కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

కొత్తలోకంలో జీవితం కోసం ఇప్పుడే సిద్ధపడండి

కొత్తలోకంలో జీవితం కోసం ఇప్పుడే సిద్ధపడండి

‘వారు వాస్తవమైన జీవాన్ని సంపాదించుకొను నిమిత్తం మేలు చేసేవారిగా ఉండాలని వారికి ఆజ్ఞాపించుము.’1 తిమో. 6:18, 19.

పాటలు: 43, 40

1, 2. (ఎ) పరదైసులో మీరు దేని కోసం ఎదురుచూస్తున్నారు? (ప్రారంభ చిత్రం చూడండి.) (బి) కొత్తలోకంలో మీకు అన్నిటికన్నా ఏది ఎక్కువ సంతోషాన్నిస్తుంది?

 ‘నిత్యజీవం’ కోసం మనందరం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నాం. అపొస్తలుడైన పౌలు దాన్ని “వాస్తవమైన జీవము” అని వర్ణించాడు. (1 తిమోతి 6:12, 18-19 చదవండి.) మనలో చాలామంది పరదైసు భూమిపై నిత్యం జీవిస్తారు. అప్పుడు ప్రతీ ఉదయం మంచి ఆరోగ్యంతో, సంతోషంతో, సంతృప్తితో లేవడం ఎంత బాగుంటుందో మనం కనీసం ఊహించలేం కూడా. (యెష. 35:5, 6) మన కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, పునరుత్థానమైన వాళ్లతో కలిసి సమయం గడుపుతున్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో! (యోహా. 5:28, 29; అపొ. 24:14, 15) అంతేకాదు, అప్పుడు కొత్తకొత్త పనులు నేర్చుకోవడానికి, మీ నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోవడానికి మీకు చాలా సమయం ఉంటుంది. ఉదాహరణకు, మీరు సైన్స్‌ గురించి ఇంకా నేర్చుకోవచ్చు, అలాగే సంగీత వాయిద్యాలను ఎలా వాయించాలో, ఇంటిని మీకు నచ్చినట్లుగా ఎలా కట్టుకోవాలో కూడా నేర్చుకోవచ్చు.

2 వీటన్నిటి గురించి మనం ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నప్పటికీ, యెహోవా ఆరాధనే మనకప్పుడు అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్నిస్తుంది. ప్రజలందరూ యెహోవా పేరును పరిశుద్ధంగా ఎంచుతూ ఆయన్ను పరిపాలకునిగా అంగీకరించినప్పుడు జీవితం ఎంత బాగుంటుందో ఆలోచించండి. (మత్త. 6:9, 10) యెహోవా కోరుకున్నట్లు అప్పుడు ఈ భూమంతా ఏ లోపంలేని మనుషులతో నిండివుంటుంది. మనం పరిపూర్ణతకు చేరుకునే కొద్దీ యెహోవాకు మరింత తేలిగ్గా దగ్గరవ్వగలుగుతాం.—కీర్త. 73:28; యాకో. 4:8.

3. మనం ఇప్పుడే దేనికోసం సిద్ధపడాలి?

3 ‘దేవునికి సమస్తం సాధ్యమే’ కాబట్టి ఆయన ఈ అద్భుతమైన విషయాలన్నీ నిజమయ్యేలా చేయగలడు. (మత్త. 19:25, 26) అయితే మనం ఆ కొత్తలోకంలో జీవించాలని కోరుకుంటే, నిత్యజీవ నిరీక్షణను ఇప్పుడే గట్టిగా పట్టుకోవాలి. అంతం చాలా దగ్గర్లో ఉందని మనకు తెలుసు కాబట్టి అది ఏ సమయంలో వచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. కొత్తలోకంలో జీవితం కోసం సిద్ధపడడానికి మనం చేయగలిగినదంతా ఇప్పుడే చేయాలి. అదెలాగో చూద్దాం.

ఎలా సిద్ధపడాలి?

4. కొత్తలోకంలో జీవితం కోసం మనం ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు? ఓ ఉదాహరణ చెప్పండి.

4 కొత్తలోకంలో జీవితం కోసం మనం ఇప్పుడే ఎలా సిద్ధపడవచ్చు? ఉదాహరణకు మనం వేరే దేశానికి వెళ్లి స్థిరపడాలని అనుకుంటుంటే, అక్కడి జీవితానికి అలవాటుపడడానికి మనం ముందుగానే కొన్ని పనులు చేస్తాం. ఆ దేశ భాషను, అక్కడి పద్ధతుల్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాం. అలాగే వాళ్ల వంటకాల్ని కూడా రుచి చూస్తాం. అదేవిధంగా కొత్తలోకంలో జీవించడం కోసం సిద్ధపడాలంటే, మనం ఇప్పటికే కొత్తలోకంలో ఉన్నట్లుగా జీవించాలి. దానికోసం మనం ఏమేమి చేయవచ్చో ఇప్పుడు పరిశీలిద్దాం.

