కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

జీవిత కథ

‘ద్వీపాలన్నీ సంతోషించుగాక’

‘ద్వీపాలన్నీ సంతోషించుగాక’

ఆ రోజును నేనెప్పుడూ మర్చిపోను. అది 2000వ సంవత్సరం, మే 22వ తేదీ. నేనూ నాతోపాటు వేర్వేరు దేశాలకు చెందిన సహోదరులు బ్రూక్లిన్‌లోని పరిపాలక సభ సభ్యుల మీటింగ్‌ జరిగే హాలులో టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాం. ఇంకాసేపట్లో రైటింగ్‌ కమిటీ సభ్యులు అక్కడికి వస్తారు. అనువాదకులకు ఎదురౌతున్న సమస్యల గురించి కొన్ని వారాలుగా మేము చర్చించుకున్నాం, వాటిని ఎలా పరిష్కరించవచ్చో కొన్ని సలహాలను ఇప్పుడు మేము ఆ కమిటీ ముందు చెప్పాలి. ఆ మీటింగ్‌ ఎందుకంత ముఖ్యమైనది? అది చెప్పడానికి ముందు నా గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను.

క్వీన్స్‌లాండ్‌లో బాప్తిస్మం తీసుకుని, టాస్మేనియాలో పయినీరుగా, తువాలు, సమోవా, ఫిజిలలో మిషనరీగా సేవ చేశాను

ఆస్ట్రేలియాలో ఉన్న క్వీన్స్‌లాండ్‌లో 1955⁠లో నేను పుట్టాను. కొద్దికాలానికే మా అమ్మ ఎస్టెల్‌ యెహోవాసాక్షులతో బైబిలు స్టడీ చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాతి సంవత్సరమే ఆమె బాప్తిస్మం తీసుకుంది. అమ్మ బాప్తిస్మం తీసుకున్న 13 ఏళ్లకు మా నాన్న రాన్‌ సత్యం అంగీకరించాడు. నేను 1968⁠లో క్వీన్స్‌లాండ్‌లో బాప్తిస్మం తీసుకున్నాను.

చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం, భాషలంటే మరీ ఇష్టం. మా కుటుంబమంతా ఎప్పుడైనా సరదాగా కారులో వెళ్తున్నప్పుడు, నేను ప్రకృతి అందాల్ని చూడకుండా వెనక సీట్లో కూర్చొని పుస్తకాలు చదువుతుండేవాణ్ణి. అది చూసి మా అమ్మానాన్నలకు చాలా చిరాకు వచ్చి ఉంటుంది. అయితే పుస్తకాలు చదివే అలవాటు వల్ల స్కూల్లో బాగా రాణించాను. అంతేకాదు, టాస్మేనియాలోని గ్లినోర్కీ పట్టణంలో ఉన్న హైస్కూల్లో చదివేటప్పుడు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

అయితే, నేను స్కాలర్‌షిప్‌ తీసుకుని యూనివర్సిటీలో చదువుకోవాలా వద్దా అనే ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నాకు పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే చాలా ఇష్టం. అయితే అంతకన్నా ఎక్కువగా యెహోవాను ప్రేమించడం నేర్పించిన మా అమ్మకు నేను ఎంతో కృతజ్ఞుణ్ణి. (1 కొరిం. 3:18, 19) స్కూల్‌ చదువు పూర్తవగానే అమ్మానాన్నల అంగీకారంతో 1971, జనవరిలో పయినీరు సేవ మొదలుపెట్టాను. నాకప్పుడు 15 ఏళ్లు.

ఆ తర్వాత ఎనిమిది సంవత్సరాలపాటు నేను టాస్మేనియాలో పయినీరు సేవ చేశాను. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన జెన్నీ అల్కోక్‌ అనే ఓ అందమైన సహోదరిని పెళ్లి చేసుకున్నాను. తర్వాత మేమిద్దరం కలిసి స్మిత్‌టెన్‌, క్వీన్స్‌టౌన్‌లోని మారుమూల ప్రాంతాల్లో నాలుగేళ్లు ప్రత్యేక పయినీరు సేవ చేశాం.

