కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కనిపెట్టుకొని ఉండండి!

కనిపెట్టుకొని ఉండండి!

‘అది ఆలస్యంగా వచ్చినా దానికోసం ఎదురుచూస్తూ ఉండండి.’హబ. 2:3, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

పాటలు: 32, 45

1, 2. యెహోవా సేవకులు ఎల్లప్పుడూ ఏమి చేశారు?

 ప్రవచనాల నెరవేర్పు కోసం యెహోవా సేవకులు ఓపిగ్గా ఎదురుచూశారు. ఉదాహరణకు, బబులోనీయుల చేతిలో యూదా నాశనం అవుతుందని యిర్మీయా చెప్పిన ప్రవచనం సా.శ.పూ 607⁠లో నెరవేరింది. (యిర్మీ. 25:8-11) బబులోను చెరలో ఉన్న యూదుల్ని యెహోవా విడిపించి, మళ్లీ యూదా దేశానికి రప్పిస్తాడని ప్రవచిస్తూ యెషయా ఇలా అన్నాడు, “ఆయన నిమిత్తము కనిపెట్టుకొనువారందరు ధన్యులు.” (యెష. 30:18) యెహోవా వాగ్దానాలు నెరవేరతాయని మీకా కూడా ఎదురుచూశాడు. ఆయనిలా అన్నాడు, “నా దేవునికొరకు నేను కనిపెట్టియుందును.” (మీకా 7:7) ఆ తర్వాత కాలంలోని దేవుని సేవకులు, మెస్సీయ లేదా క్రీస్తు తప్పకుండా వస్తాడని వందల సంవత్సరాలపాటు ఎదురుచూశారు.—లూకా 3:15; 1 పేతు. 1:10-12. a

2 నేడు మనంకూడా దేవుని రాజ్యానికి సంబంధించిన ప్రవచనాల నెరవేర్పు కోసం ఎదురుచూస్తున్నాం. ఆ రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తు త్వరలోనే చెడ్డవాళ్లందర్నీ నాశనం చేసి, దేవుని సేవకుల్ని రక్షించి, కష్టాలన్నిటినీ పూర్తిగా తీసేస్తాడు. (1 యోహా. 5:19) కాబట్టి యెహోవా దినం ఏ క్షణంలోనైనా రావచ్చని ఎదురుచూస్తూ, దానికోసం సిద్ధంగా ఉండడానికి చేయగలిగినదంతా చేయాలి.

3. మనం అంతం కోసం చాలాకాలంగా ఎదురుచూస్తుంటే, మనకెలా అనిపించవచ్చు?

3 దేవుని చిత్తం భూమ్మీద నెరవేరే రోజు కోసం మనం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాం. (మత్త. 6:9, 10) అంతం కోసం మనం ఒకవేళ చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తుంటే మనకిలా అనిపించవచ్చు, ‘అంతం త్వరలోనే వస్తుందని మనం ఇంకా ఎందుకు ఎదురుచూస్తూ ఉండాలి?’

ఎందుకు ఎదురుచూస్తూనే ఉండాలి?

4. మనం ఎందుకు అప్రమత్తంగా ఉండాలి?

4 యేసు తన అనుచరుల్ని “మెలకువగా” లేదా అప్రమత్తంగా ఉండమని ఆజ్ఞాపించాడు. కాబట్టి అంతం త్వరలో వస్తుందని మనం ఎదురుచూస్తూ ఉండాలి. (మత్త. 24:42; లూకా 21:34-36) యెహోవా సంస్థ కూడా మనల్ని “దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు” ఉండమని, ఆయన వాగ్దానం చేసిన కొత్తలోకం మీదే మనసుపెట్టమని ప్రోత్సహిస్తుంది.—2 పేతురు 3:11-13 చదవండి.

5. యెహోవా దినం కోసం ఎదురుచూస్తూ ఉండడానికి ఇంకో కారణం ఏంటి?

