కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవామీద ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి

యెహోవామీద ఎల్లప్పుడూ నమ్మకం ఉంచండి

‘జనులారా, ఎల్లప్పుడూ ఆయనయందు నమ్మకం ఉంచండి.’కీర్త. 62:8.

1-3. యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకం పౌలులో ఎలా బలపడింది? (ప్రారంభ చిత్రం చూడండి.)

 మొదటి శతాబ్దంలోని రోములో క్రైస్తవులుగా జీవించడం చాలా కష్టంగా ఉండేది. అప్పట్లో రోమన్లు క్రైస్తవుల్ని క్రూరంగా హింసించేవాళ్లు. ఉదాహరణకు, రోము నగరంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదానికి వాళ్లే కారణమనీ, వాళ్లు ప్రజల్ని ద్వేషిస్తారనీ క్రైస్తవుల్ని నిందించారు. ఎంతోమంది క్రైస్తవుల్ని జైళ్లలో వేసి, చిత్రహింసలు పెట్టారు. కొంతమందిని జంతువులచేత ముక్కలుముక్కలుగా చీల్చి చంపించారు. ఇంకొంతమందిని మ్రానుపై వ్రేలాడదీసి, మంటల్లో తగలబెట్టి, రాత్రంతా దీపాల్లా ఉపయోగించుకున్నారు. క్రైస్తవులు వీటిలో ఏదో ఒకదాన్ని ప్రతీరోజు ఎదుర్కోవాల్సి వచ్చేది.

2 ఇలాంటి పరిస్థితుల్లో అపొస్తలుడైన పౌలును జైల్లో వేశారు. మొదట్లో ఆయనను ఆదుకోవడానికి సహోదరులెవరూ రాలేదు, దాంతో తనకు ఎవరైనా సహాయం చేస్తారో లేదోనని పౌలు బహుశా అనుకొనివుంటాడు. అయితే సహోదరుల నుంచి కాదుగానీ వేరేవిధంగా పౌలుకు సహాయం అందింది. ఆయనిలా రాశాడు, “ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను.” అవును, పౌలుకు కావాల్సిన బలాన్ని యెహోవా యేసు ద్వారా అందించాడు. అంతేకాదు, “నేను సింహము నోటనుండి తప్పింపబడితిని” అని కూడా పౌలు రాశాడు.—2 తిమో. 4:16, 17. a

3 యెహోవా తనకు అంతకుముందు ఎలా సహాయం చేశాడో పౌలు గుర్తు చేసుకున్నాడు. కాబట్టి, తాను ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాన్ని, అలాగే ముందుముందు ఎదుర్కోబోయే కష్టాల్ని సహించడానికి యెహోవా సహాయం చేస్తాడని పౌలు నమ్మాడు. అందుకే, ‘ప్రభువు ప్రతి దుష్కార్యమునుండి నన్ను తప్పించును’ అని ఆయన రాయగలిగాడు. (2 తిమో. 4:18) సహోదరులు సహాయం చేయలేకపోయినా యెహోవా, యేసు మాత్రం తప్పకుండా సహాయం చేస్తారని పౌలు స్వయంగా తెలుసుకున్నాడు. ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అనుమానమూ లేదు.

యెహోవామీద నమ్మకం పెంచుకోవడానికి అవకాశాలు

4, 5. (ఎ) మీకు ఎల్లప్పుడూ ఎవరు సహాయం చేయగలరు? (బి) యెహోవాతో మీ సంబంధాన్ని బలపర్చుకోవాలంటే ఏమి చేయాలి?

4 మీరు ఏదైనా కష్టంలో చిక్కుకున్నప్పుడు, సహాయం చేసేవాళ్లు ఎవరూ లేక ఒంటరి అయిపోయినట్లు భావించారా? బహుశా మీ ఉద్యోగం పోవడం, స్కూల్లో ఒత్తిళ్లు, అనారోగ్యం లేదా మరేదైనా సమస్యవల్ల మీరు బాధపడివుండొచ్చు. వేరేవాళ్లను సహాయం అడిగినా వాళ్లు చేయకపోవడంతో మీరు నిరాశపడి ఉండవచ్చు. నిజమే, కొన్ని సమస్యలను మనుషులెవరూ పరిష్కరించలేరు. అప్పుడు ఏమి చేయాలి? “యెహోవాయందు నమ్మకముంచుము” అని బైబిలు చెప్తుంది. (సామె. 3:5, 6) అయితే యెహోవా సహాయం చేస్తాడని మీరు నిజంగా నమ్మవచ్చా? ఖచ్చితంగా. యెహోవా తన ప్రజలకు నిజంగా సహాయం చేస్తాడని మనం నమ్మడానికి బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

