కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యెహోవాకున్న చెక్కుచెదరని ప్రేమ గురించి ఆలోచించండి

యెహోవాకున్న చెక్కుచెదరని ప్రేమ గురించి ఆలోచించండి

“నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును.”కీర్త. 77:12.

పాటలు: 18, 29

1, 2. (ఎ) యెహోవాకు తన ప్రజలమీద ప్రేమ ఉందని మీరు ఎందుకు నమ్ముతున్నారు? (బి) దేవుడు మనలో ఏ కోరికను పెట్టాడు?

 యెహోవాకు తన ప్రజలమీద ప్రేమ ఉందని మీరు ఎందుకు నమ్ముతున్నారు? ఆ ప్రశ్నకు కొంతమంది సహోదరసహోదరీలు ఏమని జవాబిచ్చారో పరిశీలించండి. టాలీన్‌ అనే ఓ సహోదరిని తోటి సహోదరసహోదరీలు ఎన్నో ఏళ్లుగా ప్రోత్సహిస్తూ వచ్చారు. ఒకప్పటిలా ఎక్కువగా సేవ చేయలేకపోతున్నందుకు బాధపడొద్దని వాళ్లు ఆమెకు సలహా ఇచ్చారు. ఆమె ఇలా చెప్తుంది, “యెహోవాకు నామీద ప్రేమ లేకపోతే ఆయన నాకు ఇన్నిసార్లు సలహా ఇచ్చేవాడు కాదు.” బ్రిజట్‌ అనే సహోదరి, భర్త చనిపోవడంతో తన ఇద్దరు పిల్లల్ని ఒంటరిగా పెంచింది. ఆమె ఇలా చెప్తుంది, “సాతాను లోకంలో పిల్లల్ని పెంచడం చాలా కష్టం, ఒంటరిగా పెంచడం మరీ కష్టం. కానీ యెహోవాకు నామీద ప్రేమ ఉందని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన నా కష్టాలన్నిటిలో తోడుగా ఉన్నాడు, నేను తట్టుకోలేనంత కష్టాన్ని ఆయన ఎన్నడూ రానివ్వలేదు.” (1 కొరిం. 10:13) సండ్ర అనే సహోదరి నయంకాని జబ్బుతో బాధపడుతోంది. ఆమె ఓ సమావేశానికి హాజరైనప్పుడు, ఓ సహోదరి తనమీద ఎంతో శ్రద్ధ చూపించింది. సండ్ర వాళ్లాయన ఇలా చెప్తున్నాడు, “మేము ఎవరో తెలీకపోయినా, ఆమె మామీద శ్రద్ధ చూపించినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. మన సహోదరసహోదరీలు ప్రేమతో చేసే చిన్నచిన్న పనులైనా, అవి యెహోవాకు మనమీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తాయి.”

2 మనం ఇతరుల్ని ప్రేమించాలని, ఇతరులు మనల్ని ప్రేమించాలని కోరుకుంటాం, ఆ కోరికను యెహోవాయే మనలో పెట్టాడు. అయితే కొన్నిసార్లు అనారోగ్యం వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్ల లేదా పరిచర్యలో అంతగా ఫలితాలు రాకపోవడం వల్ల యెహోవా మనల్ని ప్రేమించట్లేదని మనకు అనిపించవచ్చు. మీకెప్పుడైనా అలా అనిపిస్తే, మీరు యెహోవాకు విలువైనవాళ్లనీ ఆయన మీ కుడిచేతిని పట్టుకుని సహాయం చేస్తాడనీ గుర్తుతెచ్చుకోండి. మనం దేవునికి నమ్మకంగా ఉంటే ఆయన మనల్ని ఎప్పటికీ మర్చిపోడు.—యెష. 41:13; 49:15.

3. యెహోవాకు మనమీద చెక్కుచెదరని ప్రేమ ఉందనే నమ్మకాన్ని ఎలా బలపర్చుకోవచ్చు?