5 యెహోవా దినం కోసం ఎదురుచూస్తూ ఉండమని యేసు తన శిష్యులకు చెప్పాడు. అలా ఎదురుచూడడం ఆ కాలంలోనే ప్రాముఖ్యమంటే మనకాలంలో ఇంకా ప్రాముఖ్యం. ఎందుకు? ఎందుకంటే, యేసు చెప్పిన సూచనను బట్టి ఆయన 1914 నుండి రాజుగా పరిపాలిస్తున్నాడని, మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని అర్థమౌతుంది. యేసు ఆ సూచనలో చెప్పినట్లు లోక పరిస్థితులు అంతకంతకూ దిగజారిపోతున్నాయి, మరోవైపు రాజ్యసువార్తను ప్రకటించే పని భూవ్యాప్తంగా జరుగుతుంది. (మత్త. 24:3, 7-14) అంత్యదినాలు ఎంతకాలం ఉంటాయో యేసు చెప్పలేదు కాబట్టి అంతం ఎప్పుడైనా రావచ్చని మనం సిద్ధంగా ఉండాలి.

6. అంతం దగ్గరయ్యేకొద్దీ పరిస్థితులు ఇంకా దిగజారిపోతాయని మనకెలా తెలుసు?

6 ‘అంత్యదినాల్లో’ ప్రజలు అంతకంతకూ చెడ్డగా మారతారని బైబిలు చెప్తుంది. (2 తిమో. 3:1, 13; మత్త. 24:21; ప్రక. 12:12) కాబట్టి ప్రస్తుతం పరిస్థితులు చెడుగా ఉన్నా, ముందుముందు అవి ఇంకా దిగజారిపోతాయని మనకు తెలుసు. అయితే “యుగసమాప్తి” అనే మాట, భవిష్యత్తులో పరిస్థితులు మరీ ఘోరంగా తయారయ్యే కాలాన్ని సూచిస్తుందా?

7. మత్తయి 24:37-39 ప్రకారం అంత్యదినాల్లో లోక పరిస్థితులు ఎలా ఉంటాయి?

7 “మహాశ్రమలు” మొదలయ్యేముందు, ప్రతీ దేశంలో యుద్ధాలు జరుగుతుంటాయని, ప్రతీ ఇంట్లో ఎవరోఒకరు రోగాలతో బాధపడుతుంటారని లేదా ఆకలితో అలమటిస్తుంటారని కొంతమంది అనుకుంటారు. (ప్రక. 7:14) ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే, బైబిలు ప్రవచనం నెరవేరుతోందని ప్రతీఒక్కరూ, చివరికి బైబిలంటే ఆసక్తిలేనివాళ్లు కూడా ఒప్పుకుంటారు. అయితే తన ప్రత్యక్షతకు సంబంధించిన సూచనను చాలామంది ప్రజలు ‘ఎరుగరని’ లేదా గమనించరని యేసు చెప్పాడు. వాళ్లు రోజువారీ పనుల్లో మునిగిపోయివుంటారు కాబట్టి యెహోవా దినం వచ్చినప్పుడు వాళ్లు అవాక్కవుతారు. (మత్తయి 24:37-39 చదవండి.) కాబట్టి మహాశ్రమల ముందు, లోక పరిస్థితులు మరీ చెడుగా మారతాయని మనం అనుకోకూడదు.—లూకా 17:20; 2 పేతు. 3:3, 4.

8. మనం ఏ విషయాన్ని నమ్ముతున్నాం?

8 తన అనుచరులు ఎలాంటి కాలంలో జీవిస్తున్నారో వాళ్లు తెలుసుకోవడానికే యేసు ఆ సూచన చెప్పాడు. ఆ సూచనను అర్థం చేసుకున్న ఆయన అనుచరులు అప్రమత్తంగా ఉన్నారు. (మత్త. 24:27, 42) యేసు ఇచ్చిన సూచనలోని ఒక్కొక్క అంశం 1914 నుండి నెరవేరుతోంది. కాబట్టి, మనం ‘యుగసమాప్తి’ కాలంలోనే జీవిస్తున్నామని గట్టిగా నమ్ముతున్నాం. ఈ దుష్టలోకాన్ని ఎప్పుడు నాశనం చేయాలో యెహోవా ఇప్పటికే నిర్ణయించాడు.