5, 6. యెహోవా సంస్థ ఇస్తున్న నిర్దేశాలకు లోబడడం ద్వారా కొత్తలోకంలో జీవితానికి మనమెలా సిద్ధపడవచ్చు?

5 లోకంలోని ప్రజలు తమకు నచ్చినట్లు ప్రవర్తించవచ్చని అనుకుంటారు. వాళ్లు అలా అనుకోవాలనే సాతాను కోరుకుంటున్నాడు. స్వేచ్ఛగా జీవించడమే ముఖ్యమనీ, దేవుని మాట వినాల్సిన అవసరం లేదనీ చాలామంది అనుకుంటారు. దానివల్ల కష్టాలు, కన్నీళ్లే మిగిలాయి. (యిర్మీ. 10:23) కానీ, కొత్తలోకంలో ప్రతీ ఒక్కరూ ప్రేమగల పరిపాలకుడైన యెహోవా మాట విన్నప్పుడు జీవితం ఎంత బాగుంటుందో కదా!

6 కొత్తలోకంలో యెహోవా సంస్థ నిర్దేశం కింద మనం ఈ భూమిని పరదైసుగా మారుస్తూ, పునరుత్థానమైన వాళ్లకు బోధిస్తూ, సంతోషంగా యెహోవా చిత్తం చేస్తాం. అయితే ఈ పనుల్ని పర్యవేక్షించేవాళ్లు మనకు ఏదైనా ఇష్టంలేని పనిని ఇస్తే అప్పుడేంటి? మనం వాళ్ల మాట వింటామా? ఆ పనిని సంతోషంగా చేస్తూ దాన్ని పూర్తి చేయడానికి శాయశక్తులా కృషి చేస్తామా? కొత్తలోకంలో జీవితం కోసం సిద్ధపడాలంటే, యెహోవా సంస్థ ఇస్తున్న నిర్దేశాలకు మనం ఇప్పుడే లోబడాలి.

7, 8. (ఎ) మనపై నాయకులుగా ఉన్న సహోదరులకు ఎందుకు సహకరించాలి? (బి) కొంతమంది క్రైస్తవుల నియామకాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? (సి) కొత్తలోకంలో జీవితం ఎలా ఉంటుందని మనం నమ్మవచ్చు?

7 కొత్తలోకంలో జీవితం కోసం సిద్ధపడాలంటే, యెహోవా సంస్థకు లోబడడంతోపాటు సంతృప్తిగా ఉండడం, ఒకరికొకరం సహకరించుకోవడం కూడా నేర్చుకోవాలి. ఉదాహరణకు, సంస్థ ఇప్పుడు మనకేదైనా కొత్త నియామకం ఇచ్చినప్పుడు మనం సహకరించాలి. ఆ నియామకంలో సంతోషాన్ని, సంతృప్తిని పొందడానికి చేయగలిగినదంతా చేయాలి. అలా, మనపై “నాయకులుగా ఉన్న” సహోదరులకు సహకరించడం ఇప్పుడే నేర్చుకుంటే కొత్తలోకంలో కూడా సహకరించగలుగుతాం. (హెబ్రీయులు 13:17 చదవండి.) వాగ్దాన దేశంలో ఇశ్రాయేలీయులు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాలో యెహోవా నిర్ణయించాడు. (సంఖ్యా. 26:52-56; యెహో. 14:1, 2) కొత్తలోకంలో యెహోవా మనల్ని ఏ ప్రాంతంలో ఉండమని చెప్తాడో మనకు తెలీదు. అయితే సహకరించే లక్షణాన్ని ఇప్పుడే అలవాటు చేసుకుంటే, పరదైసులో మనం ఏ ప్రాంతంలో ఉన్నా సంతోషంగా యెహోవా చిత్తం చేస్తాం.