3 పైన చెప్పిన ఉదాహరణల్లోని సహోదరసహోదరీలు, కష్టాల్లో యెహోవా తమకు తోడుగా ఉన్నాడని నమ్మారు. మనం కూడా యెహోవా మనకు తోడుగా ఉన్నాడనే పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. (కీర్త. 118:6, 7) యెహోవాకు మనమీద ప్రేమ ఉందని చూపించే నాలుగు బహుమానాల గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిద్దాం. అవేమిటంటే, (1) సృష్టి, (2) బైబిలు, (3) ప్రార్థన, (4) విమోచన క్రయధనం. యెహోవా మనకోసం చేసిన మంచి వాటిగురించి ఆలోచించినప్పుడు, ఆయనకు మనమీద ఉన్న చెక్కుచెదరని ప్రేమపట్ల మరింత కృతజ్ఞతతో ఉంటాం.—కీర్తన 77:11, 12 చదవండి.

యెహోవా సృష్టి గురించి ఆలోచించండి

4. యెహోవా సృష్టిని చూస్తే ఏమి అర్థమౌతుంది?

4 యెహోవా చేసిన సృష్టిని చూస్తే ఆయనకు మనమీద ఎంత ప్రేమ ఉందో అర్థమౌతుంది. (రోమా. 1:20) ఉదాహరణకు, ఆయన భూమిని చేసిన విధానం చూస్తే, మనం ఏదోక రకంగా జీవించాలని కాదుగానీ, సంతోషంగా జీవించాలన్నదే ఆయన కోరికని తెలుస్తుంది. అందుకు కావాల్సినవన్నీ ఆయన సృష్టించాడు. మనం బ్రతికుండాలంటే ఏదోకటి తినాలి, అయితే మనం తినేవాటిని ఆస్వాదించేలా ఆయన రకరకాల ఆహారపదార్థాలను ఇచ్చాడు. (ప్రసం. 9:7) కేత్రన్‌ అనే సహోదరికి సృష్టిని చూడడమంటే ఇష్టం, ముఖ్యంగా కెనడాలో ఏప్రిల్‌ నెలలో ఉండే ప్రకృతి అంటే ఇంకా ఇష్టం. ఆమె ఇలా చెప్తుంది, ‘పువ్వులు వికసించడం, వలస వెళ్లిన పక్షులు తిరిగిరావడం, మా వంటగది బయట వేసిన గింజల్ని తినడానికి చిన్న తేనెపిట్ట రావడం చూసినప్పుడు చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. మన సంతోషం కోసం యెహోవా ఇన్ని చేశాడంటే ఆయనకు మనమీద చాలా ప్రేమ ఉండివుండాలి.’ సృష్టిని చూసి యెహోవా ఎంతో సంతోషిస్తాడు, మనం కూడా దాన్ని చూసి సంతోషించాలని ఆయన కోరుకుంటున్నాడు.—అపొ. 14:16, 17.

5. మనల్ని సృష్టించిన విధానంలో యెహోవా ప్రేమ ఎలా కనిపిస్తుంది?

5 మనకు సంతృప్తిని, సంతోషాన్ని ఇచ్చే పనుల్ని చేసే సామర్థ్యంతో యెహోవా మనల్ని సృష్టించాడు. (ప్రసం. 2:24) ఆయన మనుషులకు ఓ ముఖ్యమైన పని అప్పగించాడు. వాళ్లు భూమిని నింపి దాన్ని సాగుచేయాలి, అలాగే చేపల్ని, పక్షుల్ని, మిగతా ప్రాణులన్నిటినీ చూసుకోవాలి. (ఆది. 1:26-28) అంతేకాక, మనం తనను అనుకరించగలిగేలా అద్భుతమైన లక్షణాల్ని మనలో పెట్టాడు.—ఎఫె. 5:1.

దేవుని వాక్యం విలువైనది

6. మనకు బైబిలు పట్ల ఎందుకు కృతజ్ఞత ఉండాలి?

