మనం పవిత్రంగా ఉండగలం
‘మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి.’ —యాకో. 4:8, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.
1. చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారు?
నైతికంగా దిగజారిపోయిన లోకంలో మనం జీవిస్తున్నాం. సలింగ సంయోగం, అక్రమ సంబంధాలు వంటివి పెద్ద తప్పేమీ కాదని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు. సినిమాలు, పుస్తకాలు, పాటలు, వాణిజ్య ప్రకటనలు వంటివి అనైతికతతో నిండిపోతున్నాయి. (కీర్త. 12:8) అయితే, ఇలాంటి పరిస్థితుల మధ్య కూడా మనం తనను సంతోషపెట్టే విధంగా జీవించడానికి యెహోవా సహాయం చేయగలడు. అవును, ఈ అనైతిక లోకంలో కూడా మనం పవిత్రంగా ఉండగలం.—1 థెస్సలొనీకయులు 4:3-5 చదవండి.
2, 3. (ఎ) తప్పుడు కోరికలు మొలకెత్తకుండా ఎందుకు చూసుకోవాలి? (బి) ఈ ఆర్టికల్‌లో మనమేమి చర్చిస్తాం?
2 మనం యెహోవాను సంతోషపెట్టాలంటే, ఆయన అసహ్యించుకునే ప్రతీదానికి దూరంగా ఉండాలి. అయితే, చేపలకు ఎర ఆకర్షణీయంగా కనిపించినట్టే అపరిపూర్ణులమైన మనకు కూడా అనైతికత ఆకర్షణీయంగా కనిపించవచ్చు. మనలో ఏవైనా తప్పుడు కోరికలు మొలకెత్తితే వాటిని మొదట్లోనే తుంచేయాలి. అలా చేయకపోతే ఆ కోరికలు మరింత బలపడి, అవకాశం దొరికినప్పుడు మనం తప్పు చేసే ప్రమాదం ఉంది. అందుకే, ‘దురాశ గర్భం ధరించి పాపాన్ని కంటుంది’ అని బైబిలు చెప్తుంది.—యాకోబు 1:14, 15 చదవండి.
3 తప్పుడు కోరికలు మన హృదయంలో మొదలౌతాయి. కాబట్టి మన హృదయంలో ఎలాంటి కోరికలు మొలకెత్తుతున్నాయో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తప్పుడు కోరికలు మొలకెత్తిన వెంటనే వాటిని తీసేసుకుంటే మనం వ్యభిచారానికి, దానివల్ల వచ్చే చెడు ఫలితాలకు దూరంగా ఉండగలుగుతాం. (గల. 5:16) తప్పుడు కోరికలతో పోరాడడానికి మనకు సహాయం చేసే మూడు విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అవేమిటంటే, యెహోవాతో స్నేహం, దేవుని వాక్యంలోని సలహాలు, పరిణతిగల తోటి క్రైస్తవుల సహాయం.
‘దేవుని దగ్గరకు రండి’
4. యెహోవాను స్నేహితునిగా భావిస్తే మనమేమి చేస్తాం?
4 దేవునికి దగ్గరవ్వాలనుకునే వాళ్లకు బైబిలు ఇలా చెప్తుంది, ‘మీ చేతులు శుభ్రం చేసుకోండి, మీ హృదయాలు పవిత్రం చేసుకోండి.’ (యాకో. 4:8, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) యెహోవాను మన స్నేహితునిగా భావిస్తే, మన పనులే కాదు ఆలోచనలు కూడా ఆయన్ను సంతోషపెట్టే విధంగా ఉండాలని కోరుకుంటాం. మన ఆలోచనలు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉంటే హృదయం కూడా పవిత్రంగా ఉంటుంది. (కీర్త. 24:3, 4; 51:6; ఫిలి. 4:8) నిజమే, మనం అపరిపూర్ణులం కాబట్టి మనలో తప్పుడు కోరికలు మొదలవ్వవచ్చని యెహోవా అర్థం చేసుకుంటాడు. కానీ మనం ఆయనను బాధపెట్టాలనుకోం కాబట్టి వాటిని తీసేసుకోవడానికి చేయగలిగినదంతా చేస్తాం. (ఆది. 6:5, 6) మన ఆలోచనలను పవిత్రంగా ఉంచుకోవడానికి శాయశక్తులా కృషి చేస్తాం.
5, 6. తప్పుడు కోరికల నుండి బయటపడడానికి ప్రార్థన మనకెలా సహాయం చేస్తుంది?
5 మనం తప్పుడు కోరికలతో పోరాడాలంటే సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తూ ఉండాలి. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా, మనం పవిత్రంగా ఉండడానికి కావాల్సిన బలాన్ని ఇస్తాడు. మన ఆలోచనలు తనను సంతోషపెట్టేలా ఉండాలని కోరుకుంటున్నామని మనం ప్రార్థనలో ఆయనకు చెప్పవచ్చు. (కీర్త. 19:14) అంతేకాదు, పాపం చేయడానికి దారితీసే తప్పుడు కోరికలు మనలో ఉన్నాయేమో పరిశీలించమని యెహోవాను వినయంగా అడగాలి. (కీర్త. 139:23, 24) కాబట్టి, అనైతికతకు దూరంగా ఉండేలా, శోధనలు ఎదురైనా సరైనది చేసేలా సహాయం చేయమని మనం యెహోవాను అడుగుతూనే ఉండాలి.—మత్త. 6:13.
6 సత్యం తెలుసుకోకముందు, బహుశా మనం యెహోవాకు నచ్చని పనులను ఇష్టపడి ఉంటాం. ఆ తప్పుడు కోరికల నుండి బయటపడడానికి మనం ఇప్పటికీ పోరాడుతుండవచ్చు. అయినప్పటికీ, మన ప్రవర్తన మార్చుకుని, తనకు ఇష్టమైన విధంగా జీవించేలా యెహోవా సహాయం చేయగలడు. ఉదాహరణకు, రాజైన దావీదు బత్షెబతో వ్యభిచారం చేసిన తర్వాత ఎంతో పశ్చాత్తాపపడి, తనకు “పవిత్ర హృదయాన్ని” కలుగజేయమని, విధేయత చూపించేలా సహాయం చేయమని దేవున్ని వేడుకున్నాడు. (కీర్త. 51:10, 12, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) కాబట్టి గతంలో మనకున్న బలమైన తప్పుడు కోరికలతో ఒకవేళ ఇప్పటికీ పోరాడుతుంటే యెహోవా మనకు సహాయం చేయగలడు. ఆయనకు విధేయత చూపిస్తూ, సరైనదే చేయాలనే మరింత బలమైన కోరికను ఆయన మనలో కలిగించగలడు. చెడు ఆలోచనలను అదుపులో పెట్టుకోవడానికి యెహోవా మనకు సహాయం చేయగలడు.—కీర్త. 119:133.
‘వాక్యప్రకారం ప్రవర్తించండి’
7. తప్పుడు ఆలోచనలకు దూరంగా ఉండడానికి దేవుని వాక్యం మనకెలా సహాయం చేస్తుంది?
7 సహాయం కోసం మనం చేసే ప్రార్థనలకు యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా జవాబిస్తాడు. ఆయన వాక్యంలో ఉన్న జ్ఞానం “పవిత్రమైనది.” (యాకో. 3:17) కాబట్టి, మనం ప్రతిరోజు బైబిలు చదివినప్పుడు, మన మనసును పవిత్రమైన ఆలోచనలతో నింపుకుంటాం. (కీర్త. 19:7, 11; 119:9, 11) అంతేకాదు బైబిల్లో ఉన్న ఉదాహరణలు, సలహాలు మనం తప్పుడు ఆలోచనలకు, కోరికలకు దూరంగా ఉండడానికి సహాయం చేస్తాయి.
8, 9. (ఎ) సామెతలు 7వ అధ్యాయంలో ప్రస్తావించబడిన యువకుడు ఎందుకు వ్యభిచారం చేశాడు? (బి) మనం ఎలాంటి పరిస్థితులకు దూరంగా ఉండాలని ఆ ఉదాహరణ తెలియజేస్తుంది?