పసిఫిక్‌ ద్వీపాల్లో మిషనరీ సేవ

మేము 1978లో పాపువా న్యూగినిలోని పోర్ట్‌ మోర్జబీలో జరిగిన ఓ అంతర్జాతీయ సమావేశానికి వెళ్లాం. అక్కడ ఓ మిషనరీ హీరీ మోటు భాషలో ఇచ్చిన ప్రసంగం నాకిప్పటికీ గుర్తుంది. ఆయన ప్రసంగంలో ఒక్క మాటకూడా నాకు అర్థం కాలేదు. అయినా అది విన్నాక, ఆయనలాగే మిషనరీ అవ్వాలనీ వేరే భాష నేర్చుకుని ఆ భాషలో ప్రసంగాలు ఇవ్వాలనీ నాలో కోరిక కలిగింది. అలా చివరికి, భాషపై నాకున్న ఇష్టాన్ని యెహోవా సేవలో ఉపయోగించే మార్గం నాకు కనిపించింది.

ఆస్ట్రేలియాకు తిరిగి రాగానే, మమ్మల్ని తువాలులోని ఫూనాఫూటీ ద్వీపంలో మిషనరీలుగా నియమించారని తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయాం. మేము 1979 జనవరిలో అక్కడ మా సేవ మొదలుపెట్టాం. తువాలు ద్వీపాలన్నిటిలో మేము కాక బాప్తిస్మం తీసుకున్న ప్రచారకులు మరో ముగ్గురు మాత్రమే ఉన్నారు.

తువాలులో జెన్నీతోపాటు

తువాలువన్‌ భాష నేర్చుకోవడం అంత తేలిక కాదు. ఆ భాషలో ఉన్న ఒకేఒక్క పుస్తకం, “కొత్త నిబంధన” బైబిలు. ఆ భాషలో డిక్షనరీలుగానీ, భాషను నేర్పించే కోర్సులుగానీ లేవు కాబట్టి, రోజుకు 10 నుండి 20 కొత్త పదాలు నేర్చుకోవాలని మేము అనుకున్నాం. అయితే మేము నేర్చుకుంటున్న పదాలకు వేరే అర్థాలు ఉన్నాయని మాకు కొద్దికాలంలోనే అర్థమైంది. ఉదాహరణకు, శకునాలు చూడడం తప్పు అని చెప్పడానికి బదులు త్రాసులు, చేతి కర్రలు వాడడం తప్పు అని చెప్పేవాళ్లం. అయితే, మేము ఎన్నో బైబిలు స్టడీలు మొదలుపెట్టాం కాబట్టి ఆ భాష నేర్చుకునే మా ప్రయత్నాల్ని ఆపలేదు. మొదట్లో మేము స్టడీ ఇచ్చిన ఒకాయన చాలా ఏళ్ల తర్వాత మాతో ఇలా అన్నాడు, “మీరిప్పుడు మా భాషలో చక్కగా మాట్లాడుతున్నందుకు మాకెంతో సంతోషంగా ఉంది. కానీ మొదట్లో మీరు చెప్పేది ఒక్క ముక్క అర్థమయ్యేదికాదు.”

అయితే, ఆ భాషను త్వరగా నేర్చుకోవడానికి మాకు ఓ మంచి అవకాశం దొరికింది. అదేంటంటే, మాకు అద్దె ఇల్లు దొరకకపోవడంతో గ్రామంలోని ఓ సాక్షుల కుటుంబంతోపాటు ఉన్నాం. అలా మేము ఇంట్లోనూ బయటా తువాలువన్‌ భాషే మాట్లాడాల్సి వచ్చింది. మేము కొన్నేళ్లపాటు ఇంగ్లీషు మాట్లాడకుండా ఉండడంతో తువాలువన్‌ భాష మా ముఖ్య భాష అయ్యింది.

కొద్దికాలంలోనే, చాలామంది సత్యం నేర్చుకోవడానికి ఆసక్తి చూపించారు. అయితే, అప్పట్లో తువాలువన్‌ భాషలో మన ప్రచురణ ఒక్కటి కూడా లేదు. మరి వాళ్లతో బైబిలు స్టడీ ఎలా చేయాలి? వాళ్లు వ్యక్తిగత అధ్యయనం ఎలా చేసుకుంటారు? మీటింగ్స్‌కి వచ్చినప్పుడు పాటలు ఎలా పాడతారు? ఏ పుస్తకాలు, పత్రికలు ఉపయోగిస్తారు? అసలు మీటింగ్స్‌కి ఎలా సిద్ధపడతారు? వాళ్లు బాప్తిస్మం తీసుకునేంతగా ఎలా ప్రగతి సాధించగలరు? దీనులైన ఈ ప్రజలకు కూడా తమ సొంత భాషలో ఆధ్యాత్మిక ఆహారం అవసరం! (1 కొరిం. 14:9) అయితే, ‘15,000కన్నా తక్కువమంది ఉన్న ఈ ప్రజలకు తమ భాషలో ఎప్పటికైనా ప్రచురణలు వస్తాయా’ అని మేము అనుకునేవాళ్లం. ఆ ప్రశ్నలన్నిటికీ యెహోవా జవాబిచ్చాడు, అంతేకాదు రెండు విషయాలు మాకు స్పష్టం చేశాడు, (1) ‘దూరంగా ఉన్న ద్వీపాల్లోని’ ప్రజలు తన గురించి తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు, (2) ఈ లోకం దృష్టిలో ‘దీనులు, సాత్వికులు’ అయినవాళ్లు తన నామాన్ని ఆశ్రయించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు.—యిర్మీ. 31:10; జెఫ. 3:12, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌.

ఆధ్యాత్మిక ఆహారాన్ని అనువదించడం

బ్రాంచి కార్యాలయం 1980⁠లో మాకు తువాలువన్‌ భాషలోకి ప్రచురణలను అనువదించే పని అప్పగించింది. ఆ పనికి మేము అస్సలు సరిపోమని అనిపించింది. (1 కొరిం. 1:27-29) మొదట్లో మేము ప్రభుత్వం నుండి ఓ పాత ప్రింటింగ్‌ మెషిన్‌ కొని, కూటాల్లో చర్చించే సమాచారాన్ని ప్రింట్‌ చేసేవాళ్లం. అంతేకాదు, నిత్యజీవమునకు నడుపు సత్యము పుస్తకాన్ని తువాలువన్‌ భాషలోకి అనువదించి, ఆ మెషిన్‌ సహాయంతో ప్రింట్‌ చేశాం. ఆ ఇంక్‌ ఘాటు వాసన, తీవ్రమైన వేడిలో ఎంతో కష్టపడి చేత్తోనే సాహిత్యాన్ని ప్రింట్‌ చేయడం నాకింకా గుర్తుంది. అప్పట్లో అక్కడ కరెంటు కూడా లేదు!

తువాలువన్‌ భాషలో అనువాదం చేయడం కష్టం, ఎందుకంటే ఆ భాషకు సంబంధించిన ఎలాంటి పుస్తకాలు అప్పట్లో లేవు. అయితే కొన్నిసార్లు ఊహించని విధంగా సహాయం వచ్చేది. ఓ రోజు ఉదయం నేను ఇంటింటి పరిచర్యలో, సాక్షుల్ని ఇష్టపడని ఒకాయన ఇంటికి పొరపాటున వెళ్లాను. ఆయన వయసుపైబడిన వ్యక్తి, ఒకప్పుడు టీచరుగా పనిచేశాడు. నన్ను చూడగానే, ‘మా ఇంటికి రావద్దని మీకు చెప్పాగా’ అన్నాడు. తర్వాత ఆయనిలా అన్నాడు, “కానీ మీకో విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు అనువాదంలో ఉపయోగిస్తున్న పదాలను ఇక్కడ ప్రజలు ఎక్కువగా వాడరు.” నేను దానిగురించి వేరేవాళ్లను అడిగాను, వాళ్లు కూడా అలాగే చెప్పారు. దాంతో మా అనువాదంలో కొన్ని మార్పులు చేసుకున్నాం. సాక్షులంటే ఇష్టపడని ఒక వ్యక్తి ద్వారా యెహోవా మాకు సహాయం చేయడం చూసి ఆశ్చర్యపోయాను. ఆయనలా చెప్పాడంటే మన ప్రచురణల్ని చదువుతున్నట్లేగా.

