కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆయన ప్రజల్ని ప్రేమించాడు

ఆయన ప్రజల్ని ప్రేమించాడు

“నరులను చూచి ఆనందించుచునుంటిని.”సామె. 8:31.

1, 2. తనకు మనుషులందరి మీద చాలా ప్రేమ ఉందని యేసు ఎలా చూపించాడు?

 దేవుని మొదటి కుమారుడైన యేసు, యెహోవాకున్న అంతులేని జ్ఞానానికి గొప్ప నిదర్శనం. ఆయన తన తండ్రి దగ్గర ‘ప్రధానశిల్పిగా’ పనిచేశాడు. తన తండ్రి “ఆకాశవిశాలమును స్థిరపరచినప్పుడు,” అలాగే “భూమియొక్క పునాదులను నిర్ణయించినప్పుడు” యేసు ఎంత సంతోషించివుంటాడో ఊహించండి. అయితే, తన తండ్రి చేసిన సృష్టి అంతట్లో యేసు ముఖ్యంగా ‘నరులను చూసి ఆనందించాడు.’ (సామె. 8:22-31) అవును, ఆయనకు మొదటినుండి మనుషులంటే చాలా ఇష్టం.

2 తర్వాత, ఆయన ఇష్టపూర్వకంగా పరలోకాన్ని విడిచి భూమ్మీద మానవునిగా జీవించడానికి వచ్చాడు. అలా, తండ్రి పట్ల తనకున్న ప్రేమను, విశ్వసనీయతను చూపించాడు. అలాగే మనుషులందరి మీద తనకెంత ప్రేమ ఉందో కూడా చూపించాడు. తన ప్రాణాన్ని “అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా” ఇవ్వడానికి యేసు ఎంతో ప్రేమతో ముందుకొచ్చాడు. (ఫిలి. 2:5-8; మత్త. 20:28) ఆయన భూమ్మీద ఉన్నప్పుడు అద్భుతాలు చేసేలా దేవుడు ఆయనకు శక్తినిచ్చాడు. ఈ అద్భుతాల ద్వారా, తనకు ప్రజలమీద ఎంత ప్రేమ ఉందో, అతిత్వరలో మనుషులందరి కోసం తానేమి చేస్తాడో యేసు చూపించాడు.

3. ఈ ఆర్టికల్‌లో మనమేమి పరిశీలిస్తాం?

3 భూమ్మీదకు రావడంవల్ల యేసు “దేవుని రాజ్యసువార్తను” ప్రకటించగలిగాడు. (లూకా 4:43) ఆ రాజ్యం తన తండ్రి నామాన్ని పరిశుద్ధపరుస్తుందని, మనుషుల సమస్యలన్నిటినీ శాశ్వతంగా పరిష్కరిస్తుందని యేసుకు తెలుసు. ప్రకటనా పని చేస్తున్నప్పుడు, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు. అవి, ప్రజలందరి పట్ల యేసుకున్న శ్రద్ధను చూపించాయి. వాటి గురించి తెలుసుకోవడం ఎందుకు ప్రాముఖ్యం? ఎందుకంటే అవి మనకు భవిష్యత్తు మీద ఆశను, నమ్మకాన్ని కలిగిస్తాయి. కాబట్టి యేసు చేసిన నాలుగు అద్భుతాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

ఆయనకు స్వస్థపర్చే శక్తి ఉంది

4. యేసు దగ్గరికి ఓ కుష్ఠరోగి వచ్చినప్పుడు ఏమి జరిగింది?

4 యేసు పరిచర్య చేస్తూ ఓసారి గలిలయకు వెళ్లాడు. అక్కడ ఒకానొక పట్టణంలో, భయంకరమైన కుష్ఠువ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆయన దగ్గరకు వచ్చాడు. (మార్కు 1:39, 40) ఆ వ్యాధి ఎంత తీవ్రంగా ఉందంటే, అతని ఒళ్లంతా “కుష్ఠరోగముతో నిండి” ఉందని వైద్యుడైన లూకా వర్ణించాడు. (లూకా 5:12) అతను యేసును చూసి, ‘సాగిలపడి—ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవని ఆయన్ను వేడుకున్నాడు.’ తనను బాగుచేసే శక్తి యేసుకుందని ఆ వ్యక్తికి తెలుసు. కానీ, అలా బాగుచేయాలనే కోరిక యేసుకు ఉందో లేదో అతను తెలుసుకోవాలనుకున్నాడు. ఎందుకు? ఎందుకంటే తనలాంటి కుష్ఠరోగుల్ని పరిసయ్యులుఎంతగా అసహ్యించుకుంటారో అతనికి బాగా తెలుసు. మరి ఆ వ్యక్తిని చూసినప్పుడు యేసుకు ఎలా అనిపించివుంటుంది? అందవికారంగా ఉన్న ఆ వ్యక్తితో యేసు ఎలా ప్రవర్తించాడు? మీరైతే ఏమి చేసివుండేవాళ్లు?

