కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

‘మీకు సహనం అవసరం’

‘మీకు సహనం అవసరం’

అనిత a యెహోవాసాక్షి అయినప్పుడు ఆమె భర్త తీవ్రంగా వ్యతిరేకించాడు. ఆమెను కూటాలకు వెళ్లనిచ్చేవాడు కాదు, కనీసం దేవుని పేరు ఎత్తినా ఊరుకునేవాడు కాదు. ఆమె ఎప్పుడైనా యెహోవా పేరు పలికితే, ఆయనకు చాలా కోపం వచ్చేది.

అంతేకాదు, ఆమె పిల్లలకు యెహోవా గురించి చెప్పినా, వాళ్లను కూటాలకు తీసుకువెళ్లినా అస్సలు ఊరుకునేవాడు కాదు. దాంతో తన భర్తకు తెలీకుండా వాళ్లకు యెహోవా గురించి నేర్పించడం అనితకు చాలా కష్టంగా ఉండేది.

బహుశా అనిత లాంటి పరిస్థితే మీరూ ఎదుర్కొంటుండవచ్చు, మీరు యెహోవాను ఆరాధించకుండా మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తుండవచ్చు. లేదా చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడడం లేదా మీ బిడ్డగానీ, భర్త/భార్యగానీ చనిపోవడం లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు యెహోవాను విడిచిపెట్టడం వంటి కష్టాలవల్ల గుండెకోత అనుభవిస్తుండవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు యెహోవాకు ఎలా నమ్మకంగా ఉండవచ్చు?

అపొస్తలుడైన పౌలు ఇలా చెప్పాడు, ‘మీకు ఓరిమి [సహనం] అవసరం.’ (హెబ్రీ. 10:36) అయితే, సహనంగా ఉండడానికి మీకేవి సహాయం చేస్తాయి?

సహాయం కోసం యెహోవాకు ప్రార్థించండి

కష్టాల్ని సహించాలంటే మనం సహాయం కోసం యెహోవాకు ప్రార్థిస్తూ ఆయనపై ఆధారపడాలి. అనా అనే ఓ సహోదరి అనుభవాన్ని పరిశీలించండి. ఆమె భర్త అకస్మాత్తుగా చనిపోయాడు. వాళ్లకు పెళ్లై 30 ఏళ్లు అయింది. ఆమె ఇలా చెప్తుంది, ‘ఆయన ఆఫీస్‌కు వెళ్లి తిరిగి రాలేదు. ఆయన వయసు 52 ఏళ్లే.’

మరి అనా ఆ బాధను ఎలా తట్టుకోగలిగింది? ఆమె మళ్లీ ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది, ఆ పనిలో పూర్తిగా నిమగ్నమవ్వడం వల్ల ఆమె కాస్త కోలుకుంది. కానీ ఆ బాధ మాత్రం పూర్తిగా పోలేదు. ఆమె ఇలా చెప్తోంది, ‘నా మనసులోని బాధంతా యెహోవాకు చెప్పుకుని నాకు సహాయం చేయమని వేడుకున్నాను.’ అలా ప్రార్థించిన తర్వాత ఆమె మనసు కుదుటపడి ప్రశాంతంగా అనిపించేది, దాంతో యెహోవా తనకు సహాయం చేశాడని ఆమెకు అర్థమైంది. ఆమె ఇంకా ఇలా చెప్తోంది, ‘యెహోవా నా భర్తను తప్పకుండా తిరిగి బ్రతికిస్తాడని నాకు తెలుసు.’—ఫిలి. 4:6, 7.

తన సేవకుల ప్రార్థనలు వింటానని యెహోవా మాటిస్తున్నాడు. (కీర్త. 65:2) తన సేవలో కొనసాగడానికి అవసరమైనవన్నీ ఆయన ఇస్తాడు. కష్టాలొచ్చినప్పుడు కూడా మీరు నమ్మకంగా ఉండడానికి ఆయన సహాయం చేస్తాడు.

