విషయాన్ని ఎలీషా శ్రద్ధగా వింటూ, ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. తనకన్నీ తెలుసని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఏలీయా సుడిగాలిచేత కొనిపోబడిన తర్వాత ఎలీషా యొర్దాను నది దగ్గరకు తిరిగొచ్చి, “ఏలీయాయొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని అంటూ, ఏలీయా వస్త్రంతో నీళ్లమీద కొట్టాడు. అప్పుడు, అది మళ్లీ రెండు పాయలుగా విడిపోయింది.—2 రాజు. 2:8-14.
16 ఎలీషా చేసిన మొట్టమొదటి అద్భుతం, అచ్చం ఏలీయా చేసిన అద్భుతంలాగే ఉందనే సంగతి గమనించండి. దీని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? ఇప్పుడు తానే ప్రవక్త కాబట్టి, ఏలీయా చేసినట్టు కాకుండా ఏదో కొత్తగా ప్రయత్నించాలని ఎలీషా అనుకోలేదు. బదులుగా, ఏలీయా పద్ధతుల్నే అనుకరిస్తూ, ఆయన మీద గౌరవం ఉందని చూపించాడు. దానివల్ల తోటిప్రవక్తలు కూడా ఎలీషాను నమ్మగలిగారు. (2 రాజు. 2:15) ఎలీషా 60 ఏళ్లపాటు ప్రవక్తగా సేవచేశాడు. అంతేకాదు, ఏలీయా చేసినవాటి కన్నా ఇంకా ఎక్కువ అద్భుతాలు చేసేలా యెహోవా ఎలీషాకు శక్తినిచ్చాడు. శిక్షణ పొందుతున్న సహోదరులు దీనినుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు?
17. (ఎ) శిక్షణ పొందుతున్న సహోదరులు ఎలీషాకున్న వైఖరిని ఎలా చూపించవచ్చు? (బి) ముందుముందు యెహోవా వాళ్లను ఎలా ఉపయోగించుకోవచ్చు?
17 మీరు సంఘంలో బాధ్యతలు చేపట్టినప్పుడు, సంఘంలో అప్పటివరకు పాటించిన పద్ధతుల్నే మీరూ పాటించండి. వాటిని పూర్తిగా మార్చేయాలని అనుకోకండి. సంఘ అవసరాల్నిబట్టి, లేదా సంస్థ చెప్తే ఆ పద్ధతుల్ని మార్చాలి గానీ మీకు నచ్చనందుకు కాదు. తనకు శిక్షణ ఇచ్చిన ఏలీయా పద్ధతుల్నే పాటించడం ద్వారా ఆయనమీద గౌరవం ఉందని ఎలీషా చూపించాడు. తోటి ప్రవక్తల నమ్మకాన్ని కూడా సంపాదించుకున్నాడు. అలాగే, మీకు శిక్షణ ఇచ్చిన సంఘపెద్దలు అనుసరించిన లేఖనాధార పద్ధతుల్నే మీరూ పాటిస్తే, మీకు వాళ్లమీద గౌరవం ఉందని చూపిస్తారు. అంతేకాదు, మీ సహోదరసహోదరీల నమ్మకాన్ని సంపాదించుకుంటారు. (1 కొరింథీయులు 4:17 చదవండి.) అయితే, మీకు అనుభవం పెరిగేకొద్దీ, సంఘం అభివృద్ధి సాధించడానికి సంస్థ చేస్తున్న మార్పులను ఆచరణలో పెట్టగలుగుతారు. ఏలీయాకన్నా ఎలీషా గొప్పకార్యాలు చేసినట్లే, యెహోవా సహాయంతో ముందుముందు మీరు కూడా, మీకు శిక్షణ ఇచ్చిన వాళ్లకన్నా గొప్పవాటిని చేయవచ్చు.—యోహా. 14:12.
18. సంఘంలోని సహోదరులకు శిక్షణ ఇవ్వడం ఇప్పుడు ఎందుకు అత్యవసరం?
18 ఈ ఆర్టికల్‌లో, ముందటి ఆర్టికల్‌లో ఉన్న సలహాలు, ఇతరులకు శిక్షణ ఇవ్వడానికి కృషి చేసేలా ఎంతోమంది పెద్దల్ని ప్రోత్సహిస్తాయని ఆశిస్తున్నాం. అలాగే, అర్హులైన సహోదరులు శిక్షణ పొందడానికి ముందుకొస్తారని, నేర్చుకున్న విషయాల్ని సంఘసభ్యుల మేలు కోసం ఉపయోగిస్తారని కూడా ఆశిస్తున్నాం. ఇలాంటి శిక్షణ ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలన్నిటినీ బలపరుస్తుంది. అంతేకాదు, రాబోయే ప్రాముఖ్యమైన కాలాల్లో నమ్మకంగా ఉండేందుకు మనలో ప్రతిఒక్కరికీ సహాయం చేస్తుంది.
a యౌవనుడైన ఓ సహోదరునికి 20 ఏళ్లకన్నా తక్కువ వయసున్నా, సంఘంలో సేవ చేయడానికి కావాల్సిన పరిణతి, వినయం అవసరమైన మరితర లక్షణాలు ఉంటే, పెద్దలు అతన్ని పరిచర్య సేవకునిగా సిఫారసు చేయవచ్చు.—1 తిమో. 3:8-10, 12; కావలికోట (ఇంగ్లీషు) జూలై 1, 1989 సంచిక 29వ పేజీ చూడండి.
b కావలికోట ఏప్రిల్ 15, 2012, 14-16 పేజీల్లో 8-13 పేరాల్లోని సమాచారాన్ని, అలాగే “దేవుని ప్రేమలో నిలిచి ఉండండి” పుస్తకంలో 16వ అధ్యాయంలో, 1-3 పేరాల్లోని సమాచారాన్ని కూడా మీరు చర్చించవచ్చు.