కంటెంట్‌కు వెళ్లు

విషయసూచికకు వెళ్లు

ఆధ్యాత్మిక విషయాలను ధ్యానిస్తూ ఉండండి

ఆధ్యాత్మిక విషయాలను ధ్యానిస్తూ ఉండండి

“నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము, వీటియందే సాధకము చేసికొనుము.”1 తిమో. 4:15.

పాటలు: 22, 52

1, 2. మనిషి మెదడు అద్భుతమైనదని ఎందుకు చెప్పవచ్చు?

 మనిషి మెదడు ఎంతో అద్భుతమైనది. దానివల్లే మనం భాషను నేర్చుకోగలుగుతున్నాం. భాషను నేర్చుకోవడం వల్ల చదవడం, రాయడం, మాట్లాడడం, విన్నదాన్ని అర్థం చేసుకోవడం వంటివి చేయగలుగుతున్నాం. అంతేకాదు యెహోవాకు ప్రార్థించగలుగుతున్నాం, ఆయనకు స్తుతిగీతాలు పాడగలుగుతున్నాం. ఈ సామర్థ్యం మరే ఇతర ప్రాణికీ లేదు. ఇలాంటి అద్భుతమైన పనుల్ని మన మెదడు ఎలా చేయగలుగుతుందో శాస్త్రవేత్తలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు.

2 భాషను ఉపయోగించే సామర్థ్యం యెహోవా మనకిచ్చిన ఓ బహుమానం. (కీర్త. 139:14; ప్రక. 4:10, 11) మరే ఇతర ప్రాణికీ ఇవ్వని మరో గొప్ప బహుమానాన్ని కూడా యెహోవా మనకిచ్చాడు. అదేమిటంటే, మనల్ని ‘తన స్వరూపంలో’ సృష్టించడం. మనకు స్వేచ్ఛాచిత్తం అంటే సొంతగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంది. కాబట్టి మనం భాషను ఉపయోగించి యెహోవాను సేవిస్తూ, ఆయన్ను స్తుతించాలని కోరుకుంటాం.—ఆది. 1:27.

3. జ్ఞానాన్ని పొందాలంటే మనమేమి చేయాలి?

3 మనం తనను ఎలా సేవించాలో, ఎలా స్తుతించాలో బైబిలు ద్వారా యెహోవా మనకు చెప్తున్నాడు. మొత్తం బైబిలు లేదా అందులోని కొన్ని పుస్తకాలు 2,800కు పైగా భాషల్లో అందుబాటులో ఉన్నాయి. బైబిల్లోని విషయాలను ధ్యానించినప్పుడు మనం యెహోవాలా ఆలోచించడం నేర్చుకుంటాం. (కీర్త. 40:5; 92:5; 139:17) యెహోవా ఆలోచనలు మనకు జ్ఞానాన్ని ఇవ్వడంతోపాటు మనం నిత్యజీవాన్ని సొంతం చేసుకోవడానికి కూడా సహాయం చేస్తాయి.—2 తిమోతి 3:14-17 చదవండి.

4. ధ్యానించడం అంటే ఏమిటి? మనం ఏ ప్రశ్నల్ని పరిశీలిస్తాం?

4 ధ్యానించడం అంటే ఏదైనా ఓ విషయం మీద మనసు పెట్టి, దాని గురించి లోతుగా, జాగ్రత్తగా ఆలోచించడం. (కీర్త. 77:12; సామె. 24:1, 2) యెహోవా, యేసు గురించి మనం నేర్చుకుంటున్న విషయాలను ధ్యానించినప్పుడు మనమెంతో ప్రయోజనం పొందుతాం. (యోహా. 17:3) అయితే చదవడానికి, ధ్యానించడానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? మనం ఏయే విషయాల గురించి ధ్యానించవచ్చు? క్రమంగా ధ్యానిస్తూ ఆనందించడానికి మనకేది సహాయం చేస్తుంది? వీటి జవాబులను ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

చదువుతున్న వాటినుండి ప్రయోజనం పొందండి

5, 6. చదివేవాటిని గుర్తుంచుకోవాలంటే, బాగా అర్థం చేసుకోవాలంటే మనమెలా చదవాలి?

5 ఊపిరి తీసుకోవడం, నడవడం, సైకిల్‌ తొక్కడం వంటి కొన్ని పనుల్ని మనం ఏమాత్రం ఆలోచించకుండానే చేస్తుంటాం. అదేవిధంగా, చదివేటప్పుడు కూడా కొన్నిసార్లు ఏమాత్రం మనసుపెట్టకుండా చదువుతాం. ఇంకొన్నిసార్లైతే ఓవైపు చదువుతూనే, వేరే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇలాంటి అలవాట్లను మనమెలా మానుకోవచ్చు? మనం ఏదైనా చదువుతున్నప్పుడు, మనసుపెట్టి చదువుతూ దాని అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నించాలి. ఓ పేరాను లేదా ఒక ఉపశీర్షిక కింద ఉన్న సమాచారాన్ని చదివిన తర్వాత కాసేపు ఆగి, అప్పటివరకు మీరు చదివినవాటిని ధ్యానించండి. మీరేమి నేర్చుకున్నారో ఆలోచించండి, అంతేకాక దాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి కృషి చేయండి.

6 మనం బయటికి చదివేవాటిని తేలిగ్గా గుర్తుంచుకోగలుగుతామని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. మన సృష్టికర్తకు ఈ విషయం ముందే తెలుసు, అందుకే ధర్మశాస్త్రాన్ని ‘ధ్యానించమని’ లేదా తక్కువ స్వరంతో చదవమని ఆయన యెహోషువకు చెప్పాడు. (యెహోషువ 1:8 చదవండి.) కాబట్టి మనం బైబిల్ని బయటికి చదివినప్పుడు దానిపై మరింతగా మనసుపెట్టగలుగుతాం, చదివిన వాటిని మరింత బాగా గుర్తుంచుకోగలుగుతాం.

7. దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఏది సరైన సమయం? (ప్రారంభ చిత్రం చూడండి.)

7 మనం చదువుతున్న వాటిమీద మనసు పెట్టాలన్నా, ధ్యానించాలన్నా చాలా కృషి అవసరం. కాబట్టి మీరు అలసిపోని సమయంలో, మీ ధ్యాస పక్కకు మళ్లించేవేవీ లేని ప్రశాంతమైన స్థలంలో ధ్యానించడం మంచిది. కీర్తనకర్త దావీదు రాత్రిపూట మంచం మీద పడుకుని ధ్యానించేవాడు. (కీర్త. 63:4) పరిపూర్ణుడైన యేసు ప్రశాంతంగా ఉండే ప్రదేశాలకు వెళ్లి ధ్యానించేవాడు, ప్రార్థించేవాడు.—లూకా 6:12.

ధ్యానించాల్సిన విషయాలు

8. (ఎ) మనం దేని గురించి ధ్యానించవచ్చు? (బి) మనం యెహోవా గురించి ఇతరులతో మాట్లాడినప్పుడు ఆయనెలా భావిస్తాడు?

8 బైబిల్లో ఉన్న విషయాల గురించే కాకుండా ఇతర విషయాల గురించి కూడా మీరు ధ్యానించవచ్చు. ఉదాహరణకు, మీరు యెహోవా చేసిన అద్భుతమైన సృష్టిని చూసినప్పుడు, కాసేపు ఆగి ‘ఇది యెహోవా గురించి నాకేమి నేర్పిస్తుంది’ అని ఆలోచించండి. ఇలా ఆలోచిస్తే మీరు తప్పకుండా ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు చెప్తారు, అలాగే ఆయన గొప్పతనం గురించి ఇతరులతో మాట్లాడతారు. (కీర్త. 104:24; అపొ. 14:17) మనం ధ్యానిస్తున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు, తన గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు యెహోవా మనల్ని గమనిస్తూ ఎంతో సంతోషిస్తాడు. “యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు [“ధ్యానిస్తూ,” NW] ఉండువారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను” అని బైబిలు చెప్తుంది.—మలా. 3:16.

మీరు స్టడీ ఇస్తున్న వాళ్లకు ఏవిధంగా సహాయం చేయవచ్చో ధ్యానిస్తున్నారా? (9వ పేరా చూడండి)

9. (ఎ) ఏ విషయాల గురించి ధ్యానించమని పౌలు తిమోతికి చెప్పాడు? (బి) పరిచర్యకు సిద్ధపడుతున్నప్పుడు మనం వేటిగురించి ధ్యానించవచ్చు?

