కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—రెండవ భాగం

మాదిరి ప్రార్థనకు అనుగుణంగా జీవించండి—రెండవ భాగం

“మీకేం కావాలో మీ తండ్రికి తెలుసు.” —మత్త. 6:8, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

1-3. తనకేమి కావాలో యెహోవాకు తెలుసని ఓ సహోదరి ఎందుకు భావించింది?

 తన రెండు ప్రార్థనలకు యెహోవా జవాబిచ్చిన ఆ రోజును లానా ఎప్పటికీ మర్చిపోదు. ఆమె 2012 వేసవిలో జర్మనీలో ఉన్నప్పుడు ఓ రోజు రెండు విషయాల గురించి ప్రార్థించింది. మొదటిది, ఆమె ట్రైన్‌లో ఎయిర్‌పోర్ట్‌కు ప్రయాణిస్తూ, ఎవరికైనా సాక్ష్యం ఇచ్చే అవకాశాన్ని ఇవ్వమని యెహోవాకు ప్రార్థించింది. అయితే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక, ఆమె వెళ్లాల్సిన విమానం ఒకరోజు ఆలస్యమని తెలిసింది. ఆమె దగ్గర ఎక్కువ డబ్బులు లేకపోవడంతో, ఆ రాత్రి ఎక్కడ తలదాచుకోవాలో ఆమెకు అర్థంకాలేదు. కాబట్టి ఈ విషయంలో సహాయం చేయమని ఆమె యెహోవాకు ప్రార్థించింది.

2 లానా అలా ప్రార్థించిందో లేదో, “హలో లానా! నువ్వేంటి ఇక్కడున్నావ్‌?” అనే మాటలు వినిపించాయి. ఎవరా అని చూస్తే, తనతోపాటు స్కూల్లో చదువుకున్న ఓ యువకుడు. అతను దక్షిణాఫ్రికా వెళ్తున్నాడు, అందుకని వీడ్కోలు చెప్పడానికి అతని అమ్మ, అమ్మమ్మ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. లానా తన పరిస్థితి గురించి చెప్పినప్పుడు, ఆమెను తమ ఇంటికి ఆహ్వానించారు. ఇంటికెళ్లిన తర్వాత, వాళ్లు ఆమె నమ్మకాల గురించి, ఆమె చేస్తున్న పయినీరు సేవ గురించి ఎన్నో ప్రశ్నలు అడిగారు.

3 తర్వాతి రోజు టిఫిన్‌ చేశాక, వాళ్లు అడిగిన మరికొన్ని బైబిలు ప్రశ్నలకు లానా జవాబిచ్చింది. యెహోవాసాక్షులు వాళ్లను మళ్లీ కలిసేందుకు వీలుగా వాళ్ల చిరునామా, ఫోన్‌ నెంబరు అడిగి తీసుకుంది. ఆ తర్వాత, ఆమె తన స్వదేశానికి క్షేమంగా తిరిగొచ్చి పయినీరు సేవను కొనసాగిస్తోంది. యెహోవా తన ప్రార్థనలకు జవాబిచ్చాడని, తనకేమి కావాలో తెలుసుకుని సహాయం చేశాడని ఆమె భావిస్తోంది.—కీర్త. 65:2.

4. ఈ ఆర్టికల్‌లో ఏమి చర్చిస్తాం?

4 అనుకోకుండా మనకేదైనా సమస్య వస్తే సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తాం. తన సేవకుల ప్రార్థనలు వినడం ఆయనకు ఎంతో ఇష్టం. (కీర్త. 34:15; సామె. 15:8) అయితే, మనం ప్రార్థించాల్సిన మరింత ముఖ్యమైన విషయాలు ఉన్నాయని మాదిరి ప్రార్థన చూపిస్తుంది. అందులోని చివరి నాలుగు విన్నపాలు, మనం యెహోవాకు నమ్మకంగా ఉండడానికి ఎలా సహాయం చేస్తాయో ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం.—మత్తయి 6:11-13 చదవండి.

“మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము”

5, 6. మనకు ఆహారానికి ఏ లోటూ లేకపోయినా “మా అనుదినాహారము” దయచేయమని ప్రార్థించాలని యేసు ఎందుకు చెప్పాడు?

5 మనం ప్రార్థించేటప్పుడు, “నా అనుదినాహారము” కోసం కాకుండా “మా అనుదినాహారము” కోసం అడగాలని యేసు నేర్పించాడు. ఆఫ్రికాలో ప్రాంతీయ పర్యవేక్షకునిగా సేవ చేస్తున్న విక్టర్‌ ఇలా చెప్తున్నాడు, ‘రేపు మా భోజనం సంగతేంటి, ఇంటి అద్దె ఎలా కట్టాలి అనే వాటి గురించి నేనూ, నా భార్య దిగులుపడాల్సిన అవసరం లేనందుకు యెహోవాకు తరచూ కృతజ్ఞతలు చెప్తుంటాను. సహోదరులు ఎంతో దయతో ప్రతీరోజు మా అవసరాలను తీరుస్తున్నారు. అయితే వాళ్లకు వచ్చే ఆర్థిక ఒత్తిళ్లను సరిగ్గా ఎదుర్కోనేలా సహాయం చేయమని నేను యెహోవాకు ప్రార్థిస్తుంటాను.’

6 మనకైతే ఆహారానికి ఎలాంటి లోటూ లేకపోవచ్చు కానీ మన సహోదరులు చాలామంది పేదరికంలో మగ్గుతున్నారు, విపత్తుల వల్ల బాధపడుతున్నారు. మనం వాళ్ల గురించి ప్రార్థించడమే కాకుండా వీలైన సహాయం కూడా చేయవచ్చు. ఉదాహరణకు, మన దగ్గరున్న వస్తువులను అవసరంలో ఉన్న తోటి సహోదరసహోదరీలకు ఇవ్వవచ్చు. అలాగే, ప్రపంచవ్యాప్త పనికోసం క్రమంగా కొంత విరాళం ఇవ్వవచ్చు. మనమిచ్చే ఆ విరాళాలు అవసరంలో ఉన్న మన సహోదరసహోదరీలకు ఉపయోగపడతాయి.—1 యోహా. 3:17.

7. రేపటి గురించి చింతించవద్దని యేసు ఎలా వివరించాడు?

7 “అనుదినాహారము” గురించి ప్రార్థించమని చెప్పినప్పుడు, యేసు మన రోజువారీ అవసరాల గురించి మాట్లాడుతున్నాడు. అందుకే ఆయనిలా చెప్పాడు, ‘అల్ప విశ్వాసం ఉన్నవారలారా, అడవిగడ్డినే దేవుడు ఇంతగా అలంకరిస్తే, మరి నిశ్చయంగా మీకు వస్త్రాలు ఇస్తాడు కదా. కనుక ఏం బట్టలు వేసుకొంటామో? అని చింతించకండి.’ ఆ తర్వాత మళ్లీ ఇలా చెప్పాడు, ‘రేపటి గురించి చింతించకండి.’ (మత్త. 6:30-34, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) కాబట్టి మనం రేపటి గురించి అతిగా చింతించకుండా, ఏరోజుకారోజు మన కనీస అవసరాలు తీరుతున్నందుకు మనం తృప్తిపడాలి. కాబట్టి కనీస అవసరాల కోసం అంటే ఉండడానికి ఓ ఇల్లు, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఏదైనా పని, ఆరోగ్యం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం కోసం మనం యెహోవాకు ప్రార్థించవచ్చు. కానీ మనం ప్రార్థించాల్సిన అంతకన్నా ముఖ్యమైన అవసరాలు ఉన్నాయి.

8. మన అనుదినాహారము గురించి యేసు చెప్పిన మాటలు ఏ విషయాన్ని మనకు గుర్తుచేయాలి? (ప్రారంభ చిత్రం చూడండి.)

