కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—మొదటి భాగం

మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—మొదటి భాగం

“నీ నామము పరిశుద్ధపరచబడు గాక.”—మత్త. 6:9, 10.

1. మత్తయి 6:9-13 వచనాల్లో ఉన్న మాదిరి ప్రార్థనను మనం పరిచర్యలో ఎలా ఉపయోగిస్తాం?

 మత్తయి 6:9-13 వచనాల్లో ఉన్న యేసు నేర్పించిన ప్రార్థన గురించి చాలామందికి తెలుసు. మనం కూడా ఇంటింటి పరిచర్యలో, దేవుని రాజ్యం ఈ భూమిని పరదైసుగా మార్చే ఓ నిజమైన ప్రభుత్వమని చెప్పడానికి ఆ వచనాల్నే ఉపయోగిస్తాం. అలాగే, “నీ నామము పరిశుద్ధపరచబడు గాక” అనే మాటల్ని చూపించి, దేవునికి ఒక పేరు ఉందనీ ఆ పేరును మనం పరిశుద్ధంగా ఎంచాలనీ వివరిస్తాం.—మత్త. 6:9, 10.

2. మనం ప్రార్థించే ప్రతీసారి మాదిరి ప్రార్థనలోని మాటల్నే ఉపయోగించాలన్నది యేసు ఉద్దేశం కాదని ఎలా చెప్పవచ్చు?

2 మనం ప్రార్థించే ప్రతీసారి మాదిరి ప్రార్థనలోని మాటల్నే ఉపయోగించాలని యేసు చెప్తున్నాడా? లేదు, మనం ప్రార్థన చేసేటప్పుడు చెప్పిన మాటల్నే మళ్లీమళ్లీ చెప్పొద్దని యేసు అన్నాడు. (మత్త. 6:7) యేసు మరో సందర్భంలో తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించినప్పుడు, అదే ప్రార్థనను చేశాడు కానీ వేరే పదాలు ఉపయోగించాడు. (లూకా 11:1-4) కాబట్టి, మనం ఎలాంటి విషయాల గురించి ప్రార్థించవచ్చో నేర్పించడానికే యేసు మాదిరి ప్రార్థనను నేర్పించాడు.

3. మాదిరి ప్రార్థన గురించి చర్చిస్తుండగా, మనం ఏ ప్రశ్నల గురించి ఆలోచించాలి?

3 యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని విషయాలను ఈ ఆర్టికల్‌లో, తర్వాతి ఆర్టికల్‌లో చర్చిస్తాం. అలా పరిశీలిస్తున్నప్పుడు, ‘నా ప్రార్థనలను మెరుగుపర్చుకోవడానికి మాదిరి ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మరిముఖ్యంగా ‘నేను మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవిస్తున్నానా?’ అని ఆలోచించండి.

“పరలోకమందున్న మా తండ్రీ”

4. “మా తండ్రీ” అనే మాట మనకు ఏ విషయాన్ని గుర్తుచేస్తుంది? యెహోవా మనకు ఏ భావంలో తండ్రి అవుతాడు?

4 “మా తండ్రీ” అనే మాటతో యేసు ప్రార్థన మొదలుపెట్టాడు. ఆ మాట, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సహోదరసహోదరీలందరికీ యెహోవాయే తండ్రి అని మనకు గుర్తుచేస్తుంది. (1 పేతు. 2:17) పరలోక నిరీక్షణ ఉన్నవాళ్లను యెహోవా తన ‘పిల్లలుగా’ దత్తత తీసుకున్నాడు, కాబట్టి ఆయన వాళ్లకు ఓ ప్రత్యేక భావంలో తండ్రి అవుతాడు. (రోమా. 8:15-17) అలాగే, భూనిరీక్షణ ఉన్నవాళ్లు కూడా యెహోవాను “తండ్రి” అని పిలవవచ్చు. ఎందుకంటే యెహోవా వాళ్లకు జీవాన్ని ఇచ్చి, ప్రేమతో వాళ్ల అవసరాలను తీరుస్తున్నాడు. అయితే వాళ్లు పరిపూర్ణులై, చివరి పరీక్షలో కూడా యెహోవాకు నమ్మకంగా ఉన్నామని నిరూపించుకున్న తర్వాత వాళ్లు పూర్తిస్థాయిలో “దేవుని పిల్లలు” అవుతారు.—రోమా. 8:20, 21; ప్రక. 20:7, 8.