5. యేసు కుష్ఠరోగిని బాగుచేసేటప్పుడు “నాకిష్టమే” అని ఎందుకు అన్నాడు?

5 ధర్మశాస్త్రం ప్రకారం, కుష్ఠరోగం ఉన్న వ్యక్తి ‘అపవిత్రుణ్ణి అపవిత్రుణ్ణి’ అని కేకలు వేయాలి. కానీ, ఆ వ్యక్తి అలా చేయలేదని అర్థమౌతోంది. (లేవీ. 13:43-46) అయినా యేసు అతన్ని కోప్పడే బదులు, అతనిమీద శ్రద్ధతో సహాయం చేయాలనుకున్నాడు. ఆ సమయంలో యేసు ఖచ్చితంగా ఏమి ఆలోచించి ఉంటాడో మనకు తెలీదు కానీ ఆయనెలా భావించాడో మనకు తెలుసు. ఆ వ్యక్తిని చూసి ఎంతో జాలిపడి, ఆయన ఓ అద్భుతం చేశాడు. ఎవ్వరూ ముట్టుకోని ఆ వ్యక్తిని ఆయన ముట్టుకున్నాడు. యేసు కనికరంతో “నాకిష్టమే; నీవు శుద్ధుడవుకమ్మని అనగానే, కుష్ఠరోగము వానిని విడిచెను.” (లూకా 5:13) యెహోవా ఇచ్చిన శక్తితో యేసు ఈ గొప్ప అద్భుతాన్ని చేసి, ప్రజలమీద తనకెంత ప్రేమ ఉందో చూపించాడు.—లూకా 5:17.

6. యేసు చేసిన అద్భుతాల్లో ప్రత్యేకత ఏమిటి? ఆ అద్భుతాలు మనకేమి తెలియజేస్తున్నాయి?

6 దేవుడిచ్చిన శక్తితో యేసు ఎన్నో అసాధారణమైన అద్భుతాలు చేశాడు. ఆయన కేవలం కుష్ఠరోగుల్నే కాదు, రకరకాల జబ్బులతో బాధపడుతున్న చాలామందిని బాగుచేశాడు. “మూగవారు మాట్లాడ్డం, వికలాంగులకు పూర్తిగా నయం కావడం, కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడం” ఇవన్నీ చూసి ప్రజలు చాలా ఆశ్చర్యపోయారని బైబిలు చెప్తుంది. (మత్త. 15:31, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) ఇప్పటి డాక్టర్లు రోగుల్ని బాగుచేయడానికి కొన్నిసార్లు అవయవ మార్పిడి చేస్తారు. కానీ, యేసు మాత్రం పాడైపోయిన అవయవాల్నే మళ్లీ బాగుచేశాడు. అంతేకాదు, ఆయన ప్రజల్ని అప్పటికప్పుడే బాగుచేశాడు, కొన్నిసార్లైతే చాలా దూరంలో ఉన్నవాళ్లను కూడా బాగుచేశాడు. (యోహా. 4:46-54) ఈ అద్భుతాలు మనకేమి తెలియజేస్తున్నాయి? అసలు జబ్బులే లేకుండా చేసే శక్తి, చేయాలనే కోరిక మన రాజైన యేసుక్రీస్తుకు ఉన్నాయని అవి తెలియజేస్తున్నాయి. యేసు ప్రజలతో ప్రవర్తించిన తీరును బట్టి, ఆయన కొత్తలోకంలో కూడా ‘నిరుపేదలమీద, బీదలమీద కనికరం’ చూపిస్తాడని నమ్మవచ్చు. (కీర్త. 72:13) అవును, అప్పుడు అనారోగ్యంతో బాధపడేవాళ్లను యేసు ఇష్టపూర్వకంగా బాగుచేస్తాడు.

‘లేచి నీ పరుపు ఎత్తుకుని నడువు’

7, 8. యూదయకు వెళ్లిన తర్వాత యేసు ఏమి చేశాడు?