సహోదరసహోదరీలతో సన్నిహితంగా ఉండండి

సంఘంలోని సహోదరసహోదరీల ద్వారా కూడా యెహోవా మనకు సహాయం చేస్తాడు. థెస్సలోనిక సంఘంలోని వాళ్లు, తీవ్రమైన హింసలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్లు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండడం చాలా ముఖ్యం. (1 థెస్స. 2:14; 5:11) వాళ్లు ప్రేమతో ఒకరికొకరు దగ్గరౌతూ, సహాయం చేసుకుంటూ తమకు ఎదురైన విశ్వాస పరీక్షను దాటగలిగారు. వాళ్లలాగే మనం కూడా కష్టాల్ని సహించాలంటే ఏమి చేయాలి?

మనం సంఘంలోని వాళ్లతో సన్నిహితంగా ఉంటూ ఒకర్నొకరు ప్రోత్సహించుకోవాలి, మరిముఖ్యంగా కష్టాలొచ్చినప్పుడు అలా చేయడం ప్రాముఖ్యం. (రోమా. 14:19) అపొస్తలుడైన పౌలు తీవ్రమైన హింసల్ని, ఇతర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. అయితే వాటిని సహించడానికి కావాల్సిన బలాన్ని యెహోవా ఆయనకు ఇచ్చాడు. యెహోవా కొన్నిసార్లు సహోదరసహోదరీల ద్వారా పౌలును ప్రోత్సహించాడు. వాళ్ల గురించి పౌలు ఇలా చెప్పాడు, “వీరివలన నాకు ఆదరణ కలిగెను.” (కొలొ. 4:10, 11) వాళ్లు పౌలును ఎంతో ప్రేమించారు, అందుకే ఆయనకు సహాయం అవసరమైనప్పుడు వాళ్లు ఆయన్ను ఓదార్చి, ప్రోత్సహించారు. అదేవిధంగా, మీ సంఘంలోని సహోదరసహోదరీలు కూడా తమ మాటల ద్వారా, చేతల ద్వారా మిమ్మల్ని ఎన్నోసార్లు ప్రోత్సహించి ఉంటారు.

సంఘపెద్దల సహాయం తీసుకోండి

సంఘపెద్దల ద్వారా కూడా యెహోవా మనకు సహాయం చేస్తాడు. వాళ్లు మనల్ని ప్రోత్సహించి, బైబిలు నుండి మనకు కావాల్సిన చక్కని సలహాలు ఇస్తారు. వాళ్లు ‘గాలికి మరుగైనచోటువలె గాలివానకు చాటైన చోటువలె ఉంటారు. ఎండినచోట నీళ్లకాలువలవలెను అలసట పుట్టించు దేశమున గొప్పబండ నీడవలె ఉంటారు.’ (యెష. 32:2) మనకు సహాయం చేయడానికి సంఘపెద్దలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని తెలుసుకోవడం మనకు ఊరటనిస్తుంది. కాబట్టి కష్టాలొచ్చినప్పుడు సంఘపెద్దల సహాయాన్ని తీసుకోండి. మీరు యెహోవాను సేవిస్తూ ఉండడానికి వాళ్లు సహాయం చేస్తారు.

నిజమే, వాళ్లు కూడా మనలా అపరిపూర్ణులే కాబట్టి వాళ్లు మన సమస్యలన్నిటినీ పరిష్కరించలేరు. (అపొ. 14:15) కానీ పెద్దలు మనకోసం చేసే ప్రార్థనలవల్ల మనకెంతో ప్రయోజనం ఉంటుంది. (యాకో. 5:14, 15) ఉదాహరణకు, ఇటలీలో ఎన్నో ఏళ్లుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సహోదరుణ్ణి పెద్దలు ప్రోత్సహించారు. ఆయనిలా చెప్పాడు, ‘వాళ్లు నా మీద చూపించిన ప్రేమాప్యాయతలు, నన్ను చూడడానికి తరచూ మా ఇంటికి రావడం ఇవన్నీ నా బాధను సహించడానికి నాకు సహాయం చేశాయి.’ మీరు కూడా ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు, సంఘపెద్దల సహాయం తీసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు.

