కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాతో మీ సంబంధం ఎంత బలంగా ఉంది?

యెహోవాతో మీ సంబంధం ఎంత బలంగా ఉంది?

“దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.”యాకో. 4:8.

1. యెహోవాతో మన సంబంధాన్ని ఎందుకు బలంగా ఉంచుకోవాలి?

 మీరు బాప్తిస్మం తీసుకున్న ఓ యెహోవాసాక్షా? అయితే, మీ దగ్గర విలువైన సంపద ఉన్నట్టే. యెహోవాతో మీకున్న వ్యక్తిగత సంబంధమే ఆ సంపద. కానీ సాతాను లోకం వల్ల, మన సొంత అపరిపూర్ణత వల్ల ఆ సంబంధం బలహీనపడవచ్చు. అందుకే మనందరం యెహోవాతో మన సంబంధాన్ని వీలైనంత బలంగా ఉంచుకోవాలి.

2. యెహోవాతో మన సంబంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

2 మీరు యెహోవాను ఓ నిజమైన వ్యక్తిగా, స్నేహితునిగా భావిస్తున్నారా? ఆయనతో మీకున్న సంబంధాన్ని మరింత బలపర్చుకోవాలని కోరుకుంటున్నారా? దానికోసం మీరేమి చేయాలో యాకోబు 4:8 చెప్తుంది. అక్కడిలా ఉంది, “దేవునియొద్దకు రండి, అప్పుడాయన మీయొద్దకు వచ్చును.” అంటే మీరు యెహోవాకు దగ్గరవ్వడానికి కృషిచేస్తే, ఆయన కూడా మీకు దగ్గరవుతాడు. మీరెంత ఎక్కువగా అలా చేస్తే, అంత ఎక్కువగా ఆయన్ను ఓ నిజమైన వ్యక్తిలా చూడగలుగుతారు, ఆయనతో మీ సంబంధం కూడా బలపడుతుంది. అప్పుడు మీరుకూడా యేసులానే భావిస్తారు. ఆయనిలా చెప్పాడు, “నన్ను పంపినవాడు సత్యవంతుడు [‘నిజమైన వ్యక్తి,’ NW] . . . నేను ఆయనను ఎరుగుదును.” (యోహా. 7:28, 29) మీరు యెహోవాకు ఇంకా దగ్గరవ్వడానికి ఏమేమి చేయవచ్చు?

మీరు దేవునితో ఎలా సంభాషించవచ్చు? (3వ పేరా చూడండి)

3. మనం యెహోవాతో ఎలా సంభాషించవచ్చు?

3 మీరు యెహోవాకు దగ్గరవ్వాలంటే, ఆయనతో క్రమంగా సంభాషించడం చాలా ప్రాముఖ్యం. మరి, మీరు దేవునితో ఎలా సంభాషించగలరు? మీరూ, దూరప్రాంతంలో ఉంటున్న మీ స్నేహితుడూ ఎలా మాట్లాడుకుంటారో ఒకసారి ఆలోచించండి. మీరిద్దరూ తరచూ ఉత్తరాలు రాసుకుంటారు లేదా ఫోన్‌లో మాట్లాడుకుంటారు. అదేవిధంగా, మీరు క్రమంగా యెహోవాకు ప్రార్థించడం ద్వారా ఆయనతో మాట్లాడతారు. (కీర్తన 142:2 చదవండి.) మరి, యెహోవా చెప్పేది మీరెలా వినవచ్చు? ఆయన వాక్యమైన బైబిల్ని క్రమంగా చదవడం, ధ్యానించడం ద్వారా మీరు ఆయన చెప్పే మాటల్ని వింటారు. (యెషయా 30:20, 21 చదవండి.) సంభాషణవల్ల, యెహోవాతో మీ సంబంధం ఎలా బలపడుతుందో, ఆయనెలా మీకు నిజమైన స్నేహితుడవుతాడో ఇప్పుడు చూద్దాం.

మీరు బైబిలు చదువుతున్నప్పుడు యెహోవా మీతో మాట్లాడతాడు

4, 5. బైబిలు ద్వారా యెహోవా మీతో ఎలా మాట్లాడతాడు? ఓ ఉదాహరణ చెప్పండి.