6 యెహోవా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కాబట్టే మనకు బైబిల్ని ఇచ్చాడు. మనం బైబిలు ద్వారా ఆయన గురించి, మనుషులతో ఆయన వ్యవహరించే తీరు గురించి తెలుసుకుంటాం. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు పదేపదే తన మాట లెక్కచేయనప్పుడు యెహోవా ఎలా భావించాడో బైబిలు చెప్తుంది. కీర్తన 78:38 (పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌) వచనంలో ఇలా ఉంది, ‘దేవుడు దయ గలవాడు. వాళ్ల పాపాల విషయంలో ఆయన వాళ్లను క్షమించాడు, ఆయన వాళ్లను నాశనం చేయలేదు. అనేకసార్లు దేవుడు తన కోపాన్ని అణచుకున్నాడు. దేవుడు తనకు మరీ ఎక్కువ కోపాన్ని రానివ్వలేదు.’ ఈ లేఖనం గురించి ఆలోచించినప్పుడు మనం అపరిపూర్ణులమైనా యెహోవాకు మనమీద ఎంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయో తెలుస్తుంది. అవును, యెహోవాకు మనమీద చాలా శ్రద్ధ ఉందనే నమ్మకంతో ఉండండి.—1 పేతురు 5:6, 7 చదవండి.

7. మనం ఎందుకు బైబిల్ని ఎంతో విలువైనదిగా ఎంచాలి?

7 యెహోవా తన వాక్యమైన బైబిలు ద్వారా మనతో మాట్లాడతాడు కాబట్టి మనం దాన్ని చాలా విలువైనదిగా ఎంచాలి. తల్లిదండ్రులు, పిల్లలు మనసువిప్పి మాట్లాడుకున్నప్పుడు వాళ్ల మధ్యవున్న ప్రేమ, నమ్మకం బలపడతాయి. యెహోవా మన ప్రేమగల తండ్రి. మనం ఆయన్ను ఎప్పుడూ చూడకపోయినా, ఆయన స్వరం వినకపోయినా, బైబిలు చదివినప్పుడు ఆయన మాటల్ని వింటాం. అందుకే మనం బైబిలు చదువుతూ ఉండాలి. (యెష. 30:20, 21) అప్పుడే మనం యెహోవా గురించి తెలుసుకుంటాం, ఆయనమీద నమ్మకం ఉంచుతాం. ఆయన మనల్ని నడిపించాలని, కాపాడాలని కోరుకుంటున్నాడు.—కీర్తన 19:7-11; సామెతలు 1:33 చదవండి.

యెహోషాపాతును సరిదిద్దినా యెహోవా ఆయనలో ‘మంచి క్రియల్ని’ చూశాడు (8, 9 పేరాలు చూడండి)

8, 9. మనం ఏ విషయాన్ని తెలుసుకోవాలని యెహోవా కోరుకుంటున్నాడు? ఓ బైబిలు ఉదాహరణ చెప్పండి.

8 మనం తన ప్రేమను గుర్తించాలని యెహోవా కోరుకుంటున్నాడు. ఆయన మనలోని లోపాల్ని కాదుగానీ మంచినే చూస్తాడు. (2 దిన. 16:9) యూదా రాజైన యెహోషాపాతు విషయంలో యెహోవా అదే చేశాడు. ఇశ్రాయేలు రాజైన అహాబు, రామోత్గిలాదు పట్టణాన్ని చేజిక్కించుకోవడం కోసం సిరియాతో యుద్ధం చేయాలని అనుకున్నాడు. యెహోషాపాతు ఆయనకు సహాయం చేయాలనే తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నాడు. ఆ యుద్ధంలో అహాబు గెలుస్తాడని 400 మంది అబద్ధ ప్రవక్తలు చెప్పారు. కానీ యెహోవా ప్రవక్త మీకాయా మాత్రం ఆయన ఓడిపోతాడని చెప్పాడు, సరిగ్గా అదే జరిగింది. ఆ యుద్ధంలో అహాబు చనిపోయాడు, యెహోషాపాతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆ తర్వాత, యెహోవా దేవుడు యెహోషాపాతును సరిదిద్దడానికి యెహూను పంపించాడు. ఆయన ఓవైపు యెహోషాపాతును సరిదిద్దుతూనే ఇలా అన్నాడు, “నీయందు మంచి క్రియలు కనబడుచున్నవి.”—2 దిన. 18:4, 5, 18-22, 33, 34; 19:1-3.