యెహోవా సేవ మీదే దృష్టి నిలపండి

మనం యెహోవా సేవ మీద దృష్టి పెడితే, ఆయన మనకు ఏవిధంగా సహాయం చేస్తాడో స్వయంగా తెలుసుకుంటాం. జాన్‌ అనే సహోదరుని విషయంలో అదే జరిగింది. ఆయనకు 39 ఏళ్లున్నప్పుడు, ఓ అరుదైన క్యాన్సర్‌ ఉందని వైద్యపరీక్షల్లో తేలింది. చిన్నవయసులోనే తనకు అంత భయంకరమైన జబ్బు రావడం అన్యాయమని ఆయన కుమిలిపోయాడు. తన భార్యను, మూడేళ్ల తన కొడుకును తలుచుకుని ఆయన చాలా బాధపడ్డాడు. ఆయనిలా అంటున్నాడు, ‘మా అబ్బాయి మంచిచెడ్డలతోపాటు నా చికిత్సకు సంబంధించిన విషయాలు కూడా మా ఆవిడే చూసుకోవాల్సి వచ్చింది.’ కీమోథెరఫీ చికిత్స వల్ల జాన్‌ చాలా నీరసించిపోయేవాడు, ఇతర అనారోగ్య సమస్యల్ని కూడా ఎదుర్కొనేవాడు. అంతేకాకుండా, ఆ సమయంలోనే తన తండ్రి చావుబతుకుల మధ్య ఉన్నాడని, ఆయన బాగోగులు చూసుకోవాల్సిన అవసరముందని జాన్‌కు తెలిసింది.

మరి జాన్‌, ఆయన కుటుంబ సభ్యులు ఆ కష్టాల్ని ఎలా తట్టుకున్నారు? జాన్‌కు నీరసంగా అనిపించినా, తన కుటుంబమంతా యెహోవా సేవకు మొదటిస్థానం ఇచ్చేలా చూసేవాడు. ఆయనిలా చెప్తున్నాడు, ‘మేము కూటాలన్నిటికీ వెళ్లేవాళ్లం, ప్రతీవారం పరిచర్యకు వెళ్లేవాళ్లం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా కుటుంబ ఆరాధనను తప్పకుండా చేసుకునేవాళ్లం.’ యెహోవాతో బలమైన సంబంధం ఉంటే ఎలాంటి కష్టాన్నైనా తట్టుకోవచ్చని జాన్‌ గ్రహించాడు. తన పరిస్థితి గురించి మొదట్లో ఆందోళనపడినా, కొంతకాలంలోనే ఆ బాధ నుండి తేరుకున్నాడు. యెహోవా తనను ప్రేమించి, తనకు కావాల్సిన బలాన్ని ఇచ్చాడని జాన్‌ అర్థంచేసుకున్నాడు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు యెహోవా మీకుకూడా అదేవిధంగా సహాయం చేయగలడు. జాన్‌ ఇలా చెప్తున్నాడు, ‘యెహోవా నన్ను బలపర్చినట్లే మిమ్మల్ని కూడా బలపర్చగలడు.’

కష్టాల్లో ఉన్నప్పుడు, ‘మీకు ఓరిమి [సహనం] అవసరం’ అని పౌలు చెప్పిన మాటల్ని గుర్తుతెచ్చుకోండి. యెహోవాకు ప్రార్థిస్తూ ఆయనపై ఆధారపడండి. తోటి సహోదరసహోదరీలతో సన్నిహితంగా ఉండండి, సంఘపెద్దల సహాయం తీసుకోండి, యెహోవా సేవ మీదే దృష్టి పెట్టండి. ఇప్పుడు మీకు ఏ సమస్య ఉన్నా లేదా ముందుముందు ఎలాంటి సమస్య వచ్చినా, సహించడానికి యెహోవా మీకు సహాయం చేస్తాడు.

a అసలు పేర్లు కావు.