7 గలిలయలో కుష్ఠరోగిని బాగుచేసిన కొన్ని నెలల తర్వాత, యేసు యూదయకు వెళ్లి, దేవుని రాజ్య సువార్తను ప్రకటించడం కొనసాగించాడు. అక్కడ వేలమంది ప్రజలు యేసు ప్రకటించిన సందేశానికి, ఆయన ప్రేమకు ముగ్ధులైవుంటారు. బీదల్ని, అణచివేయబడిన వాళ్లను ఓదార్చి, వాళ్లలో భవిష్యత్తు మీద ఆశను చిగురింపజేయాలని యేసు మనస్ఫూర్తిగా కోరుకున్నాడు.—యెష. 61:1, 2; లూకా 4:18-21.

8 నీసాను నెలలో పస్కా పండుగను ఆచరించడానికి యేసు యెరూషలేముకు వెళ్లాడు. ఆ ప్రత్యేక పండుగను ఆచరించడానికి వచ్చిన ప్రజలతో పట్టణమంతా రద్దీగా ఉంది. యెరూషలేము ఆలయానికి ఉత్తరాన ఉన్న బేతెస్ద అనే కోనేరు దగ్గర యేసు, ఓ నడవలేని వ్యక్తికి సహాయం చేశాడు.

9, 10. (ఎ) ప్రజలు బేతెస్ద కోనేటికి ఎందుకు వచ్చేవాళ్లు? (బి) ఆ కోనేరు దగ్గర యేసు ఏమి చేశాడు? దీనినుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

9 జబ్బులతో, అంగవైకల్యంతో బాధపడుతున్న చాలామంది ప్రజలు ఆ కోనేటికి వచ్చేవాళ్లు. ఎందుకు? జబ్బు ఉన్న వ్యక్తి ఆ కోనేటిలోని నీళ్లు కదులుతున్నప్పుడు అందులో దిగితే స్వస్థత పొందుతాడని వాళ్ల నమ్మకం. ఎలాగైనా స్వస్థత పొందాలని, ఆందోళన పడుతున్న చాలామంది నిస్సహాయ ప్రజలు అక్కడ ఉన్నారు. వాళ్లు ఏమి ఆలోచిస్తూ ఉండివుంటారో ఒక్కసారి ఊహించండి. పరిపూర్ణుడైన యేసుకు ఎలాంటి అనారోగ్యం లేదు, మరి ఆయనెందుకు అక్కడ ఉన్నాడు? ఆయన ప్రజలమీద ప్రేమతో అక్కడికి వెళ్లాడు. యేసు భూమ్మీద జీవించిన దానికన్నా, ఎక్కువ సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తిని యేసు అక్కడ చూశాడు.—యోహాను 5:5-10 చదవండి.

10 యేసు అతన్ని ‘స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా?’ అని అడిగాడు. స్వస్థత పొందాలని ఉన్నా, తనను కోనేటిలోకి దించేవాళ్లు ఎవరూ లేరని అతను యేసుకు చెప్పుకుంటూ ఎంత బాధపడివుంటాడో ఊహించండి. అప్పుడు యేసు ఆ వ్యక్తికి అసాధ్యమైన ఓ పనిని చేయమని అంటే లేచి తన పరుపు ఎత్తుకుని నడవమని చెప్పాడు. దాంతో అతను తన పరుపు ఎత్తుకుని నడవడం మొదలుపెట్టాడు! ఈ అద్భుతం, యేసు కొత్తలోకంలో ఏమి చేస్తాడనే దానికి ఓ చక్కని రుజువు. అంతేకాక, యేసుకు ప్రజలమీద ఎంత ప్రేమ ఉందో దీన్నిబట్టి అర్థమౌతుంది. యేసు అవసరంలో ఉన్నవాళ్ల కోసం వెదికాడు. అదేవిధంగా మన ప్రాంతంలో కూడా, లోకంలోని ఘోరమైన విషయాలను చూసి కృంగిపోయినవాళ్ల కోసం మనం వెదుకుతూ ఉండాలి.

‘నా వస్త్రాలు ముట్టుకుంది ఎవరు?’

11. అనారోగ్యంతో బాధపడేవాళ్ల పట్ల యేసుకు ప్రేమ ఉందని మార్కు 5:25-34⁠లోని వృత్తాంతం ఎలా చూపిస్తుంది?