8 అనైతికతకు దూరంగా ఉండమని సామెతలు 5:8 మనల్ని హెచ్చరిస్తుంది. ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చే ప్రమాదాన్ని సామెతలు 7వ అధ్యాయంలోని వృత్తాంతంలో చదువుతాం. ఆ వృత్తాంతంలోని యువకుడు రాత్రిపూట ఓ వేశ్య ఉంటున్న ఇంటి వైపుగా వెళ్లాడు. ఆ స్త్రీ “వేశ్యావేషము వేసికొని” వీధి చివర నిలబడివుంది. ఆమె అతన్ని పట్టుకుని, ముద్దుపెట్టుకుని, కవ్వించే మాటలతో అతనిలో కోరికల్ని రేపింది. తన కోరికల్ని అదుపులో పెట్టుకోకపోవడం వల్ల ఆ యువకుడు ఆమెతో వ్యభిచారం చేశాడు. బహుశా అతను తప్పు చేయాలనే ఉద్దేశంతో అటు వెళ్లకపోయినా చివరికి తప్పు చేశాడు, దానివల్ల ఘోరమైన ఫలితాలు అనుభవించాడు. పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి ఉంటే, ఆ యువకుడు ఆమె నుండి దూరంగా పారిపోయేవాడే.—సామె. 7:6-27.
9 ఆ యువకునిలాగే, మనం కూడా ప్రమాదాన్ని పసిగట్టలేకపోవడం వల్ల కొన్నిసార్లు శోధనలో చిక్కుకోవచ్చు. ఉదాహరణకు, కొన్ని టీవీ ఛానళ్లు రాత్రిపూట అశ్లీల కార్యక్రమాలను ప్రసారం చేస్తాయి. కాబట్టి, అలాంటి సమయాల్లో ఊరికే ఛానళ్లు మారుస్తూ ఉండడం ప్రమాదాన్ని కొనితెచ్చుకోవడమే. అలాగే ఇంటర్నెట్ వాడేటప్పుడు స్క్రీన్ మీద కనపడే ప్రతీ లింక్‌ను తెరచి చూడడం కూడా ప్రమాదకరమే. అంతేకాదు అశ్లీల ప్రకటనలు, అశ్లీల చిత్రాలు ఉండే ఛాట్ రూమ్‌లు లేదా వెబ్సైట్లను ఉపయోగించడం వల్ల ఉచ్చుల్లో చిక్కుకుంటాం. ఎందుకంటే, మనం చూసే ప్రకటనలు, చిత్రాలు మనలో కోరికల్ని రేకెత్తించి చివరికి యెహోవా చేయవద్దన్న పనిని చేసేలా మనల్ని నడిపిస్తాయి.
10. ఇతరులతో సరసాలాడడం ఎందుకు ప్రమాదకరం? (ప్రారంభ చిత్రం చూడండి.)
10 స్త్రీపురుషులు ఒకరితోఒకరు ఎలా ప్రవర్తించాలో కూడా దేవుని వాక్యం చెప్తుంది. (1 తిమోతి 5:2 చదవండి.) క్రైస్తవులు తమ భర్త/భార్యతో లేదా పెళ్లి చేసుకోబోయే వ్యక్తితో తప్ప ఇతరులతో చనువుగా ఉండరు, సరసాలాడరు. కానీ కొంతమంది మాత్రం, అవతలి వ్యక్తిని ముట్టుకోనంత వరకూ, శరీర కదలికలతో లేదా హావభావాలతో, చూపులతో రెచ్చగొట్టడం తప్పేమీకాదని అనుకోవచ్చు. కానీ ఇద్దరు వ్యక్తులు సరసాలాడడం మొదలుపెట్టిన క్షణం నుండే వాళ్లలో తప్పుడు ఆలోచనలు మొలకెత్తవచ్చు. అది చివరికి వ్యభిచారానికి దారితీయవచ్చు. గతంలో అలా జరిగింది కాబట్టి, ఇప్పుడు కూడా జరిగే అవకాశం ఉంది.
11. యోసేపు నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు?
11 నైతిక విషయాల్లో యోసేపు మనకు మంచి ఆదర్శం. తన కోరిక తీర్చమని పోతీఫరు భార్య యోసేపును బలవంతపెట్టింది. ఆయన ఎంత నిరాకరించినా ఆమె మాత్రం కవ్విస్తూనే ఉంది. తనతో ఉండమని ఆయన్ని ప్రతీరోజు అడిగేది. (ఆది. 39:7, 8, 10) ఒకవేళ యోసేపు తనతో ఏకాంతంగా ఉంటే తనను కోరుకుంటాడని ఆమె అనుకుని ఉండవచ్చని ఓ బైబిలు విద్వాంసుడు అన్నాడు. అయితే యోసేపు మాత్రం ఆమె తీపి మాటలకు లొంగకూడదని నిశ్చయించుకున్నాడు, ఆయన ఏరోజూ ఆమెతో చనువుగా ప్రవర్తించలేదు. అలా ఆయన తన హృదయంలోకి తప్పుడు కోరికల్ని రానివ్వలేదు. ఆఖరికి ఆమె యోసేపు వస్త్రాన్ని పట్టుకుని, బలవంతపెట్టినప్పుడు కూడా ఆయన వెంటనే ‘తన వస్త్రాన్ని ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాడు.’—ఆది. 39:12.