5, 6. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇవ్వగల శ్రేష్ఠమైన బహుమతి ఏమిటి? మరి పిల్లల బాధ్యత ఏమిటి? (ప్రారంభ చిత్రం చూడండి.)

5 తల్లిదండ్రులు తమ పిల్లలకు, యెహోవా మన ప్రియమైన పరలోక తండ్రి అనీ ఆయనకు ప్రార్థించాలనీ నేర్పించాలి. అలా చేసే తల్లిదండ్రులు తమ పిల్లలకు ఓ మంచి బహుమానాన్ని ఇస్తున్నట్లే. దక్షిణ ఆఫ్రికాలో ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవచేస్తున్న ఓ సహోదరుడు ఇలా చెప్తున్నాడు, ‘మా కూతుళ్లు పుట్టిన మొదటిరోజు నుంచి నేను రోజూ రాత్రి వాళ్లతో కలిసి ప్రార్థిస్తూ వచ్చాను. నేను ఊర్లో లేకపోతే తప్ప రోజూ అలా చేసేవాణ్ణి. అయితే, ఆ ప్రార్థనల్లో నేను ఖచ్చితంగా ఏ పదాలు ఉపయోగించేవాణ్ణో గుర్తులేదని వాళ్లు అంటుంటారు. కానీ ఎంత గౌరవంగా యెహోవాకు ప్రార్థించేవాళ్లమో, ప్రార్థనలవల్ల ప్రశాంతంగా, సురక్షితంగా ఉన్నట్లు ఎలా భావించేవాళ్లమో వాళ్లు గుర్తుచేసుకుంటారు. వాళ్లు కాస్త ఎదిగిన తర్వాత, బిగ్గరగా ప్రార్థించమని వాళ్లను ప్రోత్సహించాను. వాళ్లు తమ ఆలోచనల్ని, భావాల్ని యెహోవాకు చెప్పుకుంటుంటే వినేవాణ్ణి, అలా వాళ్ల మనసుల్లో ఏముందో తెలుసుకునేవాణ్ణి. నెమ్మదినెమ్మదిగా, మాదిరి ప్రార్థనలో ఉన్న ముఖ్యమైన అంశాల్ని కూడా తమ ప్రార్థనల్లో చేర్చేలా వాళ్లకు సహాయం చేశాను. అలా వాళ్లు సరైన విధంగా ప్రార్థించడం నేర్చుకున్నారు.’

6 ఆయన కూతుళ్లు పెరిగి పెద్దయ్యేకొద్దీ, యెహోవాకు మరింత దగ్గరయ్యారు. వాళ్లు పెళ్లి చేసుకుని, తమ భర్తలతో కలిసి సంతోషంగా పూర్తికాల సేవ చేస్తున్నారు. తల్లిదండ్రులారా, యెహోవా ఓ నిజమైన వ్యక్తి అనీ, ఆయనతో స్నేహం చేయవచ్చనీ మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ పిల్లలకు ఇవ్వగల అతి పెద్ద బహుమతి అదే. అయితే, యెహోవాతో ఉన్న స్నేహాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాత్రం పిల్లలదే.—కీర్త. 5:11, 12; 91:14.

“నీ నామము పరిశుద్ధపరచబడు గాక”

7. మనకు ఏ గొప్ప గౌరవం ఉంది? అయితే, మనమేమి చేయాలి?

7 దేవుని పేరు తెలుసుకుని, ఆయన ‘నామం కొరకు ఒక జనముగా’ ఉండే గొప్ప గౌరవం మనకుంది. (అపొ. 15:14; యెష. 43:10) యెహోవా ‘నామం పరిశుద్ధపర్చబడాలని’ మనం ప్రార్థిస్తాం. ఆయన నామానికి చెడ్డపేరు తీసుకొచ్చే పనులకు, మాటలకు దూరంగా ఉండేలా మనకు సహాయం చేయమని కూడా వేడుకుంటాం. అయితే మనం మొదటి శతాబ్దంలోని కొంతమందిలా ఉండకూడదు. వాళ్లు ఇతరులకు బోధించారేగానీ వాటిని పాటించలేదు. అందుకే పౌలు వాళ్లకు ఇలా రాశాడు, ‘మీ వల్లే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతుంది?’—రోమా. 2:21-24.