8 మన అనుదినాహారము గురించి యేసు చెప్పిన మాటలు, మనకు ఆధ్యాత్మిక ఆహారం అవసరమని కూడా గుర్తుచేయాలి. “మనుష్యుడు రొట్టెవలన మాత్రము కాదుగాని దేవుని నోటనుండి వచ్చు ప్రతిమాటవలనను జీవించును” అని ఆయన అన్నాడు. (మత్త. 4:4) కాబట్టి, యెహోవా మనకు తగినవేళ ఆధ్యాత్మిక ఆహారం అందిస్తూ ఉండాలని మనం ప్రార్థించాలి.

‘మా రుణాలు క్షమించుము’

9. మన పాపాల్ని అప్పులతో ఎందుకు పోల్చవచ్చు?

9 యేసు తన మాదిరి ప్రార్థనలో, ‘మా రుణాలు క్షమించుము’ అని ప్రార్థించమని నేర్పించాడు. అయితే మరో సందర్భంలో, “మా పాపములను క్షమించుము” అని ప్రార్థించమని చెప్పాడు. (మత్త. 6:12; లూకా 11:4) మన పాపాల్ని రుణాలతో లేదా అప్పులతో పోల్చవచ్చు. 1951⁠లో కావలికోట పత్రిక ఇలా వివరించింది: మనం యెహోవా ఆజ్ఞలను పాటిస్తూ ఆయన పట్ల ప్రేమ చూపించాలి. కానీ మనం యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు, ఆయనకు న్యాయంగా ఇవ్వాల్సిన విధేయతను, ప్రేమను ఇవ్వలేకపోతాం. ఆ విధంగా, మనం పాపం చేసినప్పుడు యెహోవాకు అప్పుపడతాం. కావాలనుకుంటే యెహోవా మనతో ఉన్న స్నేహాన్ని తెంచేసుకోగలడు. ఆ కావలికోట ఇంకా ఇలా చెప్పింది, “పాపం చేయడమంటే యెహోవా మీద ప్రేమ లేకపోవడమే.”—1 యోహా. 5:3.

10. యెహోవా మన పాపాల్ని దేని ఆధారంగా క్షమిస్తున్నాడు? దాని గురించి మనమెలా భావించాలి?

10 అందుకే, మన పాపాల్ని క్షమించడం కోసం యేసును బలిగా అర్పించినందుకు మనం యెహోవాకు ఎంతో కృతజ్ఞులం. మనకు యెహోవా క్షమాపణ ప్రతీరోజు అవసరం. యేసు చనిపోయి దాదాపు 2,000 సంవత్సరాలైనా, ఆయన బలి ద్వారా వచ్చిన ప్రయోజనాల్ని మనం ఈరోజు కూడా అనుభవిస్తున్నాం. ఇంతటి అమూల్యమైన బహుమతి ఇచ్చినందుకు మనం యెహోవాకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పాలి. మన “ప్రాణవిమోచన ధనము” ఎంత గొప్పదంటే దాన్ని మనలో ఎవ్వరం ఎప్పటికీ చెల్లించగలిగేవాళ్లం కాదు. (కీర్తన 49:7-9; 1 పేతురు 1:18, 19 చదవండి.) ‘మా రుణాలు క్షమించుము’ అనే మాటలు, యేసు విమోచన క్రయధనం మనకు అవసరమైనట్టే, మన సహోదరసహోదరీలకు కూడా అవసరమని గుర్తుచేస్తాయి. అంతేకాదు, మనం కేవలం మన గురించే కాకుండా, తోటి సహోదరసహోదరీల గురించి, వాళ్లకు యెహోవాతో ఉన్న స్నేహం గురించి కూడా ఆలోచించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు, ఇతరులు మన విషయంలో ఏవైనా పొరపాట్లు చేసినా మనం వెంటనే క్షమిస్తాం. అలాంటి చిన్నచిన్న పొరపాట్లను క్షమించడం ద్వారా మనకు వాళ్లపట్ల ప్రేమ ఉందని చూపిస్తాం. అంతేకాదు, యెహోవా మన తప్పులను క్షమిస్తున్నందుకు మనకు కృతజ్ఞత ఉందని చూపిస్తాం.—కొలొ. 3:13.