12. మనం చూసే విషయాలు మన హృదయం మీద ప్రభావం చూపిస్తాయని ఎలా చెప్పవచ్చు?
12 మనం చూసే విషయాలు మన హృదయంలో తప్పుడు కోరికల్ని రేకెత్తించవచ్చని యేసు హెచ్చరించాడు. ‘ఒక స్త్రీని మోహపుచూపుతో చూసే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసినవాడవుతాడు’ అని ఆయన అన్నాడు. (మత్త. 5:28) రాజైన దావీదు విషయంలో అదే జరిగింది. ఆయన మిద్దె మీద నడుస్తున్నప్పుడు, స్నానం చేస్తున్న ఓ స్త్రీని చూశాడు. ఆయన తన చూపును తిప్పుకోకుండా ఆమెనే చూస్తూ, ఆమె గురించే ఆలోచించాడు. (2 సమూ. 11:2) ఆమె ఇంకొకరి భార్య అయినా, దావీదు ఆమె మీద మోజుపడి చివరికి వ్యభిచారం చేశాడు.
13. మన కళ్లతో ఎందుకు “నిబంధన” చేసుకోవాలి? ఎలా చేసుకోవాలి?
13 తప్పుడు ఆలోచనలతో పోరాడి గెలవాలంటే, మనం కూడా యోబులా ‘మన కళ్లతో నిబంధన’ చేసుకోవాలి. (యోబు 31:1, 7, 9) ఎన్నడూ ఇతరులను తప్పుడు ఉద్దేశంతో చూడకూడదని మనం నిర్ణయించుకోవాలి. కంప్యూటర్లోగానీ, పోస్టర్ల మీదగానీ, పుస్తకాల మీదగానీ లేదా మరెక్కడైనా అశ్లీల చిత్రం కనిపిస్తే వెంటనే చూపు తిప్పేసుకోవాలి.
14. పవిత్రంగా ఉండాలంటే మనమేమి చేయాలి?
14 ఇప్పటివరకు మనం పరిశీలించిన వాటిలో, మీరు దేనిలోనైనా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తిస్తే, వెంటనే మార్పులు చేసుకోండి. దేవుని వాక్యంలోని సలహాలను ఇష్టంగా పాటిస్తే, మీరు అనైతికతకు దూరంగా ఉంటూ పవిత్రంగా ఉండగలుగుతారు.—యాకోబు 1:21-25 చదవండి.
సంఘపెద్దల సహాయం తీసుకోండి
15. తప్పుడు కోరికలతో పోరాడడం కష్టంగా ఉంటే, ఇతరుల సహాయం తీసుకోవడం ఎందుకు ముఖ్యం?
15 ఒకవేళ చెడు కోరికలతో పోరాడడం మీకు కష్టంగా ఉంటే, ఎంతోకాలంగా యెహోవాను సేవిస్తూ, దేవుని వాక్యం నుండి మంచి సలహా ఇవ్వగల తోటిక్రైస్తవుల సహాయం తీసుకోండి. నిజమే, వ్యక్తిగత విషయాల గురించి ఇతరులతో మాట్లాడడం కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినప్పటికీ ఇతరుల సహాయం తీసుకోవడం చాలా ప్రాముఖ్యం. (సామె. 18:1; హెబ్రీ. 3:12-14) ఎలాంటి మార్పులు చేసుకోవాలో మీరు గుర్తించేలా పరిణతిగల క్రైస్తవులు సహాయం చేయగలుగుతారు. మీరు వెంటనే ఆ మార్పులు చేసుకుంటే, యెహోవాతో మీకున్న స్నేహాన్ని కాపాడుకోగలుగుతారు.