8, 9. తన నామాన్ని పరిశుద్ధపర్చాలని కోరుకునేవాళ్లకు యెహోవా ఎలా సహాయం చేస్తాడో ఓ అనుభవం చెప్పండి.

8 యెహోవా నామానికి ఘనత తీసుకురావడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం. నార్వేకు చెందిన ఓ సహోదరి భర్త చనిపోవడంతో, ఆమె ఒంటరిగానే తమ రెండేళ్ల కొడుకును పెంచింది. ఆమె ఇలా చెప్తుంది, ‘అది నా జీవితంలో చాలా కష్టకాలం. నేను ప్రతీరోజు, దాదాపు గంటగంటకూ ప్రార్థించేదాన్ని. నేను ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకున్నా లేదా తప్పు చేసినా సాతాను యెహోవాను నిందిస్తాడు, కాబట్టి సాతానుకు ఆ అవకాశం ఇవ్వకుండా ఉండేందుకు నాకు సరిగ్గా ఆలోచించే సామర్థ్యాన్ని ఇవ్వమని ప్రార్థనలో అడిగేదాన్ని. నేను యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చాలని కోరుకున్నాను, అంతేకాదు పరదైసులో మా అబ్బాయి వాళ్ల నాన్నను కలుసుకోవాలన్నది నా కోరిక.’—సామె. 27:11.

9 మరి, యెహోవా ఆమె ప్రార్థనలకు జవాబిచ్చాడా? ఇచ్చాడు. తోటి సహోదరసహోదరీలతో ఎక్కువగా సమయం గడపడం వల్ల ఆమె ప్రోత్సాహం పొందింది. ఐదేళ్ల తర్వాత, ఆమె ఓ సంఘపెద్దను పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయికి ఇప్పుడు 20 ఏళ్లు, అతను బాప్తిస్మం తీసుకున్న ప్రచారకునిగా సేవచేస్తున్నాడు. ఆమె ఇలా అంటోంది, ‘మా అబ్బాయిని సరిగ్గా పెంచడంలో నా భర్త సహాయం చేశాడు, అందుకు నాకెంతో సంతోషంగా ఉంది.’

10. యెహోవా తన నామాన్ని ఎప్పుడు పూర్తిగా పరిశుద్ధపర్చుకుంటాడు?

10 తన నామానికి చెడ్డపేరు తీసుకొస్తూ, తన సర్వాధిపత్యాన్ని వ్యతిరేకించే వాళ్లందరినీ నాశనం చేసినప్పుడు యెహోవా తన నామాన్ని పరిశుద్ధపర్చుకుంటాడు. (యెహెజ్కేలు 38:22, 23 చదవండి.) అప్పుడు మనుషులు క్రమంగా పరిపూర్ణులౌతారు, పరలోకంలోనూ భూమ్మీదా జీవించేవాళ్లందరూ యెహోవానే ఆరాధిస్తారు. అలా అందరూ యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చే రోజు కోసం మనం ఎంతో ఎదురుచూస్తున్నాం. అప్పుడు, మన ప్రేమగల తండ్రి అందరికీ సర్వస్వం అవుతాడు.—1 కొరిం. 15:28.

“నీ రాజ్యము వచ్చుగాక”

11, 12. తన ప్రజలు 1876లో ఏ విషయాన్ని అర్థం చేసుకునేలా యెహోవా సహాయం చేశాడు?

11 యేసు పరలోకానికి వెళ్లేముందు శిష్యులు, ‘ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలుకు రాజ్యాన్ని మళ్లీ అనుగ్రహిస్తావా?’ అని ఆయన్ను అడిగారు. అయితే దేవుని రాజ్య పరిపాలన ఎప్పుడు మొదలౌతుందో వాళ్లు తెలుసుకోవడానికి అది సమయం కాదని యేసు అన్నాడు. బదులుగా, ప్రాముఖ్యమైన ప్రకటనా పని మీద దృష్టి పెట్టమని వాళ్లకు చెప్పాడు. (అపొస్తలుల కార్యములు 1:6-8 చదవండి.) దాంతోపాటు, దేవుని రాజ్యం రావాలని ప్రార్థించమని, దానికోసం ఎదురుచూడమని కూడా యేసు వాళ్లకు చెప్పాడు. అందుకే దేవుని రాజ్యం రావాలని మనం ఇప్పటికీ ప్రార్థిస్తున్నాం.