8 దేవుని రాజ్యపాలన కింద జీవించడం ఎంతో గొప్ప అవకాశం. అందుకే మనం ఇప్పుడు యెహోవా సంస్థకు సహకరిస్తూ ఏ బాధ్యత అప్పగించినా సంతోషంగా చేస్తాం. అయితే కొన్నిసార్లు మన నియామకాలు మారవచ్చు. ఉదాహరణకు, అమెరికాలోని బెతెల్‌ కుటుంబ సభ్యుల్లో కొంతమందిని పయినీర్లుగా పంపించారు. అలాగే, వయసు పైబడడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల కొంతమంది ప్రయాణ పర్యవేక్షకులను ప్రత్యేక పయినీర్లుగా నియమించారు. వాళ్లు ఆ కొత్త నియామకాల్లో సంతోషంగా సేవ చేస్తూ యెహోవా ఆశీర్వాదాలు పొందుతున్నారు. మనం సహాయం కోసం యెహోవాకు ప్రార్థించి, ఆయన సేవలో చేయగలిగినదంతా చేస్తూ మనకిచ్చిన ఏ పనిలోనైనా సంతృప్తి పొందడం నేర్చుకోవాలి. అలా చేస్తే మనం సంతోషంగా ఉంటాం, యెహోవా ఆశీర్వాదాలు పొందుతాం. (సామెతలు 10:22 చదవండి.) కొత్తలోకంలో ఒకవేళ మీరు కోరుకున్న ప్రాంతంలో కాకుండా వేరే ప్రాంతంలో ఉండమని యెహోవా సంస్థ చెప్తే అప్పుడేంటి? కొత్తలోకంలో మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా ఎంతో కృతజ్ఞతతో, సంతృప్తితో, ఆనందంగా ఉంటాం.—నెహె. 8:10.

9, 10. (ఎ) కొత్తలోకంలో ఏయే పరిస్థితుల్లో మనం సహనం చూపించాల్సి రావచ్చు? (బి) మనం ఇప్పుడు సహనం ఎలా చూపించవచ్చు?

9 కొత్తలోకంలో మనకు కొన్నిసార్లు సహనం అవసరమవ్వచ్చు. ఉదాహరణకు వేరేవాళ్ల బంధువులూ స్నేహితులూ పునరుత్థానం అవ్వడం, వాళ్లు చాలా సంతోషంగా ఉండడం మీరు చూస్తుండవచ్చు. కానీ మీ ప్రియమైన వాళ్లు ఇంకా పునరుత్థానం అయ్యుండకపోవచ్చు. అప్పుడు మీరేం చేస్తారు? సహనంగా ఉంటూ వాళ్ల సంతోషంలో పాలుపంచుకుంటారా? (రోమా. 12:15) మనం యెహోవా వాగ్దానాల నెరవేర్పు కోసం ఇప్పుడు సహనంగా ఎదురుచూడడం నేర్చుకుంటే కొత్తలోకంలో కూడా సహనంగా ఉండగలుగుతాం.—ప్రసం. 7:8.

10 లేఖనాల అవగాహనలో మార్పులు వచ్చినప్పుడు సహనంగా ఉండడం ద్వారా కూడా మనం కొత్తలోకంలో జీవితం కోసం సిద్ధపడవచ్చు. మనం ఏదైనా కొత్త సమాచారాన్ని చదువుతున్నప్పుడు అది పూర్తిగా అర్థంకాకపోయినా సహనంగా ఉంటామా? ఇప్పుడు సహనంగా ఉంటేనే, కొత్తలోకంలో యెహోవా మనకు కొత్త విషయాల్ని చెప్పినప్పుడు కూడా సహనంగా ఉండగలుగుతాం.—సామె. 4:18; యోహా. 16:12.

11. ఇతరుల్ని క్షమించడం ఇప్పుడే ఎందుకు నేర్చుకోవాలి? ఆ అలవాటు మనకు కొత్తలోకంలో ఎలా సహాయపడుతుంది?

11 క్షమించడం నేర్చుకోవడం ద్వారా కూడా మనం కొత్తలోకంలో జీవితం కోసం ఇప్పుడే సిద్ధపడవచ్చు. వెయ్యేళ్ల పరిపాలన కాలంలో ప్రతీఒక్కరూ అంటే నీతిమంతులూ, అనీతిమంతులూ పరిపూర్ణతకు చేరుకోవడానికి కొంత సమయం పట్టవచ్చు. (అపొ. 24:14, 15) అప్పుడు మనం ఒకరిపట్ల ఒకరం ప్రేమ చూపిస్తూ క్షమించుకుంటామా? ఇతరుల్ని మనం క్షమిస్తూ వాళ్లతో స్నేహంగా ఉండడం ఇప్పుడే అలవాటు చేసుకుంటే, కొత్తలోకంలో కూడా అలాగే ఉంటాం.—కొలొస్సయులు 3:12-14 చదవండి.