యెహోవా మిమ్మల్ని క్షమించాలంటే మీరు ఇతరుల్ని క్షమించాలి (11వ పేరా చూడండి)

11. ఇతరుల్ని క్షమించడం ఎందుకు ప్రాముఖ్యం?

11 ఎంతైనా మనం అపరిపూర్ణులం కాబట్టి, మనల్ని నొప్పించిన వ్యక్తిని క్షమించడం కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది. (లేవీ. 19:18) అయితే ఆ వ్యక్తి మనల్ని నొప్పించిన సంగతి మనం అందరికీ చెప్తే, సంఘంలోని ఇతరులు ఆయన్ని దూరం పెట్టవచ్చు. అలా మనం సంఘ ఐక్యతను దెబ్బతీసినవాళ్లం అవుతాం. ఆ పరిస్థితిని అలాగే కొనసాగనిస్తే, యేసు బలిపట్ల మనకు గౌరవం లేదని చూపించినవాళ్లమౌతాం. అలాచేస్తే ఆ బలివల్ల వచ్చే ప్రయోజనాల్ని మనం పొందలేం. మనం ఇతరుల్ని క్షమించకపోతే, యెహోవా కూడా మనల్ని క్షమించడు. (మత్తయి 6:14, 15 చదవండి; మత్త. 18:35) అలాగే, యెహోవా క్షమాపణను పొందాలంటే మనం గంభీరమైన పాపాల్ని చేస్తూ ఉండకూడదు.—1 యోహా. 3:4, 6.

‘మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు’

12, 13. (ఎ) బాప్తిస్మం తర్వాత యేసుకు ఎలాంటి పరిస్థితి ఎదురైంది? (బి) మనం శోధనలకు లొంగిపోతే వేరేవాళ్లను ఎందుకు తప్పుపట్టకూడదు? (సి) తన చివరిశ్వాస వరకు యథార్థంగా ఉండడం ద్వారా యేసు ఏమి నిరూపించాడు?

12 ‘మమ్మల్ని శోధనలోకి తీసుకురావద్దు’ అనే మాటలు, బాప్తిస్మం తర్వాత యేసుకు ఎదురైన పరిస్థితిని మనకు గుర్తుచేస్తాయి. “యేసు అపవాదిచేత శోధింపబడుటకు ఆత్మవలన అరణ్యమునకు కొనిపోబడెను” అని బైబిలు చెప్తుంది. (మత్త. 4:1; 6:13) అలా జరిగేలా యెహోవా ఎందుకు అనుమతించాడు? దానికి జవాబు తెలుసుకోవాలంటే అసలు యెహోవా యేసును భూమ్మీదకు ఎందుకు పంపించాడో ఆలోచించాలి. ఆదాముహవ్వలు యెహోవా పరిపాలనను వద్దనుకున్నప్పుడు సాతాను కొన్ని ప్రశ్నలు లేవదీశాడు. ఉదాహరణకు, యెహోవా మనుషుల్ని తయారుచేసిన విధానంలో ఏదైనా లోపం ఉందా? ‘దుష్టుడు’ శోధిస్తున్నా ఓ పరిపూర్ణ మనిషి యెహోవాకు నమ్మకంగా ఉండగలడా? మనుషులు తమను తామే పరిపాలించుకుంటే పరిస్థితి ఇంకా బాగుంటుందా? వాటికి జవాబు రావడానికి సమయం పట్టింది. (ఆది. 3:4, 5) యేసు యథార్థంగా ఉండడం ద్వారా సాతాను వేసిన నిందలన్నీ అబద్ధాలని నిరూపించాడు. భవిష్యత్తులో యెహోవా దేవుడు, సాతాను ప్రశ్నలన్నిటికీ ధీటైన జవాబిచ్చినప్పుడు, పరలోకంలోనూ భూమ్మీద ఉన్నవాళ్లందరూ యెహోవా పరిపాలనే అత్యుత్తమమైనదని తెలుసుకుంటారు.