తువాలువన్‌ భాషలో రాజ్య వార్త నం. 30

తువాలువన్‌ భాషలో ప్రజలకు మేము అందించిన మొదటి సాహిత్యం, జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వాన పత్రం. దాని తర్వాత రాజ్య వార్త నం. 30 వచ్చింది, అది ఇంగ్లీషుతోపాటు తువాలువన్‌ భాషలో కూడా విడుదలైంది. ప్రజలకు తమ సొంత భాషలో సాహిత్యం ఇచ్చినప్పుడు కలిగే ఆనందమే వేరు. ఆ తర్వాత కొన్ని బ్రోషుర్లు, కొన్ని పుస్తకాలు కూడా ఆ భాషలో వచ్చాయి. 1983⁠లో ఆస్ట్రేలియా బ్రాంచి కార్యాలయం తువాలువన్‌ భాషలో 24 పేజీల కావలికోట పత్రికను ముద్రించడం మొదలుపెట్టింది. అది మూడు నెలలకు ఒకసారి వచ్చేది. మరి మన ప్రచురణలు అక్కడి ప్రజలకు నచ్చాయా? తువాలు ప్రజలకు చదవడం అంటే ఇష్టం కాబట్టి వాళ్లు మన పత్రికలను, పుస్తకాలను శ్రద్ధగా చదివేవాళ్లు. ఏదైనా కొత్త ప్రచురణ వచ్చిన ప్రతీసారి, ప్రభుత్వ రేడియోలో ఆ విషయం ప్రకటించేవాళ్లు. ఒక్కోసారైతే పేపర్లో ముందు పేజీలో వాటిగురించి రాసేవాళ్లు! a

మేము అనువాద పని ఎలా చేసేవాళ్లమంటే, మొదట సమాచారాన్ని పేపరుమీద రాసేవాళ్లం. ఆ తర్వాత దాన్ని టైప్‌ చేసి, తప్పులు లేకుండా వచ్చేవరకూ మళ్లీమళ్లీ టైప్‌ చేసి ఆ పేపర్లను ఆస్ట్రేలియా బ్రాంచికి పంపించేవాళ్లం. అక్కడ ఇద్దరు సహోదరీలు, మేము టైప్‌ చేసి పంపించిన సమాచారాన్ని కంప్యూటర్‌లో విడివిడిగా ఎక్కించేవాళ్లు. వాళ్లకు తువాలువన్‌ భాష రాదు. అలా సమాచారాన్ని రెండుసార్లు కంప్యూటర్‌లోకి ఎక్కించి, ఆ రెండిటినీ పోల్చిచూడడంవల్ల తప్పులు చాలా తక్కువగా వచ్చేవి. ఆ తర్వాత దాన్ని కంపోజ్‌ చేసేవాళ్లు అంటే సమాచారానికి చిత్రాలను జోడించేవాళ్లు. అలా కంపోజ్‌ చేసిన పేజీలను మాకు పోస్టులో పంపించేవాళ్లు, మేము వాటిని జాగ్రత్తగా పరిశీలించి ప్రింటింగ్‌ కోసం మళ్లీ బ్రాంచికి పంపించేవాళ్లం.

అయితే పరిస్థితులు ఇప్పుడు ఎంతగా మారిపోయాయో! ఇప్పుడు అనువాదకులు నేరుగా కంప్యూటర్‌లోనే సమాచారాన్ని అనువదించి, దాన్ని సరిచేస్తున్నారు. చాలాప్రాంతాల్లో, అనువాదం జరిగే చోటే కంపోజ్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రింటింగ్‌ కోసం వాటిని ఇంటర్నెట్‌ ద్వారా బ్రాంచి కార్యాలయాలకు పంపిస్తారు. కాబట్టి, టైప్‌ చేసిన పేపర్లను పోస్టులో పంపించడం కోసం పోస్టాఫీస్‌కు పరుగులు తీసే రోజులు పోయాయి.

ఇతర నియామకాలు

కాలం గడుస్తుండగా నేనూ జెన్నీ, పసిఫిక్‌లోని వివిధ ద్వీపాల్లో సేవ చేశాం. 1985⁠లో మమ్మల్ని తువాలు నుండి సమోవా బ్రాంచికి పంపించారు. అక్కడ మేము తువాలువన్‌ భాషతోపాటు సమోవా, టోంగా, టోక్లావన్‌ భాషల్లో జరుగుతున్న అనువాద పనిలో సహాయం చేశాం. b ఆ తర్వాత 1996⁠లో మేము ఫిజి బ్రాంచికి వెళ్లాం. అక్కడ మేము తువాలువన్‌ భాషతోపాటు ఫిజియన్‌, కిరిబాటి, నావోరూవాన్‌, రొటుమన్‌ భాషల అనువాదంలో సహాయం చేశాం.