12. కొత్తలోకంలో జీవితం కోసం మనం ఇప్పుడే ఎందుకు సిద్ధపడాలి?

12 కొత్తలోకంలో, మనం కోరుకున్నవన్నీ దొరకకపోవచ్చు లేదా వాటికోసం కొంతకాలం వేచి చూడాల్సిరావచ్చు. అయినప్పటికీ మనం కృతజ్ఞతతో, సంతృప్తితో ఉండాలి. నిజానికి, ఏ లక్షణాల్ని చూపించమని యెహోవా ఇప్పుడు మనకు చెప్తున్నాడో, ఆ లక్షణాలు కొత్తలోకంలో కూడా అవసరమౌతాయి. కాబట్టి వాటిని ఎలా చూపించాలో ఇప్పుడే నేర్చుకోవాలి. అలాచేస్తే, కొత్తలోకంలో నిత్యం జీవించాలని కోరుకుంటున్నామని, దానికోసం సిద్ధపడుతున్నామని చూపిస్తాం. (హెబ్రీ. 2:5; 11:1) అంతేకాదు, ప్రతీఒక్కరూ యెహోవాకు లోబడే లోకంలో జీవించాలని ఎంతో ఎదురుచూస్తున్నామని చూపిస్తాం.

యెహోవా సేవ మీదే మనసుపెట్టండి

సువార్తను ఉత్సాహంగా ప్రకటించండి

13. కొత్తలోకంలో మనం దేనికి మొదటి స్థానమిస్తాం?

13 మనం సంతోషంగా జీవించడానికి అవసరమైనవన్నీ కొత్తలోకంలో ఉంటాయి. కానీ యెహోవాతో మనకుండే సంబంధమే అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్నిస్తుంది. (మత్త. 5:3) మనం అప్పుడు యెహోవా సేవను ఉత్సాహంగా చేస్తూ ఎంతో ఆనందంగా ఉంటాం. (కీర్త. 37:4) కాబట్టి ఇప్పుడు మన జీవితంలో యెహోవాకు మొదటి స్థానమివ్వడం ద్వారా కొత్తలోకంలో జీవితానికి సిద్ధపడతాం.—మత్తయి 6:19-21 చదవండి.

14. యౌవనులు ఎలాంటి లక్ష్యాలు పెట్టుకోవచ్చు?

14 యెహోవా సేవలో మరింత ఆనందం పొందడం కోసం మనమేమి చేయవచ్చు? అందుకు ఓ మార్గం, లక్ష్యాలు పెట్టుకోవడం. మీరు యౌవనులైతే, మీ జీవితాన్ని యెహోవా సేవలో ఎలా ఉపయోగించవచ్చో జాగ్రత్తగా ఆలోచించండి. పూర్తికాల సేవలోని వివిధ రంగాల గురించి మన ప్రచురణల్లో వచ్చిన సమాచారాన్ని చదవండి. వాటిలో ఏదో ఒకదాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. a ఎన్నో ఏళ్లుగా పూర్తికాల సేవ చేస్తున్నవాళ్లతో మాట్లాడండి. మీ జీవితాన్ని యెహోవా సేవలో ఉపయోగించడం ద్వారా మీరు ఎంతో విలువైన శిక్షణ పొందుతారు. కొత్తలోకంలో యెహోవాను సేవించడానికి ఆ శిక్షణ మీకు ఉపయోగపడుతుంది.

యెహోవా సేవలో లక్ష్యాలు పెట్టుకోండి

15. మనం యెహోవా సేవలో ఏ ఇతర లక్ష్యాలు పెట్టుకోవచ్చు?

15 యెహోవా సేవలో మనం పెట్టుకోగల లక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు, పరిచర్యకు సంబంధించి ఏదైనా కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకోవచ్చు లేదా బైబిల్లోని సూత్రాలను మరింత బాగా అర్థంచేసుకుని వాటిని పాటించడానికి ప్రయత్నించవచ్చు. చదివే సామర్థ్యాన్ని, ప్రసంగాలను, వ్యాఖ్యానాలను మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి మీరు లక్ష్యాలు పెట్టుకుంటే, మరింత ఉత్సాహంగా దేవుని సేవ చేయగలుగుతారు, కొత్తలోకంలో జీవితం కోసం సిద్ధపడతారు.