13 యెహోవా పరిశుద్ధుడు కాబట్టి చెడ్డ పనులు చేసేలా ఆయన ఎవర్నీ శోధించడు. మనల్ని ‘శోధించేవాడు’ సాతానే. (మత్త. 4:3) సాతాను మనల్ని ఎన్నో రకాలుగా శోధిస్తాడు. అయితే, వాటిని ఎదిరించాలా లేక వాటికి లొంగిపోవాలా అని నిర్ణయించుకోవాల్సింది మనమే. (యాకోబు 1:13-15 చదవండి.) యేసుక్రీస్తు దేవుని వాక్యంలోని మాటల్ని ఎత్తిచెప్తూ సాతాను శోధనల్ని వెంటనే తిప్పికొట్టాడు. అలా యేసు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. కానీ సాతాను పట్టువదలకుండా, ఆయన్ను శోధించే “మరో అవకాశం చిక్కేవరకు” ఎదురుచూశాడు. (లూకా 4:13, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) సాతాను ఎంత ప్రయత్నించినా యేసు మాత్రం దేవుని పరిపాలనకే ఎల్లప్పుడూ లోబడ్డాడు. అలా, ఎన్ని తీవ్రమైన శోధనలు వచ్చినా ఓ పరిపూర్ణ మానవుడు యెహోవాకు యథార్థంగా ఉండగలడని ఆయన నిరూపించాడు. అయితే సాతాను మాత్రం, దేవునికి అవిధేయత చూపించేలా యేసు అనుచరుల్ని శోధిస్తూనే ఉన్నాడు. వాళ్లలో మీరు కూడా ఉన్నారని గుర్తుంచుకోండి.

14. శోధనలకు లొంగిపోకూడదంటే మనం ఏ రెండు పనులు చేయాలి?

14 యెహోవా పరిపాలన గురించి సాతాను లేవదీసిన ప్రశ్నలకు జవాబు రావడానికి ఇంకా సమయం ఉంది. కాబట్టి మనల్ని శోధించడానికి యెహోవా సాతానును అనుమతిస్తున్నాడు. అంతేకానీ యెహోవా మనల్ని ‘శోధనలోకి తీసుకురాడు.’ నిజానికి, మనం యథార్థంగా ఉంటామనే నమ్మకం ఆయనకు ఉంది, మనకు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు కూడా. అయితే సరైనది చేసేలా యెహోవా మనల్ని ఎన్నడూ బలవంతపెట్టడు. ఈ విషయంలో మనకున్న స్వేచ్ఛను ఆయన గౌరవిస్తున్నాడు. కాబట్టి ఆయనకు యథార్థంగా ఉండాలో వద్దో నిర్ణయించుకోవాల్సింది మనమే. అయితే, శోధనలకు లొంగిపోకూడదంటే మనం రెండు పనులు చేయాలి. యెహోవాకు దగ్గరగా ఉండాలి, ఆయన సహాయం కోసం ప్రార్థిస్తూ ఉండాలి. అలాంటి ప్రార్థనలకు యెహోవా ఎలా జవాబిస్తాడు?

యెహోవాకు దగ్గరగా ఉంటూ ఉత్సాహంగా పరిచర్యలో పాల్గొనండి (15వ పేరా చూడండి)

15, 16. (ఎ) మనం ఏయే శోధనల్ని ఎదిరించాలి? (బి) మనం శోధనలకు లొంగిపోతే తప్పు ఎవరిది?