4 నిజమే, బైబిల్లోని సందేశాన్ని దేవుడు మనుషులందరి కోసం ఇచ్చినా, మీరు యెహోవాకు దగ్గరయ్యేలా అది సహాయం చేయగలదు. ఎలా? మీరు క్రమంగా బైబిలు చదువుతూ, దాన్ని అధ్యయనం చేస్తుండగా, చదువుతున్న వాటి గురించి మీరెలా భావిస్తున్నారో పరిశీలించుకోండి. అంతేకాక, నేర్చుకున్నవాటిని ఎలా పాటించవచ్చో ఆలోచించండి. అలాచేస్తే, మీరు యెహోవా చెప్పేది వినగలరు. అప్పుడు, ఆయన మీకు సహాయం చేసే ఓ సన్నిహిత స్నేహితుడవుతాడు, మీరు ఆయనకు ఇంకా దగ్గరవుతారు.—హెబ్రీ. 4:12; యాకో. 1:23-25.

5 ఉదాహరణకు, “భూమిమీద మీకొరకు ధనమును కూర్చుకొనవద్దు” అని యేసు చెప్పిన మాటల్ని మీరు చదివారు. అప్పుడు మీకేమనిపిస్తుంది? మీరు ఇప్పటికే యెహోవాకు మొదటి స్థానమివ్వడానికి కృషి చేస్తుంటే, ఆయన మీ విషయంలో సంతోషిస్తున్నాడని మీకు అర్థమౌతుంది. కానీ, మీరు ఎక్కువ సేవ చేయగలిగేలా నిరాడంబరంగా జీవించాల్సిన అవసరం ఉందని ఆ మాటలు గుర్తుచేస్తే? మీరు తనకు మరింత దగ్గరవ్వాలంటే ఏమి చేయాలో యెహోవా మీకు చెప్తున్నాడని అర్థం చేసుకోండి.—మత్త. 6:19, 20.

6, 7. (ఎ) మనం బైబిలు చదివినప్పుడు, యెహోవాతో మన సంబంధం ఎలా బలపడుతుంది? (బి) బైబిలు చదువుతున్నప్పుడు మన ముఖ్య ఉద్దేశం ఏమై ఉండాలి?

6 నిజమే, మనం బైబిలు చదివినప్పుడు, యెహోవాను మరింతగా సేవించగలిగేలా మనం ఇంకా ఏయే మార్పులు చేసుకోవాలో తెలుసుకుంటాం. అయితే, బైబిల్లో యెహోవా ప్రేమతో చేసిన పనుల గురించి, ఆయన అద్భుత లక్షణాల గురించి కూడా ఉంది. వాటి గురించి తెలుసుకున్నప్పుడు మనం యెహోవాను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాం. మనకు ఆయనమీద ప్రేమ పెరిగేకొద్దీ, ఆయనకు కూడా మనమీద ప్రేమ పెరుగుతుంది. అలా ఆయనతో మన సంబంధం ఇంకా బలపడుతుంది.1 కొరింథీయులు 8:3 చదవండి.

7 మనం యెహోవాకు దగ్గరవ్వాలంటే, సరైన ఉద్దేశంతో బైబిలు చదవాలి. యేసు ఇలా చెప్పాడు, “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.” (యోహా. 17:3) మనం బైబిలు చదివినప్పుడు ఎన్నో కొత్త విషయాలు, ఆసక్తికరమైన విషయాలు నేర్చుకుంటాం. కానీ, యెహోవా గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలన్న ముఖ్య ఉద్దేశంతోనే మనం బైబిలు చదవాలి.—నిర్గమకాండము 33:13 చదవండి; కీర్త. 25:4.

8. (ఎ) రాజైన అజర్యాను యెహోవా శిక్షించడం గురించి కొంతమంది ఏమనుకోవచ్చు? (బి) మీకు యెహోవా గురించి బాగా తెలిస్తే, ఆయన చేసే వాటి గురించి మీరెలా భావిస్తారు?