9 యెహోషాపాతు రాజైన కొత్తలో, యూదా పట్టణాలన్నిటికి వెళ్లి ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధించమని పెద్దల్ని, లేవీయుల్ని, యాజకుల్ని ఆజ్ఞాపించాడు. దానివల్ల వేరేదేశాల ప్రజలు కూడా యెహోవా గురించి తెలుసుకోగలిగారు. (2 దిన. 17:3-10) అందుకే యెహోషాపాతు ఆ తర్వాత తెలివితక్కువ నిర్ణయం తీసుకున్నా, యెహోవా ఆయన చేసిన మంచి పనుల్ని మర్చిపోలేదు. ఇది మనకెంతో ఊరటనిస్తుంది, ఎందుకంటే మనం కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తాం. అయితే, యెహోవాను సంతోషపెట్టడానికి మనం చేయగలిగినదంతా చేస్తే ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. అంతేకాదు, మనం ఒకప్పుడు చేసిన మంచి పనుల్ని ఆయన మర్చిపోడు.

ప్రార్థనను అమూల్యంగా ఎంచండి

10, 11. (ఎ) ప్రార్థన యెహోవా ఇచ్చిన ఓ ప్రత్యేకమైన బహుమానమని ఎందుకు చెప్పవచ్చు? (బి) యెహోవా మన ప్రార్థనలకు ఎలా జవాబివ్వవచ్చు? (ప్రారంభ చిత్రం చూడండి.)

10 ప్రేమగల తండ్రి తన పిల్లలు తనతో మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వింటాడు. ఆయనకు వాళ్లపట్ల ఎంతో శ్రద్ధ ఉంటుంది కాబట్టి వాళ్ల మనసులోని భావాల్ని తెలుసుకోవాలని కోరుకుంటాడు. మన ప్రేమగల తండ్రి యెహోవా కూడా అంతే. మనం ప్రార్థించినప్పుడు ఆయన శ్రద్ధగా వింటాడు. యెహోవాతో మాట్లాడడం ఎంత అమూల్యమైన అవకాశం!

11 మనం ఏ సమయంలోనైనా యెహోవాకు ప్రార్థించవచ్చు. ఆయన ఓ స్నేహితునిలా మనం చేసే ప్రార్థనలు వినడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మొదటి పేరాలో మనం చూసిన టాలీన్‌ ఇలా చెప్తుంది, ‘మీరు ఏ విషయం గురించి అయినా యెహోవాతో మాట్లాడవచ్చు.’ మన మనసులోని విషయాలను ప్రార్థనలో చెప్పుకున్నప్పుడు, యెహోవా ఓ లేఖనం ద్వారా, మన పత్రికల్లో ఏదైనా ఆర్టికల్‌ ద్వారా లేదా తోటి విశ్వాసుల ప్రోత్సాహకరమైన మాటల ద్వారా మనకు జవాబివ్వవచ్చు. మన హృదయపూర్వక ప్రార్థనలను యెహోవా వింటాడు. మనల్ని ఎవ్వరూ అర్థం చేసుకోకపోయినా యెహోవా అర్థంచేసుకుంటాడు. మన ప్రార్థనలకు జవాబివ్వడం ద్వారా, మనమీద తనకు చెక్కుచెదరని ప్రేమ ఉందని యెహోవా చూపిస్తున్నాడు.

12. బైబిల్లో ఉన్న దేవుని సేవకుల ప్రార్థనలను మనమెందుకు పరిశీలించాలి? ఓ ఉదాహరణ చెప్పండి.