9 తిమోతికి రాసిన మొదటి పత్రికలో అపొస్తలుడైన పౌలు అతన్ని ప్రోత్సహిస్తూ అతని మాటలు, ప్రవర్తన, బోధ ఎలా ఉన్నాయో ధ్యానించమని చెప్పాడు. (1 తిమోతి 4:12-16 చదవండి.) మీరు కూడా అలాంటి వాటిగురించి ధ్యానించవచ్చు. ఉదాహరణకు, బైబిలు స్టడీ కోసం సిద్ధపడుతున్నప్పుడు ఆ విద్యార్థి గురించి ఆలోచించండి. ఆ వ్యక్తి ప్రగతి సాధించేలా సహాయం చేయడానికి ఏ ప్రశ్నలు అడిగితే లేదా ఏ ఉపమానం చెప్తే బాగుంటుందో ఆలోచించండి. ఈ విధంగా సిద్ధపడితే, మీ విశ్వాసం బలపడడంతోపాటు మీరు మరింత ఉత్సాహంగా, సమర్థవంతంగా దేవుని వాక్యాన్ని ఇతరులకు బోధించగలుగుతారు. పరిచర్యకు వెళ్లే ముందు కూడా ధ్యానించడం మంచిది. (ఎజ్రా 7:10 చదవండి.) ఉదాహరణకు, మీరు అపొస్తలుల కార్యములు పుస్తకంలోని ఓ అధ్యాయాన్ని చదివితే, పరిచర్య చేయాలన్న ఉత్సాహం మీలో పెరుగుతుంది. మీరు ఆ రోజు పరిచర్యలో ఉపయోగించాలనుకుంటున్న లేఖనాల గురించి, ఇవ్వాలనుకుంటున్న ప్రచురణల గురించి కూడా ధ్యానించవచ్చు. (2 తిమో. 1:6) అలాగే, మీరు పరిచర్య చేస్తున్న ప్రాంతంలోని ప్రజల గురించి కూడా ఆలోచించండి. ఏ విషయాలు మాట్లాడితే వాళ్లు ఆసక్తి చూపిస్తారో ఆలోచించండి. ఇలా సిద్ధపడితే మీరు పరిచర్యలో బైబిల్ని మరింత బాగా ఉపయోగించగలుగుతారు.—1 కొరిం. 2:4, 5.

10. మీరింకా ఏయే విషయాల గురించి ధ్యానించవచ్చు?

10 మీరింకా ఏయే విషయాల గురించి ధ్యానించవచ్చు? కూటాల్లో, సమావేశాల్లో మీరు రాసుకున్న అంశాలను మళ్లీ ఓసారి పరిశీలించండి. అలా పరిశీలిస్తున్నప్పుడు ‘దేవుని వాక్యం నుండి, ఆయన సంస్థ నుండి నేనేమి నేర్చుకున్నాను’ అని మిమ్మల్ని ప్రశ్నించుకోండి. అలాగే కావలికోట, తేజరిల్లు! పత్రికల్లో, సమావేశంలో విడుదలైన కొత్త ప్రచురణల్లో ఉన్న విషయాల గురించి కూడా ధ్యానించవచ్చు. వార్షిక పుస్తకం (ఇంగ్లీషు)లో ఏదైనా అనుభవం చదివినప్పుడు, కాసేపు ఆగి దానిగురించి ఆలోచిస్తే అది మీ హృదయాన్ని కదిలిస్తుంది. అంతేకాక, చదువుతున్నప్పుడు ముఖ్యమైన అంశాల్ని అండర్‌లైన్‌ చేసుకోండి లేదా మార్జిన్‌లో క్లుప్తంగా నోట్సు రాసుకోండి. అవి, మీరు పునర్దర్శనాలకు లేదా కాపరి సందర్శనాలకు లేదా ప్రసంగానికి సిద్ధపడేటప్పుడు ఉపయోగపడతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా, చదివిన వాటిని ధ్యానించడానికి సమయం తీసుకున్నప్పుడు, ఆ విషయాలు మీ హృదయంలోకి వెళ్తాయి. అలాగే మీరు నేర్చుకుంటున్న మంచి విషయాలను బట్టి ప్రార్థనలో యెహోవాకు కృతజ్ఞతలు చెప్తారు.

దేవుని వాక్యాన్ని ప్రతీరోజు ధ్యానించండి

11. అన్నిటికన్నా ముఖ్యంగా మనం దేని గురించి ధ్యానించాలి? అలా ధ్యానించడంవల్ల మనకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? (అధస్సూచి చూడండి.)

11 అయితే మనం అన్నిటికన్నా ముఖ్యంగా ధ్యానించాల్సింది బైబిల్నే. భవిష్యత్తులో ఎప్పుడైనా మన దగ్గర బైబిలు ఉండని పరిస్థితి వస్తే ఏమి చేయవచ్చు? a మనం గుర్తుపెట్టుకున్న లేఖనాల్నిగానీ, రాజ్యగీతాల్నిగానీ అప్పుడు ధ్యానించవచ్చు. అలా చేయకుండా మనల్ని ఎవ్వరూ ఆపలేరు. (అపొ. 16:25) మనం నేర్చుకున్న విషయాల్ని గుర్తుతెచ్చుకునేలా పరిశుద్ధాత్మ సహాయం చేస్తుంది.—యోహా. 14:26.

12. మనం ప్రతీరోజు బైబిలు చదవడానికి ఎలాంటి ప్రణాళిక వేసుకోవచ్చు?

12 మీరు ప్రతీరోజు బైబిలు చదవడానికి ఎలాంటి ప్రణాళిక వేసుకోవచ్చు? బహుశా వారంలో కొన్నిరోజులు, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో బైబిలు పఠనం కోసం ఇచ్చిన అధ్యాయాల్ని చదివి, ధ్యానించవచ్చు. మిగతా రోజుల్లో మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలను చదివి యేసు బోధల గురించి, ఆయన పనుల గురించి ధ్యానించవచ్చు. (రోమా. 10:17; హెబ్రీ. 12:1, 2; 1 పేతు. 2:21) యేసు జీవితంలో జరిగిన సంఘటనలను, అవి జరిగిన క్రమంలో వివరించే ఓ పుస్తకాన్ని కూడా మన సంస్థ ప్రచురించింది. సువార్త వృత్తాంతాల నుండి పూర్తి ప్రయోజనం పొందడానికి అది మీకు సహాయం చేయగలదు.—యోహా. 14:6.

ధ్యానించడం ఎందుకు చాలా ముఖ్యం?

13, 14. యెహోవా, యేసు గురించి ధ్యానిస్తూ ఉండడం ఎందుకు చాలా ముఖ్యం? అది మనలో ఏ కోరికను కలిగిస్తుంది?

13 యెహోవా గురించి, యేసు గురించి ధ్యానించడం వల్ల మనం పరిణతి సాధిస్తాం, విశ్వాసాన్ని బలంగా ఉంచుకుంటాం. (హెబ్రీ. 5:14; 6:1) అలా ధ్యానించకపోతే యెహోవాతో మనకున్న స్నేహాన్ని నెమ్మదిగా పోగొట్టుకుని, చివరికి ఆయనకు దూరమైపోతాం. (హెబ్రీ. 2:1; 3:12) “నిజాయితీగల మంచి మనసుతో” దేవుని వాక్యాన్ని అంగీకరించకపోతే, అది మనలో నిలవదు. బదులుగా ‘జీవితంలోని చీకూచింతలు, సంపదలు, సుఖభోగాలు’ మనల్ని అణచివేస్తాయి.—లూకా 8:14-15, పవిత్ర గ్రంథం, వ్యాఖ్యాన సహితం.

14 కాబట్టి మనం బైబిల్లోని విషయాల్ని ధ్యానిస్తూ, యెహోవా గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంటూ ఉందాం. అప్పుడే ఆయన లక్షణాల్ని, వ్యక్తిత్వాన్ని పూర్తిగా అనుకరించాలనే కోరిక మనలో కలుగుతుంది. (2 కొరిం. 3:18) మనం ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా, మన పరలోక తండ్రి యెహోవా గురించి మరింత ఎక్కువగా తెలుసుకుంటూ, ఆయన్ను అనుకరిస్తూ ఉంటాం. అంతకన్నా గొప్ప గౌరవం మరొకటి లేదు.—ప్రసం. 3:11.

15, 16. (ఎ) యెహోవా, యేసు గురించి ధ్యానించడం వల్ల మీరెలాంటి ప్రయోజనం పొందారు? (బి) ధ్యానించడం కొన్నిసార్లు ఎందుకు కష్టం కావచ్చు? అయినా మనమెందుకు ప్రయత్నిస్తూనే ఉండాలి?

15 యెహోవా గురించి, యేసు గురించి ధ్యానించడంవల్ల సత్యం పట్ల మనకున్న ఆసక్తి తగ్గిపోకుండా ఉంటుంది. అప్పుడు మన ఉత్సాహాన్ని చూసి తోటి సహోదరసహోదరీలు, అలాగే మనం పరిచర్యలో కలిసే ప్రజలు ఎంతో ప్రోత్సాహం పొందుతారు. అంతేకాదు, విమోచన క్రయధనం గురించి మనం ధ్యానించినప్పుడు యెహోవాతో మనకున్న స్నేహాన్ని మరింత విలువైనదిగా చూస్తాం. (రోమా. 3:24; యాకో. 4:8) దక్షిణ ఆఫ్రికాకు చెందిన మార్క్‌ అనే సహోదరుడు తన విశ్వాసం కారణంగా మూడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఆయనిలా అన్నాడు, ‘ధ్యానించడాన్ని ఓ ఆసక్తికరమైన ప్రయాణంతో పోల్చవచ్చు. ఆధ్యాత్మిక విషయాల గురించి ధ్యానించేకొద్దీ, యెహోవా గురించి కొత్తకొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. భవిష్యత్తు గురించి నాకెప్పుడైనా కాస్త నిరుత్సాహంగా లేదా ఆందోళనగా అనిపిస్తే, వెంటనే బైబిలు తెరచి కొన్ని లేఖనాల గురించి ధ్యానిస్తాను. నాకప్పుడు చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది.’