11 మార్కు 5:25-34 చదవండి. ఓ స్త్రీ 12 ఏళ్లుగా బయటికి చెప్పుకోలేని ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతుంది. ఆ సమస్య ఆమె రోజువారీ పనులన్నిటికీ, చివరికి ఆరాధనకు కూడా ఆటంకంగా ఉండేది. ఆ వ్యాధి నయమవడం కోసం ఆమె చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్లింది, తనకున్నదంతా ఖర్చుచేసింది. అయినా ఆ వ్యాధి తగ్గకపోగా ఇంకా ఎక్కువైంది. ఓ రోజు, ఆ సమస్యనుండి బయటపడే ఓ ఆలోచన ఆమెకు తట్టింది. ఆమె జనసమూహం మధ్యలో నుండి వెళ్లి యేసు వస్త్రాన్ని ముట్టుకుంది. (లేవీ. 15:19, 25) తనలో నుండి శక్తి బయటకు వెళ్లిందని గమనించిన యేసు తనను ఎవరు ముట్టుకున్నారని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ ‘భయపడి, వణుకుతూ వచ్చి, ఆయన ఎదుట సాగిలపడి, తన సంగతి అంతా ఆయనతో చెప్పింది.’ ఆ స్త్రీని స్వస్థపర్చింది యెహోవాయే అని గ్రహించి యేసు దయగా ఆమెతో ఇలా అన్నాడు, “కుమారీ, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానము గలదానవై పొమ్ము; నీ బాధ నివారణయై నీకు స్వస్థత కలుగుగాక.”

మన గురించి, మన సమస్యల గురించి తనకు శ్రద్ధ ఉందని యేసు అద్భుతాలు చేయడం ద్వారా చూపించాడు (11, 12 పేరాలు చూడండి)

12. (ఎ) మనం నేర్చుకున్నదాన్ని బట్టి యేసు ఎలాంటి వ్యక్తని మీకనిపిస్తుంది? (బి) యేసు మనకెలాంటి ఆదర్శం ఉంచాడు?

12 ప్రజలను, ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడేవాళ్లను యేసు ఎంతో ప్రేమిస్తాడని తెలుసుకోవడం ఊరటనిస్తుంది. అయితే సాతాను మాత్రం, మనమెందుకూ పనికిరాని వాళ్లమని, మనమీద ఎవరికీ ప్రేమ లేదని నమ్మించడానికి ప్రయత్నిస్తాడు. అయితే మన విషయంలో, మన సమస్యల విషయంలో యేసుకు నిజంగా శ్రద్ధ ఉందని ఆయన చేసిన అద్భుతాలు రుజువు చేశాయి. అలాంటి ప్రేమగల రాజు, ప్రధాన యాజకుడు మనకున్నందుకు ఎంతో రుణపడివున్నాం. (హెబ్రీ. 4:15) చాలాకాలంగా అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నవాళ్ల బాధను అర్థంచేసుకోవడం మనకు కష్టం కావచ్చు, ముఖ్యంగా మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పుడు అది మరీ కష్టం. కానీ యేసు ఎన్నడూ అనారోగ్యంతో బాధపడకపోయినా, అలాంటి వాళ్లమీద కనికరం చూపించాడు. కాబట్టి ఆయన్ను అనుకరించడానికి శాయశక్తులా కృషి చేద్దాం.—1 పేతు. 3:8.

“యేసు కన్నీళ్లు విడిచెను”

13. లాజరు పునరుత్థానం యేసు గురించి ఏమి చెప్తుంది?

13 యేసు ఇతరుల బాధల్ని చూసి చలించిపోయాడు. ఉదాహరణకు, తన స్నేహితుడైన లాజరు చనిపోయినప్పుడు ఏడుస్తున్న అతని కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని చూసి యేసు ‘కలవరపడి, ఆత్మలో మూలిగాడు.’ లాజరును మళ్లీ బ్రతికిస్తానని తెలిసి కూడా యేసు కంటతడి పెట్టుకున్నాడు. (యోహాను 11:33-36 చదవండి.) తాను ఏడిస్తే, చుట్టూ ఉన్నవాళ్లు ఏమనుకుంటారోనని ఆయన భయపడలేదు. యేసు లాజరును, అతని కుటుంబాన్ని ఎంతగా ప్రేమించాడంటే, దేవుని శక్తితో ఆయన లాజరును మళ్లీ బ్రతికించాడు.—యోహా. 11:43, 44.

14, 15. (ఎ) మానవజాతి సమస్యలన్నిటినీ తీసివేయాలనే కోరిక యెహోవాకు ఉందని ఎలా చెప్పవచ్చు? (బి) పునరుత్థానానికి యెహోవా జ్ఞాపకశక్తితో ఎలాంటి సంబంధం ఉంది?

14 యెహోవాకు ఉన్న లక్షణాలు, భావాలే యేసుకు ఉన్నాయని బైబిలు చెప్తుంది. (హెబ్రీ. 1:3, 4) కాబట్టి వ్యాధి, బాధ, మరణం లేకుండా చేయాలని యెహోవా కూడా కోరుకుంటున్నాడని యేసు చేసిన అద్భుతాలు రుజువు చేస్తున్నాయి. త్వరలోనే యెహోవా, యేసు చనిపోయిన చాలామందిని మళ్లీ బ్రతికించబోతున్నారు. “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు” పునరుత్థానం అవుతారని యేసు చెప్పాడు.—యోహా. 5:28, 29.