5 ఇతరులు మీ కష్టాల్లో సహాయం చేయకపోతే వాళ్లమీద కోపం పెంచుకోకండి. దానికి బదులు, యెహోవాను పూర్తిగా నమ్మడానికి వాటిని అవకాశాలుగా చూడండి. పౌలు కూడా అలాగే చేశాడు. అంతేకాదు, యెహోవాకు మీమీద ఎంత శ్రద్ధ ఉందో కష్టాలొచ్చినప్పుడు మీరు స్వయంగా తెలుసుకుంటారు. అప్పుడు యెహోవామీద మీకు నమ్మకం పెరుగుతుంది, ఆయనతో మీకున్న సంబంధం బలపడుతుంది.

యెహోవామీద నమ్మకం ఉంచడం ప్రాముఖ్యం

6. కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవామీద నమ్మకం ఉంచడం ఎందుకంత తేలిక కాదు?

6 ఏదైనా ఓ సమస్య మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండవచ్చు. ఆ పరిస్థితుల్లో మీరు చేయగలిగినదంతా చేశారు, సహాయం కోసం యెహోవాకు ప్రార్థించారు కూడా. ఇక యెహోవా చూసుకుంటాడనే నమ్మకంతో మీరు మనశ్శాంతితో ఉండొచ్చా? తప్పకుండా. (కీర్తన 62:8; 1 పేతురు 5:7 చదవండి.) యెహోవాతో మంచి సంబంధం కలిగివుండాలంటే, మీరు ఆయన మీద నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి. అయితే అది అంత తేలిక కాదు. ఎందుకు? ఒక కారణమేమిటంటే, యెహోవా కొన్నిసార్లు మీ ప్రార్థనలకు వెంటనే జవాబివ్వకపోవచ్చు.—కీర్త. 13:1, 2; 74:10; 89:46; 90:13; హబ. 1:2.

7. యెహోవా మన ప్రార్థనలకు కొన్నిసార్లు ఎందుకు వెంటనే జవాబివ్వడు?

7 యెహోవా కొన్నిసార్లు మన ప్రార్థనలకు వెంటనే ఎందుకు జవాబివ్వడు? బైబిలు యెహోవాను తండ్రితో పోలుస్తుంది. (కీర్త. 103:13) పిల్లలు అడిగే ప్రతీదాన్ని తండ్రి ఇవ్వడు, అలాగే అడిగిన వెంటనే ఇవ్వడు. పిల్లలు ఉన్నట్టుండి ఫలానిది కావాలని అడుగుతారని, ఆ తర్వాత దాన్ని పట్టించుకోరని తండ్రికి తెలుసు. తన పిల్లలకు ఏది మంచిదో, అది ఇతరుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో తండ్రికి బాగా తెలుసు. వాళ్లకు ఏది అవసరమో, అదెప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు. పిల్లలు అడిగిన ప్రతీది వెంటనే ఇచ్చేస్తే, తండ్రి వాళ్లకు పనివాడు అవుతాడు. మన పరలోక తండ్రి అయిన యెహోవా మనల్ని ప్రేమిస్తున్నాడు. మనకేమి అవసరమో, వాటిని ఇవ్వడానికి ఏది సరైన సమయమో తెలివైన సృష్టికర్తగా ఆయనకు తెలుసు. కాబట్టి, యెహోవా మన ప్రార్థనలకు జవాబిచ్చేవరకు వేచి చూడడం చాలా మంచిది.—యెషయా 29:16; 45:9 వచనాలతో పోల్చండి.

8. మన కష్టాల విషయంలో యెహోవా ఏమని మాటిస్తున్నాడు?

8 మరో కారణమేమిటంటే, మనలో ప్రతీఒక్కరం ఎంతవరకు సహించగలమో యెహోవాకు తెలుసు. (కీర్త. 103:14) కాబట్టి మనకు అవసరమైన బలాన్ని ఆయనిస్తాడు. నిజమే, ఇక నావల్ల కాదని కొన్నిసార్లు మనకు అనిపించవచ్చు. కానీ, తన సేవకులు భరించలేనంత కష్టాన్ని వాళ్లకు ఎప్పటికీ రానివ్వనని యెహోవా మాటిస్తున్నాడు. అవును, ‘తప్పించుకొనే మార్గాన్ని’ ఆయనే చూపిస్తాడు. (1 కొరింథీయులు 10:13 చదవండి.) మనం ఎంతవరకు భరించగలమో యెహోవాకు తెలుసని మనం నమ్మినప్పుడు ఎంతో ఊరట పొందుతాం.

9. మన ప్రార్థనలకు యెహోవా వెంటనే జవాబివ్వకపోతే మనమేమి చేయాలి?

9 కాబట్టి, సహాయం కోసం మనం ప్రార్థించినా యెహోవా వెంటనే జవాబివ్వకపోతే మనం సహనంగా ఉండాలి. మనకు సహాయం చేయాలనే ఆత్రుత ఉన్నా, ఆయన సరైన సమయం కోసం ఓపిగ్గా ఎదురుచూస్తున్నాడని గుర్తుంచుకోండి. బైబిలు ఇలా చెప్తుంది, ‘మీమీద దయ చూపాలని యెహోవా అవకాశం కోసం చూస్తున్నాడు. మిమ్మల్ని కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయనకోసం ఎదురు చూసేవారందరూ ధన్యులు.’—యెష. 30:18, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

‘సింహం నోటి’ నుండి కాపాడతాడు

10-12. (ఎ) అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుని బాగోగులు చూసుకోవడం ఎలాంటి పరిస్థితుల్లో కష్టంగా ఉండవచ్చు? (బి) కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవామీద నమ్మకముంచడం, ఆయనతో మీ సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఒక అనుభవం చెప్పండి.

10 తీవ్రమైన కష్టాలు వచ్చినప్పుడు మీరు ‘సింహం నోట్లో’ ఉన్నట్లు మీకు కూడా అనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో యెహోవామీద నమ్మకముంచడం చాలా ప్రాముఖ్యం. ఉదాహరణకు, మీరు అనారోగ్యంతో ఉన్న కుటుంబ సభ్యుని బాగోగులు చూసుకుంటున్నారు అనుకోండి. ఆ సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, ధైర్యంగా ఉండడానికి సహాయం చేయమని మీరు యెహోవాకు ప్రార్థించారు. b దానివల్ల, యెహోవా మిమ్మల్ని చూస్తున్నాడని, మిమ్మల్నీ మీ పరిస్థితినీ అర్థం చేసుకుంటాడనే నమ్మకంతో మీరు మనశ్శాంతిగా ఉండగలుగుతారు. మీరు సహించడానికి, తనకు నమ్మకంగా ఉండడానికి ఆయన మీకు సహాయం చేస్తాడు.—కీర్త. 32:8.

11 కానీ, మరోవైపు పరిస్థితులు చూస్తుంటే యెహోవా సహాయం చేయట్లేదని మీకు అనిపించవచ్చు. డాక్టర్లు రకరకాల సలహాలు ఇస్తుండవచ్చు. లేదా మిమ్మల్ని ఓదారుస్తారనుకున్న బంధువుల వల్ల పరిస్థితి మరింత దిగజారి ఉండొచ్చు. కానీ బలం కోసం ఎల్లప్పుడూ యెహోవామీద ఆధారపడుతూ ఆయనకు దగ్గరౌతూ ఉండండి. (1 సమూయేలు 30:3, 6 చదవండి.) యెహోవా ఎలా సహాయం చేశాడో ఆ తర్వాత మీరు గ్రహించినప్పుడు, ఆయనతో మీకున్న సంబంధం మరింత బలపడుతుంది.

12 లిండ c అనే సహోదరి విషయంలో అదే జరిగింది. జబ్బుపడిన తల్లిదండ్రులు చనిపోయేవరకు ఆమె ఎంతోకాలంపాటు వాళ్ల బాగోగులు చూసుకుంది. ఆమె ఇలా చెప్తోంది, ‘ఆ పరిస్థితుల్లో నాకు, నా భర్తకు, తమ్ముడికి ఏమి చేయాలో తెలిసేదికాదు. కొన్నిసార్లు వాళ్లకెలా సహాయం చేయాలో మాకు అర్థమయ్యేదికాదు. కానీ ఆ కాలమంతటిలో యెహోవా మాకు ఎలా అండగా ఉన్నాడో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఆయన మమ్మల్ని బలపర్చాడు, ఇక ఏ దారి లేనట్టు అనిపించినప్పుడు కూడా మాకు సరిగ్గా అవసరమైనదే ఆయనిచ్చాడు.’

13. యెహోవామీద నమ్మకముంచడం వల్ల ఓ సహోదరి పెద్దపెద్ద కష్టాలను ఎలా తట్టుకోగలిగింది?