9. అంతం త్వరలోనే వస్తుందని మనమెందుకు ఎదురుచూస్తూ ఉండాలి?

9 అంతం త్వరలోనే వస్తుందని మనం ఎందుకు ఎదురుచూస్తూనే ఉండాలి? ఎందుకంటే అలా ఎదురుచూస్తూ ఉండమని యేసు చెప్పాడు. అంతేకాదు, అంత్యదినాల గురించి ఆయన చెప్పిన సూచన నిజమవ్వడాన్ని మనం ఇప్పుడు కళ్లారా చూస్తున్నాం. మనం వినే ప్రతీ మాటను గుడ్డిగా నమ్మడం వల్ల అంతం దగ్గర్లో ఉందని నమ్మట్లేదు కానీ బైబిలు ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతున్నాయి కాబట్టే నమ్ముతున్నాం. మనం అప్రమత్తంగా ఉంటూ అంతం కోసం సిద్ధంగా ఉండాలి.

ఎంతకాలం ఎదురుచూడాలి?

10, 11. (ఎ) మెలకువగా ఉండమని యేసు తన శిష్యులకు ఎందుకు చెప్పాడు? (బి) అంతం ఆలస్యమౌతున్నట్లు అనిపించినా ఏం చేయాలని ఆయన తన శిష్యులకు చెప్పాడు? (ప్రారంభ చిత్రం చూడండి.)

10 మనలో చాలామందిమి ఎంతోకాలంగా యెహోవాను నమ్మకంగా సేవిస్తూ, యెహోవా దినం కోసం ఆశగా ఎదురుచూస్తున్నాం. మనం ఎంతకాలంగా ఎదురుచూస్తున్నప్పటికీ, అంతం త్వరలోనే వస్తుందనే నమ్మకాన్ని వదులుకోకూడదు. యేసు ఈ దుష్టలోకాన్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మనం సిద్ధంగా ఉండాలి. యేసు తన శిష్యులకు చెప్పిన ఈ మాటల్ని గుర్తుచేసుకోండి, ‘జాగ్రత్తపడండి; మెలకువగా ఉండి ప్రార్థన చేయండి; ఆ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలీదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వానివాని పని నియమించి—మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలం ఉంటుంది.) ఇంటి యజమాని ప్రొద్దుగ్రుంకి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడికూసినప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో, ఎప్పుడు వస్తాడో మీకు తెలీదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవడం చూస్తాడేమో గనుక మీరు మెలకువగా ఉండండి. నేను మీతో చెప్తున్నది అందరితోను చెప్తున్నాను; మెలకువగా ఉండండి.’—మార్కు 13:33-37.

11 యేసు 1914⁠లో రాజయ్యాడని ఆయన అనుచరులు అర్థంచేసుకున్నప్పుడు, అంతం ఏ సమయంలోనైనా రావచ్చని గ్రహించారు. అందుకే వాళ్లు ప్రకటనాపని ఎక్కువగా చేస్తూ అంతం కోసం సిద్ధపడ్డారు. అయితే తాను ‘కోడికూసినప్పుడు లేదా తెల్లవారినప్పుడు’ రావచ్చని అంటే ఆలస్యంగా రావచ్చని యేసు చెప్పాడు. అలా ఆలస్యమైనా తన అనుచరులు ‘మెలకువగానే ఉండాలని’ ఆయన అన్నాడు. మనం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నా అంతం రాలేదు కాబట్టి, అది ఇప్పట్లో రాదని లేదా మనకాలంలో రాదని అనుకోకూడదు.

12. హబక్కూకు యెహోవాను ఏమి అడిగాడు, దేవుడు ఏమని జవాబిచ్చాడు?