8 మనం యెహోవా గురించి ఎక్కువగా తెలుసుకున్నప్పుడు, ఆయన ఒకానొక సందర్భంలో ఫలానా విధంగా ఎందుకు ప్రవర్తించాడో బైబిలు చెప్పకపోయినా మనం కలతచెందం. ఉదాహరణకు, రాజైన అజర్యా యూదాను పరిపాలిస్తున్నప్పుడు, ప్రజలు అబద్ధ దేవుళ్లను ఆరాధించారు. కానీ అజర్యా మాత్రం అలా చేయలేదు. ఆయన “యెహోవా దృష్టికి నీతిగలవాడై ప్రవర్తించెను.” (2 రాజు. 15:1-5) అయినప్పటికీ, యెహోవా ఆయన్ని కుష్ఠువ్యాధితో శిక్షించాడు. ఎందుకు? ఈ వృత్తాంతంలో దానికి జవాబు లేదు. కాబట్టి, యెహోవా చేసినదాని గురించి మీకేమనిపిస్తుంది? ఆయన సరైన కారణం లేకుండా అజర్యాను శిక్షించి, అన్యాయంగా ప్రవర్తించాడని మీకనిపిస్తుందా? యెహోవా గురించి మీకు బాగా తెలిసుంటే అలా ఎన్నడూ అనుకోరు, బదులుగా ఆయనిచ్చే క్రమశిక్షణ ఎప్పుడూ సరైనదేనని మీరు నమ్ముతారు. ఆయన ఎప్పుడూ ‘మితంగానే శిక్షిస్తాడు.’ (యిర్మీ. 30:11) కాబట్టి, యెహోవా అజర్యాను ఎందుకు శిక్షించాడో మీకు తెలియకపోయినా, ఆయన సరైనదే చేశాడని మీరు నమ్మవచ్చు.

9. యెహోవా అజర్యాను ఎందుకు కుష్ఠువ్యాధితో శిక్షించాడో అర్థంచేసుకోవడానికి ఏ వివరాలు మనకు సహాయం చేస్తాయి?

9 అయితే, బైబిల్లోని మరో వృత్తాంతంలో అజర్యా గురించిన మరికొన్ని వివరాలు ఉన్నాయి. ఆయనకు ఉజ్జియా అనే పేరు కూడా ఉంది. (2 రాజు. 15:7, 32) రాజైన ఉజ్జియా “యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను” అని 2 దినవృత్తాంతములు 26:3-5, 16-21 వచనాల్లోని వృత్తాంతం చెప్తుంది. కానీ, ఆ తర్వాత “అతడు మనస్సున గర్వించి చెడిపోయెను” అని కూడా ఆ వృత్తాంతం చెప్తుంది. యాజకులు మాత్రమే చేయాల్సిన ఓ పనిని ఆయన చేయాలని చూశాడు. 81 మంది యాజకులు ఆయన చేస్తున్నది తప్పని చెప్పి, ఆపడానికి ప్రయత్నించారు. అప్పుడు ఆయనేమి చేశాడు? ఆయన చాలా గర్వంతో, కోపంతో వాళ్లమీద విరుచుకుపడ్డాడు. ఇలాంటి వివరాలు, యెహోవా అజర్యాను ఎందుకు కుష్ఠువ్యాధితో శిక్షించాడో అర్థంచేసుకోవడానికి సహాయం చేస్తాయి.

10. (ఎ) మనం యెహోవా చేసేవాటికి కారణాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు లేదు? (బి) యెహోవా ఎప్పుడూ సరైనదే చేస్తాడనే నమ్మకాన్ని మనమెలా పెంచుకోవచ్చు?

10 ఈ వృత్తాంతంలో ఉన్న ముఖ్యమైన పాఠం ఏమిటి? రాజైన అజర్యాను యెహోవా ఎందుకు శిక్షించాడో అర్థం చేసుకోవడానికి కావాల్సిన వివరాలు బైబిల్లో ఉన్నాయి. కానీ ఒకవేళ బైబిల్లో పూర్తి వివరాలు లేకపోయివుంటే అప్పుడేంటి? యెహోవా చేసింది నిజంగా సరైనదేనా అని మీరు సందేహిస్తారా? లేక, దేవుడు ఎప్పుడూ సరైనదే చేస్తాడని నమ్మడానికి కావాల్సినంత సమాచారం బైబిల్లో ఉందని అనుకుంటారా? (ద్వితీ. 32:4) యెహోవా గురించి తెలుసుకునే కొద్దీ మీకు ఆయన మీద ప్రేమ, నమ్మకం పెరుగుతాయి. అప్పుడు, మీరు యెహోవా చేసే ప్రతీ పనికి కారణాలు వెదకరు. మీరు బైబిలు చదివి అందులోని విషయాల్ని ధ్యానించినప్పుడు, యెహోవాను ఓ నిజమైన వ్యక్తిలా చూస్తారు, ఆయనకు మరింత దగ్గరౌతారు.—కీర్త. 77:12, 13.

ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు యెహోవాతో మాట్లాడతారు

11-13. యెహోవా ప్రార్థనలు వింటాడని మీకెలా తెలుసు? (ప్రారంభ చిత్రం చూడండి.)

11 ప్రార్థన ద్వారా మనం యెహోవాకు దగ్గరౌతాం. ప్రార్థనలో ఆయన్ను స్తుతిస్తాం, కృతజ్ఞతలు చెప్తాం, సహాయం కోసం అడుగుతాం. (కీర్త. 32:8) అయితే యెహోవా మీకు దగ్గరి స్నేహితుడు అవ్వాలంటే, ఆయన ప్రార్థనలను వింటాడనే నమ్మకం మీకుండాలి.

12 దేవుడు ప్రార్థనలు వినడనీ, ప్రార్థనలు కేవలం మనసు ప్రశాంతంగా ఉండడం కోసమేనని కొంతమంది అంటారు. సమస్యల గురించి జాగ్రత్తగా ఆలోచించుకుని, తమంతట తామే పరిష్కారం కనుగొనడానికి ప్రార్థన సహాయం చేస్తుందని వాళ్లు అనుకుంటారు. ప్రార్థన వల్ల ఇలాంటి ఉపయోగాలు ఉండొచ్చు అన్నమాట నిజమే. అయితే, మీరు ప్రార్థనలో యెహోవాతో మాట్లాడేటప్పుడు, ఆయన నిజంగానే వింటాడు. అలాగని ఎందుకు నమ్మవచ్చు?

13 ఈ విషయం గురించి ఆలోచించండి. యేసు పరలోకంలో ఉన్నప్పుడు, యెహోవా తన సేవకుల ప్రార్థనలకు జవాబివ్వడం స్వయంగా చూశాడు. అలాగే యేసు భూమ్మీదున్నప్పుడు, తన తండ్రికి ప్రార్థన చేస్తూ తన ఆలోచనల గురించి, భావాల గురించి చెప్పుకున్నాడు. ఓ సందర్భంలోనైతే, రాత్రంతా ప్రార్థించాడు. (లూకా 6:12; 22:40-46) యెహోవా ప్రార్థనలు వినడని యేసు అనుకొనివుంటే, అలా ప్రార్థించేవాడా? అంతేకాదు, ప్రార్థన ఎలా చేయాలో యేసు తన శిష్యులకు నేర్పించాడు. యెహోవా ప్రార్థనలు వినడని ఆయన అనుకొనివుంటే, ప్రార్థించమని తన శిష్యులకు చెప్పేవాడా? దీనిబట్టి, యెహోవా నిజంగా ప్రార్థనలు వింటాడనే విషయం యేసుకు తెలుసని చెప్పవచ్చు. అందుకే ఆయన ఓసారి తన తండ్రితో ఇలా అన్నాడు, “తండ్రీ, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడును నా మనవి వినుచున్నావని నేనెరుగుదును.” యేసులాగే మనం కూడా, యెహోవా ‘ప్రార్థన ఆలకిస్తాడనే’ నమ్మకంతో ఉండవచ్చు.—యోహా. 11:41, 42; కీర్త. 65:2.

14, 15. (ఎ) మన ప్రార్థనలో నిర్దిష్టమైన విషయాల గురించి ఎందుకు అడగాలి? (బి) యెహోవాకు దగ్గరయ్యేందుకు ఓ సహోదరికి ప్రార్థన ఎలా సహాయం చేసింది?