15 పునరుత్థానానికి యెహోవా జ్ఞాపకశక్తితో సంబంధం ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు, విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త కాబట్టి, చనిపోయిన మన ప్రియమైనవాళ్ల లక్షణాలతో సహా, వాళ్ల వివరాలన్నిటినీ గుర్తుపెట్టుకోగలడు. (యెష. 40:26) యెహోవాకు అలా గుర్తుపెట్టుకునే సామర్థ్యమే కాదు, గుర్తుపెట్టుకోవాలనే కోరిక కూడా ఉంది. బైబిల్లో నమోదైన పునరుత్థానాలు, కొత్తలోకంలో ఏమి జరగబోతోందో మనకు తెలియజేస్తాయి.

యేసు చేసిన అద్భుతాల నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

16. చాలామంది దేవుని సేవకులకు ఏ అవకాశం ఉంటుంది?

16 మనం చివరి వరకూ నమ్మకంగా ఉంటే, మహాశ్రమల్ని తప్పించుకోవచ్చు. అది మనం చూడగల గొప్ప అద్భుతాల్లో ఒకటి. హార్‌మెగిద్దోను ముగిసిన వెంటనే, మనం మరిన్ని అద్భుతాలు చూస్తాం. అప్పుడు ప్రతీ ఒక్కరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. (యెష. 33:24; 35:5, 6; ప్రక. 21:4) ఒకసారి ఊహించుకోండి, ఎవ్వరూ ఇక కళ్లద్దాలను, చేతికర్రలను, చక్రాల కుర్చీలను, చెవిటి మిషన్లను ఉపయోగించాల్సిన అవసరం ఉండదు. హార్‌మెగిద్దోనును తప్పించుకున్నవాళ్లకు యెహోవా పూర్తి ఆరోగ్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే, అప్పుడు చేయాల్సిన పని చాలా ఉంటుంది, వాళ్లు భూమిని అందమైన పరదైసుగా మార్చాలి.—కీర్త. 115:16.

17, 18. (ఎ) యేసు ఎందుకు అద్భుతాలు చేశాడు? (బి) కొత్తలోకంలో ఉండడానికి మనమెందుకు శాయశక్తులా కృషి చేయాలి?

17 యేసు చేసిన స్వస్థతల గురించి బైబిల్లో చదివినప్పుడు, ‘గొప్ప సమూహానికి’ చెందినవాళ్లు ఊరట పొందుతారు. (ప్రక. 7:9) యేసు భవిష్యత్తులో అనారోగ్యాన్ని పూర్తిగా తీసేస్తాడనే వాళ్ల నమ్మకాన్ని ఆ అద్భుతాలు బలపరుస్తాయి. అంతేకాక, దేవుని మొదటి కుమారుడైన యేసుకు మనుషుల మీద ఎంత ప్రేముందో కూడా అవి చూపిస్తాయి. (యోహా. 10:11; 15:12, 13) యేసు చూపించిన గొప్ప కనికరం, యెహోవాకు తన సేవకుల్లో ప్రతీఒక్కరి పట్ల ఉన్న ప్రేమను చక్కగా ప్రతిబింబిస్తుంది.—యోహా. 5:19.

18 ఇప్పుడు లోకంలో ఎటు చూసినా బాధలు, కష్టాలు, చావులే ఉన్నాయి. (రోమా. 8:22) అందుకే దేవుడు తీసుకొచ్చే కొత్తలోకం మనకు అవసరం. ఆ కొత్తలోకంలో అందరూ దేవుడు వాగ్దానం చేసినట్లు పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. అపరిపూర్ణతలన్నీ పోవడంవల్ల మనం సంతోషంగా, ఉత్సాహంగా ‘గంతులు వేస్తూ’ ఉంటామని మలాకీ 4:2 చెప్తుంది. మనం యెహోవాపట్ల కృతజ్ఞత కలిగి ఉంటూ, ఆయన వాగ్దానాల మీద విశ్వాసం ఉంచాలి. అప్పుడే, కొత్తలోకంలో ఉండేలా అర్హత సాధించడానికి శాయశక్తులా కృషి చేస్తాం. యేసు చేసిన అద్భుతాలు, ఆయన తన పరిపాలనలో మనందరి శాశ్వత ప్రయోజనం కోసం చేయబోయేవాటికి సూచనగా ఉన్నాయని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరం!