కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

యోహన్న నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

యోహన్న నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

యేసుక్రీస్తుకు 12 మంది అపొస్తలులు ఉండేవాళ్లని చాలామందికి తెలుసు. కానీ ఆయన శిష్యుల్లో కొంతమంది స్త్రీలు కూడా ఉండేవాళ్లని వాళ్లకు తెలిసుండకపోవచ్చు. ఆ స్త్రీలలో యోహన్న ఒకరు.—మత్త. 27:55; లూకా 8:2, 3.

యేసు పరిచర్యకు యోహన్న ఏవిధంగా మద్దతిచ్చింది? ఆమె నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

యోహన్న ఎవరు?

యోహన్న ‘హేరోదు గృహనిర్వాహకుడైన కూజా భార్య.’ బహుశా హేరోదు అంతిప ఇంటి వ్యవహారాలన్నీ కూజానే చూసుకునేవాడు. యేసు స్వస్థపర్చిన చాలామంది స్త్రీలలో యోహన్న ఒకరు. ఇతర స్త్రీలతోపాటు ఆమె కూడా యేసు, ఆయన అపొస్తలులతో కలిసి ప్రయాణించింది.—లూకా 8:1-3.

స్త్రీలు తమకు బంధువులుకాని పురుషులతో స్నేహంగా ఉండకూడదని, వాళ్లతో కలిసి ప్రయాణించకూడదని ఆ కాలంలోని యూదా మతనాయకులు బోధించేవాళ్లు. నిజానికి యూదా పురుషులు స్త్రీలతో ఎక్కువగా మాట్లాడేవాళ్లు కాదు. కానీ యేసు వీటన్నిటినీ పట్టించుకోకుండా, యోహన్నతోపాటు తనపై విశ్వాసముంచిన ఇతర స్త్రీలు తనతో ప్రయాణించడానికి ఒప్పుకున్నాడు.

యేసుతో, అపొస్తలులతో స్నేహంగా ఉంటే సమాజంలో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిసినా యోహన్న వెనకాడలేదు. నిజానికి, యేసు అనుచరులందరూ తమ రోజూవారీ జీవితంలో అలాంటి కొన్ని త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉండాలి. వాళ్ల గురించి యేసు ఇలా చెప్పాడు, ‘దేవుని వాక్యం విని దానిప్రకారం జరిగించు వీళ్లే నా తల్లి, నా సహోదరులు.’ (లూకా 8:19-21; 18:28-30) తనను అనుసరించడం కోసం త్యాగాలు చేసేవాళ్లను యేసు ఎంతో ప్రేమిస్తాడని తెలుసుకోవడం మీకు ప్రోత్సాహంగా లేదా?

ఆమె తన ఆస్తిని పరిచర్య కోసం ఉపయోగించింది

యోహన్నతోపాటు చాలామంది స్త్రీలు ‘తమకు కలిగిన ఆస్తిని’ ఉపయోగించి యేసుకు, ఆయన 12 మంది శిష్యులకు సేవ చేశారు. (లూకా 8:3) దీనిగురించి ఓ రచయిత ఇలా రాశాడు, “ఆ స్త్రీలు వంట చేశారనో, గిన్నెలు కడిగారనో, చిరిగిన బట్టలు కుట్టారనో లూకా చెప్పట్లేదు. బహుశా వాళ్లు ఆ పనులు కూడా చేసుండవచ్చు . . . కానీ లూకా చెప్తుంది మాత్రం వాటిగురించి కాదు.” కాబట్టి ఆ స్త్రీలు తమ డబ్బును, వస్తువులను, ఆస్తిని తమతోపాటు ప్రయాణిస్తున్న వాళ్లకోసం ఉపయోగించి ఉండవచ్చు.

పరిచర్య చేసేటప్పుడు యేసుగానీ ఆయన అపొస్తలులుగానీ తమ పోషణ కోసం ఏ పనీ చేయలేదు. కాబట్టి తమకు, తమతోపాటు ప్రయాణిస్తున్నవాళ్లకు అంటే సుమారు 20 మందికి కావాల్సిన భోజనానికి, ఇతర అవసరాలకు సరిపడా డబ్బు వాళ్ల దగ్గర ఉండకపోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు వాళ్లకు ప్రేమతో ఆతిథ్యం ఇచ్చిన మాట నిజమే. కానీ యేసు, అపొస్తలుల దగ్గర “డబ్బు సంచి” ఉండేదని బైబిలు చెప్తుంది కాబట్టి, వాళ్లు ప్రతీసారి ఇతరుల ఆతిథ్యం మీదే ఆధారపడేవాళ్లు కాదని అర్థమౌతుంది. (యోహా. 12:6; 13:28, 29) వాళ్ల ఖర్చుల కోసం బహుశా యోహన్న, ఇతర స్త్రీలు విరాళాలు ఇచ్చి ఉండవచ్చు.

కానీ యూదా స్త్రీల దగ్గర ఆస్తి లేదా డబ్బు ఉండేది కాదని కొంతమంది విమర్శకులు అంటారు. అయితే, యూదా స్త్రీలకు ఈ విధాలుగా ఆస్తి వచ్చేదని ఆ కాలంనాటి కొన్ని నివేదికలు చెప్తున్నాయి: (1) కొడుకులు లేకుండా తండ్రి చనిపోతే ఆయన ఆస్తి కూతుళ్లకు వచ్చేది; (2) కొన్నిసార్లు తల్లిదండ్రులు ఆస్తిలో కొంతభాగాన్ని కూతుళ్లకు ఇచ్చేవాళ్లు; (3) ఒకవేళ విడాకులు తీసుకుంటే భర్త తన భార్యకు కొంత డబ్బు ఇచ్చేవాడు; (4) చనిపోయిన భర్త ఆస్తిలో నుండి, ఆమె పోషణ కోసం క్రమంగా కొంత డబ్బు వచ్చేది; (5) కొన్నిసార్లు స్త్రీలే కష్టపడి ఆస్తి సంపాదించుకునేవాళ్లు.

యేసు అనుచరులు నిస్సందేహంగా తమ శక్తికొలది విరాళాలు ఇచ్చివుంటారు. ఆయన అనుచరుల్లో కొంతమంది డబ్బున్న స్త్రీలు కూడా ఉండివుండవచ్చు. యోహన్న హేరోదు గృహనిర్వాహకుని భార్య కాబట్టి ఆమె ధనవంతురాలని కొంతమంది అంటారు. యేసు వేసుకున్న కుట్టులేని ఖరీదైన అంగీని బహుశా ఆమెలాంటి డబ్బున్నవాళ్లెవరో ఇచ్చుండవచ్చు. (యోహా. 19:23, 24) ఓ రచయిత్రి ఇలా రాసింది, ‘చేపలు పట్టుకునేవాళ్ల భార్యలు అంత ఖరీదైన వస్త్రాన్ని ఇచ్చి ఉండకపోవచ్చు.’

యోహన్న డబ్బును విరాళంగా ఇచ్చిందని బైబిలు ఖచ్చితంగా చెప్పడంలేదు, కానీ ఆమె చేయగలిగినదంతా చేసింది. దీని నుండి మనం ఓ పాఠం నేర్చుకోవచ్చు. రాజ్య సంబంధ విషయాలకు ఎలా మద్దతివ్వాలో, అసలు ఇవ్వాలో వద్దో నిర్ణయించుకోవడం మన చేతుల్లోనే ఉంది. అయితే యెహోవా మాత్రం, మనం చేయగలిగింది సంతోషంగా చేస్తున్నామా లేదా అన్నదే చూస్తాడు.—మత్త. 6:33; మార్కు 14:8; 2 కొరిం. 9:7.

యేసు చనిపోయినప్పుడు, ఆ తర్వాత

యేసుకు మరణ శిక్ష విధిస్తున్నప్పుడు ఇతర స్త్రీలతో పాటు యోహన్న కూడా ఉండివుంటుంది. యేసు ‘గలిలయలో ఉన్నప్పుడు వీళ్లు ఆయనను వెంబడించి ఆయనకు పరిచారం చేసినవాళ్లు. వీళ్లుకాక ఆయనతో యెరూషలేముకు వచ్చిన ఇతర స్త్రీలు అనేకులు వాళ్లలో ఉన్నారు.’ (మార్కు 15:41) యేసు శరీరాన్ని పాతిపెట్టడానికి మ్రాను మీద నుండి దించినప్పుడు, ‘గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యాలను పరిమళ తైలాల్ని సిద్ధపర్చారు.’ ఆ స్త్రీలలో ‘మగ్దలేనే మరియ, యోహన్న, యాకోబు తల్లి మరియ’ ఉన్నారని లూకా రాశాడు. అంతేకాక వాళ్లు విశ్రాంతి దినం అయ్యాక సమాధి దగ్గరకు తిరిగొచ్చారని, అప్పుడు దేవదూతలు కనబడి యేసు పునరుత్థానమైన సంగతి వాళ్లకు చెప్పారని కూడా ఆయన రాశాడు.—లూకా 23:55–24:10.

యోహన్న, ఇతర నమ్మకమైన స్త్రీలు తమ ప్రభువు కోసం చేయగలినదంతా చేశారు

సా.శ. 33 పెంతెకొస్తున యెరూషలేములో ఒకచోట సమకూడిన శిష్యుల్లో యేసు తల్లి, ఆయన తమ్ముళ్లతోపాటు యోహన్న కూడా ఉండివుండవచ్చు. (అపొ. 1:12-14) అంతేకాదు, ఆమె హేరోదు గృహనిర్వాహకుని భార్య కాబట్టి, హేరోదు రాజభవనంలో జరిగిన కొన్ని విషయాలు ఆమె ద్వారానే లూకాకు తెలిసుండవచ్చు. అందుకే లూకా ఒక్కడే యోహన్న పేరును ప్రస్తావించాడు.—లూకా 8:3; 9:7-9; 23:8-12; 24:10.

యోహన్న చేసిన దానినుండి మనం ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఆమె తనకు వీలైన విధానంలో యేసుకు మద్దతివ్వడానికి చేయగలిగినదంతా చేసింది. తన ఆస్తి ఓ మంచిపనికి ఉపయోగపడడం చూసి ఆమె ఎంతో సంతోషించివుంటుంది. యేసు, 12 మంది అపొస్తలులు, మరితరులు ప్రయాణిస్తూ పరిచర్య చేయడానికి అది ఉపయోగపడింది. యేసు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ఆయనకు మద్దతిస్తూ నమ్మకంగా సేవించింది. నేటి క్రైస్తవ స్త్రీలు కూడా అలాంటి స్ఫూర్తినే చూపించాలి.