14 కొన్నిసార్లు, మీ ప్రార్థనలకు దేవుడిచ్చే జవాబులను మీరు స్పష్టంగా చూడలేకపోవచ్చు. కానీ మీరు నిర్దిష్టమైన విషయాల గురించి ప్రార్థిస్తే, యెహోవా ఇచ్చే జవాబులను మరింత స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. అప్పుడు, ఆయన మీకు మరింత నిజమైన వ్యక్తి అవుతాడు. దాంతోపాటు, మీరు చింతిస్తున్న ప్రతీ విషయం గురించి యెహోవాకు చెప్తే, ఆయన మీకు ఇంకా దగ్గరౌతాడు.

15 కాతీ a అనే సహోదరి ఉదాహరణే తీసుకోండి. ఆమె క్రమంగా పరిచర్యకు వెళ్లేది కానీ పరిచర్యలో ఆమె అంతగా ఆనందించేది కాదు. ఆమె ఇలా చెప్పింది, “నాకు పరిచర్య అంటే ఇష్టం ఉండేది కాదు. దాన్ని నిజంగానే ఇష్టపడేదాన్నికాదు.” కానీ ఆమె రిటైర్‌ అయిన తర్వాత, పయినీరు సేవ చేయమని ఓ సంఘపెద్ద ప్రోత్సహించాడు. ఆమె ఇంకా ఇలా చెప్పింది, “ఆయన నాకు అప్లికేషన్‌ కూడా ఇచ్చాడు. నేను పయినీరు సేవ చేయాలని నిర్ణయించుకున్నాను, కానీ నేను పరిచర్యను ఇష్టపడేలా చేయమని రోజూ యెహోవాకు ప్రార్థించేదాన్ని.” మరి, యెహోవా ఆమె ప్రార్థనలకు జవాబిచ్చాడా? మూడు సంవత్సరాలు పయినీరు సేవ చేసిన తర్వాత, ఇప్పుడు ఆమె ఇలా అంటోంది, “పరిచర్యలో ఎక్కువ సమయం గడపడంవల్ల, ఇతర సహోదరీల నుండి నేర్చుకోవడంవల్ల, నేను సాక్ష్యమిచ్చే నైపుణ్యాన్ని క్రమంగా మెరుగుపర్చుకున్నాను. ఇప్పుడు నేను పరిచర్యను ఇష్టపడడం కాదు ప్రేమిస్తున్నాను. మరిముఖ్యంగా, యెహోవాతో నా సంబంధం ఒకప్పటికన్నా ఇంకా బలపడింది.” కాతీ, తన ప్రార్థనల వల్ల యెహోవాకు నిజంగా మరింత దగ్గరవ్వగలిగింది.

మనం చేయాల్సింది చేద్దాం

16, 17. (ఎ) యెహోవాతో మన సంబంధాన్ని బలపర్చుకుంటూ ఉండాలంటే ఏమి చేయాలి? (బి) తర్వాతి ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

16 మనం ఎప్పటికీ యెహోవాకు దగ్గరౌతూనే ఉండవచ్చు. కాబట్టి క్రమంగా బైబిలు చదవడం ద్వారా యెహోవా చెప్పేది వింటూ, ప్రార్థించడం ద్వారా ఆయనతో మాట్లాడుతూ ఉందాం. మనమలా చేస్తే యెహోవాతో మన సంబంధం అంతకంతకూ బలపడుతుంది. అంతేకాదు, ఆయన సహాయంతో ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోగలుగుతాం.

మనం ఎప్పటికీ యెహోవాకు దగ్గరౌతూనే ఉండవచ్చు (16, 17 పేరాలు చూడండి)

17 అయితే, మన సమస్యల గురించి యెహోవాకు ప్రార్థిస్తూనే ఉన్నా, కొన్నిసార్లు వాటినుండి మనం బయటపడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనకు యెహోవామీద నమ్మకం నెమ్మదిగా తగ్గిపోవచ్చు. యెహోవా మన ప్రార్థనలు వినట్లేదని, ఆయన మనల్ని స్నేహితులుగా చూడట్లేదని మనకు అనిపించవచ్చు. ఒకవేళ మీకు అలా అనిపిస్తుంటే, మీరేమి చేయవచ్చు? దానిగురించి తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

a అసలు పేరు కాదు.