12 యేసు పరలోకంలో రాజయ్యే సమయం దగ్గరపడుతుండగా, అది ఎప్పుడు జరుగుతుందో గ్రహించడానికి యెహోవా తన ప్రజలకు సహాయం చేశాడు. 1876⁠లో ఛార్లెస్‌ తేజ్‌ రస్సెల్‌, “అన్యజనముల కాలములు: అవి ఎప్పుడు ముగుస్తాయి?” అనే ఆర్టికల్‌ రాశాడు. దానియేలు ప్రవచనంలోని “ఏడు కాలములు,” యేసు చెప్పిన ప్రవచనంలోని “అన్యజనముల కాలములు” ఒకటేనని, అవి 1914⁠లో ముగుస్తాయని ఆ ఆర్టికల్‌లో వివరించాడు. aదాని. 4:16; లూకా 21:24.

13. ఏ సంఘటన 1914లో జరిగింది? అప్పటినుండి ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ఏ విషయాన్ని రుజువు చేస్తున్నాయి?

13 యూరప్‌లో 1914⁠లో మొదలైన యుద్ధం, కొంతకాలానికే ప్రపంచ యుద్ధంగా మారింది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన కరువులు వచ్చాయి. 1918⁠లో ఆ యుద్ధం ముగిసే సమయానికి, ఓ ప్రాణాంతకమైన ఫ్లూ వ్యాధి ప్రబలింది. యుద్ధంలో చనిపోయినవాళ్లకన్నా ఆ వ్యాధివల్ల చనిపోయినవాళ్లే ఎక్కువ. ఇవన్నీ యేసు 1914⁠లో రాజయ్యాడని నిరూపించే ‘సూచనలో’ భాగమే. (మత్త. 24:3-8; లూకా 21:10, 11) ఆ సంవత్సరంలో ఆయన ‘జయించుచు, జయించుటకు బయలువెళ్లాడు.’ (ప్రక. 6:2) ఆయన సాతానును, అతని దయ్యాలను పరలోకంనుండి భూమ్మీదకు పడేశాడు. అప్పటినుండి, “భూమీ, సముద్రమా, మీకు శ్రమ; అపవాది తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధముగలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడు” అనే మాటలు నెరవేరడం చూస్తున్నాం.—ప్రక. 12:7-12.

14. (ఎ) దేవుని రాజ్యం రావాలని ఎందుకు ప్రార్థిస్తూనే ఉండాలి? (బి) ఇప్పుడు మనం చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏమిటి?

14 యేసు పరలోకంలో రాజైనప్పటినుండి భూమ్మీద పరిస్థితులు ఎందుకు ఘోరంగా తయారౌతున్నాయో, ప్రకటన 12:7-12 వచనాలు వివరిస్తున్నాయి. యేసు పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టినా ఈ లోకం మాత్రం ఇంకా సాతాను గుప్పిట్లోనే ఉంది. కానీ త్వరలోనే యేసు భూమ్మీదున్న చెడుతనాన్ని తీసేసి, తన జైత్రయాత్రను ముగిస్తాడు. అప్పటివరకు మనం దేవుని రాజ్యం రావాలని ప్రార్థిస్తూ, రాజ్యం గురించి ప్రకటిస్తూ ఉందాం. మనం చేస్తున్న ప్రకటనా పని యేసు చెప్పిన ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తుంది, “ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును.”—మత్త. 24:14.

‘నీ చిత్తం భూమిమీద నెరవేరును గాక’

15, 16. దేవుని చిత్తం భూమ్మీద నెరవేరాలని ప్రార్థించడం మాత్రమే సరిపోతుందా? వివరించండి.

15 సుమారు 6,000 సంవత్సరాల క్రితం భూమ్మీద దేవుని చిత్తం జరుగుతూ ఉండేది. అందుకే తాను చేసిన ప్రతీదీ “చాలమంచిదిగా” ఉందని యెహోవా చెప్పాడు. (ఆది. 1:31) అయితే, సాతాను తిరుగుబాటు చేసిన దగ్గరనుండి, చాలామంది ప్రజలు దేవుని చిత్తం చేయడం మానేశారు. కానీ ఇప్పుడు దాదాపు 80 లక్షలమంది యెహోవా దేవున్ని సేవిస్తున్నారు. వాళ్లు దేవుని చిత్తం భూమ్మీద నెరవేరాలని ప్రార్థిస్తున్నారు, దానికి తగ్గట్లు జీవిస్తున్నారు కూడా. వాళ్లు దేవున్ని సంతోషపెట్టేలా జీవిస్తూ, దేవుని రాజ్యం గురించి ఇతరులకు ఉత్సాహంగా ప్రకటిస్తారు.