13 యెహోవా మీద పూర్తి నమ్మకం ఉంచితే మనం పెద్దపెద్ద కష్టాలను కూడా సహించగలుగుతాం. రాండ అనే సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. సాక్షికాని ఆమె భర్త విడాకులివ్వాలని నిర్ణయించుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే, ఆమె తమ్ముడికి తీవ్రమైన అనారోగ్యం ఉన్నట్లు వైద్య పరీక్షల్లో తేలింది. ఆ తర్వాత కొన్ని నెలలకు ఆమె తమ్ముడి భార్య చనిపోయింది. వీటన్నిటి నుండి తేరుకుంటున్న సమయంలో ఆమె పయినీరు సేవ మొదలుపెట్టింది. కానీ కొంతకాలానికి ఆమె తల్లి కూడా చనిపోయింది. అయితే రాండ వీటన్నిటినీ ఎలా తట్టుకోగలిగింది? ఆమె ఇలా చెప్తుంది, ‘నేను యెహోవాతో రోజూ మాట్లాడేదాన్ని, చివరికి చిన్నచిన్న నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఆయనతో మాట్లాడేదాన్ని. అలా చేయడం వల్ల నేను యెహోవాను ఓ నిజమైన వ్యక్తిగా చూడగలిగాను. అంతేకాదు, నామీదో ఇతరులమీదో కాకుండా యెహోవా మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ఆయన నాకు నిజమైన సహాయం అందించి, నా అవసరాలన్నిటినీ తీర్చాడు. దానివల్ల, యెహోవాతో పాటు పనిచేయడం ఎలా ఉంటుందో రుచి చూశాను.’

కుటుంబంలో వచ్చే సమస్యలు కూడా, యెహోవాతో మీ సంబంధం ఎలా ఉందో పరీక్షిస్తాయి (14-16 పేరాలు చూడండి)

14. మీ కుటుంబసభ్యుల్లో ఒకర్ని సంఘం నుండి బహిష్కరిస్తే, మీరు ఏ నమ్మకంతో ఉండవచ్చు?

14 మరో ఉదాహరణ చూద్దాం, మీ కుటుంబసభ్యుల్లో ఒకర్ని సంఘం నుండి బహిష్కరించారని అనుకోండి. అలాంటివాళ్లతో ఎలా వ్యవహరించాలని బైబిలు ఆజ్ఞాపిస్తుందో మీకు స్పష్టంగా తెలుసు. (1 కొరిం. 5:11; 2 యోహా. 10) కానీ, మీకు ఆ వ్యక్తి మీదున్న ప్రేమవల్ల, ఆ ఆజ్ఞలు పాటించడం చాలా కష్టమని లేదా అసాధ్యమని మీరు అనుకోవచ్చు. d అయితే, తనకు నమ్మకంగా లోబడి ఉండడానికి కావాల్సిన బలాన్ని మీ పరలోక తండ్రి ఇస్తాడని మీరు నమ్ముతారా? ఆ పరిస్థితిని యెహోవాకు దగ్గరవడానికి వచ్చిన అవకాశంగా భావిస్తారా?

15. ఆదాము యెహోవా దేవునికి ఎందుకు అవిధేయత చూపించాడు?

15 మొదటి మానవుడైన ఆదాము గురించి ఒకసారి ఆలోచించండి. యెహోవా ఇచ్చిన ఆజ్ఞను మీరి కూడా నిత్యం జీవించవచ్చని ఆదాము అనుకున్నాడా? లేదు, “ఆదాము మోసపరచబడలేదు” అని బైబిలు చెప్తుంది. (1 తిమో. 2:14) మరి ఆయన ఎందుకు యెహోవాకు అవిధేయత చూపించాడు? ఆదాము యెహోవాకన్నా తన భార్యనే ఎక్కువగా ప్రేమించాడు కాబట్టే ఆమె ఇచ్చిన పండ్లు తిన్నాడు. యెహోవా మాట వినే బదులు ఆయన తన భార్య మాట విన్నాడు.—ఆది. 3:6, 17.

16. మనం అందరికన్నా ఎక్కువగా ఎవర్ని ప్రేమించాలి? ఎందుకు?