12 హబక్కూకు ప్రవక్త విషయమే తీసుకోండి. యెరూషలేము నాశనం గురించి ప్రకటించమని యెహోవా ఆయనకు చెప్పాడు. అయితే ఆయనకు ముందున్న ప్రవక్తలు కూడా ఆ విషయాన్నే చాలా సంవత్సరాలుగా ప్రకటిస్తున్నారు. మరోవైపు చెడుతనం, అన్యాయం అంతకంతకూ ఎక్కువౌతున్నాయి. అందుకే ఆయనిలా అడిగాడు, “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు?” అయితే అంతం ఎప్పుడొస్తుందో చెప్పకపోయినా యెహోవా ఇలా భరోసా ఇచ్చాడు, “దానికొరకు కనిపెట్టుము, జాగుచేయక వచ్చును.”—హబక్కూకు 1:1-4; 2:3 చదవండి.

13. హబక్కూకు ఏమి ఆలోచించే అవకాశం ఉంది? అది ఎందుకు ప్రమాదకరం?

13 అంతం ఇంకా రావట్లేదని హబక్కూకు నిరుత్సాహపడి, ‘నేను యెరూషలేము నాశనం గురించి ఎన్నో సంవత్సరాలుగా వింటున్నాను. కానీ అది ఇప్పట్లో జరిగేలా లేదు. నేను దాని గురించి ప్రకటించాల్సిన అవసరం లేదు. ఆ పనిని వేరేవాళ్లు చేస్తారు’ అని అనుకొనివుంటే ఏం జరిగివుండేది? యెహోవాతో తనకున్న స్నేహాన్ని ఆయన పోగొట్టుకునేవాడు. ఒకవేళ సిద్ధంగా లేకపోయుంటే, యెరూషలేము నాశనమైనప్పుడు ప్రాణాన్ని కూడా కోల్పోయేవాడు.

14. అంతం కోసం ఎదురుచూస్తూ ఉండమని ప్రోత్సహించినందుకు మనం యెహోవాకు ఎందుకు కృతజ్ఞులుగా ఉంటాం?

14 ఇప్పుడు మీరు కొత్తలోకంలో ఉన్నట్లు ఊహించుకోండి. అంత్యదినాల గురించి యెహోవా ముందే చెప్పినవన్నీ ఖచ్చితంగా జరగడం చూసి ఆయనపై మీకున్న నమ్మకం ఇంకా పెరిగింది. ఆయన చేసిన ఇతర వాగ్దానాలు కూడా తప్పకుండా నెరవేరతాయని మీరు ఇప్పుడు మరింత నమ్మకంగా ఉన్నారు. (యెహోషువ 23:14 చదవండి.) అంతాన్ని సరైన సమయంలో తీసుకొచ్చినందుకు, దానికోసం ఎదురుచూస్తూ ఉండమని ప్రోత్సహించినందుకు మీరు యెహోవాకు ఎంతో కృతజ్ఞతతో ఉంటారు.—అపొ. 1:7; 1 పేతు. 4:7.

ఎదురుచూస్తున్నారని మీ పనుల ద్వారా చూపించండి

మీరు ఉత్సాహంగా సువార్త ప్రకటిస్తున్నారా? (15వ పేరా చూడండి)

15, 16. అంతం దగ్గరౌతున్న ఈ సమయంలో, మనం ప్రకటనా పనిలో చేయగలిగినదంతా ఎందుకు చేయాలి?

15 యెహోవా సేవ చేయడం మీదే మనసు పెట్టమని ఆయన సంస్థ ముందుముందు కూడా మనకు గుర్తుచేస్తూ ఉంటుంది. అలా గుర్తుచేయడం వల్ల మనం దేవుని సేవలో బిజీగా ఉంటాం, మనం ప్రకటిస్తున్న సందేశం ఎంత అత్యవసరమైనదో అర్థం చేసుకుంటాం. యేసు ఇచ్చిన సూచన ఇప్పుడు నెరవేరుతోందని, అంతం అతి త్వరలోనే వస్తుందని మనం నమ్ముతున్నాం. కాబట్టి మన జీవితాల్లో యెహోవాకు మొదటి స్థానం ఇస్తూ, రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉందాం.—మత్త. 6:33; మార్కు 13:10.