16 మన దృష్టిని పక్కకు మళ్లించే విషయాలు ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. వాటివల్ల బైబిల్లోని విషయాలను ధ్యానించడానికి మనకు సమయం దొరక్కపోవచ్చు. ఆఫ్రికాకు చెందిన పాట్రిక్‌ అనే సహోదరుడు ఇలా అన్నాడు, ‘నా మనసు ఒక మెయిల్‌ బాక్స్‌ లాంటిది, అందులో అవసరమైన విషయాలతోపాటు అనవసరమైన విషయాలు కూడా ఉంటాయి. వాటిని ప్రతీరోజు వేరు చేస్తూ ఉండాలి. నా మనసును పరిశీలించుకునేటప్పుడు కొన్నిసార్లు కలవరపెట్టే ఎన్నో విషయాలు నాకు కనిపిస్తాయి. అయితే వాటన్నిటిని తీసేసుకోవడానికి సహాయం చేయమని మొదట యెహోవాకు ప్రార్థించి, ఆ తర్వాత ప్రశాంతమైన మనసుతో ధ్యానించడం మొదలుపెడతాను. ఇలా చేయడానికి కాస్త సమయం పట్టినా, దానివల్ల నేను యెహోవాకు మరింత దగ్గరౌతున్నాను. అంతేకాదు సత్యాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలుగుతున్నాను.’ (కీర్త. 94:19) అవును, మనం ప్రతీరోజు బైబిలు చదివి, దాన్ని ధ్యానించినప్పుడు ఎన్నో విధాలుగా ప్రయోజనం పొందుతాం.—అపొ. 17:11.

ధ్యానించడానికి ఏ సమయం సరైనది?

17. ధ్యానించడం కోసం మీరెలా సమయం కేటాయించవచ్చు?

17 కొంతమంది ఉదయాన్నే లేచి బైబిలు చదివి, ధ్యానించి, ప్రార్థిస్తారు. ఇంకొంతమంది భోజన విరామ సమయంలో అలా చేస్తారు. బహుశా మనలో కొంతమంది సాయంత్రంగానీ, పడుకోబోయే ముందుగానీ అలా చేస్తుండవచ్చు. మరికొంతమంది ఉదయం పూట బైబిలు చదువుతారు, రాత్రి పడుకోబోయే ముందు కూడా చదువుతారు. (యెహో. 1:8) ఏదేమైనా మనం ‘సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోవాలి.’ అంటే అంతగా ప్రాముఖ్యంకాని విషయాల కోసం కేటాయించే సమయాన్ని బైబిల్లోని విషయాల్ని ధ్యానించడానికి ఉపయోగించాలి.—ఎఫె. 5:15, 16.

18. ప్రతీరోజు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, అందులోని విషయాల్ని పాటించేవాళ్లకు బైబిలు ఏమని వాగ్దానం చేస్తుంది?

18 తన వాక్యాన్ని ధ్యానిస్తూ, అందులోని విషయాల్ని పాటించడానికి శాయశక్తులా ప్రయత్నించేవాళ్లను యెహోవా దీవిస్తాడని బైబిలు వాగ్దానం చేస్తోంది. (కీర్తన 1:1-3 చదవండి.) యేసు ఇలా చెప్పాడు, ‘దేవుని వాక్యం విని దాన్ని గైకొనేవాళ్లు ధన్యులు.’ (లూకా 11:28) అన్నిటికన్నా ముఖ్యంగా, మనం ప్రతీరోజు బైబిల్లోని విషయాల్ని ధ్యానించినప్పుడు, యెహోవాకు ఘనత వచ్చేలా ప్రవర్తిస్తాం. దానివల్ల మనం ఇప్పుడు సంతోషంగా ఉండడమే కాకుండా కొత్తలోకంలో నిత్యజీవాన్ని సొంతం చేసుకుంటాం.—యాకో. 1:25; ప్రక. 1:3.

a కావలికోట డిసెంబరు 1, 2006 సంచికలో “ఆధ్యాత్మికంగా బలంగా ఉండడానికి మేము చేసిన కృషి” అనే ఆర్టికల్‌ చూడండి.