16 మరైతే మనం కుటుంబ సభ్యులను ప్రేమించకూడదని దానర్థమా? కాదు. వాళ్లను ప్రేమించాలి, కానీ యెహోవాకన్నా ఎక్కువగా కాదు. (మత్తయి 22:37, 38 చదవండి.) మనం యెహోవాను ఎక్కువగా ప్రేమించినప్పుడు, మన కుటుంబసభ్యులు సత్యంలో ఉన్నా లేకపోయినా, వాళ్లకు సరైన సహాయం అందించగలుగుతాం. కాబట్టి యెహోవామీద మీకున్న ప్రేమని, విశ్వాసాన్ని బలపర్చుకుంటూ ఉండండి. బహిష్కరించబడిన మీ కుటుంబసభ్యుని గురించి మీరు బాధపడుతుంటే, మీ మనసులో ఉన్న భావాలన్నిటినీ యెహోవాకు ప్రార్థనలో చెప్పుకోండి. e (రోమా. 12:12; ఫిలి. 4:6, 7) ఆ విషయం మిమ్మల్ని ఎంతో బాధపెట్టినప్పటికీ, దాన్ని యెహోవాతో మీ సంబంధాన్ని మరింత బలపర్చుకోవడానికి అవకాశంగా చూడండి. అప్పుడు మీరు యెహోవామీద నమ్మకం ఉంచగలుగుతారు, అంతేకాదు ఆయనకు లోబడడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకుంటారు.

మీ ప్రార్థనలకు జవాబు కోసం వేచి చూస్తున్నప్పుడు

యెహోవా సేవలో బిజీగా ఉంటూ ఆయనపై మీకెంత నమ్మకం ఉందో చూపించండి (17వ పేరా చూడండి)

17. మనం వీలైనంత ఎక్కువగా ప్రకటనా పని చేస్తే, ఏ నమ్మకంతో ఉండవచ్చు?

17 పౌలును యెహోవా ‘సింహం నోటి’ నుండి ఎందుకు కాపాడాడు? దానికి జవాబు పౌలు మాటల్లోనే ఉంది. “నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము” అని ఆయన అన్నాడు. (2 తిమో. 4:17) యెహోవా, “సువార్త” ప్రకటించే బాధ్యతను మనకు కూడా అప్పగించాడు, అంతేకాదు మనల్ని తన ‘జతపనివారిగా’ చూస్తున్నాడు. (1 థెస్స. 2:4; 1 కొరిం. 3:9) మనం వీలైనంత ఎక్కువగా ప్రకటనా పని చేస్తే, మన అవసరాలన్నీ యెహోవా తీరుస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు. (మత్త. 6:33) అంతేకాదు, మన ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చేంతవరకు వేచి ఉండడం అంత కష్టంగా అనిపించదు.

18. యెహోవామీద నమ్మకాన్ని, ఆయనతో మీ సంబంధాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

18 కాబట్టి, యెహోవాతో మీకున్న సంబంధాన్ని ప్రతీరోజు బలపర్చుకుంటూ ఉండండి. ఏదైనా సమస్య మిమ్మల్ని బాధపెడుతుంటే, ఆ పరిస్థితిని ఉపయోగించుకుని యెహోవాకు మరింత దగ్గరవ్వండి. దేవుని వాక్యాన్ని చదువుతూ, అధ్యయనం చేస్తూ, చదివినవాటి గురించి లోతుగా ఆలోచిస్తూ ఉండండి. యెహోవాకు ప్రార్థిస్తూ, ఆయన సేవలో బిజీగా ఉండండి. ఇవన్నీ చేస్తున్నప్పుడు, ప్రస్తుతం అలాగే భవిష్యత్తులో వచ్చే కష్టాలన్నిటినీ సహించడానికి ఆయన మీకు సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండవచ్చు.

a యెహోవా పౌలును నిజంగానే సింహాల బారి నుండి లేదా వేరే ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితి నుండి తప్పించి ఉండొచ్చు.

b అనారోగ్యంతో బాధపడేవాళ్లకు, వాళ్ల బాగోగులు చూసుకునేవాళ్లకు సహాయం చేసే ఆర్టికల్స్‌ కోసం కావలికోట డిసెంబరు 15, 2011, 27-30 పేజీలు; కావలికోట మే 15, 2010, 17-19 పేజీలు చూడండి.

c అసలు పేర్లు కావు.

d ఈ సంచికలోని “బహిష్కరించడం ఎందుకు ప్రేమతో చేసిన ఏర్పాటు?” అనే ఆర్టికల్‌ చూడండి.

e కుటుంబసభ్యుల్లో ఒకరు యెహోవాకు దూరమైనప్పుడు కలిగే బాధను తట్టుకోవడానికి సహాయం చేసే ఆర్టికల్స్‌ కావలికోట సెప్టెంబరు 1, 2006, 17-21 పేజీల్లో; జనవరి 15, 2007, 17-20 పేజీల్లో ఉన్నాయి.