తువాలువన్‌ ప్రచురణలతో సత్యం నేర్పిస్తూ

అనువాద పని కొన్నిసార్లు విసుగ్గా, అలసటగా అనిపించినా సహోదరసహోదరీలు దాన్ని ఉత్సాహంగా చేయడం చూస్తుంటే నాకెప్పుడూ ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయినప్పటికీ ఈ నమ్మకమైన సహోదరసహోదరీలు యెహోవాను అనుకరించడానికి ప్రయత్నిస్తారు. ఆయన “ప్రతీ దేశానికి, ప్రతీ జాతికి, ప్రతీ భాషకు ప్రతీ గుంపుకు చెందిన ప్రజలకు” సువార్త చేరాలని కోరుకుంటున్నాడు. (ప్రక. 14:6, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) ఉదాహరణకు, టోంగా భాషలో కావలికోట అనువదించడానికి ఏర్పాట్లు జరుగుతున్నప్పుడు, టోంగాలోని సంఘపెద్దలందర్నీ కలిసి ‘మీలో ఎవరు అనువాదకులుగా శిక్షణ పొందడానికి ఇష్టపడుతున్నారు?’ అని అడిగాను. వాళ్లలో మెకానిక్‌గా బాగా సంపాదిస్తున్న ఒక పెద్ద, తర్వాతిరోజే దాన్ని వదిలేసి అనువాదకునిగా సేవ చేయడానికి ముందుకొచ్చాడు. ఆయన బలమైన విశ్వాసం నన్ను కదిలించింది, ఎందుకంటే ఆయనకు కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉద్యోగం మానేస్తే ఖర్చులకు డబ్బు ఎక్కడినుండి వస్తుందో అని ఆయన ఆలోచించలేదు. అయితే వాళ్ల బాగోగులను యెహోవాయే చూసుకున్నాడు. ఆ సహోదరుడు చాలా ఏళ్లు అనువాద పనిలో సేవ చేశాడు.

అలాంటి అనువాదకులకు పరిపాలక సభ సభ్యులకు ఉన్నటువంటి అభిప్రాయమే ఉంది. తక్కువమంది మాట్లాడే భాషల్లో కూడా ఆధ్యాత్మిక ఆహారాన్ని తయారుచేయడానికి పరిపాలక సభ ఎంతో శ్రద్ధ చూపిస్తుంది. ఉదాహరణకు ఓ సందర్భంలో, అంత కష్టపడి తువాలువన్‌ భాషలో ప్రచురణలు అనువదించడం అవసరమా అని కొంతమంది ప్రశ్నించారు. దానికి పరిపాలక సభ ఇచ్చిన ఈ సమాధానం నాకెంతో ప్రోత్సాహం ఇచ్చింది, “మీరు తువాలువన్‌ భాష అనువాదం ఎందుకు ఆపాలనుకుంటున్నారో మాకు అర్థంకావట్లేదు. వేరే భాషలు మాట్లాడేవాళ్లతో పోలిస్తే తువాలువన్‌ మాట్లాడేవాళ్లు తక్కువే కావచ్చు, కానీ వాళ్లకు కూడా తమ సొంత భాషలో సువార్త చేరాలి.”

బాప్తిస్మం ఇస్తూ

నన్నూ జెన్నీని 2003లో న్యూయార్క్‌లోని ప్యాటర్‌సన్‌లో ఉన్న అనువాద సేవల విభాగంలో సేవ చేయడానికి ఆహ్వానించారు. ఆ విభాగం, మన ప్రచురణలు మరిన్ని భాషల్లో అనువాదం అయ్యేలా, అలాగే ఆ భాషల్లో మరిన్ని ప్రచురణలు వచ్చేలా సహాయం చేస్తుంది. అందులో భాగమైనప్పుడు మా కల నిజమైనట్లు అనిపించింది. ఆ తర్వాత దాదాపు రెండేళ్లపాటు మేము ఎన్నో దేశాలకు వెళ్లి అక్కడి అనువాదకులకు శిక్షణనిచ్చాం.