16, 17. (ఎ) తప్పుడు కోరికలతో పోరాడుతున్నవాళ్లకు సంఘపెద్దలు ఎలా సహాయం చేస్తారు? ఓ అనుభవం చెప్పండి. (బి) అశ్లీల చిత్రాలు చూసే అలవాటు ఉన్నవాళ్లు వెంటనే పెద్దల సహాయం ఎందుకు తీసుకోవాలి?
16 ముఖ్యంగా సంఘపెద్దలు అలాంటి సహాయం చేయగలరు. (యాకోబు 5:13-15 చదవండి.) బ్రెజిల్‌కు చెందిన ఓ యువకుడు చాలా సంవత్సరాలపాటు తప్పుడు కోరికలతో సతమతమయ్యాడు. అతనిలా అంటున్నాడు, “నా ఆలోచనలు యెహోవాను బాధపెడుతున్నాయని నాకు తెలుసు. కానీ నా సమస్య గురించి ఇతరులతో చెప్పడానికి చాలా సిగ్గనిపించింది.” అతని సమస్యను అర్థం చేసుకున్న ఓ పెద్ద అతనికి సహాయం అవసరమని గుర్తించి, సంఘపెద్దల సహాయం తీసుకోమని అతన్ని ప్రోత్సహించాడు. ఆ యువకుడు ఇలా అంటున్నాడు, “సంఘపెద్దలు నాతో దయగా వ్యవహరించిన తీరును చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను అనుకున్నదానికన్నా నామీద ఎక్కువ దయ చూపించి, నన్ను బాగా అర్థం చేసుకున్నారు. నా సమస్య గురించి చెప్తున్నప్పుడు వాళ్లు శ్రద్ధగా విన్నారు. యెహోవా నన్ను ఇంకా ప్రేమిస్తున్నాడని బైబిలు ద్వారా భరోసా ఇచ్చి, నాతో కలిసి ప్రార్థించారు. వీటన్నిటివల్ల వాళ్లిచ్చిన లేఖనాధారిత సలహాను పాటించడం నాకు తేలికైంది.” యెహోవాతో తన స్నేహాన్ని బలపర్చుకున్న తర్వాత ఆ యువకుడు ఇలా చెప్తున్నాడు, ‘సమస్యలతో ఒంటరిగా సతమతమవ్వడం కన్నా, పెద్దల సహాయం తీసుకోవడం ఎంత ముఖ్యమో నాకిప్పుడు అర్థమైంది.’
17 మీకు అశ్లీల చిత్రాలను చూసే అలవాటు ఉంటే, వెంటనే సంఘపెద్దల సహాయం తీసుకోండి. మీరు ఆలస్యం చేసేకొద్దీ, లైంగిక అనైతికతకు పాల్పడే ప్రమాదం మరింత ఎక్కువౌతుంది. దానివల్ల మీరు ఇతరుల్ని బాధపెట్టడమే కాక, యెహోవాకు చెడ్డపేరు తీసుకొస్తారు. అయితే, యెహోవాను సంతోషపెట్టాలని, సంఘంలోనే ఎప్పటికీ ఉండాలని కోరుకున్న చాలామంది, పెద్దల సహాయం అడిగి, వాళ్లిచ్చిన సలహాలను పాటించారు.—యాకో. 1:15; కీర్త. 141:5; హెబ్రీ. 12:5, 6.
పవిత్రంగా ఉండాలని నిశ్చయించుకోండి
18. మీరేమని నిశ్చయించుకున్నారు?
18 సాతాను లోకం రోజురోజుకీ నైతికంగా దిగజారిపోతోంది. కానీ యెహోవా సేవకులు మాత్రం తమ ఆలోచనలను పవిత్రంగా ఉంచుకుంటూ, దేవుని నైతిక ప్రమాణాల ప్రకారం జీవించడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. వాళ్లను చూసి యెహోవా ఎంతో గర్వపడుతున్నాడు. కాబట్టి యెహోవాకు సన్నిహితంగా ఉంటూ, ఆయన తన వాక్యమైన బైబిలు ద్వారా, సంఘం ద్వారా ఇచ్చే సలహాలను పాటించాలని నిశ్చయించుకుందాం. అలా చేసినప్పుడు, నిర్మలమైన మనస్సాక్షితో సంతోషంగా ఉంటాం. (కీర్త. 119:5, 6) అంతేకాదు, భవిష్యత్తులో సాతాను నాశనమయ్యాక దేవుని పరిశుభ్రమైన కొత్తలోకంలో నిత్యం జీవిస్తాం.