అత్యుత్తమ జీవితాన్ని ఇప్పుడే అనుభవిస్తున్నాం

ఆధ్యాత్మిక ఆహారం పట్ల కృతజ్ఞత చూపించండి

16. యెహోవా సేవ చేయడమే ఎందుకు అత్యుత్తమమైన పని?

16 ఇప్పుడు మన సమయాన్ని కొత్తలోకం కోసం సిద్ధపడడానికి ఉపయోగిస్తున్నామంటే, జీవితంలో ఏదో కోల్పోతున్నట్టా? కానేకాదు. దేవుని సేవ చేస్తూ మనం ఎంతో సంతృప్తికరమైన జీవితాన్ని ఆనందిస్తున్నాం. ఎవరో బలవంతపెట్టారనో లేదా మహాశ్రమల్ని తప్పించుకోవాలనో మనం ఆ సేవ చేయట్లేదు. యెహోవాతో మంచి సంబంధం ఉన్నప్పుడు మన జీవితం బాగుంటుంది, మనం సంతోషంగా ఉంటాం. అలా జీవించాలనే యెహోవా మనల్ని చేశాడు. దేవుని ప్రేమను అనుభవించడం, ఆయనిచ్చే నిర్దేశాల్ని పొందడం కన్నా ముఖ్యమైనవి జీవితంలో ఇంకేవీ లేవు. (కీర్తన 63:1-3 చదవండి.) యెహోవాను మనస్ఫూర్తిగా ఆరాధించడం వల్ల వచ్చే ఆనందాన్ని మనందరం ఇప్పుడే పొందుతున్నాం. ఎంతోకాలంగా యెహోవా సేవ చేస్తున్నవాళ్లు ఇదే అత్యుత్తమ జీవితం అని ఒప్పుకుంటున్నారు.—కీర్త. 1:1-3; యెష. 58:13, 14.

లేఖనాధార సలహా కోసం వెదకండి

17. కొత్తలోకంలో మనకిష్టమైన పనులు చేయడానికి, సరదాగా గడపడానికి మనమెంత సమయం కేటాయిస్తాం?

17 పరదైసులో మనం కొంత సమయాన్ని మనకిష్టమైన పనులు చేయడానికి, సరదాగా గడపడానికి ఉపయోగిస్తాం. అలా ఆనందంగా గడపాలనే కోరికను యెహోవాయే మనలో పెట్టాడు. అంతేకాదు, తన ‘గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తానని’ ఆయన మాటిస్తున్నాడు. (కీర్త. 145:16; ప్రసం. 2:24) అప్పుడప్పుడూ సరదాగా గడపడం, విశ్రాంతి తీసుకోవడం అవసరమే. అయితే యెహోవాతో మనకున్న స్నేహానికి మొదటిస్థానం ఇచ్చినప్పుడే వాటివల్ల ఎక్కువ ఆనందం పొందుతాం. కొత్తలోకంలో కూడా అంతే. కాబట్టి ‘రాజ్యాన్ని మొదట వెదుకుతూ,’ యెహోవా సేవలో ఇప్పుడు మనం పొందుతున్న దీవెనలపై మనసు పెట్టడం తెలివైన పని.—మత్త. 6:33.

18. పరదైసులో నిత్యజీవం కోసం సిద్ధపడుతున్నామని మనమెలా చూపించవచ్చు?

18 కొత్తలోకంలో జీవితం మనం ఊహించినదానికన్నా ఎంతో బాగుంటుంది. ఆ “వాస్తవమైన జీవము” కోసం ఇప్పుడే సిద్ధపడడం ద్వారా మనం దానికోసం ఎంతగా ఎదురుచూస్తున్నామో చూపిద్దాం. యెహోవా చెప్తున్న లక్షణాల్ని వృద్ధి చేసుకుంటూ ఉత్సాహంగా సువార్త ప్రకటిద్దాం. యెహోవా సేవకు మొదటి స్థానం ఇవ్వడం వల్ల వచ్చే ఆనందాన్ని అనుభవిద్దాం. యెహోవా వాగ్దానాలన్నీ కొత్తలోకంలో నిజమౌతాయని మనకు పూర్తి నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడే కొత్తలోకంలో ఉన్నట్లుగా జీవిద్దాం.

a కావలికోట నవంబరు 15, 2010 సంచికలోని “యౌవనస్థులారా, మీ జీవితంలో మీరేమి చేస్తారు?” అనే ఆర్టికల్‌; సెప్టెంబరు 15, 2014 సంచికలోని 30వ పేజీలో ఉన్న “పూర్తికాల సేవలోని విధానాలు” అనే బాక్సు చూడండి.