కొన్ని చారిత్రక నిర్ణయాలు

నేను మొదట్లో చెప్పిన సందర్భం దగ్గరకు మళ్లీ వద్దాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనువాదకులకు శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని 2000వ సంవత్సరంలో పరిపాలక సభ గుర్తించింది. అప్పటివరకు అనువాదకులు అంతగా శిక్షణ పొందలేదు. ఆ రోజు మేము దానిగురించి రైటింగ్‌ కమిటీతో చర్చించిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనువాదకులకు శిక్షణ ఇవ్వాలని పరిపాలక సభ నిర్ణయించింది. అందులో భాగంగా ఇంగ్లీషు బాగా అర్థం చేసుకోవడం, అనువాద మెళకువలు నేర్చుకోవడం, ఒకరికొకరు సహకరించుకుంటూ ఒక టీమ్‌గా పనిచేయడం వంటి విషయాల్లో అనువాదకులకు శిక్షణ ఇచ్చారు.

దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? మన ప్రచురణలు ప్రజలకు ఇంకా బాగా అర్థమౌతున్నాయి. అంతేకాక, అవి గతంలోకన్నా ఎక్కువ భాషల్లో అనువాదం అవుతున్నాయి. 1979లో మేము మిషనరీ సేవ మొదలుపెట్టినప్పుడు, కావలికోట పత్రిక కేవలం 82 భాషల్లోనే వచ్చేది. పైగా ఇంగ్లీషులో వచ్చిన చాలా నెలలకుగానీ వేరే భాషల్లో వచ్చేది కాదు. అయితే ఇప్పుడు కావలికోట 240 కన్నా ఎక్కువ భాషల్లో వస్తుంది, వాటిలో చాలావరకు ఇంగ్లీషుతోపాటే వస్తున్నాయి. ఆధ్యాత్మిక ఆహారం నేడు ఏదో ఒక రూపంలో 700 కన్నా ఎక్కువ భాషల్లో అందుబాటులో ఉంది. ఇలాంటివన్నీ కేవలం కలలోనే జరుగుతాయని ఒకప్పుడు మేము అనుకునేవాళ్లం.

పరిపాలక సభ 2004లో, నూతనలోక అనువాదం బైబిల్ని సాధ్యమైనంత త్వరగా మరిన్ని భాషల్లోకి అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ఆ నిర్ణయం వల్ల ఇప్పుడు చాలామంది ప్రజలు తమ సొంత భాషలో నూతనలోక అనువాదం బైబిల్ని చదవగలుగుతున్నారు. 2014కల్లా, నూతనలోక అనువాదం మొత్తంగా లేదా కొంత భాగంగా 128 భాషల్లో అందుబాటులోకి వచ్చింది. వాటిలో దక్షిణ పసిఫిక్‌ ప్రాంతంలో మాట్లాడే అనేక భాషలు కూడా ఉన్నాయి.

తువాలువన్‌ భాషలో క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం బైబిల్ని విడుదల చేస్తూ

నేను 2011లో తువాలులో జరిగిన సమావేశానికి హాజరవడం నా జీవితంలో ఓ మర్చిపోలేని సందర్భం. సమావేశానికి కొన్ని నెలల ముందు నుంచి వర్షాలులేక ఆ దేశం కరువుతో అల్లాడుతోంది. పరిస్థితి చూస్తే సమావేశం జరగదేమో అనిపించింది. అయితే మేము అక్కడికి వెళ్లిన సాయంత్రమే కుండపోతగా వర్షం కురిసింది, సమావేశం కూడా ఏ ఆటంకం లేకుండా జరిగింది. ఆ సమావేశంలో, తువాలువన్‌ భాషలో క్రైస్తవ గ్రీకు లేఖనాల నూతనలోక అనువాదం బైబిల్ని విడుదల చేసే గొప్ప అవకాశం నాకు దొరికింది. ఇప్పటిదాకా నూతనలోక అనువాదం విడుదలైన భాషల్లో, అతి తక్కువమంది మాట్లాడే భాష ఇదే. సమావేశం అయిపోయిన తర్వాత కూడా మళ్లీ పెద్ద వర్షం కురిసింది. అలా, హాజరైన వాళ్లందరూ ఆధ్యాత్మిక నీళ్లతోపాటు మామూలు నీళ్లు కూడా సమృద్ధిగా పొందారు.