16 మనం సువార్త ప్రకటించడం ద్వారా, త్వరలో రాబోతున్న అంతం నుండి ప్రజల్ని రక్షిస్తాం. 1945⁠లో విల్‌హెల్మ్‌ గుస్ట్‌లాఫ్‌ అనే ఓడ మునిగిపోయింది, సముద్రంలో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో అదొకటి. అందులో కొన్ని వేలమంది చనిపోయారు. ఓ సహోదరి, ఆమె భర్త ఆ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఓవైపు ఓడ మునిగిపోతుంటే ఒకావిడ, “నా సూట్‌కేసులు! నా సూట్‌కేసులు! నా నగలు! నా నగలన్నీ గదిలోనే ఉండిపోయాయి. నా వస్తువులన్నీ పోయాయి!” అని గట్టిగా అరుస్తోందని ఆ సహోదరి గుర్తుచేసుకుంది. కానీ ప్రాణాలు విలువైనవని అర్థం చేసుకున్న కొంతమంది ప్రయాణికులు, ప్రాణాలకు తెగించిమరీ తోటివాళ్లను రక్షించారు. నేడు కూడా ప్రజల ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. కాబట్టి మనం ఆ నిస్వార్థ ప్రయాణికుల్లా ప్రకటనా పని ఎంత అత్యవసరమైనదో గుర్తించాలి, ఈ దుష్టలోకాంతం నుండి ప్రజల్ని రక్షించడానికి చేయగలిగినదంతా చేయాలి.

ప్రకటనా పని ఎంత అత్యవసరమైనదో మీ నిర్ణయాల ద్వారా చూపిస్తున్నారా? (17వ పేరా చూడండి)

17. అంతం ఏ సమయంలోనైనా రావచ్చని మనం ఎందుకు నమ్మాలి?

17 బైబిలు ప్రవచనం నెరవేరుతోందని, ఈ లోకాంతం చాలా దగ్గర్లో ఉందని మనకు స్పష్టంగా అర్థమౌతోంది. ప్రకటన 17:16⁠లో ఉన్న “పది కొమ్ములుగల ఆ మృగము,” మహాబబులోనును అంటే అబద్ధమత సామ్రాజ్యాన్ని నాశనం చేసే సమయం కోసం ఎదురుచూస్తున్నాం. అయితే దానికింకా చాలా సమయం ఉందని మనం అనుకోకూడదు. అబద్ధమతం మీద దాడి చేసేలా దేవుడు ‘వాళ్లకు బుద్ధి పుట్టిస్తాడని,’ అది ఏ క్షణానైనా జరగవచ్చని మనం గుర్తుంచుకోవాలి. (ప్రక. 17:17) ఈ లోకాంతం త్వరలో రాబోతుంది కాబట్టి మనం యేసు ఇచ్చిన ఈ హెచ్చరికను పాటించాలి, “మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరివచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి.” (లూకా 21:34, 35; ప్రక. 16:15, 16) యెహోవా ‘తనకొరకు కనిపెట్టువాని విషయమై తన కార్యం సఫలం’ చేస్తాడనే నమ్మకంతో మనం అప్రమత్తంగా ఉంటూ, ఆయన సేవలో బిజీగా ఉందాం.—యెష. 64:4.

18. తర్వాతి ఆర్టికల్‌లో ఏ ప్రశ్న గురించి చర్చిస్తాం?

18 మనం అంతం కోసం ఎదురుచూస్తూ యూదా ఇచ్చిన ఈ ఉపదేశాన్ని పాటిద్దాం, “ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్ధమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు, నిత్యజీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరముకొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచునట్లు కాచుకొని యుండుడి.” (యూదా 20, 21) అయితే కొత్తలోకం త్వరగా రావాలని కోరుకుంటున్నామని, దానికోసం ఎదురుచూస్తున్నామని మనమెలా చూపించవచ్చు? దీని గురించి తర్వాతి ఆర్టికల్‌లో చూద్దాం.

a మెస్సీయకు సంబంధించిన కొన్ని ప్రవచనాల గురించి, వాటి నెరవేర్పు గురించి తెలుసుకోవడానికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంలోని 200వ పేజీ చూడండి.