15 శోధనల్ని ఎదిరించడానికి కావాల్సిన బలాన్ని, సహాయాన్ని యెహోవా తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు ఇస్తాడు. అంతేకాక, మనకు ఎదురయ్యే ప్రమాదాల గురించి బైబిలు ద్వారా, సంఘం ద్వారా ఆయన మనల్ని హెచ్చరిస్తాడు. ఉదాహరణకు, మనకు నిజంగా అవసరంకానివాటి కోసం మన సమయాన్ని, డబ్బును, శక్తిని వృథా చేయొద్దని ఆయన మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ అనుభవాన్ని పరిశీలించండి. ఇస్పెన్‌, యానె అనే జంట యూరప్‌లోని ఓ సంపన్న దేశంలో ఉంటున్నారు. వాళ్లు తమ దేశంలోనే, అవసరం ఎక్కువున్న ఓ ప్రాంతంలో ఎన్నో ఏళ్లపాటు క్రమ పయినీర్లుగా సేవ చేశారు. అయితే వాళ్లకు ఒక బాబు పుట్టడంతో పయినీరు సేవ ఆపేయాల్సి వచ్చింది, ఇప్పుడు వాళ్లకు ఇద్దరు పిల్లలు. ఇస్పెన్‌ ఇలా అంటున్నాడు, ‘మేము ఇంతకుముందులా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాం కాబట్టి శోధనలకు లొంగిపోకుండా సహాయం చేయమని మేము తరచూ యెహోవాకు ప్రార్థిస్తుంటాం. అంతేకాదు యెహోవాతో మా స్నేహాన్ని, పరిచర్యలో మా ఉత్సాహాన్ని కాపాడుకోవడానికి సహాయం చేయమని కూడా వేడుకుంటాం.’

16 మనం ఎదిరించాల్సిన మరో శోధన, అశ్లీల చిత్రాలు చూడడం. ఒకవేళ మనం ఈ శోధనకు లొంగిపోతే సాతానును తప్పుపట్టకూడదు. ఎందుకు? ఎందుకంటే సాతానుగానీ అతని లోకంగానీ, మనకు ఇష్టంలేని పనిని చేసేలా మనల్ని బలవంతపెట్టలేరు. కొంతమంది, తప్పుడు విషయాల గురించే ఆలోచిస్తూ ఉండడం వల్ల అశ్లీల చిత్రాలను చూశారు. కానీ మన సహోదరసహోదరీల్లో చాలామంది ఈ శోధనను ఎదిరించారు. మనం కూడా ఎదిరించగలం.—1 కొరిం. 10:12, 13.

‘దుష్టుని నుండి మమ్మల్ని తప్పించుము’

17. (ఎ) యెహోవా మనల్ని ‘దుష్టుని నుండి తప్పించాలని’ మనం నిజంగా కోరుకుంటే ఏమి చేయాలి? (బి) మనమెప్పుడు నిజమైన ప్రశాంతత అనుభవిస్తాం?

17 యెహోవా మనల్ని ‘దుష్టుని నుండి తప్పించాలని’ మనం నిజంగా కోరుకుంటే ఏమి చేయాలి? మనం ‘లోకసంబంధులుగా’ ఉండకూడదు, అలాగే ‘లోకాన్నిగానీ లోకంలో ఉన్నవాటినిగానీ ప్రేమించకూడదు.’ (యోహా. 15:19; 1 యోహా. 2:15-17) యెహోవా సాతానును, అతని దుష్ట లోకాన్ని నాశనం చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో! అయితే అప్పటివరకు ఒక విషయాన్ని అస్సలు మర్చిపోకండి, “తనకు సమయము కొంచెమే అని తెలిసికొని” సాతాను చాలా కోపంగా ఉన్నాడు. మనల్ని యెహోవా ఆరాధన నుండి దూరం చేయడానికి అతను ఎంతకైనా తెగిస్తాడు. కాబట్టి సాతాను నుండి కాపాడమని మనం యెహోవాకు ప్రార్థిస్తూనే ఉండాలి.—ప్రక. 12:12, 17.

18. ఈ దుష్టలోక అంతాన్ని తప్పించుకోవాలంటే మనమేమి చేస్తూ ఉండాలి?

18 సాతానులేని లోకంలో జీవించాలని మీకు ఉందా? అయితే దేవుని రాజ్యం రావాలనీ, యెహోవా నామం పరిశుద్ధపర్చబడాలనీ, ఆయన చిత్తం భూమ్మీద నెరవేరాలనీ ప్రార్థిస్తూ ఉండండి. మీ ఆధ్యాత్మిక, భౌతిక అవసరాలన్నిటి కోసం యెహోవాపై ఆధారపడండి. అవును, యేసు నేర్పించిన మాదిరి ప్రార్థన ప్రకారం జీవించడానికి చేయగలిగినదంతా చేయండి.