దేవుని చిత్తం చేసేలా మీ పిల్లలకు నేర్పిస్తున్నారా? (16వ పేరా చూడండి)

16 ఉదాహరణకు, 1948⁠లో బాప్తిస్మం తీసుకుని ఆఫ్రికాలో మిషనరీగా సేవ చేసిన 80 ఏళ్ల ఓ సహోదరి ఇలా అంటోంది, ‘మరీ ఆలస్యం కాకముందే, గొర్రెల్లాంటి ప్రజలందరూ సువార్త వినాలని, వాళ్లు యెహోవా గురించి తెలుసుకోవాలని నేను తరచూ ప్రార్థిస్తాను. అలాగే నేను ఓ వ్యక్తికి సాక్ష్యం ఇచ్చే ముందు, అతని హృదయాన్ని చేరుకునేలా ప్రకటించడానికి జ్ఞానం ఇవ్వమని కూడా ప్రార్థిస్తాను. ఇప్పటికే సువార్తను అంగీకరించిన వాళ్లకు సహాయం చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలను ఆశీర్వదించమని ప్రార్థిస్తాను.’ ఈ సహోదరి యెహోవాను తెలుసుకోవడానికి చాలామందికి సహాయం చేసింది. ఆమెలాగే యెహోవా చిత్తాన్ని ఉత్సాహంగా చేస్తున్న వృద్ధ సహోదరసహోదరీల గురించి ఆలోచించండి.—ఫిలిప్పీయులు 2:17 చదవండి.

17. దేవుడు మనుషుల విషయంలో, భూమి విషయంలో ఏమి చేయబోతున్నాడు? దాని గురించి మీకేమనిపిస్తుంది?

17 ఈ భూమ్మీదున్న తన శత్రువులందర్నీ యెహోవా నాశనం చేసేంతవరకు, మనం ఆయన చిత్తం నెరవేరాలని ప్రార్థిస్తూనే ఉంటాం. అప్పుడు ఈ భూమంతా పరదైసుగా మారుతుంది, చనిపోయిన కోట్లాదిమంది మళ్లీ బతుకుతారు. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని” బయటికి వస్తారని యేసు చెప్పాడు. (యోహా. 5:28, 29) చనిపోయిన మన ప్రియమైన వాళ్లను మళ్లీ కలుసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో ఊహించండి. దేవుడు మన కన్నీళ్లను తుడిచేస్తాడు. (ప్రక. 21:4) పునరుత్థానమైన వాళ్లలో ఎక్కువమంది ‘అనీతిమంతులే’ ఉంటారు, అంటే యెహోవా గురించీ యేసుక్రీస్తు గురించీ తెలుసుకోకుండా చనిపోయినవాళ్లే ఉంటారు. వాళ్లకు దేవుని చిత్తం గురించి సంతోషంగా నేర్పిస్తూ వాళ్లు ‘నిత్యజీవం’ పొందేలా మనం సహాయం చేస్తాం.—అపొ. 24:14, 15; యోహా. 17:3.

18. మానవజాతికి కావాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటి?

18 మానవజాతికి కావాల్సిన మూడు ముఖ్యమైన విషయాలు: దేవుని నామం పరిశుద్ధపర్చబడడం, ఆయన రాజ్యం రావడం, విశ్వంలో ఉన్నవాళ్లందరూ యెహోవాను ఐక్యంగా ఆరాధించడం. యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని మొదటి మూడు విన్నపాలు ఇవే. యెహోవా ఈ మూడు విన్నపాలకు జవాబిచ్చినప్పుడు, ఆ ముఖ్యమైన విషయాలను నెరవేరుస్తాడు. తర్వాతి ఆర్టికల్‌లో, యేసు నేర్పించిన మాదిరి ప్రార్థనలోని మిగతా విన్నపాలను చర్చిస్తాం.

a ఆ ప్రవచనం 1914లో నెరవేరిందని ఎలా చెప్పవచ్చో తెలుసుకోవడానికి, బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 215-218 పేజీలు చూడండి.