12 బైబిల్లో ఉన్న దేవుని సేవకుల ప్రార్థనల నుండి ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. వీటిలో కొన్నిటిని కుటుంబ ఆరాధనలో చర్చించడంవల్ల ప్రయోజనం పొందుతాం. వాటిని పరిశీలించి మన ప్రార్థనలను మెరుగుపర్చుకోవచ్చు. ఉదాహరణకు, యోనా ఓ పెద్ద చేప కడుపులో ఉన్నప్పుడు వినయంగా చేసిన ప్రార్థనను మీరు పరిశీలించవచ్చు. (యోనా 1:17–2:10) లేదా ఆలయ ప్రతిష్ఠాపన సమయంలో సొలొమోను మనస్ఫూర్తిగా చేసిన ప్రార్థనను చర్చించవచ్చు. (1 రాజు. 8:22-53) అలాగే, యేసు నేర్పించిన మాదిరి ప్రార్థన గురించి మీరు ఆలోచించవచ్చు. (మత్త. 6:9-13) అన్నిటికన్నా ముఖ్యంగా, క్రమం తప్పకుండా ‘మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.’ దానివల్ల ‘సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం మీ హృదయాలకు, తలంపులకు కావలి ఉంటుంది.’ అప్పుడు, యెహోవా చూపిస్తున్న చెక్కుచెదరని ప్రేమపట్ల మన కృతజ్ఞత మరింత పెరుగుతుంది.—ఫిలి. 4:6, 7.

విమోచన క్రయధనం పట్ల కృతజ్ఞత చూపించండి

13. విమోచన క్రయధనం వల్ల ఏమి సాధ్యమైంది?

13 మనం ‘జీవాన్ని పొందాలని’ యెహోవా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. (1 యోహా. 4:9) దేవుడు ప్రేమతో ఇచ్చిన ఆ అద్భుతమైన బహుమానం గురించి అపొస్తలుడైన పౌలు ఇలా రాశాడు, ‘క్రీస్తు తగినకాలంలో భక్తిహీనులకోసం చనిపోయాడు. న్యాయవంతుని కోసం ఎవరైనా చనిపోవడం అరుదు. ఒకవేళ మంచి వ్యక్తికోసం ఎవరైనా తెగించి చనిపోతే చనిపోవచ్చు. కానీ మనమింకా పాపులుగా ఉన్నప్పుడే క్రీస్తు మనకోసం చనిపోయాడు. ఇలా దేవుడు తన ప్రేమను మనమీద చూపిస్తున్నాడు.’ (రోమా. 5:6-8, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం) విమోచన క్రయధనం యెహోవా ప్రేమకు అత్యంత గొప్ప రుజువు. దానివల్లే మనుషులు యెహోవాతో స్నేహం చేయడం సాధ్యమైంది.

14, 15. విమోచన క్రయధనం వల్ల (ఎ) అభిషిక్త క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందుతారు? (బి) భూనిరీక్షణ ఉన్నవాళ్లు ఎలా ప్రయోజనం పొందుతారు?

14 ఆ ఏర్పాటువల్ల, కొంతమంది క్రైస్తవులు మరో ప్రత్యేకమైన విధానంలో యెహోవా దేవుని గొప్ప ప్రేమను రుచి చూస్తారు. (యోహా. 1:12, 13; 3:5-7) దేవుడు వాళ్లను పరిశుద్ధాత్మతో అభిషేకించి తన పిల్లలుగా దత్తత తీసుకున్నాడు. (రోమా. 8:15, 16) వాళ్లలో కొంతమంది ఇంకా భూమ్మీద ఉండగానే, దేవుడు వాళ్లను ‘పరలోకమందు క్రీస్తుయేసుతో కూడా కూర్చోబెట్టాడు’ అని పౌలు అన్నాడు. (ఎఫె. 2:7) ఎందుకు? ఎందుకంటే, యెహోవా వాళ్లకు పరలోకంలో నిత్యం జీవించే నిరీక్షణను ఇచ్చాడు.—ఎఫె. 1:13, 14; కొలొ. 1:5.