2014లో ఆస్ట్రేలియాలోని టౌన్స్‌విల్‌లో జరిగిన ఓ సమావేశంలో మా అమ్మానాన్నలు రాన్‌, ఎస్టెల్‌లను ఇంటర్వ్యూ చేస్తూ

అయితే 35 ఏళ్లుగా నా పక్కనే ఉన్న జెన్నీ, ఈ సంతోషకరమైన సంఘటన చూడకుండానే చనిపోయింది. పదేళ్లు రొమ్ము క్యాన్సర్‌తో పోరాడి చివరికి 2009⁠లో కన్నుమూసింది. ఆమె మళ్లీ బ్రతికినప్పుడు, తువాలువన్‌ భాషలో బైబిలు విడుదలైందని తెలుసుకుని ఎంత సంతోషిస్తుందో!

అయితే జెన్నీ చనిపోయాక, యెహోవా నాకు మరో అందమైన భార్యను ఇచ్చాడు. ఆమె పేరు లొరేనీ సికీవో. తనూ, జెన్నీ కలిసి ఫిజి బ్రాంచి కార్యాలయంలో పనిచేశారు, లొరేనీ ఫిజియన్‌ భాషా అనువాదకురాలిగా పనిచేసింది. అలా నాలాగే యెహోవానూ భాషనూ ప్రేమించే నమ్మకమైన భార్య నాకు మళ్లీ దొరికింది.

ఫిజిలో, లొరేనీతో కలిసి సాక్ష్యమిస్తూ

మన ప్రేమగల తండ్రి, తక్కువమంది మాట్లాడే భాషలతో సహా అన్ని భాషల ప్రజల అవసరాలను ఎలా తీరుస్తున్నాడో ఎన్నో సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. (కీర్త. 49:1-3) ప్రజలు తమ మాతృభాషలో ప్రచురణల్ని మొదటిసారి చూసినప్పుడు లేదా తమ భాషలో పాటల్ని పాడుతున్నప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే ఆనందంలో యెహోవా ప్రేమను నేను చూశాను. (అపొ. 2:8, 11) తువాలువన్‌ భాష మాట్లాడే సౌలో టీయాసీ అనే ఓ వృద్ధ సహోదరుడు చెప్పిన మాటలు నాకింకా గుర్తున్నాయి. తన మాతృభాషలో మొదటిసారి పాట పాడిన తర్వాత ఆయన నాతో ఇలా అన్నాడు, ‘ఈ పాటలు ఇంగ్లీషులోకన్నా తువాలువన్‌ భాషలోనే చాలా బాగున్నాయి, ఈ మాటను మీరు పరిపాలక సభకు చెప్పండి.’

నేను 2005 సెప్టెంబరు నుండి యెహోవాసాక్షుల పరిపాలక సభ సభ్యునిగా పనిచేస్తున్నాను. అది నేను ఊహించని ఓ గొప్ప అవకాశం. నేను ఇప్పుడు అనువాదకునిగా సేవ చేయకపోయినా, ప్రపంచ నలుమూలలా జరుగుతున్న అనువాద పనికి మద్దతిచ్చేలా నన్ను అనుమతిస్తున్నందుకు యెహోవాకు నేనెప్పుడూ థాంక్స్‌ చెప్తుంటాను. పసిఫిక్‌ సముద్రంలో అక్కడక్కడ ఉన్న ద్వీపాల్లోని ప్రజలతోసహా తన ప్రజలందరి ఆధ్యాత్మిక అవసరాలను యెహోవా తీర్చడం చూస్తుంటే ఎంత సంతోషంగా అనిపిస్తుందో! అవును, కీర్తనకర్త అన్నట్లుగా “యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక ద్వీపములన్నియు సంతోషించునుగాక.”—కీర్త. 97:1.

a మన ప్రచురణలకు వచ్చిన స్పందన గురించి తెలుసుకోవడానికి, కావలికోట డిసెంబరు 15, 2000 సంచిక 32వ పేజీ; ఆగస్టు 1, 1988 (ఇంగ్లీషు) సంచిక 22వ పేజీ; తేజరిల్లు! డిసెంబరు 22, 2000 (ఇంగ్లీషు) సంచిక 9వ పేజీ చూడండి.

b సమోవాలో జరుగుతున్న అనువాద పని గురించి మరిన్ని వివరాల కోసం 2009 వార్షిక పుస్తకం (ఇంగ్లీషు)లోని 120-121, 123-124 పేజీలు చూడండి.