15 అభిషిక్తులుకాని వాళ్లు కూడా విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉంచుతూ దేవుని స్నేహితులు అవ్వగలరు. దేవుడు వాళ్లను కూడా తన పిల్లలుగా దత్తత తీసుకుని భూపరదైసులో నిత్యం జీవించే అవకాశాన్ని ఇస్తాడు. మనుషులందరిపట్ల యెహోవాకు ఎంత ప్రేముందో విమోచన క్రయధనం బట్టి తెలుస్తుంది. (యోహా. 3:16) దేవున్ని నమ్మకంగా ఆరాధిస్తే, కొత్తలోకంలో ఆయన మనకు అద్భుతమైన జీవితాన్ని ఇస్తాడు. కాబట్టి యెహోవాకున్న చెక్కుచెదరని ప్రేమకు అతిగొప్ప రుజువైన విమోచన క్రయధనాన్ని విలువైనదిగా ఎంచుతున్నామని చూపిద్దాం.

యెహోవామీద మీకున్న ప్రేమను చూపించండి

16. యెహోవా చూపించే ప్రేమ గురించి ఆలోచించినప్పుడు మనం ఏమి చేస్తాం?

16 యెహోవా మనమీద లెక్కలేనన్ని విధాలుగా ప్రేమను చూపిస్తున్నాడు. రాజైన దావీదు ఇలా పాడాడు, “దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి వాటి మొత్తమెంత గొప్పది. వాటిని లెక్కించెద ననుకొంటినా అవి ఇసుక కంటే లెక్కకు ఎక్కువై యున్నవి.” (కీర్త. 139:17, 18) యెహోవా మనమీద ఏయేవిధాలుగా ప్రేమ చూపిస్తున్నాడో ఆలోచిస్తే, మనం కూడా ఆయన్ను ప్రేమించాలనీ మనస్ఫూర్తిగా సేవించాలనీ కోరుకుంటాం.

17, 18. మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఏయే విధాలుగా చూపించవచ్చు?

17 మనం యెహోవాను ప్రేమిస్తున్నామని ఎన్నో విధాలుగా చూపించవచ్చు. ఒక మార్గం ఏమిటంటే, రాజ్యసువార్తను ఉత్సాహంగా ప్రకటించడం. (మత్త. 24:14; 28:19, 20) అంతేకాక, మన విశ్వాసానికి పరీక్షలు ఎదురైనప్పుడు నమ్మకంగా ఉండడం ద్వారా కూడా ఆయన్ను ప్రేమిస్తున్నామని చూపించవచ్చు. (కీర్తన 84:11; యాకోబు 1:2-5 చదవండి.) తీవ్రమైన కష్టాలు వచ్చినా, మన బాధను యెహోవా చూస్తున్నాడనీ, మనం ఆయనకు విలువైనవాళ్లం కాబట్టి తప్పకుండా సహాయం చేస్తాడనీ ధైర్యంగా ఉండవచ్చు.—కీర్త. 56:8.

18 మనకు యెహోవామీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన చేసిన అద్భుతమైన సృష్టి గురించి ఆలోచిస్తాం. బైబిల్ని శ్రద్ధగా చదవడం ద్వారా ఆయనమీద, ఆయన వాక్యంమీద ప్రేమ ఉందని చూపిస్తాం. మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ప్రార్థనలో ఆయనకు మరింత దగ్గరౌతాం. ఆయనిచ్చిన గొప్ప బహుమానమైన విమోచన క్రయధనం గురించి ఆలోచించినప్పుడు, ఆయనమీద మన ప్రేమ మరింత పెరుగుతుంది. (1 యోహా. 2:1, 2) మనమీద యెహోవాకున్న చెక్కుచెదరని ప్రేమపట్ల కృతజ్ఞత చూపించే విధానాల్లో ఇవి కొన్ని మాత్రమే.